"ఈనాడు ఆదివారం సంపాదకీయాలకు సంబధించి నాకు
తోచిన నాలుగు మాటలు.
ఈనాడు ఆదివారం సంపాదకీయం ఒక రకంగా తెలుగు పాఠం. ఆదివారంనాటి సంపాదకీయం
సాహిత్యవిశేషాలతో పుష్టిగా
ఉంటుంది. సంపాదకీయం ఉటంకించే సంగతులు ప్రధానంగా
పురావైభవానికి సంబదించినవి.
శిష్టగ్రాంధికం సజీవ ప్రదర్శనకు అక్షర
వేదిక ఆదివారం సంపాదకీయం.
ప్రాచీనసాహిత్యక్షీరం మధించి
తీసిన వెన్నముద్దరుచి పదప్రయోగాలు..
మీగడతరకతీపి పెద్దలసూక్తులు బారులు తీరి అలరించే పద్యపాదాల.. పదాలకొలువు ఈనాడు
సంపాదకీయం. భాషలో పొదుపు ఈ రచనల
ప్రత్యేకత. సాధారణ పాఠకుడికి సాహిత్య
పరిజ్ఞానం రేఖామాత్రంగానైనా అందించాలన్న ఆరాటం ప్రతి అక్షరంలోనూ
ప్రత్యక్షమవుతుంటుంది. దైనందిక వార్తావేదిక అయినందువల్లనేమో సమకాలీన స్పృహనూ సంపాదకీయం విస్మరించ జాలదు. ఆ వారం జరిగిన
ఏదైనా విశేషాన్నో.. ఆదివారానికి అటూ ఇటుగా వచ్చే ప్రత్యేకదినోత్సవాన్నో.. ఏదీ
లేదంటే విశ్వవ్యాప్తంగా విజ్ఞానశాస్త్రాల్లో వికసించే నవ్యపరిశోదనల్లోనుంచి విత్యవ్యహారానికి
సంబంధించి ఉత్సుకత పెంచే ఆంశాన్నో..
సూత్రంగా మలుచుకొని అందంగా అల్లే
మూడుమూరల పదకదంబం ఆదివారం సంపాదకీయం. 'భళా!' అనే రీతిలో సాగి సానుకూల ఆలోచనలతో
స్వస్తివాక్యం పలికే ఈ తరహా సంపాదకీయాలు
నాకు తెలిసి తెలుగులో నాటికీ నేటికీ ఈనాడులోనే నిరంతరాయంగా వస్తున్నాయనిపిస్తుంది.
సాధారణంగా వీలున్నంత వరకూ ఈ
సంపాదకీయభ్రమరం తెలుగురుచి కుసుమం చూట్టూతానే పరిభ్రమించడమూ అభినందనీయం.
చక్కని చిక్కని శిష్టతెలుగులో కృషిచేయాలని
కోరుకొనే సాహితీ ప్రేమికులకు ఈనాడు ప్రతీ ఆదివారంనాడు ప్రచురించే సంపాదకీయం ఓ
నమ్మదగిన తోడు"
***
అమ్మల పండుగ- ఈనాడు సంపాదకీయం
కౌసల్య తన 'పేరేమిటో'
చెప్పమంది. 'రా' అనే
అక్షరం, 'డు' అనే అక్షరం పలకడం రాని చిన్నారి రాముడు 'లాములు'
అంటాడు. 'నాన్నపేరేమిటి
నాన్నా?' అని అడుగుతుందీ సారి. 'దాచాతమాలాలు
' అంటాడు బాలుడు ముద్దుగా. 'మరి నా పేరో?' రెట్టించిన ఉత్సాహంతో మరో ప్రశ్న. అమ్మతోనే కానీ..ఆమె పేరుతో పనేంటి చంటి
పిల్లలకి? 'అమ్మగాలు'
అంటాడు.. పాపం..ఆ బాలరాముడు అత్యంత
కష్టం మీద. 'కౌసల్య తండ్రీ' అని బిడ్డడ్ని సరిదిద్దబోయి అప్పటికే
నాలుక
తిప్పటం రాని రాముని కళ్ళలోని చిప్పిల్లిన నీరు చూసి తల్లి గుండె
చెరువైపోతుంది. 'కౌసల్యను కానులేరా నాన్నా!.. 'వట్టి
అమ్మనేరా నా చిట్టి రామా !' అంటో అమాంతం
ఆ పసికందుని తల్లి గుండెలకు హత్తుకునే రమణీయ దృశ్యం విశ్వనాథ వారి 'రామాయణ
కల్పవృక్షం'లోది. నవ మాసాలు మోసి రక్త మాంసాలను పంచి కన్న-
పాప కనుపాప కన్న ఎక్కువ అనటం 'సుమధుర
భావనామృత సుశోభిత మాతృ హృదంతమ్ము'ను
తక్కువ చేయడమే. సంత్ జ్ఞానానంద యోగి ప్రవచించినట్లు తాయి 'సంతతి
సంతత యోగ దాయి.' 'చల్లగ కావుమంచు మనసార పదింబది దైవ సన్నిధిన్
మ్రొక్కు' మాత
వాత్సల్యాన్ని ప్రసిద్ద ఆంగ్ల రచయిత రాబర్ట్ బ్రాల్ట్ మాటల్లో చెప్పాలంటే 'తల్లి
నివేదనకన్నా ముందుగా బిడ్డ కామన చేరగలిగే
ప్రార్థనాస్థలి సృష్టి మొత్తం గాలించినా ఎక్కడా దొరకదు'. గణాధిపత్యం
కోసం శివపుత్రులిద్దరి మధ్య స్పర్థ ఏర్పడింది. మయూరవాహనుడికి సర్వ తీర్థాలలో
తనకన్న ముందుగా అన్నగారే మూషికారూఢుడై
సందర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తల్లి కామన వల్లే సిద్ధివినాయకుడికా విజయం
సిద్ధించిందన్న ధర్మసూత్రం
వల్లీనాథుడుడికి అప్పుడు కాని బోధపడలేదు.
వానలో వస్తే తడిసినందుకు నాన్న తిడతాడు. అదే అమ్మైతే? 'ఈ
పాడు వాన నా బిడ్డ ఇంటికి వచ్చిందాకా ఆగకూడదా!'
అంటో వాననే శాపనార్థాలు పెడుతో బిడ్డ
తలతుడుస్తుందిట. అమ్మంటే అది. హిందువులు
సంధ్యావందనంలో 'తల్లిలా కాపాడమని' జలదేవతను
ప్రార్థించేది అందుకే.
ఏడాదికి పన్నెండు మాసాల పర్యంతం వారంలో ఒక్క
రోజైనా విశ్రాంతి లేకుండా ఇరవై నాలుగ్గంటలూ
అనుక్షణం బిడ్డమీద వాత్సల్యం
కురిపించినా తృప్తి చెందనిది సృష్టిలో అమ్మ
ఒక్కతే. 'తండ్రిం జూడము తల్లి జూడము యశోదాదేవియున్ నీవు
మా/తండ్రిం దల్లియు నంచు నుండుదుము..యింతటివారమైతిమి గదా తత్త ద్వయోలీలలన్' అంటో
రెండు చేతులూ జోడిస్తాడు ముకుందుడంతటి వాడు నందుని సందర్శనార్థమై రేపల్లె
వచ్చిన సందర్భంలో భాగవతంలో. ఈశుడు
ఓంప్రథమంగా సృష్టించిన ఈశానాం(లక్ష్మీ
దేవి) ఈశిత్రి( జగత్తు)ని అమ్మలా పాలిస్తుందని పరాశరబట్టర్ ద్వయమంత్ర శ్లోక
సారంశం. అమ్మతో కూడున్నవేళ ఆ భగవానుడు
చేసే జగత్పాలనా విలక్షణంగా ఉంటుందని ఆళ్వారుల నమ్మకం. 'జగన్నాథుడిని
అలా తీర్చిదిద్దే యుక్తి అమ్మదే. 'నాయన
గొప్ప సంపద అమ్మే' అని కదా
శ్రీస్తవ స్తోత్రం! సర్వ భూతాలలో ద్యోతకమయ్యే దివ్యశక్తిని మాతృరూపిగానే
సంభావిస్తుంది దుర్గా సప్తశతి. 'తల్లుల చల్లని ప్రేమలు,/పిల్లల
మాటలు, నగవులు,
ప్రియమగు పాటల్/ ఫుల్ల ధవళ కుసుమ
సరము/లల్లా తెల్లని మనసున కతి ముదము నిడున్'
అని అల్లా చల్లని దయమీదో చక్కని అష్టకం ఉంది. అకాళికమూ, అసాయి, అనల్లా, అనేసు
అనేవి ప్రేమలోకంలో చెల్లవు. దుర్గా, ఫాతిమా,
మేరీ, బుద్ధుని మేనత్త గోతమి, బహాయీల తాయి
తాహిరి, మహావీరుని తల్లి త్రిషాల.. మాతృ ప్రేమకు కులమతాలని దేశకాలాలని
ఎల్లలేముంటాయి? గ్రీకులకు
వార్షిక వసంతోత్సవాలలో దేవతల తల్లిని ఆరాధించడం ఆనవాయితీ. ప్రాచీన రోమన్లు హీఠారియా
పేరిట దేవతామూర్తి సిబెల్‌ను మాతృపీఠం ఎక్కించారు. యేసు తల్లి గౌరవార్థం ప్రాచీన
క్రైస్తవులు మాతృదినోత్సవం జరుపుకునే వారు. ఇంగ్లాండ్‌లో తల్లులందరికీ 'మదరింగ్ డే'
పేరిట ఆటవిడుపు. మే రెండో ఆదివారాన్ని
అమెరికా దేశమూ 'తల్లుల దినోత్సవం'గా
ఆమోదించి వచ్చే ఏటికి శతాబ్దం. ప్రపంచీకరణ ప్రభావం..ఇవాళ్టి రోజును మరెన్నోదేశాలూ తల్లికి నివాళులిచ్చే ఓ సంబరంగా జరుపుకుంటున్నాయి. ప్రేమాభిమానాలు
భారతీయులకేం తక్కువ? మాతృదినోత్సవం ప్రస్తుతం మనకూ ఓ ముఖ్యమైన పండుగ
అవడం అబ్బురం కాదు.
కాలం
సనాతనమైనా.. అధునాతనమైనా అమ్మ పాత్రలో మాత్రం మారని అదే సౌజన్యం. బిడ్డ కోరితే
గుండైనా కోసిచ్చే త్యాగ గుణం. కోటి తప్పిదాలనైనా చిరునవ్వుతో క్షమించేయగల సహనం.
గుళ్లోని దేవుణ్నిఅడిగాడు ఓ సత్యాన్వేషి 'అమ్మ' అంటే ఏమిటని?
'తెలిస్తే ఆమె కడుపునే పుట్టనా!'అని
దేవుడి ఉత్తరం. భిక్షమడిగే బికారి
నడిగాడీసారి. 'బొచ్చెలోని పచ్చడి మెతుకుల'ని
సమాధానం. మానవులతో పని కాదని చివరికి
పిల్లిపిల్లను చేరి అడిగితే.. కసిగా కరవబోయిందా పిల్లతల్లి. నడిచే
దారిలో ఓ రాయి తాకి తూలి పడినప్పుడు కాని
తెలిసి రాలేదా సత్యాన్వేషికి తన పెదాల
మీదే సదా 'అమ్మా!'లా
దాగుండేదే అమ్మేనని. విలువ తెలియని వారికి అమ్మ అంటే 'ఇంతేనా'. తెలుసుకున్న
వారికి 'అమ్మో..ఇంతనా!' 'ఆపదవచ్చినవేళ నారడి బడినవేళ/పాపపు వేళల
భయపడిన వేళ/వోపినంత హరినామమొక్కటే గతి..' అనే అన్నమాచార్యులవారి సంకీర్తన హరినామానికి
అమ్మపదమొక్కటే ఇలలో సరి. అడ్దాలనాటి బిడ్డలకి గడ్డాలు మొలుచుకొచ్చి ఆలి
బెల్లం..తల్లి అల్లమతున్న రోజులివి. కాలమెంతైనా మారనీ..పెరటి తులసి వంటి అమ్మలో
మాత్రం మార్పు లేదు. రాబోదు. అందుకేనా చులకనా?బిడ్డను చెట్టులా సాకేది తల్లి. ఆ తల్లికే
చివరిదశన కాస్తింత చెట్టునీడ కరవవుతున్నది.పేగు పంచి ఇచ్చిన ఆ తల్లికి 'జీవించే హక్కు' ఇప్పుడు ప్రశ్నార్థకం! తల్లి కన్నీటికి
కారణమైనాక బిడ్డ ఎన్నిఘనకార్యాలు ఉద్ధరించినా సార్థకమేది? కన్నీటి
తడితో కూడా బిడ్డ మేలును మాత్రమే కోరేది సృష్తి మొత్తంలో తల్లి ఒక్కతే. 'అమ్మకై
పూదండ/లల్లుకుని వచ్చాను/అందులో సగభాగ/మాశ పెడుతున్నాను/ మా యమ్మ మాకిత్తువా దైవమా!/మాలలన్నియు
నిత్తురా!' అని మాతృవిహీనుడైన ఓ కవిగారి మొత్తుకోలు. అమ్మ పాదాలు దివ్య
శోభాకరాలు, పరమ కృపాస్పదాలు, సకల భయాపహాలు.. అమ్మ పాదాలు కొండంత
అండ! స్తోత్రాలు సరే. 'అమ్మపండుగ'
ఏడాదికి ఒక్కనాడే. నిండు మనసుతో బిడ్డ
ఆదరించిన ప్రతిక్షణమూ అమ్మకు నిజమైన పండుగ.
ఈ 'అమ్మల పండుగ' నుండైనా చాలు.. అమ్మ మేలుకు బిడ్డలు పునరంకితమవుతే.. అదే
పదివేలు.
***
(ఈనాడు దినపత్రిక సౌజన్యంతో- కృతజ్ఞలతో)
No comments:
Post a Comment