స్వామివారి పంచరత్నాలలో చివరగా వినిపించే శ్రీరాగంలోని 'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు' కృతి సంగీతం రానివారికీ, స్వరలోకంతో సంబంధం లేనివారి చెవులకు కూడా సోకకుండా ఉండని చరణం.
త్యాగయ్యగారి
గురువు శొంఠి వేంకట రమణయ్యపంతులుగారు. ఒకానొక సందర్భంలో గురువుగారికి ప్రతినిధిగా సంగీత సభలో పాల్గొనాల్సిన
పరిస్థితి స్వామివారి మీద పడిందంటారు. వయసులో
పిన్నవాడు అయిన కారణంగా త్యాగయ్య సంగీత సామర్థ్యం ప్రశ్నార్థకం అవడమే కాకుండా..
తనను సూచించిన గురువుగారి గౌరవం కాపాడవలసిన అదనపు బాధ్యతా ఆయన
భుజస్కంధాలపై పడిన పరిస్థితి. అయితే ఆ సందర్భానికి తగ్గట్లుగామే త్యాగయ్య ఈ విచిత్రమైన కృతిన కల్పించి పాడి విమర్శకుల
నోళ్లు మూయించినట్లు ఓ కథనం బహుళప్రచారంలో ఉంది.
'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు'అంటూ మొదలయ్యే ఈ కృతిలో 'చందురు వర్ణుని అందచందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించువారు..'
అనే అనుపల్లవి ఒకటి వినిపిస్తుంది. శ్రీరామచంద్రుని
అంద చందాలను వర్ణంచే ఈ కృతిలో 'చందురు వర్ణుడు' అనే విశేషణం చొరబడటమే విడ్డూరం అనిపిస్తుంది కదా సాధారణ శ్రోతలకు! రాముడు
నీలి మేఘ శ్యాముడు. నల్లటి మబ్బు రంగు ఆ మహానుభావుడి మేని ఛాయ . మరి రామచంద్రుని వర్ణానికి, చంద్రుని వర్ణానికి
సాపత్యమేంటి? పోలిక
ఎంత అపసవ్యంగా ఉంది అనిపిస్తుంది సహజంగానే! మిడి మిడి జ్ఞానులు ఈ రంధిలో పడి
కొట్టుకుంటుండగానే త్యాగయ్య తన గానచాతుర్యంలో నిజమైన శ్రోతలను మెప్పించేసి శభాష్
అనిపించుకొన్నాడని ఎక్కడో చదివిన గుర్తు. కాకపోతే శ్రీ నూకల
సత్యనారాయణగారు తన పుస్తకంలో దీనికి సంబంధించి చక్కని వివరణ ఇచ్చున్నారు కనక ఆ
విశేషం తెలియచేసి ముగిస్తా.
'వర్ణో ద్విజాది శుక్లాది యజ్ఞే గుణ కధాసు చ – వర్ణమంటే
బ్రాహ్మణుల్లాంటి కులాలు, తెలుపు లాంటి రంగులు, యజ్ఞం, గుణం-ఇన్ని అర్ధాలున్నాయి మరి. శ్రీ రామచంద్రుడు చంద్రుడికి మల్లే చల్లని చూపులతో ప్రకాశవంతంగా ఉంటాడు
కాబట్టి అట్లా పోల్చడంలో కించిత్తైనా అన్వయదోషం లేనే లేదు అని భాష్యం
చెప్పుకోవచ్చు. పురాణపురుషుడిగా తీర్చిదిద్దిన రుషి వాల్మీకి
కూడా రాముణ్ణి “సోమవత్ ప్రియదర్శనః” అని కీర్తించాడన్న విషయం
మరపుకొస్తేనే మరి ఈ తరహా చిన్ని చిన్ని సందేహాలు మనసుల్ని సతాయించేది. .
ఇహ ఇక్కడ
త్యాగరాజస్వామి గడుసుతనం ఏమిటంటే.. ఇట్లాంటి
పదప్రయోగం ఒకటి సభలోకి వదిలేస్తే సంగీత పండితుల్లో మధన మొదలవడం ఖాయం. అర్థ
విద్వాంసుల ధ్యాసను కొద్దిగా ఆ దిక్కుకు మళ్ళించేస్తే తాను తన విద్వత్ పరీక్షలో
గట్టెక్కడం సులువవుతుందన్నది ఆ సంగీత వైతాళికుడి గడసరితనం.
సాధారణంగా విద్వత్సభల్లో నెగ్గుకురావడం
తాడిచెట్టుకు ఎదురు దేకడమంత క్లిష్టం. మిడిమిడి జ్ఞానంతో అంతా తమకే తెలుసన్న అహంభావుకత అదికంగా ఉండే పండితులు
అన్ని కాలాల్లో అన్ని స్థలాల్లో తారసపడుతూనే ఉంటారు. ఎదుటి
మనిషిలోని తప్పులు ఎక్కడ దొరుకుతాయా.. ఎప్పుడు వాళ్ల
ప్రతిభను కించపరుద్దామా అని రంధ్రాలు వెతికే బాపతు అర్థజ్ఞానులను
బోల్తాకొట్టించడమే ధ్యేయంగా బహుశా త్యాగయ్యరాజస్వామి ఆనాటి పండిత సభలో ఆ పదప్రయోగ
చేసివుండచ్చు.
వివాదాన్ని
పెరగనిచ్చి చివర్లో సరైన సమాధానం ఇచ్చి ఈర్ష్యాపరుల నోళ్లు మూయించే గడసరితనాన్ని
తప్పుపట్టలేం. త్యాగరాజస్వా,మి 'చందురు వర్ణుని' పదప్రయోగం ఈ లక్ష్యంతోనే
సాగిందనుకోవాలి. పాండిత్యమే కాకుండా లౌక్యం
నేర్చుకున్నప్పుడే లోకంలో రాణింపుకొచ్చే మాట.
-సేకరణ
కర్లపాలెం
హనుమంతరావు
No comments:
Post a Comment