Sunday, February 14, 2016

సృజన


సృష్టి-పునఃసృష్టి జీవనం కొనసాగింపు  సహజచర్య. మానవేతర జంతుజాలం తమలాంటి జీవులను మాత్రమే సృష్టించ గలిగితే… ఇతర  రూపాలనూ, శబ్దాలనూ సృష్టించే ప్రతిభ మనిషిది. సంతాన సృష్టికి ప్రతిభతో పని లేదు.అవి జంతుజాలాలూ చేసే సృష్టికార్యమే. ఇతరేతర శబ్ద, రూపాల పునఃసృష్టికి ప్రతిభ తప్పనిసరి. ఆ  ప్రతిభనే మనం సృజనగా గుర్తిస్తున్నాం.  ఆ శక్తి గలవారిని  సృజనశీలురు, స్రష్టలు అంటున్నాం.
కళాకారులందరూ స్రష్టలే. కాని అంతకన్నా ముందు మానవులు. అలాగని మానవులందరూ కళాకారులు కాదు. కాలేరు. కొద్దో గొప్పో ప్రతి మనిషిలోనూ పిసరంతైనా కళంటూ ఏదో ఒకటి దాగుండక పోదు కానీ..ఆ కళేదో బహిర్గతమైనప్పుడే అతనికి    కళాకారుడిగా గుర్తింపొచ్చేది.
సుప్రసిద్ధ పాశ్చాత్య దార్శనికుడు డిస్కార్టిస్టు ‘ఆలోచనను బట్టే ఉనికి’ (Cogito ergo sum)సిద్ధాంతం ప్రకారం మనిషి సృజనశీలి కన్నాముందు బుద్ధిజీవి.   ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అస్తిత్వసిద్ధాంతం దీనికి బద్ధ వ్యతిరేకి.  ‘I exist.. therefore I think’ అంటుంది అస్తిత్వ వాదం. ఈ వాదం ప్రకారం మనిషి బుద్దిజీవికన్నా ముందుగా సృజనశీలి.  జెన్ తత్త్వం, మన  భారతీయుల భక్తి యోగాలకూ రసవాదంతోనే చుట్టరికం. హేతువు
కన్నాముందు  అనుభూతికే మనిషి ప్రాధాన్యత ఎందుకిస్తాడు?- ఇది అంతుబట్టని రహస్యం.  కానీ సృజన అంటే మాత్రం స్థూలంగా ఒక అభిప్రాయానికి రావచ్చు. శ్రీశ్రీ ‘దివ్యానుభూతి’ ఖండికలో మాదిరి కవితాత్మకంగా చెప్పాలంటే  అదొక
సంకుల పయోధర  చ్చటా పంకిల నిబి
డాంధకార నిర్జన వీధికాంతరముల
నా చరించెడు వేళ ప్రోన్మత్త రీతి,
అవశ మొనరించు దివ్యతేజోనుభూతి’.
లేని దాన్ని సృష్టించడం, ఉన్నదాన్ని మరో రూపంలో సృష్టించడం, చూసిన వాటిని చూడని వాటిల్లోకీ, చూడని చూడలేని వాటిని చూసిన వాటిల్లోకి తర్జుమా చేసి  తన్మయత్వం చెందటం, తోటివారినీ తన్మయపరచడానికి  ప్రయాస పడటం.. సృజనశీలత  కొన్ని  ప్రధాన  లక్షణాలు.
సరసియై చల్లనై నన్ను జలకమార్చె,
నందన నవ నీలతాంత కాంతస్రజమ్ము
గా నొక క్షణమ్ము నామెడ కౌగలించె’
అని మహాకవొచ్చి మొత్తుకున్నా సరే ‘ఎవరా ‘సరసి’ మహానుభావా?’ అని మాత్రమే వివరాలడుగబోతాడు శుద్ధ లౌకికుడు. లౌకికులకు ఒక పట్టాన అంతు పట్టని వింత చేష్టలింకా ఇలా చాలానే ఈ అలౌకిక ప్రాణుల్లో ఉంటుంటాయి మరి. నిశ్శబ్దం విసుగెత్తినప్పుడు  శబ్దాన్ని సృష్టించటం, శబ్దం ఎక్కువైనప్పుడు నిశ్శబ్దాన్ని ఆశ్రయించడం ఈ అలౌకిక లక్షణాలే. ఈ అలౌకిక మహాశయుడు శబ్దాలకేవో అర్థాలు కల్పించి కవిత్వమంటాడు. ఎక్కడా లేని ఓ ప్రత్యేక నాదాన్ని సొంతంగా సృష్టించుకుని  రాగాలాపనలోకి జారుకుంటాడు.  కొత్త లయలూ, భంగిమలూ, కదలికలూ కనిపెట్టి నృత్యం పేరుతో సొంత లోకంలో విహరిస్తుంటాడు. అనుకరణే కావచ్చు కానీ అనుసృజన అనిపించే చిత్రాలు, శిల్పాలు సృష్టించుకుని మురుస్తాడు. కవిదీ అదే వరస.’భావ మనియెడు నెత్తావి బలిసియున్న-మేలు రేకుల విప్పారు పూలు మేము’ అంటూ వాస్తవ జగత్తును అనుసరిస్తూనే   కొత్త కొత్త పదాలతో, వ్యక్తీకరణలతో  నూత్నప్రపంచమొకటి  సృష్టించుకుని అందులో  ఆనందాలను వెదుక్కుంటాడు. అనుకరణ కన్నా అనుసృజన మానుషకళలోని  చెప్పుకోదగ్గ గొప్ప ప్రజ్ఞావిశేషం.
అస్తిత్వ సిద్దాంతాన్ని పైపైన చూస్తే మాత్రం-  ప్రజ్ఞ, విజ్ఞానం అభాసాలంకారాల్లాగా ఎడపెడగా అనిపిస్తాయి కానీ అది నిజం కాదు.  మహా మేధావి ఆల్ బర్ట్ ఐన్ స్టీన్ వయోలిన్ బ్రహ్మాండంగా వాయిస్తాడు. ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త భాభా చిత్రకళ ప్రావీణ్యం అత్యద్భుతం. అమెరికా మాజీ అధ్యక్షుడు ఐసెన్ హోవర్బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి చర్చిల్ చక్కటి ప్రకృతి చిత్రకారులు. కళాభినివేశమంటూ మెలుకువతో ఉండాలే గానీ బుద్ధి ఏ రంగంలో పనిచేస్తున్నా  సృజనతృష్ణ( creative urge) మరో రూపంలో  బైటపడి తీరుతుంది. ‘సృజనశీలత ఆయాచిత వరంగా దక్కిన అదృష్టవంతులు..లౌకిక వృత్తిలో రాణిస్తూనే..ప్రవృత్తి పరంగా అలౌకిక  లోకాల్లో ఆత్మానందాన్ని వెదుక్కుంటో విహరిస్తుంటార’నేది మనోవైజ్ఞానిక శాస్త్రమే నిర్థారించిన సత్యం.
కవి ఒక కమనీయ కావ్యం, చిత్రకారుడు ఒక   అద్భుత చిత్రం, నర్తకీమణి ఒక  రమణీయ రూపకం, సంగీతవేత్త ఒక మహత్తరమైన రాగం, శిల్పి ఒక అనల్పమైన విగ్రహం..కల్పించటానికి అహోరాత్రాలు నిద్రాహారాలు కూడా మాని ఎందుకంతగా శ్రమిస్తాడంటారు?! ఎన్ని కష్టనష్టాలొచ్చి పడ్డా ఆ శ్రమ నుంచీ విముక్తి కోరుకోడెందుచేత?! ‘చల్లని వేళ సత్కవి విశాలమనంబునయందు బుట్టి సం/ ఫుల్లత నొందు హల్లకము పోల్కి నొకళ్ళ మొకళ్ళ మోలిమై/ నల్లన మేము విచ్చుచునుందుము’ అంటో  లోపల్నుంచీ ఉడుకులెత్తే సృజనశక్తి హోరెత్తిస్తుంటే ఆ వత్తిడినుంచీ ముక్తి పొందటానికిలా   ఏదో కళారూపంలో  భౌతికసృష్టి జరగాల్సిందే- కనక.
కొందరు ఎందుకంత సులభంగా  సృజనశీలులై పోగలరు? ఇంకొందరెందు కెంత తన్నుకులాడినా ఒక్క మంచి  కల్పనా చేసి వప్పించలేరు?! అనేదింకో  సందేహం. ప్రశ్నంత   సులభం కాదు సమాధానం. అనువంశికతో, మానసికతో, బాహ్య పరిసరాల అనుకూలతో, కార్యరూపం దాలిస్తే మరేమన్నాఇతరేతర ప్రేరేపక శక్తుల శబలతో..  ఇతమిత్థంగా ఇదీ అని నిర్థారించడం కుదరని ఇంకేవైనా  కారణాలో కావచ్చు – అనేది ప్రముఖ రసతత్త్వవేత్త  సంజీవ్ దేవ్ జీ మతం.  జన్మతః సృజనశీలత ఉండీ..పరిసరాల ప్రభావం వల్లా, ప్రతికూల పరిస్థితులవల్లా సంపూర్ణంగా వికసించని ప్రచ్చన్న కళాకారులు కొందరైతే..పుట్టుకతో పట్టుబడక పోయినా పట్టుదలవల్లా, అనుకూల పరిస్తితుల చలవ వల్లా శిక్షణ ద్వారా రాణించిన, రాణిస్తున్న కళాకారులు ఇంకొందరు మన సమాజంలో మన మధ్యనే  ఎప్పుడూ సంచరిస్తుంటారు’అనీ ఆయన వాదం. కాదనలేము కదా!
ఐతే సృజనకార్యంలో తలమునకలైన వాళ్ళంతా కళాకారులే ఐనా ..సహజప్రతిభకి.. బుకాయింపు కళకి మధ్య చాలా అంతరం ఉంటుంది. అసలు కళను ఆ ‘కళే’ పట్టిస్తుంది. సహజ స్రష్ట మదిలో సదా త్యాగయ్యలో మాదిరి  ఓ ఆనందజ్వాల ప్రజ్జ్వలిస్తుంటుంది.  వీరబ్రహ్మంగారి జీవితం లోలాగా బౌతిక పీడలు వాళ్ళ అంతఃచేతననెంత  మాత్రం  ప్రభావితం చేయ లేవు.  సందుఛూసుకుని మరీ  అన్నమాచార్యులవారి  అంతరంగ తపన లాగా ఇంకేదో  ఉత్కృష్ట రూపంలో విస్మయంగా  బైటికి తన్నుకొచ్చే తీరుతుంది..చెరసాల  పీడ  గోపన్నలోని రాగజ్వాలను మరింత ప్రజ్జ్వలింప చేసినట్లు.

కళాకృతులను అమితంగా ప్రేమించి ఆరాధించే కళాభిమానులు వాటి సృష్టికర్తలను  సైతం అంతే సమున్నతంగా ఊహించుకోడం సహజం. కానీ  నిజ జీవితాలను సొంత కళాసృష్టంత సమోన్నతంగా నిర్వహించుకోడం ఏ కళాకారుడికైనా ఏమంత తేలిక వ్యవహారం కాదు. తెనాలి రామలింగడు ఎద్దేవా చేసిన ‘కూరగాయల’ కళాకారులు అప్పుడూ ఉన్నారు.ఇప్పుడూ ఉన్నారు. ఎప్పుడూ ఉంటారు. నిజ,కళాజీవితాల  ప్రస్థానాలు సరాసరి వ్యతిరేక దిశల్లో ప్రయాణించిన నీరోలు, జౌరంగజేబులు మనకు చరిత్రలో ఉండనే ఉన్నారు. సృజనవేళే వీళ్ళు అపరబ్రహ్మలు. మిగతా వేళల  వట్టి పిండి బొమ్మలు. బ్రహ్మ రాక్షసులు. మామూలు వ్యక్తుల మాదిరే వ్యావహారిక జీవితంలో చిరుకోరికలకూ, చిట్టి పొట్టి తాపాలకూ, చిరాకులకూ, చిన్నాపెద్దా బలహీనతలకూ దాసులు.  రూకల  బొబ్బట్లు, సన్మానం దుప్పట్లు, అహం చలి కాచుకునేందుకు  వెచ్చవెచ్చని చప్పట్ల  కుంపట్లు.. వాటికోసం సిగ్గు విడిచి సిగపట్లు..! ఏటి వాలులోనే వీరి నావ వీర విన్యాసాలు. నిలువీత రాకపోతే ఎంత గజీతగాడి పోజు పెట్టినా…ఆటుపోటు లెదురైనాక   బోటు గల్లంతు..
ఆదరము తగ్గె దంభమాహాత్మ్యములకు
పక్షపాతపు రచనల పస నశించె
రసికులకు మీ చరిత్ర విసువు దోచె
పరువుగా నింతట బ్రబంధపురుషులార!
కదలిపొం డెటకైనను..మీకు
నేటి కావ్యప్రపంచాన చోటు లేదు’ అంటూ   కాలప్రవాహం దయాదాక్షిణ్యాలకే  అలాంటి మిడతంభొట్లగుంపు నొదిలేయడానికి మించిన మహత్తర కార్యం మరోటి లేదు.
అలాగని లోకమంతా  ఆషాఢభూతుల బంధువులతో నిండి ఉందన్న నిస్పృహా శుభం కాదు.    ఇంత వైవిధ్యవిలాసాలతో విలసిల్లుతున్న సృష్టి ఎన్ని లక్షల స్వచ్చమైన కళాకారుల సృజనపునాదుల మీద నిర్మాణమవుతుందో అర్థం చెసుకోవాలి. కామించిన సుందరి ‘చీ.. పొమ్మన్న్దం’దుకు గోపాలుడి నడ్డమేసుకుని జావళీలు సృష్టించిన క్షేత్రయ్యలు  ఈ కళాక్షేత్రంలో కొల్లలు. అన్నహారాలు మాని అన్నమిచ్చిన వాని పుణ్యాన్ని రోజుకోతీరులో  సంకీర్తించిన  పదపితామహులు
అన్నమయ్య సాహిత్యలక్ష్మిపాదాలకి అలంకరించిన మువ్వల  మాటేమిటి!  దుండగుల కెదురుగా  నోరు తెరవాలంటే కొండతో పొట్టేలు ఢీకొన్నట్లున్న గడ్డుకాలంలో సైతం సామాజిక దురాచారాలను ఆటవెలదుల నోటితో కడిగి పారేసిన ప్రజావేదాంతి వేమన పద్యాల సంగతో! చెప్పాలంటే చేటభారతమంత. ఆ మాటకొస్తే  భారతంలో మాదిరి కళాభారతంలో కూడా ఉత్తరకుమారులున్నట్లే..ఉదాత్త కర్ణులూ..ఏకలవ్యులూ ఉన్నారు.ఉంటారు. ఎవరి దారి ఆదర్శనీయమో అనుసరణీయమో నిర్ణయించుకొనే విజ్ఞత మాత్రం ఎవరిది వారిదే.
సహృదయంతో చూడాలే కాని..నిజ జీవితాలని  సొంత  కళాకృతులను మించిన నిబద్ధతతో నిర్వహించుకున్న స్రష్టలు.. మనకు కళాసాహిత్య రంగాలనిండా శతసహస్రాలు. అందరిలో అసామాన్యంగా వెలిగే సుగుణదీపం-  హేతువాదం వికాసం.  సృజనశక్తికి సాయంగా  సమీక్ష, సహనం, నిజాయితీ, నిబద్ధత సమాంతరంగా వెలిగే ఆ కళాజ్యోతుల జీవితాల్లో ఆలోచనల అనుభూతుల కలబోత  కొట్టొచ్చినట్లు కనిపించే మరో కిరణపుంజం.  ఉత్తమ కళాకారుడు ఉత్తమ మానవుడుగా కూడా సమాజానికి సదా ఆదర్శప్రాయుడై ఉండి తీరాలని చిత్తశుద్ధితో నమ్మి ఆచరించి చూపించిన కళావైతాళికుల అడుగుజాడల్లో నడవడానికి కవులుగా మనకెవరు అడ్డొస్తున్నట్లు!

నడవడకయ నడచివచ్చితి
నడచిన నే నడచిరాను నడచెడునటులన్
నడిపింప నడవనేరను
నడవడికలు చూచి నన్ను నడిపింపరయా!’
అని కదా సృజన  బులపరింపు!
పరిసర ప్రభావాలెంత ప్రతికూలంగా ఉన్నాస్వయంప్రతిభతో ఆ పిలుపునందుకుని ఎత్తుల కెదిగే ప్రయత్నం సొంతంగా  చేయడం,   సాటి సహోదరులకూ చేతనైనంత  చేయూతనిచ్చి పైకి చేదుకోవడమూట -మనలోని సృజనశీలత ఇంకా సజీవంగానే ఉన్నదని నిరూపించుకునే రుజువులు. కాదంటారా?

-కర్లపాలెం హనుమంతరావు

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...