మా నేత మారాడ్రా!
నమ్మచ్చా!
నిజవైఁ న
పరివర్తనకు ఇరవైనాలుగ్గంటలే ఎక్కువ
మరి..
పూటగడవక ముందే నిండు సభలో ఈ గజడదబలు.. ?
అర్థం కాలా!
గ- అంటే
గలభా. జ- అంటే జగడం. డ- అంటే డబ్బా కొట్టింగ్. ద- అంటే దబదబా బల్లల చరుపులు. ఇహ ‘బ’
అంటే..
బడబడా
వాగడమేగా! నీలాగా.. ఇలాగా! తెలీకడుగుతా!
మేం మారడం అంత అబ్బురమా.. అపురూపమా? ఒపీనియన్ అంటే వంటి మీది బనియన్ వంటిదే గదరా శుంఠా!
అమావాస్యకో పౌర్ణానికో ఓ సారన్నా అది మారకపొతే బాడీ కుళ్లు కంపు కొట్టదా? ఊసరవెళ్ళి సృష్టి రహస్యమేంటంటావ్? మా పాలిటిక్సోళ్లకు పాఠాలు నేర్పే పంతులు.! క్షణానికో రంగది మార్చేదే రాజకీయాలోళ్లని
చూసి నేర్చుకోమని. అయినా మార్పూ మంచిదే.. చంద్రుడి మీది మరకలాగా!
ఆ మారేదేదో
అసతోమా సత్ గమయా.. మోడల్లో ఉండాలి భయ్యా!
వెల్తుర్నుంచి మరింత అంధకారంలోకి తోసే మార్పూ మార్పేనా? గతంలో రష్యా మారింది జార్ చక్రవర్తుల
నియంతృత్వ పెత్తనం నుంచి. చైనా మారింది పీడించే రాజుల చీనా నుంచి ప్రజల చీనాగా!
నిన్న గాక మొన్న నేపాల్ మారింది! మెడ్రాస్ చెన్నైగా, బొంబాయ్
ముంబాయ్ గా.. ఇట్లా ఎన్ని మారడంలా?
'ఛేంజ్' స్లోగన్ ఒబామాను ఏ రేంజ్ కు ఎగరేసిందో అది చెప్పూ!
ఓ బాబు మాడు
మొహం మీద చిర్నవ్వు పులుముకుంటే, మరో సాబు
మార్పనే ముక్క పట్టుకుని పార్టీ పెట్టుంటే .. ఏంటంట బెనిఫిట్ ప్రజానీకానికి? ఇప్పుడదే ‘మార్పు’ వంక పెట్టుకునేసి గోడలు దూకేస్తున్నారు బడా బడా
ప్రజాప్రతినిధులు చెడామడా! జనం నమ్మి ఓటిచ్చి చట్టసభకు పమ్మించిన రంగుల్ను కూడా
మార్చేసుకుని! హుఁ..
నీ కుళ్ళేడుపులకేంలే!
ఈ పుల్లిరిపు మాటలు లోకాన్నే మాత్రం మార్చకుండా అపలేవబ్బీ! రూపాయిక్కిలో బియ్యం
దొరుకుతుందిప్పుడు. అయినా దెప్పుళ్లే!ఆ మార్పు కనిపించదు నీకు!
కందిపప్పూ
రోజుకో రకంగా మారుతోందిగా. మరి దాం సంగతో? 'సత్యాలు' మారిపోతున్నాయ్. నిందితులే అప్రూవర్లుగా మారిపోతున్నారు.
ఆసుపత్రుల్లో బిడ్డల మార్పేమన్నా ఆగుతుందా? కిడ్నీల దొంగ మార్పిడో? ఇప్పుడదే ఓ పేద్ధ కార్పొరేటెడ్ వ్యాపారం! మీ పెద్దాయన చెప్పాడని
పెద్ద పెద్ద అధికారులే మారిపోతున్నార్..
కూల్.. కూల్!
నీ ఎనుగు జ్ఞాపక శక్తి కూలా! ఎప్పటి మార్పుల్నో మనసులో పెట్టుకుని మమ్మల్నిప్పుడు దులపరించడవాఁ? మా హయాం మార్పుల్ని గూర్చి కొద్దిగా
మెచ్చుకోలు మాటలైనా ఊడిపడవు కాబోలు! కొత్త నోట్లను తెచ్చాం పాత నోట్ల చోట్లో.
ఆయోగ్ సంస్థల్లాంటివి కొత్తవి కట్టుకుపోయేటన్ని నెత్తికి తెచ్చిపెట్టాం..! బ్యాంకుల్లో
మార్పులు.. చట్టాల్లో మార్పులు.. అసలు చట్టాలు చెయ్యడంలోనే మౌలికంగా మార్పులు!
మనసుండి చావాలే గానీ మేం తెచ్చిన మార్పులు
మూల మూలలా కనిపిస్తానే ఉంటాయ్!
ఎందుక్కనిపించడం
లేదన్నా! నోట్లు రద్దయినా దొంగనోట్లు
మారుతూనే ఉన్నాయించక్కా ఇప్పటికీనూ! ధరలు రోజుకో రకంగా మారే కథిహ సరే సరేనూ!
ఓటర్ల జాబితాలో పేర్లు అదేంటో తమాషాగా తెల్లారేసరికల్లా మారుతూనే ఉంటయ్! ఇసుక
బంగారంగా మారుతున్న కతలు ఇహ విసుగూ విరామం లేకుండా నడుస్తూనే ఉండె!
పుటం
పెట్టినా నీ వెటకారపు ధోరణి మారదురా బాబో! నీ కోసం కాకపోయినా జనాల్ని మా వేపుకు
మార్చుకునేందుకు చెబుతున్నా! మార్పనేదే లేకపోతే మనిషింకా నీకు మల్లేనే కోతిలా
గెంతుతూనే ఉండేవాడిప్పడికీ. బోయ వాల్మీకిగా మారకపోయుంటే మనకు రామాయణమనే
ఉద్గ్రంధం రాజకీయాలు చేసుకునేందుకు
దొరికేదేనా! విభీషణు రాములోరి పక్షం మారడమే రావణాసురుడి అంతానికి అసలు కారణం.
మారడం చేతరాకే హరిశ్చంద్రుడు కూడా మీ బాబోరికి మల్లే అష్టకష్టాలు పడింది.. పెట్టింది.
మాట మాటకూ
మాట మార్చే రావుల సంగచ్చెప్పూ! మేం
మెదలకుండా ఊరుకునుంటే.. ఇహ సాధువేషంలో దూరబట్టే
రావణాసురుడికా సీతమ్మ తల్లి సులువుగా దొరికిందని బుకాయించను కూడా బుకయిస్తావ్!
అర్థిక మాంద్యం వల్ల జనాలు ఉద్యోగాలు మారుతున్నారు. ఆ సంగతి మరి మిరు నోరెత్తి బైటకు
చెప్పరు. మైకేల్ జాక్సన్లు వంటి రంగు
మర్చుకుంటేనో, వాస్తు ప్రకారం వంటింటి ఫ్లాట్
ఫాం దిశ మార్చుకుంటేనో సామాన్య జనానికి వరిగి వళ్లో పడేదేముందంట? నీ వీలును బట్టి సెక్సు మార్చుకోడానికి, పాత్రను బట్టి
బాడీ షేపు మార్చడానికీనా రాజకీయాలలోకే రావడం! వందేమాతరం వరస మారిందనో, అమెరికా రిటనోడి యాస మారిందనో వంక బెట్టి నీ సొంత లాభం కోసం మారడమే
ప్రజాప్రతినిధిగా జనానికి నువ్వు చేసే అతిపెద్ద ద్రోహం.
నీ ముసుగులో
గుద్దులాట చూస్తుంటే ముద్దేస్తుందబ్బీ! మా నేత దినదినం గొప్పవాడిగా మార్పు చెందడం
చూళ్లేకే ఈ కుళ్లు ఏడుపులన్నీ.. ‘మార్పు’ను అడ్డమేసుకుని'
'నీ గొప్ప నీ దగ్గరే ఉంచుకోఅన్నాయ్.. నాకు నో అబ్జెక్షన్. సముద్రం
గొప్పదైతే ఎవరికిరా గ్రేట్? నీళ్లు ఉప్పన. గడ్డిపోచనైనా తనలో
నిలకడగా ఉండనీయదు. జీవంతో లోపలికి లాగేసుకోడం.. నిర్జీవంగా ఒడ్డుకు విసిరేసేఎయ్యడం. గుక్కెడు తాగే మంచితీర్థ మిచ్చే బావి కోసమే జనమెప్పుడైనా
అలమటించేది. 'జనంతో మంచి సంబంధాలుంటే నడకలో, నడతలో వినయం .. విని సవరించుకొనే మంచి గుణం, మాటల్లో
మార్దవం ఉంటాయి' అని
ఉపన్యాసాలు దంచాడుగా మరి మన అధినేత!.. మరిప్పుడు..
నిన్నింకా మా
పార్టీ వేపుకు మార్చుకునే ట్రయల్స్ శుద్ధ వేస్ట్. నువ్వు మారవురా బాబో! మన టీ.వీ
సీరియల్స్, సినిమా కతలు, రోడ్ల బాపతే..
‘జనం తలరాత’
అని మాత్రం అని అనవు కదా! మరి మారంది మీరా.. మేమా? హ్హా.. హ్హా..హ్హా!
-కర్లపాలెం
హనుమంతరావు
(ఈనాడు దినపత్రిక
సంపాదకీయ పుట 01 -08 -2009 - 'మారేవి..
మారనివి' శీర్షిక పేరుతో ప్రచురితం)
No comments:
Post a Comment