Wednesday, January 27, 2021

చందన న్యాయం - పదప్రయోగం - పరమార్థం - కర్లపాలెం హనుమంతరావు

చందన న్యాయం - పదప్రయోగం - పరమార్థం - కర్లపాలెం హనుమంతరావు
న్యాయం అంటే న్యాయస్థానాలలో వినిపించే చట్ట సంబంధమైన వ్యవహారం ఒక్కటే కాదు. వ్యవహారానికి, భాషకు సంబధించిన అర్థాలలో కూడా ఈ ప్రయోగాలు కనిపిస్తాయి.
ఎక్కడైనా అన్యాయం జరిగితే 'ఇదేం న్యాయం?' అని నిలదీస్తాం కదా! అక్కడ ప్రశ్నకు గురయే న్యాయం సహజన్యాయం, సామాజిక న్యాయం, వైయక్తిక న్యాయం .. మొత్తానికి నిత్యకృత్య జనవ్యవహారానికి సంబంధించిన న్యాయం.
ఆ అర్థంలో కాకుండా ఇంకో అర్థంలో కూడా 'న్యాయం ' అనే పదం వ్యవహారంలో ఉంది. కాకపోతే అది సాధారణంగా నిత్యకృత్యాలలో కాకుండా ఏ సాహిత్యానికి సంబంధించిన అలంకారం కిందనో వాడుతూ పండితులు, కవులు, చమత్కారులు మెరుగులు పెట్టారు. ఆ తరహా సాహిత్య సంబంధమైన న్యాయం 'చందన న్యాయం'. ఆ సుందరమైన తెలుగు పదప్రయోగం గురించిన కొంత సమాచారం మిత్రులతో పంచుకుందామనే ఈ టపా!
తెలుగే అసలు పెద్దగా వాడకంలో లేని ఈ రోజుల్లో 'చందన న్యాయం' వంటివి చక్కని పదాలే అయినా మూలన పడిపోయి ఎక్కడా వాడుకలో లేనప్పుడు ఎందుకు ఈ చర్చ? అని కొద్దిమంది బుద్ధిమంతుల ఆలోచన కూడా అయివుండవచ్చు! కాని, ఇంచక్కని తెలుగు రాయాలనుకునే ఔత్సాహికులకు కొన్ని కొత్త పదప్రయోగాలు (నిజానికి ఇవి పాతవే.. వాడేవారు కరవై మనకు కొత్తగా అనిపిస్తున్నాయి గాని ఇప్పుడు) వాటి అర్థాలు, తత్సంబధిత ప్రయోగాలు, అన్వయాలు అవగాహనకు వస్తే శోభ ఉట్టిపడే తెలుగుకు మళ్లీ పురుడు పోసిన తల్లులవుతారు కవులు, రచయితలని నా క్షోభ.. ఇక చర్చ తగ్గించి చందన న్యాయం పద ప్రయోగానికి వద్దాం. దాని కన్నా ముందు 'చందనం' అనే మాటను గురించి కొద్దిగా!
చందనం ఈ మధ్య కాలంలో మనకు బాగానే పరిచయం అయిన పదం. ఎర్ర చందనం దొంగ వీరప్పన్ మహానుభావుడి చలవ వల్ల అప్పట్లో ఏ దినపత్రికలో చూసినా చందనం తాలూకు వార్తలు, చర్చలే కనిపించేవి. చంద్రబాబుగారు ముఖ్యమంత్రి అయీ కాగానే (2014) తిరుపతి శేషాద్రి అడవుల్లోకి జొరబడి వచ్చేసి అక్రమంగా ఎంతో విలువైన చందనం దుంగలను మొదలంటా కొట్టుకుపోయి అమ్ముకునే ముఠా తాలూకు దొంగలను ఒక్కపెట్టున ఎన్కౌంటర్ లో ఠా అనిపించి సంచలనం చేసిన కథ గుట్టుగా సాగిందేమీ కాదు.
తెలుగు రాష్ట్రాల తాలుకు ముఖ్యమైన వనరుల్లో అత్యంత విలువైన వాటిలో ఇనుము ఖనిజాన్ని ఒక వంక గాలి జనార్దన రెడ్డి భూగర్భం నుండీ పెళ్లగించి మరీ సొమ్ముచేసుకుపోతే, మరో వంక నుంచి అంతకు మించిన ఖరీదైన చందనం దుంగలను శేషాద్రి అడవుల్లో ప్రాంతాలలో దొరికే శ్రేష్టమైన చందనం శ్రేణి దొంగదారుల్లో దారుణంగా పక్క రాష్ట్రాల గుండా విదేశాలకు తరలిపోయింది. అప్పట్లో అది మన బోటి మధ్య తరగతి చదువుకున్నజీవులకు న్యూస్ పేపర్లలో, టీ.వీలల్లో టీ కాఫీలు చప్పరిస్తూ చదువుకొనే సినిమా కబుర్లకు మల్లే వినోదం మాత్రమే కలిగించింది. తెలుగువాళ్లకు జరుగుతున్న అన్యాయం తెలుగువాడికే పట్టింది కాదు ఎప్పట్లానే! ఆ విలువైన చందనం గురించి ఒక చిన్న 'న్యాయం' ప్రబంధ కావ్యాలలో కనిపిస్తుంది. దాని పేరే 'చందన న్యాయం'.
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామికి ప్రతీ ఆషాఢ పూర్ణిమలో వేకువజామున సుప్రభాత సేవతో మేల్కొలిపి మంగళ వాయిద్యాల మధ్యన సుగంధ ద్రవ్యాలను మిళితం చేసిన మూడు మణుగుల చందనాన్ని అర్చకులు సమర్పించడం ఒక ఆనవాయితీ. ఉత్సవమూర్తి అయిన గోవిందరాజస్వామికీ విశేషంగా అభిషేకాలు జరిపించి చందనాన్ని కిరీటంగా అలంకరించడం ఒక ఆధ్యాత్మిక సంప్రదాయం. చందనానికి సంబంధించి దాదాపు అన్ని దేవుళ్లకూ ఒకే రీతిలో చర్చలు, నైవేద్యాలు. ఇప్పుడు మన అంశం అది కాదు.
చందనం అనగానే 'జయదేవుని గీత గోవిందం తాలూకు అష్టపదుల్లోని 'చందన చర్చిత నీల కళేబర! పీత వసన! వనమాలీ' అనే అష్టపదుల్లోని పదం కూడా మనసులో మెదిలి తపించే మనసు ఎందు చేతనో కొంత సేదతీరుతుమ్ది. సేదతీర్చే ఔషధ గుణం బౌతికంగా కూడా చందనం ప్రత్యేక లక్షణం. మాటలోనే కాదు.. పూతలో కూడా మనసునూ, శరీరాన్ని చల్లబరిచే అరుదైన పదార్థాలలో చందనం ప్రధానమైనది!
ఇప్పుడంటే రకరకాల ఆయింట్ మెంటులు, స్నోలు, కాస్మొటిక్స్ వాడకంలోకి వచ్చాయి కాని, ఇవేవీ సామాన్య జనానికి అందుబాటులో లేని కాలంలో కాలిన గాయాలకు ముందు చందనం అరగదీసి మందులా అద్దే వారు. అందుకోసం గాను ప్రతి ఇంట్లో చందనం చక్కలు ఉండేవి. వాటి మీద కొద్దిగా నీరు పోసి బొటనవేలుతోనో , మరో చిన్న చందనం పేడుతోనో గట్టిగా పదే పదే రుద్దితే ఆ నీటిలో చందనం కలిసేది, ఆ లేపనాన్ని గాయానికి పట్టించడం ఇప్పటి మన ఫస్ట్ ఎయిడ్ చికత్సలాంటిది. చందనం పీటలు గ్రామ సంతల్లో బాగా అమ్ముడు పోయే గృహ చికిత్స పరికరాలలో ఒకటి.
చందనానికి పవిత్ర గుణం కూడా ఆపాదించడం చేత దేవుడి విగ్రహాలకు చందనం పూతలు ఒక ధార్మిక కార్యక్రమం దేశమంతటా సాగుతుంటాయి. చందన చర్చితం అంటే చందనాన్ని మెత్తని పేస్టులా వంటికి మొత్తం పట్టించడం. వాస్తవానికి మనుషులూ వంటి నిండా చందనం పట్టించుకుని కొన్ని గంటల పాటు ఆరనిస్తే వంట్లో ఉన్న వేడిమి మొత్తం దిగలాగేస్తుంది. కానీ అత్యంత ఖరీదైన చందనం మామూలు మనిషి వంటి నిండుగా ఎట్లా పట్టించుకోగలదు?
గతంలో మహారాజులకు ఆ విధమైన చికిత్సలు జరుగుతుండేవి. ఇక కావ్యాలు రాసే కవులకయితే కదిలితే మెదిలితే విరహ తాపంతో అల్లాడే నాయికల వంటికి సఖుల చేత చందనం పట్టించడమే ముందు గుర్తుకు వచ్చే గొప్ప శృంగార చర్య. ప్రబంధాల నిండా చందనం వంటి సుగంధ భరిత శృంగార పద్యాలే. వాటి ప్రస్తావన మరో సందర్భంలో చేసుకుందాం.
వంటి నిండా పట్టించక పోయినా శరీరంలో ఏ కొద్ది భాగానికి చందనం అలదితే దాని ప్రభావం శరీరం మొత్తానికి పాకి అవయవాలకు తొందరగా స్వాస్థ్యత చేకూరుతుందని ఆయుర్వేదం చెపుతుంది. ఆ విధంగానే బొటన వేలంతైనా ఉందో లేదో, అసలు ఎక్కడుందో కూడా ఉనికి తెలీని మనసు (ఆధ్యాత్మిక వాదుల పరిభాషలో ఇది అంతరాత్మ) ఆరడుగుల శరీరం మొత్తాన్ని ప్రభావితం చేయడం ప్రకృతి విచిత్రం కదూ! ఒక కాలు విరిస్తే పట్టుదల గల మొనగాడు మరో కాలు మీద నడవగలడు. ఒక చెయ్యి విరిగినా రెండో చేతితో పనులు అద్భుతంగా చేసేవారు కద్దు. అసలు చేతులే లేకపోయినా కాళ్లతో చేతులకు మించి చక్కగా పనులు చక్కబెట్టే పట్టువదలని విక్రమార్కులు మనకు అరుదుగానే అయినా కనిపిస్తారు.
శిక్షల కింద కారాగారాలలో పడవేసినా బైటికి వచ్చిన తరువాత సలక్షణంగా తమ ధ్యేయం వైపుకు సాగిపోయిన యోదులకు చరిత్రలో కొదవలేదు కదా!. మనిషిని అచేతనుడిని చేసేందుకు, చైతన్యవంతుడిగా మార్చేందుకైనా మనసు మీద ప్రయోగాలు చేసే వైద్యవిధానాలూ ఉండనే ఉండె! వ్యక్తిగత సుముఖత, విముఖతలు రెండింటికీ మనసు మీద జరిగే ప్రయోగాలు రాటుదేలిన రాజకీయాలలో 'మైండ్ గేమ్' పేరుతో విశ్వవ్యాప్తంగా పరమ ప్రసిద్ధం. ఎక్కడుందో తెలియని ఓటర్ల మైండ్ తో నేతలు గేమ్స్ ఆడటానికి కారణం ఇదిగో ఈ మైండ్ కు ఉండే ఈ ప్రత్యేక శక్తే! శత్రువర్గంలోని బంధుమిత్రులను వధించవలసిన సందర్భం ఎదుట పడేసరికి అంత మహాయోధుడు అయివుండీ పాండవ మధ్యముడు డీలా పడిపోయాడు. ఆ గాండీవుణ్ని మళ్లీ గాడిలో పెట్టడానికి పరమాత్ముడు శ్రీకృష్ణుడి బాడీ ద్వారా కేంద్రీకృతం చేసింది అర్జునుడి మనసు మీదనే అని ఆధ్యాత్మికవాదుల ప్రగాఢ విశ్వాసం. పాండవుల మీద పగ తీర్చుకునేందుకై ఎంతో పట్టుదలగా ఎన్నో విద్యలు నేర్చుకున్న కర్ణుణ్ణి సరిగ్గా యుద్ధక్షేత్రంలో నడిమధ్యలో నిర్వీర్యుదుగా మార్చిందీ అతగాడి రథంలాగే గుర్రాల పగ్గం పట్టుకుని ముందు కూర్చున్న శల్యుడి పుల్లవిరుపుడు మాటలే! రాజకీయాలలో రాటుతేలిన నేతల ధ్యాస కూడా ఎప్పుడూ పాడుచేయవలసిన ఎదుటి వాడి మనసు మీదనే!ఉంటుంది. ఆ వ్యతిరేకార్ధంలో కాకుండా సానుకూల భావంతో చూసుకుంటే చుక్కంత చందనం నుదుటికి దిద్ది శరీరం మొత్తన్ని ప్రభావితం చేసే విధానానికి నకలే ఈ మైండ్ గేమ్ ఎత్తుగడలన్నీఅనిపిస్తాయి కాదా ! గీతలో చెప్పినట్లుగా అంగుష్ఠ ప్రమాణంలో ఉండే ఆత్మ (లౌకికుల భాషలో మనసు)ను ప్రభావితం చేయడం ద్వారా మనిషి మొత్తాన్ని స్వాధీనంలోకి తెచ్చుకునే పద్ధతినే కావ్యపరిభాషలో 'చందన న్యాయం' గా చెప్పుకొచ్చారు అలంకారికులు.
సూక్ష్మ పరిణామంలో ఉండే వస్తువు మీద ప్రయోగాలు చేయడం ద్వారా స్థూల పరిణామంలో ఉండే వస్తువు మొత్తాన్ని ప్రభావితం చేసే విధానానికి 'చందన న్యాయం' అన్న పదం అందుకే వంద శాతం సరయిన అన్వయం.
-కర్లపాలెం హనుమంతరావు
27 -02 -2021
బోథెల్, యూఎస్

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...