Monday, February 11, 2019

అమ్మోరు .. రావాలి వన్స్ మోర్!-గ్రామసీమల సంస్కృతి



గ్రామాల రూపం మారినా గ్రామాచారాలు కొనసాగుతున్నాయ్ ! ఊరికో గ్రామ దేవత.. ఊరంతా ఆమె ఇల్లు. పాడిపంటలు, నీటి వనరులు, నీతి అవినీతి ఆమె బాధ్యతలు. దారి తప్పితే  శిక్షతప్పదు.పెద్దా చిన్నా లేదు  ప్రేమాభిమానాలకు. పిల్లలు, స్త్రీలు, ముదుసలులు, వైకల్యం ఉన్న వాళ్ల మీద పిసరంత పక్షపాతం ఎక్కువ. కోపం వచ్చినా, ప్రేమ కలిగినా ప్రకృతి ద్వారానే ప్రకటిస్తుంది. ఆ సూచనలు మాతంగి మాటగా  ముందే  హెచ్చరిస్తుంది. భారతీయ .. ద్రవిడ.. గ్రామీణ సంసృతి ఇది. శతాబ్దాలబట్టి కొనసాగే ఈ విశ్వాసాలను ఏకమొత్తంగా నేలమట్టం చేయడం ఎంత బలమైన ఉద్యమం వచ్చినా  సాధ్యం కాని పని. లౌకిక భావజాలం మీద విశ్వాసం కలిగి ఉన్న రాజకీయ పక్షాలు ఈ భారతీయ ద్రవిడ సంస్కృతి విశిష్టతను అవగాహన చేసుకోక తప్పదు.  గ్రామదేవతల అనుగ్రహాలకని జానపదులు ఏటేటా కొలుపులు చెయ్యడం తప్పనిసరిగా భావిస్తారు. రక్తపానం, ఆసన సేవనం ఆమ్మతల్లులకు  ఇష్టం. అమ్మ కొలుపులకు బ్రాహ్మలు పనికిరారు. కుమ్మరి విగ్రహం చేస్తే, చాకలి బలిపీఠం దగ్గరకు చేరుస్తాడు. ఈడిగ మనిషి పసుపు కుంకుమలతో అలంకరిస్తే, మాల మాదిగలు ఊరేగిస్తూ వేటపోతును బలిస్థలికి చేరుస్తారు. బానల నిండుగా కల్లు అందించే పని ఈడిగలదే. బోనాలు వండి పంపే బాధ్యత ఊరిపెద్దలది. ఆసాదులు అమ్మవారి మీద పాటలు పాడటం, మాతంగి నృత్యాలు చేయడం కాలానుగుణమైన మార్పులతో ఆ సందళ్లన్నీ పూర్వం కన్నా ఇప్పుడు పటాటోపంగా జరుగుతున్నాయ్. ఓటు బ్యంకు రాజకీయాల్లో ఊరి దేవతలు సైతం మిగతా అన్నింటి మల్లేనే పావులుగా మారిపోయారు. పోతు వేటతో మొదలయ్యే బలి తతంగం ఊరివాళ్లు తెచ్చిన సన్నజీవాల హతంతో కొనసాగుతుంది చాకళ్ల ఆధ్వర్యంలో. చంపిన పోతు నోట్లోనే దాని కాలు కుక్కి, నెత్తురు బోనాలతో సహా కమ్మరిచేసిన చెక్కబండి మీద ఊరేగింపు జరుగుతుంది. కల్లు తాగి చిందులేస్తూ కొమ్ము బూరాలు, తప్పెట్లు చేసే కోలాహలం  అంతా ఇంతా కాదు. ఎంత సందళ్లు సాగుతున్నా నెత్తురు కలిపిన బోనాన్ని 'పొలి.. పొలి ' అంటూ పొలికేకలు పెడుతూ ఊళ్లో వెదజల్లేటప్పుడు అంతా నిశ్శబ్దం! అమ్మోరి మీద ఉండే భక్తి అలాంటిది మరి! బలి పశువుల పేగులు నోట కరుచుకుని పొలి ఊరంటా జల్లేవారు మాల మాదిగలు. కొన్ని చోట్ల కొన్ని పద్ధతుల్లో కాలాన్ని బట్టి మార్పులు జరుగుతున్నా.. ఈ రకమైన కొలుపులు, జాతర్లలో ఇప్పుడు ముఖ్యమంత్రులు, ముఖ్యమైన మంత్రిపుంగవులు  సైతం నెత్తి మీద  బోనాలు మోస్తూ కనిపిస్తున్నారు. ప్రజాస్వామ్యం.. ప్రజల మనసుల్ని గెలుచుకోవాలంటే ఈ రకం టక్కు టమారా విద్యలు తప్పనిసరి అన్నట్లు సాగుతున్నాయ్  సెక్యులర్ స్టేట్ గా మనం గొప్పలు పోతున్న ఈ దేశంలో! గ్రామదేవతల  మీద భయభక్తులతో అన్ని కులాలవారు అంత ఒద్దికగా గ్రామదేవతలకు పూజాపునస్కారాలు చేసుకునే ఈ నిజమైన సెక్యులర్ సమాజంలో పెద్ద  కులాలవారు(కమ్మ, రెడ్డి .. ఇప్పుడు కొత్తగా కాపులాంటి) తమ తమ కులాల పాలన ఆధిపత్యాల  కోసం నీతి. అవినీతి, సామాజిక న్యాయం.. అన్యాయం, వరసావావి వంటి కట్టుబాట్లలో కూడా చిచ్చు పెడుతున్నారు. దైవదూతలమని భేషజాలకు పోయే బ్రాహ్మల వంటి కులాలు మధ్యదళారులుగా మారి మరింత భ్రష్టు పట్టిస్తున్నారు. తమకు జరిగే అన్యాయాన్ని ప్రతిఘటించాల్సింది పోయి అసలే అనైక్యంగా ఉన్న ఉత్పాదక వృత్తులవాళ్లు తమలో తాము మరింత పేచీలు పెట్టుకుంటో రొట్టె ముక్కను మళ్ళీ పెద్ద కులాలవాళ్ల నోటికి నేరుగా అందిస్తున్నారు. కులాల కుమ్ములాటలకు తోడు ఇప్పుడు అదనంగా మత దుర్రాజకీయాలూ తోడై సామాజిక ప్రజాస్వామ్య పాంచాలికి   బహిరంగ వస్త్రాపహరణ జరుగుతోంది. ప్రజాస్వామ్య పితామహుల మౌనం మరింత చేటు తెస్తోంది. ప్రకృతి ఉత్పాతాలనుంచి రక్షిస్తుందని విశ్వసించే అమ్మోర్లయినా ఇహ కన్నెర్ర చేయాలి కదా! సునామీలు, క్షామాలు , అంటురోగాలకన్నా ఎక్కువ చేటు ప్రజాస్వామ్యానికి వ్యక్తుల వరకే పరిమితం కావాల్సిన ఈ మతం, కులం విశ్వాసాలు! 
-కర్లపాలెం హనుమంతరావు

Sunday, February 10, 2019

దేవునిబిడ్లు (కత) సడ్లపల్లె చిదంబరరెడ్డి



- ** ** ** మీరు దీన్ని నిజమన్నా అనుకొండి! అబద్దమన్నా అనుకొండి!!అది మీ ఇష్టం!! నేను పెద్ద బుక్కులు సదవ లేదు.నోరు తిరగని పరాయి మాట్లు నేర్సలేదు. అన్నీ సదివి గడ్డాలు,మీసాలు నెర్సినోళ్లు ఏమి రాతలు రాసిండారో !ఏమి కూతలు కూసిండారో నాకి అసలుకే తెలీదు. ఈ జనాల్నంతా సూస్తావుంటే,ఇంతకు ముందు జరిగిన సంగతంతా ఒగసారి మీకు సెప్పుదామనిపిస్తావుంది. యనకటికి దేవునికి--ఆయప్ప లోకంలోని దేవాను దేవతల నంతా సూసి,వాళ్ల యవ్వారాలన్నీ ఇని శానా బేజారయి  పాయనంట!'తూత్.. ఏమిరా ఈళ్ల పాడు బుద్దులు, గలీజు పన్లు. అంతా సెడి సెన్నూరు తిప్పలు పట్టిండారు. ఈళ్లని సక్క జేసేకి నా శాతగాదు. ఇంగొగ కొత్త లోకం ఏర్పాటు సేస్తే బాగుంటాదీ అని మనసులోనే అనుకొన్నంట. అనుకోనుందే తడువు సంగటి ముద్ద మాదిరి ఒగ గోళాన్ని తయారు సేసి, పైన్నుండి ఆకాశంలోకి పారేశనంట. అది గిర్ర్ న బంగరం మాదిరీ తిరగ బట్నంట. 'తోకెనక నారాయణా' అని దేవుని సుట్టూ తిరుగుతా వున్నంట. అపుడు దేవుడు కొన్ని బొమ్మలు తయారు సేసి రూపాలు ఇంగడిచ్చి దోసిట్లోకి తీసులోని, వాటి నోట్లోకి సుక్కుడు సుక్కుడు ప్రాణం పోసినంట. అపుడు ఆ బొమ్మలు గుడ్లలోనుండి బయటికొచ్చిన కోడి పిల్లల మాదిరీ దేవుని సేతుల్లో బిలబిల తిరగబట్నంట. దేవుడు రవ్వంత సేపు ఆ జీవుల్ని అట్లే సూసి మాటలు నేర్పిచ్చి "మనుషులు" అని పేరు పెట్నంట. "ఈ దినం నుండి మీరు బొమ్మలు కాదు. జంతువులూ కాదు. బంగారట్లా ఆలోశన సేసే మనసున్న మనుషులు. మీరంతా ఆ గోళం మీదికి దుమికి హాయిగా బతుక్కో పోండి" అని సెప్పెనంట. ఏడిదీ ఆదారం లేకుండా గిర్ గిర్ న యంత్రం మాదిరీ తిరుగుతా వుండే దాన్ని జూసి వాళ్లు బయంపడిరంట. ఏమి సేయల్లో తెలీక, నిలువు గుడ్లేస్కోని, బిర్ర బిగుసుకోని నిలబడి పాయరంట. దేవుడు వాళ్లకి శానా సెప్పు సూసినంట."ఒరే! అది బూమిలోకము. మీకోసరం కన్నగసట్లూపడి తయారు సేసిండాను. ఆ తావకి సేరుకోని మానాలుండే మానవ లోకం తయారు సేసుకొండి" అని గడ్డాలు పట్టుకోని అడుక్కోని సిలక్కు సెప్పినట్ల సెప్పినంట. అయినా వాళ్లెవురూ ఇనలేదంట. అపుడు దేవునికి కోపము నసాళానికి ఎక్కినంట. "ఇదిగో నేను కండ్లు మూసుకోని, మూడంకెలు లెక్కబెట్టే లోపల ఈట్నుంచి ఎల్లిపోవల్ల. పోకుంటే మిమ్మల్ని ఏమి సేస్తానో నాకే తెలీదు." అని కండ్లకొద్దీ కోపం సేసుకోని కండ్లు మూసుకొన్నంట. 'ఆత్రగాడికి బుద్ది మట్టు ' అన్నట్ల యనకా ముందూ సూడకుండా ఒగడు బిర్న బూమిలోకం మీదికి 'ధఢుం' న దుమికి పారేశనంట. వాడు ఎర్రోని మాదిరీ బూమ్మీదికి 'ధభాల్ 'న పడింది సూసి మిగిల్నోళ్లు ఎర్సుకోని, గడగడ్న అదురుకోని దేవుని నోట్లోకి,ముక్కులోకి,సెవుల్లోకి...ఇట్ల యాడ సందుంటే ఆడ దూరి దాచి పెట్టుకొన్న్రంట!! మూడంకెలు లెక్కబెట్టేది అయినంక, దేవుడు కండ్లు తెర్సి సూస్తే దోసిట్లో ఎవరూ లేరంట! బూమ్మీదికి తొంగి సూసెనంట. ఒగడు మాత్రం సీమిడిలో తగులుకొన్న ఈగ మాదిరీ బూమ్మీద పడి తనుకులాడ్తా వుండాడంట. మిగిల్న జనాలు ఏమై పాయిరప్పా!! అని దేవుడు బూమండలమంతా అంజనం ఏసినట్ల ఎదికినంట. యాడా కనిపిచ్చలేదంట. "నేను పుట్టిచ్చిన జనాలు నాకే టోపీ ఏసి, నా కండ్లకే కనిపిచ్చకుండా యాటికి మాయమై పాయిరప్పా??" అని సందేహం పడినంట. ఇంగొగసారి దుబిణీ ఏసి ఎదికినట్ల బూమండలం ఒగపక్కనుంచి అంగుళమంగుళమూ గాలిచ్చినంట. అయినా కనిపించలేదంట. సివరాకరికి-- "ఈళ్లు కంటి పాపలకి తెలీకుండా కన్ను రెప్పల్ని కత్తిరించే రకం మాదిరీవుండారు" అని అనుకోని, బయటి సూపులు సాల్జేసి, అంతరంగం లోనికి తొంగి సూసుకొన్నంట. యపుడయితే దేవుని సూపులు,దేవుని లోపలికి ఎలుగులు మాదిరీ జొరబడ్నో.. అవుడు వాళ్లకి బయ్యమయి పాయనంట. కన్నాల్లో దూరుకోనుండే యలకలకి, ప్యాడపిడకల్తో ఊదర బెడితే యట్ల అవి బయటికి ఉరికెత్తుకొస్తాయో అట్ల భగమంతుని శరీరములోని సందుల్లో నుంచి సర్ న బయటికొచ్చిరంట. అపుడు దేవుడు వాళ్లని సేతుల్లోకి తీసుకోని "ఒరే! తప్పుడు నా కొడుకులూ!!నేను మీకు సెప్పిందేమి? మీరు సేస్తావుండేదేమి??"అని నొటికొచ్చినట్ల తిట్టి పారేసినంట. దానికి వాళ్లు "స్వామీ! మాన్నబావా!! మమ్మల్ని ఈడ పుట్టిచ్చి ఆడ పారెస్టే, యట్ల బతకల్ల? బతికే తత్వం తెలిసేదంకా నీ అంగాల్లో సేరుకోనుండి, పరాన్న జీవులమాదిరీ బతుకుతాము" అని మొర పెట్టుకొనిరంట. అపుడు దేవుడు తలతలే కొట్టుకోని "ఈ దేవలోకం సూస్తే అంతా మోసగాళ్లు. జనాలందర్లోనా లేని పోని బయాలు పుట్టిచ్చి--యాగాలూ, నోములూ, పూజలూ, శాంతులూ, వాస్తులూ, దానాలూ … ఇట్లా అర్తంపర్తం లేని పనుల్ని సేపిచ్చి కూకోని తినేదానికి రుసిమరిగిండారు. బతుకనేది మర్సి నాటకాలే జీవితమన్నట్లు తయారయ్యిండారు. యన్ని ఉపదేశాలు సేసినా ఈ సెవిలో యిని ఆ సెవిలో ఇడిసి పెడతావుండారు. దాని కోసరమే--- దేవలోకమోళ్లు సూసి సిగ్గుపడే రకంగా బూమిలోకం తయారు సేస్తాము అనుకొంటి. మీరు సూస్తే ముంతడు నీళ్లకే ముక్కు మూసుకొనే ముదనష్టం నా కొడుకుల మాడిరీ వుండారు!" అని మనసులోని బాధనంతా యళ్లగక్కినంట. భూమి లోకంలోనికి వాళ్లనట్ల తొంగి సూడమనినంట. *** **** *** *** ***** **** యాడసూసినా పచ్చపచ్చగా వుండే అడవులు. తళతళామెర్సే కొండలు, గుట్టలు. గలగలా పార్తావుండే ఏర్లు. వంకల్లో పిళపిళా ఈదులాడ్తావుండే సేపలు. బక్కల్లో బెకబెకా అరుస్తావుండే కప్పలు.సెట్లమీద కిలికిలా అరుస్తావుండే గువ్వలు. కసువు మేసుకొంటా బుడుగుబుడుగున ఎగురులాడతావుండే జింక పిల్లలు.పట్పట్న రెక్కలు కొట్టుకోని ఎగుర్తావుండే పక్షులు.సర్ న జారి పోతావుండే పాములు. కొమ్మల మింద ఎగిరి దుముకుతావుండే కోతులు. కండ్లకి ఆనందం తినిపిచ్చి శబ్దమే లేకుండా గాళ్లో తేలి పోతావుండే ముత్యాలమ్మ పులుగులు (సీతాకోక చిలుకలు) ఇట్ల ఒగిటిగాదు రెండుగాదు, బూమండలమంతా అందాలు ఒలకబోసి అలికి ఇంపుగా ముగ్గులు పెట్టినట్ల వుంది.దాన్ని సూసి వాళ్లు శానా ఆనంద పడిపాయిరి. అఫుడు దేవుని దిక్క తిరిగి "స్వామీ! ఘడియ ముందు సూసు నపుడు భూమండలం ఎండుకు పోయిన సంగటి ముద్ద మాదిరీ, తిరుమల పూజార్లకి సిక్కిన బక్తాదుల తలకాయ మాదిరీ నున్నగా ఉండింది కదా?? ఇంత బిరీన మా కండ్లు పట్టనంత అందం యాట్నుంచి వొచ్చె??" అని అడిగిరంట. అపుడు స్వామి "దేవలోకంలో ఒగ నిమిషమైతే ఆడ భూలోకంలో ఒగ యుగము. ఈడ కత్తిరించుకోనే గిలీటు గాళ్లు. ఆడ కష్టం సేసి బతికే కల్మషంలేని జీవులు" అన్నెంట. "అంటే వాళ్లెవురు స్వామీ??" అని అడిగిరంట. అపుడు స్వామి 'ఈళ్లు నాన్న సేతికి నామాలు పెట్టి నాన్నా నాగుబాము అనే రకం జాతోళ్లమాదిరీ వుండారు ' అని అనుకోని "కండ్లు ఇగ్గబీకి సూడండ్రా" అని అర్సినంట. అపుడు సూస్తే తలకాయకి బట్ట సుట్టుకోని, నడుంకానా పంచెగ్గట్టుకోని, ఆడా మగా పిల్లా జల్లా ముసలీ ముతకా అనకుండా ఎద్దుల్తోను, ఎనుముల్తోను, ఆవుల్తోను భూమిని దున్నతా వుండారంట. యండ, వాన, పగలు, రాత్రి అనేదే మర్సి పంటలు సాగుజేసి అందరి బతుకులకీ అన్నం పండి పెడ్తావుండారంట. వాళ్లకి భూమే ఒగ యగ్న గుండమంట . పంటలు పండిచ్చేదే ఒగ యాగమంట. మనిషంటే పనంట. పనంటే మనిషంట. కాయకష్టం సేయకుండా బతికే బదులు సచ్చేదే మేలు అనుకోనే రకమంట. అట్లా జనాన్ని సూసిన దేవునిబిడ్లు, దేవునిగ్గూడా సెప్పకుండా భూమ్మీదకి సేర్రంట. ఈళ్లూ,రైతులూ కల్సిన భూలోకం శానా బాగుంటుదని మీరనుకోవచ్చు. అట్లనుకొంటే మీరు సదువు నేర్సి సెడినోళ్లకిందే లెక్క!! యాలంటే "ఒరే !!మేము దేవుని బిడ్లు. నేను దేవుని నోట్లో నుంచి వొచ్చిండాను, నాకాకలయినవుడు నా నోటికి అన్నం అందించేది నీపని" అని ఒగడు. "నేను సెవుల్లో నుంచి వొచ్చిండాను, నేను సెప్పినట్ల ఇంటే నీకి పుణ్యమొస్తుంది" అని ఒగడు. "నేను కాళ్లలోనుంచి పుట్టిండాను, నా కాళ్లకిమొక్కి పూజలు సేస్టే స్వర్గలోకం అందుతుంది" అని ఒగడు."నేను దేవుని కండ్లలో నుండి వొచ్చిండాను నేను సెప్పిన టయానికి ఇల్లుగట్టి,పెండ్లి సేసుకో,నువ్వు నూరేండ్లు బతుకుతావు"అని ఒగడు... ఇట్ల కష్టజీవులమింద దాదాగిరీ సేసుకొంటా,కండ్లకి గంతలుగట్టి గానుగ తిప్పే ఎద్దుల మాదిరీ సేసి కాడిచ్చుకోని తింటావుండారు!! ఇంతకు ముందయితే దేవుడు భూలోకానికి అపుడపుడు వొచ్చి సూసి పోతావుండే!! దేవుని లోకం మాదిరీ భూలోకంగూడా యఫుడు సెడి పాయనో!!అపుడు ఆయప్ప వొచ్చేదే ఇడిసి పెట్టిండాడు.అందుకే ఈ లోకంలో దేవునిబిడ్లు ఆడింది ఆట! పాడింది పాట!! అయి జరిగి పోతావుంది
-సడ్లపల్లె చిదంబరరెడ్డి

చెత్త చెత్త చట్టాలు!- సూర్య దినపత్రిక వ్యంగల్పిక- -జి.ఎస్.దేవి





ఇజ్రాయిల్లో పుచ్చకాయలు బహిష్కరించారు ఒకానొకప్పట్లో. అయినా ఏ నిందలపాలూ కాలేదు అక్కడి ప్రభుత్వాలు అప్పట్లో. అదే మన ఇండియాలో అయితేనో? పాలుపోసే
సాంబయ్య చెంబులో  నాలుగు చుక్కల నీళ్లెక్కువ కలిపినా  పాలకులదే ఆ
పాపభారమంతా! ఇండిగో విమానం ఫర్ సేల్ కని వచ్చినప్పుడు చూసాం గదా ఆ కనీ
వినీ ఎరుగని గోల!
నార్త్ కొరియాలో నో మెక్డొనాల్డ్ అన్నారింకోసారి.  నారికేళాలతో
సరిపుచ్చుకున్నారే తప్ప నోరెత్తి..   ఒక్క బక్కజీవైనా గద్దించలేదెవర్నీ!
అదే ఇక్కడయితేనా? ఖాళీ మందు గళాసులతో నడిరోడ్ల మీద కొచ్చిపడి చేసే గలాటా
అంతా  ఇంతానా! పాక్షిక మద్యపానమైనా సరే.. సంపూర్ణంగా నిషేధించిందాకా
బీహార్ నితీష్ బాబును  నిద్రపోనిచ్చిందా  దేవదాసుల బృందం!
మరీ అంత చుక్క మీద నాలుక పీకితే ఇంచక్కా  ఐర్లాండు పోతే సరిట! అక్కడ ఏ
పరీక్ష రాసే నెపంతోనో  హాల్లో చేరగిలబడి బల్ల మీదో కత్తి గుచ్చేస్తే
ఫినిఫ్! ఫ్రీగా పీకల్దాకా ఎన్ని పింటులైనా తాగేసేయచ్చు! విధ్యార్థులైనా
సరే.. టెస్టులు రాసేటప్పుడు నోట్లో గొట్టాలు గట్రా పెట్టే టైపు ఆల్కహాల్
టెస్టులు చట్టవిరుద్ధంట అక్కడ!
అంత కన్నా చెత్త చట్టముంది ఓరేగావ్ అని ఓ మరో చిన్న ఊర్లో! ఎంత వరకు
నిజమో తెలీదు కానీ.. అచ్చోట బళ్లల్లో ఆడపిల్లలు  ముచ్చటకైనా అచ్చోసిన
లేగదూడల్లా జుట్టూ జుట్టూ పట్టుకు కొట్టేసుకోడం నేరం. ఆ తరహా చట్టం మన
దగ్గర సర్దాకోసమైనా పెట్టి చూడండి! టీవీ చర్చల్లో ఒక్క పురుగైనా
కనిపించదు. చట్టసభల్లో   పోటీకి  ఒక్క శాల్తీ  అయినా సిద్ధపడుదు.
గ్యారంటీ!
మిన్నెసోటా అనే మరో చోట మగాళ్లు గడ్డాలు గీక్కోడం నేరం.  నెబ్రాస్కా అనే
ఇంకో వింత ప్రాంతంలో  పబ్లిక్ షేవింగులకు చట్టం అడ్డం. మన దగ్గర బాహాటంగా
తలలు తెగతరుక్కుంటున్నా రక్షకదళం ఆ తరహా సిల్లీ గలాటాల జోలికి ఛస్తే
పోదు.. నరికే శాల్తీ ఏ పెద్దమనిషి తాలూకూ సరుకు కాదని తేలే వరకు!
థాయ్ లాండులో అండర్ వేర్ లేకుండా అపార్టుమెంటు గ్రౌండులో కూడా
కనిపించకూడదు.  ఇండియాలో ఆ మాదిరి బండచట్టాలేం పనిచేస్తాయ్? బంజారా,
బూబ్లీ, ఫిల్మ్ నగర్ పరిధులయినా సరే.. నో ప్రాబ్లం! ఎంత జాలీగా
బజార్లల్లో పడి బడితెప్రొటెస్టులు చేసుకుంటే అంత హ్యాపీగా పాప్యులారిటీ
ప్లస్సయిపోతుంది! పది హిట్ మూవీలల్లో తన్నుకులాడి చచ్చినా  పట్టించుకోని
జనాలు ఒక్క పావుగంట వైరల్ వీడియోతోనే  నీరాజనాలు పట్టేస్తారు
వెర్రెత్తిపోయి!
ఇండియన్ పీపుల్ ఎంతో  లక్కీ! ఊటా లోలా  ఆలి కారూ గట్రాలు బైటికి తీసి
షికారుకని బైలుదేరితే ఎర్ర పీలికోటి చేతపట్టి మొగుడనేవాడు ముందు
నడవనక్కర్లేదు.
మిన్నెసోటాలో మరీ సోద్దెం! వంటి మీదొక్క నూలు పోగైనా లేకుండా కంటి మీదకు
కునుకు రాకూడదు. కాదంటే తెల్లారిసరికల్లా పళ్లు తోముకొనేది జైలు
ఊచలకవతాలే సుమా!
అన్నట్లు రోజులో రెండోసారి పళ్లుతోమేందుకు ప్రయత్నిస్తే పోలిసోళ్ళొచ్చి
పట్టుకుపోతారుట  రష్యాలో! ఇదాహో అని మరో వింత ప్రాంతం! ఇదీ  ఎంత వరకు
నిజమో తెలీదు కానీ.. ఇక్కడ తలకు తుండు  చుట్టుకుని బైటెక్కడైనా కనిపిస్తే
తక్షణమే శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాప్తిరస్తు! మరదే  మన దేశంలో? తుండు
తుపాకీ గుండు కన్నా  పవర్ ఫుల్! మన నేతాశ్రీలేసే పగటి వేషాలెన్ని
చూస్తున్నాం! గుండు మీద తుండు, మెళ్లో ఓ  ఎర్రటి  తువ్వాలూ ఉంటే సరి..
తుక్కుజనాల కష్టసుఖాలల్లో పాలుపంచుకున్నట్లే! తిక్క లెక్క!
ఇటలీది ఇంకో ఇరగబాటుతనం! జుట్టుకు రంగేసుకోడం.. విరగబోసుకు తిరిగేయడం
అక్కడ మహా విశృంఖలత్వం కింద లెక్క! మరిక్కడో? నోట్లో పళ్లన్నీ రాలిన
పండుకోతి తాతయినా ఓకే! తలకో బెత్తెడు మందాన నల్లరంగు బెత్తి తా తై.. థక్
దిమ్.. తా తై థక్ ధిమ్ అంటూ రిథమిక్కా  ఓ రెండు స్టెప్పులేసేస్తే సరి!
అభిమాన సందోహాల ఆనంద పారవశ్యాలతో వెండితెరలన్నీ చిరిగిపోవాలి! నెత్తి మీద
ఏ రంగూ పడనందుకే   కదండీ.. పాపం అంత లావు  సీనియర్సయి ఉండీ అద్వానీజీ
అండ్ కో  రాజకీయాల్లో మాజీ గుంపులోకెళ్లి పడిందీ!
అంగోలాలో మరో రకం గోల! ఆడజీవిగా పుట్టడం శాపం అక్కడ. అడపా దడపా అయినా సరే
జీన్స్ డ్రస్సులేసుకోడం నేరం! మన దగ్గరో? నయీం లాంటి బడాచోర్లూ,
వంచకులక్కూడా చోళీ.. లంగాలే తప్పించుకొనే షార్ట్ కట్ రూట్లు. ఆడవేషంలో
అతగాడేసిన వేషాలు పక్క పాకిస్తానులో గానీ అయితేనా.. మడిచి పొయ్యిలో
పెట్టేస్తారు!
ఫ్లోరిడాలో కోడిపిల్లలు రక్షణ జాతికి చెందిన జీవాలు. తినే బొచ్చెలో వాటి
బొచ్చింత కనిపించినా చచ్చినట్లు..  మిగతా భోజనమంతా బొక్కలోకెళ్లే
బొక్కేది!
కొలొరాడో పిల్లుల  ఖర్మ! చీకట్లో మ్యావ్ మన్నా  పర్మినెంటుగా వాటి తోకలు
కట్ చేసెయ్యాలన్నది అక్కడి  చట్టం! అదే ఇండియన్ పిల్లులయితేనో? గోడల మీద
చేరడం తరువాయి.. దిగేటంత వరకూ  అలకపాన్పు మీది  అల్లుడికి మించి
మనుగుడుపులు!
ఇండోనీషియాలో, ఐస్ బెర్గ్ ల్లో కుక్కల్ని వేటాడ్డం, పెంచడం శిక్షార్హమైన
నేరంట. మన దగ్గర  అందుకు పూర్తిగా విరుద్ధం.  ఆవేశకావేశాల్లో ఏదో  కుక్కల
 మీదట్లా  కాస్తింత ఆక్రోశం వెళ్లనోసినా .. ఎన్నికల వేళొచ్చే వేళకి
ప్రధానంతటి పై  స్థాయి పెద్దమనిషి కూడా  దేశానిక్కావలి కాసే  పెద్ద కుక్క
అవతామెత్తేస్తాడు!
నార్త్ కరోలినాలో రక్తసంబంధీకలు అయినా సరే విత్ ఇన్ లా లో ఉంటే 
సనో-ఇన్-లా నో,,, డాటర్-ఇన్‌-లా నో అయుపోవచ్చు.  సొసైటీకి సైతం నో
అబ్జెక్షన్! 'ఛీఁ పాడూఁ' అంటూ అలా  ఫేసులు పెట్టద్దు! గెలిపించిన
పార్టీకే ఛీఁ కొట్టేసి మళ్లీ  మరో పార్టీ జెండా పట్టుకొనొచ్చే గో.పీ
లకు ఛీఁర్స్ కొట్టి మరీ  మనం ఓటేసి గట్టెక్కించేయడంలా ఇక్కడ!
కంప్యూటర్లో సిరిని ససవాలక్ష ప్రశ్నలడుక్కోండి! ఏ మాత్రం ఉడుక్కోదు
ఫ్లోరిడాలో! ఫ్యాక్టో కాదో! ఏదో ఫ్లోలో ఎవరైనా అన్నారో ఏమో.. తెలీదు
కానీ.. హాస్యానికైనా ఫలానా శవం ఏ గదిలో దాగుందని  దగుల్భాజీ ప్రశ్నలు
వేశారనుకోండి! వల్గర్గా మాట్లాడినందుకు ఆనక  విచారించాల్సింది   కటకటాల
వెనకాల తీరిగ్గా చేరి!   మన దగ్గర  నట్టింటి ఆడబిడ్డను  ఏ పరువు వంకనో
చిత్రహింసలు పెట్టి చంపినా ఏళ్లకేళ్లు విచారించడాలే తప్ప.. ఫట్ మని
చర్యలు చేపట్టే చట్టాలేవీ.. చిత్రం కాకపోతే!
---        ---        ---
 అబ్బబ్బ! ఆపవయ్యా సామీ! అసలే అవతల పెద్దెన్నికలు.. ఆ రవంధాళీతో  ఇక్కడ
థణుకులదిరిపోతుంటేనూ.. మధ్యనేంటి నీ సోది! వేళాకోళాలక్కూడా
వేళాపాళాలుంటాయి నాయినా! మరీ అంతలా గిలకాలని చెయ్యి సలపరంగా ఉందా?  మన
దగ్గరే  చచ్చుబండ చట్టాలు సవాలక్ష పడి ఏడుస్తున్నాయ్.. ఏళ్ల తరబడి
బక్కజీవులనదే పనిగా ఏడిపించుకుంటూ! కలేజా ఉంటే వాటి మీదనయ్యా ముందు నీ
కలం ఝళిపించాల్సిందీ! ఎక్కడో న్యూ జెర్శీ కహానీలు ఇక్కడ మనకవసరమా..
చెప్పు? చెప్పులు నేరుగా ముఖాన పడితేనే  దులపరించుకుపోయే దున్నపోతులు మన
నేతలు! అన్యాపదేశంగానే అయినా సరే.. ఇలా ఉపదేశాలకు తెగబడితే  ముందు
అన్యాయమైపోయ్యేది నువ్వే సామీ! నెట్టింట్లో టైం పాసు వరకేరా పిచ్చోడా
నువ్ చెప్పుకొచ్చే ఈ చెత్త ఊసులన్నీ! ఆ పక్కనెక్కడో ఓ మూల పడున్నదా
బుల్లి దేశం జపాన్! అక్కడ ఈడొచ్చిన ఆడబిడ్డలు నైన్ టైమ్స్ కి మించి  నై
డేటింగులకు నై అంటే డేంజర్! మొగుడు రాలగొట్టిన పళ్లైనా సరే .. మళ్లీ
కట్టించుకోవాలంటే ఆ  మొగ్గాడిద  పర్మిషనే తప్పనిసరి  పెర్మెంటోలో!
ఆర్కాన్సానా అని మరో దిక్కుమాలిన దేశం. అక్కడా తాళికట్టిన వెధవ పెళ్లాలను
చిత్తమొచ్చినంత సేపు  చితక్కొట్టుకోవచ్చంట! కానీ ఆ  కోటింగుల కోటా గాని
నెలకోటి దాటిందంటే.. ముందా   మొగుడుగాడికే పోలీసోడి బూటుతో సత్కారం! ఒక్క
సెకనుకు మించి ముద్దులాట్టం మైనే దేశం చట్టానికి గిట్టదంట!  పెళ్లాం
పుట్టిన్రోజు గాని మర్చిపోతే పోలిసోడొచ్చి లాఠీతో గుర్తుచేస్తాట్ట  నమోనా
 అనే మరో నరకంలో! ఇద్గిదిగో.. ఇట్లాంటి చెత్తా చెదారాన్నంతా ఏ నెట్లో
నుంచో కొట్టేసుకొనొచ్చేసి మన  చట్టాలను అట్లా పడేసి
వెక్కిరించేస్తున్నావ్ పెద్ద మహా!  దేశభక్తి దండు సంగరి మర్చిపోతున్నావ్
మహాశయా! నువ్వే  అదేదో కొత్తగా ఘనకార్యాలన్నీ ఆవిష్కరిస్తున్నట్లు
ఏంటబ్బాయ్ ఆ బడాయ్?   మన దగ్గర మాత్రం అంతకన్నా మహా గొప్ప చట్టాలేమన్నా
అమల్లోఉన్నాయనా నీ ఉద్దేశం? ఈడూ పాడూ చుసుకోకుండా గుళ్లూ గోపురాల
వైపుక్కూడా రావద్దని పెద్దతలలే ఎంతలా  రాద్ధాంతాల్ చేస్తున్నాయో..
చుస్తున్నావు గదా! చిన్ని చిన్ని పాపలను పాడుచేసినా ఆ త్రాష్టులు  గానీ
ఈడేరకపోయుంటే ఏ శిక్షకు పాత్రులు కాదంటున్నాయ్ నాయనా  మన దగ్గరి అమానుష
చట్టాలు! ఒకటా రెండా?  ప్రజాస్వామ్యం పేరు చెప్పి సన్నజీవాలనలా దశాబ్దాల
బట్టి సలుపుతున్న ఈ మాదిరి సన్నాసి చట్టాలిక్కడ సవాలక్ష! చెప్పుకుంటూ
పోతే రొప్పురావడమే తప్ప లాభమేంటో చెప్పు!   రాజకీయ పార్టీలకొచ్చిపడే
చందాల సొమ్ము మీద ఎవళ్ల నిఘాలు ఉండకూడదంట! అక్రమాలు విచారణలకూ,
న్యాయమెటుందో తేల్చుకునే వెసులుబాట్లకే గదా రాజ్యాంగపరంగా మనం  అన్నేసి
సంస్థలు గొప్పగా ఏర్పాటుచేసుకుందీ! ఏ ఒక్కటైనా పొరపాటునైనా పెద్దమనుషులను
టచ్ చేసే చట్టాలు  లా బుక్కులు దాటి ఎప్పుడైనా బైటకొస్తున్నాయా?   సాగు
పేరు చెప్పుకుంటే చాలంట..   దొంగాదాయం ఏ దొడ్డిదారి నుంచి వచ్చి పడ్డా
పన్నుశాఖలకా లెక్కల బొక్కలు  చెప్పుకొనే పని లేదంట!  ఓనామాలైనా ఆనమాలు
పట్టేపాటి తెలివితేటలేమీ అక్కర్లేదు! ఎన్నికల్లో  ఏ ఈవియమ్ముల్నో
నమ్ముకొనేపాటి గడుసుదనం వంటబడితే చాలు!  ఇదేంటని  తప్పట్టే
చట్టాలేమన్నా మరి మన మహాప్రజాస్వామ్య్ంలో చాలామణీలో ఉన్నాయా నాయనా?
జల్లికట్టు,  కోడి పందెం బాపతు  మూగజీవులనైనా  బలవన్మరణాల నుంచి
కాపాడుకోలేని చట్టాల పర్యవేక్షణలో స్వామీ మనం బతుకులీడుస్తున్నదీ! తలాక్
లూ, అయోధ్య గుళ్ల చుట్టూతా ప్రదక్షిణాలు చెయ్యడానికే మన చట్టాలకు ఎక్కడి
టైమూ చాలి చావడంలేదు. పైసా చేత లేని పాపర్ గాడు ఒక్కడైనా నూటపాతిక
కోట్లమంది ఇండియన్సులో నుండి  ప్రాపర్ గా చట్టసభలకెళ్లే
ప్రజాస్వామ్యంలోనే మన మివాళ ఊపిరి పీలుస్తున్నదీ? అవేవో పేర్లు కూడా
నోటికి సరిగ్గా   తిరగని చిట్టి పొట్టి ప్రాంతాలు! సత్యాలో.. అర
సత్యాలో.. ఏవీ నిర్ధారణ కాకుండానే నెట్లో జనాలు పుట్టించే
పుక్కిటిపురాణాలు! వాటితోనా  నాయనా నీ కాలక్షేపాలు? జనసంక్షేమం కోరే
చట్టాలను గూర్చి చర్చించుకునే టైమే ఇవ్వకుండా  విలువైన ప్రజల ఆలోచనా
సమయాన్నిట్లా చెత్త చట్టాల చుట్టూతా తిప్పడమే నన్నడిగితే అసలు  పెద్ద
నేరం! బక్కోళ్ల దృష్తి వాళ్ల కష్టాలు, కడగళ్ల మీంచి   మళ్లించడానికి చేసే
 ఎత్తుగలు కదా ఇవన్నీ! నాగ్గానీ ఈ సారి ఎన్నికల్లో ఏకపక్షంగా చట్టాలు
చేసేపాటి ల్యాండ్ స్లైడ్ మెజార్టీ వస్తేనా! ముందు.. బెయిలు కూడా దొరకని
వందేళ్ల కఠిన కారాగారశిక్ష వేసే చట్టం తీసుకొచ్చేస్తా ఖాయం! అంతకన్నా
ముందసలు నీ బోటి బఠానీరాయుళ్లందరి పుఠమార్చేటంద్కు ఈ
పుక్కిటపురాణాలన్నింటినీ ఎలక్షన్ కమీషన్  తరహాలో  ఏక్ దమ్ నిషేధించవతల
పారేస్తా!
హ్హా.. హ్హా.. హ్హా!  చైనాలో చదూకునే పిల్లకాయలకు గూగుల్ నిషిద్ధం!
టర్కీ పౌరలందరికీ ట్విట్టరు నిషిద్ధం!  ఒమాన్ లో ఆడంగులకు ఫేసుబుక్కూ,
ట్వట్టర్లూ రెండూ నిషిద్ధం. కతార్ లో అమ్మళ్ళకు మేకప్పు సరుకు నిషిద్ధం.
మోంటానాలో ఆడపిల్లలకు యోగా డ్రస్సులు నిషిద్ధం. రష్యాలో రోజుకు ఏడు గంటలు
మించి  నిద్ర నిషేద్ధం. కెనడాలో  పాతికేళ్ళు లోబడ్డ బడుద్ధాయిలకు బీరు
గట్రా నిషిద్ధం. ఏ నిషేధ చట్టం ఎక్కడ ఏ మేరకు సవ్యంగా అమలవుతుందో  నా
దగ్గరైతే ఇప్పటికిప్పుడు అంతగాఠ్ఠి సమాచారం లేదుకాని బాబాయ్..  మన దగ్గర
మాత్రం చట్టాలు ఎంత ఓటిగా ఉన్నాయో.. ఉన్నవి ఎంత మొక్కుబడిగా చలామణీ
అవుతున్నాయో.. ఉదాహరణలతో సహా సవివరణాత్మకంగా తెలియచేసే  బిలియన్ టిబి
డాటా ప్రస్తుతానికి సిద్ధంగా ఉంది.  బీ రెడీ! నెట్ ఓపెన్ చేసేస్తున్నా!
ఓరి దేవడో.. మా కంఠశోషే తప్ప మీ సోషల్ నెట్ వర్క్ గాసిప్పు
గాళ్లెప్పటికీ ఛస్తే మారర్రో దేవుడోయ్!
మైన్ మేటరు ఇంకా నీ ముసలి మైండుకే బోధపడ్డంలేదు పిచ్చి బాబాయో! ముందటి
సర్కార్లు చేసినవన్నీ ఎట్లాంటి చెత్త చట్టాలో సోషల్ నెట్ వర్కులెంటబడి
చాటుకోబట్టే   ఇప్పటి సర్కార్లకూ ఐదేళ్లపాటు చెత్త చెత్త చట్టాలు
చేసుకొనే ఛాన్సు దక్కింది ముసలి బాబాయో!
***

Friday, February 8, 2019

ఆచార్యదేవోభవ!



'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా. యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు.

రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది. అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. అందరూ ప్రణామాలు చేసే శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చి ఇచ్చే శ్రమ తీసుకున్నాడు.

గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు. క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు. కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా.

మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు. పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది!

నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి శాస్త్రరహస్యం పట్టుబడలేదు. బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది. 'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

గురువులు అష్టవిధాలు.
అక్షరాభ్యాసం చేయించినవాడు, గాయత్రి ఉపదేశించినవాడు, వేదాధ్యయనం చేయించినవాడు, శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు, పురోగతి కోరేవాడు, మతాది సంప్రదాయాన్ని నేర్పేవాడు, మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు, మోక్షమార్గాన్ని చూపించేవాడు
అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు. దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే జాతికైనా మేలు జరిగేది.
-కర్లపాలెం హనుమంతరావు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈనాడు,  సంపాదకౖయ పుట 05-09-2009 ప్రచురితం )
_________________________

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...