అనగనగా ఓ అబ్బాయి. ఓ రోజున అతనికి ఓ అందమైన కల వచ్చింది.అందులోని సుందరాంగి
చేతులుచాచి మరీ తనలోకి చేరమని ప్రాథేయపడింది.
'అప్పుడేనా! నాకింకా నిండా పదహారేళ్లైనా నిండలేదు.
ఇది తరుణంకాదు’ అని తిరస్కరించాడు
అబ్బాయి.
అబ్బాయికి
యవ్వనం వచ్చింది. ఓ రోజు కలలో మళ్లీ మునపటి స్వప్నసుందరే ప్రత్యక్షమయి 'తరుణం వచ్చింది కదా! తరిద్దాము రారాదా!' అని సిగ్గువిడిచి మరీ బ్రతిమాలింది.
'వయస్సు వస్తే సరిపోతుందా! నా స్వంతకాళ్లమీద నేను నిలబడవద్దా!
అప్పుడూ ఈ తరించడాలు.. తడిసిపోవడాలు!' అని అప్పటికి
తప్పుకొన్నాడు అబ్బాయి.
అబ్బాయి సంపాదన
పరుడైన వెంటనే మళ్లా కల్లో కనిపించి కాళ్ళావేళ్లాబడినంత పని చేసింది స్వప్నసుందరి.
'పిల్లా పీచూ సంగతి చూడాలి ముందు. ఆ తరువాతే ఈ గెంతులూ..
చిందులూ!' అని సుందరిని కర్కశంగా పక్కకు తోసాసాడు ఈసారి కూడా ఆ అబ్బాయి.
అబ్బాయిగారి
చివరికూతురు పెళ్ళిచేసుకొని అత్తారింటికి తరలిపోయింది.
'ఇప్పుడైనా కనికరిస్తావా మహానుభావా!' అని అడిగింది స్వప్నసుందరి
పట్టువదలకుండా మళ్లా కల్లోకొచ్చి.
'పట్టినంత కాలం ఓపిక పట్టావు. మనుమలు.. మనుమరాళ్లు పుట్టుకొచ్చే సమయం. వాళ్లతోకూడా కాస్త ముద్దూ
ముచ్చట్లు తీర్చుకోనీయవోయి
సుందరీ!' అంటూ వచ్చినదారే
చూపించాడు ఆ సుందరికి బడుద్దాయి అబ్బాయి.
మనమలు.. మనమరాళ్లతో ముద్దుముచ్చట్లు ముగిసిపోయాయి. చేసే ఉద్యోగానికి
విరమణ అయిపోయింది. కావలసినంత తీరిక.
బోలెడంత సమయం. కూర్చొని కూర్చొని విసుగొచ్చిన అబ్బాయిగారికి
అప్పుడు గుర్తుకొచ్చింది స్వప్నసుందరి.
కానీ.. స్వప్నసుందరిజాడే ఇప్పుడు కానరావడం లేదు!
స్వప్నసుందరి
దర్శనం కలగాలంటే ముందు నిద్రాసౌభ్యాగ్యం అబ్బాలి. బిపి.. షుగరు.. కాళ్లతీపులు..
అజీర్తి.. అతిమూత్రవ్యాధి.. మతిమరుపు రోగం.. నరాల బలహీనత! ఇన్ని
ఇబ్బందులున్నవాడికి నిద్ర పట్టేది ఎలా! స్వప్నసుందరి
సందర్శనం ఇహ తీరని కలా! అయినా.. అంతలా నరాల
బలహీనతలున్న అబ్బాయిగారు కలలరాణితో కలసి చేసేదిమాత్రం ఏముంది?
స్వప్నసుందరి
మరే అబ్బాయి కలలోనో బిజీగా ఉండి ఉంటుంది.
‘ఆ పిల్లగాడన్నా తాను చేసిన పొరపాటు చేయకూడద’ని గొణుక్కున్నాడు మగతనిద్రలోనే
అబ్బాయిగారు!
***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- ఫిబ్రవరి 2016- మరీ చి.క కాలమ్ లో ప్రచురితం)
No comments:
Post a Comment