వివరణ: ఈ శతకము విద్యార్థులకు తెలుగు పదాలకు కల
నానార్థాలను వివరించే విధంగా సులభమైన భాషలో రచించబడింది. ఎంతో ఉపయుక్తమైన శతకము.
శ్రీ గిరిజాప్రియనాధా
రాగక్రోధాది దోషరహితచరిత్రా
యోగీశ వినుత చరణా!
భోగివలయ రొంపిచర్ల పురవరనిలయా!
వ. అవధరింపుము
తే.గీ. తెనుగుగీర్వాణపదములు దెలియునటుల
నరసిసమకూర్చిచెప్పితి నార్యులలర
సిరులొసంగెడి నానార్ధ శివశతకము
దీని భవదంకితమొనర్తు దేవదేవా!
1. కం. శ్రీయనలక్ష్మియు, గీర్తియు
శ్రీయన వృద్ధియును, బుద్ధి
సిరి, శారదయున్
శ్రీయన విష ముపకరణము
శ్రీయన నొకరాగమండ్రు శ్రీపతివంద్యా!
2. కం. అంకమన గుఱుతు, జోతును
అంకముయొడి, తప్పు, యుద్ధ
మాక్షేపంబున్
అంకమన జెంతకర్ధము
అంకముయంకెయును, దొడవు నహిరాట్భూషా!
3. కం. అంగదయన నుత్సాహము
అంగ దుపద్రవము, గినుక నాకలియునగున్
అంగదయన దుఃఖంబగు
అంగదయన గష్టమగును నంబరకేశా!
4. కం. ఆత్మయన బుద్ధి, యత్నము
ఆత్మ శరీరంబు, జీవు డతులితధైర్యం
బాత్మ యనంగను బ్రహ్మము
ఆత్మయనం మనసు, బన్నగాధిపహారా!
5. ఇమ్మనుకూలము, యుక్తము
ఇమ్ము యుపాయంబు, విరివి యింపును,
జోటున్
ఇమ్మమ నోజ్ఞము, సుఖమును
ఇమ్మనగా స్పష్టమగు, మహీధరచాపా!
6. కం. ఇరయన జలమును, గల్లును
ఇరయన మేరయును, మాట పృథివియు మఱియున్
ఇరువుయన బ్రక్కయిల్లగు
ఇరువనస్థానంబు, బ్రక్క యిభదైత్యహరా!
7. కం. ఉత్థానమనగ లేచుట
ఉత్థానము సంతసంబు యుద్ధము, సేనౌ
ఉత్థానమనగ ముంగిలి
ఉత్థానంబన సమాప్తి యురగాభరణా
8. కం. ఊర్మియన నొప్పి, వెల్లువ
ఊర్మి వెలుగు వ్యసనమగును నుమ్మియు, నలయున్
ఊర్మి షడూర్ములకర్ధము
ఊర్మి పరంపరయునగును యోగీంద్రనుతా!
9. కం. ఎగ్గన దోషముకర్ధము
ఎగ్గన నపకారమగును నెగ్గన గీడున్
ఎగ్గు ననారదమునునగు
ఎగ్గుయనం దూషణంబు నిందువతంసా!
10. కం. ఒఱపన సౌందర్యంబగు
ఒఱపుయుపాయంబు, దృఢము యోగ్యతయునగున్
ఒఱపు ప్రతాపంబు, తాపము
ఒఱపనగా స్థైర్యమగును నుగ్రాక్షశివా!
11. కం. ఓజయనవిధము, నాజ్ఞయు
ఓజ యుపాధ్యాయుడగును నుత్సాహమగున్
ఓజ క్రమమును, భయమును
ఓజయనంగ స్వభావ ముగ్రకపర్ధీ!
12. కం. కంకుడన గపటబాపడు
కంకుడు కఠినాత్ముడైన కాలుండునగున్
కంకుడన ధర్మరాజగు
కంకుడనం బోయవాడు కాయజదమనా!
13. కం. కందువ యన నేకాంతము
కందువ సంకేతభూమి జాడయు, ఋతువున్
కందువ సామర్ధ్యంబును
కందువయన దెగయు, జోటు కంఠేకాలా!
14. కం. కటమన నృనుగు చెక్కిలి
కటమన నతిశయము, చాప కటమనబీన్గున్
కటము ప్రతిజ్ఞయు, మొలయగు
కటమనగా నొలికిమిట్ట కంకాళధరా!
15. కం. కరణమన వ్రాతకాడగు
కరణము కొరముట్టు, మేను కారణమునగున్
కరణంబన రతిబంధము
కరణంబన బూత, పనియు గౌరీరమణా!
16. కం. కరమన నత్యంతంబగు
కరమన వడగల్లు నగును గరమన జేయిన్
కరమన గిరణము, గప్పము
కరమనగా దొండమగును గామారాతీ!
17. కం. కఱియన నలుపుకునర్ధము
కఱియన పశుయోనియగును కరియననేన్గున్
కరియన సాక్షి, కోతియు
కరిమేర, నిదర్శనంబు గామాథ్వంసీ!
18. కం. కర్కమన నెండ్రకాయయు
కర్కము సుందరము, గుండ కర్కమునిప్పున్
కర్కము తెల్లనిగుఱ్ఱము
కర్కంబన నద్దమగును గందర్పహరా!
19. కం. కాలికయన బార్వతియును
కాలిక ద్రౌపదియు, నాడుకాకియు, గల్లున్
కాలికయన నెలవడ్డియు
కాలిక నూగారు, తమము గఱకంఠశివా!
20. ఖంబన స్వర్గమభావము
ఖంబన నింద్రియము, దెలివి ఘనపట్టణమున్
ఖంబన నాకాశంబును
ఖంబన వరిమడియు, సుఖము ఖంజనిభగళా!
21. కం. గురువన దండ్రి, బృహస్పతి
గురువుయుపాధ్యాయుడన్న కులపెద్దయగున్
గురువన తాతయు, మామయు
గురువనగా రాజునగును గుధరజనాధా!
22. కం. గోవన నావును, బాణము
గోవనవజ్రాయుధంబు క్షోణియు, నెద్దున్
గోవనగ శశియు, స్వర్గము
గోవనగిరణంబు, దిక్కు గుసుమశరారీ
23. కం. గోపతియన నాబోతగు
గోపతియన సూర్యుడౌను క్షోణీధవుడౌ
గోపతియన దేవేంద్రుడు
గోపతియన శంకరుండు గోవాహశివా!
24. కం. ఘనమన బెరుగును, సమ్మెట
ఘనమనగాదిటవు, విరివి ఘనమనమబ్బున్
ఘనమన తాళపు వాద్యము
కనకాచలచాప! చంద్రఖండకలాపా!
25. కం. ఘనరసము జలముకర్ధము
ఘనరసమన మజ్జిగగును గర్పూరంబున్
ఘనరసము చెట్టుబంకగు
ఘనరసమన గుళిగయగును గౌరీలోలా!
26. కం. చక్రము కుమ్మరి సారెయు
చక్రము విష్ణాయుధంబు సైన్యము, గుంపున్
చక్రము రాష్ట్రము, జక్కవ
చక్రంబన బండికల్లు చంద్రాపీడా!
27. కం. చక్రియన విష్ణుకర్ధము
చక్రియనం రాజునగును జక్కవకలరున్
చక్రియనంగను గుమ్మరి
చక్రియనం సర్పమగును జంద్రార్ధధర
28. కం. చరణమన తినుటకర్ధము
చరణము నడవడిక, కులము చరణము వేరున్
చరణమనంగను తిరుగుట
చరణముపాదమును, తరుణ చంద్రాభరణా!
29. కం. చాయయన నీడ, కాంతియు
చాయయనంరంగు, సూర్యసతియున్ వరుసన్
చాయయన లవము, శోభయు
చాయయనంలంచమగును జండీనాథా!
30. కం. కల్లియన గొప్పువలయగు
జల్లియనం చామరంబు సవరము, గుచ్చున్
జల్లియనంగను జాలరు
జల్లియ సత్యంబునగును జగదాధారా!
31. కం. డంబన, గపటము, గాంతియు,
డంబన గర్వంబు, విధము డంబంబునగున్
డంబుప్రతిష్ఠకు నర్ధము
డంబనగానధికమగు షడాననజనకా!
32. కం. తంత్రమన శబ్దశాస్త్రము
తణ్త్రము మగ్గమును, నౌషధంబును,
సేనౌ
తంత్రము హేతు వుపాయము
తంత్రము నిజరాష్ట్రచింత తరుణేందుధరా!
33. కం. తఱియన సమయము కర్ధము
తఱియన జేరువయు నగును తరియనమబ్బున్
తరియోడ, పొగయు, మథనము
తరియన మాగాని యగును దర్పకవైరీ!
34. కం. తలయన శిరమును నెత్తును
తలయన వెండ్రుకలు, గొనయు తలమొత్తంబున్
తల యెడ, సమయము, బూనిక
తలయన బక్షమును జోటి ధరరాట్చాపా!
35. కం. తీర్ధమన బుణ్యనదియగు
తీర్ధము యజ్ఞంబు, గురువు దీర్ధము రేవున్
తీర్ధము శాస్త్ర ముపాయము,
తీర్ధము పాత్రంబు, మంత్రి
త్రిదశారినుతా!
36. కం. తెగయన నిశ్శేషంబగు
తెగ విధము, సమూహమగును తెగ నిడుపునగున్
తెగ యల్లెత్రాడు, పక్షము
తెగయన మోపెట్టుటగును ద్రిపురపురారీ!
37. కం. తోయంబన బరివారము
తోయం బొకతడవ, విధము దోయము తెగయున్
తోయము జలమున కర్ధము
తోయంబన సమయమగును ధూర్జటిసాంబా!
38. కం. దండమన నమస్కారము
దండము నృపశిక్ష, హయము దండును జతయున్
దండము బారయు, కవ్వము
దండము కప్పంబు, గుంపు దర్పకమదనా!
39. కం. దండమన దుడ్డుకఱ్ఱగు
దండమ నంచెట్టుబోదె దండము వధమున్
దండము కాడయు, గర్వము
దండమనం బీడనంబు దాక్షిణ్యనిధీ!
40. కం. దండియ కిన్నెర కర్ధము
దండియ వీణెయునునగును దంబుఱయునగున్
దండియ పల్లకిబొంగగు
దండియ యన ద్రాసుకోల దండధరారీ
41. కం. దర్శనమన నద్దంబగు
దర్శన మన బుద్ధి, తెలివి ధర్మము, కలయున్
దర్శనము చూపు, నేత్రము
దర్శనమన శాస్త్రమగు సుధాకరమకుటా!
42. కం. ద్రవ్యము మంచిపదార్ధము
ద్రవ్యము నిత్తడియు, భూతధనమున్,
మందున్
ద్రవ్యమన లక్కకర్ధము
ద్రవ్యంబన భవ్యమగును దైత్యారిసఖా!
43. కం. ద్విజుడనగ భూసురుండగు
ద్విజు డనగా వైశ్యుడగును ద్విజుడనరాజున్
ద్విజరాజు యనగ గరుడుడు
ద్విజరాజన శశియు, ఫణియు ద్విజరాట్భూషా!
44. కం. ధర్మమన నుపనిషత్తును
ధర్మము యజ్ఞం బహింస దానంబునగున్
ధర్మము క్రమ మాచారము
ధర్మము వేదోక్త విధియు ధనదసుమిత్రా!
45. కం. ధామమన వెలుగు కర్ధము
ధామము చోటును, గృహంబు ధామము కాంతిన్
ధామము మేను, ప్రభావము
ధామంబన పుట్టువగును ధవళాంగ శివా!
46. కం. ధేనుకయన నాడేనుగు
ధేనుక పార్వతియు, గత్తి ధేనువుయు నగున్
ధేనుకయన నాడ్గుఱ్ఱము
ధేనుక మన చీరపోతు ద్విప చర్మధరా!
47. కం. నభమన వర్షాకాలము
నభమనగా తమ్మపడిగ నాసిక మిన్నున్
నభమన దామర తూడగు
నభమనగా మేఘమగును నగరాట్చాపా!
48. కం. నయమన లాభము చౌకయు
నయమన సౌందర్యమగును నయమన నీతిన్
నయము మృదుత్వము నునుపును
నయమన జూదంబు మేలు నాగాభరణా
49. కం. నాగమన సత్తు తగరము
నాగంబన బాము, గొండ నాగము గ్రహమున్
నాగంబొక నుపవాయువు
నాగముకరి, మబ్బునగును నగభేదిసుతా!
50. కం. నారాయణ యన విష్ణువు
నారాయణ రవియు, శశియు నగజాధిపుడున్
నారాయణ యన బ్రహ్మయు
నారాయణ యనగ నగ్ని నగజాధీశా!
51. కం. నిష్కమన మాడ, తంకము
నిష్కము పతకమును, ఫలము నిష్కము వెండిన్
నిష్కమనంగ సువర్ణము
నిష్కుటమన తలుపు, తోట నీలగ్రీవా!
52. కం. పటలమన నింతికప్పగు
పటలము తిలకంబు, గ్రంధ భాగంబు నగున్
పటలమన గుంపు కర్ధము
పటలము పరివార మగును భావజవైరీ!
53. కం. పట్టుయన బ్రయత్నించుట
పట్టన నక్కఱయు, బూత బంధుత్వంబున్
పట్టన విషయము, హేతువు
పట్టనగా బట్టుదలయు బన్నగభూషా!
54. కం. పట్టు నివాసస్థానము
పట్టవకాశంబు, నూత పంతంబు నగున్
పట్టన ధైర్యము, వెడలుపు
పట్టనగా ఘట్టమగును బాపవిదూరా!
55. కం. పణమన వ్యవహారంబగు
పణమన జూదంబు, ధనము పందెంబు నగున్
పణమన వెలయును, గూలియు
పణమనగ గవ్వయెత్తు ఫణిరాట్భూషా!
56. కం. ప్రణయము ప్రేమము కర్ధము
ప్రణయంబన వినయమగును బరిచయమునగున్
ప్రణయము విశ్వాసంబగు
ప్రణయంబన బ్రార్ధనంబు రజితగిరీశా!
57. కం. ప్రత్యయ మన విశ్వాసము
ప్రత్యయ మవకాశ మగును బ్రఖ్యాతియగున్
ప్రత్యయ మన నాచారము
ప్రత్యయ మన శపథమగును రాజాభరణా!
58. కం. పత్రమన నాకు కర్ధము
పత్రము చురకత్తి యగును వాహనమునగున్
పత్రము దస్తావేజగు
పత్రంబన ఱెక్క, శరము బార్వతినాధా!
59. కం. పత్రియన కగొండర్ధము
పత్రియనం రధికుడగును బాణంబునగున్
పత్రియన బక్షి, డేగయు
పత్రియనం మ్రానునగును బ్రమధగణేశా!
60. కం. పదమన శబ్దము వాక్యము
పదము ప్రయత్నంబు, బద్యపాదంబునగున్
పదమన చిహ్నము, నిరువును
పదమన గిరణంబు మఱియు పాదంబభవా!
61. కం. పదనుయన తడికి నర్ధము
పదననగా సమయమౌను పరిపాకంబౌ
పదనన వాడికి నొప్పును
పదడుయనం భస్మగును బర్వతధన్వీ!
62. కం. ప్రభయన ధనదుని పురమగు
ప్రభయన భాస్కరుని భార్య, పార్వతియునగున్
ప్రభయన వెలుగుకు నర్ధము
ప్రభయనగా దశయు నగును రాకేందుధరా!
63. కం. పరికర మన నుపకరణము
పరికరము సమూహమగును బరివారంబున్
పరికర మన మంచంబగు
పరికరము వివేకమగును బంచశరారీ!
64. కం. పరుఘ మన గడియమ్రానగు
పరిఘంబన కోటగవను, బాణంబునగున్
పరిఘము కుండయు, దెబ్బయు
పరిఘంబన నినుపగుదియ ప్రమధాధిపతీ!
65. కం. పరియనగను సైన్యంబగు
పరియన పంజ్తయును, గుంపు బర్యాయంబున్
పరివేష్టనముకు నర్ధము
కరిచర్మంబర త్రినేత్ర గౌరీమిత్రా!
66. పక్షమన ఱెక్క, బ్రక్కయు
పక్షము వారద్వయంబు బ్రభునేనుగయున్
పక్షమన శత్రు మిత్రులు
పక్షంబన బలమునగును భవణయహరణా!
67. కం పాదమున నడుగుకర్ధము
పాదము కిరణంబు, వేరు పాతికయునగున్
పాదమన పద్యపాదము
పాదంబన చిన్నగుట్ట భావజమదనా!
68. కం. పిండమన నన్నకబళము
పిండము గర్భంబు, జెండుబిందము, బలమున్
పిండంబినుము, శరీరము
పిండముగజ కుంభమగు, గుబేరసుమిత్రా!
69. కం. పెంపన నాధిక్యంబగు
పెంపన పాలన, సమృద్ధి, వృద్ధిక్షయమున్
పెంపు మహత్వము కర్ధము
పెంపనగా గౌరవంబు భీమకపర్ధీ!
70. కం. పొదియన భారముకర్ధము
పొదిమంగలియడపమగును పొదుగుయునునగున్
పొదియన నమ్ములపొదియౌ
పొదియనగా గుంపు, శేషభుజగవిభూషా!
71. కం. పొలమనగ పంతనేలయు
పొలము ప్రదేశంబు, నడవి పొలమనయూరున్
పొలమన జాడయు, విధమును
పొలమనగా గంచెయగును భుజగాభరణా!
72. కం. పోటన యుద్ధము కర్ధము
పోటు సముద్రోల్బణంబు బోటన బొడుపున్
పోటన శౌర్యంబును నగు
పోటనగా బాధయగును భూతేశహరా!
73. కం. ప్లవమనగ జువ్విచెట్టగు
ప్లవమనగా నీటికాకి ప్లవమనగప్పౌ
ప్లవమన కోతియు, గొఱ్ఱెయు
ప్లవమనగా తెప్పయగును బావకనేత్రా!
74. కం. ఫలమన నాగటి కఱ్ఱగు
ఫలము పయోగంబు, పంట, బాణాగ్రంబున్
ఫలమన బండును, లాభము
ఫలమనగా జాజికాయ ఫాలాక్షశివా!
75. కం. బభ్రువన కపిలగోవగు
బభ్రువనం విష్ణువగును బరమేశ్వరుడౌ
బభ్రువనంగను నగ్నియు
బభ్రువనం నాకుపచ్చ బాలేందుధరా!
76. కం. బరియన బార్శ్వము కర్ధము
బరిదొంగ దిగఁబరము బరిగోలయగున్
బరియనగ శత్రుండగు
బరిగీచిన గిఱియునగును భావజదమనా!
77. కం. బలమన నధికము కర్ధము
బలమన సైన్యంబు, రసము, బలుపునుదనరున్
బలమన రూపము గంధము
బలమనగ సత్తువగును భసితవిభూషా!
78. కం. బాసయన వ్రతముకర్ధము
బాస ప్రమాణంబునగును భాషయును నగున్
బాసన సంకేతంబగు
బాసయనంగను బ్రతిజ్ఞ పాపధ్వంసీ!
79. కం. బీజమన విత్తనంబు
బీజము వృషణమును, బలము, విత్తుటయునగున్
బీజమన గారణంబగు
బీజము రేతస్సునగును భీష్మకపర్ధీ!
80. కం. బ్రహ్మయన నలువ, విష్ణువు
బ్రహ్మయనంఋత్విజుండు బ్రాహ్మణుడుమఱిన్
బ్రహ్మంబన బరమాత్మగు
బ్రహ్మము వేదము, తపము భస్మవిదారీ!
81. కం. భగమన ధర్మము, వీర్యము
భగము మహాత్మ్యంబు, యోని,
వైరాగ్యంబున్
భగమైశ్వర్యము, నిచ్చౌ
ణగమన మోక్షంబు, గీర్తి, భైరవజనకా!
82. కం. భోగమన సుఖము, ధనమగు
భోగము పాలనము, బడగ, భోజనమునగున్
భోగియన రాజు, మంగలి
భోగియనం భుజగమౌను బుష్పశారారీ!
83. మదమన నేనుగు క్రొవ్వగు
మదమన సంతోషమగును, మదమన బొగరున్
మదమింద్రియమును, గర్వము
మదమన గస్తూరియగును మన్మధవైరీ!
84. కం. మధువన ౠతువు వసంతము
మధువనగా చైత్రమగును మఱితేనెయగున్
మధువన బాలును గల్లును
మధువనగా నీరు, జంద్రమఃఖండధరా!
85. కం. మండలియన సూర్యుండగు
మండలి శునకంబు, బాము, మార్జాలంబున్
మండలియనగను రాజగు
మండలియన గుంపునగును మనసిజదమనా!
86. కం. మందుడన దెలివిహీనుడు
మందుడనందిరుగుబోతు మఱియల్పుండున్
మందుడు వ్యాధిగ్రస్తుడు
మందుడు నిర్భాగ్యుడండ్రు మదనవిరోధి!
87. కం. మాతయన తల్లికర్ధము
మాతయనం లక్ష్మియగును మాతంగియగున్
మాతయనంగను నేలయు
మాతయనంగోవు, భూతిమండితకాయా!
88. మాధవి పశుసమృద్ధియు
మాధవి తేనెయును, కల్లు, మాదీఫలమున్
మాధవియన జెక్కెరయగు
మాధవియన లక్ష్మియగును మారధ్వంసీ
89. మినుకన బంగార్నాణెము
మినుకనగా తాలిబొట్టు మినుకనవాక్కున్
మినుకన గాంతియు, గిరణము
మినుకుల నం వేదమండ్రు మేరుశరాసా!
90. కం. మృగమన జంతువు కర్ధము
మృగమనగా నడవియేన్గు , మృగశిరయునగున్
మృగమన జింకయు, వేడుట
మృగమన్వేషణము, వేట మృత్యువినాశా!
91. కం. ముఖమనగా బంచపాకయు
ముఖము యుపాయంబు, మాట, మొగమున్, నోరున్
ముఖము ప్రయత్నము కర్ధము
ముఖమొక నాటకపుసంధి మునిజనవినుతా!
92. కం. మెఱవడియన నతిశయమును
మెఱవడి ధైర్యంబు నగును మెఱవణియునగున్
మెఱవడియన నుద్రేకము
మెఱవడి గౌరవము, నేర్పు మహికాంశుధరా!
93. కం. మేలన శుభ ముపకారము
మేలనబుణ్యంబు, వలపు, మేలన గొప్పౌ
మేలువిశేషము, లాభము
మేలనగా సుకృతమలరు మీనాంకహరా!
94. కం. యోగము ధాన్యము కర్ధము
యోగ ముపాయంబు, గూర్పు యోగము మందున్
యోగము ద్రవ్యము, గవచము
యోగమనంగను బ్రయత్న మురగవిభూషా!
95. కం. రచ్చయన న్రాజమార్గము
రచ్చన మందపము, సభయు రచ్చన గోష్టిన్
రచ్చయన గలకలంబగు
రచ్చయనంగ లహమగును రతిపతిదమనా!
96. కం. రసమన పాదరసంబును
రసమను రాగంబు, విషము, ద్రవము బసరున్
రసమన రుచియును, జలమును
రసమనగా వీర్యమగును రాగవిదూరా!
97. రహియన సంతోషంబగు
రహియన నాసక్తి, దెలివి, రక్తియునునగున్
రహియన బాగుకు నర్ధము
రహియనగా విధమునగును రాజవతంసా!
98. కం. రాజనగ రాజ రాజగు
రాజనగ యక్షుడగును రాజన ఱేడున్
రాజన దేవేంద్రుఁడగు
రాజనగా రాచవాడు రాజవిభూషా!
99. కం. రుచియన సూర్యుని కిరణము
రుచియనగా నిష్టమగును రుచియన జవియున్
రుచియన గాంతికి నర్ధము
రుచికడు చల్లని వెలుంగు రుసిజనవినుతా!
100. కం. లతయన నెక్కుడు తీగగు
లతయన శాఖయును, గఱిక లతచీమయగున్
లత సాలెపురుగు కర్ధము
లతయన గస్తూరియగు లలాటోగ్రాక్షా!
101. కం. వగయన సంతాపమగును
వగయా లోచనయు నగును వగ దుఃఖంబున్
వగయన విధము, విలాసము
వగయనగా గతియునగును వైశ్రవణసఖా!
102. కం. వనమన దోపు నరణ్యము
వనమన బరదేశమందు వాసము, గృహమున్
వనము సమూహము, జలమును
వనమన సెలయూతయగును వ్యాళవతంసా!
103. కం. వర్ణమన నక్షరంబగు
వర్ణము జాతియును, రంగు, బంగారంబున్
వర్ణము యశమున్, స్తుతియున్
వర్ణమనం గుణమునగును బర్వతశయనా!
104. కం. వలనుయన దిక్కు, పార్శ్వము
వలను యుపాయంబు, విధము వలను శకునమున్
వలను ప్రదక్షిణమును నగు
వలను శుచిత్వంబు, నేర్పు వాసవవినుతా!
105. కం. వశయన భార్యకు నర్ధము
వశయన నాడేనుగ గును వనితయును నగున్
వశయన గోవును, గూతురు
వశయనగాలోకువగును బ్రద్యుమ్నారీ!
106. కం. వసుయన ధనముకర్ధము
వసువన రత్నమును, నగ్ని, బంగారంబున్
వసువన పలుపును, గిరణము
వసువననొక రాజుయగును బ్రణవసురూపా!
107. కం వంశమన గులముకర్ధము
వంశము వెన్నెముకయగును వంశముగుంపున్
వంశము బిల్లంగ్రోవియు
వంశంబన వెదురునగును వ్యాళాభరణా!
108. వారమన కుబ్జవృక్షము
వారము సూర్యాది సప్త వాసరములగున్
వారము వాకిలి, గుంపును
వారమనం క్షణము, తడవ ప్రణతార్తిహరా!
109. వాసియన తారతమ్యము
వాసి స్వస్థంబు, బాగు, బరిమితియునగున్
వాసిప్రసి ధ్యాధిక్యము
వాసియనం లాభమగును వనజాక్షసఖా!
110. కం. వీడనవదలుట కర్ధము
వీడన వర్ధిల్లుటగును వీడనదండున్
వీడన శిభిరము, గట్నము
వీడన బట్టణము, గుంపు విశ్వాధిపతీ!
111. కం. వెంటయనవిధము, మార్గము
వెంటయనంగార్యమగును వేటయునునగున్
వెంటయన తోడనుండుట
వెంటయనంవిషయమగును విషమశరారీ!
112. కం. వ్యసనము నిష్ఫలయత్నము,
వ్యసనమనం గష్ఠమగును, బాపమునునగున్
వ్యసన మపాయ మసూయయు
వ్యసనంబనగానపేక్ష హాలాహలాంకా!
113. కం. శక్త్యుత్సాహమున కర్ధము
శక్తియనం జిల్లకోల, శర్వాణియగున్
శక్తి వసిష్ఠుని బుత్రుడు
శక్తి సహాయంబు, బలము శర్వాణీశా!
114. కం. శిఖయన గీరణముకర్ధము
శిఖయనగా నెమలిసిగయు, సిగయున్,
సెగయున్
శిఖయన శాఖయు, నూడయు
శిఖయనగా గొనయగును శ్రీవిశ్వేశా!
115. కం. శిఖియన నెమలియు, గోడియు
శిఖికేతుగ్రహము, నెద్దు, జెట్టును, నగ్గిన్
శిఖియన బాణముకర్ధము
శిఖిసిగ గలవాడునగును శ్రీకంఠశివా!
116. కం. శుచియన జ్యేష్ఠాషాఢము
శుచియనగా గ్రీష్మఋతువు శుచియనదెలుపున్
శుచి శృంగారరసంబును
శుచి పరిశుద్ధంబు, నగ్ని
శుభ్రాంశుధరా!
117. కం. శృంగమన కొండ కొమ్మగు
శృంగము ప్రాధాన్యమగును శృంగము గురుతున్
శృంగము కొమ్ముకునర్ధము
శృంగమనం దొరతనంబు శీతాంశుధరా!
118. కం. సంగడియన స్నేహంబగు
సంగడియన గుంపు, జతయు, సామీప్యంబున్
సంగడి పార్శ్వముకర్ధము
సంగడి వెనుకయును, విధము సర్వాభరణా!
119. కం. సంగర మంగీకారము
సంగరమాపదయు, విషము, సమరంబునగున్
సంగరమనగా బ్రతిజ్ఞయు
సంగరమన జమ్మిపండు సౌరీమిత్రా!
120. కం. సంజ్ఞయన రవితలోదరి
సంజ్ఞయనం దెలివియగును సైగయునునగున్
సంజ్ఞయనం గాయిత్రియు
సంజ్ఞయనం బేరు, శీతశైలజనాధా!
121. కం. సంతతియన గులమగు ధర
సంతతియన వరుసయగును సంతానమగున్
సంతతి పారంపర్యము
సంత్యతియన విరివియగును శైలనిశాంతా!
122. కం. సమయమన బుద్ధి, నాజ్ఞయు
సమయము కాలము, బ్రతిజ్ఞ, సంకేతంబున్
సమయము సిద్ధాంతంబగు
సమయంబన శపథమగును షణ్ముఖజనకా!
123. కం. సాధనమన నుపకరణము
సాధనము యుపాయమగును, సాధించుటగున్
సాధనము ధనము, గమనము
సాధనమన మరలబాటు సైన్యంబీశా!
124. కం. స్కంధమన చెట్టుబోదెయు
స్కంధము దేహంబు మఱియు సమరంబునగున్
స్కంధము మూపునకర్ధము
స్కంధంబన గుంపునగును గాళీనాధా!
125. కం. హంసుడన విష్ణుకర్ధము
హంసుడన సూర్యుడగును, నభవుండునగున్
హంసుడనంగను జీవుడు
హంసుడనం యోగ్యుడైన నధిపుడు సాంబా!
126. కం. హరియన రవిశశికిరణము
హరి సింహము, వజ్రి, కప్ప,
హయమున్, పామున్
హరియనగ గాలి, విష్ణువు
హరియనగా జిలుక, కోతి, యముడున్ భర్గా!
127. కం. క్షారమన నుప్పుకర్ధము
క్షారమనం బూడిదయును, గారమునునగున్
క్షారము యుమ్మెత్తయగును
క్షారమనం గాజుయగును గైలాసపతీ!
128. కం. ఈరమ్యశతక మిద్ధర
నారూఢిని మిగులజెంది హరిఖరకర భూ
తారకమై తారకమై
తారకమేగాతభక్త తతులకు నభవా
గద్యము.
ఇది శ్రీవేంకటేశ్వరవరప్రసాదలబ్ధకవితావిచిత్ర రా
మభక్త కంచర్లసూర్యనారాయణ కటాక్ష వీక్షా
పాత్రయాజ్ఞవల్క్యశాఖోత్తంస శాండిల్యసగోత్ర
పవిత్ర మాదిరాజు బుచ్చిరాజ పౌత్ర
సుబ్బమాంబా లక్ష్మీకాంత పుత్ర
సుజనవిధేయ రామకోటీశ్వర
శర్మనామధేయప్రణీతంబైన
నానార్ధశివశతకము
సంపూర్ణము.
నానార్ధశివ శతకము, మాదిరాజు రామకోటీశ్వర శాస్త్రి, శతకసాహిత్యం
-సేకరణః కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment