అచ్చు తెనుగులో అధిక్షేపం అంటే తిట్టు. తిట్లు
తెలుగువాళ్లకు కొత్త విద్యేం కాదు. బాధ, కష్టం, పగ, అసూయ, అసహ్యం లాంటి వికారాలు కలియబెడితే బండరాయిలా పడుంటాడా మనసున్న ఏ మనిషైనా!
మామూలు మనుషులైతే ఏ నీళ్ల పంపు దగ్గరో తంపులు పెట్టుకుంటారు. అదే నాలుగు అక్షరమ్ముక్కలు ముక్కుకు బట్టిన పెద్దమనిషైతే ?
పద్యాలు, పాటల రూపంలో తిట్ల దండకం
కురిపిస్తాడు. గొడ్డుకో దెబ్బలాగా మనిషికో మాట. ఆ మాటను తూటాలాగా వదలడం తేలికేమోగాని, నాలుగు
కాలాలపాటు నలుగురూ చెప్పుకునేలా వదరడం
సులభం కాదు. రెండర్థాలు, గూఢార్థాలు,
పెడసరప్పోకడలు పోయినప్పుడే
పదిమంది నోట్లో తిరిగి తిరిగి పలకగలిగేది. కష్టపడి
కావ్యాలు రాస్తే మెచ్చుకోడం మాట అటు పక్కనుంచి, పనిగట్టుకుని
వంకలు పెట్టే ప్రబుద్ధులు కొంతమంది ఎప్పుడూ ఉంటారు. అట్లాంటి
వాళ్లని గురించి పూర్వం మన ప్రబంధాలు రాసే కవులు 'కుకవినింద'
వంకన కావ్యంలోనే తమ కడుపుబ్బరం తీర్చుకొనేవాళ్లు. నన్నచోడుడు అనే కవిగారు కుమారసంభవం అనే కావ్యం రాస్తూ ఈ తరహా కుకవులను 'దొంతులు
దొర్లించే కుక్కలతో పోల్చి మరీ తన కడుపుబ్బరం తీర్చుకున్నాడు. మంచి గుణాలను దోషాలుగా ఎత్తి చూపించి ఎద్దేవా చేసే ఈ తరహా పెద్దమనుషులు
ఒక్క సాహిత్యరంగంలో ఏం ఖర్మ.. అన్నింటా.. అన్ని కాలాలలో తారసపడుతుంటారు. కాబట్టే నన్నయగారంతటి
మహానుభావుడిక్కూడా తన వంతు మహాభారతంలో ఈ
తరహా నిక్షేపరాయుళ్లను గురించి 'శిశుపాలుడు' పాత్రను అడ్డం పెట్టుకుని ప్రస్తావించక తప్పింది కాదు. భీష్ముడు చెప్పాడని చెప్పి ధర్మారాజు శ్రీకృష్ణుడికి రాజసూయ యాగం చేసే
సందర్భంలో ఆర్ఘ్యమిస్తాడు. సాటి యాదవరాజుకు అంత లావు గౌరవం
దక్కడంతో కడుపు మండిన శిశుపాలుడు, 'వసుదేవుడు అంతటి ముసిలాయన
ఉన్న సభలో వాసుదేవుడికే ఎందుకు ఈ సత్కారం? ధర్మయుక్తులు తెలిసిన
ద్వైపాయనుడున్న చోట ఋత్విజుడనా కృష్ణుడికి ఈ
గౌరవం?ద్రోణుడు, కృపాచార్యులు
వంటి గొప్ప గురువులు ఎదుటనే ఏ గురుభావం చూసి నల్లనయ్య పట్ల ఇంత వినయం? యాదవరాజులు ఎంతో మంది అవని మీద ఘనంగా ఏలుతుండగా ఏ భూనాథుడన్న బుద్ధితో ఓ
గొల్లకాపరికీ పెద్దరికం?పూజనీయులైన పురుషులింత మంది సమక్షంలో
ఏ దీక్షాదక్షతలున్నాయనయ్యా ధర్మరాజా, భీష్మాచార్యుల మాట విని
ఈ గొడ్లుకాచుకునేవానికి ఇంత గొప్ప పురస్కారమిచ్చింది?' అని
రొష్టు పడతాడు శిశుపాలుడు.
ఇహ తెలుగు మాటకు వెటకారం నేర్పిన తిక్కనగారి
కలం పోట్లను గురించి ఎంత చెప్పినా ఇంకొంత మిగిలే ఉంటుంది. విరాటపర్వంలో
తాను కీచుకుడి భయాన అనాచ్ఛిదితగా నిండు
సభామధ్యమంలోకి నాటకీయంగా జొరబడటాన్ని కంకుభట్టు వేషంలో ఉన్న మొగుడు ధర్మరాజు
తప్పుపట్టడం చూసి మనసు దెబ్బతిన్న ద్రౌపది ' నా మొగుడూ
నాటకాలరాయుడే! పెద్దాళ్లను బట్టే కదా చిన్నవాళ్లు
నడుచుకొనేదీ?' అని ఎదురు దెబ్బకొట్టేస్తుంది. అహం మీద దెబ్బ పడితే చిన్నా పెద్దా అన్న తారతమ్యం చూడనీయదు బుద్ధి.
భాగవతంలో హిరణ్యకశిపుడు వంశాచారానికి విరుద్ధంగా
విష్ణుభక్తుడవుతున్నందున కన్నకొడుకు ప్రహ్లాదుణ్ణి సైతం తన అసురవంశం అనే శరీరంలో పెరిగే
'దుష్టాంగం'గా తిట్టిపోస్తాడు. మిగిలిన అంగాలను రక్షించుకునే నిమిత్తం చికిత్స కింద ఆ 'కులద్రోహి' ని అధముడిగా భావించి శిక్షించడానికైనా
వెనుకాడడు. అసురలదేముంది? ఆ దేవుళ్లకే
కోపాలు అదుపులో లేని సందర్భాలు బోలెడన్ని తెలుగుసాహిత్యంలో. శ్రీనాథుని
భీమేశ్వర పురాణంలో కాశీని శపించిన వ్యాసులవారి మీద పట్టరాని కోపంతో తిట్లకు
లంకించుకుంటాడు సాక్షాత్తూ విశ్వేశ్వరుడు. 'ఓరి దురాత్మ
నీవారముష్టిం పచాభాస యోజన గంధి ప్రథమ పుత్ర/దేవరన్యాయ
దుర్భావనా పరతంత్ర, బహుసంహితా వృథా పాఠపఠన.. ' అని తిట్టిపోసినా ఆవేశం చల్లారని ఆ ఈశుడు అంత గొప్ప పంచమవేదం మహాభారతం
రచించిన మహాపండితుడు వ్యాసుడిని పట్టుకుని చివరకు 'భారత
గ్రంథ పండితమ్మన్య'గా తేల్చేశాడు. 'పండితమ్మన్య' అంటే పండితుడు కాని పండితుడు అని
శ్లేషార్థం.
ధూర్జటి
మహాశివభక్తుడు.
కానీ ఏ కారణం చేతనో రాజులు పేరు వింటే చాలు మహా రాజుకుంటుంది ఆ శైవుడి
మనసు. ఒకానొక సందర్భంలో 'రాజుల్మత్తులు
వారిసేవ నరకప్రాయంబు వారిచ్చునం/భోజాక్షీ
చతురంతయానతురగీభూషాదు లాత్మవృథా/బీజమబుల్' అని తిట్టిపోసిన సందర్భం అందుకు ఉదాహరణ. కారణం,
కర్జం ఉండి తిడితే అదో రకం. 'తగుపాటి
కవులకియ్యని మొగముండల కేలగలిగె మూతిన్ మీసల్' అంటూ 'ఇయ్యగ నిప్పించగల యయ్యలకేగాక మీసమందరికేలా?' అన్న
భావం గల కవిచౌడప్పల తరహా ఘంటా ఘోషంగా దాతృత్వగుణం లేనివారిని తగులుకున్న కవులూ
మనకేమీ తక్కువగా లేరు. 'ఊరక సజ్జనుండొదిగి యుండిననైన
దురాత్మకుండు ని/ష్కారణమోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా '
అభ్యసించే అల్పులను, లోభులను భాస్కర శతకకారుడు
తరహాలో 'నూరు టంకాలు ఖరీదు చేసే చీరలు పెట్టెకు నిండుగా
ఉన్నప్పుడు అవి చినిగిపోయే వరకు కొరికే చిమ్మట పురుగులతో పోల్చి తిట్టిన కవులూ లేకపోలేదు. నిష్కారణంగా పరులకు కీడుచేసే పెడబుద్ధులను తిట్టిపోసిన కవులను
లెక్కించడానికి చేతివేళ్లు, కాలివేళ్లు మనకు ఇంకెన్ని
వందలున్నా చాలవు. 'అల్పుడైన వానికి అధికారమిచ్చిన,/ దొడ్డవారినెల్ల తొలగగొట్టు' అంటూ నిత్యం లోకంలో
జరుగుతున్న అక్రమాలను కళ్లారా చూస్తూ కూడా వాళ్లని మన వేమన తరహాలో ఏ 'చెప్పు తినే కుక్కలతో' పోల్చి తిట్టుకోకుండా ఎలా
ఉండగలం? పది నీతులతో పాటు పది బూతులనూ పద్యంతో కలిపి
సభలో ధైర్యంగా చదివినవాడే ఘనుడైన కవి అని
చౌడప్పలాంటి కవులు ఎప్పుడూ వచ్చిపోతూనే ఉంటారనడానికి వెల్లువలా కురిసి వెలసిన
దిగంబర కవిత ఉద్యమ ఉధృతే ఒక ఉదాహరణ. నీతి ఉపదేశం కోసమూ
బూతును ఆశ్రయించడం ఒక విచిత్రమైన సిద్ధాంతంలా కనిపిస్తుంది. కాని
ఆ ఉపదేశం లక్ష్యం సంపూర్ణంగా నెరవేరడం ఆలకించే నాథుడిలో వివేచన మేల్కొన్నప్పుడే.
అందరూ వందిమాగదులే పోగయిన చోట
ఒక మాట ప్రత్యేకంగా వినిపించడానికి కొద్దిమంది బుద్ధిమంతులు తొక్కే బాటను అర్థంచేసుకోవచ్చు. 'కోకిలేన కృతం మౌనం ప్రావృట్కాలే సమాగతే/ యత్రభేకపతిర్వక్తా
తత్రాస్మాకం కుతో వచః'(వర్షాకాలం రాగనే కోకిల మౌనం
వహించింది.మండూక రాజు ఎక్కడైతే వక్తగా వ్యవహరిస్తాడో, అక్కడ
మా వంటివారికేమి మాటలుంటాయి?) అన్న18 వ
శతాబ్ది నాటి వాంఛానాథుడి మహిష శతకంలోని బాధ అన్నికాలాలకూ వర్తించేదే! పశుజాతి మొత్తంలోకి అతి నీచమైనదని
భావించే దున్నపోతును దుష్టరాజుకు
ప్రతినిధిగా చూపెట్టి స్తుతించే నెపంతో
వాంఛానాథుడు దూషించిన ఎత్తిపొడుపు
శతకానిదీ ఇదే దారి మరి. తిట్టడం కోసమే రాసే రాతలను కాలం
ఆట్టే కాలం పట్టించుకోదు. పద్దస్తమానం ఎవరినో ఒకరిని
ఎత్తిపొడవనిదే కల ముడవని శ్రీనాథుడిని, అతగాడి మిత్రుడు అవచి
తిప్పయ్యసెట్టిని మనసులో పెట్టుకుని వినుకొండ వల్లభరాయడు అనే కవి క్రీడాభిరామం
పేరుతో ఒక కావ్యం సృష్టించాడు. చాలావరకు శ్రీనాథుడి పోకడలు
పోతూనే కాకతీయుల నాటి ఓరుగల్లు పురవీధుల్లో తిప్పుతూ మంచనశర్మ, టిట్టిభసెట్టి అనే రెండు పాత్రల ద్వారా అన్ని కులాల, తెగల స్త్రీలను పచ్చిగా వర్ణించేశాడు. ఇప్పుడా
పద్యాలన్నీ చెప్పుకుంటూ పోతే పెద్ద రసాభసా కావడం ఖాయం. బూతు భావాలను సైతం అన్యాపదేశంగా ఎట్లా
చెప్పవచ్చో ఉదాహరణగా సూచించడానికి వల్లభరాయుడు తొలిఝామున తన మానాన తాను కూసే
కోడిని అడ్డం పెట్టుకుని ఎట్లా పద్యం చెప్పాడో ఈ పద్యంలో చూడవచ్చుః రాత్రంతా సంభోగ
విహారంలో సంరంభంగా ఉన్న జంటలోని ఒక ప్రియుడు తొలిఝామున గొంతెత్తి కూసిన పాపానికి
కోడిని ఎంతలా పడతిన్నాడో! 'ఎట్టకేలకు నలుక రేయల్ల దీర్చి
యువిద/యధరామృతమ్ముగ్రోలుచున్న నాకు
/పాన విఘ్నంబుగా మ్రోసె పాపజాతి,/జాతి ఛండాలమైన వేసడపు కోడి'.
ఇట్లా
ఏదో ఒక వింతో, చమత్కారమో ఉన్నా కొంత నయం, తిట్టడం కోసమే
కవిమహానుభావులు వెలువరించిన
తిట్టుకావ్యాలు మాత్రం మనకు కొదువా?తెనాలి రామలింగకవి
శేషప్పవిజయం, చిత్రకవి వెంకటరమణకవి సకల వర్ణనా పూర్ణరామాయణం,
కూచిమంధి జగ్గకవి చంద్రరేఖా విలాసం, పిండిప్రోలు
లక్ష్మణకవి రావణదమ్మీయం, రేకపల్లి మహాదేవకవి చిన్ని వెంకట
నరసీయం.. సర్వసభ్యతలను తోసిరాజనేసిన బూతుబుంగలు. కూచిమంచి
జగ్గకవి సాధారణంగా భగవన్నామ స్మరణతో ప్రారంభమయే
మంగళాశాసనంలోనే పోయిన పోకడ ఇందుకు ఒక చిన్న ఉదాహరణ, తన కావ్య కృతిపతి నీలాద్రిరాజును
'శ్రీకంఠుండు భుజంగభూషణుడు భస్మీభూత పంచాస్త్రు డ/ స్తోకాటోపబల ప్రతాప పురరక్షోదక్ష సంశిక్షణుం/ డాకా
శోజ్జ్వల కేశపాశుడు త్రిశూలాంకుండు తా/ నీకం జింతలపాటి
నీలన్పతిన్ వీక్షించు నేత్రత్రయిన్' శివుడు నీలాద్రి రాజును
మూడో కన్నుతో చూడాలన్నంత(బూడిద చెయ్యాలన్నంత) కసి అన్నమాట కవికి! పూర్వకవి స్తుతిలో కూడ
బీరుపోకుండా జగ్గకవి కేవలం వేములవాడ భీమకవి, తెనాలి
రామకృష్ణకవి, శ్రీనాథకవి, తురగా రామకవి
వంటి తిట్టుకవులను మాత్రమే స్మరించుకోవడం మరో విశిష్టత.
మాట
పట్టింపు దగ్గర నుంచి మత విశ్వాసం దగ్గరి దాకా అణుమాత్రం తేడా వచ్చినా అనుమానం లేకుండా
చంపమనో, నరకమనో ప్రబోధించిన సాహిత్యం సంస్కృత వాజ్ఞ్మయం నుంచి రెండాకులు ఎక్కువ
నేర్చిన వాక్శూరత్వం తెలుగుపలుకుది ఒకానొకప్పుడు. 'ప్రాజ్ఞులు
వేదజ్ఞులు, లో/కజ్ఞులు చేగొండ్రె
గతశిఖాగాయత్రీ/యజ్ఞోపవీతనాస్తికు,/లజ్ఞులు
చేగొండ్రుగాక యద్వైతమజా' అనడంతో సరిపుచ్చుకుందా .. 'శివనిందావిషయంబగు,/నవమానము సెప్పునట్టి
యప్పుస్తకముల్/అవిచారంబున గాల్పగ,/నవుచెప్పెడి
వానిజంపనగునీశానా!' అంటూ అద్వైతం పుచ్చకున్నవాళ్లందర్నీ,
శైవం వద్దన్నవాళ్లతో ఏకంగా చంపెసెయ్యమనే దారుణం అధిక్షేపాత్మక సాహిత్య
రూపంలో మల్లికార్జున పండితారాధ్యుల శివతత్వసారంలో దర్శనమిస్తుంది మరి!
కనకపు
సింహాసనమున/శునకమును కూర్చుండబెడితే ఏమవుతుందో సుమతీ శతకం ఆనాడే అధిక్షేప రూపంలో
బుద్ధిమంతులను హెచ్చైరించింది. పామరుడు తగిన రక్షణ లేకుండా
హేమం కూడబెడితే అన్యాయంగా అది ఏ విధంగా భూమీశుల పాలవుతుందో చీమలు, పాముల దృష్టాంతంతో సవివరంగా చెప్పిన అధిక్షేప సాహిత్యం సమాజం పట్ల మొదటి
నుంచి తన వంతు అప్రమత్తత బాధ్యతను
సక్రమంగానే నిర్వర్తించింది. కుమారీ, కుమార శతకాలనో, వేమన, భాస్కర,
సుమతుల వంటి మకుటాలతో వెలువడ్డ వేలాది శతకాల శ్రేణులన్నీ, కేవలం
పేరులోనే కాకుండా.. చెప్పే తీరులలో కూడా నీతులను అవసరార్థం
బూతుల రూపంలో కొంత ఘాటుగానే చెప్పిన మాట నిజం. నులిమితేనే
నుసి తొలగి పత్తి వత్తి మరింత ఉజ్వలంగా
వెలుగుతుందన్న సద్భావనతో నాలుగు పిచ్చి మాటలతో నలుగుపెట్టి బుద్ధులు నేర్పించే
అధిక్షేపం నిక్షేపంగా సదా ఆదరణియమే! అర్థ శతాబ్దం కిందట
ఆంధ్రదేశంలో వీధిబళ్లల్లో చదువుకున్న బడిపిల్లలో ఎక్కువ మంది దసరా పండుగ పదిరోజులూ
ఇంటింటికీ పప్పుబెల్లాల కోసం తిరిగే సమయంలో పాడుకొనే పాటలు కొన్ని ప్రసిద్ధమైనవి
ఉండేవి. అందులో శేషప్పకవి విరచిత నరసింహ శతకంలోని 'మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు- మాన్యముల్ జెరుప
సమర్థులంత/ యెండిన యూళ్లగోడెరిగింపడెవ్వడు-పండిన ఊళ్లకు ప్రభువులంత/యితడు పేద యటంచు
నెరిగింపడెవ్వడు-కలవారి సిరులెన్నగలరు చాల.. ' అంటూ పెట్టే దెప్పుళ్లు చాలక' యిట్టి దుష్టుల కధికార
మిచ్చినట్టి,/ప్రభువు తప్పులటంచును బలుకవలెను' అంటూ చిన్నిబిడ్డల నోట వినిపించే అధిక్షేపాలు అన్ని కాలాలకూ వర్తించే
నిష్టూరాలే కదా!
శేషప్ప
కవి నరసింహ శతకంలో మొరపెట్టుకున్న చందాన 'ఐశ్వర్యములకు
నిన్ననుసరింపగలేదు - ద్రవ్య మిమ్మని వెంటఁ దగులలేదు/కనక
మిమ్మని చాల గష్టపెట్టగలేదు - పల్ల కిమ్మని నోట బలుకలేదు/సొమ్ము
లిమ్మని నిన్నునమ్మి కొల్వగలేదు - భూము లిమ్మని పేరు పొగడలేదు/బలము లిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు - పసుల నిమ్మని పట్టుపట్టలేదు'
అంటూనే 'నేను గోరిన దొక్కటే నీలవర్ణ - చయ్యనను
మోక్షమిచ్చిన జాలు నాకు' అన్న స్వార్థంతో
నమ్ముకున్న దైవాన్ని ఏ భూషణవికాస!
శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర' అనో పొగిడే
భక్తశిఖామణులూ కద్దు లోకంలో. సొంతానికి ఆశించిన కోరికలు
నెరవేరలేదన్న ఉక్రోషంతో తిట్టిపోసే లక్షణం కొందరికి మల్లే గాక, ఆరాధించేవారికి అన్నీ సమకూరడం లేదన్న చింతతో అందుకు ఆ ఆరాధ్యులనే
బాధ్యులని చేస్తూ ఎత్తిపొడిచే బాధ ఈ భక్తశిఖామణులది. కాసుల
పురుషోత్తమకవి శ్రీకాకుళాంధ్ర మహాకవిని ఈ రకంగానే
దెప్పుతూ చెప్పిన కీర్తి నింద పద్యాలు పరమ ప్రసిద్ధం. విధర్మీయుల బలగాలు సింహాచలాన్ని, ఆ ప్రాంత ప్రజాసమూహాన్ని
చెండాడుతున్నా.. గుళ్లో రాయిలా నిమ్మళంగా పడున్నందుకు
ఉక్రోషంతో తాను ఆరాధించే నరసింహావతారుని మరో అవతారం శ్రీకృష్ణుని లీలలను గుర్తుకు తెస్తూ
గోగులపాటి కూర్మనాథకవి పెట్టిన గోడంతా ఈ
అధిక్షేప సాహిత్యం కిందనే జమ. 'పాలీయ వచ్చిన భామిని ప్రాణంబు-లపహరించి చెలంగినట్లుగాదు/యాగోత్సవంబున కతిమోదమున
బిల్వనంపు మామను ద్రుంచినట్లుగాదు/చేతగాక నరుచేత చుట్టంబుల
నందర జంపించినట్లుగాదు/తుంగ గల్పించి యుత్తుంగ వంశద్రోహ-మాచరించి చెలంగినట్లుగాదు' పరంబలంబిది నీ ప్రజ్ఞ
పనికి రాదు,/లెమ్మికను మీనమేషమ్ముల్లెక్క యిడక/ చొరవ తురకలు గొట్టగా చుక్క యెదురె,'
అంటూ వైరిహరరంహ సింహాద్రి నారసింహ' అంటూ
సాక్షాత్ స్వామి నరహర మూర్తినే నిర్భీతిగా ఎత్తిపొడిచే వ్యాజనింద రివాజే ఇక్కడ.
అధిక్షేప సాహిత్యానికి వేములవాడ భీమకవి నుంచి
లెక్క పెట్టుకుంటూ పోతే మేధావిభట్టు, బడబాగ్నిభట్టు, శ్రీనాథ మహాకవి, ప్రౌఢకవి మల్లన, తెనాలి రామలింగడు, అల్లసాని పెద్దన, భట్టుమూర్తి, కందుకూరి రుద్రయ్య, ఎర్రవల్లి పర్వతన్న, బొడ్డుచెర్ల వెంగన్న, రాళ్లబండి పట్టాభిరామరాజు, మోచెర్ల వెంకన్న, అడిదం సూరకవి, రేకపల్లి సోమనాథుడు, అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి వంటి కవులెంతో మంది వేటుకూరి ప్రభాకరశాస్త్రిగారి
చాటుపద్యమణిమంజరి చాటున చటుక్కున మెరిసి
మురిపిస్తారు. అందుకే
చూసింది చూసినట్లు, తనకు
తోచింది తోచినట్లు స్పష్టంగా, సూటిగా చెప్పేసే బలహీనత నుంచి
బయటకు రాని మహాకవి శ్రీనాథుడు మామూలు మనిషి కానివ్వండి, మహారాజాధిరాజు
కానివ్వండి, ఆఖరుకు ఆ మహాదేవదేవుడే దిగిరానివ్వండి, వాళ్ళని కడిగెయ్యటానికి అవకాశం దక్కితే ఒక్కడుగయినా వెనకాడని
మనస్తత్వం కలవాడు కనకనే ఆధునిక కవి ఆరుద్ర నోట ప్రశంసలు పొందిన ''కొంటె పిల్లకాయలు లేని కన్నతండ్రి-గోదావరి పొంగులేని రాజమండ్రి' - హంసీయానకు గామికి న్నధమ రోమాళుల్ నభఃపుష్పముల్/సంసారద్రుమ
మూల పల్లవ గుళుచ్ఛంబైన యచ్చోట వి/
ద్వాంసుల్ రాజమహేంద్ర పట్టణమునన్
ధర్మాసనంబుండి ప్ర/
ధ్వంసాభావము ప్రాగభావ మనుచున్ దర్కింత్రు
రాత్రైకమున్'
అన్న అభిశంసనకు గురయింది అన్యాయంగా. తమ
కవిత్వంలో తప్పులు వెదికేవాళ్లనో, సత్కారాలు అందివచ్చే
సూచనలు అందుకుంటూ అడ్డుపుల్లలు వెసేవాళ్ల పుణ్యం వల్ల ఆ అవకాశాలు తప్పిపోయినప్పుడో,
నిష్కారణంగా అపాయం తలపెట్టి వినోదించే దుష్టులు తారసపడినప్పుడో,
ఎన్ని వినతులు సమర్పించినా చిన్నమెత్తు సాయం అందనప్పుడో, సాటివారినైతే నోటి దూల తీరేదాకా ఎన్నైనా పడతిట్టిపోసుకోవచ్చు. బలహీనుడు బలవంతుడిని ఎదుర్కొనే సందర్భం తటస్థించినప్పుడు నేరుగా ఎదుర్కొనే
సామర్థ్యం కరవైనప్పుడు నోరూ వాయా లేని ఏ
పిల్లినో, ఎలుకనో అడ్డుపెట్టుకుని అడ్డమైన తిట్లు
తిట్టిపొయ్యడమో, అదీ ప్రమాదకరమని తోచినప్పుడు కనీసం
దెప్పిపొడుపులతో అయినా సరిపెట్టుకుపోవడమో అత్యంత సహజం. అదే కాస్త హస్త లాఘవం ముదిరిన
సరుకైతే కలం పట్టి మరీ రమణీయార్థంలోనో, అలంకార భరితంగానో,
శ్లేషార్థంతోనో, రెండర్థాల పదాలతోనో.. సరసమాడుతున్నట్లుగానే విరసాలడేయడం.. అధిక్షేప
ప్రక్రియలో అదో విధానం. నేరుగా తిట్టినవాళ్లు, నేరకపోయి వీడితో ఎందుకు
పెట్టుకున్నామా అని తలపట్టుకునేటట్లు నాలుగు పెట్టేవాళ్లు, మోజు
మాటలతోనే మొరటుతనం ప్రదర్శించే ఘనులు, బండబూతుల నుండి,
దండకాలు.. స్తోత్రపాఠాల రూపంలో చెండాడుకునే దుందుడుకుగాళ్లు, చాటువులలో పెట్టి చాటుమాటు మాటలతో చాకిరేవు పెట్టేవాళ్లు, శతకాల రూపంలో సహస్రం పెట్టేవాళ్లు, కావ్యాల వంకన
కడుపుబ్బరం తీర్చుకునే కవిరాయుళ్లు.. అబ్బో! అధిక్షేపానికి ఎంత పెద్ద కథ ఉందో ఇంత చిన్న వ్యాసంలో ఆ వివరాలన్నీ
పరామర్శించుకోవడం కుదిరే వ్యవహారం కాదు. నిద్రపోయే
ఉపపాండవులను మధ్యరాత్రిలో దాడిచేసి మట్టుపెట్టిన అశ్వత్థామను ద్రౌపది వంటి
కన్నతల్లి చేత కడు సభ్యంగా తిట్టించాడు బమ్మెర పోతన్నగారు తన భాగవతంలో! 'ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావనిన్ లేరు కిం/చిద్ద్రోహంబును
నీకు జేయరు బలోత్సేకంబుతో చీకటిన్/భద్రాకారుల పిన్నపాపల రణ
ప్రౌఢ క్రియా హీనులన్/ నిద్రాసక్తుల సంహరింప నకటా నీ
చేతులెట్లాడెనో!' అంటూ పాంచాలిలోని కన్నతల్లి హృదయం పరిపరి
విధాల రోదిస్తుంది. కానీ కాలం మారిందిప్పుడు. హింసన చణకు పాపపుణ్యాల ప్రస్తావన పట్టని కాలం నడుస్తున్నది ప్రస్తుతం.
మితి మీరిన ఆశల ఆబోతులు కుమ్ములాటకై కొమ్ములు ఝాడిస్తూ ముందుకు
ఉరికొస్తుంటే చేత ఏ ఆయుధం సమయానికి లేని అర్బకుడు అఖరుకు నోటి నాలుకనే ఆయుధంగా
సానబట్టి బరుతెగించి పోరాడక తప్పని పరిస్థితులు ప్రస్తుతానివి. తిట్టిన ప్రతీ వాడి మాడుపై మొట్టవలసిన అగత్యం లేదు కానీ.. అసందర్భంగా, స్వార్థపూరితంగా, స్వలాభం
మీద మాత్రమే ఆపేక్ష ప్రదర్శించే క్రమంలో ఎవరెట్లా గోదాట్లో కొట్టుకుపోయినా
ఫరవాలేదన్నట్లుగా కుపరిపాలన సాగించే ప్రభువుల మనసుల్లో కదలిక తెప్పించేపాటి పాటవం
కాస్తో కూస్తో కలిగించలేని పక్షంలో ఏ అధిక్షేపమయినా ఎంత అలంకారప్రాయంగా ఉన్నా
వాంఛనీయం కానేకాదు.
భాషాకాలుష్యానికి దోహదపడే తిట్టుసాహిత్యం ఎంత
రమణీయకమైన పదాలతో పొదిగినా సదా నిరాదరణీయం.
-కర్లపాలెం హనుమంతరావు
19 -01 -2020
No comments:
Post a Comment