Sunday, February 9, 2020

హేతువాదం -కర్లపాలెం హనుమంతరావు



మనిషి ఆరంభంలో హేతువాదే! తెలిసిన విషయాలతో తెలీని విషయాలను తర్కించుకుంటూ సంతృప్తికరమైన సమాధానాలు దొరికే వరకు అన్వేషణ కొనసాగించడం అతని నైజంగా ఉండేది. చేతనయింది తాను  సృష్టించుకుంటున్నట్లుగానే తనకు చేతగాని వాటిని ఎవరో తన కోసం సృష్టించి పెడుతున్నారని భావించడమూ తర్కం విభాగం కిందకే కదా వచ్చేది? ఆ అదృశ్య శక్తిని అతడు దేవుడుగా భావించాడు. ఆ దేవుడి చుట్టూతా మతం అల్లుకోవడం, అదే ఒక వ్యవస్థగా వేళ్లూనుకోవడం, క్రమంగా దానిలో మౌఢ్యం ప్రవేశించడం, దానిని ఎదుర్కొనేందుకు చైతన్యంతో ప్రతిస్పందించడం.. ఈ మొత్తాన్ని ఒక ముద్దగా చూస్తే అదే మనిషి పురోగతి అనిపిస్తుంది. మౌఢ్యాన్ని ప్రశ్నించడానికి మనిషి ఎన్నుకున్న ప్రక్రియా అనాదిలో ఆరంభంలో అనుసరించిన ప్రశ్న పధ్ధతే అని మనం మర్చిపోరాదు. 'ప్రతి వస్తువును ఎవరో ఒకరు సృష్టించాలన్న సిధ్ధాంతం ప్రకారం తనకోసం సృష్టించిన వాడినీ ఎవరో ఒకరు సృష్టించి ఉండాలి కదా?' అన్నది తర్కం కిందకే వస్తుంది కదా! ఆ ప్రశ్నకు జవాబు దొరకని మతం అలా పదే పదే ఎదురు తిరిగి ప్రశ్నించేవాళ్ల మీద 'మౌఢ్యం' ముద్ర వేయకపోతే మరింత మంది బుద్ధిమంతులు ఆ ప్రశ్ననే కొనసాగించి సమాజాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెడతారని 'మతం' బెదురు. మొదటి తర్కంలో నుంచి పుట్టిన మతాన్ని అక్కున చేర్చుకున్నవారే రెండో తర్కానికి మూఢత్వం అనే లేబుల్ అంటగట్టడం.. విచిత్రం! 'ఆస్తికత్వం' అనే పదాన్ని దేవుడు పరంగా 'ఉన్నాడు'అన్న అర్థంలో తప్ప మరో విధంగా భావించడం రాని భావదాస్యత 'ఆ ఉన్నాడు అంటున్నవాడు ఎక్కడున్నాడో.. ఎలా ఉంటాడో.. చెప్పండి.. అలా చెప్పలేక పోయినా.. పోనీ ఫలానా విధంగా ఉన్నాడన్న రుజువులైనా కొద్దిగా చూపించండ'ని ఆడుగుతుంటే సంతృప్తికరమైన జవాబు ఇచ్చే పరిస్థితుల్లో లేక  'నాస్తికత్వం' అన్న పేరు తగిలించి సంఘబహిష్కరణ చేసే విఫల ప్రయత్నాలు విశ్వవ్యాప్తంగా అన్ని కాలాల్లోనూ జరుగుతున్న అకృత్యమే!
సత్యాన్వేషణకు కట్టుబడ్డ ఎంతోమంది శాస్త్రవేత్తలు.. సామాజిక తత్వవేత్తలు తమ నిబద్ధత కారణంగా ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు చరిత్ర నిండా బోలెడన్ని.
జిజ్ఞాస, తర్కం సృష్టిలో మనిషి విశిష్టతలు. ఆ రెండింటినీ అణగదొక్కడమంటే మానవజాతిని జంతుప్రాయంగా జీవించమని నిర్బధించడమే!
తెలుగు సమాజంలోని అనేకమైన లోటుపాట్లను బట్టలు విప్పదీసి మరీ ప్రదర్శించిన ప్రశ్నవేత్త యోగి వేమన. కులభేదాలతో కుళ్లిన సమాజాన్ని సంస్కరించే సదుద్దేశంతో సామూహిక భోజన కార్యక్రమాన్ని సాహసంతో తలపెట్టిన గొప్ప సంస్కర్త బ్రహ్మనాయుడు. వీరిద్దరు చూపించిన వైజ్ఞానికి, సామాజిక తర్కవాదం దారిలోనే తదనంతర దశల్లో మరిన్ని అడుగులు జాతిని ముందుకు నడిపించిన హేతువాదులు.. కొమర్రాజు లక్ష్మణరావు, కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావులు.. వారి అనుయాయులూ త్రిపురనేని రామస్వామి చౌదరి, గుర్రం జాషువా(భగవంతుడు ఉన్నాడన్న భావన ఉన్నా నిర్భయంగా నిలదీసిన ప్రశ్నవాది). రాజారామ్మోహన్ రాయ్  బ్రహ్మసమాజం, దయానంద సరస్వతి ఆర్యసమాజం, అనీబిసెంట్ దివ్యజ్ఞాన సమాజం, రాజకీయ, ఆర్థిక రంగాల పరంగా కమ్యూనిజం.. వంటి భావజాలాల మూలకంగా భారతదేశంలో హేతువాదానికి ఎప్పటికప్పుడు కొత్త జవసత్వాలు పుట్టుకొస్తూనే ఉన్నాయ్! ఎం.ఎన్.రాయ్ రాడికల్ హ్యూమనిజం దారిలోనే గోరా హేతువాద ఉద్యమం ముందుకు సాగింది. హేతువాదానికి మరో ఉద్యమ రూపంగా సమాజంలో తనదైన ప్రత్యేక ముద్ర వేయించుకొన్న గోరాని గురించి ఎంత చెప్పినా ఇంకొంత మిగిలే ఉంటుంది.
కాకినాడ పిఠాపురం రాజావారి కళాశాలలో  చేసే చేసే ఉద్యోగాన్నుంచి ఉద్వాసన పలకాల్సొచ్చింది గోరాగారికి 1933లో హేతువాదాన్ని విద్యార్థుల్లో ప్రచారం చేస్తున్నారన్న నెపంతో. బందరు హిందూ కళాశాలలో  ఏ ప్రతిబంధకాలు లేని కారణంగా విశాఖపట్నం హిందూ పఠన మందిరంలో ఏకంగా నాస్తికత్వం మీద బహిరంగ నిర్వహించారు. ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ ప్రకటించుకొని, కృష్ణా జిల్లాల్లో నాస్తిక కేంద్రం స్థాపించారు గోరా. 'నాస్తికత్వం లేక దేవుడు లేడు' అనే పుస్తకం ద్వారా ఆలోచనాపరులను కదిలించారు. హేతువాద దృష్టికి ఒక వ్యవస్థీకృత స్థాయి ఆంధ్రదేశంలో ఏర్పడేందుకు ఆ కాలంలోనే ఊపందుకొన్న ఎం.ఎన్.రాయ్ హ్యూమనిజం భావజాలం కూడా ఒక ముఖ్యమైన కారణమే!
స్వాతంత్రోద్యమం, తెలంగాణా విమోచనోద్యమాలలో నాస్తికుల పేరునే మేధావులు కొందరు పాలుపంచుకొన్నారు. స్వతంత్రం వచ్చిన తరువాత గోరాగారు విజయవాడలో నాస్తిక కేంద్రం ఏర్పాటు చేసుకొన్నారు. అక్కణ్నుంచే 'సంఘం' పేరుతో వారపత్రిక ప్రచురణ జరిగేది. అదే పంథాలో తెనాలి నుంచి రాడికల్ హ్యూమనిజం భావప్రచారానికి 'సమీక్ష' పేరుతో  మరో వారపత్రిక వెలువడుతుండేది.
మూఢనమ్మకాలను ప్రశ్నించడం, దైవాంశసంభూతులని డబ్బాలు కొట్టుకునేవాళ్ల మహిమలను బహిరంగా సవాలు  చెయ్యడం, బాబాల  అద్భుతాలుగా కొనియాడే గమ్మత్తులను నాస్తికకవాదులుగా తామే బహిరంగంగా ప్రదర్శించి చూపించడం.. ఆనక ఆ మహిమల వెనుక ఉన్న మర్మాలను  వివరించడం వంటి  చర్యల ద్వారా అభూత కల్పనలకు అడ్డుకునే ప్రయత్నాలు నిరంతరాయంగా కొనసాగుతుండేవిచర్చల సందర్భంలో మొహం చాటు చెసే సాధారణ పౌరులలో తార్కికమైన ఆలోచనలను రేకెత్తించడమే ఇలాంటి చర్యల ప్రధాన ప్రయోజనం. గోరాగారు ఒక వ్యక్తిగా కాకుండా సకుటుంబంగా ఈ హేతువాద ఉద్యమంలో పాలుపంచుకోవడం మరన్ని హేతువాద కుటుంబాలు ఏర్పడేందుకు దోహదపడింది.
నార్ల వేంకటేశ్వర్రావు, ఆవుల గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ త్రిపురనేని వెంకటేశ్వర్రావు, గౌరిబోయిన పోలయ్య, రావిపూడి వెంకటాద్రి, మల్లాది సుబ్బమ్మ వంటి మేధావుల కార్యకలాపాల కారణంగా హేతువాద ఉద్యమం  బహుళ వ్యాప్తిలో ఉండేది. ఉంటోంది.
గోరాగారు మహాత్మాగాంధీతో చేసిన చర్చలు 'An Athiest with Gandhi' పేరుతో పుస్తక రూపంలో వెలువడి.. తదనంతర కాలంలో ఆంగ్ల తర్జుమా కూడా సంఘం పత్రికలో  వెలువడింది. నాస్తికవాద ప్రచారానికి ప్రపంచ పర్యటనకు పూనుకున్న గోరా 1970లో ప్రపంచ నాస్తిక మహాసభలు సైతం విజయవాడలో నిర్వహించారు. అదే దశకంలో ఆంధ్రదేశంలో హేతువాద సంఘం, విశాఖ వేదికగా  మార్క్సిస్టు భావజాలంతో భారత నాస్తిక సమాజం ఎర్పడ్డాయి. శిక్షణా తరగతులు, అధ్యయన తరగతులు జిల్లాల వారీగా నిర్వహించేవారు. తెలుగునాట ఉధృతమవుతున్న హేతువాద ఉద్యమానికి ఆకర్షితులయే శ్రీ లంక ప్రొఫెసర్ డాక్టర్ కోవూర్ అబ్రహాం మూడు సార్లు ఇక్కడ పర్యటించారు. దైవాంశ సంభూతల మహిమలకు వ్యతిరేకంగా ఉద్యమించే డాక్టర్ పి. ప్రేమానంద్ ఇక్కడ అనేక శిక్షణా తరగతులు నిర్వహించారు.
గోరా మరణం తరువాత వారి కుమారుడు డాక్టర్ లవణం అంతర్జాతీయ హ్యూమనిష్టు ఉద్యమంలో అంతర్భాగమయారు.  ఎన్నో పర్యాయాలు ప్రపంచం చుట్టి రావడమే కాకుండా.. రెండవ నాస్తిక మహాసభలూ నాస్తిక కేంద్ర స్వర్ణోత్సవాల సందర్భంలో  ఘనంగా నిర్వహించారు. సర్ హార్మన్ బోండి, జాన్ ఎడ్వర్డ్స్, జిం హెర్రిక్. హేరి స్టోప్సరో, లెవీ ఫ్రాగెల్, ఫ్రాంక్ షూట్, ఎరిక్ హార్టికైనన్, డాక్టర్ నిహాల్ కరీం, రాయ్ బ్రౌన్, అజం కమ్గుయాన్.. లాంటి ఎందరో నాస్తిక ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అనేక నాస్తిక మహాసభల్లో, హేతువాద ఉద్యమాలలో పాలుపంచుకున్నారంటే.. ఆ ఘనత గోరా కుటుంబం మొత్తం  ఓ క్రతువుగా సాగించిన  హేతువాద, నాస్తికవాద  ఉద్యమాల ప్రభావం వల్లనే! ఆంధ్రదేశం నుంచి ఇతర దేశాలలో జరిగిన హేతువాద, నాస్తిక సభలు సమావేశాలకు హాజరయిన ప్రముఖులలో ఎన్. ఇన్నయ్య, రావిపూడి వెంకటాద్రి,  బాబు గోగినేని వంటి వారు ఇప్పటి తరానికీ సుపరిచితులే!
ఆంధ్రుల నాస్తిక, హేతువాద ఉద్యమాలు ప్రపంచంలోని మరే ఇతర దేశాల ఉద్యమాల ముందూ తీసిపోనంత ఉధృతంగా సాగుతున్నవే! మనిషిని ఆలోచించమని కోరడమంటే తన అనుభవాల నుంచి, అవగాహనలో నుంచి ఆలోచించమని కోరడమే! అందరి ఆలోచనలు ఒకేలా ఉండనప్పటికీ వ్యక్తి స్వేచ్ఛ, పరస్పర గౌరవం వంటి మౌలికమైన మానవ విలువులలో మార్పు ఉండదు. హేతువాదులేమీ మూసపోత ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించరు. వైరుధ్యం తలెత్తని విభిన్నత్వాన్ని, వైవిధ్యాన్నే ఆలోచనాపరులైన నాస్తికులైనా, హేతువాదులైనా ప్రోత్సహించేది.
వంద సంవత్సరాల కిందటి వరకు నాస్తికత్వం, హేతువాదం ఒక పెడవాదంగా హేళనకు గురయిందన్న వాస్తవం మనం మర్చిపోరాదు. చాలా నాగరిక దేశాలలో క అలా చెప్పుకునేవారికి ఇబ్బందులు  ఎదురయేవి. అంతటి ప్రతికూల పరిస్థితుల నుంచి నాస్తిక, హేతు భావజాలాలు ఇవాళ ఒక గౌరవనీయమైన మానవవాదాల జాబితాలో చేరి మేధావుల మన్ననలు అందుకుంటోన్నది. ఈ కృషిలో మన తెలుగువారు నిర్వహించిన పాత్రా అనల్పమైనదని మరో మారు గుర్తు చేసేటందుకే ఈ చిన్న ప్రయత్నం.
రాబోయే తరాల ప్రగతి బాట నిర్మాణంలో ఎవరు వద్దన్నా, కాదన్నా నాస్తిక, హేతు భావజాలాల పాత్రా తప్పక ప్రాముఖ్యం వహిస్తుందని జ్ఞప్తికి చేసేందుక్కూడా ఈ చిరువ్యాసం.
***
(ఆంధ్రప్రదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల నేపథ్యంలో శ్రీ మండలి బుద్ధ ప్రసాద్, శ్రి గుత్తికొండ సుబ్బారావు, డా॥జి.వి. పూర్ణచంద్ గార్ల సంపాదకత్వంలో  విక్టరీ పబ్లికేషన్స్ వారు ప్రచురించిన 'తెలుగు పసిడి'- ఆంధ్రప్రదేశ్ లో 50 సంవాత్సరాల నాస్తిక, హెతువాద ఉద్యమం - శ్రీ లవణం- పు.367 - 371)

Saturday, February 8, 2020

సరదాకేః ఆదివారం శీర్షికకు తిట్టు!.. తిట్టించు! -కర్లపాలెం హనుమంతరావు




వాదన పూర్వపక్షం చేసే పాయింట్ ఓ పట్టాన దొరకనప్పుడు వాడుకొనే 'వాడి' గల
ఆయుధం- కోపం. 'పేదవాడి కోపం పెదవికి చేటు' అన్న వేమన వెర్రికాలం

కాదిప్పటిది. 'పేదవాడి కోపం పెద్దమనుషుల పదవికి చేటు' అన్నట్లుగా  సాగే
ప్రజల స్వాముల వాదం.  ఎలక్షన్ల పీడాకారం తగులుకున్నప్పుడల్లా తలనొప్పి
ఓటర్లకు దేవతాపీఠాలు దక్కడానికీ   ఈ ఆగ్రహాయుధమే ప్రధాన కారణం.
ఎన్నికలయిన తరువాత సాగే  గెలుపు బెట్టింగులంత గడబిడలుగా ఉండవు  ఓటర్ల
బెట్టుసర్లు. రాజ్యాంగం అంటే ఏదో ఆ ఆధికరణ, ఈ సవరణలంటూ ఇండియన్ ఇంకుతో
గిలికేసారు గాని ఎలక్షన్ల రంగంలో ఓటరు గొట్టంగాడు వీరంగానికి దిగితే
సాక్షాత్తూ  ఆ రాసిన పెద్దసార్లయినా సరే తట్టుకోడం కష్టం!
తిరుపతి వేంకటకవుల కృష్ణరాయబారం నాటకంలో శ్రీకృష్ణుడు ‘అలుగుటయే యెరుంగని
మహామహితాత్ముడు/ అజాత శత్రుడే అలిగిన నాడు’ ఏవేవో సాగరములన్నీ
ఏకమయిపోతాయని, నమ్ముకున్న కర్ణులు పదివేలమంది వచ్చినా చత్తుర’ని
బెదరగొట్టేస్తాడు. దుర్యోధనుడికి దూరాలోచన లేక  బాదర్ అవలేదు. కానీ
ఇండియన్ నేతకు ఓటరు అజాతుశత్రుత్వం మీద బొత్తిగా నమ్మకంలేదు.   తలనొప్పి
తద్దినమంతా  ఎందుకని నాయకులు ఎన్నికల దుర్దినాలు గడిచే దాకా ‘ఓటర్లే
దేవుళ్లు’ అంటూ స్త్రోత్రాలు అప్పగించేసేది అందుకే! నిజానికి దేవుళ్లతో
పోల్చడమంటే ఓటరు స్థాయినో మెట్టు కిందికి దిగజార్చడవేఁ!
కాసుల పురుషోత్తమం అని కవి మహాశయుడు, పనిమాలా ఘంటసాల దాకా వెళ్లి
శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువును  పట్టుకుని దులపరించాడు. 'నీ పెళ్లాం
భూదేవి అన్ని బరువులూ మోస్తుంటే..  ఆ నిర్వాకం నీదే అన్నట్లుగా పెద్ద
బిల్డప్పులు! కోరింది ఇచ్చేది నీ కోమలి ఇందిరమ్మ అయితే, నువ్వే ఏదో
కామితార్థుడికి మల్లే వీర పోజులు! కష్టమైన సృష్టి కార్యం చూసేది నీ
కొడుకు బ్రహ్మగారయితే ఇంటి పెద్దనంటూ కుంటి సాకులతో ఆ క్రెడిటంతా నువ్వే
కొట్టేసుకుంటివి! పొల్యూషన్ కంట్రోలు పనిలో పాపం గంగమ్మతల్లి తలకమునకలయి
ఉంటే, పని సాయానికి పోని   నీ కెందుకయ్యా పతితపావనుడువన్న   బిరుదు అసలు?
పెళ్లాంబిడ్డల మూలకంగా వచ్చే పేరే తప్పించి మొదట్నుంచి నువ్వు పరమ
దామోదరుడివి(పనికిమాలినవాడివి)’ అంటూటే.. తిట్టో మెప్పో తెలీక  ఆ దేవుడు
గుళ్లోని రాయికి మల్లే  గమ్మునుండిపోయాడు!
దేవుడికి భక్తుడొక్కడే దిక్కు. భక్తులకు ముక్కోటి దేవుళ్ల ఆప్షన్ ఉంది. ఏ
ఒక్క దేవుడు ముక్కోపం తెప్పించినా మరో పక్కదేవుడి దిక్కు భక్తుడికి
ఠక్కున ఆఫరయే జంపింగ్ జమానా ఇది.
 ఆపదమొక్కులవాడి కోపతాపాలనంటే ఏ మొక్కులు, పొర్లుగింతల ట్రిక్కుల్తోనో
ఠక్కున మటుమాయం చేసెయ్యచ్చు. ఓటరుకార్డు చేత బట్టిన డిప్పకాయ మరీ పాతకాలం
నాటి నాటు రథాలను మాత్రమే నమ్ముకుని ఉత్సవానికి ఊత్సాహపడే విగ్రహం
కాదిప్పుడు! డెమోక్రసీ ఎదగడం మాట ఎటు పోయినా ఓటు మిషను మీట నొక్కే మనిషి
కసి మాత్రం వామనుడు సిగ్గుపడే సైజులో పెరిగిపోతున్నది. ఓటుకు ఓ పదినోటు
ఇస్తానన్నా  పుచ్చుకునేందుకు  పది సార్లు పస్తాయించే చాదస్తం నుంచి
హీనపక్షంగా పదివేలన్నా చేత పెట్టందే పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయే దాకా
పరిపక్వత సాధించింది. ముష్టి మున్సిపాలిటీ ఎలక్షన్లక్కూడా ఎస్టేట్లు
అమ్ముకుని మరీ కుస్తీపట్లకు దిగే బస్తీనేతలే ఓటర్ని ఈ స్టేటు దాకా
ఎగదోసింది. మసిపూసి మారేడు చేసే మాయాజాలం మరి ఇంకెంతకాలమంట? కడుపులో మంట
రేగితే  ఓటరే  ఊరేగే నేత ముఖాన కసి కొద్దీ బుడ్ల కొద్దీ సిరా పూసి, బురద
జల్లే రోజులు! వీధినేత కేజ్రీవాలే ఆఫీసు ఫోర్ వాల్సుకు బుద్ధిగా
కట్టుబడ్డం ఓటరు సిరా బుడ్డి దెబ్బకు దడవబట్టే!
పాలిటిక్స్ అంటేనే పది రకాల దరిద్రాలకు వంద వెరైటీల చిట్కాలు! షాహీన్
బాగ్ చూస్తున్నాంగా! పాపిష్టి అసంతృప్తుల ముఠాల్లోకి   చొప్పించే
కోపిష్టి ముఠాలను నేతలే ఇప్పుడు  స్వయంగా ఎందుకు తయారుచేసుకుంటున్నట్లు?
కోన్ కిస్కాగొట్టంగాళ్ల తిట్లన్నీ ఒకే దిక్కుకు మళ్ళించడం ఆ ముఠాల
టార్గెట్టు! ఎన్నికలు ఇవిగో.. ఈ ఎల్లుండి పొద్దున్నే ఆనంగానే,  చల్లంగా
తిట్టే వర్గాల మీద ఏ అయోథ్యను మించి వరాల జల్లులో కురిపించేస్తే సరి!
చిల్లర పైసలు కొన్ని వదిలినా అల్లరీ ఆగం లేకుండా ఎన్నికల యాగం ఏకపక్షం
చేసుకునే స్కీములు ఇట్లాంటివి లక్షా తొంభై ఇప్పుడు.   బోడి మల్లయ్యల
తిట్లంటారా?  చెవుల్లో దూరకుండా  దూదుండల సదుపాయానికి సర్కారు దండం
దక్కినాక ఖజానా అండ ఉండనే ఉంటుందిగా!  అయినా తిట్లక్కూడా ఉట్లు తెగే
సత్యకాలమా.. పిచ్చిగానీ?
అన్ని జాతర్లలో ఉత్సవ విగ్రహాలు పూజలే అందుకుంటున్నాయా? కొన్ని
సంబరాలల్లో  అంబలను భక్తులు అడ్డమైన తిట్లు తిట్టడం ఆచారం!  ‘ఒద్దికతో
లక్ష్మి  వున్నది చాలక.. భూదేవి కూడె నీ బుద్ధిశాలి!/ తన కూతురుటంచు
ఎన్నక.. భారతిని కోరడే ఈ నీతికోవిదుడు!/అర్థాంగి యుండగ అవ్వ.. గంగను
దాల్చె నీ నియమవరుడు!’ అంటూ  తిట్టిపోసినా  దేవుళ్ళు కూడా  కిమ్మనడంలేదే!
 కులం వంకన దూషించారనో, మతం మిషతో అవమానించారనో,   జాతి పేరు చెప్పి
నోరుజారారనో,  లైంగిక దృష్టిన వేధించారనో  మనిషి మధనపడ్డం.. యుద్ధకాండకు
దిగిపోడం.. హూ కేర్స్! శుక్రవారం కోర్టు బోను.. శనివారం కోర్టు తరలింపు
సీను! జనాలు ఎవర్నన్నా శాపనార్థాలు పెడుతున్నారా? దండుకునే సమయం దండగ
కాకూడదన్నదే ప్రజాభిప్రాయంగా  ఉన్నదిప్పుడు!
దూర దూరంగా తగలడితే తూలనాడుకొనే పగే ఊండదు. ఒకే చూరు కింద పది పూటలు
చేసిపోయే పిచ్చి కాపురాలల్లోనే సవతుల మధ్యన సవాలక్ష ముటముటలు, ముక్కు
తిప్పుళ్లు! నూట ముప్పై కోట్ల మందిమి. జానా బెత్తెడు భరత భూమి. మూడు వేల
చిల్లర పార్టీలు. ఎవరికీ పెత్తనం ఎకసెక్కం కాదు. మరి మాటా మాటా రాదా? ఏ
మాటా మోటుగా రారాదంటే ఎట్లా?  రామాంజనేయయుద్ధంలో  రాముడికి..
ఆంజనేయుడికి మధ్య జరిగే గలాటాకీ నవ్వుకొనే జనాలకు నేతల తిట్లు, సిగపట్లు
ఏమంత ఎబ్బెట్తనిపిస్తాయనీ.. నీతిమంతుల పిచ్చి గానీ!
‘ఉపకారంబు చేసినాడ కదా.. ఎన్నో రీతులన్.. నాకే నే/డపకారంబు ఘటంపజూచుటలు
మేలా నీకు పార్థా! మహా/విపదబ్ధిన్ వడిదాటి నౌకన్ వెసన్ విధ్యంసమున్ జేయు
నీ/ కపటాచార కృతఘ్న వర్తనల లోకంబెందు హర్షించునే?’ అంటూ గయుణ్ని
శిక్షించే విషయంలో జోక్యం వద్దని గట్టిగా  కృష్ణుడు దెప్పితే.. బామ్మరిది
కదా అర్జునుడేమన్నా గమ్మునున్నాడా? 'ఆపదలు మేమె తరయించు అదనుజూచి/
ఉట్టిపడెదవు మమ్మెల్ల ఉద్ధరించు/ఘనుడవని కీర్తి కనెదవు గాని కృష్ణ!/ నీవు
లేకున్న మేము రాణింపలేమె?' అంటూ మాటకు మాట పెట్టాడా.. లేదా? బాణప్పుల్లలు
వదిలే ముందు పుల్లవిరుపు మాటలు, ఈటెలు విసురుకోడానికి ముందు
ఈటెపోటుల్లాంటి దెప్పుళ్లు తప్పవని అందరికీ తెలుసు! క్లైమాక్సులో కూడా ఏ
మాత్ర్రం తిట్ల వాసన తగలద్దంటే ఎంత ఎన్టీఆర్, ఎస్వీఆర్ పాండవవనవాసమైనా
ఐమాక్సులో ఫ్రీ-షో వేసినా చూసే నాథుడుండడు! బొక్క.. భోషాణం అంటూ
జుత్తెగరేసుకుంటూ తిరిగే నటులూ పొలిటికల్ ఎంట్రీలిచ్చేస్తున్నారిప్పుడు.
పోటీగా  నలుగుర్నీ కూడేసుకోడానికి నాయకుడూ  నాలుకకు ఇంకాస్త పదును
నూరుకుంటే తప్పా? తొక్కలో భాషంటూ తిట్టే నేతలెవర్నీ జనతా సైతం తొక్కేసే
మూడులో లేదిప్పుడు.
 తిట్టించుకొనేవాడి మనసు చివుక్కుమంటుందంటే ఫక్కుమని నవ్వొస్తోంది.
వినేవాడి వీనులకు ముందు భాష పసందుగా ఉండాలి. చట్టసభల్లో జుట్టూ జుట్టూ
పట్టుకునే ముందు రెండు వైపులా  లాంగ్వేజ్  లవ్లీగా పండాలి! సమయానికి
ఠక్కని ప్రసారాలు కట్ అయిపోతే జనం సరదా కోసమా కోపంతో  చిందులేసేదీ?!
కారుకూతల వినోదవల్లరి కారు చవుకగా వినే ఛాన్స్ మిస్సవుతుందని కదా కామన్
పబ్లిక్ రుసరుసలు!
కమాన్! బాపూజీ చెప్పాడు గదా అని బుద్ధిగా ప్రజాసేవ చేసుకుని పరమపదిస్తే
నరకంలో ఎవరూ మడతమంచాలేసి హాయిగా బజ్జోమనరు. దిష్టిబొమ్మల వ్యాపారాన్ని
తగలేసిన పాపానికి, పాత చెప్పుల గిరాకీపై దెబ్బ కొట్టిన నేరానికి  ముళ్ళ
డొంకల మీద పడేసి పడపడా ఈడుస్తారు! నొప్పెట్టి ఏడిస్తే కర్రు కాల్చిన
దండంతో మరో రెండు వడ్డిస్తారు.
అయినా తిట్లన్నీ ఒక్క  నేతల నోళ్ల నుంచే పొంగొకొచ్చేస్తున్నట్లు ఎందుకా
పిచ్చి తింగరి కూతలు? కట్టుకున్నోడు మందు కొట్టొచ్చినప్పుడు  తిట్టకపోతే
మహా వెలితి  బోలెడంత మంది నెలతలకు. పెళ్లాలు  తిడతారో లేదో.. నిజంగా
బైటికి తెలిసే అవకాశం లేని కాపురాలల్లో ఆ వంకన సానుభూతి కోసం వెంపర్లాడే
మగకుంకలు.. ఇదిగో.. ఈ.. తల్లో వెంట్ర్రుకలంత మంది. తిట్టుకు
వందిస్తామనండి!  తిరుపతి గుడి క్యూలకు మించి ఎగబడే ఏబ్రాసీ మందలు ఎన్ని
కోట్లుంటాయో లెక్కతేలుతుంది! పాచిపోయిన లడ్డూలు ప్రసాదం పెట్టే పై
దేవుళ్లనేమీ పట్టించుకోకుండా కిందున్న సాటి నేతల మీదనే ఎందుకిన్ని
సూటిపోటీ మాటలు జనం అంటారు?
భరతుడు దక్షాధ్వరధ్వంసాన్ని అభినయించేటప్పుడు పశ్చిమ దిక్కుగా ఉన్న
బ్రహ్మముఖం నుంచి ఆరభటీవృత్తితో రౌద్రం ఉత్పన్నమయిందా? శారదాతనయుడి
'భావప్రకాశం'లో ఆలాగని రాసుందా? ఉన్న వెకిలి పాండిత్యం మొత్తం సందర్భ
శుద్ధి లేకుండా వెళ్లగక్కే మేధావులను  కుళ్లబొడవాలి ముందు.  ఆ దక్షాధ్వర
ఘట్టంలో పోతనగారి ధ్వంస రచనకు మించి ఉందా ఏంటి మరి ఇప్పటి  కొత్త నేతల
యాంటీ- హింస నచణ?  ఉత్తిత్తిగా వేలెత్తిచూపటానికా ఓటుకు అన్నేసి వేలు
దోసెట్లో పోసీ ఉపరి.. ఎన్నికల్లో ఓటరుగాడిదను గాడ్ అంటూ కాళ్లట్టుకు
దేవులాడింది నేతలు?
భాగవతం వేనరాజును విశ్వనాథ  శతవిధాలా ఖూనీ చేసాడు. కవిరాజు 'ఖూనీ' రాసి
అదేరాజుకు మళ్లీ జీవం పోసాడు. ఎవళ్ల అవసరాలు వాళ్లవి. అవసరాలని బట్టి
బట్టీలల్లో తిట్ల తయారీ! 'కఫాదిరోగముల్/దనువున నంటి మేని బిగి
దప్పకమున్నె నరుండు మోక్ష సా/ధనమొనరింపగా వలయు'అంటూ సూక్తులు వల్లించేడు
కదా  దాశరథీ భక్తుడు  కంచెర్ల గోపన్న! కోపమేమైనా ఇసుమంతైనా మరి పాపభీతి
కలిగించిందా చెరసాలలో పడినప్పుడు ఆ రామదాసు మనసుకు? 'కలికితురాయి నీకు
పొలుపుగ జేయిస్తి రామచంద్రా/నీవు కులుకుచు దిరిగెద వెవరబ్బసొమ్మని
రామచంద్రా!' అంటూ  దాశరథి మీదనే నేరుగా దెబ్బలాటకు ఎందుకు దిగినట్లో?



'మాలిన్యం మనసులో ఉన్నా/ మల్లెపూవులా నవ్వగలగడం ఈ నాటి తెలివి' అన్నాడు
.. 'కొత్త సిలబస్' కవితలో బాలగంగాధర్ తిలక్.  వింటానికి బానే ఉంటాయ్
కవితలెప్పుడూ! కానీ ఆ  పాత 'కొత్త సిలబస్' కు ఈ ట్వంటీ ట్వంటీస్ లో కూడా
శిల వేయద్దంటే ఎట్లా? కొత్త తరం నేతలూ ఆ తలపోటు కవితలే ఫాలో అవ్వాలా?
అదేం ‘లా’? నో.. వే! నేటి తరాల నేతల దారి నేరుగా బూతు భాగోతాల ‘హై వే’
మీదనే!
బూతుందని దేవుడికి సుప్రభాతమూ వద్దనగలవా? అని మనగలవా? ఎంతాచారం
వల్లించినా ఆ పెద్దాయనా ఆ కూటికే పోక తప్పని కాలమిది నాయనా! ఆగ్రహం
చుట్టూతానే భూగ్రహమంతా తిరుగుతోందిప్పుడు. ఆ గ్రహింపు లేకుండా ‘నిగ్రహం..
నిగ్రహం’ అంటుండ బట్టే శనిగ్రహం ముద్ర పెరిగిపోతుంది రోజురోజుకూ.
‘విగ్రహం పుష్టి.. నైవేద్యం నష్టి’ అంటూ మరో నింద పడ్డానికీ ప్రణాళిక
తయారవుతోంది!
 స్వగృహంలో పడగ్గదయినా సరే చాటుగా ఓ నాలుగు బూతు సినిమా పాటలు బై హార్ట్
చేసుకునే బైటికి రావటం బుద్ధిమంతులకు అవసరమిప్పుడు! చక్రం మీద కుతి
ఒక్కటే చాలదు! వక్రమార్గంలో అయినా సరే పచ్చిబూతులు నోటికి నిండుగా
పుక్కిటపట్టక తప్పదు పుక్కిట పురాణాలలో కూడా చోటు దక్కే పరిస్థితిలేదు.
 ప్రార్థనా పద్యం ఏడో స్థానంలో  ఏదో 'చ'కారం ఏడవబట్టే నన్నయ్యగారి
మహాభారతం అరణ్యపర్వంలో అర్థాంతరంగా ఆగిపోయిందంటారు.  నన్నెచోడుడూ
కుమారసంభవం ఆరంభంలో  స్రగ్ధర గణాల మీద అశ్రద్ధ చూపెట్టబట్టి  యుద్ధంలో
దారుణంగా మరణించాడని మరో టాక్! తిట్టు వల్ల ఏ త్రాష్టుడి ఉట్టీ పుటిక్కన
తెగిన లెక్కలు నిక్కచ్చిగా తేలకపోవచ్చు కానీ, తిట్టే తిట్టు  స్పష్టంగా
లేకుంటే మాత్రం కుంటి కూత కూసిన వాడికే ముందు గంటె కాల్చినట్లు వాత
పడేది.



అనకూడని ‘బాస్టార్డ్’ లాంటి పాడు కూతలు కూడా అన్నట్లు ప్రచారంలో కొచ్చేసే
 సామాజిక మాధ్యమాల  మాయాజాల కాలం బాబూ బాబూ ఇది! బాపూజీ బోధల మీదింకా
నమ్మకమున్నది ఆ పాతకాలం నాటి ముష్టి మూడు కోతి బొమ్మలకే!  మిగతా జాతి
తూగు మొత్తం  తూలనాడే కొత్త తరం నాయకత్వం వైపే! బూత్ పాలిటిక్స్ లో బూతు
వద్దనడం.. రామాయణంలో రామా అనే శబ్దం నిషిద్ధమనడమంత అసంబద్ధం. అనకా
తప్పదు.. అనిపించుకోకా తప్పదు.  తిడితే తప్ప నెగ్గ లేని నేతలకు తిట్లు
వద్దు.. కోపాన్ని ఉగ్గబట్టు.. అనడం పెద్ద తప్పు.
ఇంత మొత్తుకున్నా ‘తిట్టి తిట్టించుకోవడమా? తిట్టించుకుని తిట్టిపోయడమా?
అని ఇంకా సందిగ్ధమేనా? ఛఁ! కొంత మందిని ఎన్ని తిట్టీ  నో యూజ్! ఇంకా
తిడుతూ కూర్చున్నా  టైం వేస్ట్!
(సూర్య దినపత్రిక ఆదివారం సరదాకే శీర్షిక 9, ఫిబ్రవరి, 2020 )

***

Monday, February 3, 2020

సరదాకేః మందు మహిమ ఏమందురో! -కర్లపాలెం హనుమంతరావు




                                                


గెలీలియో  మహానుభావుడే! సందేహం లేదు. కానీ భూమి సూర్యుడి చుట్టూ
తిరుగుతోందని కనిపెట్టేందుకు అన్నిబ్బందు లెందుకు పడ్డట్లో! నా బోటి 
డోసుబాబుకైనా ఓ క్వార్టర్  కొట్టించి పక్కన కుదేసుకునుంటే బుర్ర తిరిగే
వింతలు బోలెడన్ని బోల్డుగా బైటపెట్టుండేవాడు కదా బావా!’ అన్నాడు
సోమలింగం.
సోమలింగం మా చెల్లెలి మొగుడు. మొన్న జనవరి ముప్పై.. పరగడుపునే మా
కొంపకొచ్చి  నట్టింట వెంట తెచ్చుకున్న మందు సరుకు మొత్తం
పరుచుక్కూర్చున్నాడు.  ఇదీ కొంత బెటరే! బాపూజీ వర్థంతి. ఈ తాగుడు మేటర్
బైటెక్కడన్నా పొక్కితే వాడలీడరుగా వీడిని ఎన్నుకున్న పార్టీకే కాదు
కట్టుకున్న పుణ్యానికి మా చెల్లాయిక్కూడా.. పాపం.. పరువుచేటు.  చెల్లాయి
కోసమైనా ఈ  ఎమ్మెస్ నారాయణ  శైలి కతలు ఆలకించక తప్పదీ పూటకు.

కతలు అనుకుంటున్నావని నాకు తెలుసులే. లోకం మెచ్చిన ఎందరో కథలరాయుళ్లు
పచ్చితాగుబోతులే బావా! ఎర్నెస్ట్ హెమింగ్ వే నుంచి, జేమ్స్ జాయ్స్,
ఎడ్గర్ ఎలెన్ పో దాకా ఎందరో డోసుబాబులు! ఓ. హెన్రీ తాగుణ్ని గురించైతే ఓ
గ్రంథమే రాసేయచ్చు. మన మహాకవి శ్రీ శ్రీ రుచి గురించిహ   చేప్పేదేముంది?
కథలు చెప్పేవాళ్లందరూ తప్పతాగుతారని చెప్పకురా.. పాపం చుట్టుకుంటుంది!
అట్లా అని చెప్పను కానీ తప్పతాగేవాళ్లు మాత్రం తప్పకుండా మాంఛి కథకులై
ఉంటారు.  ఉండాలి కూడానూ! కొంపకు  ఆలస్యంగా వచ్చినప్పుడల్లా మీ సిస్టర్
లాంటి ఇంటిళ్లాళ్లకు విడవకుండా  కొత్త కొత్త కహానీలు  వినిపించే కళంటే
మాటలా ఏంటీ? అల్లాటప్పా వెంకటప్పయ్యల వల్లయ్యే వ్యవహారం కాదులే  అది.
నోరు తిరిగిన తాగుబోతుకయినా తడబాటేమీ లేకుండా, నాలుక ఏమీ మడతలు పడకుండా
ఎప్పటికప్పుడు  కొత్త కొత్త స్టోరీలల్లి చెప్పడానికి ఎంతో సృజనాత్మకత
అవసరం.  తప్ప తాగితే తప్ప ఆ సృజనాత్మకత అంతరాత్మను పట్టుకోడం కష్టం.
ఎన్నైనా చెప్పరా! తప్ప తాగడం తప్పు.. తప్పున్నరా!
 అక్కడే కాలేది. ‘మందు’ మీద  ఎందుకిన్ని అపనిందలు?! సురాపానం దురాచారమంటూ
సాగించే దుష్ప్రచారంతో మీ బుద్ధిమంతులంతా సాధించేదేముంది?! మధుపానం ఈ
రోజే కొత్తగా మా ప్రభువులు కనిపెట్టిందా? అందుకే.. ఈ మాసంలో మా ‘తామసం’
తరుఫు నుంచి నేరుగా సుప్రీమ్ తలుపులే దబదబా బాదబోతున్నాం.
తామసం అంటే తాగుబోతు మనుషుల సంఘం అని మా సోమలింగం  అర్థం!  రామరాజ్యం
కాలంలోనే 'రా' చలామణీలో ఉందంటున్నా వింటూ కూర్చోవాల్సిన ఖర్మం నా కీపూట!
రామాయణాన్ని అంత రసవత్తరంగా మార్చిందెవరూ? చలువ బట్టల పనిచేసుకొనే తులువ
నోటి నుంచి వచ్చిన మందు మాటలు కావూ! రామాయణం శిరోధార్యం అయినప్పుడు
రామకార్యం నిర్విఘ్నంగా నిర్వహించిన సోమపానం ఏ లెక్కన యాంటీ- సోషల్
యాక్టివిటీ అయ్యిందంట?
రామ!.. రామ!
సీతమ్మ తల్లిని వెతకడానికని వెళ్ళిన ఆంజనేయుడుకి లంకలో ముందుగా
కనిపించింది ఈ  చీప్ లిక్కర్ సీసాలు.. అవి సేవించే రాక్షస సమూహాలే
బావగారూ! మహాభారతం మాత్రం..?
కృష్ణ కృష్ణా!
మహాయోధుడు కీచకుడుకి మగువల మీద కన్నా  మధువు మీదనే మక్కువ జాస్తి. ఆ
మాటకు వస్తే మగనాళ్లు కూడా మధుపాన చిత్తులయి చిత్తం వచ్చిన రీతిలో
ప్రవర్తిల్లిన తీరులు మన ప్రబంధాల నిండా బోలెడు కనిపిస్తాయి. మీ
బుద్ధిమంతుల ముఠాకు ఆ విశ్వనాథ బ్రాండంటే గిట్టదు కానీ!
ప్రబంధాల మీద కూడా పడ్డాయంట్రా  మీ నోళ్లు?
'అసితోత్పలములపై అరుణేం దుధీతతుల్ వెలసినా గనుగువ లెఱ్ఱనయ్యె’అంటూ
నన్నెచోడుడు కుమారసంభవం కావ్యంలో, కళ్లు ఎర్రబడ్డం దగ్గర్నుంచి కాళ్లు
తడబడ్డం దాకా మందు కొట్టిన సుందరాంగుల వగలు సెగలన్నీ వలిచి మరీ
నిర్మొహమాటంగా చూపించాడు! ఆ పోయెమ్ ప్రతిపదార్థం  కళ్లక్కట్టినట్లు
వివరించుంటే ఆ తిక్క   టివి ఎపిసోడ్సుకు మించి ఇంతులకు ఇంగితం అబ్బుండేది
కదా! తాగుబోతులను పద్దాకా ఆడిపోసుకొనే చండికల చేత  నన్నెచోడుడి
కుమారసంభవం తిరగేయించండోసారి మొండి ధైర్యం చేసైనా.  బడాయిలు.. ఛోటూల చేత
కూడా తాగుబోతులంటూ మమ్మల్ని ‘ఛీ’ కొట్టించమంటేనే సర్దా మీకు! ‘సురాపానము
చేయువానికిని సన్మానంబులే సిగ్గులే/ వదనాలంకరణంబులే సుగతిలే వాక్సుద్ధిలే
వాంఛలే
మదిలోనన్ దయ ఇంతలే స్మరణలే మర్యాదలే  మట్టులే/ మదమేమాత్రములే సదాశివ
శివా‘ అంటూ కాంతలంతా సూరేకాంతం మేనత్తల్ని మించి మా మీదెప్పుడూ
చిందులేయడానికి   మీలాంటి ముచ్చు నీతిమంతులు కదూ రీజన్!’
మరే! తప్ప తాగే మీ మొనగాళ్లంతా పాలుతాగే పసిపిల్లకాయలు! మందు వల్ల కలిగే
లాభాలు మీరే ముందు మీ అప్పచెల్లెళ్ళు, పెళ్లాంబిడ్డల ముందర ఏకరువు
పెట్టుకోవచ్చుగదరా? ఏ మందుకొట్టుకో వెళ్ళి మరెందుకు ఓ మూల చేరి మందు
కొట్టుకుంటూ ఈ ఏడుపులూ.. పెడబొబ్బలూ? విప్పసారా మహిమనయినా వీరనారీమణులకు
విప్పి చెప్పుకోవచ్చే.. నిజంగా నిజమే ఉంటే? మీ బుడ్డిమంతుల బుర్రలు.
నాలుకలకు ఏమన్నా  విప్పులు గట్రా జారీచేసాయా సోమలింగం బావయ్యా?!
ఓటేసే వాడి నోట ‘నోటా’ మాట రావద్దన్నా ఎన్నికల పూటంతా పూటుగా నాటు పోయక
తప్పని రోజులు బావయ్యా ఇవి! ఆ పేదోడి ముందు ముంతక్కూడా చేటు తేవడం
అంతానందమా మీకు? నాటు  మీద కూడా ఎందుకీ  మోటు సరసాలు?  ఓటేసిన ఓడ మల్లయ్య
ఎటూ మీట నొక్కిన మరుక్షణం బట్టే బోడి మల్లయ్యైపోతున్నాడిప్పుడు. ఓటేయించి
గెలిపించే చీపు లిక్కర్ మీదా ఇంకా ఎందుకయ్యా సామీ మీ నీటు
పాలిటిక్సోళ్లకు నిష్టూరాలు?
గ్లాసు ముట్టని క్లాసుగాళ్లం బావా మేమంతా. ఏం చేసేమని మా మీద మీ
తాగుబోతుల యుద్ధం? మద్యం మహమ్మారి కాదంటే..  ఆడజాతి ఊరుకుంటుందనే?
మద్యమేం మహమ్మారి కాదు. చరిత్ర మొత్తం చెత్త బుట్టలో పడేసి తాగుబోతుల చేత
తిరగరాయించాలి ముందు! ఉజ్జయినీ కాళీమాతకు మద్యమేనయ్యా మహా నైవేద్యం!
శిప్రానదీ తీరాన కొలువైన భైరవుడు నాటుసారా తప్ప మరోటి ముట్టుకోడు. కల్లు,
సారాయి లాంటి గమ్మత్తు సరుకు మీద సమాజంలో సరైన అవగాహన లేకనే..
అబ్బో! సారాయంటే  అంటే అదేందో అమృతమయినట్లు? పురాణంలా పారాయణం
చేస్తున్నావ్.. చస్తున్నా విన్లేక ఇందాకణ్నుంచి!
పూర్ బావయ్యా! పురాణాలల్లోనూ దీని కోసమే మహాశయా దేవాసురులు తన్నుకు
చచ్చిందీ! పల్లెపట్టుల వైపున్న అమ్మలక్కలకు ఈ మాత్రం మద్య పురాణాల మీద
జ్ఞానం లేకపోడం మా  బ్యాడ్ లక్!  ఓ అరకాయ సారా కిట్టిన కాడికి
ఆమ్మించినప్పుడేగా ఆ వచ్చిన రూపాయిలో  పైసా తిరిగి  బక్కోళ్లకి ఏ
సంక్షేమం వంకనో దక్కేది! ఆ ఇవ్వడాలవీ  గిట్టకే సర్కారోడి మీద
అప్పోజిషనోళ్ల తరుఫు నుంచీ ఆడంగులతో మీరిట్లా రాళ్లు.. అవీ  రువ్వించడం!
గెలిపించినోడి కడుపుకు నిండుగా కాయా కసరూ తినిపించడానికి ఏ గవర్నమెంటోడు
పలుగూ పారా పట్టుకుని పొలాలెంటబడి పొర్లాడడు! కల్తీదో ..బొల్తీదో కనీసం ఓ
అరకాయ  యిప్పసరుకయినా వండించి పేదోడి నోటికి  అందుబాటులో ఉంచుతున్నాడు.
అందుకెవరూ మెచ్చరు! ఆ సొళ్లు  కన్యాశుల్కాన్ని మీ హైక్లాసోళ్లంతా ఎప్పుడూ
ఒకే రే-బాన్ కళ్లద్దాలతో చూడ్డం ఫ్యాషనయిపోయింది. పోనీ అందులోని మంచి
మాటలైనా మనసుకు పట్టించుకుంటారా?  ద్రేహం గాజు కుప్పె. ద్రేహంలో ఉండేది
పరవాత్మ. గాజు కుప్పెలో వుండేది అన్నసారం. ఈ అన్నసారం ద్రేహంలో పడితే
గాని పరవాత్మ పెజ్జరిల్లదు. ఈ పరమ రహస్యం వంటబట్టకే పరబ్రెమ్మం
పట్టువడ్డంలేదు- అన్నాడు   బైరాగి. ఆ తత్వంలో ఎంత లోతర్థముందో!
అదర్థమవాలంటే కల్లుదుకాణంలోనే కూర్చొని పరమాత్మ కోసం వెదుకులాడాలి. మందు
గ్లాసు చూస్తేనే మొహం చిట్లించేస్తే ఇహ పరమాత్మ ఈ-మెయిల్ అడ్రసైనా ఈ
జన్మకు  మీకు దొరుకుతుందా? బైరాగోళ్లే ఇవాళా రేపూ ఈ దేశంలో ధర్మపన్నాలు
వల్లించి జనాలను బాగా ఒప్పిస్తున్నది కూడా. మీ సుమతీశతకంగాళ్లతో అయ్యేదీ
పొయ్యేదీ కాదు గానీ ఈ సోమపాన మహిమల మీద ఎట్లాగైనా బళ్లల్లో అయ్యవార్ల
చేతనో, గుళ్లల్లో  ఏ సన్యాసి మహరాజుల చేతనో చెప్పించలి! అప్పుడే బ్రాందీ
బాటిల్ పట్టినోడికి గాంధీతాత గౌరవం దక్కేది.
ఉల్లిపాయ వద్దనే సాధుపుంగవులే పరగడుపునే మడి కట్టుకుని ఓ పుడిసెడు మధువు
పుచ్చుకుంటే తప్ప త్వరిత గతిన జీవన్ముక్తిని సాధించలేరని ప్రచారం
చేయాలంటావు!  మత్తుపురాణాలు మాత్రమే ప్రవచనవేత్తల  నోట ప్రపంచమంతా విని
దారికి రావాలంటావ్! భలే గమ్మత్తుగా ఉందయ్యా బావా మొత్తానికి నీ కొత్త
పొలిటికల్ ఎత్తుగడ!
పోలిశెట్టికి పోలిటిక్సుతో పోలికేంటి.. సెటైరా? చట్టసభలంత కాదులే నాయనా
మరీ  ముంతకల్లు కాంపౌండ్లయినా! లోకంలో లోపిస్తున్న  మంచీ మర్యాదా ఇప్పుడు
కొంచెమైనా కనిపించేది మా  మందు భయ్యాల మధ్యనే బావయ్యా! ఎంత ఒళ్లు మరిచి
తాగి వాగినా మరీ పొలిటీషియన్సంత బేవార్సుగా మా  నోళ్లు తూలవు.
ఊక మాటలు మానేయ్ బావా! నా టైం వేస్ట్! దీనికన్నా ఓ తెలుగు సినిమా చూడ్డం
అన్నిందాలా బెస్ట్!
ఉత్తుత్తి మాటలు కాదు బ్రదరిన్లా!  మహా తత్వవేత్త ఉమర్ ఖయ్యాం 
తత్తరపాటు లేకుండా ఎమన్నాడో తెలుసా! ‘గడిచిన ఘడియలేవో గడచిపోయినయ్!
రాబోయే కాలం మీదా ఏ నమ్మకం లేదిప్పుడు. ఈ వర్తమానమే బేబీ మన ముందున్న
ఆస్తి! బేవార్సు ఆలోచనలు మానెయ్! పానపాత్ర నిండా ముందు మందు నింపు! దా..
వీలైనంతగా ఈ బతుకును చింపవతల పారేద్దాం.. ఆనక ఆనందంగా చద్దాం' అంటాడు.
విని చచ్చే నాథుడేడీ? ఖయ్యామా అంత గొప్ప కవిత్వం చెప్పిందీ! కాదయ్యా
బావా! అతగాడి  చేతిలోని ఆ  మందు గ్లాసు’
కిక్కెక్కంది బాగా!  ఇహ ఇంటికి నడువు.. బెటరు!
ఆగవయ్యా సామీ! అప్పుడే ఏమయింది? ముంతలో ఇంకా మూడో వంతు  మిగిలే ఉంది!
ముంతా? బెల్జియం మేడ్ గాజు గ్లాస్  నీ కళ్లకు ముంతలా
కనిపిస్తుందా?కైపెక్కినప్పుడే తాగుబోతుల నోట ఈ మాదిరి వింత కబుర్లు
వినిపించేది!  హ్హా.. హ్హా..హ్హా!
ఎందుకన్నా ఆ ‘హే’ళాకోళం? అజంతా హరప్పా శిథిలాలు తవ్వినప్పుడూ ముందుగా
బైటపడ్డవి అప్పటికాలం  మా తారసం సభ్యులు తాగి పారేసిన  చట్లూ, ముంతలే!
సారాయా?.. కల్లా?.. చీపా?.. ఆఫీసర్స్ ఛాయిస్సా? అన్న తేడా ఉండదని
మందంటేనే గిట్టని మీ బోటి మందభాగ్యులకేం తెలుసు! ‘అమరులు త్రావుచో
నమృతమందురు దీని, నహివ్రజం బజ/ స్రముఁ గొని యానుచో నిది రసాయనమందురు’
అన్నాడు నన్నెచోడుడు. దేవుళ్లు తాగితే  అమృతం, పాతాళంలోని నాగులు తాగితే
రసౌషధం! శాస్త్రాల ప్రకారం ఒక్కో ‘క్లాసు’ గ్లాసుకు ఒక్కో పేరు! పేరేదైనా
ఒకే రకంగా కిక్కు, కక్కు పీకల్దాకా తాగ్గలిగితే!    నీకో సీక్రెట్
చెప్పనా! నిప్పు కనిపెట్టకముందు ఆదిమానవుడు ఎండావానలకు, చలివణుకుళ్లకు
ఎట్లా తట్టుకు నిలబడ్డాడో తెల్సా? అంతా యిప్పసారా గమ్మత్తు. వార్
టైమ్సులో ఏనుగులకి   బాగా మద్యం పట్టిస్తే తప్ప శత్రుసైన్యం మీదకు
దూకుడుగా వెళ్లేవికావు! 'ఇండికా'లో మెగస్తనీస్ అంతటి  మహానుభావుడే
మహత్తరమైనదని మెచ్చుకున్న మద్యాన్నేగదయ్యా మేం తాగేదెప్పుడూ ఎన్ని
బడ్జెట్ పద్దుల్లో రేట్లు రెట్టింపవుతున్నా!  మధ్యలో మీ చెల్లాయికి
ఎందుకంట నెప్పులు.. నా మాడుకు  బొప్పులు!
సోమలింగం ఫైటింగ్ మూడ్ కి వచ్చేసాడు.ఇహ ఇంటికి చేర్చకుంటే మా ఇంట్లో
నేనవుతా బ్యాడవుతా ముందు!
కారు స్టార్ట్ చేసి వచ్చి ‘లే బావా! ఇంటి దగ్గర డ్రాప్ చేసొస్తా.. కమాన్’ అన్నా.
 కమాన్ బావా! కామానికీ సూత్రాలు రాసిపెట్టిన మునులు మధుపానానికి మాత్రం
శాస్త్రాలు రాయకుండా ఉంటారంటావా? తంజావూరు తాళపత్ర గ్రంథాలయంలో మరికాస్త
మందుకొట్టి వెదికితే ఒకటో రెండో పెగ్గుకావ్యాలు తప్పకుండా బైటపడతాయని  మా
వర్శిటీ ప్రొఫెసర్ ఒహటే నస. నువ్వూ వస్తావా! సర్దాగా ముగ్గురం కల్సెళ్ళి
ఓ సారి ఆ పుస్తకం కాపీ కొట్టుకొచ్చేద్దాం! పీ.హెచ్డీ కొట్టేద్దాం!
వస్తాలే కానీ.. నీ ముంతలో సరుకు ఇంచి కూడా మిగల్లేదు. ఇహనన్నా లేవరా మగడా !
మౌర్యులకాలంలోనే మనవాళ్లు ఈ ఇంచీస్  కనిపెట్టారంటారు బావా యూ.. నో!
లోటాలో మందు కొలుచుకునేందుకు కాకపోతే  మరెందుకంటా ఈ కొలతల తంటా?
బలవంతంగా రెక్కలు పట్టుకుని పైకి లేపే తిప్పల్లో నేనున్నాను. కోఆపరేట్
చెయ్యకుండాచంద్రయాన్’ మిషన్ ఇంజనులో ఇంధనానికి బదులు ఏ కల్లో సారానో
కొట్టించుంటే.. సముద్రంలో కుప్పకూలే బదులుఉ కూల్ గా  చందమామ చూట్టూతా
చక్కర్లు కొడుతుండేది ఈపాటికి! అంటూ సోమలింగం సోది!
ముందే ఈ మందు ఐడియా రానందుకు మన   శ్రీహరి కోట శివ సార్  ఇప్పుడు తెహ
పాశ్చాత్తాప్ప..ప్పా..ప్పా ..ప్పా’
లేవలేక పడిపోయిన సోమలింగాన్ని చూసిం తరువాత ముందు మా చెల్లాయి మీద చచ్చే
బెంగేసింది నాకు. ‘తాగుబోతులతో ఈ దేశంలో కాబట్టి ఆడవాళ్లింత ఓపిగ్గా
కాపురాలు నెట్టుకొస్తున్నారు. సర్కార్లు మారినప్పుడెల్లా తతిమ్మా
ఇంపార్టెంట్ ఇస్యూస్ ఎన్నున్నా ఆన్ని ఊళ్లల్లో అన్ని తరగతుల ఆడవాళ్లు
మద్యాన్ని ముంసు నిషేధించమని ఎందుకు వేధిస్తున్నారో  ఇప్పుడు కళ్లారా
అర్థమవుతుంది.
పడిపోయిన సోమలింగం బావ మళ్లా లేస్తూ ‘దేవుడు కూడా ఆదాము అవ్వల్ని ఆపిల్
ముట్టుకోవద్దన్నాడే తప్పించి.. తప్ప జోలికి వెళ్లద్దని హద్దులు పెట్టింది
లేదు బావా! ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే గమ్మత్తైన ఉపాయం ఈ మత్తు మందులో
ఉంది బ్రోఇన్ లా! వాగడం ఒక్కటే పట్టించుకోవద్దు.  ఈ అమృతం తాగినప్పుడే
ఎన్నడూ  చదివెరుగని అమరకోశం సూత్రాలు కూడా సూటిగా నోటి నుంచి
తన్నుకొచ్చేస్తాయ్! ఇట్లాంటి డ్రౌజీ కండిషన్లలో  ఉన్నప్పుడే  మన
రుషివర్యులు  ఎన్నెన్నో కొత్త కొత్త విశేషాలు శోధించి సాధించింది.
అష్టాంగమార్గాల్లో ఆఖరన 'సమాధి' అని ఒకటుంది! దాని పవర్ నీకు తెలుసా’
తెలీదు.. తెలీదు .. చూపించు.. తొందరగా!‘ అడిగాను ఆశగా!
ఫుల్లుగారా’ కొట్టి చల్లంగా పడుంటమే!- అంటూ పడుకుండిపోయాడు.. ముందే
నేను ఊహించినట్లు!
అమ్మయ్య! ఈ వర్ధంతికి ‘సమాధి’లోకి వెళ్ళిపోయాడు మా సోమలింగం బావ.
సోమలింగం బావను కారులో ఇంటికి మోసుకు పోతుంటే దారిలో ఈ మందు మహమ్మారిని
గురించి మనసులో బోలెడన్ని దిగుళ్లు.. కందిరీగల్లా! అక్కచెల్లెళ్ల
కాపురాలను తల్చుకుని కళ్లూ తడి అయ్యాయి.. బాపూజీ మీద ఒట్టు!
***


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...