Sunday, September 13, 2015

వాహనవిలాపం- ఎర్రబస్సు ఏడుపు- ఓ సరదా గల్పిక


అనగనగా ఓ బంద్ రోజు..
బైట తిరిగే పనిలేనందున రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ వాహనాలన్నీ ప్రాంగణంలో సభతీరాయి. సభ ప్రారంభమయింది.
'బందులూ, ధర్మాలూ, రాస్తారోకోలు, హర్తాళ్ళూ,- రాష్ట్రంలో ఎక్కడ ఆందోళన జరిగినా ముందు ఎర్రబస్సులమీదే కన్నెర్రచేస్తున్నారు. దారిన పోయే దానయ్య సైతం సందుచూసుకొని మరీ రెండు రాళ్ళేసి సరదా తీర్చుకుంటున్నాడు!'
'మరే! చిన్న దెబ్బతగిలితేనే పెడబొబ్బలుపెట్టే ఈ అబ్బాయిలు..  అద్దాలు బద్దలయితే మనకూ అంత బాధే ఉంటుందని ఎందుకనుకోరో! ఎక్కడ ఎవరు ఏ పూట ఏ బందుకు పిలుపు ఇస్తారో..  మనమీదకొచ్చిపడి ఎవరు ఏ రాళ్లు విసురుతారోనని.. నిత్యం గుండెలు ఠారుమంటున్నాయిక్కడ!'
'బాగా చెప్పావు. అర్థరాత్రి ఆడదెప్పుడు నడిరోడ్డుమీద నిర్భయంగా తిరుగుతుందో.. అప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యమొచ్చినట్లని అప్పుడెప్పుడే బాపూజీ అన్నట్లు గుర్తు. ఇప్పుడైతే పట్టపగలు రోడ్డుమీద బస్సులు సురక్షితంగా తిరిగినప్పుడే అసలైన స్వతంత్రమొచ్చినట్ల’ని అంటాడేమో మహాత్ముడు. ఆ  మహాత్ముడు మళ్ళీ భూమ్మీదకొచ్చిపోతే బాగుణ్ణు!'
'ఎన్నికలముందు ఈ నేతలంతా బస్సుయాత్రలని ఎన్నేసి పోకడలు




'పోయారో గుర్తుందా బయ్! ఇప్పుడొక్కడికీ మన డొక్కుబతుకుల్ని  గురించి ఆలోచించేపాటి ఓపికే లేకుండా పోయింది!'
'బాగా చెప్పావు. నా దేశం, నా రాష్ట్రం, నా జిల్లా, నా మండలమంటూ గిల్లికజ్జాలు శృతిమించుతున్న ఈ కాలంలో అన్నివర్గాలను ఒకే దారిలో నడిపించే మార్గదర్శకులు ఎవరైనా ఉన్నారా అంటే ముందు చెప్పుకోవాల్సింది మనపేరే!  అడిగినా పెట్టడానికి అమ్మయినా   పదిసార్లు తటపటాస్తున్న  ఈ పాడుకరువు కాలంలో.. చెయ్యూపీ ఊపంగానే రయ్యిమని పోతున్నాసరే..   ఠపీమని ఆగిపోయి  లిఫ్టిస్తున్నామే మనం! అయినా  మనకెందుకో ఇన్ని అష్టకష్టాలు?'



'పక్కమనిషి బాగుపడుతుంటే చూసి ఓర్వలేక  రెక్కుచ్చుకొని వెనక్కీడ్చే కొక్కిరాయిసజ్జు రోజురోజుకీ ఎక్కువవుతున్న రోజుల్లో .. ఏ లాభాపేక్షా లేకండా  బస్సెక్కిన ప్రతిమనిషినీ 'పదండి ముందుకు.. పదండి ముందు'కంటూ తొందరపెట్టే మంచిజాతి మన బస్సులు మినహా ప్రపంచంలో మరెక్కడుందో చెప్పమనండి! అయినా మనకే ఎందుకో ఈ శిక్ష?'
'ఇన్ని దశాబ్దాలు గడిచిపోయినా ఆడదానికి రాజకీయాల్లో రిజర్వేషన్లగానే   నేతాశ్రీలేసే వేషాలన్నీ ఇన్నీ కావు. ఆ ఆకాశంలో సగానికి మనమేనాడో  బస్సుల్లో ప్రత్యేకావకాశాలెన్నో ఇచ్చేసామే! 'రైట్ రైట్' అనడం తప్పించి  మన కండక్టర్ల నోట మరో తప్పుడు మాటెప్పుడూ రానే రాదే! తెలుగు జనాలెప్పుడో మరిచిపోయిన తెలుగంకెల్ని భుజానేసుకొని మరీ తిరిగే మాతృభాషాభిమానులం! మనమీదే ఎందుకు అందరికీ ఇంత వివక్ష! పదండి! వెళ్ళి ఆ దేవుణ్నే  ఈ పక్షపాతమెందుకో అడిగేద్దాం!’
'ఎంత నాస్తికుడైనా మన ఎర్ర బస్సు ఎక్కాడంటే ప్రతిక్షణం ఆ నారాయణ్నే స్మరించుకుంటూ ప్రయాణం సాగిస్తాడు! ఆ పుణ్యానికైనా  దేవుడు  మనమీదింత కారుణ్యం చూపించొద్దా!   కడుగేద్దాం.. పదండి!.. పదండి!'
'అడిగేద్దాం.. కడుగేద్దాం.. సరే! మీకేం కావాలని ఆ దేవదేవుడే ఎదురడిగేస్తే  మరి బదులేం చెప్పాలో మనమిక్కడే ఒకమాటనుకొని అడుగేస్తే ఉత్తమం. ఒట్టి నల్లజెండాలూపుకోంటూ పోతే సరా! ఎజెండా పకడ్బందీగా ఉండద్దా!’
'ఆ మాటా నిజమే భాయ్!  రేపెటూ ఢిల్లీలో  గణతంత దినోత్సవం పండుగలు  మాబ్రహ్మాండంగా జరగబోతున్నాయి! ఎలాగూ మన తెలుగుశకటాలకు  ఏ పురస్కారయోగాలు ఉండనే ఉండవు.  అద్దాలు పగిలి రేకులూడిన గాడీలు, కాలిబూడిదైపోయిన మన బాడీలనైనా ఆ  పెద్దలందరిముందు కవాతుకు అనుమతించమని వేడుకొందాం! మన ఏడుపు అప్పుడైనా ప్రపంచానికి వినపడుతుందేమో చూద్దాం!'
అంగీకార సూచకంగా అన్ని డొక్కుబస్సులూ ఒక్కసారే 'బాఁయ్.. బాఁయ్' మంటూ హారన్లు మోగించేసాయ్!
-కర్లపాలెం హనుమంతరావు
(ఫిబ్రవరి 1 నాటి ఈనాడు సంపాదకీయ పుటలో 'వాహనవిలాపం' పేరుతో ప్రచురితం)




Saturday, September 12, 2015

చందమామా రావే ...జాబిల్లి రావే !- నండూరివారి ఊహాగానం







చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే - అంటూ పిల్లాడికి పాలబువ్వ పెడుతూ అమ్మ పాడే పాట చిన్నతనం లో విని మైమరచి పోని  శిశువు వుండదు.
గోరుముద్దలకు మాదిరిగా పాట ఆంధ్ర దేశంలోని ప్రతి బిడ్డ వంటిలో ఇంకి పోయుంటుంది  గానీ -చందమామ మన దగ్గరికి రాదు, మనమే చందమామ దగ్గరికి పోవాల్సి వుంటుందనే జ్ఞానం ఊహ పెరిగిన తరువాత ప్రతివారికి కలిగి తీరుతుంది.అభిమన్యు సినిమాలో నాయికా నాయకులు ప్రేమగా పాడుకునే 'అదిగో నవలోకం...'లోని లోకం చంద్ర లోకమే అయివుండాలేమో!



కొన్ని వేల ఏళ్ల పాటు అసాధ్యమనుకున్న ఘనకార్యాన్ని మానవుడు 1969 లో సాధించాడు . 'అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే మన పనిరా డింభకా!' అంటాడు పాతాళభైరవి లో ఎస్వీరంగారావు .



మానవేతిహాసానికి మకుటాయమానమయిన మహత్తరమయిన సంఘటనను పదిహేను ఏళ్ల క్రిందటే ఒక తెలుగు కవి ఊహించాడు. కవులు    స్రష్టలు కదా !శ్రీ శ్రీ 1954 లో చంద్రుడిని వుద్దేశించి గేయం రాసేనాటికి మొదటి స్ఫుత్నిక్ ఇంకా మూడేళ్ళ భవిష్యత్ దర్సనం లోనే వుంది. "ఏమో ! బహుశా మీ ఇంటికి త్వరలో రావచ్చునేమో! చంద్రమండలానికి ప్రయాణం సాధించరాని స్వప్నం కాదు .గాలికైనా బరువైన వస్తువును నేలమీద నిలబెట్ట లేదూ !సరాసరి నీ దగ్గరికే ఖరారుగా వస్తాం లే ! అప్పుడు మా రాయబారులను ఆదరిస్తావు కదూ నువ్వు?" అంటాడు తన ఖడ్గసృష్టి- శరస్చంద్రికలో .
ఇలాతలనికి ప్రకృతి ప్రసాదించిన ప్రసాదాల లో చంద్ర కాంతి ఒకటి .రాత్రివేళ ఆరుబయలు వెన్నెలలో పడుకుని మబ్బుకన్నెల తో దోబూచులాడే జాబిల్లి దాగుడుమూతలను చూసి పరవశించి పోని వారెవరుంటారు ?



"నీ ఎదుట నేను నా  ఎదుట నీవు మా ఎదుట ఎప్ప్పుడుంటావు చందమామా !" అనే తేనెమనసుల పాట, ' చందమామా...నిజం చూడకూ ! చూసినా ఎవరికీ చెప్పకూ! " అంటూ సాక్షిలో ఆఖరి సన్నివేశాలలో కధానాయకుడు అచేతనుడై  వ్యధ పడే సన్నివేశం గుండెను పిండేస్తుంది. భూమ్మీద నిత్యం జరిగే ఘోరాలనీ, నేరాలనీ , కరువు కటకాలనీ మనుషుల కడగండ్లనీ చూసి మామ గుండె చెరువయి వుండవచ్చు. అందుకేనేమో మన చంద్రయాన్ చందమయ్యలో నీటి చెలమను ఫోటో తీసిపంపింది !మన పౌరాణికులు క్షీర సాగర మధనం లో లక్ష్మీదేవి తరువాత చంద్రుడు పుట్టాడని ఒక కథ కల్పించారు. రకంగా చూస్తే చందమామ విష్ణుమూర్తి బావమరిది.మన్మధుడికి మేనమామ. 'మనిషి గుండెలో ఎప్పుడూ సజీవంగా వుండే మన్మధ భావానికి అందుకేనేమో చందమామను చూస్తే అంత ఆనందం' అంటూ కవి గారు విచిత్రమయిన ఊహాగానం చేసారు .

"కలశపాదోరాశిగర్భ వీచిమ తల్లి/కడుపార నెవ్వాని కన్నతల్లి " అని అల్లసాని పెద్దన వాక్కు. చంద్రుడు హర జటాజూట కిరీటి మణి.చంద్రుడిలోని మచ్చను మనవారు లేడి కూనగా భావించి కుందేలుగా ఊహించి హరిణా0కుడని, శశాంకుడని పేరు పెట్టారు . చంద్రుడు అమృతమయుడు. అమృతాన్ని తాగి దేవతలు దప్పిక తీర్చుకుంటారని మరొక కల్పన. చకోర పక్షులు వెన్నెల కిరణాలను మ్రింగి జీవిస్తాయని మరొక కల్పన. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయని మరొక కవిసమయం. మన ప్రబంధ నాయికలకు చంద్రోదయం కాగానే విరహ తాపం పెరిగిపోతుంది.దాంతో తిట్టిపోసేవారుముఖాలను పోల్చవలసి వస్తే మళ్ళి చంద్రబింబమే కావలిసి వచ్చేదివిశ్వనాథ వారు "అమృతము మాడుకట్టిన దొర" అని సంబోధించి తన పట్ల కోపాన పరాజ్ముఖి అయిన సఖిని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రుడిని దూతగా వాడు కున్నారు. మరొక నవ్య కవి మల్లవరపు విశ్వేశ్వర రావు "తెప్ప వోలె చంద్ర బింబం తేలిపోతూ వుంది నింగిన అందులో ణా ముద్దు ప్రేయసి వుంది కాబోలు!"  అని ఊహించుకున్నారు



.
మనకే కాదు అన్ని భాషలు  అన్ని దేశాలు తమ కవిత్వంలో,
పురాణాల్లో చంద్రుడికో ప్రత్యేక స్థానం కల్పించాయి. గ్రీకు పురాణం లో చంద్రగోళం ఒక స్త్రీ దేవతఆమె పేరు 'సిలీని'.ఇంకా డయానా అర్టేమిన్, సింధియా మొదలయిన పేర్లు కూడా వర్తిస్తాయి. లాటిన్ లో ఆమె పేరు తాన్యా.ఆమె జుపిటర్(బృహస్పతి) కూతురు. అపోలో(సుర్యుడు) కి కవల చెల్లెలు. అందుకే ఆమె లోకానికి వెళ్ళిన రోదసీ నౌకలకు 'అపోలో 'అని పేరు పెట్టారు అమెరికన్లు.ఎండిమిన్ అనే గొర్రెల కాపరిని  సిలీని ముద్దు పెట్టుకున్న గ్రీకు కథ ఎంత అద్భుతమయిన కల్పన! కల్పనే ఆంగ్ల కవి జాన్ కీట్స్ కావ్యానికి ఆధారమయింది. చంద్రుడు ఇంతగా మన ఆలోచనల్లోకి ,జీవితం లోకి చొచ్చుకుని రావటానికి  ఆకాశంలోసూర్యుని తరువాత ముఖ్యమయిన గోళం అతడే కారణం కావచ్చు. భూమికి అతి సమీపంలోని గోళం కూడా అతడే.సూర్యునితో సమానంగా మన కాలమాన విభజనకు ఆధారమయిన వాడు కూడా అతడే. అమావాస్యకు అమావాస్యకు మధ్య కాలాన్ని మనం నెల అంటాం.(చంద్రుడి మరో పేరు నెల.అతని వెలుగే వెన్నెల. ఇంగ్లిషు వారి మంత్ అనే మాట కూడా మూన్ మీదనుంచి వచ్చిందే.





చంద్రుడిని గురించి ఎన్ని అభూత కల్పనలు చేసినా అతి ప్రాచీన కాలం లోనే అతడిని గూర్చి మన పూర్వీకులు ఎన్నో విశేషాలను కనుగొన్నారు.అతనికి స్వయంగా ప్రకాశం లేదని,అతడు కూడా భూమి వంటి గోళమేనని ఆనాటి వారికి తెలుసు. అతగాడు తన ఒక ముఖాన్ని ఎల్లప్పుడూ చూపిస్తాడని, వెనక వైపు చూపించడనీ తెలుసు. చంద్రుడిని ఒక రకంగా మనం వెనక ముఖం వాడని భావించ వచ్చు నేమో ! మనకీ అతనికి మధ్య దూరం ఎంతో మనకు తెలుసు. అతనికి గ్రహణాలు ఎందుకు వస్తాయో తెలుసు. తేదీన వస్తాయో తెలుసు. చందమామ వేళాపాళా   లేకుండా వచ్చే అతిధి కాదనీ తెలుసు. మరెన్నో తెలుసుకానీ ప్రాచీనులు తెలుసుకున్న దాని కంటే ఎన్నో రెట్లు మనం  ఎక్కువగా తెలుసుకుంటున్నాం. 1610 లో గెలీలియో తన టెలిస్కోపును చంద్రుని వైపు తిప్పిన సుముహూర్తం నుంచే దొర మాడున గట్టకట్టిన అమృతం లో మన మానవాళికి ప్రయోజనమయిన సంజీవ గుళికలు దాగి వున్నాయోనన్న అన్వేషణ మొదలయింది. కొన సాగుతోంది
-కర్లపాలెం హనుమంతరావు
(నండూరి రామమోహనరావుగారి 'విశ్వరూపం' లో ఓ వ్యాసం అధారంగా}


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...