'గెలుపు
ఓటమికి మధ్య పోటీ పెడితే ఓటమిదే ముందు గెలుపు'
అని చైనా సూక్తి. ప్రతి విజయం వెనక ఓ ఓటమి చల్లని
చూపు తప్పనిసరి.. బావి తవ్వేవాడి చేతికి మొదట మట్టే అంటుకున్నట్లు. శరీరం మినహా మరే ఆధారమూలేని జీవజాలానికి పోరాటం, బతకి తీరాలనే ఆరాటం మినహా జయాపజయాలు పట్టవు. కష్టించి కట్టుకున్న గూడు చెదిరిందని సాలీడు ఏనాడూ ఆత్మాహుతి
చేసుకోదు. మళ్ళీ
చినుకుపడి చెరువు నిండేదాకా కప్ప మండుటెండయినా బండమధ్యే రోజులు గడుపుతుందికానీ, గుండె పగిలి చావాలనుకోదు.
శీతోష్ణాలు, రాత్రింబవళ్ళు, చీకటి
వెలుగులు తరహానే గెలుపు ఓటములు! రాయితో రాయిని కొట్టి ఎవరూ నేర్పకుండానే నిప్పు రాజేయటంనుంచి చంద్రమండలంమీది
నీటిజాడలు ఆనవాలు పట్టిందాకా అసలు ఓటమంటే తెలియకుండానే నెట్టుకొచ్చాడా మనిషి!
అమ్మ కడుపులో పడ్డ మరుక్షణంనుంచే మనిషికి
పరీక్షలు మొదలవుతాయి. ఒలింపిక్సు పరుగుపందెం ప్రథమ విజేతైనా బుడిబుడి అడుగుల వయసులో ఎన్నో సార్లు తడబడి పడిపోయుంటాడు. 'పరుగాపక పయనించవె తలపుల నావ/ కెరటాలకు
తలవంచితె దొరకదు తోవ...' అని ఓ సినీకవి అన్నదీ- కష్టాలవారధి
దాటినప్పుడే అవరోధాలదీవిలోని 'ఆనంద
నిధి' సొంతమయేదని చాటేందుకు. 'మనిషి ఎన్ని శాస్త్రాలు చదివి పుణ్యకార్యాలు
ఆచరించినా ప్రాణంముందు అన్నీ తృణప్రాయమే' అన్నది మహర్షి
యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి బోధించిన జీవన సూత్రం. ప్రాణం అంత తీపి కనకనే అమృతంకోసం
దాయాదివైరం సైతం తోసిరాజని క్షీరసాగర మథనయాగానికి పూనుకున్నది దేవదానవులు. యమధర్మరాజంతటి సాక్షాత్ మృత్యుస్వరూపుడే
దండంతో ప్రాణాలు హరించేందుకు
వచ్చినా శివలింగంపట్టు వదలలేదు మార్కండేయుడు!
పెద్దలు 'జాతస్య
మరణం ధ్రువమ్' అన్నారని చేతిగీతలను
చేజేతులా చెరిపి
తొమ్మిదేళ్ళు కంట్లో పెట్టుకుని పెంచుకున్న శరీరం ఇది. బిడ్డ ఆటపాటలకు, ముద్దుముచ్చట్లకు తమ జీవితాలను చాదగా చేవదేరిన దేహం ఇది. 'ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి అయిదు భూతాలు. వాక్ పాణి పాద పాయు, ఉపస్థలలు అనే అయిదు కర్మేంద్రియాలు, త్వక్ చక్షు శ్రోత జిహ్వ ఆఘ్రాణాలు అనే అయిదు జ్ఞానేంద్రియాలు.. మనోబుద్ధిచిత్తాహంకారాలనే అంతఃకరణ చతుష్టయంతో కలిసి పంథొమ్మిదిమంది దేవతలకు ఆవాసం’గా మానవ శరీరాన్ని ప్రశ్నోపనిషత్తు ప్రస్తుతించింది. శాస్త్రోక్తమా.. కాదా అన్న వాదన తరువాత. నేటి సామాజిక జీవన వాతావరణంలో ఏ వ్యక్తి జీవితమూ ఉలిపికట్టె మాదిరి ఒంటరిగా సాగే వీలులేనిది. 'పుటక నీది, చావునీది, బతుకంతా దేశానిది' అంటూ లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్‌కు ప్రజాకవి కాళోజీ నివాళులు అర్పించారు. ‘బతుకంతా దేశానిది అనిపించుకోవడం ఆనక.. కనీసం కన్నవారిది, మనం కన్న వారిది, మనల్ని నమ్ముకుని బతుకుతున్నవారిది’ అని అయినా అనిపించుకోవాలి! బిడ్డ ఒక్కపూట పాలుమాలితేనే పాలు కుడిపే తల్లిరొమ్ము ఎలా తల్లడిల్లుతుందో తెలుసుకోవాలి! ఆకాశంలో అకాలచుక్క పొద్దుగా మారతాడనా కన్నతండ్రి కండల్ని చాది బిడ్డను చెట్టంతవాణ్ని చేసేదీ! 'నాతి చరామి' అంటూ చేయిపట్టుకొని పెళ్ళిపీటలమీద ఇచ్చిన హామీని నమ్మేకదా బిడ్డలకు తల్లిగా మారేది పిచ్చితల్లి! 'అమ్మా.. నాన్నేడే!' అని బిడ్డలు నిలదీసినప్పుడు నీకు బదులుగా తనెందుకు తలొంచుకోవాలి!
పండే
పొలాలు ఎండిపోయాయనో, ప్రే మించిన పిల్లకి వేరే అబ్బాయితో
పెళ్ళయిపోయిందనో, ఉద్యోగమూడి బతుకూ
పరువూ బజారున పడ్డాయనో, స్టాక్- మార్కెట్ కుప్పకూలి షేర్లు 'బేర్' మంటూ భయపెడుతున్నాయనో, అభిమాన కథానాయకుడి సినిమా తొలిప్రదర్శన టిక్కెట్లు దొరకలేదనో, నూటికి నూరు మార్కులు పరీక్షల్లో రాలేదనో, ఇష్టమైన
మహానేత హఠాత్తుగా పైకి వెళ్ళిపోయాడనో,
క్రికెట్టాటలో తనజట్టు ఓడిపోయిందనో,
నిరాహారదీక్షలకు కూర్చున్న నేతలు అర్థాంతరంగా
నిమ్మరసం తాగారనో.. తాగాలనో స్వీయప్రాణాలు నిష్కారణంగా తీసుకునే ధోరణులు సమాజంలో క్రమంగా పెరిగడం ఆందోళన
కలిగించే అంశం. దేశవ్యాప్తంగా నిరుడు 1.22లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడితే.. ఒక్క
ఆంధ్రప్రదేశ్‌లోనే 14,224 మంది బలవన్మరణాల పాలయ్యారు. స్వహననం సమస్యకు పరిష్కారం కానే కాదు. విసుగుదలకీ, ఓటమికీ ఔదలచి ఉసురు తీసుకోవటం
విరుగుడు అసలు కాదు. యోధులుగా మారి ప్రతీ అడుగూ ఓ దీక్షాశిబిరంలా
మార్చుకొనే సమరాంగణం జీవితమంటే. ఒడుపు
మరవనంతకాలం జీవనయానం ఏ వంకర టింకర మలుపుకూ అవరోధం
కాబోదు. 'అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు
వినిపిస్తుంది...' అన్న పాట అర్థం
ఒంటపట్టించుకొంటేనే వంటికి, ఇంటికి, దేశానికి మంచిది.
***
(ఈనాడు ఆదివారం
27-12-2009 నాటి సంపాదకీయం- ఈనాడు యాజమాన్య సౌజన్యంతో..
కృతజ్ఞతలతో)
మనవిః
కొన్ని సేకరించిన ఈనాడు-
ఆదివారం సంపాదకీయాలను ఇక్కడ వరసగా ప్రచురించడానికి కారణం.. మరింతమంది విజ్ఞులైన పాఠకులకు
మంచి విషయాలు చేరాలనే. ఈనాడు సంపాదకీయాలమీద
సర్వహక్కులు ఈనాడు యజమాన్యానివే. ఈనాడు యాజమాన్యం సౌజన్యం- కృతజ్ఞతలతోనే ఈ వ్యాసాల
ప్రచురణ ఇక్కడ జరుగుతున్నదని మనవి. ప్రచురించిన వ్యాసాలమీద ఎవరికైనా అభ్యంతరాలుంటే
తెలియ చేయగలరు. వెంటనే ఈ వ్యాసాలను ఇక్కడినుంచి తొలగించడం జరుతుగుతుంది అని గమనించ
గలరు.
No comments:
Post a Comment