యాండీ రూనే అనే ఆంగ్లరచయిత
చావును గురించి ఓ చక్కని వ్యాసం ప్రచురించాడు. 'ఫలానా రోజున పైకి పోబోతున్నావన్న
సమాచారం తెలిపే కవరుగాని
వస్తే దాన్ని తెరిచి చూసేందుకుకైనా ఎవరూ సాహసం
చేయలేరు'అని యాండీ థియరీ! తప్పని పరిస్థితుల్లో
గనక తెరిచి చూడవలసివస్తే.. చావు ఘడియలు దగ్గర పడ్డాయన్న దుఃఖవార్త
తెలిసిన ఆ అభాగ్యుడు ఆఖరిక్షణాల్లో ఎలా ప్రవర్తిస్తాడన్న అంశంమీద యాండీ రాసిన ఆ వ్యాసం
చాలా అసక్తిదాయకంగా ఉంటుంది. నవ్వు పుట్టిస్తుంది. నిజమేగానీ ఎవరి ప్రాణాలైనా అలా
ఆర్థాంతరంగా గాల్లో కలిసిపోవడం నవ్వులాట వ్యవహారం కాదు గదా!
చావు దగ్గర పడ్డవాడు- ఆలుబిడ్డల్ని
గురించి.. కన్నవారిని గురించి ఆలోచించకుండా ఉండగలడా? తన తదనంతరంకూడా తనవారి బతుకులు కుదుపులేవీ లేకుండా సాగాలని కోరుకోకుండా ఉండగలడా! డబ్బున్నవాడైతే వీలునామాలాంటిదేదో రాసి పడేసి వివాదాలకు తావులేకుండా చూసుకుంటాడు.
ఏ ఏ ఆస్తిపాస్తులకు సంబంధించిన
పత్రాలు ఏ బ్యాంకులాకర్లలో మూలుగుతున్నాయో.. అంత బాధలో కూడా ముక్కుతూ మూలుగుతూ
అయినా నమ్మదగ్గవాళ్ళ దగ్గర చెప్పుకొంటాడు. పిల్లల చదువులు.. పెళ్ళి పేరంటాలు.. వాళ్ళ పిల్లలకు పెట్టవలసిన పేర్లతో సహా తాను ఏమేం కోరుకొంటున్నాడో అంత గుబుల్లోనూ ఓ టైంటేబులు వేసి
మరీ అప్పగించడం మర్చిపోడు. కుటుంబ యావ బొత్తిగా
లేకపోతేనేమి.. చావు క్షణాలు దగ్గర పడ్డాయన్న విషయం తెలిసిన
మరుక్షణంనుంచి పడమటి దేశాల పౌరుడైనా సరే.. ఉన్న
క్రెడిట్ కార్డుల లిమిట్లన్నీ గుట్టుగా వాడేసుకొనే గుటుక్కుమనాలని చూస్తాడని యాండీ ఆలోచన.
ఎలాగూ పోతున్నాం గదా.. అని ఇంత
కాలం ఉగ్గపటుకొన్న మందు.. పొగల్లాంటి పాడు అలవాట్లు మళ్ళీ మొదలెట్టే మహానుభావులూ లేకపోలేదని ఆయనగారి మరో
ఎద్దేవా. జుత్తు కత్తిరించుకొనే ఖర్చు మాత్రం అందరికీ ఒకే విధంగా
వృథా అనిపిస్తుందని హాస్యంకూడా ఒలకపోసాడా
యాండీ తన వ్యాసంలో. ఇష్టమైన పబ్బులు.. మసాలా మూవీలు ఎంత దూరంలో ఉన్నాసరే
వెళ్ళి చూసి తరించాలని ఉవ్విళ్లూరే విలాసవంతుల లీలలయితే ఇహ వేరే చెప్పవల్సిన అగత్యమే లేదుట. తిండియావ
ఉన్నవాళ్లయితే ముప్పూటలా మేతమీదనుంచి ధ్యాస మళ్ళించరని యాండీ చమత్కారం. ఏది ఏమైనా ఫ్వూనరల్ ఏర్పాట్లు స్వీయాభిరుచుల ప్రకారం దగ్గరుండి మరీ చేసుకొనే సౌకర్యంమాత్రం ఆ దురదృష్టవంతులకు ఒక్కళ్లకే
సొంతం కదా! ఆహా! ఎంత అదృష్టం! హఠాత్తుగా ప్రాణాలు తీసుకొనే ఆవేశపరులకు
కనీసం ఆ వెసులుబాటైన దొరకదు! ప్చఁ.. దురదృష్టం!
నిజానికి ప్రాణాలు తీసుకోవడం
ప్రాణాలు పోయేటంత బాధాకరంగా ఉంటుంది. ఇంతకాలం ఎంతో శ్రద్దాసక్తులతో పెంచి
పోషించుకొన్న కుక్కా,, మొక్కా వదిలి పోవడం ఎంత బాధాకరం!
ఏ సంసార ఝంఝాటం వద్దనుకొని ..బైరాగిలా బతుకు వెళ్లదీసే బాపతు సన్నసైనా తెల్లారితే బతుకు
తెల్లారిపోతుందని తెలిస్తే తెల్లవార్లూ కుమిలి పోకుండా ఉండగలడా!
చేతిలో చిల్లిగవ్వ లేకపోతేనేమి.. అన్నీ పక్కమీదనే
జరిపించుకొనే రోగిష్టిమారి జీవి అయితేనేమి.. ప్రాణాలు పోతున్నాయని తెలిస్తే సంతోషంతో
గంతులేస్తాడంటే నమ్మలేం. అవుట్ రైట్ గా 'అసలే జన్మా వద్దు .. పొమ్మ'ని సన్యాసులు
అనే మాటలన్నీ మాట వరసకనే మాటలుగానే తీసుకోవాలి. ఎన్నో బాధలు పడే అభాగ్యుడికైనా సరే.. వచ్చే జన్మలో ఏ బిల్గేటు
కొడుగ్గానో.. మోదీలాంటి పిడుగ్గానో.. మహేష్
బాబుకి మోడలుగానో పుడితే బాగుణ్నన్న బలీయమైన వాంఛ మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో దాగి ఉంటుంది.
మరలాంటప్పుడు చేతిలో ఉన్న విలువైన మానవజన్మను చూస్తూ
చూస్తూ వదులుకోవడం ఏమంత తెలివైన ఆలోచన!.. విడ్డూరం కాకపోతే!
ఈ మద్య ఏ వార్తాపత్రిక
తిరగేన్తున్నా..
ఏ టీ.వీ చానెల్ తిప్పి చూస్తున్నా.. చావు వార్త కళ్లబడకుండా ఒక్క పూటైనా చల్లంగా గడుస్తున్నదా! ఓపికున్న వాళ్ళెవరైనా ఈ దిక్కుమాలిన చావువార్తలు లెక్కలు తీసి చూడండి! భూమి పుట్టినప్పట్నుంచీ పోయినవాళ్లే ఉన్నవాళ్ళకన్నా ఎన్నో రెట్లు అధికమన్న
చేదునిజం బైటపడుతుంది. బాధ పుడుతుంది.
అంతుబట్టని రోగాలతో.. ఆహారపరమైన లోపాలతో.. గర్భస్రావాలతో.. పురిటి బాధలతో.. ఫ్యాక్షనిస్టుల కక్షలతో.. వాతావరణ కాలుష్యాలతో.. . వడదెబ్బలతో.. పరువు హత్యలతో.. మందుతో..
కల్తీ మందులతో.. హరి హరీ.. ఇదీ అదీ అనేమిటి.. చివరికి చిటికెన వేలంత లేని దోమలతో..
దూకుడుగా తిరిగే వాహనాలతో
సైతం 'హరీ' అనే వారి సంఖ్య రోజు రోజుకూ మరీ మరీ ఎక్కువవుతున్నాయి!అగ్నిప్రాఅదాలు..
భూకంపాలు.. వరదలు..కరువులు వ్హాలకు ఇప్పుడు అదనంగా సొంతంగా వింత వింత కారణాలతో ఎవరి
గొంతులు వాళ్ళే నులుముకోవడాలు ఒకటి.. మితిమీరిపోతున్నాయి.. కలవరం కలిగిస్తున్నాయి! ప్రకృతి సమతుల్యం దీని మూలకంగా
దెబ్బతింటే బతికి ఉన్నవాళ్ళకీ చచ్చే చావే!
రైతు పురుగుమందు మింగితే
బీడువారిని పొలం మళ్లీ చిగురిస్తుందా? ఆకలికి తట్టుకోలేక నేతపనివాడు చెట్టుకు
ఉరి వేసుకొంటే బతికి ఉన్న అతని కుటుంబానికి మేత దొరుకుతందా? ముక్కు
మూసుకున్నంత మాత్రాన అప్పుల తిప్పలు ఎవరికీ తప్పిపోవు.
మిగిలున్న అతగాడి వారసులను చుట్టుముటి ముప్పతిప్పలు పెడతాయి! ఉన్న ఉద్యోగం ఉద్వాసన పలికిందనో..
వైద్యానికందని రోగం వంటిమీదకొచ్చి వదలడం లేదనో.. చేస్తున్న కంచిగరుడ సేవకు పెద్దల గుర్తింపు కరువయిందనో..
వ్యాపారం ఎక్కిరాక అప్పులపాలు చేసి తిప్పలుపెడుతున్నదనో.. పరీక్షల్లో, ప్రేమలో విఫలమయ్యామనో.. సీనియర్ల
ర్యాగింగుల్లో మానవీయకోణం కూడా బొత్తిగా కరువయిందనో.. ఉపాధ్యాయులో.. ఇంటిపెద్దలో విపరీతంగా
మందలించారనో.... అభిమాన తారకు/తారడుకి వేరే వారితో పెళ్లయి పోయందనో..
ఆరాధ్యనేతలు అవినీతి కేసుల్లో చిక్కి చెరసాల పాలయ్యారనో..
కోరుకొన్న రాష్ట్రం ఎంత పోరినా వచ్చి ఓళ్ళో వాలడం లేదనో.. సెల్
టావర్లు ఎక్కి.. టాంకుబండుల నుంచి దూకి.. వంటిమీద గ్యాసునూనె ఒలకబోసుకొని...
పురుగులమందు మింగి.. ఫ్యానురెక్కలకు ఉరి వేసుకొని.. కన్నవారికి కడుపుకోత మిగల్చడం..
తాము కన్నవారిని అనాథులు చేయడం.. ఎంత తెలివిమాలినతనం!
చావడానికిలా తొందరపడడం ఎంత చిచారకరం!
రాజుల ఆట కట్టించేందుకు
బంటులు చావడం చదరంగం రూలు.
నిజ జీవన రంగంలో ఎన్ని కోట్లబంటులు ఆత్మార్పణ చేసుకొన్నా రాజుల ఆట కట్టదు. ఆగదు.. చచ్చేందుకు సవాలక్ష దారులు. చావుఘడియ ముంచుకొస్తే.. ఏ మున్సిపాలిటీ చెత్తకుప్పయినా చాలు.. మీద
పడేందుకు! నోరు మూయని బోరుబావో.. మ్యాన్
హోలో చాలు.. లోపలికి లాక్కునేందుకు! ఫలానా రోజున మరణం
ఖాయమన్న వర్తమానం అందినా సరే.. ఆఖరి క్షణం వరకు మనిషిగా మెలగడమే మనిషి చేయతగిన పని. బతికేందుకున్నది
ఒక్కటే దోవ. గుండె దిటవు. బతికి తీరాల్సిందేనన్న పంతం ఉంటే చాలు..
అర్థాంతరంగా చావడం ఎంత తొందరపాటో అర్థమవుతుంది. చావడానికి ఎందుకు తొందర?
-కర్లపాలెం
హనుమంతరావు