Sunday, August 23, 2015

డిపాజిట్- క్రైం కథల పొటీలో సాధారణ ప్రచురణ

ఒంటిగంట కావస్తోంది. సోమవారాల్లో సాధారణంగా బ్యాంకుల్లో రద్దీగా ఉంటుంది. పేరుకి కో-ఆపరేటివ్ బ్యాంకే అయినా మంచి బిజినెస్ సెంటర్లో ఉండటం వల్ల దానికీ కష్టమర్సు తాకిడీ ఎక్కువగానే ఉంది.
లంచ్ బ్రేకుకి ఇంకో గంట టైముందనగా అయ్యర్ మెల్లగా మేనేజరు ఛాంబర్లోకి వచ్చి కూర్చున్నాడు. బ్రీఫ్ కేసులోనుంచి ఒక డిపాజిట్ బాండు బైటికి తీసి మేనేజరుగారి ముందుంచి అన్నాడు 'సార్! ఈ బాండివాళ మెచూరవుతుంది. కాస్త తొందరగా ఇప్పించరా! రెండుగంటల బండికి చెన్నై చేరాలి. ఇవాళ ఈవెనింగు నా భార్యకి ఆపరేషన్. మనీ అర్జంట్ ప్లీజ్'
మేనేజరుగారు ఆ బాండు అందుకొని చూసి' మీరేనా అయ్యర్?' అని అడిగారు.
'అవును సార్!' అంటూ ఐడి తీసి చూపించాడు అయ్యర్.
బాండు వెనక డిశ్చార్చ్ సంతకం తీసుకొని కంప్యూటర్ మీద వెరిఫై చేసుకొని సంతృప్తి చెందిన తరువాత 'ఓకె! ఒక్క హాఫెనవర్ వెయిట్ చేయండి!క్యాషియర్ లంచికి వెళ్ళినట్లున్నాడు. రాగానే ఎరేంజ్ చేస్తాను' అంటూ బాండుతో సహా హాలులోకి వెళ్ళిపోయాడు.
అద్దాలలోనుంచి ఆయన ఎవరో ఆఫీసరుతో ఐడి చూపించి మాట్లాడుతూండటం.. ఆ ఆఫీసరు మధ్య మధ్యలో తలతిప్పు ఇటు చూస్తూ ఉండటం కనిపిస్తూనే ఉంది.
మెనేజరుగారు ఎటో వెళ్ళిపోయాడు.. బహుశా లంచికేమో! ఇంకో ముప్పావుగంటకు అటెండరు వచ్చి ' సార్! క్యాష్ రడీగా ఉంద్సి. అటొచ్చి తీసుకోండి!' అన్నాడు.
అయ్యర్ బ్రీఫ్ కేసుతోసహా వెళ్ళి క్యాష్ కౌంటరుముందు నిలబడ్డాడు. లంచ్ అవర్ జస్ట్ అప్పుడే అయిపోవడంవల్లనేమో హాల్లోనూ బైటా జనమాట్టేలేరు.
ముందే అరేంజి చేసినట్లున్నాడు.. వందనోట్లు రెండు బండిల్సు, చిల్లర పన్నెండువేలు కౌంటరుమీద పరచి చూపించాడు క్యాషియర్. 'సారీ సర్! మండేగదా! హెవీ పేమెంట్స్ వచ్చాయి. పెద్ద డినామినేషన్ అరేంజి చెయ్యలేకపోయాను' అని నొచ్చుకొన్నాడు కూడా.
బండిల్ అంటే పది ప్యాకెట్ల కట్ట. మొత్తం ఇరవై ప్యాకెట్లు. పదులు పది ప్యాకెట్లమీద రెండూ! 'చిన్న సూటుకేసులో సర్దుకోవడం కుదరక సతమతమవుతున్న అయ్యర్ని చూసి  అన్నాడు అప్పుడే వచ్చిన మేనేజరు 'బాలప్పా! ఊరికే అలా చూస్తూ కూర్చోకపోతే మనదగ్గరేమన్నా మంచి సంచి ఉంటే చూసి ఇవ్వరాదా!'
బాలప్ప లోపలికి పోయి  బాక్సొకటి కాస్త పెద్దదిగ ఉన్నది తెచ్చి డబ్బు అందులో సర్దుతుంటే అయ్యరు మేనేజరుగారికి  'థేంక్స్' చెప్పాడు.
'ఇట్సాల్ రైట్! ఇందులో నేను చేసింది మాత్రం ఏముందండీ! ఎవరి మనీ వారికి సేఫుగా అందేట్లు చూడ్డమేగా యాజే మేనేజరు.. నా ప్రైమరీ డ్యూటీ!ఆల్రెడీ టూవో క్లాకయింది. ఈ టైములో ఆటోలు దొరకడంకూడా కష్టమేనే! బాలప్పా! బైట మన రెడ్డిఆటో స్టాండులో ఉందేమో చూడు! సార్ ని స్టేషనులో దిగబెట్టి రమ్మను' అంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు మేనేజరుగారు.
అయ్యర్ బైటికి వచ్చాడు, బాలప్ప అప్పటికే చెప్పి పెట్టినట్లున్నాడు .. అతను చూపించిన ఆటోలోకి ఎక్కి కూర్చున్నాడు. బాలప్ప అందించిన బ్యాగు అందుకోవడమే ఆలస్యం.. ఆటో బాణంలా ముందుకు దూసుకుపోయింది.
ఆటో వేగంకన్నా ఎక్కువ వేగంగా అయ్యరు గుండెలు కొట్టుకొంటున్నాయి 'ఒకటా! రెండా! రెండు లక్షల చిల్లర! ఇంత ఈజీగా పనయిపోతుందనుకోలేదు. ఒక్కోసారంతే! ఇట్టే అయిపోతాయనుకొన్న పనులు ఏళ్లూ పూళ్ళూ గడిచిపోతున్నా ఒహ పట్టాన తెగవు. అసలు తెమలనే తెమలనుకొనేవి.. ఎవరో తరుముతున్నట్లు.. ఇదిగో.. ఇలా.. చక చకా జరిగిపోతుంటాయి! లేచిన వేళా విశేషం! ఎన్నేళ్ళు కష్టబడితే ఇంత డబ్బొచ్చి వళ్లోపడుతుంది!' వళ్లోని డబ్బుసంచీని మరింత ఆబగా దగ్గరికి తీసుకొన్నాడు అయ్యరు.
అప్పుడు చూసాడు బ్యాగుమీది ఆ ఆమ్మాయి బొమ్మను. ఎక్కడో చూసినట్లుంది ఆ  పాప ఫొటో!
'ఆఁ! గుర్తొచ్చింది. గోవిందరెడ్డి కూతురు ఫొటో కదూ అది! రెడ్డికి ఆ పాపంటే ప్రాణం. లాఢికొచ్చినప్పుడు చాలా అల్లరి చేస్తుండేది. లాడ్జికికూడా కూతురుపేరే పెట్టుకొన్నాదు రెడ్డి. 'మంగతాయారు లాడ్జి'.అలివేలు మంగ అనుకొంటా ఆ పాప పేరు!తను ఈ బ్యాగులోనే తను అప్పుడు.. లాడ్జి డబ్బులు బ్యాంకుకి తెచ్చి డిపాజిట్ చేసింది. అప్పటి బ్యాగింకా బ్యాంకులోనే భద్రంగా ఉందా! నిజానికి ఈ సొమ్ము న్యాయంగా దక్కాల్సింది సాంబశివుడికి. చచ్చి ఏ లోకాన ఉన్నాడో.. పుణ్యాత్ముడు!'
అయ్యరు ఆలోచనలు ఒక్కసారి పదేళ్ళు వెనక్కి వెళ్ళాయి.
మంగతాయారు లాడ్జిలోఆ రోజు రాత్రి అట్టహాసంగా దిగిన చెన్నయ్ చేట్టియార్ తెల్లారేసరికల్లా బెడ్ మీద శవంగా మారిపోయాడు. తెల్లావారు ఝామున బెడ్-కాఫీ ఇవ్వడానికని వెళ్ళిన తనే అందరికన్నా ముందా విషయం కనిపెట్టింది. క్యాష్ కౌంటర్లో పడి నిద్రపోతున్న సాంబశివుడిని లేపి తీసుకువచ్చి చూపించిందీ తనే! తరువాత పోలీసులు రావడం.. సాంబశివుడిని గుచ్చి గుచ్చి ప్రశ్నించడం.. తను అక్కడక్కడే తచ్చర్లాడుతూ అంతా గమనిస్తూనే ఉన్నాడు. అంత గందరగోళంలో కూడా సాంబశివుడు తనపేరు బైటపెట్టలేదు! ఎందుకో ఆ మధ్యాహ్నం పూట తెలిసింది.
లంచ్ సప్లైకని వెళ్ళిన తనను బాత్రూంలోకి ఈడ్చుకెళ్ళి ఈ బ్యాగే చేతిలో పెట్టి చెప్పాడు 'ఇందులో యాభైవేలున్నాయ్! ఇప్పుడే పోయి పండ్లబజారులో ఉన్న కో=ఆపరేటివ్ బ్యాంకులో డిపాజిట్ చెయ్యి.. నీ పేరున! ఈ హడావుడంతా తగ్గిన తరువాత నిదానంగా ఆలోచిద్దాం ఏం చెయ్యాలో!'
ఆ సాయంత్రమే గోవిందురెడ్డిని పోలీసులు పట్టుకుపోయారు. సాంబశివుడు గాయబ్! భయమేసి తనూ చెన్నయ్ పారిపోయాడు.
కేసునుంచి బైటపడటానికి రెడ్డి చాలా కష్టపడ్డాడని విన్నాడు తను. ఏడేళ్ల కిందట సాంబశివుడూ ఏదో రోగమొచ్చి పోవడంతో ఈ డిపాజిట్ విషయం అతగాడితోనే సమాధి అయిపోయింది.
మధ్యలో రెండు మూడుసార్లు వచ్చినా బాండును గడువుకన్నా ముందే సొమ్ముచేసుకొనేందుకు ధైర్యం చాలలేదు.
ఇవాళా బ్యాంకులో ఉన్నంతసేపూ ప్రాణాలు పింజం పింజం అంటూనే ఉన్నాయి. ఆ ఏడుకొండలవాడి దయవల్ల ఏ ఇబ్బందీ లేకుండానే పెద్దమొత్తం చేతికొచ్చింది. ఈ చిల్లర పన్నెండు వేలూ ముందు తిరుపతి వెళ్ళి హుండీలో వేస్తేగానీ మనశ్శాంతి లేదు.
ఆటో ఠకాల్మని ఆగిపోయింది. డైవర్ సెల్లో మాట్లాడ్డానికి అపినట్లున్నాడు.
మళ్లా స్టార్ట్ చేయబోతే ఒక పట్టాన స్టార్టు కాలేదు.
డ్రైవర్ బండిని ఓ వారకు లాక్కెళ్ళి ఆపి 'ఆయిల్ అయిపోయినట్లుంది. ఇక్కడే పెట్రోలు బంక్.. చిటికెలో వచ్చేస్తాను సార్!' అంటూ ఓ బాటిల్ పట్టుకొని మాయమైపోయాడు.
తిరిగి వస్తూ ఓ పోలీసాయన్ని వెంటబెట్టుకొని వచ్చాడు! ఆ కానిస్టేబుల్ కూడా ఎక్కంగానే బండి స్టార్టయిపోయింది ఏ ఆయిల్ పోయకుండానే! ఆటో రైలుస్టేషనుముందుగాక పోలీసుస్టేషనుముందు ఆగడంతో సీను అర్థమైపోయింది అయ్యరుకు. పారిపోవడానిక్కూడా లేదు. క్యాషుబ్యాగే కాదు.. చెయ్యికూడా కానిస్టేబుల్ అధీనంలో ఉందిప్పుడు. మారుమాట్లాడకుండా కానిస్టేబులుతోపాటు పోలీసుస్టేషనులోకొచ్చాడు అయ్యరు. బ్యాంకు మేనేజరుగారూ అక్కడే ఉన్నారు!
'నిన్నెందుకు అరెస్టు చేసామో తెలుసా? పదేళ్ళ కిందట మంగతాయారు లాడ్జిలో చెన్నై చెట్టియారుకి కాఫీలో విషం కలిపి చంపినందుకు!' అన్నాడు సి.ఐ తాపీగా.
'నో! అబద్ధం!' పెద్దగా అరిచాడు అయ్యరు.
తననింకా బ్యాంకులో దొంగతనంగా డబ్బు దాచినందుకు అరెస్టు చేసారు అనుకొంటున్నాడు ఇంతదాకా!
'మర్డరు కేసా?! యావజ్జీవమో.. ఉరిశిక్షో!' పెళ్లాంబిడ్డలు గుర్తుకొచ్చారు .'చెట్టియార్ చావుకీ నాకూ ఏ సంబంధమూ లేదు సార్!' బావురుమన్నాడు అయ్యరు.
'ఏ సంబంధమూ లేకపోతే ఎందుకలా పారిపోయావ్ బే!' అని ఠప్పుమని దవడమీద లాగి కొట్టాడు సి.ఐ. 'ఇంత డబ్బు నీకెక్కడిదిరా? ఏం పాడుపని చేస్తే ఇంతొచ్చింది? దీనికోసమే నువ్వు చెట్టియారును చంపావని పోయేముందు సాంబశివుడు వాజ్ఞ్మూలం  ఇచ్చాడురా పుండాకోర్!'
ఠపాఠపా పడుతున్న లాఠీ దెబ్బలకు అయ్యరుకళ్ళు బైర్లు కమ్మాయి. పోలీసు దెబ్బలెలా ఉంటాయో మొదటిసారి తెలిసొచ్చింది అయ్యరుకి. 'అట్లా ఎందుకన్నాడో నాకు తెలియదు సార్! సత్య ప్రమాణకంగా చెబుతున్నా!  చెట్టియారు చావుకి, నాకూ ఎట్లాంటి లింకూ లేదు సామీ! నా బిడ్డాలమీద ఒట్టేసి చెప్పమన్నా చెబుతా! కావాలంటే ఈ డబ్బంతా మీరే తీసేసుకోండి! ఈ ఒక్కసారికి నన్ను క్షమించి వదిలేయండి!'
' అట్లా అని రాసిస్తావు బే!' ఆనడిగాడు సి. ఐ సీరియస్ గా!
తలూపాడు అయ్యరు.
ఐదునిమిషాల్లో బ్యాంకుమేనేజరు తయారుచేసిన స్టేటుమెంటుమీద కళ్ళుమూసుకొని సంతకం పెట్టేశాడు అయ్యరు.
అయ్యరును బైటికి తీసుకుని వచ్చి ఆటోలో కుదేసిపోయాడు కానిస్టేబుల్.
దారిలో అన్నాడు ఆటో డ్రైవర్ 'అయ్యరంకుల్! నన్ను గుర్తు పట్టారా? నేను.. సాంబశివుడి కొడుకు.. శ్రీనివాసుని. గోవిందరెడ్డి కూతురు మంగతాయారుతో ఆడుకోవడానికి లాడ్జికొస్తుండేవాణ్ణి. మాఅయ్యా, నువ్వూ చేసిన పాడుపని నాకు తెలుసు. అయ్యే చెప్పాడు పోయ్ ముందు. మీరిద్దరూ చేసిన పనికి గోవిందురెడ్డి జైలుపాలయ్యాడు. కేసునుంచీ బైటపడటానికి బోలెడంత డబ్బు ఖర్చు చేసాడు. పరువుపోయిన అవమానంతో ఎక్కువ కాలం బతకలా!' అంటూ ఓ పాతకాలం ఇంటిముందు ఆటో ఆపాడు. 'రెడ్డికూతురు మంగతాయారు ఇప్పుడుంటున్నది ఈ అనాథ శరణాలయంలోనే! దానికి పోయిన తండ్రిని ఎలాగూ తిరిగి ఇప్పించలేం. పోగొట్టుకొన్న సొమ్ములోనైనా ఏదో కొంతమొత్తం తిరిగిప్పిచ్చాలని నేనే ఈ పథకం పన్నింది. ఈ డబ్బుతో  ఏదన్నా మంచికాలేజీలో చేరి చదువుకుంటే దాని బతుకు ఓ గాడిన పడుతుందని నా ఆశ. ఇవాళ ఈ డిపాజిట్ మెచూరవుతుందని తెలుసు.
బ్యాంకుసారు.. సి.ఐ.సారు కో-ఆపరేషన్ ఇవ్వబట్టి ఇప్పుడీ ఆపరేషన్ సక్సెసయింది. దిగంకుల్! నీ చేత్తోనే మన తాయారుకి ఆ డబ్బిచ్చేస్తే బాగుంటుది' అంటూ సి.ఐ సారిచ్చిన బ్యాంకు క్యాష్ బాక్సుతో ఆటో దిగాడు శ్రీనివాస్.
-కర్లపాలెం హనుమంతరావు
( చిత్ర- సకుటుంబసచిత్ర  మాసపత్రిక- నిర్వహించిన క్రైం కథల పోటీలో సాధారణ ప్రచురణకి అంగీకరించి జూన్, 2011 సంచికలో ప్రచురించినది)





Friday, August 21, 2015

ప్రజాప్రతినిధులు- జీతభత్యాలు- ఓ సరదా గల్పిక

'ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మనది. నూటపాతిక కోట్ల మంది జనాభాకి ముష్టి ఏడొందల తొంభై మూడుమంది మాత్రమేనా ప్రజాప్రతినిథులు! స్థాయిలో మాకన్నా ఎంతో దిగువనున్న వాళ్లకేమో   లక్షల్లో జీతాలా! మాకు మాత్రం  భిక్షాపాత్రలో ముష్టి వేసినట్లు   తొంభైవేలా?! ప్రొటోకాలు పరువైనా  నిలబడాలా వద్దా?   లెక్కకైనా వేతనంలో కనీసం  ఒక్కరూపాయైనా  ఎక్కువ మాకు  దక్కాలి గదా! ఎవరు బాబూ నువ్వు? ఎందుకా పడీ పడీ నవ్వు?'
'నీ అంతరాత్మనులే మహానుభావా! గుర్తుపట్టలా? ఎన్నికల సంఘంవాళ్లకి నువు సమర్పించిన తప్పుడు వివరాల ప్రకారం చూసుకొన్నా నీ ఇప్పటీ ఓ గంట ఆదాయం.. తెల్లకార్డువాడి ఏడాది సంపాదనకన్నా ఎన్నోరెట్లు ఎక్కువగదా! ఉచిత బంగళా.. ఫ్రీ ఫోన్ కాల్సు.. సకుటుంబ సపరివారంగా చక్కర్లు కొటేందుకు దేశీయంగా ఉచిత  ప్రయాణ సౌకర్యాలు.. ఖర్చుచేసినా చెయ్యకున్నా పెట్రోలు, గ్యాసులమీద భారీ రాయితీలు, నియోజక వర్గాల్లో తిరిగినా తిరగకున్నా సాదర ఖర్చులకింద వేలాది రూపాయలు.. నొక్కుతున్నావుకదా! ఇంకా ఈ వేతనాలు చాలడంలేదన్న సన్నాయి నొక్కులేమిటంట? నవ్వు రాదా మహాశయా! నీ విమానాలు, ఏసీ రైళ్ళ ప్రయాణాలు వగైరాలన్నింటికీ అయ్యే ఖర్చు బొక్కసానికి ఏటా డెబ్బైనాలుగు లక్షల పైచిలుకు బొక్కపెదుతోందని లెక్కలు  చెబుతున్నాయిగదా! అయినా నువ్విప్పుడు మళ్ళీ క్యాంటీను భోజనం ఖరీదుగా ఉందని యాగీకి దిగుతున్నావ్! ఇంకా ఏవేవో సౌకర్యాలు సమకూరడంలేదని  సణుగుతున్నావ్! ఈ కరవు, ఆర్థికమాంద్యం గడ్డురోజుల్లోకూడా నీకు జీతమెందుకు పెంచాలో ఒక్క సజావుకారణం ఉంటే  సెలవివ్వు.. నవ్వడం మానేస్తా!'
'ఒక్కటి కాదు. ఓ కోటి చెబుతాను.. ఒక్కోటీ ఓపిగ్గా వినాలేగాని! ఈ వృత్తిలోకి రాకముందు నేనెంత గడించేవాణ్ణో నీకూ తెలుసు. మామూళ్ళు, సెటిల్మెంటులు, రింగుల్లాంటివి ఇప్పుడు బాహాటంగా చెయ్యడానికి ఎలా వీలుంటుంది చెప్పు! పనోళ్ళకి సిమెంటు ఫ్యాక్టరీలున్నా పట్టించుకోరుగాని.. మేం ఇసుక తక్కెళ్ళ జోలికెళ్ళినా గగ్గోలు పెడతారు దిక్కుమాలిన జనం.. విడ్డూరంగా! అందుకే ప్రభుత్వ వైద్యులకు మల్లే మాకూ 'నాన్ ప్రాక్టీసింగు అలవెన్సు'ఇవ్వాలంటున్నాం! తప్పా?
'హా.. హా.. హా'
ఆ నవ్వే వద్దు! మంగళరిగి చేంతాడంతందని  మా ఆదాయప్పట్టికను తప్పుపడుతున్నావ్ గానీ.. హనుమంతుడి తోకమాదిరి సాగే మా ఖర్చుల చిట్టా మాత్రం  నీకు పట్టదు! సర్కారువాళ్ళిచ్చే ముష్టి ముగ్గురు సెక్యూరిటీ
మాకేమూలకు! కాలు బైటపెడినప్పుడల్లా ఎంత హంగూ.. ఆర్భాటం ప్రదర్శించాలీ! పెట్రోలు, డీజెలు రేట్లు ఎట్లా పెట్రేగిపోతున్నాయో.. అంతరాత్మగాడివి నీకే తెలుస్తుంది! మా  ప్రైవేటు ఆర్మీకేమన్నా తలా ఓ రెడ్ ఫెరారీ డిమాండు చేస్తున్నామా? బుల్లెటు ప్రూఫ్ కార్లు, బుల్లెట్లు, బాంబులకయ్యే ఖర్చు ఎంతని సొంతంగా పెట్టుకోగలం.. కరువుకాలంలో!  అన్నీ బైటకు చెప్పుకొనే ఖర్చులుకూడా కావాయ! ఎన్నికల్లో ఎన్నెన్నిరకాల వత్తిళ్ళొస్తాయో నీకూ తెలుసని నాకు తెలుసు.'
'నిజమే! ఇదివరకు మాదిరి ఏదన్నా సర్కారు భూముల్లో జెండాలు పాతుకొందామనుకొన్నా.. పాపం.. వాటికీ ఉల్లిగడ్డలకుమల్లే కరువొచ్చి పడిందాయ! దేవుడి సొమ్మూ దేవుడికే అంతుచిక్కకుండా అంతర్దానమవుతుందాయ!  ఇంక మీకు మాత్రం మిగులుతున్నదేముందిలే తమ్ముడూ బూడిద మినహా!'
'వెటకారమా! ప్రభుత్వాలన్నా స్థిరంగా ఉండుంటే మాకిన్ని పాట్లుండేవా చెప్పన్నా!  ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడే భూసేకరణ సవరణో.. చటుక్కున చట్టమై కూర్చుందనుకో.. ఇహ మా పని చుట్టలు పీల్చుకుంటూ రచ్చబండమీద చతికలబడ్డమేగా! కాల్ సెంటరు పనోళ్లకన్నా మెలుకువగా  కళ్లలో వత్తులేసుకొని కూర్చోకపోతే మా పని 'శ్రీమద్రమారమణ గోవిందో హారి' ఐపోదా! కొన్ని నష్టాలకు సరిపడా పరిహారంగానైనా మాకు జీతభత్యాల్లో సర్దుబాటు చేయమనడం అన్యాయవా! లాభదాయక పదవుల్లో ఉండరాదని మాకు మాత్రమే ఓ  గుదిబండ మెడలో వేలాడుతుంటుందని తెలుసుగా! ఆ వారా నష్టపరిహారం లెక్క  చూసుకున్నా ఇప్పుడు మేమడిగే పదిలక్షలకు ఐదురెట్లు ఎక్కువ ఇచ్చినాఅ తక్కువే!  ప్రజాప్రతినిధులన్న కక్ష మానేసి పక్షపాతం లేకుండా ఆలోచించమని మనవి చేసుకొంటున్నాం! అదీ  నీకు మహా ఎగతాళి ఐపోయింది!'
'సారీ తమ్ముడూ! నువ్వింత వివరంగా విడమరిచి చెప్పినప్పుడైనా   నా మైండ్ సెట్ మారకపోతే  తప్పే!ఒప్పుకుంటున్నా!  న్యాయంగా ఆలోచిస్తే నెలకు పాతిక లక్షలు జీతంగా ఇచ్చినా మీ నష్టానికి సరిపడ్డ పరిహారం కాదనే అనిపిస్తున్నదిప్పుడు!'
' థేంక్స్ అంతరాత్మా!'
'కానైతే నాదో చిన్న సలహా కూడా ఉందిమిత్రమా! పనికి తగ్గ జీతభత్యాలుండాలని కోరుకోవడంలో తప్పు లేదు. అరవై ఏళ్లకిందట ఏటా అరవై బిల్లులు పాసు చేసేవాళ్ళు మీ ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ప్రశాంతంగా కూర్చుని. ఇప్పుడో? పాతిక పాసు అవడానికే ఆపసోపాలు పడుతున్నారు! చాలా బిల్లులు చర్చలకు నోచుకోకుండానే చట్టాలు ఐపోతున్నాయిప్పుడు ఇహ చట్టసభల్లో తమరి హాజరు చిన్నబళ్లో పంతుళ్ల హాజరీకన్నా అన్యాయంగా ఉంది హుజూర్!'
'ఐతే ఏమంటావ్?!'
'అకౌంటబిలిటీనిబట్టి అకౌంటింగు ఉండాలంటాను'
'మరి..'
'గంటకు ఇంతని హాజరుభత్యం నిర్ణయించాలి. హాజరుపట్టీ ప్రకారమే జీతాల చెల్లింపులుండాలి. వాకౌట్ చేసిన రోజున జీతం మొత్తం కట్! సభాపతి అనుమతి లేకుండా మాట్లాడే ప్రతి పదానికి ఇంతని కత్తిరించడం తప్పనిసరి చేయాలి. మార్షల్సు బలవంతంగా బైటికి మోసుకుపోయిన సందర్భంలో బరువుకి ఇంతని అపరాధరుసుం అదనంగా మీ జీతాలనుంచే వసూలు చేయాలి. ఫలహార శాలల్లో ఇచ్చే రాయితీలను రూపాయి పైసల్లోకి మార్చి మీ జీతాలనుంచే  తిరిగి రాబట్టాలి. రాజకీయాల్లోకి రాకముందు.. వచ్చిన తరువాత.. కనిపించే ఆదాయాల్లోని  తేడానుబట్టి  ఇంత శాతమని శిస్తుగా వసూలు చేసి ఏ ప్రధాని సంక్షెమ నిధికో జమచేసేందుకు 'సై' అంటే నెలకు పదిలక్షలేం ఖర్మ.. పాతికలక్షలమీదొక్క రూపాయి ఎక్కువిచ్చినా అధర్మం అనిపించదు'
'ఖర్మ! ఆ లెక్కన మాకిక నికరంగా మిగిలేదేముంటుంది అంతరాత్మా.. ఆ ఒక్క రూపాయి తప్ప!'
-కర్లపాలెం హనుమంతరావు
***
(ఈనాడు సంపాదకపుటలో 'శ్రమకు తగని ఫలం' పేరుతో ప్రచురితం)



'


(

Thursday, August 20, 2015

కొన్ని చిన్నికవితలు

ఈ చినుకు
ఏ సముద్ర
ఆనందబాష్పమో!



                                           ఎవరన్నారు
కాలం
గుప్పిట్లో చిక్కదని?
-నాన్న ఫొటో!





కంటికీ చేతులుంటే
ఎంత బాగుణ్ణో
కదా ఊహాప్రేయసీ!



                     

                                                 ఎక్కినా
 
                                                  దిగినా
                                                  మెట్లు
                                                   అవే! 





నలుపు తెలుపుల్లో
ఎన్ని రంగులో
పాత మిత్రుల గ్రూప్ ఫోటో!

                  


                  మాయాలోక విహారం
                                పుస్తకం
                              కీలుగుర్రం







కోయిల కూస్తోంది
మావి చిగురు
మిగిలుందని!




తట్టి
తడిపింది
హైకు


-కర్లపాలెం హనుమంతరావు

Wednesday, August 19, 2015

నేరము- శిక్ష- గో తెలుగు కథానిక

                                                            
పగలు రాజ్యపాలన సాగిస్తూ రాత్రిళ్ళు మారువేషంలో సంచారం చేసి ప్రజల కష్టసుఖాలను స్వయంగా పరిశీలించడం మహారాజు కృష్ణవర్మగారికి  అలవాటు. ఒకసారి ఇలాగే బాటసారి వేషంలో పర్యటిస్తూ రాత్రి చీకటి పడే వేళకు  నగర పొలిమేరల్లోని ఒక ఇంటితలుపు తట్టారు కృష్ణవర్మమహారాజు.

ఆ ఇల్లొక బీద బ్రాహ్మణుడిది. ప్రాచీన సంప్రదాయాలకు ప్రాణమిచ్చే కుంటుంబం అతనిది. ఉన్నంతలోనే చేతనైనంత అతిథి మర్యాదలు చేసాడా రాత్రి.

భోజనం ముగించి.. పడుకునే ముందు బాటసారికి, బ్రాహ్మణుడికి మధ్య చిన్నపాటి లోకాభిరామాయణం సాగింది.
మాటల సందర్భంలో బ్రాహ్మణుడు మారువేషంలోని కృష్ణవర్మమహారాజుతో  దేశంలో జరుగుతున్న అన్యాయాలను, అవినీతిని, అక్రమాలను ఏకరువు పెట్టి రాజుగారి పాలనను దుయ్యబట్టాడు.
అంతా సావకాశంగా విన్న రాజావారు "అన్ని కార్యాలూ రాజుగారే స్వయంగా చూసుకోవాలంటే సాధ్యమా! న్యాయ పర్యవేక్షణ, చట్టం అమలు వంటి  విభాగాల నిర్వహణకు అందుకే ఆయన ఎక్కడికక్కడ  ఉద్యోగులను నియమించారు కదా! వారి ప్రవర్తనల్లో లోపం కలిగితే ఆ దుష్ఫలితాలను రాజుకు ఆపాదించడం న్యాయం కాదు" అని  వాదనకు దిగారు.

"కావచ్చు కానీ.. ప్రజలకు వాటితో పనిలేదు. అంతంత లోతులు ఆలోచించ లేని అమాయకులకు వారు. సుఖంగా బతుకుతున్నప్పుడు రాజుగారి చలవ వలనే అని ఎలా నమ్ముతారో..  శాంతి భద్రతలు కరువైనప్పుడూ అలాగే  రాజుగారి వైపు  వేలెత్తి చూపిస్తారు. శరీరానికి  దెబ్బ తగిలితే.. గాయపరిచిన ఆయుధాన్ని కాకుండా.. ఆయుధాన్ని ప్రయోగించిన మనిషినే కదా మనం దూషిస్తాం! ఉద్యోగే అన్యాయం చేసినా.. అలాంటి దుర్మార్గుడికి అధికారం అప్పగించిన రాజే నిందను భరించక తప్పదు. సత్పరిపాలన అంటే సచ్చరితులను గుర్తించి సరైన పదవుల్లో నియోగించుకోవడమే" అన్నాడా బ్రాహ్మణుడు.

మహారాజుగారు ఆలోచనలో పడ్డారు.
"చెప్పడం సులభమేపదవి చేతిలోకొచ్చిన తరువాత గాని అసలు నైజం బైటపడదు.   ఎవరిదాకానో ఎందుకు.. మీకే గనక ఓ న్యాయాధికారి పదవి అప్పగిస్తే రాజుగారికే మచ్చా రాకుండా భాధ్యతలు నిర్వహించగలరా?" అని అడిగారు చివరికి.
బ్రాహ్మణుడే మాత్రం తొట్రు పడలేదు. "మహారాజు గారి నమ్మకాన్ని వమ్ము చేయననే అనుకుంటున్నాను" అన్నాడు. సంభాషణ అంతటితో ముగిసి పోయింది.

మర్నాడు ఆ బ్రాహ్మణుణ్ని కృష్ణవర్మమహారాజు కొలువుకి పిలిపించారు.
రాత్రి తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించింది స్వయంగా మహారాజా వారే అని అప్పటికిగాని గ్రహింపుకి రాలేదు బ్రాహ్మణుడికి.

"నేటి నుంచి నగర న్యాయపాలనాధికారాలు తమకే అప్పగిస్తున్నాము. న్యాయం 'తు..' తప్పకుండా పాటించడ మెలాగో మీరు నిర్వహించి చూపించాలి. గడువు నెల రోజులుగాడి తప్పినట్లు ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా శిక్ష ఘోరంగా ఉంటుంది. తల కోటగుమ్మానికి వేలాడటం ఖాయం. బీరాలు పలికి చివరికి కార్యభీరువులయే వారంతా నేర్చుకోవాల్సిన పాఠ్యగ్రంథంగా పనికొస్తుంది. అంగీకారమైతే  వెంటనే అంగుళీయమును అందుకోవచ్చు" అని రాజముద్ర ఉన్న ఉంగరాన్ని  ముందుకు చాచారు కృష్ణవర్మ మహారాజు.

క్షణకాలం మాత్రమే ఆలోచన. ఆ రాజముద్రను అందుకుని భక్తిగా కళ్లకద్దుకొన్నాడు పేదబ్రాహ్మణుడు.
నగర కొత్తన్యాయాధికారిగా రామశాస్త్రిపేరు  ప్రకటింపబడింది. రామశాస్త్రి ఆ బ్రాహ్మణుడి పేరే.

సగం గడువు తీరిపోయింది. నగరంలో మార్పు కొట్టొచ్చినట్లు కనబడుతోంది ఇప్పుడు. మొదటి వారంలో రామశాస్త్రి దగ్గరకు వచ్చిన ఫిర్యాదుల్లో చాలావరకు అక్కడికక్కడే పరిష్కరింపబడ్డాయి. దోషులను విచారించడంలోను, దండనలు విధించడంలోను, శిక్షల అమలును పర్యవేక్షించడంలోను.. రామశాస్త్రి చూపిస్తున్న నిజాయితీ, నిష్పక్షపాతం, నిబద్ధత రెండోవారంలోనే మంచి ఫలితాలు చూపించడం మొదలు పెట్టాయి. నేరస్తులు జంకుతున్నారు. నిందితులు తప్పించుకునే  కొత్తదారులు వెదుకుతున్నారు. శిక్షల రద్ధుకోసం పూర్వం  అవలంబించిన అడ్దదారులేవీ పనిచేయక ఇబ్బంది పడుతున్నారు బందీలు.
కొత్తన్యాయాధికారికి జనం  'జేజే'లు పలకడం నగరసంచారంలో  కృష్ణవర్మ మహారాజు స్వయంగా గమనించారు. మహారాజావారు రామశాస్త్రిని రాజ్యంమొత్తానికి శాశ్వత న్యాయాధికారిగా నియమించబోతున్నారన్న వార్త ఒకటి ప్రచారంలో కొచ్చేసింది ఎలాగో!

అప్పుడు జరిగిందా విచిత్రం.

పనిమీద దేశాంతరం పోయిన ఒక వ్యాపారి అనుకోకుండా అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అమావాస్య కావడం వల్ల అప్పటికి చీకటి బాగా చిక్కపడి ఉంది. భార్య చాలా తాత్సారం చేసి గానీ తలుపు తీయలేదుఅనుమానం వచ్చిన భర్త ఇల్లంతా వెతికితే పడకగదిలో మంచం కింద మరొక మగమనిషి  నక్కి  కనిపించాడుతప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో వాడికీ, ఇంటియజమానికీ మధ్య పెద్ద పెనుగులాట అయింది. ఆ దెబ్బలాటలో కత్తిపోటుకి మగమనిషి ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి. ఇప్పుడు హతుడిభార్య  న్యాయం కావాలంటూ రామశాస్త్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

"ఆడమనిషి చనువు ఇవ్వకపోతే మొగవాడనే వాడికి అర్థరాత్రి  ఇంట దూరే ధైర్యం ఎక్కడినుంచి వస్తుంది? భర్త వుండీ పరాయి మగవాడితో పోవాలనుకునే ఆడదానికి పడాలి అసలైన శిక్ష.. ముందుగా" అని విగతజీవుడి భార్య వాదన.
కొట్టి పారేయదగింది కాదు.
"నాకే పాపమూ తెలీదు. మనిషి ముఖం కూడా  ఎన్నడూ చూసి ఎరగనువీడు ఎప్పుడు ఇంట్లోకొచ్చాడో..  పడకగదిలో మంచం కింద ఎందుకు దూరాడో అస్సలు   తెలీదునా బిడ్డమీద ఒట్టు. తలుపు ఆలస్యంగా తీయడానికి కారణం నేను మంచినిద్రలో వుండటమే. మా ఇంటాయన  సమయంలో వస్తాడని నేనేమన్నా కలగన్నానా?" అని భోరుమంది. కన్నబిడ్డమీద  ప్రమాణంకూడా చేసి చెప్పిందా ఇల్లాలు.
కల్లిబొల్లి కథలుగా  శంకించడం సబబు కాదు.
"నిజానికి ఆ దుర్మారుడే నన్ను చంపాలని చూసాడు. తప్పించుకునే ప్రయత్నంలో నేను కత్తి విసిరిన మాట నిజమే. కాని.. వాణ్ణి చంపాలన్న ఉద్దేశం ఏ కోశానా లేదు. గాయ పరిచి చట్టానికి పట్టిద్దామన్నదే నా ఆలోచన.   చేతికి గురి చూస్తే కత్తి  గొంతులో దిగబడింది.." అని పశ్చాత్తాపం ప్రకటించాడు ఇంటి యజమాని. ఆయనకు పరమ శాంతపరుడిగా చుట్టుపక్కల మంచి పేరుంది.
విచారణలో మాత్రం పొరపాటు జరిగినా అమాయకులు అన్యాయంగా బలైపోయే ప్రమాదం ఉంది.
రామశాస్త్రికి మొదటిసారి ధర్మసంకటం ఏర్పడింది.' న్యాయానికి భార్య ఉండీ.. పరాయిస్త్రీ కోసం వెంపర్లాడిన ఆ కాముకిడికి తగిన శిక్షే పడింది. కాని దాని పర్యవసానం  అమాయకురాలైన వాడి భార్యమీదా పడింది. వ్యాపారి భార్యమీద ఆరోపించిన కాముకత్వానికి రుజువులు లేవు. చట్టప్రకారం శిక్షించడం కుదరదు. సహజన్యాయం దృష్టితో చూస్తే.. తనకాపురంలో నిప్పులు పోయబోయిన దుర్మార్గుడిని ఆత్మగౌరవంగల మగవాడూ ఉత్తిపుణ్యానికి సహించి వదిలి పెట్టలేడు. నిజంగా వాణ్ని చంపినా వ్యాపారికి పాపం అంటుకోరాదు.

కాని ఇది న్యాయస్థానం. న్యాయం ఇక్కడ  కొన్నిచట్రాల పరిధిలో మాత్రమే ఇమిడి నిర్థారింపబడుతుంది.  కావాలని చేసినా.. అనుకోకుండా జరిగినా ఒక నిండుప్రాణం గాలిలో కలసిపోయింది. దానికి కారకుడైన వాడిని ఉపేక్షిస్తే సమాజం మొత్తానికి తప్పుడు సంకేతాలు వెళతాయి. ఇదే అదనుగా తన మీద గుర్రుగా ఉన్న తతిమ్మా న్యాయాధిపతులు మహారాజుగారికి ఫిర్యాదులూ చేయవచ్చు.
తనతలను గురించి కాదుకానీ .. రాజ్యం మళ్ళీ పూర్వపుసంక్షోభంలో  చిక్కుకుంటుందేమోనన్నదే దిగులుముందు ముందు సమాజానికి  తలతో చేయవల్సిన సేవ ఎంతో వుంది. చిన్న కారణంగా పెద్ద సామాజికభాధ్యతనుంచి ఇలా తప్పుకోవాలనుకోవడం కార్యశీలుడి లక్షణం కాదు.'

ఆ రాత్రంతా ఎన్నో రకాలుగా ఆలోచించిన రామశాస్త్రి తెల్లారి చెప్పవలసిన తీర్పు మీద ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చాడు. అప్పుడు గాని నిశ్చింతగా నిద్ర రాలేదు శాస్త్రికి.

మర్నాడు న్యాయస్థానంలో రామశాస్త్రి చెప్పిన తీర్పు ఎందరినో ఆశ్చర్య చకితులను చేసింది
'ఘటన పుర్వాపరాలు అతి సూక్ష్మంగా పరిశీలించిన పిమ్మట నేరం మొత్తానికి పూర్తి భాధ్యులు దేశాన్ని ఏలే కృష్ణవర్మమహారాజు గారే అని నిర్ధారించడమైనది. దేశాంతరం పోయిన చిరువ్యాపారి చేసే పని- తాను పండించిన కూరగాయలను కనీస ధరలకు అమ్ముకోవడం. దేశీయంగా తగిన మద్దతు దొరికితే ఎవరూ కుటుంబాన్ని అలా గాలికి వదిలి దేశాలుపట్టి పోరు.

మహారాజుగారి మరో నేరం మృతుడి దుర్మరణంస్వయంకృషితో నిమిత్తం లేకుండా సంపదలు వచ్చి పోగుపడే మిడిమేళపు వర్గం ఒకటి దేశంలో వర్ధిల్లుతున్నది. వారికి పొద్దు గడవడమే పెద్ద ఇబ్బంది. తిన్నదా అరగదు. కొవ్వా కరగాలి. అందుకే రకరకాల దోవల్లో యావలు తీర్చుకోవడానికి తాపత్రయపడుతుంటారు. సంసార స్త్రీలను ఉచ్చులోకి లాగేది ఇలాంటి నడమంత్రపు సిరిపోగైన వాళ్ళే. చట్టాలు వీరికి చుట్టాలు. న్యాయం ఆంటే మహా అలుసు దుర్మార్గులకి. పాపాత్ములకి శిక్షలూ పడని అస్తవ్యస్త వ్యవస్థకూ సర్వోన్నతాధికారి అయినందు వల్ల మహారాజుగారే భాద్యత వహించాలి'.

'కట్టుకున్న వాడితో కలసి   బతుకును పండించుకోవాలన్న ఒక్క ఆశతో మాత్రమే లలన మెట్టినింట్లోకి అడుగు పెట్టేది. కలకాలం పక్కనే ఉంటానని  ప్రమాణం చేసి మరీ చెయ్యందుకున్న  మగవాడు  కలలో తప్ప కనపడని  దుస్థితి దాపురిస్తే పడతులందరూ  ఒకే రీతిలో స్పందించరుకడుపు నిండిన వాడు అన్నం దొంగిలిస్తాడా? బిడ్డ ఖాళీ కడుపుకి కన్నవారిది నేరం ఎలాగో..  ఏలిన వారి దోషం ఇక్కడ అలాగా'.
‘మూడు తప్పులకూ మూలకారణం  మహారాజుల వారే కనక మరణ దండనే వారికి సరైన శిక్షనిందితుడే స్వయంగాబహిరంగంగా మహారాజావారి మీదకు  కత్తి విసిరాలి. తరువాత  నేరంమీద వ్యాపారికీ యథేచ్చగా ఉరిశిక్ష అమలు చేయవచ్చుహతుడి భార్య కోరుకుంటున్న న్యాయం కూడా  అప్పుడే సాధ్యమని న్యాయస్థానం భావిస్తున్నది'
రామశాస్త్రి తీర్పు పుట్టించినంచిన కలకలం అంతా ఇంతా కాదు. ప్రజలు తీర్పుకి అనుకూలంగా.. ప్రతికూలంగా రెండు వర్గాలుగా చీలి వాదులాడుకోవడం మొదలు పెట్టారు. అంశం మహారాజుగారి మరణదండనకు సంబంధించింది కనక చర్చల ప్రభావం సమాజంలోని అన్ని వర్గాల మీద తీవ్రంగా ఉంది. తీర్పులో ప్రస్తావించిన దేశీయ వ్యాపార ధోరణులు.. కలవారి విచ్చలవిడితరహా బతుకులు.. ఆడవారి జీవితాల్లో  జరుగుతున్న అన్యాయాల్లాంటి ఎన్నోసామాజిక సమస్యలు మేదావివర్గాల చర్చల్లో నలిగి నలిగి సామాన్య్లుల అవగాహనా స్థాయి పదును తేలింది. న్యాయస్థానాల్లో, శాంతిభద్రతల రక్షణ  యత్రాంగాల్లో అప్పటి వరకూ లోపాయికారీగా సాగుతోన్న అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం లాంటి ఎన్నో రుగ్మతలు ఇప్పుడు నిర్భయంగా బహిరంగ చర్చకు గురవుతున్నాయి.

రామశాస్త్రి కోరుకున్న చైతన్యం కూడా అదే.

మహారాజుగారూ  'తీర్పుకి కట్టుబడి ఉంటాన'ని ప్రకటించడంతో చట్టం ముందు అందరూ సమానమేనన్న సందేశం అత్యంత బలంగా సమాజానికి అందించినట్లయింది. న్యాయవ్యవస్థ పక్షపాతం మీద అప్పటిదాకా ధనికవర్గాలకున్న ధీమా మొత్తం  ఒక్కసారి కుప్పకూలింది.


రామశాస్త్రి తీర్పు అమలు చేయాల్సిన క్షణాలు రానే వచ్చాయి. బహిరంగ వధ్యశిల ఏర్పాటు చేయబడింది.  రాచపరివారం సమస్తం వెంటరాగా మహారాజుగారు శిక్షాస్థలికి అట్టహాసంగా తరలి వచ్చారు.

శిక్షలు విధించడమే తప్ప శిక్షలు అనుభవించే వ్యవస్థ రాచరికానికి కొత్త. చరిత్రలో సైతం ఎక్కడా జరిగినట్లు విని ఉండని  అపురూప దృశ్యాన్ని తిలకించడానికి ఎక్కడెక్కడి జనసమూహాలో   వధ్యస్థలి దగ్గర విరగబడ్డాయి.

ఏ నోట విన్నా మహారాజుగారి మంచితనాన్ని గురించిన స్మరణే.  ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలించే  కృష్ణవర్మ మహారాజుగారు వదిలేస్తున్న స్థానానికి వారసులు  ఎంతవరకు న్యాయంచేస్తారోనన్న అనుమానం. మహారాజుగారి పాలనలో కొన్ని పొరపాట్లు జరిగితే జరిగ ఉండవచ్చు. రామరాజ్యానికే ఈ మచ్చ తప్పలేదని రామాయణం చెబుతోంది.  రాములవారికేమైనా  ఇలాంటి దారుణమైన శిక్ష పడిందా?
చర్చలు ఇలా పలురకాలుగా సాగుతుండగానే.. చీకటి పడింది. తీర్పులో సూచించబడిన సమయానికి సరిగ్గా వ్యాపారిని మరణ వేదిక మీదకు తీసుకొచ్చారు. అతని చేతికి ఒక కత్తి ఇచ్చారు.
ఎదురుగా మొఖంమీద ముసుగుతో  చక్రవర్తులు..  ప్రాణాలు అర్పించడానికి సిద్ధబడి ధీరోదాత్తంగా  నిలబడి వున్నారు.

ప్రకటన వెలువడింది "వ్యాపారీ! అత్యున్నత న్యాయస్థానం ఆదేశం ప్రకారం నువ్వు మహారాజుగారి  మెడమీదకు కత్తి విసరాలి. ఒకే ఒక్క వేటుతో  మహారాజుగారి ప్రాణాలు  పోవాలి. విసురూ!"
అంతటా హాహాకారాలు.
 వజవజా వణుకుతూ చేతిలోని కత్తిని బలంగా విసిరాడు వ్యాపారి .  గురి తప్పనే తప్పింది.  మెడకు తగలాల్సిన కత్తి భుజానికి రాసుకుని కింద పడింది. తీర్పు ప్రకారం వ్యాపారికి ఇవ్వబడేది ఒకే ఒక్క అవకాశం కనక మహారాజుగారు సురక్షితం.
 అంతటా ఆనందంతో కేరింతలు.
 ప్రజాభిమానానికి  కదలి పోయారు కృష్ణవర్మ మహారాజు. ఇంతగా ప్రేమించే ప్రజలకు ఏమిస్తే రుణం తీరేను? జన సంక్షేమానికి మరింత  ప్రాథాన్యమివ్వాలని క్షణంలోనే  కృతనిశ్చయానికొచ్చారు  మహారాజు.
ఇదంతా రామశాస్త్రి చిత్రమైనతీర్పు  కలిగించిన బుద్ధివికాసం. "నిజమే కానీ.." అంటూ అప్పటి వరకూ తనను తొలుస్తున్న సందేహాన్ని రామశాస్త్రి ముందు బైట పెట్టారు మహారాజావారు "అర్థరాత్రి పరాయి యింట్లోకి ఆ దుర్మార్గుడు దూరింది ఎందుకో నిర్ధారణ కానేలేదు. ఇంటి ఇల్లాలు చరిత్ర ఎంత స్వచ్చమైందో  రుజువూ  కాలేదు.  వ్యాపారి 'దుర్మార్గుడిని కావాలని చంపలేదు.. నిర్దోషిన'ని బుకాయిస్తున్నాడు. మాటల్లోని  నిజాయితీ పాలైనా నిగ్గు తేల్చలేదు. తప్పుచేసిన వాళ్ళందరిని గాలికి వదిలేసి సంఘటనతో మాత్రం సంబంధం లేని… నాకా శిక్ష? ఆ  వ్యాపారి సుశిక్షితుడైన యోధుడు కాకపోబట్టి తడబడ్డాడులేకపోతే.."

మధ్యలోనే అందుకొని ముగించాడు రామశాస్త్రి "అతను తడబడ లేదు మహారాజా! గురి చూసే విసిరాడు. అది తప్పింది. అతని గురే అంత. కుడికన్నులో దృష్టిలోపం ఉంది. లోపం కారణంగానే రోజు రాత్రి  వ్యాపారి చేతిలో దుర్మార్గుడి ప్రాణాలు పోయాయి.  దుర్మార్గుణ్ని గాయపరిచి వదిలేద్దామన్న ఉద్దేశంతోనే వ్యాపారి  కత్తివిసిరిని మాట వాస్తవం. దృష్టిలోపం  కామాంధుడి ప్రాణాలు పోవడానికి కారణం అయింది. నిజానికి అలాంటి నీచులు బతికి ఉండటం వల్ల అమాయకులకు ఏ మాత్రం మనశ్సాంతి ఉండదు. వ్యాపారి భార్య  ఒంటరిగా ఉండటం చూసి,   నాశనం చేయాలన్న దుర్బుద్ధితోనే వాడు చీకటిమాటున చాటుగా వచ్చి ఆమె పడకగదిలో నక్కాడు. పాపంలో ఆమెకే భాగం లేదు. కాముకుడి చరిత్ర.. ఇల్లాలి చరిత్ర వాకబు చేయించిన తరువాతనే నేనీ రకమైన శిక్ష ఖరారు చేసింది.'
'సంఘటన విచారణకు వచ్చినప్పుడు  వ్యాపారికి శిక్ష పడుతుందనే అందరూ భావించారు. సాక్ష్యాలనీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి మరి. నా మనస్సాక్షి ఒక్కటే అతడికి అనుకూలం. వాకబు చేసిన మీదట నా నమ్మకం నిజమని తేలింది. కానీ సాక్ష్యాలుగా అవి చాలవువ్యాపారిని శిక్షించకుండా వదిలేయాలని, నా తల కోటగుమ్మానికి వేలాడితే చూడాలని ఉవ్విళ్ళూరే మత్సరరాయుళ్ళకు అవకాశం ఇచ్చినట్లవుతుందిఇప్పటి వరకూ వ్యవస్థను భ్రష్టుపట్టించిన వాళ్ళు వాళ్ళంతా. ఇప్పుడిప్పుడే   పరిస్థితులు చక్కబడుతున్నాయి. నా తలను గూర్చి నాకు బెంగ లేదు కానీ.. తమ మంచితనంవల్ల నాకు దక్కిన అవకాశాన్ని సమాజ హితం కోసం మరింత పదునుగా వాడాలని ఆత్రం మాత్రం ఉంది. ముందు ముందు నా విరోధులు మీ మనసు విరిచే ప్రమాదం ఉంది. అందుకే .. సంబంధం లేకపోయినా వ్యవహారంలో  మిమ్మల్ని కూడా ఇరికించవలసి వచ్చింది. మీరు అందుకు అనుమతించడం మీ వ్యక్తిత్వవిశేషం. వ్యాపారి దృష్టిలోపం మీద ఒకసారి మీకు నమ్మకం కుదిరితే .. ఇక ఎవరు ఎన్ని చెప్పినా మీరు నా తీర్పుని  శంకించరన్న నమ్మకమే నా చేత సాహసం చేయించింది. మీ సహృదయత వల్లే ఇది సాధ్యమైందిఇదీ నా సంజాయిషీ. ఇప్పుడు మీరు ఏ శిక్ష విధించినా శిరసావహించడానికి  సిద్ధం మహారాజా!"

మందహాసం చేసి అన్నారు  మహారాజు "నాకు ఇంత పెద్ద శిక్ష విధించిన పెద్దమనిషిని వూరికే వదిలి పెట్టడం కల్ల. శిక్ష ఖాయం. అమలుకు గడువుదాకా వేచిచూడటం దేనికి! రేపే ముహూర్తం. సామాన్యులకు మా ద్వారా  మరింత న్యాయం జరిగే అవకాశం ఇవ్వండి!   మా ముఖ్య సలహాదారులుగా  చేరడమే  మీకు తగిన శిక్ష " అంటూ ఆప్యాయంగా రామశాస్త్రిని ఆలింగనం చేసుకున్నారు కృష్ణవర్మ మాహారాజు .*
-కర్లపాలెం హనుమంతరావు
(గో తెలుగు సచిత్ర వారపత్రిక 122వ సంచికలో( 07-08-2015)లో ప్రచురితం)


http://www.gotelugu.com/issue122/3203/telugu-stories/neramu-shiksha/







మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...