'ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మనది. నూటపాతిక కోట్ల
మంది జనాభాకి ముష్టి ఏడొందల తొంభై మూడుమంది మాత్రమేనా ప్రజాప్రతినిథులు! స్థాయిలో మాకన్నా ఎంతో
దిగువనున్న వాళ్లకేమో లక్షల్లో జీతాలా!
మాకు మాత్రం భిక్షాపాత్రలో ముష్టి వేసినట్లు తొంభైవేలా?! ప్రొటోకాలు పరువైనా నిలబడాలా వద్దా? లెక్కకైనా వేతనంలో కనీసం ఒక్కరూపాయైనా
ఎక్కువ మాకు దక్కాలి గదా! ఎవరు
బాబూ నువ్వు? ఎందుకా పడీ పడీ నవ్వు?'
'నీ అంతరాత్మనులే మహానుభావా! గుర్తుపట్టలా? ఎన్నికల సంఘంవాళ్లకి నువు సమర్పించిన తప్పుడు వివరాల ప్రకారం చూసుకొన్నా
నీ ఇప్పటీ ఓ గంట ఆదాయం.. తెల్లకార్డువాడి ఏడాది సంపాదనకన్నా ఎన్నోరెట్లు
ఎక్కువగదా! ఉచిత బంగళా.. ఫ్రీ ఫోన్ కాల్సు.. సకుటుంబ సపరివారంగా చక్కర్లు కొటేందుకు దేశీయంగా ఉచిత ప్రయాణ సౌకర్యాలు.. ఖర్చుచేసినా చెయ్యకున్నా
పెట్రోలు, గ్యాసులమీద భారీ రాయితీలు,
నియోజక వర్గాల్లో తిరిగినా తిరగకున్నా సాదర ఖర్చులకింద వేలాది
రూపాయలు.. నొక్కుతున్నావుకదా! ఇంకా ఈ వేతనాలు చాలడంలేదన్న సన్నాయి నొక్కులేమిటంట? నవ్వు రాదా మహాశయా! నీ విమానాలు, ఏసీ రైళ్ళ ప్రయాణాలు వగైరాలన్నింటికీ అయ్యే ఖర్చు బొక్కసానికి ఏటా డెబ్బైనాలుగు
లక్షల పైచిలుకు బొక్కపెదుతోందని లెక్కలు
చెబుతున్నాయిగదా! అయినా నువ్విప్పుడు మళ్ళీ క్యాంటీను భోజనం ఖరీదుగా ఉందని
యాగీకి దిగుతున్నావ్! ఇంకా ఏవేవో సౌకర్యాలు సమకూరడంలేదని సణుగుతున్నావ్! ఈ కరవు, ఆర్థికమాంద్యం గడ్డురోజుల్లోకూడా నీకు
జీతమెందుకు పెంచాలో ఒక్క సజావుకారణం ఉంటే సెలవివ్వు..
నవ్వడం మానేస్తా!'
'ఒక్కటి కాదు. ఓ కోటి చెబుతాను.. ఒక్కోటీ ఓపిగ్గా
వినాలేగాని! ఈ వృత్తిలోకి రాకముందు నేనెంత గడించేవాణ్ణో నీకూ తెలుసు. మామూళ్ళు, సెటిల్మెంటులు, రింగుల్లాంటివి
ఇప్పుడు బాహాటంగా చెయ్యడానికి ఎలా వీలుంటుంది చెప్పు! పనోళ్ళకి సిమెంటు
ఫ్యాక్టరీలున్నా పట్టించుకోరుగాని.. మేం ఇసుక తక్కెళ్ళ జోలికెళ్ళినా గగ్గోలు
పెడతారు దిక్కుమాలిన జనం.. విడ్డూరంగా! అందుకే ప్రభుత్వ
వైద్యులకు మల్లే మాకూ 'నాన్ ప్రాక్టీసింగు అలవెన్సు'ఇవ్వాలంటున్నాం! తప్పా?
'హా.. హా.. హా'
ఆ నవ్వే వద్దు! మంగళరిగి చేంతాడంతందని మా ఆదాయప్పట్టికను తప్పుపడుతున్నావ్ గానీ..
హనుమంతుడి తోకమాదిరి సాగే మా ఖర్చుల చిట్టా మాత్రం నీకు
పట్టదు! సర్కారువాళ్ళిచ్చే ముష్టి ముగ్గురు సెక్యూరిటీ
మాకేమూలకు! కాలు
బైటపెడినప్పుడల్లా ఎంత హంగూ.. ఆర్భాటం ప్రదర్శించాలీ! పెట్రోలు, డీజెలు రేట్లు ఎట్లా పెట్రేగిపోతున్నాయో.. అంతరాత్మగాడివి
నీకే తెలుస్తుంది! మా
ప్రైవేటు ఆర్మీకేమన్నా తలా ఓ రెడ్ ఫెరారీ డిమాండు చేస్తున్నామా? బుల్లెటు ప్రూఫ్ కార్లు, బుల్లెట్లు, బాంబులకయ్యే ఖర్చు ఎంతని సొంతంగా
పెట్టుకోగలం.. కరువుకాలంలో!
అన్నీ బైటకు చెప్పుకొనే ఖర్చులుకూడా కావాయ! ఎన్నికల్లో ఎన్నెన్నిరకాల వత్తిళ్ళొస్తాయో నీకూ తెలుసని నాకు తెలుసు.'
'నిజమే! ఇదివరకు మాదిరి ఏదన్నా సర్కారు భూముల్లో జెండాలు
పాతుకొందామనుకొన్నా.. పాపం.. వాటికీ ఉల్లిగడ్డలకుమల్లే కరువొచ్చి పడిందాయ! దేవుడి
సొమ్మూ దేవుడికే అంతుచిక్కకుండా అంతర్దానమవుతుందాయ! ఇంక మీకు మాత్రం మిగులుతున్నదేముందిలే తమ్ముడూ
బూడిద మినహా!'
'వెటకారమా!
ప్రభుత్వాలన్నా స్థిరంగా ఉండుంటే మాకిన్ని పాట్లుండేవా చెప్పన్నా! ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడే భూసేకరణ
సవరణో.. చటుక్కున చట్టమై కూర్చుందనుకో.. ఇహ మా పని చుట్టలు పీల్చుకుంటూ రచ్చబండమీద
చతికలబడ్డమేగా! కాల్ సెంటరు పనోళ్లకన్నా మెలుకువగా కళ్లలో వత్తులేసుకొని కూర్చోకపోతే మా పని 'శ్రీమద్రమారమణ గోవిందో హారి' ఐపోదా! కొన్ని నష్టాలకు సరిపడా పరిహారంగానైనా మాకు
జీతభత్యాల్లో సర్దుబాటు చేయమనడం అన్యాయవా! లాభదాయక పదవుల్లో ఉండరాదని మాకు మాత్రమే
ఓ గుదిబండ మెడలో వేలాడుతుంటుందని
తెలుసుగా! ఆ వారా నష్టపరిహారం లెక్క
చూసుకున్నా ఇప్పుడు మేమడిగే పదిలక్షలకు ఐదురెట్లు ఎక్కువ ఇచ్చినాఅ తక్కువే!
ప్రజాప్రతినిధులన్న కక్ష మానేసి పక్షపాతం లేకుండా ఆలోచించమని మనవి
చేసుకొంటున్నాం! అదీ నీకు మహా ఎగతాళి
ఐపోయింది!'
'సారీ తమ్ముడూ! నువ్వింత వివరంగా విడమరిచి
చెప్పినప్పుడైనా నా మైండ్ సెట్
మారకపోతే తప్పే!ఒప్పుకుంటున్నా! న్యాయంగా ఆలోచిస్తే నెలకు పాతిక లక్షలు జీతంగా
ఇచ్చినా మీ నష్టానికి సరిపడ్డ పరిహారం కాదనే అనిపిస్తున్నదిప్పుడు!'
' థేంక్స్ అంతరాత్మా!'
'కానైతే నాదో చిన్న సలహా కూడా ఉందిమిత్రమా! పనికి తగ్గ
జీతభత్యాలుండాలని కోరుకోవడంలో తప్పు లేదు. అరవై ఏళ్లకిందట ఏటా అరవై బిల్లులు పాసు
చేసేవాళ్ళు మీ ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ప్రశాంతంగా కూర్చుని. ఇప్పుడో? పాతిక పాసు అవడానికే ఆపసోపాలు పడుతున్నారు!
చాలా బిల్లులు చర్చలకు నోచుకోకుండానే చట్టాలు ఐపోతున్నాయిప్పుడు ఇహ చట్టసభల్లో
తమరి హాజరు చిన్నబళ్లో పంతుళ్ల హాజరీకన్నా అన్యాయంగా ఉంది హుజూర్!'
'ఐతే ఏమంటావ్?!'
'అకౌంటబిలిటీనిబట్టి అకౌంటింగు ఉండాలంటాను'
'మరి..'
'గంటకు ఇంతని హాజరుభత్యం నిర్ణయించాలి. హాజరుపట్టీ ప్రకారమే
జీతాల చెల్లింపులుండాలి. వాకౌట్ చేసిన రోజున జీతం మొత్తం కట్! సభాపతి అనుమతి
లేకుండా మాట్లాడే ప్రతి పదానికి ఇంతని కత్తిరించడం తప్పనిసరి చేయాలి. మార్షల్సు
బలవంతంగా బైటికి మోసుకుపోయిన సందర్భంలో బరువుకి ఇంతని అపరాధరుసుం అదనంగా మీ
జీతాలనుంచే వసూలు చేయాలి. ఫలహార శాలల్లో ఇచ్చే రాయితీలను రూపాయి పైసల్లోకి మార్చి
మీ జీతాలనుంచే తిరిగి రాబట్టాలి. రాజకీయాల్లోకి రాకముందు.. వచ్చిన తరువాత.. కనిపించే ఆదాయాల్లోని
తేడానుబట్టి ఇంత శాతమని శిస్తుగా
వసూలు చేసి ఏ ప్రధాని సంక్షెమ నిధికో జమచేసేందుకు 'సై' అంటే నెలకు పదిలక్షలేం ఖర్మ.. పాతికలక్షలమీదొక్క
రూపాయి ఎక్కువిచ్చినా అధర్మం అనిపించదు'
'ఖర్మ! ఆ లెక్కన మాకిక నికరంగా మిగిలేదేముంటుంది అంతరాత్మా..
ఆ ఒక్క రూపాయి తప్ప!'
-కర్లపాలెం హనుమంతరావు
***
(ఈనాడు సంపాదకపుటలో 'శ్రమకు తగని ఫలం' పేరుతో ప్రచురితం)
'
(
No comments:
Post a Comment