Tuesday, June 15, 2021

కాలమర్మం! -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు సాహిత్య సంపాదకీయం .. 05:01:2014 నాటిది)


 'ఒక్కనాటి ప్రపంచము ఒక్కనాటి వలెకాదు/ ఒక్క నిమిషము వలెనొకటి గాదు-' ఆధ్యాత్మిక ఆచార్యులు అన్నమయ్య కాలభావన అది. భారతీయుల కాలవివేచన వేదకాలం నాటిది. బ్రహ్మప్రోక్తాలని ప్రతీతి కలిగిన వేదాలు 'సూర్యుణ్ని ఉషాకన్యానాథుడి'గా ప్రస్తుతించాయి (రుగ్వే. 7 మం. 75 రుక్కు). బ్రాహ్మణాలైతే నక్షత్ర మండల ప్రస్తావనలూ తీసుకొచ్చాయి. కల్పం, బ్రహ్మకల్పం వంటి కాలాపేక్ష సిద్ధాంతాలు పురాణేతిహాసాలనిండా బోలెడన్ని. 'ద్వంద్వాన్ని సమదృష్టితో చూడటమే కాలాన్ని జయించడం'గా భావించాడు ఆంగ్లరచయిత, తత్వవేత్త హక్స్‌లీ. మన శంకర భగవత్పాదులు ప్రబోధించిన 'మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్య్ర చిత్రీకృతం' సిద్ధాంతంలో ఇమిడిఉన్నదీ ఇదే రహస్యం. 'అతీతాది వ్యవహార హేతుః' అని కాలాన్ని యుగాల కిందటే నిర్వచించిన మహానుభావులు మన ప్రాచీన జ్ఞానులు. కాలచింతనే మహా వింతైనది. భూమి పుట్టుకనుంచీ బుద్ధిజీవులను వేధిస్తోంది. బమ్మెర పోతనామాత్యుడు భాగవతంలో 'ప్రారంభ సంపత్తికాధారం బెయ్యది?' అని సందేహపడితే... 'ఎందులోనుంచి ఎప్పుడు ఎలాగ పుట్టింది కాలం?' అని ఆరుద్ర 'త్వమేవాహం'లో తర్కం లేవదీశాడు. 'మొదలూ చివరా తెలియని/ అనాది గర్భాన్ని చీల్చుకుని/ వూపిరి పోసుకున్న క్షణాన/ నాకు తెలియదు ఈ అనంత కాలవాహిని పొడవెంతో' అనే మథన మనిషికి ఆకులు అలమలు మేస్తూ కారడవుల్లో తిరుగాడే నాటినుంచే వెంటాడుతోంది. కాలం- పదార్థం నాలుగో పరిమాణమన్న సాపేక్ష సిద్ధాంతం అర్థం కానంతకాలం కంటిముందు కాలంచేసే గారడి అంతా దేవలీలే. 'జనయిత్రి గర్భకోశమున బిండము జేసి యవయవంబుల దాన నలవరించి/ శిశురూపమున దానిక్షితి తలంబునద్రోయడం' మొదలు 'కర్ర చేతను బట్టించి కదలలేని స్థితికి దెప్పించడం' దాకా 'కాలమహత్తత్త్వంబు నిట్టిదనుచు వర్ణనము' చేయటం వశం కాదన్న బ్రహ్మశ్రీ రాజలింగ కవి విస్తుబాటే ఇందుకు ఉదాహరణ. కాలమర్మం అవగాహన కావాలంటే 'స్థల కాల పరస్పరాధారిత సిద్ధాంతం' బోధపడాలి. రెండు సంఘటనల మధ్య ఉండే అంతరం 'కాలం' అని, రెండు పదార్థాల మధ్య ఉండే దూరం 'స్థలం' అనుకునే సాధారణ భావజాలం నుంచి బైటపడాలి. ప్రకృతి గుణకల్పవల్లి చూపించే చిత్రాలన్నింటిని కాలపురుషుడు కల్పించే లీలావిలాసాదులుగా మనిషి భ్రమించేది ఆ నారికేళపాక సిద్ధాంతం తలకెక్కకే. 'ఒక తరి సంతోషము, వే/రొక తరి దుఃఖంబు, మరియొక తరి సుఖ మిం/కొక తరి గష్టము' కూర్చే తలతిక్క కాలానిదని తూలనాడేదీ అందుకే. మనిషి కంఠశోషేగాని కాలానికేమన్నా కనికరం ఉంటుందా? 'కుంటుతూ కులుకుతూ తూలుతూ గునుస్తూ... ఇలా సాగుతుందేమిటి చెప్పుమా కాలమా!' అని బుగ్గలు నొక్కుకోవడానికి సమయమేమన్నా 'సౌందర్యస్పర్ధ'లో సుందరాంగుల అంగవిన్యాసమా? కాలం ఒక క్షణమైనా వెనక్కు చూడదు. ఏం సాధించాలనో ఈ నిబద్ధత?దువ్వూరివారు 'వనకుమారి'లో అన్నట్లు 'కష్టజీవి కన్నీటి కాల్వకైన గాల చక్రము నిలవదు/ ధారుణీపాల పాలనా దండమునకు/ వెరచి యాగదు' కాలం. బోసిపాపల్ని నవ్వించడం, పగటికలలు కనే మగతరాయుళ్లను కవ్వించడం... 'చావుకబుర్లు వింటూ స్వగతంలో విలపించే వృద్ధులను దీర్ఘనిద్రకై దీవించడం'- కాలం ధర్మం.

అనంతమైనది భూతకాలం. అశేషమైనది భావికాలం. నడిమధ్యలో కాసింతసేపు కాలు ఝాడించినంత మాత్రాన సర్వం తెలుసని అనుకోవడం అజ్ఞానం. 'దైవరూపంబు కాలంబు దానికెపుడు/ లోటు గలుగదు మన బుద్ధి లోపంబుగాని' అన్న పానుగంటివారి 'కల్యాణరాఘవం' మాట నిజం. 'బాలు కంట తాబేలు వలెను/ ...వృద్ధు కంట లేడిరీతి' పర్వెత్తు కాలం నిరూపించేదీ ఈ సత్యాన్నే. కాలాన్ని దేవతలైనా వంచించలేరు అనిగదా కౌటిల్యుడి సూక్తి! మానవమాత్రుల శక్తియుక్తులు ఇక దాని మహత్తు ముందెంత! భర్తృహరి వైరాగ్య శతకంలోని పది శ్లోకాలు చాలు- కాలం ఎంత బలీయమైనదో తెలియజెప్పడానికి. 'భావినుంచి గతంలోకి వర్తమానం గుండా సాగే క్షణసముదాయాల నిరంతర ప్రవాహం'గా కాలాన్ని నిర్వచించారు అధునాతన కాలశాస్త్రవేత్తలు స్టీఫెన్‌ హాకింగ్‌, ఐన్‌స్టీన్‌, లైబ్నిజ్‌. కాంతివేగాన్ని మించి ప్రయాణిస్తే గతంలోకి తొంగి చూడటమూ సాధ్యమేనని హెచ్‌.జి.వెల్స్‌ వూహ. అది వాస్తవమైతే ఎంత బాగుణ్ను! రాయలవారి భువన విజయాన్ని పునర్దర్శనం చేసుకోవచ్చు. 'ఫెళ్ళుమనె విల్లు- గంటలు ఘల్లుమనె-గు/ భిల్లుమనె గుండె నృపులకు- ఝల్లుమనియె జానకీ దేహమొక నిమేషమ్ము నందే' అని కరుణశ్రీ వర్ణించిన 'శివధనుర్భంగ' దృశ్యాన్ని కమనీయంగా పునర్వీక్షణ చేసి పులకించిపోవచ్చు. వూహకు అవధులు లేకపోవచ్చు. కాని దాన్ని భావించే బుద్ధికున్నాయిగా హద్దులు! కాలానికే గనుక నిజంగా కళ్లుంటే? 'నాజూకుగా ఉండే మనుషులలో బూజు పట్టిన భావాలు చూసి/ కొత్తచివుళ్లు తొడిగిన పాత చెట్ల చాటున/ పువ్వుల మిషతో నవ్వుకుంటుందా? విసుగూ విరామం లేకుండా../ అభివృద్ధీ, వినాశనం, క్షామం, క్షేమం విప్లవం... విశ్వశాంతి' అని కలవరించే మనిషిని చూసి కలత పడుతుందా?' ఎక్కడ బయలుదేరిందో, ముందుకే ఎందుకు కదులుతుందో, ఎప్పుడు ఆగుతుందో... ఏమీ తెలియదు. మనిషికి తెలిసిందల్లా కాలంతో కలిసి ప్రస్తుతంతో ప్రయాణించడమే. ఆ ప్రస్థానంలోని మలుపురాళ్ల గుర్తులే సంవత్సరాలు. నడచివచ్చిన దారివంక మరోసారి వెనక్కి తిరిగి చూసుకోవడం, గడవాల్సిన దూరాన్ని బుద్ధిమేరా ఒకసారి బేరీజు వేసుకుని... కాలూ చేయీ కూడదీసుకోవడం... బుద్ధిమంతులందరూ చేసే పనులు. చేయాల్సిన పనులు. కాలాన్ని సద్వినియోగపరచుకునే ఘన సంకల్పమిది!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సాహిత్య సంపాదకీయం ..05:01:2014 నాటిది)

Monday, June 14, 2021

ధూమకేతువు చెప్పే నీతిపాఠం -కర్లపాలెం హనుమంతరావు



దేవుళ్ళు తాము చంపిన రాక్షసుల పేర్లు బిరుదులుగా తగిలించుకోడం సరదా కోసం కాదు. పూజించే భక్తులను రాక్షసత్వంతో ప్రవర్తించవద్దని హెచ్చరించడం కోసం. వినాయకుడిని 'ధూమకేతవే నమః' అని కీర్తించడంలో కూడా ఇట్లాంటి ఓ గట్టి హెచ్చరికే దాగివుంది.చెడ్డపనులు చేస్తే మళ్లీ రాక్షస ప్రవృత్తితో జన్మ ఎత్తాల్సొస్తుందనే బెదురు  గతంలో బాగా ఉండేది. కానీ అట్లా ఎత్తిన జన్మలో కూడా  కొన్నైనా మంచి పనులు  చేస్తే ఈ  దుర్జన్మ పీడా వగదిదుతుందన్న  ఊరటా పురాణేతిహాసాల తాలూకు కథలలో కనిపిస్తుంటుంది.  ఈ సందర్భంగానే ధూమాసురుడు అనే దుర్మార్గుడిని గురించి కొంత చెప్పడం.

పుట్టింది రాక్షస జాతిలోనే అయినా ధూమాసురుడు వేదాలను మొత్తం కంఠోపాఠం చేశాడు. చదివిన చదువుకు.. నడిచే తీరుకు బొత్తిగా సంబంధం ఉండదనడానికి ఈ దుర్మార్గుడి దుష్ప్రవర్తనే సరైన దృష్టాంతం. శివుడికి భక్తుడు అయివుండీ భృగువుతో సంవాదం చేసే పాటి పాండిత్యం సాధించినా రజోగుణం ప్రబలినప్పుడు మాత్రం యుద్ధాలు చేయాలని, దేవతలనే వాళ్ళు ఎక్కడున్నా వెదికి మరీ చీల్చి చెండాడాలని అణుచుకోలేనంత కుతిగా ఉండేది అతగాడికి. అట్లాంటి తీటలు తీరడం కోసం జైత్రయాత్రలు చేయడం, దేవతలను చెండుకు తినడం రాక్షస జాతికి సహజమే అయినా, దేదేవతలకు మాత్రం  పద్దాకా ఏదో ఓ రాక్షసాధముడి కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి.

ధూమాసురుడి దెబ్బకు తట్టుకోలేక ఎప్పట్లానే శివుడిని ఆశ్రయిస్తే, ఆయనా ఎప్పట్లానే ఆశ్రితులను కాపాడే పని పెద్దకొడుకు వినాయకుడికి పురమాయించాడు.

తండ్రి ఆజ్ఞ! తప్పుతుందా! ఏం చేద్దామా అని బొజ్జ గణపతయ్య బుర్ర బద్దలు చేసుకొనే సమయంలో తరుణోపాయంగా మాధవుడు అనే బ్రాహ్మడి కుటుంబం తాలూకు తంటా ఒకటి తెలియవచ్చింది. సంతానవతి కాని  కారణాన  మాదవుడు  భార్య సుముదను  వదిలేస్తానని తరచూ బెదిరిస్తుంటాడు. ఆమెకు మరో దారి లేక నారాయణుడిని ఆశ్రయించడం, ఆ సందు చూసుకుని వినాయకుడు ఆమె గర్భంలో జొరబడ్డం జరిగిపోతుంది.

యుద్ధానికని  బయలుదేరే  ధూమాసురుణ్ణి ఈసారి ఆకాశవాణి గట్టిగానే హచ్చరిస్తుంది. 'చావు మూడే రోజు దగ్గర్లోనే ఉంది. ఇట్లా  సుముదమ్మ కడుపులో జీవం పోసుకొంటోంది' ఆవటా అని. ఎంత రాక్షసుడికైతే మాత్రం ఎదుటి వాళ్లను ఏడిపించి చంపడం సరదా గానీ, స్వయంగా  చావును కావులించుకోవడానికి సరదా ఎందుకు పుడుతుంది? అందరికి మల్లేనే ఆ రాక్షసుడూ మృత్యుభయంతో యుద్ధాలు గిద్ధాలు కట్టిపెట్టి ఇంచక్కా దక్కిన రాజ్యాన్ని చక్కగా   'రామరాజ్యం' మోడల్లో 'ధూమాసుర రాజ్యం' గా సుప్రసిద్ధం చేద్దామని సిద్ధమయిపోయాడు.   అందుక్కారణం అతగాడి కొలువులో కనీసం ధర్ముడు అనే ఒక్క మంచి మంత్రైనా ఉండి రాజుకు హితబోధ చేయడం. తతిమ్మా కొలువు కూటానికి ఇది మహా కంటకంగా మారింది. ధర్ముడు లేని సందు చూసుకొని ధూమాసురుణ్ని రెచ్చగొట్టేస్తారు.

అటు ధర్ముడు ఇటు దుర్మార్గులైన తతిమ్మా మంత్రులు.. దోళాంళనల మధ్య ఊగిసలాడే ధూమాసురిడి వికారాలకు అమృతంలా అనిపించే సలహా ఎవరిస్తారో తెలీదు కానీ.. ఇస్తారు. ఆ వికృత  ఆలోచన కార్యరూపమే సుమద కడుపులో ఎదిగే వినాయకుణ్ణి సంపూర్ణాకారం తీసుకోక ముందే సఫా చేసేయడం.

ధూమకాసురుడి ప్రయత్నం వృథా అయిందని,   దుర్మార్గుడే వినాయకుడి చేతిలో చివరికి ఖతమయ్యాడని వేరే చెప్పక్కర్లేదు కానీ, ఇక్కడ చెప్పవలసిన అసలు ముఖ్యమైన మాట మరోటి ఉంది.  చరిత్ర ఎటూ మనకు పట్టదు.  కనీసం మనం నెత్తికెత్తుకొని నిత్యం పూజించే పురాణాలు, ఇతిహాసాలలో కనిపించే ఈ తరహా నీతికథలనయినా  మన సో కాల్డ్ ప్రజానేతలు  సమయ సందర్భాలను బట్టి ఖాతరు చేస్తుంటే ఎన్నుకునే సమయంలో ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ముకాకపోను.  ఇప్పుడు జరుగుతున్న 'రఘు రామరాజు  కారాగార  కఠిన దండన' కథా కమామిషు వింటుంటే మంచి పాలకులు మనకు ఇక సంప్రాప్తించే యోగం ఉందా' అని బాధేస్తుంది. 

మనుషుల .. ముఖ్యంగా రాజకీయాలలో నలిగే పెద్దమనుషుల మతిమరుపు  రోగం బాగా ఎరిక కాబట్టేపాపం వినాయకుడు దుర్మార్గుడైన ధూమాసురుడిని మళ్లీ కనిపించకుండా శిక్షించినా..  తన పేరులో అతగాడి   పేరు దూర్చుకుని 'ధూమకేతువు'ను అని కూడా  గుర్తు చేయడానికి పదే పదే ప్రయత్నిస్తున్నాడు. పాలకుల పెడబుద్ధులు సరిచేయడం భగవంతుడి తరమైనా అవుతుందా? చూద్దాం!

- కర్లపాలెం హనుమంతరావు

12 -06 -2021

Saturday, June 12, 2021

రాజద్రోహం – వ్యాసం -కర్లపాలెం హనుమంతరావు

 

24 విభాగాలుగా ఉన్న భారత రాజ్యాంగంలోని మూడో భాగం ప్రాథమిక హక్కులకు సంబంధించింది. ప్రపంచంలోని మరే  రాజ్యాంగమూ ఇంత విస్తృతంగా ఈ తరహా హక్కులను గురించి ప్రస్తావించింది లేదు. అయినా రాజ్యాంగ  హక్కుల ఉల్లంఘన ఇక్కడే ఎక్కువగా జరగడం.. అదో విచిత్రం!

మాట్లాడే హక్కు నుంచి శాంతికి భంగం కలగకుండా సమావేశాలు జరుపుకునే హక్కు, సంఘాలు.. సంస్థలు పెట్టుకునే హక్కు, దేశంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లగలగడం, నివాసిస్తూ శాశ్వత చిరునామా పొందడం, చట్టబద్ధమైన పని, వ్యాపారం, ఉపాధి ఏదయినా  యధేచ్ఛగా  చేసుకోవడం .. వంటి హక్కులన్నింటి మీదా 19 నుంచి ఇరవైరెండో అధికరణ దాకా రాజ్యాంగంలో ఆదేశాలున్నా.. అతి ముఖ్యమైన వ్యక్తిగత హక్కుకు మాత్రం తరచూ  తూట్లు పడడం దేశ  ప్రజాస్వామ్య వ్యవస్థను  నవ్వులపాలు చేసే వికృత చేష్టగా  మాత్రమే చెప్పుకోక తప్పదు.

పుస్తకాలలో కాకుండా పౌరుడు వాస్తవ జీవితంలో ఎంత వరకు పౌరుడు  స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు అనుభవిస్తున్నాడన్న అంశం మీదనే కదా   ప్రజాస్వామ్య స్ఫూర్తి సాఫల్యం ఆధారపడడం! అక్కదికీ ఎంత ప్రాథమికమైన హక్కైనా వ్యక్తి అనుభవించే విషయం దగ్గరికొచ్చే సరికి రాజ్యాంగమూ కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోలేదు. శిక్షాస్మృతి ఆర్టికల్ 124 (ఎ) స్వేచ్ఛను యధేచ్ఛగా అనుభవించేందుకు లేకుండా విధించిన ఈ తరహా జాగ్రత్తలలో ఒకటి. ఇది ఆంక్ష కాదు.   ముద్దుగా తెల్లదొరలు ‘రాజద్రోహం గా పిల్చుకున్న ఆ కట్టడి స్వాతంత్ర్యం సాధించుకున్న ఇన్నేళ్ల తరువాత కూడా మన రాజ్యాంగంలో  భద్రంగా పడివుండడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?

ఇంతకూ ఈ సెక్షన్ 124 (ఎ) ‘రాజద్రోహం’ అంటే ఏమిటీ? అంటే- స్థూలంగామాటలు, సైగలు, హావభావాలు, పీడించడాలు వంటి ఇంకే రకమయిన  చేష్టల ద్వారా అయినా సరే  ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాలను పడగొట్టాలనిపించేలా పిచ్చి  ప్రేలాపనలకు  దిగితే సరాసరి ‘రాజద్రోహం’ నేరం కింద గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష పడేలా చర్యలు తీసేసుకోవచ్చు.  వలస పాలకులు అప్పట్లో తమ రాజ్యం భద్రంగా ఉండడం కోసం పెట్టుకున్న అమానుష  ఆంక్ష దేశం స్వాతంత్ర్యం సాధించుకున్న  తరువాత ఇక రాజ్యాంగంలో ఎందుకు? ఇటీవల కాలంలో దేశంలోని చాలా ప్రభుత్వాలకు   గిట్టని వాళ్ళ నోళ్ళు మూయించడానికి మాత్రం  ఈ సెక్షన్ మహా వాటంగా ఉపయోగిస్తున్నది. అదే దిగులు.

 శిక్షాస్మృతిలో ఒకటిన్నర శతాబ్దాలుగా అట్లాగే పడివున్న భయంకర వ్యర్థ చట్టానికి సవరణలేమైనా వీలవుతాయేమోనన్న సంకల్పంతో సిఫార్శుల నిమిత్తమై రెండేళ్ల కిందట  కేంద్రం, హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  నిపుణుల కమిటీ నొకటి వేయడం, ఐపిసి సంస్కరణలకు సంబంధించి సూచనలేమన్నా ఉంటే చెప్పమని ప్రజల నుంచి, , ప్రజాసంఘాల నుంచి కోరడం లాంటి లాంనాలన్నీ పూర్తిచేసింది కూడా. కానీ, అంతు చిక్కని చిక్కులేవో రాజద్రోహం క్లాజు అంతిమ దహన సంస్కారాలకు అడ్డుపడుతున్నాయ్! బహుశా బెయిల్ కోసం ఏలాంటి నిబంధనలు ఇందులో పొందుపరచవలసిన అవసరం లేనందువల్లనా? ప్రభుత్వాలకు గిట్టనివాళ్లను ఎవరినైనా ఎంత కాలమైనా నిర్బంధంలో ఉంచుకొనే వెసులుబాటు ప్రభుత్వాలకు ఈ సెక్షన్ కల్పిస్తుంది కదా!   

1950లో రాజ్యాంగాన్ని రాసుకుని ఆమోదించే సందర్భంలోనే ఐపిసి తాలూకు 124 (ఎ) అధికరణం రద్దు చెయ్యాలనే ప్రతిపాదన బలంగా వినిపించింది. సర్దార్ భోవిందర్ సింగ్, ప్రొఫెసర్ యశ్వంత్ రాయ్ లాంటి రాజ్యాంగ ప్రముఖులు 1948 డిసెంబరు 2న జరిగిన రాజ్యాంగ  ముసాయిదా కమిటీ చర్చలో ఈ ‘దేశద్రోహం’ అనే దుర్మార్గ పదాన్ని చేర్చడాన్ని గట్టిగా వ్యతిరేకించారు. రాజద్రోహం క్లాజు మౌలికంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి  విరుద్ధమనేది మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అభిప్రాయం కూడా

వక్రీకరించేందుకు, వ్యతిరేకులపై ఉపయోగించేందుకు సులువుగా ఉపయోగపడేది ఈ  సెక్షన్ 124 (ఎ) లోని ‘అవిశ్వాసాన్ని’ అనే పదం. అందుకే   ప్రసిద్ధ న్యాయవాది ఎ.జి  నూరానీ ఈ నిబంధన కింద, మేం ఎల్లవేళలా ప్రభుత్వాన్ని ప్రేమించక తప్పదన్నమాట’ అని ఎద్దేవా చేసేవారు.  న్యాయశాస్త్ర కోవిదుడు  ఫోలే ఎస్. నారిమన్ వాదన ప్రకారమయితే ప్రభుత్వాన్ని అవమానించడం లేదా విమర్శిస్తూ రాయడం, విద్వేషపూరితంగా మాట్లాడటమైనా సరే.. అసలు  దేశద్రోహం సెక్షన్ 124 (ఎ) కిందకే  రాదు!

కానీ, ఇటీవలి కాలంలో, వివిధ రాష్ట్రాలలో  పాత్రికేయుల నుంచి  అధికారుల దాకా ఎందరో తరచూ ఈ  దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు! ఈ నేపథ్యంలోనే ఈ సెక్షనుతో పాత్రికేయుల ప్రాథమిక హక్కులు నిరాకరించడాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానం  బాధ్యులను గట్టిగా హెచ్చరించడం.  తప్పు పట్టే  పత్రికలది ప్రజల నిరసనగా తీసుకోవాలే తప్పించి,   దేశద్రోహంలాంటి నాన్-బెయిలబుల్  అభియోగాలు మోపమేంటని జనసామాన్యంలాగానే సుప్రీం కోర్టూ అభ్యంతరపెట్టడం ప్రజాస్వామ్యవాదులందరికీ ముదావహం కలిగించే పరిణామం.  

ప్రధాని నరేంద్ర మోడీపై అవమానకరంగా, ఆరోపణలు చేసారంటూ ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువాపై బీజేపీ పరువు నష్టం దావా వేసిందా మధ్యనభాజపా నేత అజయ్ శ్యామ్ దాఖలు చేసిన అభియోగం మేరకు హిమాచల్ ప్రదేశ్ లో నమోదైన రాజద్రోహం’ కేసును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు  భావప్రకటనా స్వేచ్ఛకు ఊపిరిపోసే ఔషధం.

భావప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకంగా వేసిన రాజద్రోహం వ్యాజ్యం పై 1962 నాటికే  కేదార్ నాథ్ సింగ్ కేసులో    న్యాయమూర్తులు యు.యు లలిత్, వినీత్ శరణ్ లతో కూడిన ధర్మాసనం పాత్రికేయులకు ఊరటనిచ్చింది. మళ్లీ ఇప్పుడు, కోవిడ్.. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో ప్రముఖ పాత్రికేయుడు  వినోద్ దువా తయారు చేసిన యూ-ట్యూబ్ కార్యక్రమం బిజెపి నాయకులకు ఆగ్రహం తెప్పించిందని,  ప్రధాని పరువుకు నష్టం కలిగినట్లు ఏ   ఐపిసి  501,  ఐపిసి 505 సెక్షన్లో  పోలీసులు బనాయించడాన్ని  సుప్రీం కోర్ట్  తీవ్రంగా తప్పుపట్టింది.  

ప్రభుత్వాన్నైనా సరే  విమర్శించే హక్కు సాధారణ పౌరుడికి కూడా ఉంటుందని, హింసను ప్రజ్వరిల్లనంత కాలం ఆ విమర్శను రాజద్రోహం కింద పరగణించడం కుదరదని సుప్రీం మరోమారు తేల్చి చెప్పింది.

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వమూ  ప్రజావాణి వినిపించే రెండు ఛానళ్లపై కక్షపూరితంగా రాజద్రోహ నేరం ఆపాదించిన కేసును విచారించే సందర్భంలో సర్వోన్నత న్యాయస్థానం అసలీ ‘రాజద్రోహం’ అధికరణ 124(ఎ) మొత్తాన్నే మొదలంటా కూలంకషంగా పరీశీలించవలసిన అగత్యం ఏర్పడిందని  అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి తిరిగి మంచి రోజులు వచ్చే  ఆస్కారమున్నట్లు   న్యాయవ్యవస్థలో  చోటు చేసుకుంటున్న ఈ తరహా సంస్కరణవాదమే ఆశ కలిగిస్తున్నది. 

-కర్లపాలెం హనుమంతరావు

   11 -06 -2021

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...