Friday, November 10, 2017

భార్యామణికే ప్రశంస- సుత్తి.. మెత్తంగా- ఆంధ్రప్రభ కాలమ్



ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతీ..!
'హల్లో..ఇంటి జ్యోతిగారూ! ఇవాళేంటీ ఈ రాగాల ట్యూనూ..  హుషారుగా ఈ టోనూ?!'
ఇంటాడాళ్లం..  ఇహ ఏ ట్యూనైనా ఫ్రీగా పాడేసుకోవచ్చు! ‘చ్చోయ్! చ్చోయ్!’ అంటూ మీ మగాళ్లింక  ముళ్ల కర్రలతో తోలాలని చూస్తే మాత్రం.. తోల్తీసి డోలు చేసి ఎంత సేపైనా ఇంచక్కా నచ్చిన ట్యూన్లు వాయించు కోవచ్చు! అలాగని మా ఆడోళ్లందరికీ లైసెన్సు లిచ్చేసింది సార్ మహారాజ రాజశ్రీ  మేవాడ్ జిల్లా మెజిస్ట్రేటువారి శ్రీ కోర్టు!'
'అదెప్పుడు? కట్టుకున్నోణ్ని .. నాతోనే పరాచికాలు? ఆయ్ఁ !'
'అక్కడ రాజస్థాన్ రాష్ట్ర అమ్మడెవత్తో..  పన్లోకి పోకుండా పద్దాకా గంజాయ మఠంలో  పొర్లాడే మొగుణ్ని ఇంటి గుంజక్కట్టేసి మరీ కుంటి కట్టెకు పని చెప్పిందంట స్వామీ మూడ్రోజులపాటు ఒక్క మినిటైనా రెస్టివవకుండా! పెళ్లాల పోట్లు పళ్లేని మీ లాంటి మొగుళ్లంతా వెనకుండి వేయించిన దావాలో..  ఇవాళే తీర్పొచ్చింది.   ఇంటావిడైతే చాలు.. ఇంట్లోని ఎవళ్లనైనా సరే ఎప్పుడైనా అంట్లగంటె టు అప్పడాల కర్రతో  సహా ఏ వెపన్తోనైనా సరే వీపు విమానం మోత మోగించేయచ్చంట!  ఐపిసి సెక్షన్లతో సహా  కోట్ చేసి మరీ మా గొప్ప తీర్పిచ్చేసిందంట.. శ్రీ కోర్టు ధర్మాసనం!'  
'అన్యాయం! అప్పీలు కెళతాం మగాళ్లమంతా మళ్లా.. మళ్లా! పెళ్లాల గయ్యాళితనాలకి ఝడిసి  దడ కొద్దీ ఇచ్చేసిన తీర్పులు  ధర్మబద్ధమెట్లా అవుతుందో.. అదీ చూద్దాం!'
'ఓర్పు.. ఓర్పు! ఆ బండ బూతులే వద్దు! భర్తలంటే   'డార్లింగూ!.. ఓ మై డార్లింగూ.. ' అంటూ రొమాంటిక్కు టైపు ట్యూన్లేవఁన్నా పాడుకొంటేనే ముద్దు!’ ‘బంగారి.. మామ’ పాటలెప్పుడూ వినుండ లేదా బంగారం?’
'హలో! ఈ బంగారి?.. మామ?,.  ఎవర్తల్లో మధ్యలో మళ్లీ నా ప్రాణానికీ?’
'బంగాళ వేపుళ్ళు తప్ప  బంగారాలూ.. శృంగారాలూ.. ఎలా  తెలుస్తాయిలే  తిక్క స్వాములకీ! చీఁ! బంగారంలాంటి మూడు  మూడు ముక్కలయింది! మేవాడ్ కోర్టు  తీర్పు అమలు చేయాలిక .. తప్పదు’
‘ఈదీ అమీను.. సద్దాం హుసేనూ.. హిట్లరూ.. ఎట్సెట్రా.. ఎట్సెట్రా.. ఇంట్లో పెళ్లాల కన్నా డిక్టేర్లట్రా?' అనక్కడికీ  చెవినిల్లు కట్టుకొని  పోరాడు మా నక్కా వెంకట్రావు! వింటేనా? పాడు శని!’
‘ఖబడ్దార్ సర్దార్! మా వైఫులంతా శివకాశీ బ్రాండులయితే.. మీ మొగుళ్లకంతా.. ఇహ కాశీ.. రామేశ్వరాలే చివరకు గతి! పెళ్లాలు టీవీ సెట్లు. మొగుళ్ళు ఓన్లీ   రిమోట్లు. అలాగుందాలి ఇళ్ళు. కుదరదంటే ప్రతి ఇల్లూ ఓ రామగుండమే’  
‘ఇదిగో.. ఇందుకే.. మాకు మఠాలు, సత్రాల మెట్లు  తటాలుమని  గుర్తుకొచ్చేది! పక్క దేశం స్వర్గాని కన్నా మిన్నని  ఎటూ ఓ టాకుంది. కోర్టు తీర్పుల మీద మరీ అంత  భరోసా వద్దు. రొహింగ్యాల మాదిరి మా మొగుళ్లూ   సరిహద్దులు దాటే దుస్థితి కద్దు! బహుభార్యాత్వం మగాడి జీవితాన్ని మరింత పొడిగిస్తుందని ఊరిస్తున్నారు బ్రిటన్ షివెల్డ్ యూనివర్శిటీ పరిశోధకులు. తస్మాత్ జాగ్రత్త తరుణీ మణులూ!’
'తమాషానా! మరి 'నాతి చరామి' మాట సంగతేమిటి మామా? మగడు కట్టిన పసుపు తాడు  కళ్లకద్దుకుంటూతిరగితే చాలా? కుష్టు మొగుళ్లను.. భ్రష్టు మొగాళ్లని.. తట్టల్లో.. బుట్టల్లో.. రెడ్లైట్ ఏరియాల చుట్టూ తిప్పుకు రావాలా? ఆ పిచ్చి   రోజులు ముగిసి పోయాయ్!  లొట్టలొద్దు! ఈ కాలం ఇల్లాళ్లు! మరీ.. అంత మంచి గయ్యాళులమేం  కాదు! 'నా కొంప అనే   సామ్రాజ్యానికి నవ్వొక్కదానివే పట్టమహిషవ'ని అగ్నిసాక్షిగా పెళ్ళినాడిచ్చిన మాట సంగతేవిఁటిట! మీరు మెహర్బానీకే అన్నా.. ఆడాళ్లం.. పిచ్చి మొహాలం! అందుకే మీరెంత మొద్దురాచిప్పలైనా .. మాడు మీదెక్కించుకొని ఇష్టంగా  తొక్కించుకొంటున్నాం! రోజులు మారి పోయాయి మారాజా!పూర్వం మాదిరి.. పెళ్లికి ముందూ కళ్లు మూసుకొని.. పెళ్లయిన తరువాతా.. నోర్మూసుకోమంటే..నో.. వేఁ..! గృహహింస చట్టం సెక్షన్లు యాక్షన్లోకొచ్చేస్తాయ్ మిష్టర్ హబ్బీ!'
'వామ్మో! మరి.. తాను అమ్ముడు పోయి అయినా సరే దీనుడైన నాధుడి యావ తీర్చాలన్నది    సుమతీ శతకం. దాని గతి?'
'మతిలేని శతకాలు.. శృతిలేని సూక్తులు!  తలలాడించే పిచ్చితల్లులెవరూ లేరిప్పుడిక్కడ మిష్టర్ మేల్ చవనిస్ట్! ఈ కాలం ఈ- కాలం. మొగుళ్ల మెళ్లకు డోళ్లం. నో ప్రోబ్లం! మోతైనా సరే .. తిరగమోతైనా సరే.. మా  శ్రీమతుల చేతుల మీదుగానే కాపురం సాగి తీరాలి. శ్రీవార్ల ఆస్తిపస్తులు..  జీతభత్యాలు.. పింఛన్లు..  భరణాలు.. ఆభరణాలు.. అన్నింటి మీదా చట్టబద్ద్జంగా మా శ్రీమతులకే సర్వహక్కులు
'మరేఁ! 'భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ! .. షాదీ మాటే వద్దు గురూ!' అంటూ కోట శ్రీనివాసర్రావు చెవిలో కోట కట్టుకుని  మరీ పాటేసాడు మనీ సినిమాలో. శని   విననిస్తేనా! అనుభవిస్తున్నాం అమ్మళ్లూ  అందుకే ఈ బాండెడ్ లేబర్లూ! హ్హుఁ'
'ఒయాసిస్సును చూసా.. ఎడారని బెదిరేది వయస్యా? మొగుడు పుల్లిస్తారాకైతే పెళ్లాం అది ఎగరకుండా  మీదుండే బండరాయన్నాడు వెనకటికో కవి.   సావిత్రి పక్కనుండబట్టే సత్యవంతుడికా బోడి ప్రాణాలు తిరిగి  దక్కింది. సీతమ్మతల్లి తోడుండబట్టే రామయ్యతండ్రి వనవాసం హనీమూనును  మించి రక్తి కట్టింది!  పెళ్లాలంతా కళ్లాలే అయితే   వేలాది మందిని వెంటేసుకొని తిరిగిన వేణు గోపాలుడు సంగతేవిఁటి   వెర్రిబాలకా? ముక్కు మూసుక్కూర్చున్న  మునిముచ్చుకే   మేనకమ్మ మేని గాలి తగలంగానే  కళ్లు చెదిరాయి! ఆడపొడంటే గిట్టని   రుష్యశృంగుడు శాంతమ్మ సిస్టర్తో  సంసారమెంత ప్రశాంతంగా గడిపాడో  తెలిసీ..
'షటప్పూ..  నీ అష్టాదశ పురాణాలిక స్టాపూ! షట్కర్మచారిణి.. సహధర్మచారిణి..  అంటారు కదా తాళికట్టిన ఆడదాన్ని! ఖర్మకాకపోతే అందులో  ఏ ఒక్క గుణమైనా..'
'.. నేటి మా మహిళకు లేదంటావు! మనువాడిన ఆడది మగాడికి దాసి.. మంత్రి.. లక్ష్మి.. భూమి.. తల్లి.. రంభా!  ఓ కే.. మ్యాన్! ఒప్పుకున్నాం! ఊడిగాలు చేయడానికి మేం రడీనే! కాకుంటే ఒకటే డీల్!  ముందు మీ మగాళ్ళూ  మినిమమ్  ఓ  రాముడి పాత్రల్లో అయినా బుద్ధిగా జీవించండి బాబులూ! 'వై ఫై' ఓ సెకను లేకపోతేనే కలియుగాంతం వచ్చేసినట్లు  కంగారు పడతారే మగాళ్లు!. ఇంటి కనెక్షన్ కదా 'వైఫ్' అంటే! రోజులో ఒక్క నిమిషమైనా నవ్వుతూ కనిపించే ఛాన్సు ఎందుకివ్వరు మగాళ్లు?’
'వివాహ సంబంధాల్నుంచీ.. విడాకులు.. పిల్లల పెంపకాల వరకు.. చట్టాలన్నీ మీ ఆడాళ్లకే కదా చుట్టాలు తల్లీ! భార్యా బాధితుల గుండెలు బాదుకొంటున్నారు.  ఐ.పి.సి.సెక్షను 498(ఎ) భర్తల స్వేఛ్చా స్వాతంత్ర్యాలకు పూర్తిగా విరుద్ధమని మొత్తుకొంటున్నారు. వినపట్టం లేదా ‘భా.బా’ల పళ్ల పట పటలు'?
‘ఇల్లొక రొమాంటిక్ జిమ్. శృంగార వ్యాయామశాల. మొగుడూ పెళ్లాలు అందులో ఒహళ్ల కొహళ్లు  'కోచ్' లు. ఒకరి పట్టులు మరొకరికి నేర్పాలి. పట్టువిడుపులుంటేనే సంసారమనే  కుస్తీ  చక్కగా సాగేది. కన్నవాళ్లందర్నీ కాదనుకొని.. కట్టుకొన్నవాడే సర్వస్వమనుకొని.. గడప దాటి   కొత్త లోకంలోకి అడుగు పెడుతుంది ఆడది. తాళి  కట్టించుకున్న ఒప్పందానికి కట్టుబడి భర్తకు వారసలని కని మరో వంశాన్ని రక్త మాంసాలొడ్చి నిలబెడుతుంది. రోజులో సగం సమయం నిద్రకనే  ఉన్నా.. ఆ నిద్ర మగతలో సైతం  మొగుడో..  పిల్లలో అంటూ  కలవరించే   పిచ్చిది ఆడది. గీజరు ఓ రెండు నిమిషాలపాటు ఎక్కువగా వాడుకుందని గొడ్డులా బాది చంపేసిన మొగుళ్లు  మొనగాళ్లుగా బోర విరుచుకొని మరీ ఆంబోతుల్లా బైట తిరుగుతున్న కాలమండీ ఇది ! మేవాడ్ మెజిస్ట్రేట్ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మీదా మళ్లీ మళ్లీ అప్పీలుకు వెళదామనే..’
'హలో! సత్యభామాజీ! ఇహ దించేస్తే మంచిది తవఁరు కత్తి! ఈ ప్రేమ భక్తుడు లొంగిపోతున్నాడు!  అందుకుంటారా  ఇహనైనా ఈ పూల గుత్తి!
***
-కర్లపాలెం హనుమంతరావు
8142283676
(సుత్తి.. మెత్తంగా- ఆంధ్రప్రభ కాలమ్- 11, నవంబర్, 2017)
 ***

Friday, November 3, 2017

‘నో’బెల్స్- ఆంధ్రప్రభలో సరదా వ్యాసం



'నోబెలు.. నోబెలు అంటా తెగ వాగుతున్నారీ  మధ్య దొరబాబులంతా!  ఆ బెల్లేంటన్నా?’
 'ఆ వివరాలన్నీ  ఏకరువు పెట్టాలంటే ఓ లోటాడు టీనో, ఓవల్టీనో తాగి రావాలి!  మూడే ముక్కల్లో ముక్కాలంటే.. ఇంత దాకా  ఎవరికీ తట్టని కొత్త వింతో.. విశేషమో  బైటపెట్టిన బుద్ధిమంతుణ్ని వెతికి పట్టుకొని  'చబాష్!' అంటూ జబ్బ మీదో చరుపు చరిచి మెళ్లో ఓ బిళ్లేయుడన్న మాట!'
'భలే! అట్లయితే ఆ నోబెలు బిళ్లలన్నీ మనోళ్ల మెళ్లలోనే కదా  ఏళ్లాడెయ్యాలా!  వింతలూ విశేషాలూ కనిపెట్టుళ్లో మనోళ్లకి  మించిన మోపుగాళ్లు పెపంచికం మొత్తంలో ఎవురున్నార్లే.. ఏడేడ ఎతుక్కొచ్చుకున్నా!’
'ఆహాఁ! అంతగా మన బాబులంతా  కనిపెట్టేసిన   ఆ  వింతలూ విశేషాలూ ఏంటో?'
'అన్నీ తెల్సిన పెద్ద బుర్రకాయవి.. ఆ ఎద్దేవాలే ఒద్దన్నా! దేశభక్తి  దెబ్బతింటది. అర్దసున్నా అన్నా ఎవుళ్లకీ ఓ పట్టాన అర్థం కాని  మొరట్రోజుల్లో నిండు గుండు సున్నా కనిపెట్టిందెవళ్ళంట? కన్నాలేయుడు, సున్నం పెట్టుడంటే..  సన్నాసోళ్లు చేసే బేవార్సు పన్లంటవు.. తెల్సును.  కానీ కన్నమేయుడు కూడా ఓ  కళే కదన్నా!  అదేందో ‘మట్టి బండి’ నాటకంలో దొంగాడెవుడో మొట్టమొదటి సారి మహా సుందరంగా గోడక్కన్నం కొట్టి మరీ లోపలికి జొరబడ్డడంట గదా!  ఆడి మెడకేసెయ్యెచ్చు కదన్నా ఈ నోబెల్లు బిళ్లోటి తెచ్చి? సుదర్శన     చక్రం కనిపెట్టుడే కాదు.. దాన్నడ్డమేసుకొని ఎట్లాంటి కథలను ఎట్లా నడిపించినాడో మన  కన్నయ్య  మహాభారతంల!  దేవుడు కదా! మరా మహానుభావుడి మెళ్లో   ఆ నోబెల్లు బిళ్లేసినా.. పురుషార్థం ప్లస్ పున్నెం కూడా దక్కుదలవుతుంది కదా అన్నా!  రామాయణంల విమానాలు?  పిట్టలకే సరిగ్గా రెక్కలు  మొలవని  కాలంలో మన కాడ మంధర గిరి పర్వతాలు గాల్లో గిరగిరా గింగిరాలు  తిరిగాయంట కదా! ఎడతెరిపి లేకుండా రోజుల్తరబడి  ఎడాపెడా ఝడివానలు కుర్సి దడ పుట్టించినా  గోవిందుడు ఆ గోవర్ధనం కొండను   అమాంతం గోటి మీదెత్తుకొని గొడుగులా నిలబెట్టిండు కదా!  గొడుగంటే    ముసుగు  దెయ్యమని గడగడలాడి చచ్చినాడు సీమ తెల్లోడు! ఆడికి పడాలా.. మరి మనోడి మెడకి పడాలా  నోబిలు బిళ్ల? తెల్లోడికి అక్షరం ముక్కంటే ఏంటో తెలీని కాలంల   మన భాగోతం  రుక్మిణమ్మ కృష్ణ పర్మాత్ముడికి ప్రేమ లేఖ  పంపించింది.. పరమ డేరింగా రుక్మిణీ దేవిది! తాటాకు బద్దతో  నాలిగ్గీసుడు  కూడా తెల్లోడి పరమ నామర్దానా! అవాకులూ చవాకులంటూ ఎవరేం పేలితే నేమిటికిలే!  అసలు రాసే కళంటూ ఓటి  తాటాకుల మీద పుట్టించిందెవుళ్లు?మనమే కదన్నా!  చీకట్లో కళ్లు కానరాక ఆఫ్రికను బండోళ్లు  కొండ తొర్రల్లో వళ్ళు దాచుకొన్న వేళ   మనోళ్ళు అలికిణ్ని బట్టి మెకాల ఎంటబడి మరీ ములుకులేసారు ఎడారోళ్లు  బట్టలు కట్టుకోడం కూడా రాక మొరటుగా తిరుగే రోజుల్ల మన దేవుళ్లు పట్టు పీతాంబరాలు, బనారస్, బద్వాల్ చీరలు.. మేచింగు బ్లౌజుల్లో కళ్లు మిరిమిట్లు గొలిపేటట్లు ఊర్లూ వాడలూ  ఊరేగినారు. ఎన్ని వింతలూ.. విశేషాలూ! అన్నీమన  వేదాల్లోనే ఉన్నాయషంటే  మళ్లీ తొండంటన్నారు ఆ పడమటి వెధవాయిలు! వెదికే ఓపిక లేకో..  ఓర్చుకొనే  గుణం  లేకో   మనల్ని వెర్రి పప్పల కింద జమ కట్టేసి ఈ నోబెల్లులు గట్రాలన్నింటికీ  ఆమడ దూరంలో అట్టే పెట్టేసే కుట్రేదో గట్టిగా నడుస్తుండాదని నా డౌటన్నా!’
'ఊహపోహల్నన్నింటినీ  ఊరికే పోగేసి   'ఊహూఁ! మన కొక్కటైనా నోబెల్ గిట్టుబాటవడం లేదం’టూ రట్టు  చేస్తున్నావ్ తమ్మీ!  నీ కతలు నీకు ముద్దేమో కానీ ఆ తాతల్నాటి స్టోరీలేవీఁ  వాళ్లకొద్దు! నీకై నువ్వుగా సొంతంగా.. తాజాగా  కనిపెట్టిన నిజమైన  వింతో.. విశేషమో ఏవఁన్నా ఉంటే.. గింటే.. బైట పెట్టబ్బీ!  బట్టబుర్రకు   జుట్టు  మొలిచిందనే కట్టు కతలు కుదరవు! తర్కంతో రుజువు కావాల. మన  సి.వి. రామన్ సర్ కి గణితంలో నోబెల్ వచ్చింది చూడు అట్లాగా?’
'అరేఁ! భలే గుర్తు చేసినావన్నా! అదే అరవదేశంలో మరో రామరయ్యరు కూడా.. నా సామి రంగా..  ఆకు పసర్నుండి గేసునూనె పిండాడన్నా! దుబాయ్.. అరబ్బు దేశాల ఎదాన బోలెడంత డబ్బు పోసి కొంటున్నాం కదా గబ్బు సరుకు! ఆ దుబారా తగ్గించే కొత్త ఐడియా  చేసిండు కదా! మరందుకైనా  ‘చబాష’ ని భుజం తట్టి ఓ నోబెల్ బిళ్ళ ఆ అయ్యరాయన మెళ్లో వేసెయ్యచ్చు కదా?  అట్లాంటి గోసాయి చిట్కాలు మరన్ని పుట్టుడుకి ఆస్కారమొచ్చుండెడిది!   నిధుల కొరతో అంటా అల్లాడతా అట్టా దేశాలట్టుకు తెగ తిరుగుతన్నాం కదా మనం! ఆ గండం నుండి గట్టెక్కించుడికి ఓ సన్యాసి.. ఆ మధ్య..  పాపం కష్టపడి కల గన్నాడు. లంకెబిందెల  జాడ ఎక్కడుందో  బైటపెట్టిండు. అయినా  ఏం చేసినం? సర్కారు సొమ్ముతో గోతులు సగం తవ్వినాక.. అందరూ నవ్వుతున్నరని ఆనక మరి కాస్త సొమ్ముతో పూడ్చేసినాం!  పెపంచకం మొత్తం ముందు అల్లరి పాలయ్ పొయ్యినామా లేదా! ఆర్థిక తత్వవేత్త.. ఆ సారు ఎవరూ.. ఆట్టే నోరు తిరిగి చావదు నాకు..  ఈ పెద్ద పెద్దోళ్ల పేర్లు.. ‘   
‘డాక్టర్ అమర్త్య సేన్ ‘
‘ఆఁ.. ఆఁ.. ఆ మర్త్యంసారు కిచ్చిన నోబిళ్ల బిళ్లే మరి మన లంకెబిందెల సన్నాసి కీ ఇచ్చుండచ్చుగా?’
‘ఆపరా బాబూ నీ ఊక దంపుళ్లు! కొత్తగా కనిపెట్టుడంటే.. ఎప్పటెప్పటి సొల్లు కతలో వప్ప చెప్పుడు కాదు!  ఆడ బడితల మొండాలకి తుఛ్చులు అప్ప చెల్లెళ్ల తలలు మార్చుతున్నరు! ఆపరేషన్ మిషతో పరేషాన్ చేసి  పేషెంటు కిడ్నీలు  చాటుగా అమ్మేసుకొంటున్నరు. అట్లాంటి దిక్కుమాలిన పన్లక్కాదబ్బీ నోబెళ్లు  ఇచ్చుడు?  పేదోడికి చవగ్గా చక్కటి  చదువు చెప్పించు! మంచి మంచి కొలువులు సర్కార్లవి ఇప్పించు! ఎప్పుడో ఏకలవ్యుడు వేలు కోసిచ్చిన పాత కహానీ లిప్పుటి నోబెళ్లకు పనికి రావబ్బీ! న్యూసెన్సు  కతలు  కాదు.. న్యూ సైన్సు స్టోరీలేమైనా నీ కాడ ఉంటే    షార్ట్ లెన్తులో వినిపించు. మెరికలు అమెరికాలోనే కాదు. మన కాడా ఉన్నారని  నిరూపించు! నిధులు రాబట్టుకొనేటందుకు.. సేద్యం, వైద్యం, విద్యలాంటి ప్రధాన సామాజికి రంగాలు సజావుగా నడిచుకునేటందుకు.. మద్యం అమ్మకాల మీదే  నిండా ఆధారపడ్డంతో మనది వట్టి  గాన్ కేసని తెలిపోయిందబ్బీ  ప్రపంచ దేశాలల్ల? అయినా మన ప్రతిభ నొహళ్లు చూసి బెల్లు కొట్టేదేందిలే?  మెచ్చి బోబెల్ బిళ్లల్తెచ్చి మెళ్లో వేసేదేందిలే?’
'ఔనన్నా1  ఆ నోబెళ్ళూ బిళ్లలిచ్చే బాబులు ఎలుకల్ని పట్టి వాటి మీద ప్రయోగాలు చేసున్నరు. మనమో? ఆ ఎలుకల్నే మౌసుల కింద మార్చేసి ప్రపంచం మొత్తం నివ్వెర పడేట్లు సాఫ్టువేర్లు పుట్టిస్తున్నం. మన కాడ కాకులక్కూడా  లెక్కలు నేర్పించేయగల కాకల్తీరిన సర్కారు నౌఖర్లు మస్తుగున్నరు. బల్ల కిందుగా  పింకు  గాంధీ బొమ్మలో  కట్టగా కనిపించకుంటే..  ఎంత బుల్లెట్ రైలు దస్త్రాన్నైనా నత్తకన్నా కుంటిగా  నడిపించగల గడుసులున్నరు. ‘కనిపెట్టుడు’ ఏ బుర్ర తక్కువ ఎదవైనా చేసే కార్యమే!. 'కనికట్టు చేయడు’లోనే  అసలైన బుధ్ధి దాగుందన్నా! ఆ గుట్టుమట్లన్నీ మన దేశంల గుట్టకీ పుట్టక్కూడా తెల్సును! అది గుర్తించకుండా ఎన్ని నోబెల్లు బిళ్లలు ఎంతమంది  సైన్సోళ్లకి, సాహిత్యాలోళ్ళకి, సంగీతాలు వాయించుకొనేటోళ్లకి, శాంతి మార్గాల వెదికి పెట్టేటోళ్లకిచ్చినా ,, నో యూజ్! ఎవళ్లూ మన మెళ్లకి ఆ నోబెల్లు బిళ్లలెయ్యక పోతేనేంటంట? మన బిళ్లలు మనమే మన మెళ్లకు ఏసేసుకుంటే పోలా!  మన బెల్లులు మనమే ఘల్లు ఘల్లుమని  మోగించేసుకొంటే దూల తీరలా!’
‘అదీ దెబ్బరా అబ్బీ! సెల్ఫ్ డబ్బా కొట్టింగులో  ప్రపంచకం మొత్తంలో మనల్ని మించిన మోపుల్లేరు.. ఇహ ముందూ పుట్టబోరు. అలాగని  మన బెల్లు మనమే కొట్టుకుంటుంటే చాలబ్బీ.. అదే వెయ్యి నోబెళ్లు మెళ్లో వేళ్ళాడే పెట్టు!
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ- దినపత్రిక- సుత్తి.. మెత్తంగా.. కాలమ్-04-11-2017)

***

Sunday, October 29, 2017

అల్లుడు గారి గిల్లుడు కహాని- ఆంధ్ర ప్రభ 'సుత్తి.. మెత్తంగా' కాలమ్


ద్రుపదుణ్ని చూస్తే జాలేస్తుంది!  కూతురు ఒహటే. అయినా ఐదు దశమ గ్రహాలు! మామల కోణం కదా! అందుకే మరి అల్లుళ్ల మీదీ వ్యంగ్య బాణాలు!
గిల్లకుండా చల్లకుండలా అత్తారింట ఓ మొత్తన  మెత్తంగా పడుంటే అల్లుడెలా అలుగర్ర అవుతాడయ్యా?  ముల్లుకర్ర ఆచారం తు.. చ తప్పకుండా పాటింస్తున్నందుకేనా   దేవుళ్ళలాంటి  అల్లుళ్ల మీదిన్ని  'థూఁ' లు.. ఛాఁ'లు!
అక్షింతలేసే వరకు ఎస్వీఆరంత గాంభీర్యం. అలక పాన్పు దగ్గర మాత్రం గుండెపోటొచ్చి దగ్గే  గుమ్మడి వ్యవహారం!  ఆడపిల్లంటేనే నట్టింటి సిరి మా లచ్చిమి కదా! ఆ సిరికే.. ఇంకొంచెం కొసరుగా ..ఒహటో.. రెండో .. రెండు  పంటల భూములు! ఆచారం తప్పలేకేగా అల్లుళ్లలా అదనపు కట్నాలకు  వేధించడం? ఆ మాత్రానికే వరకట్నం వంకతో అల్లుళ్లనలా వేదించేయడవేఁ?  
వరుడూ సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడేగా? ఆ హరి హారతి పళ్లెంలో చిల్లర కిందో  చెవర్లెస్ కారోటి కానుగ్గా పారేస్తే మాంగారి సొమ్మేమైనా తరుక్కు పోతుందా? ఆకస్మిక  దాడులప్పుడు అల్లుళ్ల మీదకు మల్లే ఐ. టి, ఇ.డి ల మీదలా  దుమ్మెత్తి పోసే దమ్ముందా మాంగార్లూ?
సన్-ఇన్-లాస్ అంటే సన్నాసులేం కాదు. అగాధంలాంటి సంసారంలోకి  దూకి ఈదే  దుస్సాహసులు.  ఉరికంబం ఎక్కే ముందు నరహంతుకుడైనా సరే..  ఆఖరి కోరిగ్గా సన్నీ లియోస్ ని  చూడాలనుకొంటాడా లేదా! ఆ అవుట్-లాస్ కన్నా సన్-ఇన్-లాస్ ఎందులోనయ్యా లోకానికి లోకువా? 
విలువైన స్వేఛ్చా స్వాతంత్ర్యాలను సైతం ఫణంగా పెట్టాడన్న సింపతీ లేదు.. దాం దుంప తెగ! తృణంగానో ఫణంగానో అల్లుడి టేస్టుకు తగ్గట్లో  లేటెస్టు  సెల్లో.. బైకో..  కొనివ్వాలా వద్దా? అడగందే పెట్టంది  'మామ్' మాత్రమే! పిల్లనిచ్చిన మాంగారు అడక్కుండానే  అడుగులకు మడుగులొత్తాలి నిజానికి! సనిన్లా ఏవఁన్నా సన్నాఫ్ కుబేరుడా స్వామీ?  మాంగార్ని కాకుంటే మాల్యాగార్నా కట్నంకోసం   వేధించేది?
పిల్లకు వచ్చే సంబంధమేమో సంపూర్ణేష్ బాబులా ఛస్తే ఉండకూడదు! బుద్ధిలో బిల్స్ గేట్సు, నడతలో సత్య  నాదెళ్ల, ఆస్తుల్లో అంబానీ, జాబుల్లో సుందర్ పిచాయ్! ఊహలకేమీ ఊహూఁ  ఆకాశం కూడా అడ్డు రాకూడదు   కానీ.. ఆ తాహతుకు తగ్గట్లు తూగమంటే మాత్రం  కాణీ బోణీ కాని చింతపండు కొట్టోడి దివాలా పోజు!
కాళ్లు కడిగే ముహూర్తం ఖాయమైన్నాడే కన్నీళ్లు కార్చే శక్తి  కూడగట్టుకోవాలి! అల్లుడంటే  పిల్లతండ్రికి పుస్తె కట్టని మొగుడండీ! పిలదానికి  అప్పగింతలు పెట్టినప్పుడే  మాంగారి  కప్పం కథలు మొదలయినట్లు!
కాశీయాత్రకని బైల్దేరిన సన్నాసిని.. పిల్లనిస్తామని  బెల్లించి మరీ పిటల మీద  కుదేస్తిరి! పాంకోళ్లో పక్కన పారేసినందుకైనా ఓ కోళ్ళ ఫారం  ఓపెన్ చేయించాలి కదా! గొడుగో మూల  గిరాటేసినందుకైతే గిరాకీ తగ్గని రాజధాని ప్లాటోటి రాసివ్వాలి! నానో  బుల్లి కారడిగినా సరే  'నోఁ.. నోఁ' అంటేనే  అల్లుళ్లంతా  మాంగార్లమీదంతలా ఫైరయ్యేది!
పెళ్లంటేనే ముద్దూ ముచ్చట్లట! మంచి మాట. అల్లుళ్లది ముద్దూ.. మామలది  ముచ్చెమట్ల  ముచ్చట! ఇహ అల్లుళ్ల 'నాతి చరామి' అంటారా? హామీ  నిజమే.. కానీ స్వామీ! మాంగార్లిచ్చే  మాగాణీ భూముల మీదొచ్చే రాబడి   బట్టే ఆ మాటలకుండే చెల్లుబడి!
కల్లాకపటమేం లేకుండా పిల్ల మాడునింత  జీలకర్ర, బెల్లముక్క అద్ది  చల్లంగా ఇంటికి తోలుకెళ్తే.. మామ చేతిలో ఆడే తోలుబొమ్మంటుందయ్యా అల్లుణ్ని పోసుకోలు  లోకం. మాంగారి పరువు నిలపడం కోసమే బాబూ.. మాంగారి పరువు తీసే  కోరికలు  పెద్ద మనసుతో  కోరుకోడం అసలైన పెద్దమనుషులు!
వరకట్న నిషేధమనే మిషన్తో కంగారు పెట్టయకండయ్యా బాబూ పాపం  ఆ పెద్దమనుషుల్ని! భూమి గుండ్రంగా ఉండదన్నా 'ఊఁ' కొట్టేసి ముందర్జంటుగా  ఓ సంఘం పెట్టేసే తుగ్లక్కులు తుక్కు తుక్కుగా ఉన్న భూమి  ఈ  దేశం! వరకట్న నిషేధ బాధితులు అనే హ్యాష్  ట్యాగ్ పెట్టేసి ఓ ట్వట్టర్ ఎక్కౌంటు గానీ ఓపెన్ చేసేస్తే గంటలో ఆ రాహుల్ బాబు రికార్డు బద్దలయ్యే రీ ట్వీటుల వచ్చి పడిపోతాయ్!
పెట్రోలు ఉత్పత్తులకు మల్లే వరకట్నం సొమ్ముమీదా జి ఎస్ టీ వద్దు! అదనపు కట్న కానుకల మీద అదనపు సేవా పన్నులు గట్రా తక్షణమే రద్దు. మనీ, ల్యాండు.. గట్రా ఏదైనా మామల నుంచి  లాఘవంగా  రాబట్టుకొన్న సొమ్ము.. మనీ ల్యాండరింగు యాక్టు నుంచి మినహాయింపు! చిటికెడు ఓపికా.. టైమూ తగలడాలే కానీ సర్కార్లను ఇరుకున పెట్టేసే చిటుకులు తట్టలు తట్టలు పుట్టించెయ్యచ్చు! తస్మాత్ జాగ్రత్త  పిల్లనిచ్చిన మాంగార్లూ.. అల్లుళ్లెన్నుకున్న సర్కార్లూ! కొరియా'కిమ్' అయినా తయారు చెయ్యలేని అణుబాంబు బాబూ అల్లుడుబాబు!
ఏ జన్మలో చేసిన పాపమో.. ఈ జన్మలో ఆడపిల్లలకు 'పాపా'లుగా పుట్టడం! మామల ఆజన్మ జరా దుఃఖ పాతకాదులన్నీ పూరా పరిహరించే హరిమూర్తి అవతారులయ్యా శ్రీ అల్లుళ్ళు! గుళ్లు కట్టించుడు.. మొక్కుడు ఎలాగూ లేదు! నిలువు దోపిడీలయినా ఇచ్చుకోండయ్యా.. చాలు!  కేవలం    లవ్వుల్తోనే పిల్లల కాపురాలు ఎల్లకాలం నిలవ్వు!
వరకట్నం ఆడబిడ్డల్ని కన్న వారికి భగవంతుడిచ్చిన గొప్ప వరం! పరిశోధనలు చేసి మరీ పాఠ్యాంశాల్లో చేర్చిందయ్యా ఈ మధ్యన  మన బెంగుళూరు సెయింట్ జోసెఫ్ కళాశాల సామాజిక శాస్త్ర విభాగం! నమ్మకుంటే ఆ నోట్సు జిరాక్సు కాపీ లొకసారి  తెప్పించుకొని చదువుకోవాలి ఆడబిడ్డల్ని కన్న    అదృష్టవంతులంతా!
అందంగా లేని ఆడపిల్లకు తొందరగా పెళ్లిళ్లయే గోసాయి చిటుకు. బిడ్డ భారీగా ఉన్నా లారీడు సొమ్ము డౌరీగా పోస్తే చాలు.. పుస్తె కట్టే  వస్తాదులు వరసలో నిలబడతారు మెగాస్టార్ బ్లాక్ బస్టర్ ఫస్టాటాడే హాలు బైటకు మించి!  కట్న కానుకలు వంకతో ఏ అడ్డగాడిద కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నా మన ఆడపిల్లకు అత్తారింట్లో  అదానీ కోడలు హోదా ప్లస్ జడ్ ప్లస్ సెక్యూర్టీ! మన బిడ్డకు మనమే స్వయం పోషక శక్తి  ఇంచక్కా కల్పించేసుకొనే యుక్తి. 
బ్రీఫ్ కేసుల్తో తప్ప  పోలీసు కేసుల్తో ఏ సన్నిన్లా కేసులూ  చరిత్రలో సాల్వయింది లేదిప్పటి వరకు.  దామాద్ అంటే అత్తారింటి  దావూద్  ఇబ్రహీం! అయితేనేం? కోరినంత కట్నం కోరినప్పుడు  విసిరి పారేస్తుంటే అతగాడే అమ్మాయి పాలిట రాం అండ్  రహీం! అన్నీ సుమతీ శతకం నూరి పొయ్యదు!
'డౌరీ.. డౌన్! డౌన్!' ఊబిలో దిగి పోవద్దు.  ఏ ఇండియన్ పీనల్ కోడూ పిల్లనిచ్చిన మాంగార్ల గోడును తీర్చింది లేదు! కట్నమెప్పటికీ భూతం కానే   కాదు. అమ్మాయి బంగారు భవిష్యత్తుకు అదే పెద్ద ఊతం. ఉన్నంతలో ఇచ్చుకోడం పాతకాలం ఉదారం.  ఉన్నదంతా ఊడ్చి  అచ్చుకోడం కొత్త  వరకట్నపు ఆచారం.
కార్పొరేటు యుగం! ప్రద్దానికీ ఓ రేటుండటం సహజం. అమూల్యమైన ఓటే ఎన్నికల టైంలో ఎన్నో రెట్లు ధర పెరుగుతుంది కదా!
దేవుళ్ళు కాబట్టి అల్లుళ్ల ఆరళ్లు  ముందే తెల్సుట. హడలి  అందుకే ఆ హరి హరులు సైతం అసలు  ఆడబిడ్డలకే కన్నతండ్రులు కాలేదుట! సెట్ రైటు చేసుకోడం  రాని  బుద్ధూలే.. దేవుళ్లలాంటి  అల్లుళ్ల మీద అన్నేసి సెటైర్లు అన్యాయంగా వేసేది!
పురిట్లోనో.. పుట్టక ముందో ఆడబిడ్డల్ని చంపే ఆ దురాగతాలు మనకొద్దు. మనిషి మనుగడ ఆడబిడ్డల భ్రూణ హత్యలు మీన్స్  వరకట్న పరిరక్షణకు దాపురించే తీరని నష్టం! ఉద్యోగాలు.. ఉపాధులు ఆట్టే దొరకని కరువు కాలం. వరకట్నాలు, అదనపు కట్న కానుకలేగా నిరుద్యోగ యువకులకు  ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధరువులు.
అల్లుళ్లంటే వట్టి  'వెధవ'లంటూ తలంటే  మాంగార్లనలాగే పెరగనీయి భగవాన్! పెద్దల తిట్టు దీవెన పెట్టు.  'వె.ధ.వ' అంటే వెయ్యేళ్ళు ధనంతో వర్ధిల్లమని  కదా అంతరార్థం? అంతకు మించిన గొప్ప వరమూ ప్రస్తుతానికి మరేముంటుంది అస్తమానం మాంగార్లను గిల్లుకుంటూ బతుగ్గడిపే అల్లుళ్లందరికీ!
-కర్లపాలెం హనుమంతరావు
***
(ఆంధ్రప్రభ 28-10-2017 నాటి 'సుత్తి.. మెత్తంగా' కాలమ్ లో ప్రచురితం)



Friday, October 20, 2017

‘బండ’ చదువులు- ఆంధ్రప్రభ- సరదా కాలమ్- సుత్తి.. మెత్తంగా


చంద్రన్నో.. కే సీ ఆరన్నో.. కేకేసి మరీ కానుకలు కుక్కేసి  పండగ పండక్కీ పంచేసే సంచీలు అంటే పబ్లిక్కి ఎప్పుడూ  మా లావు కిక్కే. బళ్లకెళ్లే పిల్ల బుడంకాయలకే  బ్యాగులంటే  భుజాలమీద ఏళ్లాడే బేతాళుల్ల లెక్క! ఒక్కో బుక్కులబ్యాగు పది గాడిదలు  కల్సి ముక్కి మూలిగినా  లాగలేనంత  తుక్కు బరువని ఒకటి. సమాధానం తెల్సి చెప్పినా.. తెలీక గమ్మునున్నా తల వెయ్యి వక్కలయ్యే భూతాల యవ్వారమని.. ఇంకోటి! అన్నీ పితలాటకాలే!
బ్రహ్మదేవయ్యకు బద్ధకం బలిసిందో.. చదువులమ్మకే చతుర్లెక్కువయ్యాయో? తెలుగు రాష్ట్రాలు రెండింటిలో బడి బుడతలిప్పుడు స్కూలుబుక్కు బ్యాగుల్ని చూస్తే చాలు..  గబుక్కుమని జడుసుకుని జొరాలు  తెచ్చేసుకుంటున్నరు!
తొమ్మిది, పది తరగతుల  సంచీల బరువు ఆరు కిలోలకి మించి  ఉండద్దన్నది కదా సర్కారు సార్ల హుకూం! అయినా లిఫ్టు లేకుండా మూడో అంతస్తు తరగతి కొండకు  రోజూ మాదిరి గేసుబండ బరువుండే పుస్తకాల సంచి మోసుకుంటూ ఎదురు దేకలేక .. పాపం.. ఓ లేత  ప్రాణానికి నిండా నూరేళ్లు నిండినాయంట!
అడ్డమైనోళ్ల మైల కుప్పలు.. రెండు పూటలా రేవులకీ మోసే ఓపిక లేక ‘ఓఁ..ఓఁ..’అంటా ఓండ్ర పెట్టే   అడ్డగాడిద లిప్పుడు.. పేరు గొప్ప ప్రయివేటు బళ్ల పిల్లకాయల రొప్పులు వినీ వినీ  కన్నీళ్లు  తెగ కార్చేస్తున్నయి! అడ్డగాడిదలుగానైనా పుట్టుడుకు రడీనే! బాబ్బాబూ.. ఆ తెలుగు రాష్ట్రాల్ల బడిపిల్లకాయలకు మల్లే మాత్రం పుట్టించి మమ్మల్ని శిక్షించకండి మహాప్రభో!’ అంటా  సృష్టికర్త కాళ్లా వేళ్లా పడి తలలు మోదుకుంటున్నాయంట.. బ్రహ్మలోకం  టాకు!
సత్యకాలం కాబట్టి హిరణ్యాక్షుడు భూగోళం మొత్తాన్ని చాపలా చంకలో చుట్టేసి చులాగ్గా తారుకున్నాడు. ఈ కలికాలంలో ఆ ఘనకార్యం రిపీట్ చేసి చూపించమనండి! బుడ్డ వామనుడు తొక్కేసిన బలిదేవుడికి మల్లే పాతాళం అడుక్కి  అణిగి పోవుడు ఖాయం!
పేటకో కార్పొ’రేటు’ బడి. బడికో పాతిక తరగతులు. తరగతికో వంద బెంచీలు. బెంచీకో పదిమంది మందమతులు. మతులెంత మందంగా ఉంటేనేమి స్వామీ.. వీపున మోసే పుస్తకాలు మాత్రం వందకు ఒక్కటి తగ్గినా డొక్కచీరుడు ఖాయం. చూసి రాసే బుక్కయినా సరే.. వీశకు వీసమెత్తు  తక్కువ తూగినా..  మోసే బిడ్డడి   వీపు మీద విమానం మోత మోగుడు ఖాయం! ‘మోత’ మోగుళ్ళుంటేనే చదువులు మోతెక్కేలా సాగుతున్నట్లు కన్నవారిక్కూడా అదో దిక్కుమాలిన లెక్కయిపోయిందిప్పుడు.. పిల్లకాయల ఖర్మ!
 డబ్బు బళ్లు, ఉబ్బు బుక్కులూ ఉనికిలో లేవు కాబట్టే ఆదికాలంలో ఆ అట్లాసు రాక్షసుడు ఎట్లాగో ముక్కుతూ మూలుగుతూ  భూగోళాన్ని మోయగలిగాడు! అదే ఈ కలికాలంలో? గోళం మొత్తం అఖ్కర్లే! మొదటి గ్రేడు బుడతడి బేక్-బ్యాగు ఎత్తి వీప్మీద పెట్టుకు నడ్డిమీద స్టడీగా నిలబడమనండి! చడ్డి  తడుపుకోకపోతే .. నేరుగా ఒలంపిక్సు  వెయిట్ లిఫ్టింగుకి పంపేసెయ్యచ్చు! వేరే శిక్షణెందుకు? మనీ వేస్టు!
వేదాలు ఏవో నాలుగు కవిల కట్టలు కాబట్టి.. నీట్లో బుడుంగున పడ్డా.. ముట్టెతో ఎత్తి వరాహావతారం పరువు నిలిపాడు హరి నారాయణుడు.  అదే ఇప్పటి ఏ ప్రీ-ఎల్కేజీ పిలగాడి పుస్తకాల సంచీ అయితేనో?    పది కాదు మాష్టారూ.. మరో పది అవతారాలెత్తినా  బ్యాగోద్ధరణ ఆ భగవంతుడి శక్తి సామర్థ్యాలకి మించిన   పెద్ద అగ్నిపరీక్షయుండేది నిశ్చయంగా!  
అప్పట్లా అష్టాంగ పంచాంగాలు.. అష్టాదశ పురాణాలా అత్యంత  సునాయాసంగా అవపోసన పట్టేసేందుకు లేదు.  ఇప్పటి ఫస్టు గ్రేడు సైన్సు గైడైనా చూడండి.. మంచుకొండను మించి బరువుంటుంది!   రావణాసురుడికి.. పాపం.. ఏ ప్రయివేటు బడి  పుస్తకాలూ మోసే అలవాటు లేదు. కాబట్టే సీతా స్వయంవరంలో ఆ పాత పడ్డ శివధనుస్సును సైతం రెండు చేతులు వాడినా ఇంచైనా  కదల్చ లేక  కుదేలయిండు. నిండా పదహారేళ్లయినా పండని  పసి బాలుడు రాముడు. అయితేనేమి? ఆ సామి  భారీ శివధనస్సును ఎలా అంత చులాగ్గా ఎత్తి  పుసుక్కని ఇలా నడిమికి విరిచేసాడంటారూ? బాల రాముడిది విశ్వామిత్రుడి కార్పొరేట్  స్కూలింగు మరి! 
సాందీపని బడిచదువులకూ భారీ బరువుబ్యాగుల్తోనే పని! కాబట్టే గోవర్థన గిరినంత సులభంగా కొనగోటి పైన నిలబెట్ట గలిగిందా పశువుల కాపరి!
ఈ వెయిట్ లిఫ్టింగు స్టడీసుకి భయపడే  సత్యభామ అలా చిన్నబడికి పోవడానికి పాలుమాలింది  పోతన్నగారి భాగోతంలో. బాల్యంలో ఏ ఎల్కేజీ బడికి పోయున్నా  ఇంట్లో ఏ మూలనో ఆ పుస్తకాల సంచీ పడుండేది కదా? నగా నట్రాను మాత్రమే  నమ్ముకొన్న ఆ కొమ్మ పుస్తకాల బ్యాగు సమయానికి దగ్గర లేకే  అలా భంగపడింది. బుక్కుల బ్యాగ్గాని సిబ్బెలో పడేసి ఉంటే,, కొండనెత్తిన గోవిందుడైతేనేమి బండబ్యాగు బరువుకి పైకి తూగుండేవాడే. రుక్మిణమ్మ తులసాకూ   ఓ సాకనిపిస్తుంది. నిజానికది ఆ పట్టమహిషి చిన్నప్పటి బడి సంచి ఎందుక్కాకూడదూ?
అంత లావు గ్రామర్ నాలెడ్జి కెంత మందం రన్ అండ్ మార్టిన్లు అరగదీశిండో పాపం  ఆంజనేయుడుచిన్ని సంజీవని  మొక్క తెమ్మంటే మొత్తం కొండనే పెకిలించుకొచ్చాడా మహానుభావుదు. వృథా పోతుందా బాల్యమప్పటి   ఆ బండసంచులు మోసి నప్పటి అనుభవమంతా!

సతుకులెంత  పెద్దవైనా సతక్కో.. మంచిదే భయ్యా! కానీ  సంసారమంటూ ఒహటుండాలి.. తప్పదు గదా ఎంత లావు   సన్నాసికైనా! ఇప్పుడిట్లా ఎంతలా దెప్పి దెప్పి మాట్లాడుతున్నా.. ముందు ముందు ఎలాగూ గ్యాసు బండలు మోయక తప్పనప్పుడు.. ఇదిగో..  ఇంతప్పట్నుంచే ముందస్తుగా  స్కూలుబ్యాగుమోయుడు తరహా తర్ఫీదు లిప్పిస్తే మాత్రం తప్పేముంది తమ్ముడూ?
అందరికీ ‘ఆఛ్చే దిన్’ అందుబాటుకి  వచ్చే దిన్ .. సచ్చీ బోల్తే తోఁ.. సర్కార్ల నోట్నించే స్పష్టంగా వినబడనప్పుడు.. ముందు ముందు ఏ జీతగాడిగా  బతుకు ‘గాడీ’ నడపాలో ? ‘రేల్ గాడీ’ కాడ ఏ గాడిదగాడి  గబ్బుమూటలు పది రూపాయల కోసం పడీ పడీ మోయాలో? గాడిదమోత లెలాగూ తప్పేది లేనప్పుడు.. తమ్ముడూ!.. గ్రాండ్ లెవెల్లో ‘వెయిట్ లిఫ్టింగ్ స్కిల్స్’  కార్పొరేట్ స్టైల్లో ప్రాక్టికల్సుగ చేయిస్తే తప్పేందో చెప్పుదూ? ఒలంపిక్కు లెవెల్ వెయిట్-లిఫ్టింగు లిస్టుల్లో టెల్గూ పిల్లల్దే ఎప్పుడూ  టాప్ టెన్ ర్యాంకులు. వై? టెల్!  కమాన్! ఆ నైపుణ్యం మొత్తం  ప్రయివేట్ స్కూలుబ్యాగుల పుణ్యమే మ్యాన్! ఒప్పుకోవాలి ముందు.  అందుకే ఆడ బిడ్డలకైనా సరే ‘సిక్స్ పాక్’  కంపల్సరే కార్పొరేట్ బళ్లల్లో. ఆరు సబ్జెక్టులు.. ఇంగ్లీష్, టెల్గు, హిందీ, గణితం, సోషల్ అండ్ సైన్స్! ఒక్కో సబ్జెక్టుకి మళ్లా ఆరేసి  బుక్కులు.. టెక్స్ట్ బుక్, టెస్ట్ బుక్, నోట్ బుక్, గయిడ్, హోం వర్క్, క్లాస్ వర్క్. ఇళ్లకి హోం వర్క్,, బళ్లోకి క్లాస్ వర్క్!  బ్యాలెన్సు బుక్స్ .. తరగతి గది ఆరో అంతస్తులో ఉన్నా.. సన్న సన్నటి నున్నటి జారుడు మెట్లు ఎక్కి  దిగలేక బొక్క బోర్లా పడి ప్రాణాల మీదకి తెచ్చుకొన్నా.. అడుగు ముందుకే వేసే    ప్రాక్టీసు కోసం! పెద్దలకేనా.. పిల్లల చదువు బరువు బాధ్యతలూ? పిల్లలకూ తెలిసిరావాలి  చదువు ‘బరువు’ బాధ్యతలు. అందుకే  ‘బండ’ చదువులు!’
ఈ బండ చదువులు చల్లంగుండా!  పిల్లకాయల భారీ బడిసంచుల బారిన పడే భూగోళం తరచూ కక్ష్యనుంచి పక్కకు తూలుతున్నట్లు ఖగోళ శాస్త్రజ్ఞులు గోల పెడుతున్నరు. ఏదో ఒహటి  చేయాలి వెంటనే! లేకుంటే ఆ భూటాన్ భూకంపాలని మించి ఉత్పాతాలు భూలోకం  మొత్తాన్ని ముంచెత్తేసేయడం ఖాయం. శనిగ్రహమో.. గురు గ్రహమో.. ముందో కొత్త ఖాళీగ్రహం విశ్వాంతరాళాలలో ఎక్కడుందో కాస్త తొందరగా కనిపెట్టండయ్యా శాస్త్రజ్ఞులూ! ఈ భారీ చదువుబళ్లు ఎంత చెప్పినా తలొంచేట్లు లేవు.  ఇహ కట్ట కట్టెసి ఆ కొత్త గ్రహాలమీదకి తోసేయడ మొక్కటే మిగిలిన తొవ్వ! కావాలంటే అక్కడీ కార్పొరేట్ స్టైలు స్కూళ్లు ఎన్నంతస్తుల భవంతుల్లోనైనా లిఫ్ట్లు.. షిఫ్టుల్లేకుండా నిశ్చింతగా నడుపుకోవచ్చు. ఎన్నేసి రకాల ఫీజులైనా సక్రమంగానే వసూలు చేయాలన్న సర్కార్ల  స్ట్రిక్టు రూళ్లు  నిర్భయంగా అతిక్రమించుకోవచ్చు!
ముందీ ‘బండ’ చదువుల నుండి మన లేత బిడ్డల్ని కాపాడుకొందాం.. రండి!
-కర్లపాలెం హనుమంతరావు
(ఆంధ్రప్రభ- సుత్తి.. మెత్తంగా- కాలమ్- 21-10-2017- ప్రచురితం)
 ***


 



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...