Monday, May 21, 2018

కన్యాశుల్కంలో మూఢనమ్మకాలు


నమ్మకానికి ఆధారం అవసరం. ఆధారం లేకుండా నమ్మితే అది మూఢనమ్మకం అవుతుంది. మూఢవిశ్వాసాలు విశ్వవ్యాప్తంగా అన్ని జాతుల్లోనూ అనాదిగా   వస్తున్నవే. సేకరించడం మొదలుబెడితే ఆ చాదస్త విశ్వాసాల సమాచారం దస్తాల కొద్దీ బైటపడుతుంది.  
మూఢనమ్మకానికి మూలస్తభం అజ్ఞానం. ఆదిమ మానవుడికి విద్యాబుద్ధులు తక్కువ. ఆ కారణంగా విచక్షణాజ్ఞానమూ అంతంత మాత్రమే! ప్రకృతి శక్తుల విజృంభణ, మనో వైకల్యం, శారీరక రుగ్మతవంటి  ఉపద్రవాలు  ఎదురైనప్పుడు సమన్వయించుకునే మేధోసామర్థ్యంలేక ఆ ఉపద్రవాలను అదృశ్యశక్తుల ఆగ్రహాలుగా భ్రమపడ్డాడు. భయపడ్డాడు. శాంతించమని, అనుగ్రహించమని కనిపించని ఆ శక్తుల ముందు సాగిలపడ్డాడు. ఆ భయభక్తులే  మూఢనమ్మకాలకు మూలకారణమయ్యాయి క్రమక్రమంగా!
సమాజాన్ని కుంగదీసే, వ్యక్తిచైతన్యాన్ని అణగదొక్కే మహమ్మారులు ఈ మూఢనమ్మకాలు. అంటువ్యాధులకన్నా ప్రమాదకరం. ఈ తరహా ఊహపోహలను తీవ్రంగా  అపహాస్యం చేస్తుంది గురుజాడవారి ప్రగతిశీల 'కన్యాశుల్కం' నాటకం.
అవిద్య ఒక్కటే అంధవిశ్వాసాలకు కారణమా? విద్యావంతుల్లో వింతనమ్మకాలు లేవా? అని ప్రశ్నించేవారూ ఉన్నారు. కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాన్లు అందుకు ఉదాహరణ. ఆయన జటాంతస్వాధ్యాయి. అయినా వేదానికి అర్థం తెలీదు! 'మా మేనత్తలందర్నీ కూడా అమ్మారండీ! వాళ్లంతా పునిస్త్రీ చావే చచ్చారు' అంటాడు. ‘కన్యాశుల్కం’ దురాచారాన్నీ అచ్చివచ్చిన సంప్రదాయంగా నమ్మే ఆ మూఢుడు! ఆ అవివేకి దృష్టిలో  ‘దిబ్బావధాన్లు కొడుక్కి వూష్ణం వచ్చి మూద్రోజుల్లో కొట్టేయడానికి’ ఇంగ్లీషు చదువే కారణం. ఆచరించడం సంగతి ఆనక.. అసలు దురాచారమని అనుకొనేదాన్ని మనసులో తలుచుకున్నా చాలు.. ఏదో కీడు తప్పదని భయపడే బుద్ధిహీనులు తక్కువేమీలే రీ లోకంలో. బుచ్చబ్బి కొడుక్కి చచ్చినంత ఖాయిలా చెయ్యడానికి ఇంగ్లీషు చదువుదామని అనుకోవడమే కారణమని దబాయించే  అగ్నిహోత్రావధాన్లు తరహా మూర్ఖులున్నంత కాలం ‘కన్యాశుల్కం’ నాటకం నిత్యజీవితంలోని అస్తవ్యస్తతకు అపహాస్య దర్పణంగానే  వర్ధిల్లుతుంటుంది.
సనాతధర్మం మిషతో ప్రచారమయే ఆచారాలలో  అంధవిశ్వాసాల పాలు తక్కువేమీ కాదు. వాటి ప్రస్తావనలేవీ లేకుండా  అట్టడుగు జాతులు అవగాహనాలేమితో గుడ్డిగా నమ్మే విశ్వాసాలను మాత్రమే అవహేళన చేయడం.. నాగరీక సమాజంలో కనిపించే  ఒక అవలక్షణం. కన్యాశుల్కం  ఈ తరహా 'ద్వంద్వనీతి'ని అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలోనూ ఉతికి ఆరేసింది. 'నా పిల్లేమిటి, ఫకీరు ముండ. రేపు ఇంటికి వెళ్తూనే ఘటాశ్రాద్ధం పెట్టేస్తాను' అంటాడు అగ్నిహోత్రావధాన్లు లేచిపోయిందనుకున్న బుచ్చెమ్మ మీద ఆగ్రహంతో. వేదార్థం సాకల్యంగా అర్థంచేసుకొన్నవారెవరూ ఈ సందర్భంలో వాడే మాటకాదు ఘటాశ్రాధ్దం. కర్మకాండ విధానాలు అదను తప్పి ఎంత గుడ్డిగా పెద్దకులాల్లో కూడా అమలవుతున్నాయో 'ఘటాశ్రాద్ధ' చలనచిత్రం చూస్తే అర్థమవుతుంది.  
తెలుగుజాతిని పట్టి పీడించే మూఢాచారాల మీద వీలున్న అన్ని దారుల్నుంచి దాడులు చేసిన అభ్యుదయ యోధుడు కందుకూరి అయితే వీరేశలింగం వేసిన ఆ సంస్కార మార్గంలో 'కన్యాశుల్కం' బండిని మహా దూకుడుగా నడిపించిన ప్రగతికాముకుడు  గురుజాడ.  శ్రద్ధగా పరిశీలిస్తే మూఢాచారాల ప్రస్తావనలే కాదు.. వాటి అతిక్రమణలూ  కన్యాశుల్కంలో  ప్రహసన పూర్వకంగా అలరిస్తాయి. మూఢవిశ్వాసాలను సృష్టించేది, సానుకూలంగా ఉన్నప్పుడు ప్రస్తావించేది,  లేనప్పుడు వాటిని  అతిక్రమించేదీ సంఘంలోని పై తరగతులకు చెందిన పెద్దమనుషులే. ఈ వైరుధ్యానికి కన్యాశుల్కం అత్యద్భుతంగా అద్దంపట్టింది.
గిరీశం పాశ్చాత్య సంస్కృతితో బాగా ప్రభావితమైన పాత్ర. వైదికాచారాలు కొన్నింటితో పరిచయం కద్దు. కానీ వాటిని విశ్వసించడు. అయినా సందర్భం వచ్చినప్పుడు ఆ మూఢవిశ్వాసాలనే తన స్వార్థప్రయోజనాల కోసం వాడుకోవడం మానడు!  'నీకు నమ్మకం చాలకపోతే ఇదిగో గాయిత్రి పట్టుకు ప్రమాణం చేస్తాను' అని ఫొటోగ్రాఫుపంతులి బంట్రోతుని నమ్మిస్తాడు బకాయి వసూలుకు వచ్చి పీకల మీద బైఠాయించినప్పుడు. అంధవిశ్వాసాలకు ఉండే సామాజిక బలిమి గిరీశానికి బాగా ఎరికే. ఈ సమాజంలో లంచాలకి లొంగనివాడినయినా ‘విశ్వాసాల’తో మచ్చిక చేసుకోవడం సులువని వాడికి తెలుసు. ‘తమ వరకు వస్తే గాయిత్రిని, సావిత్రిని జపించక పోబట్టే ఆధునిక యుగం ఇంత అభివృద్ధి చెందింద’న్న గిరీశం థియరీలో అణులేశమైనా అతిశయోక్తిలేదు. వట్టి మంత్రాలు వల్లించడం వల్ల ఒరిగి పడేదేమీ లేదన్న స్పృహ నేటి మనిషికి మల్లే ఉండబట్టే 'తోవలో ఏటి దగ్గర సంధ్యావందనం అదీ చేసుకున్నాను' అని అబద్ధమాడి మరీ 'చల్దివణ్ణం' లాగించేసాడు గిరీశం జంకూ గొంకూ లేకుండా అగ్నివోత్రావధానులు ఇంట్లో. 'కాలిస్తే కోవిల్లోనే చుట్టలు కాల్చాలోయ్' అన్న గిరీశంలో ఈ కాలపు నయవంచకుల ప్రతిరూపం స్పష్టంగా కనిపిస్తుంది. మూఢవిశ్వాసాల సంగతి అటుంచి.. అసలు 'విశ్వాసాల’ జంజాటాలే పెట్టుకోవడం లేదు కదా నేటి మరీకొత్తతరం? 'మయిలా గియిలా మా ఇంగ్లీషువాళ్లకు జాన్తా నై' అని మధురవాణి దగ్గర గిరీశం కూసిన కూతలు ఈ నవనాగరీకుల బరితెగింపు బుద్ధిని ప్రదర్శిస్తాయి నగ్నంగా. 
గిరీశం గడుసుదనం ఎట్లా ఉన్నా గురజాడవారి గడుసుదనం కన్యాశుల్కంలో అడుగడునా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మూఢవిశ్వాసాలను సృష్టించి, వ్యాప్తి చేసే ఉన్నత సామాజిక వర్గాల ద్వారానే వాటి నిష్ప్రయోజకత్వాన్నీ చెప్పించడం గురజాడ గొప్ప టెక్నిక్. గ్రహచారాల ఆధారంగానే లుభ్దావధాన్లుని ముగ్గులోకి దింపాడు రామప్పపంతులు. 'శీఘ్రమే వివాహయోగం.. ఆ యోగం వల్ల ధనయోగం'ఉందని నమ్మబలికాడు. తప్పితే 'మారకం' ఉందన్నాడు. (పెళ్లికూతుళ్ళు మారడం మీదే తరువాతి  ప్రహసనమంతా నడిచింది కదా)! అక్కడేమో అగ్నిహోత్రావధాన్లు బిడ్డ చేతిలో కూడా 'ధనరేఖ' జెర్రిగొడ్డులా కనిపించింది! ఇదంతా హస్తసాముద్రికం మీద వ్యంగంగా నడిచిన తంతు.  ‘అన్నగారూ!’ అని సంబోధిస్తూ లుబ్ధావధాన్లుకు గిరీశం 'చిన్నది బహు లక్షణంగా ఉంటుంది. గాని కొంచెం పెయ్యనాకుడు కద్దు. అద్దానిని మనవారు వైధవ్యహేతువు అండ్రు' అంటూ బనాయించిన  ఉత్తరంలో కూడా 'శరీరశాస్త్రం' ప్రస్తావన వస్తుంది. తిధి, వార, నక్షత్రాల, గ్రహ స్థితుల ఆధారంగా పుట్టే జాతకాల గుట్టును రామప్పపంతులే  రట్టు చేస్తాడు మరో సందర్భంలో. 'మా బ్రాహ్మల్లో ఇది పరిపాటే. పెళ్లిళ్లలో పంపించే ఒహ జాతకవు నిజం ఉండదు' అంటూ జాతకాల బూటకాన్ని స్వయంగా బట్టబయలు చేసుకుంటాడు. జాతకాలను నమ్మేవాళ్ల గాలి తీస్తాడు వకీలు నాయుడు. అంగీరసలో పుట్టిన పిల్ల 'భావ'లో పుట్టినట్లుండటం చూసి 'బ్రాహ్మల పరువంతా తీస్తివే' అంటూ అగ్నిహోత్రావధాన్లను కలెక్టరు మందలిస్తాడు. శుభ ముహూర్తాలను సైతం అనుకూలతని బట్టి మార్చడం అప్పటిలాగా ఇప్పుడూ నడుస్తున్న 'లౌక్య ప్రజ్ఞే' లోకంలో.
దయ్యాలు, భూతవైద్యుల భాగోతం కన్యాశుల్కంలో అన్నిటికన్నా రసవత్తరమైన అభూతకల్పనలు. ఒక సన్నివేశంలో లుబ్ధావధాన్లు, మీనాక్షి, అసిరిగాడు, రామప్పపంతులు ప్రధాన పాత్రలు. తాను పెళ్లాడింది 'రెండో పెళ్ళి ముండ' అన్న లుబ్ధావధాన్లు  అనుమానం నుంచి మొదటిమొగుడు దయ్యమై పుట్టుకొచ్చాడు. మాయగుంట నూతిలో పడిందన్న మరో అనుమానం నుంచి రెండో దయ్యం పుట్టుకొచ్చింది. అక్కణ్నుంచీ గవరయ్య రంగప్రవేశం, లూటీ కార్యక్రమం మొదలవుతాయి. భయస్తుల దడుపు నుంచి ఒడుసుకోవడం చాలా సులవు. బ్రహ్మరాక్షసినీ, కామినీ పిశాచాన్నీ ఒకే సీసాలో బంధించానని గవరయ్య అన్నప్పుడు, 'ఇద్దర్నీ ఓ సీసాలో పెడితే దయ్యప్పిల్లల్ని పెడతారేమో?' అంటుంది మీనాక్షి. ఆధారంలేని విశ్వాసాల చూర్లు పట్టుకు వేలాడుతూనే ఆ పట్టు వదిలేస్తే జారిపడతామన్న తర్కం సమాంతరంగా మనిషి మెదడులో ఎలా పనిచేస్తుందో గురజాడ చక్కగా చూపిస్తాడిక్కడ. అజ్ఞానం వెలిబుచ్చే తర్కంలో  హాస్యరసం చిప్పిల్లుతుంది సహజంగానే. కానీ ఈ మాదిరి అభాసంతా సమాజ వికాసానికి సమాంతరంగా సాగే వికృతత్వానికి నిదర్శనం. ఈ తరహా మౌఢ్యాన్ని కన్యాశుల్కంలో గురజాడ అంత  తీవ్రంగా, వికటంగా బహుశా ప్రపంచ సాహిత్యంలో ఇంకెవ్వరూ ఎండగట్టి ఉండరేమో! రాసి శతాబ్ది దాటినా 'కన్యాశుల్కం' ఈ నాటికీ  తిరుగులేని ప్రహసనంగా జనాకర్షణ నిలుపుకోవడానికి కారణం సమాజాన్ని నిత్యం పీడించే అంధవిశ్వాసాలు ఇందులో ప్రతిభావంతంగా చిత్రీకరించడమే.
మూఢవిశ్వాసాలు పై తరగతులవారికి ఎంతలా  ఆటివచ్చాయో.. ఎంత అడ్దువచ్చాయో.. కింది తరగతులవారికీ ఆ మోతాదుల్లోనే అక్కరొకొచ్చాయ్.. అడ్డూ వచ్చాయ్! ఆ పార్శ్వమూ గురజాడ గురి నుంచి తప్పిపోలేదు.  రెండు రూపాయలిస్తే ముహూర్తం మార్చేస్తానంటాడు సిధ్దాంతి! ఉన్నతవర్గాలవారు స్వార్థప్రయోజనాల కోసం మూఢవిశ్వాసాలను సృష్టించి సందర్భాన్ని బట్టి వాడుకుంటే, దిగువ తరగతులవారు ఆకలి వంటి ప్రాధమిక జీవితావసరాల కోసం మాత్రమే ఆ అంధవిశ్వాసాలను వాడుకుంటారు. ఈ రెండు పార్శ్వాల మధ్య ఉండే తారతమ్యం గుర్తించనివారు ‘కన్యాశుల్కం’ నాటకం జీవసారాన్ని సక్రమంగా గ్రహించలేరు.
మోసగాడితో లాలూచీపడి మోసపోయినవాడు దుకాణదారుడు. అతగాడితో కత్తు కలిపినవాడు గవరయ్య. ఉద్యోగధర్మాన్ని అనుసరించి మాయగుంటను, కరటక శాస్త్రిని పట్టుకోవాల్సింది పోయి బైరాగి అంజనం మీద ఆధారపడే  మూర్ఖుడు హెడ్డు. కన్యాశుల్కం పాత్రలన్నింటిలో మూర్ఖత్వమో, అమాయకత్వమో ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి. ఒక్క మధురవాణి, సౌజన్యారావు పంతులు మినహాయింపు. అమాయకులను, ఆశపోతులను, అదుపుతప్పినవాళ్లను, దిక్కులేనివాళ్లను, విశ్వాసాల వంకతో వంచకులు ఎట్లా ఆటలాడిస్తారో గిరీశం, బైరాగి, రామప్పపంతుళ్ళు వంటి పాత్రల ద్వారా సాటిలేని రీతిలో నిరూపించాడు కన్యాశుల్కంలో గురుజాడ. కన్యాశుల్కంలో బైరాగి  ప్రాతఃకాలంలో కాశీలో గంగను సేవించి, పవనం బంధించి, వాయువేగం మీద విశాఖపట్టణం వీధిలో విజయం చేస్తాడు! విశ్వేశ్వరుడి కోవిలలో ఆకాశం మీంచి పడ్డ బంగారపు రేకు మీద చెక్కిన లిపి బ్రాహ్మలెవరికీ బోధ అవక తనను చిత్తగింజమన్నట్లు బైరాగి చెప్పుకొస్తాడు. యోగదృష్టి, ఖేచరీగమనం, తిరస్కరణీవిద్య, వాయువేగం, వాగ్బంధం, అంజనం, రసవాదం, వాయుస్తంభన లాంటి అపరవిద్యల్ని గూర్చి హేతువుకు అంతుబట్టని కబుర్లతో పబ్బం గడుపుకొనే బైరాగి  మోసగాడని వాసన పట్టే పాఠకులే, వాస్తవ జీవితంలో మూఢవిశ్వాసల కారణంగా అదే మాదిరి మాయాజాలంలో సులభంగా పడిపోతున్నారు! లుబ్ధావధాన్లు మల్లే విలవిలలాడుతున్నారు! నాటకంలోని ఏ సన్నివేశమూ అసహజం అనిపించక పోవడానికి అదే కారణం.
భాగవత గ్రంధం తలకింద పెట్టుకు పడుకోవడం, దీపాలార్పి ప్రమాణం చెయ్యడం, పేకాట దగ్గర ముణుకు పెట్టడం, ఇనప చేతులు(ఐరన్ లెగ్) వంటి అపశకునాలు  అడుగడుగునా నిత్యజీవితంలో మాదిరి ప్రత్యక్షమవుతుంటాయి ఈ నాటకంలో. చదువుకొనే సంస్కృతకావ్యం మీద నమ్మకంలేక.. ఇంగ్లీషు పుస్తకం పైన  ప్రమాణంచేస్తే తప్ప కరటకశాస్త్రి శిష్యుడు గురువును నమ్మడు! మారే తరాలకు తగ్గట్లు వస్తువు మారినా మౌలిక ఆలోచనల్లోని మూఢత్వం చెక్కుచెదరని పరిస్థితిని గురజాడ ఎంతో గొప్పగా చిత్రీకరించాడీ నాటకంలో.
'ఆకాశంబు శూన్యంబు' అని మనవాళ్లయ్య అన్నప్పుడు.. 'తెల్లోడు యెర్రోడా? పట్టంలో గొట్టావెట్టి అదే సూస్తాడే ఆకాశం కేసి?' అని ఎదురు ప్రశ్న వేస్తాడు మునసబు. పాశ్చాత్య విజ్ఞానం వెలుగులోకి వచ్చేకొద్దీ పల్లెటూళ్లల్లో కూడా ఆలోచనా విధానం ఎట్లాంటి మార్పుకు గురయిందో గురజాడ ఇటువంటి సందర్భాలలో మర్చిపోకుండా ప్రస్తావిస్తాడు. 'ఆంజనేయస్వామికి పదిశేర్లు నెయ్యితో దీపారాధన చేస్తాన’ని కరటక శాస్త్రి అన్నప్పుడు .. ‘కడుపులోకి వెళ్లవలసిన నెయ్యి కాల్చివెయ్యడం నాకేమీ ఇష్టంలేదు. మొక్కుకోండి చాలు'అంటాడు అతగాడి శిష్యుడు.  ఈ దేశపు అజ్ఞానపు కోటలకు ఇట్లాంటి సందర్భాలలో బీటలుపడ్డమూ  కదాచిత్ లేకపోలేదు. కానీ ఆ చిట్టి దీపాలు గాఢమైన చిమ్మచీకట్లను పారదోలేటంత వెలుగులు ఎన్నడూ ప్రసరించింది లేదు. అదే విషాదం.
మూఢ విశ్వాసాలను నమ్మేవాళ్లే తోసిరాజనేవాళ్లు. తోసిరాజన్నవాళ్లే నమ్మినవాళ్ళు కన్యాశుల్కం నాటకం నిండా కనిపిస్తారు వాస్తవ లోకంలోలా. వాస్తవానికి మధురవాణి, సౌజన్యరావు పంతులు మినహాయించి  ఈ ప్రహసనంలోని ఏ పాత్రకూ దేని మీదా స్థిరమైన నమ్మకం లేదు. ఏది నమ్మాలి? ఏది నమ్మరాదు? అనే అంశానికి ఎప్పుడూ అంతగా ప్రాధాన్యతా లేదు. అవకాశవాదమే నాగరికులకు పక్కవాడిని బోల్తా కొట్టించే పక్కా చిటుకు! బైరాగి కనిపిస్తే మాయలేడిని, కరటక శాస్త్రిని అంజనం వేసి కనిపెడతాడని ఆశపడే హెడ్డుతో 'హెడ్డుగారూ! ఇదంతా ‘గ్రాండచ్చీ ఆఫ్ బాడన్' అని వాదిస్తాడు గిరీశం.  మూఢనమ్మకాల లోతుపాతులన్నీ ఆ ఒక్క ముక్కతో తేల్చిపారేసాడు గిరీశం పాత్ర  ద్వారా గురజాడ కన్యాశుల్కం నాటకంలో!
 కన్యాశుల్కంలోని మూఢపాత్రల విశ్వాసమల్లా జీవిత భద్రత మీద, డబ్బు మీద. వాటి కోసం ఏది ఎప్పుడు అవసరమనిపిస్తే  దాన్ని అప్పుడు వాడుకున్నాయి  దాదాపు అన్ని పాత్రలు. వాస్తవంగా అధికశాతం లౌకికుల  అసలు మనస్తత్వం కూడా ఇదే. ఈ విధమైన స్వీయనయవంచన జీవన సరళిగా కొనసాగుతున్నంత కాలం సమాజంలో పతనం భీభత్సంగానే కొనసాగుతుంది. ఈ భీభత్సాన్నుంచి బైటపడాలంటే  ఉదారవాదం, హేతువు ఆధారంగా వికాసం పొందే మానవవాదం అలవడాలి. కన్యాశుల్కంలోని మూఢవిశ్వాసాల చిత్రీకరణ ద్వారా గురజాడ జాతికి ఇవ్వదలుచుకున్న సందేశం కూడా ఇదే.
-కర్లపాలెం హనుమంతరావు
***
(కన్యాశుల్కం - మూఢవిశ్వాసాలు- పు.200- 205 - డా।। యు.. నరసింహమూర్తి- కన్యాశుల్కం 19 వ శతాబ్ది ఆధునిక భారతీయ నాటకాలు- ప్రేరణతో


Sunday, May 20, 2018

హిందూ పదం.. మతానికి సూచిక కాదు. అది ఒక సంస్కృతికి సంకేతం - వ్యాసం




'సప్త ద్వీపా వసుంధరా'. భూమి ఏడు ద్వీపాల సంపుటం. ద్వీపం అంటే నీటి మధ్యలో ఉండే భూభాగం. 'జంబూ ద్వీపే, భరత ఖండే, భరత వర్షే' అనే మంత్రం పూజాదికాలలో వింటూ ఉంటాం. జంబూ అనే ఓ ద్వీపం మధ్య ఉన్న భరత ఖండంలోని ఒక భాగం భరత వర్షం(దేశం). అంటే పురాణాల ప్రకారం చూసుకున్నా మనం ఉన్నది హిందూదేశం కాదు. భారతదేశం. మరి ఇప్పుడు తరచూ మారుమోగే ఈ 'హిందూ' పదం ఎక్కడ నుంచి   దిగుమతయినట్లు? కాస్త చరిత్ర తిరగేస్తే ఈ అనుమానం సులభంగా నివృత్తి అవుతుంది.
'హిందూ' పదం నిజానికి ఒక మతాన్ని సూచించదు. అది ఒక సంస్కృతికి సూచిక.
స్వాతంత్ర్యం సాధన తరువాత లౌకిక ప్రజాతంత్ర విధానంలో పాలన జరగాలని తీర్మానించుకున్న మనం  రాజ్యాంగంలో 'హిందూ' అన్న పదానికి పాలనాపరంగా ప్రాధాన్యత ఇవ్వలేదు. దాని స్థానే 'భారత్' 'భారత్ దేశ్' అనే పదాలు కనిపిస్తాయి.
యురోప్ ఖండంలో మన దేశానికి 'ఇండియా'గా గుర్తింపుంది. ఆ పాపం తెల్లవాడి వల్ల. 'ఇండికా' 'ఇండిగో' అంటే నల్లమందు అని అర్థం. నల్లమందు కోసం వెతుక్కుంటూ వచ్చిన తెల్లవాళ్లకు ఇక్కడ ఆ నీలిమందు పుష్కలంగా పండే భూములు కనిపించాయి. పాడి- పంట చేసుకు బతికే అన్నదాతల చేత బలవంతంగా నీలిమందు సాగుచేయించిన బీహార్ 'చంపారన్' కథ మనందరికీ తెలుసు. అక్కడి రైతులు బాపూజీ ఆధ్వర్యంలో చేసిన ప్రతిఘటనతోనే మన మలిదశ స్వాతంత్ర్యపోరాటానికి బీజం పడింది.
రాజ్యాంగం 'హిందూ' పదాన్ని గుర్తించలేదు. అటు సంస్కృతీ, ఇటు రాజ్యాంగమూ రెండు గుర్తించని ఈ 'హిందూ' పదానికి మరి ఇప్పుడు ఇంత ప్రాధాన్యత ఎందుకు పెరుగుతున్నట్లు? ఇంకాస్త లోతుకుపోయి తరచి చూస్తే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తాయ్!
ఇప్పుడున్న భావన ప్రకారం ఈ దేశంలో అధిక సంఖ్యాకులు ఆచరిస్తున్న మతం 'హిందూ మతం'. అలాంటి ముద్ర వేసిపోయింది ఆంగ్లపాలకులు.  స్వార్థప్రయోజనాల కోసం రాజకీయాలలోకి 'హిందూ' పదాన్ని ఒక మత రూపంలో చొప్పించి పబ్బం గడుపుకుపోయిన మహానుభావులు ఆంగ్లేయులు.
నిజానికి భారతదేశానికి ఒక మతమంటూ పత్యేకంగా లేదు. భారతీయత ఒక తాత్వికత.. అంటే ఓ ఆలోచనా రూపం. వేదాల నుంచి పుట్టిన భావుకత కూడా కాదు. వేదాలే భారతీయనుంచి రూపు దిద్దుకొన్న వాఙ్మయం. గతాన్ని గురించి స్మరించినా.. వర్తమానమే భారతీయతకు ప్రధానం. ఆదీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిరంతరం కొత్త వికాసమార్గాలలో ప్రస్థానిస్తుంది భారతీయం. ఒక  ప్రాంతానికో, ప్రజలకో పరిమితం కాకుండా సమస్త మానవాళి కళ్యాణం కోసం పరితపిస్తుందది. మానుషధర్మం నుంచి పక్కకు తొలగకపోవడం భారతీయతలోని విశిష్ట లక్షణం. ఇందుకు చరిత్ర నుంచి ఎన్నైనా ఉదాహరణలు చూపించవచ్చు. ముందు ఈ 'హిందూ' పదం పుట్టుపూర్వోత్తరాలను గురించి కాస్త తెలుసుకొందాం.
తురుష్కులు ఈ దేశం మీదకు దండెత్తి వచ్చినప్పుడు  ముందుగా వాళ్ల కంటబడ్డది సింధునది. సింధూని వాళ్లు హిందూగా పిలుచుకున్నారు. ఈ దేశాన్ని హిందూదేశం, ఇక్కడి జనాలను హిందువులు అన్నారు. ముసల్మానుల పెత్తనం వెయ్యేళ్లకు పైనే సాగింది ఈ దేశం మీద. ఆ పాలకుల నోట నలిగి నలిగి చివరికి ఈ దేశం ప్రజల నాలుకల మీదా  'హిందూస్తాన్' గా స్థిరబడింది.
ముసల్మానులతో పాటు ఇస్లామూ వారి వెంట  వచ్చింది. ఇస్తాం ఒక శుద్ధమతం. ఆ మతం ముమ్మరంగా ప్రచారంలోకి వచ్చిన తరువాతే ఇక్కడి ముస్లిమేతరుల మీద 'హిందువులు' అనే ముద్ర స్థిరపడింది. ఆ హిందువులు ఆచరిస్తున్న ధర్మం హిందూధర్మంగా గుర్తింపబడింది.
'హిందూ' విదేశీయుల మనకు అంటగట్టిన ఒక ‘బానిస ట్యాగ్’ అంటారు దాశరథి రంగాచార్య ‘హిందూత్వంపై ఇస్లాం ప్రభావం’ అనే వ్యాసంలో. బానిసత్వం పోయినా ఇంకా ఆ పరాధీన సూచిక పదాన్నే గర్వంగా చెప్పుకు తిరగడం మనకే చెల్లింది!
స్వాతంత్ర్యం రావడం వేరు. బానిసత్వం పోవడం వేరు. జాతీయభాషగా రాజ్యాంగంలో మనం గుర్తించిన 'హిందీ' పదం అసలు జాతీయపదమే కాదు. అది విదేశీయుల నోటి నుంచి వచ్చిన నిమ్నపదం. ఈ నిజం గుర్తించలేకపోవడానికి పన్నెండేళ్లకు పైగా బానిసలుగా బతకేందుకు అలవాటు పడటమే కారణం కావచ్చు.
మహమ్మదు ప్రవక్త ఇస్లాం మతాన్ని ఒక సంఘటిత శక్తిగా రూపొందించాడు. రాజ్యవిస్తరణ, మతప్రచారం.. అనే రెండు ధ్యేయాలతో ఇస్లాం ఆయుధం పుచ్చుకొని బైలుదేరింది. ఇస్లాం ఆక్రమించుకొన్నంత భూభాగాన్ని, విశ్వాసాన్ని బహుశా చరిత్రలో అంత తక్కువ వ్యవధిలో మరే ఇతర మతం ఆక్రమించి ఉండదేమో!
ఆ ఇస్లాం వెయ్యేళ్లు పాలించిన భూభాగం భారతదేశం. ముసల్మానుల ప్రమేయం లేకుండా భారతదేశ చరిత్ర లేదు. ఇస్లామును తుడిచి పెడతామన్న రాజకీయాపార్టీలు సైతం  మహమ్మదీయులను సంతోషపెట్టే ఓటు రాజకీయాలు చేస్తున్నాయిప్పుడు!
హింసతోనే ప్రచారం ప్రారంభమయినా.. కాలక్రమేణా ఈ దేశ సంస్కృతిలో అంతర్భాగమయింది ఇస్లాం. 'స్వర్గ మన్నది ఎక్కడున్నది?' అంటే ‘ఇదిగో.. ఇదిగో.. ఇక్కడున్నది' అనే వరకు మచ్చికయింది భారతీయతకు. భారతీయ తాత్విక చింతన ఇస్లామును అంతగా ప్రభావితం చేసింది. వెయ్యేళ్ల చరిత్రలో కొన్ని దుర్మార్గాలకు ఒడిగట్టినా.. మొత్తం మీద భారతీయ ధర్మ, సంస్కారాల ప్రభావానికి లొంగిపోయింది ముస్లిముల సంస్కృతి. భారతీయుల మత సహిష్ణుత అలవడ్డం వల్లే.. మిగతా దేశాలలోని దూకుడు కాలక్రమేణా ఇక్కడ తగ్గింది. మతమార్పిడులు జరిగినా.. ఇస్లామేతరాన్ని పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నం చివరి వరకు కొనసాగలేదు. ఆదిశంకరుడి అద్వైతం, రామానుజుడి విశిష్టాద్వైతం, వల్లభాచార్యులు, జయదేవుల మధుర భక్తి, తులసి రామాయణం, కబీర్, మీరా, త్యాగయ్య, రామదాసు, అన్నమయ్యల భక్తివాఙ్మయం ముస్లిం పాలకుల కాలంలోనే దేశానికి దక్కింది. ఇంత సాహిత్య, సంగీత, ఆధ్యాత్మిక భావజాలం వర్ధిల్లనీయడానికి కారణం ముస్లిముల మీద పడిన భారతీయ తాత్విక సహిష్ణుత ప్రభావం,
ఆరు నెలల సావాసానికి వారు వీరు అవుతారంటారు. వెయ్యేళ్ల సహజీవనంలో భారతీయత నుంచి ఇస్లాం స్వీకరించిన  సాంస్కృతిక సంపద స్వల్పమేమీ కాదు. భారతీయ చింతనలో వచ్చిన మార్పూ కొట్టిపారేసిది కాదు. పార్శీ ప్రభావంతోనే ఎదిగినా ఉర్దూ షాయిరీలో సంస్కృత సాహిత్య  ఛాయలు సుస్పష్టంగా కనిపిస్తాయ్! సూఫీ సిధ్దాంతానికి భారతీయ తాత్వికతే తల్లి. ఉత్తర భారతంలో వేషభాషల మీదే కాక, ఆహార అలవాట్ల మీదా ముస్లిం సంస్కృతి అధికంగా కనిపిస్తుంది. ఉపనిషత్తులు నమ్మని ఏకబ్రహ్మ సూత్రాన్ని ముస్లిం ఆధ్యాత్మికత ప్రభావం వల్ల అద్వైత, విశిష్టాద్వైత సిధ్దాంతాలకు అంకురార్పణ జరిగింది. ఉత్తరాది దేవాలయాల్లో నేటికీ సాగే 'ఆరతి' సంప్రదాయం ముసల్మానుల 'సామూహిక ప్రార్థన'లకు అనుకరణే. భారతీయత  మౌలిక నిర్మాణం తీరుతెన్నులవల్ల  అనుకూలించక   ఎప్పటికప్పుడు బెడిసిగొడుతున్నవి కానీ  భారతీయ సమాజం మొత్తాన్నీ ఒకే ఛత్రం కిందకు తెచ్చేందుకు ఇప్పుడు హిందూత్వ చేస్తున్న ప్రయత్నాలు ముస్లిముల అఖండ మత సిద్ధాంతంతో ప్రభావితమైనవే!
కానీ భారతీయత ‘ధర్మం వేరు.. రాజకీయం వేరు.. గా’ ఉంటుంది. లౌకికధర్మం రాజకీయాన్ని శాసిస్తుంది.  సమాజం ఆ తరహా ధర్మాన్ని రక్షిస్తుంటుంది. రాజకీయం ధర్మాన్ని శాసించే తత్వం  పరాయి మతప్రధానదేశలోలాగా భారతీయ సమాజంలో చెల్లదు.  
హిందూ ముస్లిముల మధ్య వ్యక్తిపరమైన వైరుధ్యాలేమైనా ఉంటే ఉండవచ్చు  కానీ మతపరమైన ఘర్షణలు  ఉండేవి కాదు. ఆంగ్లేయులు భారతదేశాన్ని ఆక్రమించుకొనే వరకు ఈ సహోదరభావం వర్ధిల్లింది. కాబట్టే 1857 స్వాతంత్ర్య పోరాటంలో బహదూర్ జఫర్ షా చక్రవర్తి కావాలని  హిందూప్రభువులు సైతం ప్రాణాలర్పించడానికి సిధ్దపడి పోరాడారు. తెల్లవాళ్లను విదేశీయులుగా భావించి తరిమికొట్టేందుకు హిందూ ముస్లిములిద్దరూ సంఘటితంగా తిరుగుబాటు చేసారు. మత సిధ్దాంతాల మధ్య వైరుధ్యాలను పక్కన పెట్టి హిందూ ముస్లిములు  ఒక్కటిగా ఉన్నంత వరకు తమది పై చేయి కాదన్న తత్వం తలకెక్కింది కాబట్టే విభజించి పాలించే విధానానికి తెరలేపింది తెల్లప్రభుత.
టర్కీ సుల్తాను నుంచి మతాధికారాలని ఊడలాక్కొన్న సందర్భంలో ముస్లిముల ఆత్మగౌరవానికి అవమానంగా భావించి కాంగ్రెస్ ఆధ్వర్యంలో హిందూ ముస్లిములిద్దరూ కలిసే ‘ఖిలాఫత్’ ఉద్యమం నదిపించారు. బెదిరిన బ్రిటిష్ దొరలు 'హిందూ రాజ్యంలో ముస్లిములకు రక్షణ ఉండదు' అన్న దుష్ప్రచారాన్ని ముమ్మరం చేసినప్పటి నుంచి రెండు మతాల మధ్య కనిపించని పొరపచ్చలు మొదలయ్యాయి. జిన్నా సారధ్యంలో ఏర్పడ్డ ముస్లిం లీగ్ ప్రత్యేక ఇస్లాం రాజ్యం కోసం చేసిన ఉద్యమంతో ఇరు మతాల  మనోభావాలు  తిరిగి మెరుగవనంతగా  చెడిన కథంతా మనకు తెలిసిందే!

ముస్లిములలో పెద్దలు కొందరు పెద్దలు మతద్వేషాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేస్తే,, హిందువుల్లో కొందరు మహానుభావులు మతద్వేషాన్ని రెచ్చగొట్టే కుత్సితానికి పాల్పడ్డారు. హిందువులు ఒక తాత్విక జాతిగా స్వభావరీత్యా  పరమతాలను ద్వేషించరు. కానీ ఆ కొద్దిమంది మహానుభావులకు మరికొంతమంది బుద్ధిమంతులు తోడవుతూ అనునిత్యమూ ప్రజల మధ్య సామాజిక శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు.
భారతదేశం విభిన్న విశ్వాసలకు ఆలవాలం. బౌధ్ధం, జైనం, శాక్తేయం, చార్వాకం వంటి పరస్పర విరుధ్ద విశ్వాసాలు సయోధ్యతో సహజీవనం సాగించాయి ఇక్కడ. స్వాతంత్ర్యం సాధించుకున్న తరువాతా సుఖజీవనానికి అవసరం లేని మతద్వేషాలు  అవసరమా? ప్రత్యేక మతరాజ్యం సాధించుకొనేందుకు అప్పట్లో ఆయుధంగా వాడిన మతవిద్వేషాలను ఇంకా ఏం సాధించాలని ఇక్కడ కొనసాగిస్తున్నట్లు?! 'సర్వే జనా సుఖినో భవన్తు' అన్నది భారతీయత మౌలిక ధార్మికసూత్రం. ఆ స్ఫూర్తి సంపూర్ణంగా ధ్వంసమయేదాకా మతవాదం అతిచొరవ చూపిస్తే సమాజమే శిక్షిస్తుంది. చరిత్ర చాలా సార్లు రుజువులతో సహా నిరూపించిన ఈ హితవును పెడచెవిన పెడతామంటే  .. సరే,, స్వయంకృతానికి ఇక ఎవరైనా  చేసేదేముంది?
***
కర్లపాలెం హనుమంతరావు
2౦ -05 -2018
(దాశరథి రంగాచార్య అక్షర మందాకిని (8) – హిందుత్వం పై ఇస్లాం ప్రభావం –వ్యాసం – ప్రేరణతో)

Friday, May 18, 2018

ప్రాచీన సాహిత్యమూ పరిచయం కావాలి!- వ్యాసం



వెయ్యేళ్ల పైబడిన చరిత్ర తెలుగు సాహిత్యానిది. ప్రబంధ సాహిత్య కాలం అందులో స్వర్ణయుగమంటారు. అందుకు ఒప్పుకోని వారూ ఉన్నారు. ఏదేమైనా మన ప్రాచీన సాహిత్యాన్ని గూర్చి కొద్దో గొప్పో పరిచయం ఉండటం ప్రతీ యువకవికీ అవసరమే! కానీ ఆ దిశగా ద్వారాలు ఎందుకు మూసుకున్నట్లు? సాహిత్యాన్ని ప్రత్యేక అంశంగా ఎన్నుకునే విద్యార్థులు మాత్రమే అధ్యయనం  చేసే విభాగంగా భావించడం తప్పు.
చైనా తాంగ్ రాజులను గురించి రాసిన ప్రాచీన సాహిత్యాన్ని ప్రస్తుత కమ్యూనిష్టు ప్రభుత్వాలేమీ ప్రపంచానికి కనిపించకుండా దాచేయడంలేదు. రాజులకు సంబంధించిన ఈర్ష్య, అసూయ, మదం, మాత్సరాలకు చెందిన కథలే కదా అని షేక్స్పియర్ సాహిత్యాన్ని ఆంగ్లేయులు 'ఓన్' చేసుకోకుండా వదిలేసిందిలేదు. పెద్ద కులాలకు చెందిన వ్యవహారల పట్ల శ్రద్ధ ఎక్కువగా చూపించిన 'పుష్కిన్' సాహిత్యాన్ని మాక్సిం గోర్కీ 'ఆరంభాలలకే ఆరంభం'గా ప్రస్తుతించాడు. సంగం రాజుల కాలంలో వర్ధిల్లిన పంచకావ్యాలను తమిళులు తమ సంస్కృతికి చిహ్నంగా సగర్వంగా చెప్పుకుంటారు ఇప్పటికీ. మన దగ్గరే ఎందుకో ప్రాచీన సాహిత్యం మీద అర్థంలేని  చిన్నచూపు! దురదృష్టం.
కవి భావజాలంతో కావ్యాన్ని తుల్యమానం చెయ్యడం వల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ! కవి వ్యక్తిత్వాన్ని అతను సృజించిన  కావ్యం ద్వారానో, కావ్య నైపుణ్యాన్ని అది  సృజించిన కవి వ్యక్తిత్వం ద్వారానో అనుశీలించడం ఉత్తమ సాహిత్య విమర్శ అనిపించుకోదు. రాజాశ్రయాలలో జీవిక సాగిస్తూ సృజనను ఒక వృత్తిగా కొనసాగించే కవులు కొన్ని వత్తిడుల మధ్య, అవసరాల దృష్ట్యా కావ్యరచన సాగించే సందర్భాలు కద్దు. కాబట్టి కవి వ్యక్తిత్వాన్ని ఆ కావ్యం ద్వారా అనుశీలించడం సరికాదు.
ఎంతటి ప్రతిభా వ్యుత్పత్తులున్న కవి అయినా రాసేది రాజుల కథలే అయినప్పటికి తన కాలంనాటి సామాజిక పరిస్థితుల ప్రభావం నుంచి పూర్తిగా వైదొలగి రచన సాగించలేడు. 15 వ శతాబ్దం నాటి శ్రీహర్షుని నైషధాన్ని శ్రీనాధుడు 'శృంగార' నైషధంగా ఎందుకు పేర్కొన్నాడో, 16 వ శతాబ్ది నాటి రాజు శ్రీకృష్ణదేవరాయలు తన 'ఆముక్తమాల్యద'లో'తృణీకృతదేహుడు' అయిన మాల దాసరి పాత్రను ఎందుకు అంత ఉన్నతంగా చిత్రీకరించాడో అర్థం చేసుకోవాలంటే ఆనాటి సాంఘిక, తాత్విక, చారిత్రక జ్ఞానమూ కొంత అవసరం.  సాహిత్య విమర్శంటే కేవలం కావ్యలక్షణాలకు, కవి వ్యక్తిత్వానికి, అలంకార శాస్త్రానికి, వ్యాకరణ శృంఖలాలకు మాత్రమే చెందింది కాదు. కవి, కావ్య కాలాలనాటి చారిత్రిక, తాత్విక, సాంఘిక ధోరణులను సైతం పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే ఆ అనుశీలన కవికి, కావ్యానికి న్యాయం చేసేది. తెలుగులో ఈ తరహా సాహిత్య విమర్శలు ఇంకా పారంభదశలో అయినా ఉన్నాయా అని అనుమానం.
యూరోప్ సాంస్కృతిక పునరుజ్జీవన నిర్మాతల్లో ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ ఒకరు. ఆయన చిత్రకళను గూర్చి పరిశీలిస్తూ ఒక విమర్శకుడు 'డావిన్సీ సమస్య ఒక్క మానవత్వ మహిమను చిత్రీకరించడమే కాదు.. ఆ సృజనను పది కాలాలపాటు ముందు తరాలూ ఆస్వాదించే విధంగా పదిలపరిచడం ఎలాగు అన్నది మరో సమస్య' అంటాడు. ఏ కళాజీవీ తన సృజన కాలానికి ఎదురీది కలకాలం  చిరంజీవిగా నిలబడాలన్న తపనతోనే పని ప్రారంభిస్తాడు. అందుకు తగిన విధానాలనే ఎంచుకొని అనుసరిస్తాడు. ఉదాహరణకు సముఖం వేంకట కృష్ణప్ప నాయకుడి 'అహల్యా సంక్రందనము' తీసుకుందాం.
'మగనాలొకతె చాపల్యమున పర పురుషు నాదరించినది. ఆమె అహల్య. ఆమె కథ ఈ అహల్యా సంక్రందనము'. జారిణి అయినా ఆ అహల్య పంచకన్యలలో ప్రధమగణ్యగా ఆదరించబడింది! స్త్రీకి సౌశీల్యమే సహజాభరణంగా  స్థిరీకరించబడిన  సమాజంలో ఈ వైరుధ్యం ఏ విధంగా సాధ్యమైనట్లు? పతివ్రతా శిరోమణులు ఎందరో ఉండగా కవికి సందేహాస్పద శీలవతి అహల్య కథ మీదే ఎందుకు దృష్టి మళ్లింది? అహల్య జారత్వానికి ఇంద్రుడి మీద ఆకర్షణ కారణమంటారు.  తైత్తరీయారణ్యకంలో మరి ఈ ఇంద్రుణ్ణే యాగశాలకు ఆహ్వానించే సందర్భంలో '.. అహల్యాయై జార..'  అని వేదమంత్రోక్తంగా ఆహ్వానిస్తారు! ఈ రకమైన విరుద్ధ భావాలను సమర్ధవంతంగా సమన్వయించుకొనే మేధో సామర్థ్యాన్ని మెరుగుపరుచుకొనేందుకైనా అన్ని రకాల భావజాలాలతో.. అవి  ప్రాచీనమైనవైనా సరే..  పరిచయం అవసరం.
దేహాన్ని నిరాకరించిన ధార్మాలు ఒక పక్క,  దేహధర్మమే ప్రధానమన్న భావజాలం మరో పక్క .. విరుధ్ధమైన భావజాలాల మధ్య కవులు కావ్యరచనలు కొనసాగించవలసిన అగత్యం నేటికన్నా రాజరికానిదే గుత్తాధిపత్యంగా సాగిన కాలంలో మరింత ఎక్కువగా ఉండేది. దైవం, ధర్మం, దేహం.. కవికి మూడు వైపులా తలుపులు బార్లా తెరిచి  'రా.. రమ్మ'ని ఉబలాట పెట్టినప్పుడు ఏ కవికి ఆ కవి తన అవసరాలు, వ్యక్తిత్వం,  అగత్యాల దృష్ట్యా ఏదో ఓ మార్గం ఎంచుకొని ముందుకు సాగిన మాట నిజం. కవి తొక్కిన దారి సరే.. తొక్కవలసిన పరిస్థితులు.. నడిచిన దారిన కవి  ప్రదర్శించిన ప్రతిభా వ్యుత్పత్తులు .. సర్వం సమగ్రంగా తుల్యమానం చేయడం సరయిన సాహిత్యదర్శనం అవుతుంది. అది మానేసి.. ఈనాటి జీవిత విలువల ఆధారంగా ఆనాటి కవులను, వారి కావ్యాలను బేరీజు వేయడం సరికాదు. కొత్త కవులకు వాటిని దూరంగా ఉంచడం అంతకన్నా సబబూ కాదు.
దేహానికి, దైవానికి జరిగిన భీకర సంగ్రామ చరిత్రను ఒకప్పుడు సొఫాక్లిజ్, యురిపిడిస్ వంటి గ్రీకు ప్రాచీన సాహిత్యకారులు అద్భుతంగా అక్షరీకరించారు.  సాహిత్యకౌశల్యంలో, వస్తువివేచనలో, అభివ్యక్తి గాఢతలో వారెవరికీ తీసిపోని రీతిలో మన ప్రబంధ సాహిత్యం నిలబడింది.  పాతదని మనమే పక్కన పెట్టేసుకుంటున్నాం. వజ్రాలు పాతవైతే మాత్రం ఆ వెలుగు ఎటు పోతుంది? చూసి తరించాలంటే మనమే మూసుకున్న కళ్లు తెరుచుకోవాలి. ఆ జిలుగు వెలుగులు మన కొత్త తరాల అనుభవానికి వచ్చే విధంగా ప్రదర్శించాలి.
వెయ్యేళ్ల పై బడ్ద తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధయుగాన్ని స్వర్ణయుగమంటున్నారు . ఏ విశేషాలూ లేకుండానే ముఖస్తుతిగా ఏ విమర్శకుడూ ప్రస్తుతించడు కదా! ఆ విశేషాలను ఆస్వాదించేందుకు ప్రస్తుత తరాలకూ ప్రాచీన సాహిత్యం అందుబాటులో ఉంచడం  అవసరం.
(ఎమెస్కో ప్రచురణ- అహల్యా సంక్రదనము- వాడ్రేవు చినవీరభద్రుడి పరిచయ వాక్యాల ప్రేరణతో- వారికి కృతజ్ఞతలతో ఎమెస్కో వారికి ధన్యవాదాలతో)
-కర్లపాలెం హనుమంతరావు
19 – 09 -2018
***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...