Friday, May 18, 2018

ప్రాచీన సాహిత్యమూ పరిచయం కావాలి!- వ్యాసం



వెయ్యేళ్ల పైబడిన చరిత్ర తెలుగు సాహిత్యానిది. ప్రబంధ సాహిత్య కాలం అందులో స్వర్ణయుగమంటారు. అందుకు ఒప్పుకోని వారూ ఉన్నారు. ఏదేమైనా మన ప్రాచీన సాహిత్యాన్ని గూర్చి కొద్దో గొప్పో పరిచయం ఉండటం ప్రతీ యువకవికీ అవసరమే! కానీ ఆ దిశగా ద్వారాలు ఎందుకు మూసుకున్నట్లు? సాహిత్యాన్ని ప్రత్యేక అంశంగా ఎన్నుకునే విద్యార్థులు మాత్రమే అధ్యయనం  చేసే విభాగంగా భావించడం తప్పు.
చైనా తాంగ్ రాజులను గురించి రాసిన ప్రాచీన సాహిత్యాన్ని ప్రస్తుత కమ్యూనిష్టు ప్రభుత్వాలేమీ ప్రపంచానికి కనిపించకుండా దాచేయడంలేదు. రాజులకు సంబంధించిన ఈర్ష్య, అసూయ, మదం, మాత్సరాలకు చెందిన కథలే కదా అని షేక్స్పియర్ సాహిత్యాన్ని ఆంగ్లేయులు 'ఓన్' చేసుకోకుండా వదిలేసిందిలేదు. పెద్ద కులాలకు చెందిన వ్యవహారల పట్ల శ్రద్ధ ఎక్కువగా చూపించిన 'పుష్కిన్' సాహిత్యాన్ని మాక్సిం గోర్కీ 'ఆరంభాలలకే ఆరంభం'గా ప్రస్తుతించాడు. సంగం రాజుల కాలంలో వర్ధిల్లిన పంచకావ్యాలను తమిళులు తమ సంస్కృతికి చిహ్నంగా సగర్వంగా చెప్పుకుంటారు ఇప్పటికీ. మన దగ్గరే ఎందుకో ప్రాచీన సాహిత్యం మీద అర్థంలేని  చిన్నచూపు! దురదృష్టం.
కవి భావజాలంతో కావ్యాన్ని తుల్యమానం చెయ్యడం వల్ల వచ్చే ఇబ్బందులు ఇవన్నీ! కవి వ్యక్తిత్వాన్ని అతను సృజించిన  కావ్యం ద్వారానో, కావ్య నైపుణ్యాన్ని అది  సృజించిన కవి వ్యక్తిత్వం ద్వారానో అనుశీలించడం ఉత్తమ సాహిత్య విమర్శ అనిపించుకోదు. రాజాశ్రయాలలో జీవిక సాగిస్తూ సృజనను ఒక వృత్తిగా కొనసాగించే కవులు కొన్ని వత్తిడుల మధ్య, అవసరాల దృష్ట్యా కావ్యరచన సాగించే సందర్భాలు కద్దు. కాబట్టి కవి వ్యక్తిత్వాన్ని ఆ కావ్యం ద్వారా అనుశీలించడం సరికాదు.
ఎంతటి ప్రతిభా వ్యుత్పత్తులున్న కవి అయినా రాసేది రాజుల కథలే అయినప్పటికి తన కాలంనాటి సామాజిక పరిస్థితుల ప్రభావం నుంచి పూర్తిగా వైదొలగి రచన సాగించలేడు. 15 వ శతాబ్దం నాటి శ్రీహర్షుని నైషధాన్ని శ్రీనాధుడు 'శృంగార' నైషధంగా ఎందుకు పేర్కొన్నాడో, 16 వ శతాబ్ది నాటి రాజు శ్రీకృష్ణదేవరాయలు తన 'ఆముక్తమాల్యద'లో'తృణీకృతదేహుడు' అయిన మాల దాసరి పాత్రను ఎందుకు అంత ఉన్నతంగా చిత్రీకరించాడో అర్థం చేసుకోవాలంటే ఆనాటి సాంఘిక, తాత్విక, చారిత్రక జ్ఞానమూ కొంత అవసరం.  సాహిత్య విమర్శంటే కేవలం కావ్యలక్షణాలకు, కవి వ్యక్తిత్వానికి, అలంకార శాస్త్రానికి, వ్యాకరణ శృంఖలాలకు మాత్రమే చెందింది కాదు. కవి, కావ్య కాలాలనాటి చారిత్రిక, తాత్విక, సాంఘిక ధోరణులను సైతం పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే ఆ అనుశీలన కవికి, కావ్యానికి న్యాయం చేసేది. తెలుగులో ఈ తరహా సాహిత్య విమర్శలు ఇంకా పారంభదశలో అయినా ఉన్నాయా అని అనుమానం.
యూరోప్ సాంస్కృతిక పునరుజ్జీవన నిర్మాతల్లో ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ ఒకరు. ఆయన చిత్రకళను గూర్చి పరిశీలిస్తూ ఒక విమర్శకుడు 'డావిన్సీ సమస్య ఒక్క మానవత్వ మహిమను చిత్రీకరించడమే కాదు.. ఆ సృజనను పది కాలాలపాటు ముందు తరాలూ ఆస్వాదించే విధంగా పదిలపరిచడం ఎలాగు అన్నది మరో సమస్య' అంటాడు. ఏ కళాజీవీ తన సృజన కాలానికి ఎదురీది కలకాలం  చిరంజీవిగా నిలబడాలన్న తపనతోనే పని ప్రారంభిస్తాడు. అందుకు తగిన విధానాలనే ఎంచుకొని అనుసరిస్తాడు. ఉదాహరణకు సముఖం వేంకట కృష్ణప్ప నాయకుడి 'అహల్యా సంక్రందనము' తీసుకుందాం.
'మగనాలొకతె చాపల్యమున పర పురుషు నాదరించినది. ఆమె అహల్య. ఆమె కథ ఈ అహల్యా సంక్రందనము'. జారిణి అయినా ఆ అహల్య పంచకన్యలలో ప్రధమగణ్యగా ఆదరించబడింది! స్త్రీకి సౌశీల్యమే సహజాభరణంగా  స్థిరీకరించబడిన  సమాజంలో ఈ వైరుధ్యం ఏ విధంగా సాధ్యమైనట్లు? పతివ్రతా శిరోమణులు ఎందరో ఉండగా కవికి సందేహాస్పద శీలవతి అహల్య కథ మీదే ఎందుకు దృష్టి మళ్లింది? అహల్య జారత్వానికి ఇంద్రుడి మీద ఆకర్షణ కారణమంటారు.  తైత్తరీయారణ్యకంలో మరి ఈ ఇంద్రుణ్ణే యాగశాలకు ఆహ్వానించే సందర్భంలో '.. అహల్యాయై జార..'  అని వేదమంత్రోక్తంగా ఆహ్వానిస్తారు! ఈ రకమైన విరుద్ధ భావాలను సమర్ధవంతంగా సమన్వయించుకొనే మేధో సామర్థ్యాన్ని మెరుగుపరుచుకొనేందుకైనా అన్ని రకాల భావజాలాలతో.. అవి  ప్రాచీనమైనవైనా సరే..  పరిచయం అవసరం.
దేహాన్ని నిరాకరించిన ధార్మాలు ఒక పక్క,  దేహధర్మమే ప్రధానమన్న భావజాలం మరో పక్క .. విరుధ్ధమైన భావజాలాల మధ్య కవులు కావ్యరచనలు కొనసాగించవలసిన అగత్యం నేటికన్నా రాజరికానిదే గుత్తాధిపత్యంగా సాగిన కాలంలో మరింత ఎక్కువగా ఉండేది. దైవం, ధర్మం, దేహం.. కవికి మూడు వైపులా తలుపులు బార్లా తెరిచి  'రా.. రమ్మ'ని ఉబలాట పెట్టినప్పుడు ఏ కవికి ఆ కవి తన అవసరాలు, వ్యక్తిత్వం,  అగత్యాల దృష్ట్యా ఏదో ఓ మార్గం ఎంచుకొని ముందుకు సాగిన మాట నిజం. కవి తొక్కిన దారి సరే.. తొక్కవలసిన పరిస్థితులు.. నడిచిన దారిన కవి  ప్రదర్శించిన ప్రతిభా వ్యుత్పత్తులు .. సర్వం సమగ్రంగా తుల్యమానం చేయడం సరయిన సాహిత్యదర్శనం అవుతుంది. అది మానేసి.. ఈనాటి జీవిత విలువల ఆధారంగా ఆనాటి కవులను, వారి కావ్యాలను బేరీజు వేయడం సరికాదు. కొత్త కవులకు వాటిని దూరంగా ఉంచడం అంతకన్నా సబబూ కాదు.
దేహానికి, దైవానికి జరిగిన భీకర సంగ్రామ చరిత్రను ఒకప్పుడు సొఫాక్లిజ్, యురిపిడిస్ వంటి గ్రీకు ప్రాచీన సాహిత్యకారులు అద్భుతంగా అక్షరీకరించారు.  సాహిత్యకౌశల్యంలో, వస్తువివేచనలో, అభివ్యక్తి గాఢతలో వారెవరికీ తీసిపోని రీతిలో మన ప్రబంధ సాహిత్యం నిలబడింది.  పాతదని మనమే పక్కన పెట్టేసుకుంటున్నాం. వజ్రాలు పాతవైతే మాత్రం ఆ వెలుగు ఎటు పోతుంది? చూసి తరించాలంటే మనమే మూసుకున్న కళ్లు తెరుచుకోవాలి. ఆ జిలుగు వెలుగులు మన కొత్త తరాల అనుభవానికి వచ్చే విధంగా ప్రదర్శించాలి.
వెయ్యేళ్ల పై బడ్ద తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధయుగాన్ని స్వర్ణయుగమంటున్నారు . ఏ విశేషాలూ లేకుండానే ముఖస్తుతిగా ఏ విమర్శకుడూ ప్రస్తుతించడు కదా! ఆ విశేషాలను ఆస్వాదించేందుకు ప్రస్తుత తరాలకూ ప్రాచీన సాహిత్యం అందుబాటులో ఉంచడం  అవసరం.
(ఎమెస్కో ప్రచురణ- అహల్యా సంక్రదనము- వాడ్రేవు చినవీరభద్రుడి పరిచయ వాక్యాల ప్రేరణతో- వారికి కృతజ్ఞతలతో ఎమెస్కో వారికి ధన్యవాదాలతో)
-కర్లపాలెం హనుమంతరావు
19 – 09 -2018
***

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...