Sunday, January 31, 2021

అన్నమయ్య కృష్ణతత్వం -కర్లపాలెం హనుమంతరావు


 


అన్నమయ్య అనగానే కళ్ల ముందు కనబడేది ఆ ఏడుకొండలవాడి మంగళకర స్వరూపం.  వేంకటాద్రిరాయడి కొలువు కూటమికి అంతకు ముందు నుండే కొండలు నెలవై  ఉండినా, కలియుగ అవతార పురుషునిగా  భక్తజన సందోహం గుండెల మీదకు చేదిన ఘనత మాత్రం నిశ్చయంగా తాళ్లపాకవారి సంకీర్తన గానామృత వైశిష్ట్యానిదే! అడుగడుగులవాడిని ఎన్నిందాల ప్రదర్శించ తగునో, అన్నిందాలా హుందాగా ప్రదర్శించి చూపించిన ప్రతిభా ప్రాగల్భ్యం  అన్నమయ్య ఘంటానిది, కంఠానిది. అయ్యతో పాటూ అమ్మకూ  స్వరార్చనాసేవలు సరిసమానంరగా అందడం అయ్యవారి ఆనాటి అభ్యుదయ భావాలకు అద్దంపడుతుంది.  ఆచార్యులవారి కీర్తిని అజరామరం చేసిన వేలాది సంకీర్తనల్లో కృష్ణ సంబంధమైన సంకీర్తన గానామృతం ఓ గుక్కెడు సేవించడమే  ఇక్కడ ముఖ్యోద్దేశం. 

తాళ్లపాకవారి రాగిరేకులు తడవని రసరహస్యం లేదనడం అతిశయోక్తి కాబోదు. అయ్యవారి కృష్ణతత్వం గురించి చేసిన గానప్రస్తావనాలను గాని గాఢంగా పరిశీలిస్తే భజగోవింద కర్త  శ్రీశంకర భగవత్పాదులు భావించిన ఆ 'ఏదో తెలియని నీలిరూప తత్వం' అన్నమయ్యనూ వదలకుండా వెన్నంటి వేధించి మరీ తన్మయత్వ అగాధంలో ముంచి తేల్చిందని చెప్పుకోవాలి.  జయదేవుని అష్టపదులకు దీటైన పాదపంక్తులను ఆ పారవశ్య పరమార్థ చింతనతోనే అన్నమయ్య అత్యద్భుత్వంగా తీర్చిదిద్దినట్లు ఒప్పుకోవాలి. 

కన్నయ్య అనగానే మనస్సుకు తటిల్లుమని తట్టేది  ఆ నల్లనయ్య కూనరూప లావణ్యం, చిలిపి చేష్టలు. ఆ యదుబాలుని ముద్దుమురిపాలను  అన్నమయ్య మథించి  మరీ కట్టిన కీర్తనల చల్లపై తెడ్డు కట్టిన వెన్నల తరకల రుచి వట్టొట్టి మాటలతో మనసుకు పట్టించడం ఒక్క నాలుక వల్ల శక్యమయే పని కానేకాదు. 'భావయామి గోపాలబాలం మన/స్సేవితం తత్పదం చింతయేహం సదా' అంటూ  చిన్నికృష్ణుని ముద్దు పాదాలను తాను తలుచుకుంటూనే తప్ప తతిమ్మా దేవుళ్ల సంకీర్తనల పర్వం సవ్యంగా సాగించలేన’ని  స్వయంగా ఆ  చెంగల్వరాయని స్వరసేవకుడే సెలవిచ్చుకున్న సందర్భం గమనీయం.

'కటి ఘటిత మేఘలా ఖచిత మణి ఘంటికా'-బుజ్జి నడుముకి కట్టిన రత్న ఖచితమైన మొలతాడును తలుచుకుని తనలో తానే సంకీర్తనా పరవశుడై మురిసిపోతాడు అన్నమయ్య వందలొందల పర్యాయాలు. 'నిరతరకర కలితనవనీతం  బ్రహ్మాది/ సురనికర భావనా శోభిత పదం' -వెన్నముద్దతో నిండి ఉండే చిన్ని చిన్ని చేతులుండే ఆ బాలగోపాల రూపాన్ని మనసులో భావించుకుంటేనే గాని..  మిగతా దేవతలకు ప్ర్రార్థనలు.. అవీ సవ్యంగా సాగే పని కాదు!'అని అన్నమయ్యే తన కృష్ణతత్వ కాంక్షాపరత్వాన్ని నిర్మొహమాటంగా బైటపెట్టిన సన్నివేశాలు ఎన్నో!  

'చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ/బంగారు మొలతాడు పట్టుదట్టి' అన్న పద్యం నోట బట్టని బాలలు తెలుగునేలల మీద కనిపించడం చాలా అరుదు  నిన్న మొన్నటి దాక. ఆ తరహా వెన్నముద్ద వంటి  కృష్ణ కీర్తననే అన్నమయ్య మన జిహ్వలకు అందించింది. అనుభవిస్తూ ఆలపిస్తే సాక్షాత్తూ ఆ బుజ్జికృష్ణుడే తనకు తానై వచ్చి మన గుండెల మీదెక్కి కూర్చుని ఆడుకుంటున్నంత ఆనందం ఖాయం! బ్రహ్మానంద పారవశ్యం కలిగించే పదబంధాలతో వేలాది సంకీర్తనలు సృజించిపోయిన అన్నమయ్యను ఒక్క నోటితో మాత్రమే పొగిడితే చాలునా? అదే శ్లోకంలో చిట్టచివరన 'పరమపురుషం గోపాలబాలం' అని కృష్ణతత్వాన్ని పరమ క్లుప్తంగా, ఆప్తంగా  ముక్తాయించడం వెనక, స్వరూపానికి స్వల్పుడే అయినప్పటికీ  పరమపురుష తత్వం శ్రీకృష్ణపరంధామునిది    అన్న కృష్ణతత్వం వెలయించడమే అన్నమయ్యవారి పరమార్థం! ఆ వాగ్గేయకారుని ఎన్ని వేల జిహ్వలతో స్తుతిస్తే న్యాయం జరిగినట్లు?  

'చిన్ని శిశువు చిన్ని శిశువు /ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు' అంటూ కృష్ణయ్య ముద్దుమురిపాలు ఒలికే బాలుని స్వరూపాన్ని కళ్లకు కట్టించే ప్రయత్నం చేసాడు అన్నమయ్య అనేక పర్యాయాలు.  అలతి అలతి పదాలతో ఇంత అందమైన వర్ణనలతో మరి  మరో కవి ఇంకెవరైనా   పాలచారలు తెడ్డు కట్టిన కృష్ణయ్య బుజ్జి బొజ్జను గూర్చి కూడా భజించాలన్న బుద్ధిపుట్టిందా? ఏమో..  తెలియదు.  అదే అన్నమయ్యలోని విశిష్టత. అణువు నుంచి బ్రహ్మాండం వరకు, అనంతం నుంచి చింతాకు చిగురు వరకు ఏదీ ఆ వాగ్గేయకారుని  సంకీర్తనల స్వర గాలాలకు తగలకుండా తప్పించుకోలేకపోయింది. 

ఇళ్లలోని పసిపిల్లలు తాగే తాగే పాలను ఒక్కోసారి వంటి మీదకు వంపేసుకున్నప్పుడు  చటుక్కున చూసిన వెంటనే ముందు మనకు తెగ ముద్దొచ్చేస్తారు. బాలుడు భగవంతుడెలాగో.. భగవంతుడూ బాలుడుకు మల్లే అయిపోతాడు కాబోలు ఒక్కో మారు.  సంపూర్ణ సత్యస్వరూపుడైన శ్రీకృష్ణపరమాత్ముడిని ముగ్ధమనోహరమైన ఆ బాల్యస్థాయికి దింపుకొచ్చి భగవంతుని మీది ముప్పిరిగొనే భక్తిభావాన్ని ముద్దుమురిపాల రూపంలో తీర్చుకునే అవకాశం భక్తలోకానికి అందించిన అన్నమయ్య అక్షరాలా ధన్యజీవి. 

దేవకీసుతుడు బాలకృష్ణుడి ఫాలభాగం మీద జారిపడే ముంగురులను పైకి నెట్టి మురిపెంగా సవరించే భాగ్యం యశోదమ్మ తల్లికి దక్కింది చివరకు. అదృష్టమంటే యశోదమ్మదే కదా అని కృష్ణయ్యను అమితంగా కామించే అన్నమయ్యలోని తల్లిహృదయం అసూయచెందే కీర్తనల పర్వం ఇది. 'పాయక యశోద వెంట పారాడు శిశువు' గా వేదోద్ధారకుణ్ణి భావించిన  వైరుధ్య వైదుష్యం తాళ్లపాక అన్నమయ్యలవారిది. ఆ మాటకొస్తే అండ పిండ బ్రహ్మాండ నాయకుడిని ఓ బాల వెన్నదొంగ స్థాయికి దింపి వర్ణించే ఆలోచన అన్నమయ్యకు  కలగడం వాస్తవానికి తెలుగువారి వాగ్గేయసాహిత్య ప్రక్రియ చేసుకున్న అక్షరాల నోముఫలంగా చెప్పుకోవాలి. 

'ఝుమ్మని మడి శృతి గూడగను/ కమ్మని నేతులు కౌగగ చెలగే' ననే ఒకానొక కీర్తనలో 

'పాలు పితుకుచును బానల కేగుల/సోలి పెరుగు త్రచ్చుచు చెలరేగే' నేతులు కాగుతుంటే వెలికొచ్చే ధ్వనులు, గోవుల పొదుగుల కింద చేరి గోపాలురు పాలు పితికే సందర్భంలో పుట్టే సవ్వడులు.. ఇట్లా సర్వం ఝుమ్మనే నాదాల మాదిరి పొంగిపొరలుతున్నట్లు అన్నమయ్య సందు దొరికిన ప్రతీ సందర్భంలోనూ కర్ణపేయమైన ఆ సప్తస్వర మిశ్రితాలను  తాను విని ఇహలోకాలూ తన్మయమయేలా  వినిపించడం వాగ్గేయ సంగీత విభాగానికి ప్రత్యేకంగా కలిసొచ్చిన  స్వరాలవిందు! 

'దది మధన నినాదైః త్యక్త నిద్ర ప్రభాతే/ నిభృత పదమగారం వల్లవానాం ప్రవిష్టః/ముఖ కమల సమీరైః ఆశు నిర్వాప్య దీపాన్/కబళిత నవనీతః పాతు గోపాలబాలాః'- పరగడుపునే పెరుగు చిలికే శబ్దాలు విని లేచి, నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి దీపం ఆర్పి మరీ వెన్న దొంగిలించే ఆ కొంటె కృష్ణుడికి మనకు లాగా ఆ చౌర్యం పాపహేతువు కాదు. సరికదా, కృష్ణచౌర్య స్మరణం ముక్తిఫలదాయకమని నమ్మి ఎంతో మంది భక్తిభావుకులు దానినో  ఓ తత్వం కింద తీర్చిదిద్దారు. అందులో జయదేవుడు, లీలాశుకుడు, మన తెలుగులో పోతనా.. ఆయనకు తోడుగా  అన్నమయ్య ఇప్పుడు! 

వాస్తవానికి లోకంలో దొంగతనం చేయని జీవి ఎక్కడైనా ఉందా? ముఖ్యంగా మనిషి మౌలిక ప్రవృత్తే చోరబుద్ధి. తల్లి గర్భంలో చేరినప్పటి బట్టి అమ్మకు వంటబట్టిన తిండి సారాన్ని  తస్కరించడం  మరిగిన తండ్రి జీవకణమే కదా నవమాసాల అనంతరం భూమ్మీద మనిషిగా అవతరించడం! కన్నవారి ముద్దుమురిపాలను, రక్తమాంసాల ఫలసాయంతో సహా తోబుట్టువులతో కలసి మరీ దొంగిలించి తినే మనం, తినే తిండి నుంచి పీల్చే గాలి వరకు అనుభవించే అన్నింటా అంతో ఇంతో ఏమిటి.. ఆసాంతం.. ప్రకృతి నుంచి, సాటి జీవజాతికి న్యాయంగా దక్కవలసిన  భాగాన్నుంచి  కాజేసి కదూ మరీ ముదురుతున్నది?  ఇదేమని  ఎదురడిగేవారిని మరేదో కట్టుకథలతో దారి మళ్లించే మనిషితత్వం కృష్ణతత్వంతో కలగలసిపోయి అన్నమయ్య అత్యద్భుత ఆధ్యాత్మిక సంకీర్తనల సారంగా రూపుదిద్దుకొన్నదనిపిస్తుంది. వెన్న కాగుతుంటే తినేందుకని చెయ్యి పెట్టి చుర్రుమంటే చీమ కుట్టిందని చిన్నికృష్ణుడు బుడిబుడి రాగాలు తీసినా, తోడుదొంగలమైనందుకేనేమో మనకూ చీమ కుట్టినంతైనా  కోపం రానిది! కన్నయ్య చిన్ననాటి  కొంటె కథలన్నీ ఇట్లాగే ఉంటాయని అన్నమయ్యలోని భక్తిసాధకుని తన్మయత్వ  భావన. ఆ గోపాలుడి నిద్ర మెలుకువే పాలు చిలికే కవ్వం సవ్వళ్లతో మొదలవుతుంది. తరకలు కట్టే వెన్నముద్దలు దొంగిలించే ఆలోచనతోనే ఆ నల్లనయ్య కళ్లు నులుముకుని మరీ నిద్ర  లేచేదని లీలాశుకుని 'శ్రీకృష్ణకర్ణామృతం' కృష్ణతత్వాన్ని వర్ణించింది  గోపీజన మానస చోరుడుగా  కన్నయ్యకు మరో మనోహరమైన  బిరుదు ఎలాగూ ఉంది. క్రౌర్యం, నైచ్యం వంటి మరెన్నో మానసిక బలహీనతలు అన్నిటిని చౌర్యం చేసైనా సరే మనిషిని శుద్ధిచేయడం భగవంతుని బాధ్యతగా  భాగవతులంతా భావించిన తీరులోనే అన్నమయ్య  భావనా వాగ్గేయమార్గంలో అచ్చమైన తెలుగులో అద్భుతంగా సాగిందనుకోవాలి. 

'సా రోహిణి నేల మసూతరత్నం/కృతాస్పదం గోప వధూ కుచేషు' (రోహిణి కృష్ణుడనే నీలిరత్నాన్ని కన్నది. గోపికలు ఎప్పుడూ దానిని తమ వక్షస్థలంలొ ధరిస్తారు) అని లీలాశుకుడు చమత్కరిస్తే, అంతకు రెండాకులు ఎక్కువ చదివినట్లు కృష్ణతత్వం ఆసాంతం నవరత్నాలతో పోల్చదగ్గదని అన్నమయ్య  తెలుగులో చేసిన భావన పరమాద్భుతం. 'ముద్దుగారె యశోద ముంగిట ముత్యము వీడు'సంకీర్తనలో అన్నమయ్య  ఆ నవరత్నాలను పొదిగిన లాఘవం అమోఘం.  యశోదమ్మ ముంగిటి ముత్తెం మరెవరో కాదు.. తిద్దరాని మహిమల దేవకీ సుతుడైన బాలకృష్ణుడే! అతగాడే అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యం; పంతమాడే కంసుని పాలిట  వజ్రం కూడా అతగాడే. ముల్లోకాలకు కాంతులిచ్చే గరుడ పచ్చపూసట చిన్నికృష్ణుడు. రతికేళికి ఎదిగే వేళకు ఆ మదనుడే రుక్మిణమ్మ పాలిటి  పగడంగా మారాడుట! గోవుల గుంపు మధ్య  గోమేధికంలా మెరిసిపోయే నల్లని కృష్ణుడు, శంఖ చక్రాలు ధరించినప్పుడు వాటి సందులో వైడూర్యంలా మెరుపులీనుతాడుట. భక్తజాతికి అంతిమ గతిగా భావించబడే  కమలాక్షుడు కాళింగుడనే సర్పం శిరస్సు మీద కళ్ళు చెదిరే   పుష్యరాగం మాదిరి మిరిమిట్లు గొలుపుతాడని, పాలకడలిలో మెరిసే ఇంద్రనీలం వంటి ఆ శ్రీవేంకటాద్రి పద్మనాభుడే ఆన్నెపున్నేలేమీ ఎరుగని పసిబాలుడి మాదిరి  మన మధ్యనే  పారాడే  దివ్యరత్నమని అన్నమయ్య భావించడం కృష్ణతత్వానికి పట్టిన  అపూర్వ వాగ్గేయ హారతి పళ్లెం.  

- కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్  ; యూ ఎస్ ఎ 

30-01. 2021


***

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...