ఎక్కడో చూసినట్లే ఉంటుంది.. ఎక్కడో ఠక్కున గుర్తుకు రాదు. ఎప్పుడూ చూస్తూనే ఉంటాం.. ఎప్పటికప్పుడు కొత్తే! ఏమిటి.. మనిషి మెదడులోని ఈ ద్వైదీభావాలకు భాష్యం?
కొంత మంది వ్యక్తులతో కలసిన మొదటి క్షణంలోనే ఒక ఆత్మీయత ఫీల్ గుడ్ భావన ఏర్పడుతుంది. మళ్లీ కలుసుకోకపోయినా సరే ఆ కలయిక చానాళ్ల వరకు అట్లాగే తాజాగా ఆహ్లాదం కలిగిస్తుంది. కొంతమందితో బంధం కాల పరిస్థితుల కారణంగా కొనసాగించక తప్పదు. అయినా ఆ నడక సాగినంత కాలం ముళ్ల మీద ప్రయాణంలాగా ఇబ్బందికరంగా ఉంటుంది.
చాలా సంసారాలలో భార్యాభర్తల మధ్య ఉండే బంధం ఏదో సంఘ సంప్రదాయం కోసం కొనసాగిస్తున్నట్లు కనిపించడం గమనించవచ్చు. ఇద్దరి రాశులూ జత కూడలేదని అందుకనే ఈ పొరపొచ్చలని నిరాధారమైన రుజువులు చూపించి బుకాయించే బాపతును పక్కన పెట్టేయండి. సంస్కారపరంగా ఇద్దరూ ఉత్తర దక్షిణ ధృవాలు అయివుండాలి. అయినప్పటికి, పెద్దలు కుదిర్చిన వివాహబంధం, సమాజం ఎదుట సహచరులమని ప్రకటించుకున్న కారణంగా అభిప్రాయబేధాలు నాలుగ్గోడలు దాటి రాకుండా గుట్టుగా కొనసాగించే సంసారాలకు కొదవుండదు. ఒక భర్త మరో స్త్రీ పట్ల ఆకర్షితుడవడం, ఒక గృహిణి పరపురుషుని దర్శనార్థం తపించిపోవడం ఉంటుంది. కానీ, చలంగారు తన కథల్లో మొత్తుకున్న విధంగా అది పూడ్చిపెట్టిన అనుబంధాల కిందకే వస్తాయి. ఆ రకమైన సన్నివేశాలలలో భర్త ఎదుట ఆ పరపురుషుడిని చూసినా భార్య అపరిచితుడిని చూసినట్లే ప్రవర్తిస్తుంది. తనకు అంతకు ముందు నుంచి అనుబంధం ఉన్న స్త్రీ భార్య సమక్షంలో తటస్తపడితే భర్త ప్రవర్తనా డిటో! ఏతావాతా తేలేదేమంటే పరిచితాలు.. అపరిచితాలు అనే అంశాలు శుద్ధసత్యం కేటగిరీ కిందికి వచ్చేవి కావు.
మన చుట్టూ ఉన్న గాలిని గురించి మనకేమన్నా సమాచారం ఉంటుందా? ఉన్నా సమగ్రంగా, నిర్దిష్టంగా ఉంటుందా? పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి - ఈ ఐదింటిని గురించి ఎంత తెలిసినా తెలియనట్లే ఉంటుంది. ఎంత తెలీనట్లు నటించినా ఎంతో కొంత ఎరిక ఉంటుంది. తెలియడం, తెలియచెప్పడం అనే రెండు ప్రక్రియల మీదనే ప్రపంచం సర్వం ముందుకు వెనక్కు ప్రయాణం చేయడం. సర్వజ్ఞులు అన్నది ఒక భావన మాత్రమే. ఆదర్శ భావన. అన్నీ తెలిసినజ్ఞాని, ఏమీ తెలియని అజ్ఞానీ కంచుకాగడా వేసి గాలించినా ముల్లోకాలలో కనిపించడు. ముల్లోకాలు, ముక్కోటి దేవతలు, నాలుగు దిక్కులు, అష్టైశ్వర్యాలు,నవరత్నాలు.. లాగా కొన్నింటికి అన్నీ తెలిసిపోయినట్లు ఒక సంఖ్యకు కుదించి సంతృప్తి చెందుతాము. నవరత్నాలు తొమ్మిదేనా! నవగ్రహాలు అన్నారు నిన్న మొన్నటి వరకు రోదసీతలంలో పరిభ్రమించేవి. ఇప్పుడు కొన్ని గ్రహాలు గ్రహాలే కావు పొమ్మంటున్నారు. న్యూటన్ సిద్ధాంతమే విజ్ఞాన శాస్త్రం మొత్తానికి ఇరుసు వంటిది అని శతాబ్దాల పర్యంతం ఊదరగొట్టి ఇరవై ఒకటో శతాబ్ది వచ్చే సరికి అదంతా తప్పుల తడక అని తేల్చేస్తున్నారు. మనిషి పురోగమనం ఇహ శాశ్వత అమరత్వం వైపుకే అని కోతలు కోసిన శాస్త్రజ్ఞులు ఇప్పుడు ఎదురైన కరోనా మహమ్మారి అంతం చూసేందుకు తలకిందులు అయిపోతున్నారు. అన్నీ పరిచయమే.. అనుకుంటాం గానీ, ఏదీ సంపూర్ణ పరిచితం కాదు. ఏదీ పరిచితం అని నైరాశ్యం ప్రకటించేవారికీ ఇదే సూత్రం. ఎంతో కొంత తెలియకుండా మనుగడ ముందుకు సాగదు. ఆకలి తీర్చుకునేందుకు ఆహారం అవసరమని, దాహం ఆరేందుకు మంచి తీర్థం తప్పదని ఎవరు వచ్చి మనకు పాఠం నేర్పుతున్నట్లు? పుట్టక ముందు ఎవరమో తెలీదు,పుట్టిన తరువాత ఎప్పుడు పోతామో ఎవరం ఇతమిత్థంగా చెప్పనూ లేం. ఇంత మాత్రం దానికి నిన్ను నీవు తెలుసుకో.. అంటూ స్వాములార్లు మఠం వేసుక్కూర్చుని బోధించే శుష్కమైన పలుకులు ఆలకించడం శుద్ధ దండుగ . ఎప్పుడు చూసినా కొత్తగా ఉండడం, ఎప్పుడు చూడకున్నా చిరపరిచితు లనిపించడం ఏమిటో ముందు తెలుసుకో! అది తెలియాలంటే నిన్ను గురించి నీవు కాదు, నీ పక్కవాడిని గురించి నీవు తెలుసుకునే ప్రయత్నం చేస్తుండాలి.
ముఖమే చూడని ఆకారాన్ని ఊహించుకుని జీవితమంతా ఆ మూర్తికి దాసోహం అయిపోతూ స్తోత్రాలు, దండకాలు, వల్లించడం మించి మనిషిలోని పరిచిత అపరిచితానికి ఉదాహరణ ఏముంటుంది? కంటి ముందుండే ఆహారం వదిలేసి కంటికి ఎన్నడూ కనిపించని ఆకారం దర్శంచాలని భక్తి పేరుతో నిరాకారికి జీవితం ధార పోయడమేమిటో ఆ రహస్యం ముందు కనిపెట్టు! పడుకునేందుకు ఆరడుగుల నేల, కడుపు వేడి చల్లబడేందుకు చేతికి నిండుగా కబళం ముద్ద, కంటి రెప్పల విరామానికి ఓ ఆరు గంటల నిద్ర, కష్టసుఖాలు కలబోసుకుంటూ పక్క మనిషితో మసిలే నిశ్చింత.. ఈ మాత్రం భాగ్యానికి ప్రపంచయుద్ధాలు చేసుకున్న మనుషులకు ఏమి తెలుసని? ఏమి తెలియదని? మళ్ళీ మళ్లీ సొదపెట్టుకునేందుకు?
- కర్లపాలెం హనుమంతరావు
బోథెల్; యూఎస్ఎ
Sunday, December 6, 2020