Friday, February 24, 2017

ఎన్ని గిన్నీసు రికార్డులో!- ఓ సరదా వ్యాఖ్య


'ముంబైలో మొన్న సామూహికంగా పద్దెనిమిదొందలమంది ఒకేసారి క్షవరం చేయించుకొని ప్రపంచ రికార్డుల కెక్కేసారంట! వింటున్నావా బాబాయ్?
'రికార్డుల కెక్కడంలో మనదే గదరా ముందునుంచీ రికార్డు! అందులోనూ క్షవర కళ్యాణమంటే.. మన వాళ్లదే ముందు వరస! 'షేవ్ ఇండియా' అంటూ ఏకంగా కురకర్మకాండమీదే మన దండ్లు ఇలా చెలరేగి పోవడానికి కారణమేంటబ్బా? వృథాగా టైం షేవింగ్! ఇంటా బైటా, ఆఫీసుల్లో, ఆసుపత్రుల్లో, గుళ్ళల్లో, బళ్లల్లో, దుకాణాల్లో, పెట్రోలు బంకుల్లో, బస్సుల్లో, రైళ్లల్లో, ఆన్లైన్లో, ఆఫ్ లైన్లో.. నిత్యం జరిగే కళ్యాణకట్ట ఘట్టాలేగదరా ఇవన్నీ? దీనికింత 'కటింగ్' ఎందుకంట?'
'ఎటకారమా?'
'ఎటకారమా.. ఉప్పూ కారమా? పాతిక  పెట్టి గుళ్లో దేవుడికి టెంకాయ కొడితే.. శఠగోపురమూ, ఇంత చిన్నముక్కా తక్క ప్రసాదంగా అంట్లు తోముకునే కొబ్బరి పీచైనా ఉదారంగా దక్కదీ  ధర్మభూమిలో ఎంత వి ఐ పి భక్తవర్యుడికైనా! మన కొబ్బరి ప్రసాదంతోనే చేసిన చట్నీకి రెండోసారి ఆశపడితే రెండ్రూపాలు ఎక్స్ట్రా చెల్లింపు తప్పదు. క్షవరం కాక ఇదేవన్నా ఆ  దేవదేవుడి వరమా నాయనా?'
'ఓస్.. అంతేనా! మనం గుడికెళ్లేది దేవుడి ప్రసాదం కోసమూ కాదు. హోటలు కొచ్చేది కేవలం కొబ్బరికోరు కోసమూ కాదు. క్షవరమంటే నువ్వింకా ఏ ఓబులాపురం గనుల బులబాటాల టైపులో గంభీర నిజాలెన్నో వెలికి తీయబోతున్నావనుకున్నానే!'
'అరేయ్! మనం తాగి చెత్తకుండీలో పారేసిన  సీసాల్లోనే తేరగా కారే నల్లానీళ్లను పట్టేసి బాటిలిరవై రెండన్నా ఆబగా కొని గబగబా గొంతులో పోసుకుంటున్నామే! మన  గనుల్లో పడి ఎవరెవరో ఇనప ఖనిజాన్ని ఒక్క పైసా చెల్లించకుండా దొడ్డిదారిన  తవ్వుకు పోతున్నారు.. అంతా క్షవరమై పోతోన్నది. నిజంగా నాలాంటి వెర్రి పుల్లయిలెవరైనా నిజాయితీగా గొడవలు పెట్టుకోవాలనుకున్నా .. దొరగారేదో రెక్కల కష్టంమీద  నాలుగు రాళ్లు వెనకేసుకుంటుంటే కడుప్మంట! అల్లర్లకు దిగుతున్నావంటూ అంతా నామీద దాడికి తయారయ్యేవారే కానీ.. రాష్ట్రం నిలువు దోపిడీ పాలైపోతున్నదనే అని దిగులు పడే ఏ సన్నాసైనా కనుసన్నల్లో కనపడుతున్నాడా? అందుకే.. అంతలేసి గంభీరమైన క్షురకర్మకాండల జోలికి పోయే సాహసం చేయకుండా.. అందరికీ తేలికగా అర్థమవుతుంది కదా అనీ..'
'నిజవేఁ కానీ బాబాయ్.. జానా బెత్తెళ్లో తేల్చెయ్యాల్సిన మేటర్ని జానారెడ్డిగారి మోడల్లో ఎంతకీ తెమల్చకుండా నువ్విలా నోట్లో నువ్వుగింజేసుకున్నట్లు నానుస్తోంటే  ఎంతలావు తెలివితేటలున్న మేధావికైనా తెల్సినవీ తెలీకుండా అయోమయంలో పడిపోయే ప్రమాదం పొంచుంది. తూకాల్లో మోసాలు, మందుల్లో కల్తీలు, బియ్యంలో రాళ్లు, బాలల్లో దేవుళ్ళు, రాళ్లల్లో అదృష్టాన్నిచ్చే రంగు రాళ్లు, పాస్ గ్యారంటీ క్రాష్ కోర్సులు, పార్టీలిచ్చే హామీలు, అసుపత్తుల్లో వైద్యాలు.. లాంటివేవీ కాకుండా  కటింగు రికార్డు లేవఁన్నా మనం నిజంగా సాధించుంటే..  చెప్పు!  వింటా! లేకుంటే నీ టైమూ.. నా టైమూ రెండూ కటింగు'
'జనాభా కన్నా ఓటర్లెక్కువుండే మన ప్రజాస్వామ్య  దేశంలో  రికార్డులక్కొదవేముంటుందిరా కన్నా పట్టించుకునే బుద్ధిమంతులుండాలే గానీ! మొన్నా మధ్యనే బైట పడ్డది స్పెక్ట్రమ్ స్కాం. అంతకు మించిన బడా కుంభకోణం భూమండలంమీద ఇంకెక్కడుందో  నువ్వే చెప్పు! రాత్రికి రాత్రే యల్లంపల్లి అంచనాలను కోట్లక్కోట్లు పెంఛేసి బొక్కసానికి భారీ బొక్కేసినా ఏ సర్కారూ చీమైనా కుట్టినంత శబ్దం చెయ్యలేదు..ఆ పత్రికలోళ్లే చివరికి  ముక్కులు  చిట్లించిందాకా! మొన్నా మధ్యొచ్చిన వరదల్లో సారాయి గిడ్డంగుల్లోకి నీరు చేరి సరుకు పాడయిందని.. ఏలినవారు 'తాగబోయించే శాఖ' వారికి  నష్టపరిహారం కింద పన్నుల్లో  భారీ రాయితీ లిచ్చేసుకున్నారు. వరదనష్టం లోటునూ పూటుగా  తాగించి పూడ్చేసుకోవచ్చన్న గొప్ప రహస్యం ఎక్సైజుశాఖవారికి వేరెవరో వచ్చి చెవుల్లో ఊదిపోనక్కర్లేదు.'
'దేవదాసుల జేబుల కెంత కోతేసినా తప్పులేదులే బాబాయ్!'
'దేవదాసులకే కాదురా.. దేవీ దేవతలక్కూడా కటింగులు తప్పడం లేదబ్బీ ఈ మన ధార్మిక  దేశంలో! తన కొండకొచ్చేవాళ్ల  గుండు గీయించేదాకా వదిలి పెట్టని ఆ ఏడుకొండలవాడి హుండీకే 'గండ్లు' పడ్డం ఎక్కువయిందని గాఢభక్తులు గగ్గోలు పెడుతున్నార్రా బాబూ.. చెవిన పడ్డం లేదా?  లేదా.. నీ చెవినీ ఎవరైనా 'కటింగ్' ఖర్చులో జమ చేసేసారా? రికార్డుల కెక్కడం లేదు కానీ.. పంగనామాల పాలవుతున్న ఆ నామాలవాడి సొమ్మూ సమ్మంధం లెక్కలన్నీ కూపీ తీయిస్తే.. గిన్నీసు రికార్డు బుక్కే బద్దలయ్యేటన్ని కటింగులు బైటపదతాయ్! ఉద్యోగాల్లో కోత, ఉద్యోగుల  జీతాల్లో ఆదాయప్పననీ, వృత్తి పన్ననీ, ఆ పన్ననీ ఈ పన్ననీ తెగ్గోసుకుంటూ పోతే సగటు వేతన జీవి జీవితం బెత్తెడు తోకున్న గొర్రెకన్నా పొట్టిదైపోయిందని   తేలిపోతుంది! 
నెల నెలా నువ్వు చెల్లించే ఫోను బిల్లుల్నెప్పుడైనా పరీక్షగా చూసుకునావురా? సేవా సుంక వంకతో పది శాతం అదనంగా   క్షవరం చేసే సొమ్ములో విద్య సెస్సు రెండు శాతం, ఉన్నత విద్య సెస్సు  ఒక శాతం కటింగులు  కనపడుతుంటాయ్!'
'అవునా? నేనెప్పుడూ చూసుకోలేదే!'
'అదే మరి నేననేది కూడా! విషయం కొత్తగా అనిపించినా కత్తిరింపులన్నీ పాత మోడల్లోనే సాగుతున్నాయని. సోపు కూడా పూయకుండా సుతిమెత్తంగా చేసే ఈ తరహా క్షవరాలను   రికార్డుల్లోకి తీసుకుంటే .. మొదట్లో నువ్వన్నావే.. ఆ ముంబాయిలో ఏదో పది.. పద్దెనిమిది వందలమందో   సాముహికంగా కూలబడి ఒకేసారి గొరిగించేసుకొని రికార్డు సృష్టించేసారని.. ఆ  లెక్కకన్నా ఎక్కువా రికార్డులు గిన్నీసుల్లోకెక్కి తీరతాయి'
'…!'
'రికార్డులమీద మరీ ఎంత మోజున్నా  వృథాగా పెరిగే జుత్తునా  అలా త్యాగం చేయడం? అదేం ఘనతబ్బీ! ప్రపంచంలో ఎవరూ ఎప్పుడూ సాధించలేని  రికార్డులు ఇక్కడ మన దగ్గరా ప్రతీ రోజూ చచ్చేటన్ని  సాధిస్తూనే ఉన్నాంగా! పసిపిల్లలు తాగాల్సిన పాలు నాయకులకు, వినాయకులకు క్షీరాభిషేకాలుగా పునీతమవుతున్నాయ్! ఒక్క గంటలో రైలు బండిని బుగ్గిపాలు చేసేసి.. ఏ సంబంధమూ లేని అమాయకులెందరినో పొట్టన పెట్టుకునేలాంటి దుర్ఘటనలెన్నింటికో  ప్రపంచంలో మనదే పెద్ద రికార్డు. దిష్టిబొమ్మలీ గడ్డమీద రికార్డు స్థాయిలో తగలడుతుంటాయ్ ప్రతీ రోజూ. బతికున్నోళ్లకు చేసే శవయాత్ర లెక్కలు బైట పడితే రేపు పోయేవాడి ప్రాణాలు ఈ పూటే గాల్లో కల్సిపోడం ఖాయం! ద్రవ్యోల్బణం సూచికల్ని మైనస్ లెవెల్లోకి దింపేసిన ఘనతా అచ్చంగా మన మాజీ ఆర్థిక శాఖామాత్యుల వారిదే! ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులూ మనకున్నన్ని ప్రపంచం మొత్తంలో మరెక్కడా కానరావు. చదువులు చెప్పే విద్యాలయాలు వరసగా మూడు వారాలు మూతబడ్డా చీమకుట్టినంతైనా చీకు చింతా కనబర్చని యోగపుంగవుల రికార్డూ   మన దేశంలో బిడ్డల్ని కనే తల్లిదండ్రులదే భూమండలం మొత్తంమీద ఎంత గాలించినా! ప్రపంచంలో కెల్లా అతి పిన్న వయసున్న బాల దేవత గల సౌభాగ్యభూమి మనదొక్కటేరా పిచ్చికన్నా! ఇక్కడి భద్రతా సిబ్బంది ఒక్క నిరపరాధినే రోజుకు రెండేసి సార్లైనా కష్టడీలోకి తీసుకోగల   నిబద్ధత ప్రదర్శించేది. ఇక్కడి అమాత్యుల్లో కొందరు  అధికారులనైనా సరే చితకబాది మరీ ముఖ్యమైన  దస్త్రాలు పట్టుకెళ్ళగలిగేటంత పట్టుదలగల సమర్థులు. ఇక్కడి అధికారులు రాత్రికి రాత్రే వందలాది జీ.వోలు కళ్ళు తిప్పేలోగా   గెజిట్ చేయించగల సేవాతత్పరులు. జాతిపిత బాపూజీకైనా  అదురు బెదురు లేకుండా ఆధార్ కార్డు సృష్తించడంలో రాజీలేని నైపుణ్యం మన ఔట్ సోర్సు సిబ్బంది పుణ్యం. ఇహ ధరవరల రికార్డులంటావా? కంది గింజ వంద.. బియ్యం కిలో  రెండొందలు..'
'చంపకు బాబోయ్! మన రికార్డులు వల్లెవేయడంలో ముందు నువ్వు గిన్నీసు రికార్డులు చింపేట్లున్నావ్! హెల్తు కార్డుకూడా లేదు.. నేనుగానీ  పడిపోతే రికార్డు స్థాయిలో వచ్చే ఆసుపత్రిబిల్లులకు ముందు నేను  చిత్రగుప్తుడి రికార్డుల్లోకి  జంపు చేయాలి'
***

(ఈనాడు- 20-12-2009 నాటి సంపాదకీయ పుటలో ప్రచురితం)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...