Showing posts with label Andhra Prabha. Show all posts
Showing posts with label Andhra Prabha. Show all posts

Thursday, December 23, 2021

కథ పగ రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్రప్రభ వారపత్రిక - 31 - 12 - 1977 సంచికలో ప్రచురితం )





 




కథ

పగ 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్రప్రభ వారపత్రిక - 31 - 12 - 1977 సంచికలో ప్రచురితం ) 


“ప్రపంచంలో ఇలా ఇంకెక్కడున్నా జరిగిందేమో నాకు తెలీదు. కాని, నా జీవితంలో మాత్రం జరిగిపోయింది....'


"ఎవరికైనా చెప్పుకుని భోరువ ఏడవాలనిపిస్తుంది. కానీ ఎవరికి చెప్పు కోను ! ఎలా చెప్పుకోను ! విన్న వాళ్ళెవరైనా  నా మొహాని ఉమ్మేస్తారే!...”


"నాకు పిచ్చెత్తి నా బావుణ్ణు . కానీ, పిచ్చెత్తదు. . ఈ బడబాగ్ని గుండెల్లో దాచుకుని ఇలా ఉండిపోవాల్సిందే,”


“దేవుణ్ణి నే వంత పిచ్చిగా ఎందుకు ప్రేమించాను: ఏమో!... నాకే తెలీడు. అతనిలో ఏదో చిత్రమైన ఆకర్షణ  ఉంది. దాని ప్రభావానికే మంత్రముగ్ధనై  ఆంతధైర్యంగా అందర్నీ విడిచి వచ్చి అతన్ని పెళ్ళాడింది...” 


"ఇప్పుడు నా కెవ్వరూ లేరు  అతను తప్ప...." 


"అతమా నాకు దూరమయితే!... ఓహ్! ఆ ఊహకే తన గుండె దడ దడలాడిపోతుందే!... బహుశా ఈ బలహీనతే తన జీవితం మీద ఇంత పెద్ద దెబ్బ తీసిందేమో!... 


' ఏమో!... అంతా ఆయిపోయింది... ఇప్పుడుకొని ప్రయోజన మేముంది!... నిప్పులాంటి ఈ తప్పును గుప్పెట్లో పెట్టుకుని  తిరగటం తప్ప.... 


“నిప్పు గుప్పెటను కాలుస్తుంది.


ఆ సంగతి తెలుసు. నిజం ఎప్పటికైనా బయటపడి తీరుతుంది. ఆ సంగతీ  తెలుసు... దేవుడి కెప్పుడో ఈ విష యం తెలిసే తీరుతుంది... అప్పుడు తనేం చేస్తాడు!.... 


ఏమయినా చేయనీ!  ఇప్పుడు మాత్రం తనీ విషయం  చెప్పదు .... చెప్పి చేజేతులా తన సంసారంలో  నిప్పులు కుమ్మరించుకోదు ... చూస్తూ చూస్తూ దేవుడి పొందును  తనెలాంటి పరిస్థితుల్లోనూ వదులుకో లేదు... 


అతని విూద తన కంత లాలప ఉండబట్టేనా ఇంత పెద్ద ఘోరాన్ని కిమ్మవకుండా తన గుండెల్లో దాచుకు తిరుగుతోంది! 


“దేవుడికి మాత్రం తన మీదంత  ప్రేమలేదూ! ఎంత ప్రేమ లేక పోతే కులం కూడా చూడకుండా అంతమంది  నెదిరించి నా మెళ్ళో తాళికడతాడు! అందుకేగా వాళ్ళందరికీ అతను  దూరమయింది! ఇప్పుడు అతనికి మాత్రం ఎవరున్నారు. . నేను  తప్ప..."


"నే నతనికి .. నాకతనూ!...”


" ఈ అలుసు చూసుకొనేనేమో  శేషు తన జీవితంలో ఇలా నిప్పులు కురి పించిందీ!....”


"ఏంత వద్దనుకున్నా అతను గుర్తుకొస్తూవే ఉన్నాడు....”


"వాడు గురుకొస్తే చాలు ఒళ్ళంతా కంపరమెత్తి పోతుంది... 


ఏమయితేనేమి... ఆ దుర్మార్గుడిపల్లే తన జీవితమిలా కళంకితమయిపోయింది.” 


ఏమాత్రం పసి గట్టినా ఎప్పుడో ఆ నాగుపాము  పడగ నీడ నుండి తప్పుకోనుండేది. 


ఇప్పుడంతా అయిపోయింది.. తన బ్రతుకు సర్వనాశనం అయిపోయింది...” 


" పూర్తిగా వాడిననీ ప్రయోజనం లేదేమో! తన తలరాతే అలా ఉందేమో!... కాకపోతే ఇదంతా ఏమిటి? 


 కమ్మగా తిని, తిరిగే దేవుడు మంచమెందుకెక్కాలి? ..... ఒక్క నెలరోజులు డ్యూటీకి హాజరు కాలేక పోయినందుకే  పగ బట్టినట్లు మేనేజ్ మెంట్  అతన్ని  ఎందుకు టెర్మినేట్ చేమాలి? అక్కడికీ  వ్యక్తిగతంగా ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోయిందే!... 


ఆరో గ్యం చెడిపోయి, ఉన్న ఆ ఒక్క చిన్న ఉద్యోగం ఊడిపోయే సరికి అతను బెంబేలు పడిపోయి  తననెందుకు అంతలా  కంగారు పెట్టాలి? అప్పటికీ తనెంతో ధైర్యం  చెప్పిందతనికి! '' వెధవ ఉద్యోగం! పోతేపోయింది. ముందారోగ్యం కుదుట పడనీయండి . . తరువాత చూసుకుందామని... " 


తను మాత్రం బింకం  కొద్ది అలాగ అంది కాని రోజు రోజుకీ క్షీణిస్తున్న అతని ఆరోగ్యాన్ని చూసి ఎంత కుమిలిపోయేది!... 


అక్కడికీ తను తన తండ్రికి  ఉత్తరం రాసింది.  నా కూతురెప్పుడో చచ్చిపాయిందని సమాధానం వ్రాసాడా పెద్దమనిషి! .... 


అత్తగారింటికి  స్వయంగా వెళ్ళి వచ్చింది . తనెవరాలా తెలిసే సరికి తెరిచిన తలుపులు  కూడా మూసుకున్నారు! 


 వంటిమీది  సొమ్ము  ఒక్కొక్కటే తాకట్టు కొట్టు కెళ్లిపోయింది   కూర్చుని తింటే అంటే కొండలైనా కరిగిపోవా! ... 


 ఉన్నవన్నీ హరించుకుపోతుంటే  బాధ పడలేదు.. విధి ఎంచుకిట్లా పగ పట్టినట్లు   తమ జీవితాలతో  చెలగాట మాడుతుందొ తెలీదు !  


ఉన్నట్లుండి ఆయన రక్షం కక్కుకుంటే ..బేజారెత్తిన తను డాక్టరు కోసం పరుగెత్తింది. అప్పపుడు  దొరికిన వాడొక్క శేషునే. 

ఆ స్థితిలో  తానేమీ ఆలోచించుకోలేక పోయింది . టెస్టులు చేయించి తరువాత చివరకు  క్షయ_గా తేలింది. 


శేషు రికమెండేషన్ మీదటనే  దేవుడు హాస్పిటల్లో జాయినవ్వడం .. కొన్ని రోజులు తరువాత డిశ్చార్జ్ అవడమూ సాధ్యమయాయి.  


ఆ తరువాత కూడా రోజూ వచ్చి దేవుణ్ణి చూసిపోయేవాడు శేషు. 


వైద్యం ఖర్చుల గురించి అడిగినప్పుడు " మీరు వాటిని గురించి ఆలోచిస్తూ వర్రీ అవకండి" అని నవ్వేవాడు. 


అంతా ఉదార బుద్ధి అనుకొనేది తాను  అప్పుడు. శేషు అంతగా మారిపోయినందుకు తనెంతో  సంషించింది కూడా. 


.. కానీ వాడు మార లేదనీ .. ఆ ఉదారమంతా వట్టి  బూటకమని..... కడుపులో  కుత్సితపు టాలోచనలు పెట్టు కునే ఈ సహాయం చేస్తున్నాడని  తెలుసుకోలేక పోయింది .... 


.. అన్నీ  తెలిపే వేళకి నిలువులోతు  రొంపిలో కూ రుకుపోయినట్లు తెలిసిపోయింది.    


నిస్సహాయంగా ఆ దుర్మార్గుడి వత్తిడికె బలైపోయింది . 


"ఆ దురదృష్టకరమైన రోజు తనకింకా  బాగా గుర్తే! ...”


"బయట భోరున  వర్షం. చలిగాలికి దేవుడికి తిరిగి దగ్గు ఆరంభమయింది . ఆ బాధచూడలేక కబురంపితే శేషు ప్రత్యక్షమయాడు.


ఇంజెక్షన్ ఇచ్చిన తరువాత మత్తుగా పడుకొన్నాడాయన .


"చలి గాలి తగలకూడదు . తలుపులేసి రమ్మన్నాడు శేషు.


వేసి వస్తుంటే హఠాత్తుగా  చేయి పట్టుకున్నాడు.... అసహ్యంతో తన ఒళ్ళంతా కంపించింది... ! కోపంగా చేయి విసిరికొట్టింది .


" నీ దేవదాసు నీకు  దక్కాలంటే నా కోరిక మన్నించాలి" అని చిన్నగా నవ్వాడతను . "నీ మొగుడిప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, నే నిప్పుడిచ్చిందిమామూలు మత్తు  ఇంజెక్షన్ కాదు . ఆ ప్రత్యేకమైన మందు ప్రభావంతో ఒక్క గంటదాకా ఆతనికిక్కడ జరిగేదీ తెలిసే అవకాశం లేదు.తరువాత ట్రీట్ మెంట్ సాగకపోతే మాత్రం ఇంజెక్షన్ ప్రభావంవల్ల మరింత బాధపడుతాడు.  ఇదే అతని చివరి రాత్రి అవుతుంది . నీకు భర్త కావాలో..  నీ శీలమే కావాలో తేల్చుకో."


"నువ్వేమనుకొన్నా ఫర్వాలేదు.. నువ్వీ రాత్రికి నాకు కావాలి. కాదంటావా! నా ఫీజు నాకు పారేయి.. వెళ్ళిపోతా.." 


" ఎక్కడ నుంచి  తేగలదంత  డబ్బు ఆక్షణంలో! ఇంకో గంటలో  స్పృహ  వచ్చి బాధతో ఈయన మెలికలు తిరిగిపోతూ మెల్ల మెల్లగా మృత్యు ముఖంలోకి జారి పోతుంటే నిస్సహాయంగా ఎలా ఊరుకోగలదు ! ఎక్కడికని పోగలదీ అర్ధరాత్రి? .... ఎవరినని  యాచించగలదు మాంగల్యం  కాపాడమని!...


" భగవాన్! ఏ ఆడదానికీ ఎదురవ్వ రాని  దౌర్భాగ్యపు పరీక్ష! ఇంత లోకంలో ఒంటరిగా ఒక ఆడది దిక్కులేక భర్త ప్రాణం కోసం తనను తాను అర్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు కల్పించావ్!.....


తాను నమ్మిన భూమే తన కాళ్ళకింద తొలుచుకుపోతుంటే, 


తానేదో అంతు లేని అగాథాలలోకి అణగివేయబడుతున్న  చప్పుళ్లు ! 


... ఆ చీకటిరాత్రి... చిన్న గదిలో ... భర్త ఎదుటే... మరో మగాడి కామానికి బలయిపోయిన ఆ దౌర్భాగ్యపు క్షణాలు తనా జీవితంలో మాయని మచ్చ! 

చచ్చిపోదామన్న పిచ్చి  కోరిక చాలా సార్లు కలిగింది.  కాని... దేవుడిని అల్లాంటి  స్థితిలో వదిలిపోలేని బలహీనత! ... బలవంతాన తననిలా   కట్టి పడేస్తుంది...


మధ్య మధ్య  జరిగిందంతా అతనికి చెప్పేయాలన్ని పిచ్చి ఉద్రేకం ముంచు కొస్తుంది... కాని... చెప్పి... చే జేతులా అతని ప్రేమను దూరం చేసుకోలేదు ... 


అదేనేమో తనలోని   బలహీనత .. 


అందుకే... ఇలా... అందర్నీ దగా చేస్తూ... తనను తాను దగా చేసుకుంటూ బతుకు ఈడ్చుకొస్తున్నది. .......! 


శేషు: 


"మనిషి మనసు మహాచిత్రమైంది. అదెంత స్వచ్ఛమయిందో అంత స్వేచ్ఛకలది  కూడా. 


దానికి వావివరుసలు, నీతి నియమాలు, న్యాయాన్యాయాలు, కట్టు బాట్లు ఏవీ. . పట్టవు. బుద్ధి బలమైనదైతే తప్ప మనసు వెర్రి పోకడకు అడ్డుకట్ట పడటం  కష్టం.


"నా మనసు చాలా సున్నితమైంది. ఒకసారి వోడిపోతే జీవితాంతం మరిచి పోలేని నైజంనాది. పగబట్టి కసి తీర్చుకుంటే గాని  మనసు తృప్తి పడదు, మనసుకు బావిసను నేను . అందుకే విధి ఆడించిన ఆ విషాద నాటకంలో నేను విలన్ పాత్రనే పోషించానేమో..  నాకు తెలీదు.


జీవితంలో మళ్ళీ కవించదనుకున్న శారద ఆరోజు తిరిగి తటస్థ పడింది. 

అదీ... నా కంటి ముందు... నా అనుగ్రహం  కోసం పరితపిస్తూ .. 


ఒకప్పుడు తన కోసమే నేను రాత్రింబవళ్ళు పరితపించి పోయింది ... ఆమె ప్రేమమ పొందాలని... ఆమె అందాలనన్నింటిని అందుకోవాలని వెర్రెత్తి  పోయాను ...


 కాని అప్పుడు ఎంత కర్కశంగా తిరస్క రించిందీ! ....


 'ఛీ ! నీ మొహానికి తోడు ప్రేమొకటే తక్కువ..." అని ఎద్దేవా కూడా చేసింది.  నేను ఆర్తిలో రాసినా ప్రేమలేఖను  చించి నా కళ్లెదుటే చెత్తబుట్టలోకి విసిరేసింది! 


ఆ సంఘటన నేను జన్మలో మర్చి పోగలనా? 


" ఆదంతా ఈ దేవదాసు అండ చూసుకునే అని అప్పట్లో నాకు తెలీనేలేదు....”


మళ్ళీ శారద రాకతో ప్రశాంతంగా సాగుతున్న నా జీవితంలో తుఫాను చెలరేగింది. 


' ఎంత వద్దనుకున్నా గతం ముల్లులా  గుండెల్ని కెలకసాగింది. వచ్చిన ఆ అవకాశాన్ని వదులుకో దలుచుకో 

లేదు.' 


నిజానికి శారద భర్తదంత సీరి యస్ కేసేమీ కాదు. ప్రథమస్థాయిలో ఉన్న క్షయ మాత్రమే. చాలా తేలికగా నయం చేయవచ్చుకూడా. 

కానీ, ఓ నెలరోజుల పాటు అతన్ని మా హాస్పిటల్ లో అడ్మిట్ చేయించుకొని  దాన్ని బాగా ముదరనిచ్చాను. అదే మరో రోగినైనా , మరో డాక్టరయినా నెల  రోజుల్లో మామూలు మనిషిని చేయవచ్చు. కాని, శారద ఆర్థిక స్థితి చాలా హీనంగా ఉందని గ్రహించాను. 


ఇద్దరూ పెద్ద వాళ్ళను  కాదని ప్రేమ వివాహం చేసుకుని అందరికీ దూరమయి అల్లాడుతున్నారని తెలుసు కోవడానికి ఆట్టే సమయం పట్టింది కాదు.  


శారద నిస్సహాయ స్థితి చుట్టూ నా వలను మరింత నేర్పుగా బిగించాను. నెలరోజుల ట్రీట్ మెంట్ కు  ఒక్క పైసా అయినా తీసుకోకుండా ఎంతో ఉదార బుద్ధి నటించాను. నా ఉచిత సహాయానికి పాపం, దేవదాసెంత కుచించుకు పోయేవాడో! 


"మీ ఋణం ఎన్ని జన్మలెత్తినా ఎలా తీర్చుకోగలను డాక్టర్!" అని అతనెన్ని సార్లన్నాడో! 


అప్పట్లో శారదను అనాథను చేయటమే తన లక్ష్యం. కానీ క్రమంగా శారద  ప్రవర్తన నాలోని అహాన్ని మరింత రెచ్చ గొట్టింది. 


గతాన్ని మర్చిపోయినట్లు లేదావిడ. నా మంచి తనాన్ని నమ్మినట్లు కూడా లేదు. నా మనసు తెలిసినట్లు నాకు దూర దూరంగా తప్పుకు తిరిగేది.  తప్పని సరి   పరిస్థితుల్లో నా సహాయాన్ని స్వీకరించాల్సి వచ్చినట్లు ప్రవర్తించటం నన్ను  మరింత కవ్వించింది. 


" అందుకే క్రమ క్రమంగా నా పథకంమార్చేశాను . మరింత క్రూరమైన పద్ధతి ద్వారా శారద జీవితాన్ని ఛిన్నా భిన్నం  చెయ్యనిదే నా పగ చల్లారదు . 


అందుకే ఆ రాత్రి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నది ....


 తప్పో ఒప్పో నాకు తెలీదు. నా పగ తీరి అహం తృప్తి చెందడం ప్రధానం.... “


అందుకే ఆ వర్షం రాత్రి శారద పిలిచినప్పుడు  మెడిషన్ లో  పాత మార్ఫియా కూడా తీసుకువెళ్లాను, 


బాధతో మెలికలు తిరుగుతుతున్న దేవదాసుకు ప్రమాదకరమైన మందు  ఇంజెక్షన్ లా  ఇచ్చాను


నిజానికి ఆ డోసుకు మనిషి పూర్తిగా మగతలో  వెళ్ళలేడు . పరిసరాలలో ఏమి జరుగుతుందో  తెలుస్తూనే ఉంటుంది. కాని, ఏమీ చేయలేనంత అశక్తుడవుతాడు ... 


కావాలనే నా పని చేశాను... శారదకు, నాకు  మధ్య జరిగే వ్యవహారంతా ప్రత్యక్షంగా విని అతని మనసు విరిగి  పోవాలనే ఆ పని చేశాను . 


తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన  భార్య  తన కళ్ళెదుటే మరో మగాడికి త్య శీలాన్ని  సమర్పిస్తుంటే ఏమొగాడికైనా మనసు విరిగి ముక్కలు చెక్కలవుతుంది.

తరువాత  ఆ భార్యతో మనసారా సంసారం చేయలేడు, 

నేను కోరుకున్నదీ అదే. బ్రతికినంత కాలం వాళ్ళిద్దరి మధ్య పెద్ద  అగాధం సృష్టించడం. 


శారదను G పరిస్థితుల్లో లొంగ దీసుకోవటమంత కష్టమయిన పనేమీ  కాదు. 


బలవంతంగానైనానేనాపనిచేసి ఉండే వాడినే. 


కాని, దేవదాసు చివరి ఘుడియల్లో ఉన్నాడనీ సింపుల్ గా  చిన్న అబద్దమాడి  ఆవిడ బలహీనత మీద దెబ్బకొట్టి చివరికామె తనకు తానే  లొంగిపోయేటట్లు చేయగలిగాడు...” 


" శారదమీద నాకు అప్పుడు ఎలాంటి మోజూ లేదు. ఉన్నదల్లా కేవలం పగ... కసి... ! ఏ మనిషి అండ చూసుకుని నా స్వచ్ఛమయిన ప్రేమను తిరస్క రించి నా గుండెను  గాయపరచిందో ఛీ! అని ఆ మనిషి చేతనే తిఁస్కరింపబడేటట్లు చేయడమే  నా లక్ష్యం.. దాన్ని సాధించటానికి నేనెన్ని మెట్లు దిగజారినా లెక్క పెట్ట లేదు.... 


దేవదాసు: 


"శీలం అంటే నా దృష్టిలో మానాసిక మైనది. 

శారీరకంగా పవిత్రంగా ఉండి మానసిక వ్యభిచారం చేసే వాళ్ళని ఎంతో మందిని చూస్తున్నాను. వాళ్ళంటేనే నాకు అసహ్యం . 


 శారద మీద నాకున్న అభిమారం ఇప్పుడు  కూడా రవంత తగ్గలేదు. 


నాకే అంత నరకయాతనగా ఉంటే .. ఆ క్షణాలలో ఆమె ఎంత  క్షోభకు గురయివుంటుందో ఊహించగలను. 


శీలాన్ని గురించి ఆడవాళ్ళకుండే అభిప్రాయం .. సర్వస్యంగా  భావించడం! అది ఆత్మాభిమానానికీ సంబంధించిన సంస్కారంగా భావిస్తారు. స్వంత ప్రమేయం లేకుండా యాదృచ్ఛికంగా మగాడు చేసే అఘయిత్రయంలో తాను పాపపంకిలం అయినట్లు కాదు . స్త్రీలను ఆవిధంగా ట్యూన్ చేసినవాడు మగవాడే . స్త్రీకి విధిగా ఉండాలని నిర్దేశించే ఆ సోకాల్డ్ ' శీలం ' తనకు మాత్రం ఉండనవసరం లేదా?  


తాము చేయని  తప్పులకు అమాయకంగా తమకు తామే శిక్షలు విధించుకోవడం!  .. కుదరని పక్షంలో  కుమిలిపోవడం ! ఎప్పుడు ఇది సరైన పద్ధతి కాదని అర్థమవుతుందో అప్పటి వరకు ఆ మిషతో మగఓాతి వికృత చర్యల కింద అణగారి పోవడం తప్ప మరో వికాసం ఉండదు. 


శారద అదే కోవలో ఆలోచిస్తోంది . అదే నాభయం ఎక్కడ ఏ అఘా త్యానికి పాల్పడుతుందో!  


ఏది ఏమయినా నేను త్వరగా కోలుకోవాలి . శారద కోసమైనా మళ్లా మనుషుల్లో  పడాలి . జీవితాంతం నేను తనను ప్రేమిస్తూనే ఉంటానని భరోసా కలిపించడం భర్తాగా స్నేహితుడుగా, ప్రేలుకుడుగా తన తక్షణ కర్తవ్యం కూడా! 

శారదను అపరాధ భావన నుంచి విముక్తి చేసేందుకు నేను త్వరగా కోలుకుని తీరుతాను . నాకా నమ్మకం ఉంది. నేను ఆశాశీవిని 

***


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్రప్రభ వారపత్రిక - 31 - 12 - 1977 సంచికలో ప్రచురితం ) 




Wednesday, December 22, 2021

కథానిక పనికిరానివాడు - కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక- 03-07- 1985 సంచికలో ప్రచురితం )



కథానిక 

పనికిరానివాడు  

- కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక- 03-07- 1985 సంచికలో ప్రచురితం ) 


తాగబోతున్న టీని తిరిగి ఇచ్చే సి వాప సిచ్చిన చెత్త నోటును పట్టుకుని బయలుదేరాను. 


ఈ నోటును మార్చట మెలా? అదీ సమస్య 


కొండపల్లి పోయిందాకా తెలిసిన మొహం లేదే! 


చీరాల బస్సు స్టాండులో చిల్లర కోసం పత్రిక కొనాల్సి వచ్చింది. 


బస్సు బయలుదేరే హడావుడిలో నోటు చూసుకోలేదు. టిక్కెట్టు ఖరీదు ప్లస్ సాదర ఖర్చులు పోనూ మిగిలిందీ నోటు మాత్రమే.


పది పైసలతో  కొండపల్లి చేరటం ఇంపాజి బుల్. 


ఊరుకాని ఊరు. ఈ బెజవాడలో చిక్కడిపో యాను. వెనక్కు పోవటానికి లేదు. ముందుకు సాగటానికి లేదు. 


ఏదో విధంగా ఈ పదిరూపా యల నోటుని మార్చాలి . 


బ్యాంకుల టైము కాదు. సాయంత్రం అయిదున్నరయింది.


(కొన్ని బాంకులు ఉంటాయి గాని, ముక్కూ మొగం తెలీనివాళ్ళ దగ్గర చెత్త నోట్లు ఎక్స్ఛేంజ్ చేస్తాయన్న నమ్మకం లేదు).


చూపు ఉన్న  ఏ సన్నాసీ ఈ నోటును చస్తే తీసుకోడు. పోనీ డిస్కౌంటు రేటుకు ట్రై చేస్తేనో! 


ఎలా అడగటం? ఎవరిని అడగటం? 


విజయ వాడలో నోట్ల ఆసుపత్రి ఉందని విన్నాను. ఎక్క డుందో తెలీదు. ఎవరి నడిగినా ఫలితం లేకపో యింది.


ఎనిమిది గంటల లోపు నేను కొండవల్లి చేరుకో లేకపోతే నా ఈ ప్రయాణం వృథా.


'నువ్వు ప్రయోజకుడివిరా. పైకొస్తావు. డబ్బు సాయం నేను చేస్తాను. బి.ఎ. పరీక్షకు కట్టు' అన్న మేనమాడు ఈ రాత్రే పనిమీద హైద్రాబాదు వెళుతున్నాడు. నెల రోజుల దాకా తిరిగి రాడు. 


పరీక్ష ఫీజు కట్టే సమయం దాటి పోతుందప్పటికైతే. అందుకే హడావుడిగా దొరికిన డబ్బు చేత పుచ్చుకుని కొండపల్లి బయలుదేరాను సాయంత్రం.


'ఈ పది రూపాయల నోటు మార్చలేకపోతే ప్రాక్టికల్ గా  నేను పనికిరాని వాడి కిందే లెక్క. 


ఇంటర్లో సంపాదించుకున్న ఫస్ట్ క్లాసు ఇందుకు ఉపయోగిస్తుందా?' 


రకరకాల ఆలోచనలు... కొన్ని ఆచరించలేనివి.

కొన్ని ఆచరించగలిగినా అంతరాత్మ ఒప్పుకోనివి. 'రిక్షా బేరం చేసుకొని కొంత దూరం పోయి ఈ నోటు ఇస్తేనో ? 


తీసుకోక చస్తాడా? పాపం! కష్టజీవి!


గుడ్డివాడి బొచ్చెలోవేసి చిల్లర తీసుకుంటేనో! 


పదిరూపాయల చిల్లర బొచ్చెలో ఉండదు. అలా తీసుకోవడం ద్రోహం' కూడా! 


ఆలోచనలతో బుర్ర వేడెక్కడమే కాని, ఫలితం లేదు. 


ఎదురుగా లీలా మహల్లో ఏదో ఇంగ్లీషు సినిమా.  రష్ గా ఉంది. 'పోనీ అక్కడ కౌంటర్‌ లో ట్రై చేసి చూస్తేనో! ఆ హడావుడిలో వాడు నోటు చూడవచ్చాడా!' 


రు. 20 కౌంటర్ లో అరగంట నిలబడిన తరువాత కౌంటరు ముందు కొచ్చాను. నోటు తీసి కౌంటర్లోకి తోస్తుంటే గుండె గుబగుబలా ఉంది.


ఇందాక టీ స్టాలు ముందు ఏమీ అనిపించలేదు. అప్పుడు నోటు సంగతి తెలీదు. 


ఇప్పుడు తెలుసు. మోసం... మోసం ... అని అంతరాత్మ ఘోషిస్తూనే ఉంది.


'ఇందులో మోసం ఏముంది? దొంగనోటు కాదు గదా నేనిచ్చేది!' అని మరో వైపునుండి సమర్థన. 


' ఈ నోటు పోదు' అనేశాడు కౌంటర్లో మనిషి కర్కశంగా


గభాలున  చెయ్యి బయటకు తీసేసుకుని మొహం చూపకుండా హాలు బయటకు వచ్చేశాను. 


'ఇంక ఈ నోటును మార్చటం నా వల్ల కాదు. కొండపల్లిదాకా నడిచి పోవడమొక్కటే మార్గం. లేదా.... బెగ్గింగ్...' 


' ఛీ...చీ... ! నా మీద నాకే చచ్చే చిరాకుగా ఉంది.


'టికెట్ కావాలా సార్!' అని పక్క కొచ్చినిలబడ్డాడు ఓ కుర్రాడు. 


పదిహేనేళ్ళుంటాయి. వాడు వేసుకొన్న పట్టీ బనీను మాసి , చినిగి, ముడతలు  పడి అచ్చు నా వదిరూపాయల నోటు లాగే ఉంది.


' 2 - 20 .. ఫోర్ రుపీస్...2-20 . ఫోర్ రుపీ స్ . అని మెల్లగా గొణుగుతున్నాడు.


బ్లాకులో టిక్కెట్లు అమ్ముతున్నాడని తెలుస్తూనే ఉంది' 


' పోనీ నాలుగు రూపాయలకు టిక్కెట్టు కొంటే ! ఆరు రూపాయలన్నా మంచివి వస్తాయి. కొండపల్లిదాకా వెళ్ళవచ్చు. ఎందుకైనా మంచిది ముందే నోటు సంగతి చెప్పి ఇవ్వటం....'


నోటును చూసి ' అయిదు రూపాయ లిస్తాను. సార్!' అన్నాడు ఆ కుర్రాడు. 


నా అవసరాన్ని కనిపెట్టాడు-అవకాశాన్ని ఉపయో

గించుకుంటున్నాడు. అసాధ్యుడు! 


జంకూ గొంకూ లేకుండా తెలిసి తెలిసి ఇలాంటి పరమ చెత్త నోటును తీసుకోవటానికి చాలా సాహనం కావాలి. అందులోనూ ఒక రూపాయి కాదు, రెండు రూపాయలు కాదు... పది రూపాయలు... అతని స్తోమతకు అది చాలా ఎక్కువ. 


టికెట్ ప్లస్ అయిదు రూపాయలు ఇచ్చాడు. వది

రూపాయల నోటు అందుకొని. 


అడగకుండా ఉండలేకపోయాను.' ఈ నోటును నువ్వెలా మారుస్తావోయ్?' 


' అదంతా ట్రేడ్ సెక్రెట్, సార్!' అని నవ్వా డు. 


' చెబితే రూపాయి ఇస్తా!' 


' అయితే, చెప్పను. మీ కంటిముందే మార్చి చూపిస్తా... రెండు రూపాయ లిస్తారా?' అన్నాడు. సవాల్ గా . 


ఎలాగూ నాకీ అయిదు రూపాయలు తిరిగి చీరాల పోను సరిపోవు. కొండపల్లిలో ఎలాగూ తంటాలు పడాల్సిందే. సరే. మరో రూపాయి పారేసి ప్రపంచజ్ఞానం నేర్చుకుంటే పోయేదే ముంది.. ఆ జ్ఞానం  నాకు లేనప్పుడు!


ఒప్పుకున్నాను. 


ఫుట్ పాత్ మీద అడుక్కునే గుడ్డి తాత దగ్గర పాత నోటు మదుపు పెట్టి ఎనిమిది రూపాయలు తెచ్చాడు. 


నన్ను కూడా వెనక నిలబెట్టి రెండు సినిమా టిక్కెట్లు కొన్నాడు. 


చూస్తుండగానే పది నిముషాల్లో ఆ టికెట్లను రెట్టింపు రేటుకు గిట్టించేశాడు. పావు గంటలో అరు రూపాయలు లాభం... అదీ పాత పనికిరాని నోటు పెట్టుబడితో! ....


' అడుక్కునే తాతకు ఆ నోటు మారదు. నువ్వు

పాపం గుడ్డి తాతను మోసం చేశావు' అన్నాను.


' అందరి విషయం మన కనవసరం, సార్! మన పనేదో మనం చూసుకోవాలి. అడిగారు గనుక చెబుతున్నా. తాతకు బాంకులో అకౌంటుంది. ఏ నోటు ఇచ్చినా తీసుకుంటారు. వాడికి రెండు రూపాయలు లాభం. నాకు అయిదు రూపాయలు లాభం... మీకు పని జరిగింది...' 


' ఇంత తెలివైన వాడివి మరెందుక నిలా రోడ్లు పట్టావు! ? ' 


అని అడగకుండా ఉండలేకపోయాను బెట్ పెట్టిన రెండు రూపాయలు అందిస్తూ ఒక రకమైన అడ్మిరేషన్‌ తో. 


వాడు నవ్వాడు మిస్టీరియస్ గా.  'మా అయ్య నన్ను తన్ని తగలేశాడు చదూకోటల్లేదని, ఎందుకూ పనికిరానని...' 


ఉలిక్కిపడ్డాను నేను. 


పనికిరాని వాడు.... అతనా?...నేనా??...


ఎవరు? వాడు చదువుకోలేదు. కనక భేషజం లేదు. 


నేను చదువుకున్నాను. కనక భేషజం నన్ను చొరవ చెయ్యనియ్యలేదు. .


మంచికీ చెడుకూ కూడా పనికిరాని ఈ చదువు పనికిరాని వాడుగా తయారు చేస్తుంది నన్నే...


ఇంకా నాలాంటి వాళ్లు ఎందరో...! 


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్రప్రభ వారపత్రిక - 03 -07 - 1985 సంచికలో ప్రచురితం ) 

Sunday, December 12, 2021

కథానిక - కర్పూరం రచన - కర్లపాలెం హనుమంతరావు

 







కథానిక : 

కర్పూరం 

రచనః కర్లపాలెం హనుమంతరావు


(ఆంధ్రభూమి- వారపత్రిక- 17 సెప్టెంబరు 2015 నాటి సంచికలో ప్రచురితం)



అయినవాళ్ళందరికి కబుర్లు వెళ్ళాయి. కొడుకులూ కోడళ్ళూ, కూతుళ్ళూ అల్లుళ్ళూ, సంతానంతోసహా అంతా వచ్చేసారు. ఇంట్లో ఒహటే హడావుడి.


సుందరమూర్తే బెడ్ మీద పడున్నాడు అచేతనంగా. కానీ అతని మనసుమాత్రం  పనిచేస్తోంది..  ఎప్పటికన్నా చురుకుగా!


పక్కగదిలో అందరూ ఏదో 'పారాయణం'లో ఉన్నట్లున్నారు. 


నవ్వులు, చలోక్తులు జోరుగా వినపడుతున్నాయి. 


' అయితే ఓడిన పార్టీ గెలిచిన పార్టీని సినిమాకు తీసుకెళ్ళాలిరా.. అదీ పందెం’ అంటున్నాడు పెద్దకొడుకు.


'వట్టి సినిమానేనా? డిన్నరుకూడా ఉండాలి.. అప్పుడే మజా'  పెద్దల్లుడి వంత.


'బావగారి చూపెప్పుడూ మీల్సుప్లేటుమీదే!' చిన్నకూతురు కౌంటరు. అందరూ విరగబడి నవ్వుకోవడాలు.


ఇవతల గదిలో సుందరమూర్తి మాత్రం మూతిమీద వాలిన ఈగను తోలుకోలేక తంటాలు పడుతున్నాడు. ఒహటే దురద! 


తోలుకొనేందుకు చేతులు లేవు. అవి నెల  కిందట జరిగిన బండిప్రమాదంలో నజ్జునజ్జయిపోయాయి. 


' అసలు ప్రాణానికే ప్రమాదం’ అన్నారు ముందు పెద్దాసుపత్రి వైద్యులు. ఆనక 'చేతుల వరకు  తీసేస్తే ప్రాణానికి కొంతవరకు భరోసా ఇవ్వచ్చు' అని తేల్చారు. 


' యాంప్యుటేషన్’ అంటే మాటలా? మూటలతో పనికానీ!

సుందరమూర్తి చేసేదేమీ సర్కారుద్యోగం కాదు. ఏదో ప్రైవేట్ పుగాకు కంపెనీలో అకౌంటెంటు. 


' యాక్సిడెంటయింది ఆదివారం డ్యూటీ-ఆఫ్ లో ఉన్నప్పుడు కాబట్టి  రూల్సు ప్రకారం  ముట్టేదేమీ లేదు పొమ్మ’న్నారు కంపెనీవాళ్ళు. 


నెలనెలా  జీతంలోనుంచి దాచుకొంటున్న పి. ఎఫ్ కూడా ఆడపిల్లల పెళ్ళిళ్ళకని చేసిన అప్పులకే చెల్లిపోతోంది. 


పెళ్లాం మెళ్ళో వేళ్ళాడే పుస్తెలు మినహా మరేమీ మిగల్లేదు ఇంట్లో.. ఇన్నాళ్ల పిల్లల చదువులు, పెళ్ళిళ్ల తంతులన్నీ ముగిసాక.


అప్పట్లో సుందరమూర్తి అన్ని పాట్లు అట్లా పడబట్టే.. ఇవాళ పెద్దాడు ఇన్ కమ్ టాక్సు ఆఫీసురుగా  కుదురుకొన్నది. చిన్నాడు బ్యాంకాఫీసరు కాగలిగింది. ఉండటానికి సొంత నీడంటూ ప్రస్తుతానికి మిగలక పోతేనేమి.. ఇద్దరు కూతుళ్ళకూ కుదురైన అత్తారిళ్ళు కుదిరిపోయాయి. 


‘ఆఖరివాడి విషయంలోనే కాస్త అన్యాయం జరిగింది. టొబోకో బోర్డులో వేయించగలిగాడుగానీ.. అది అన్నలకు మల్లే అధికార హోదాకలది కాదు.  నాలుగు డబ్బులు చేతుల్లో ఆడుతుంటే చివరాడికి మాత్రం  చిన్నగుమాస్తాగిరీతో సరిపెట్టేవాడినా!' అని మధన పడుతుంటాడెప్పుడూ సుందరమూర్తి ఒంటరిగా ఉన్నప్పుడు. 


ఆ కారణంగా వాడికి తనమేదెంత కోపమో తలుచుకుని తలుచుకొని అపరాధభావనతో  కుంగిపోవడం సుందరమూర్తి బలహీనత.


తండ్రీ బిడ్డలకు ఈ  విషయం మూలకంగా అంతగా మాటలు  లేవు.


' తనకిలా యాక్సిడెంటయిందని అందరితో పాటూ కబురెళ్ళినా..  చివరోడు తీరిగ్గా ఆఖర్లో మాత్రమే  ఎందుకొచ్చాడో తనకు తెలుసు. వచ్చి ఒక్కరోజైనా కాకుండానే 'సెలవుల్లేవు.. అర్జంటు పన్లున్నాయ'ని పెట్టేబేడా ఎందుకు సర్దుకుంటున్నాడో కూడా తనకు తెలుసు’ . 


దీర్ఘంగా నిటూర్చాడు సుందరమూర్తి.


గంటక్రితం అదే గదిలో కుటంబసభ్యులమధ్య జరిగిన సంభాషణలు గుర్తుకొచ్చాయి సుందరమూర్తికి.


' నాన్నగారి ఆపరేషనుకి తలా కొంత ఇచ్చుకోవాలిరా!' అని అడిగింది సుందరమూర్తి భార్య సుగుణమ్మ.. అందరికీ కాఫీలు అందిస్తూ.


' అరె! ఆ సంగతి ముందే చెప్పాలి కదమ్మా! పోయిన్నెల్లోనే పెద్దాడి కాలేజీ సీటుకోసమని ఐదు లక్షలు అప్పు తీసుకొచ్చాను బ్యాంకునుంచి. మళ్లీ అంత సొమ్మంటే మా ఆఫీసురూల్సు ఒప్పుకోవు' అనేసాడు పెద్దాడు వెంటనే. ముందే తయారు చేసిపెట్టుకున్నట్లుంది అతగాడా  స్పందించిన తీరు చూస్తుంటే!


సుందరమూర్తికి నవ్వొచ్చింది అంత బాధలోనూ. 'నాన్నా!పోయిన్నెలకు ముందే నువ్వెందుకు చేతులు పోగొట్టుకోలేదు?' అని ఆడిగినట్లనిపించింది. 


అయినా పెద్దాడి తత్వం తనకేమన్నా కొత్తా! వాడిప్పుడు అచ్చంగా వాళ్ల మామగారి అడుగుజాడల్లోనే కదా నడుస్తున్నదీ! మామగారి దయవల్లే తనకు ప్రమోషనొచ్చింద'ని ఎన్ని వందల సార్లు తనముందు అనివుంటాడో!


అయినా సుగుణకు వాడిమీదే ప్రేమ జాస్తి. 'మీకులాగా కాదు. నా పెద్దకొడుకు బతకనేర్చినవాడు' అని గర్వంగా చెప్పుకుంటుంటుందెప్పుడూ. '


తగిన శాస్తి చేసాడు తనకిప్పుడు' అనుకున్నాడు సుందరమూర్తి మనసులో చిన్నగా నవ్వుకొంటూ.


సుగుణమ్మ వెర్రిమొహమేసుకొని రెండోవాడివంక చూసినప్పుడు వాడూ అంతకుమించిన  మహానాటకానికే తెరతీసాడు. 


మొహం వేలాడేసుకొని 'ఇంతర్థాంతరంగా లక్షలంటే నా వల్లవుతుందా? నా వంతుగా ఓ పదో.. పాతికో అంటే ఎలాగో తంటాలు పడతాగానీ! దానికీ టైము కావాలమ్మా! లోనుకి అప్లై చేసిన వెంటనే సాంక్షనంటే అయే రోజులా ఇవి?' అని ముక్తాయించేసాడు. అదీ పెళ్లాం వంక బితుకు బితుకుమని చూస్తూ. 


పదికీ పాతిక్కీ కమిటయినందుకు అర్థాంగిగారు ఆనక గదిలో ఏం క్లాసు పీకుతుందోనన్న భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంది వాడి కళ్ళల్లో.


పెద్దల్లుడే నయం. 'కొడుకులు మీరట్లా అనడం ఏం బాగోలేదోయ్! మరీ అంత ఇబ్బందయితే చెప్పండి. సర్దడానికి నేను రెడీ! ఆనక మీదగ్గరున్నప్పుడే ఇద్దురుగానీ' అన్నాడు. 


కానీ వెంటనే పెద్దకూతురు అందుకోనే అందుకంది'అవ్వ! బావమరదులకు అప్పిస్తానంటారా! లోకం వింటే నవ్విపోతుంది. అయినా మీదగ్గర అంత సొమ్ము మూలుగుతున్నట్లు నాకూ తెలీదే! కాలేజీకెళ్లే పిల్ల మెడ బోసిగా ఉంది.. కనీసం ఒక చిన్నగొలుసైనా చేయిద్దామని ఎంతకాలంబట్టీ మొత్తుకుంటున్నాను! ఆప్పుడు లేదన్న డబ్బు ఇప్పుడు కొత్తగా ఎక్కణ్ణుంచి పుట్టుకొచ్చిందో?!  పెళ్ళికి చెల్లాయికి అమ్మ మంచి గొలుసు చేయించి ఇచ్చిందిగదా! ఏమే!  అది బ్యాంకులో పెట్టినా నాన్న అవసరాలు తీరిపోతాయిగదా .. ఇలా అమ్మావాళ్ళు అందరి కాళ్ళు..  గడ్డాలు పట్టుకొని బతిమాలేబదులు!' అంటూ సన్నాయినొక్కులు మొదలుపెట్టింది.


అనుకోకుండా గాలి తనవేపుకి తిరగడంతో వెంటనే ఎలా స్పందించాలో తోచక బిక్కమొగమేసుకుంది చిన్నకూతురు. 


సుగుణమ్మే కలగజేసుకొని అనాల్సొచ్చింది 'కొత్తగా పెళ్లయిన పిల్ల, వంటిమీదకని ఇచ్చిన సొమ్మును ఎంతవసరమొస్తేమాత్రం తిరిగి తీసుకుంటామా? వదిలేయండింకా ఈ టాపిక్కుని ఇక్కడితో!' అనడంతో అమ్మగన్న సంతానమంతా గమ్మునయిపోయారు. 


'అమ్మయ్య! ఈ పూటకీ గండం ఎలాగో గడిచిపోయింద’న్నసంబరమే అందరి కళ్ళల్లో కనిపిస్తున్నది' అనుకున్నాడు సుందరమూర్తి. 


వాతావరణాన్ని తేలిక పరచడానికని తనే కలగజేసుకొన్నాడు చివరికి 'మీ ఆమ్మ పిచ్చిది.  పాతకాలం మనిషి. ఆమె మాటల్నేమీ పట్టించుకోకండర్రా! ఇక్కడున్న నాలుగురోజులు సంతోషంగా గడిపిపోండంతా. మళ్ళా ఎప్పుడు కలుస్తారో  ఏమో ఇట్లా అందరూ! పిల్లాపాపలతో మీరంతా చల్లంగా ఉండటమే మాకు కావాల్సింది' అన్నాడు.


తరువాత తనగదిలోకి వచ్చినప్పుడు సుగుణమ్మ కన్నబిడ్డల మాటల్ని తలుచుకొని తలుచుకొని గుడ్లనీరు కుక్కుకుంటుంటే సుందరమూర్తే సర్దిచెప్పాల్సి వచ్చింది. 


' వూరికే అనవసరంగా  వాళ్లని బాధ పెట్టడమెందుకు? నువ్వూ బాధ పడ్డమెందుకు? ఇప్పుడంత అర్జంటుగా నేనీచేతులు బాగుచేయించుకొని వరగబెట్టేది మాత్రం ఏముంది చెప్పు! ఎలాగూ  రిటైరవబోతుంటిని. ఆర్నెల్లకు  ముందే పదవీవిరమణ చేసానని సర్దిచెప్పుకొంటే సరిపోదా సుగుణా!' అంటూ.


ఎప్పుడు వచ్చాడో లక్ష్మీనారాయణ.. అంతా అప్పుడే  విన్నాడో.. సుగుణమ్మ అంతకుముందే చెప్పుకుందో.. లోపలికొచ్చి కూర్చున్నాడు. 'చూసావుగా సుందరం! నేనాడే హెచ్చరించాను. ఈ కాలం కుర్రసజ్జే అంత. పిలల్ని మనం 'బంగారు కొండల'నుకుంటాం. ఆ కొండలే విరిగి నెత్తిమీద పడితే?  అయ్యో.. మన త్యాగమంతా వృథా అయిపోయిందిగదా అనుకుంటూ అల్లాడిపోతుంటాం.. ఇలాగా!' అంటూ వేదాంతం మొదలుపెట్టాడు.


'పోనీలేరా! కన్నందుకు పిల్లల్ని వృద్ధిలోకి తేవడంకూడా ఓ గొప్పత్యాగమేనా! పుట్టీపుట్టంగానే డొక్కల్లో తంతూ నడక నేర్పించడానికి మనమేమీ ఒంటెలం కాదు. జిరాఫీలం అంతకన్నా కాదు. రెక్కలిరిగినప్పుడు ఆదుకుంటాయనేనా పిట్టలు గువ్వలకి నోళ్ళు పగలదీసి మరీ బువ్వ పెట్టేది! మన రక్తసంబధాలు విచిత్రంగా ఉంటాయిరా! కనకనే మనం మనుషులం. ఎవరి అదృష్టాలనిబట్టి వాళ్లకవి లభ్యమవుతాయి. నా అదృష్టం ఇదీ! దానికింకెవర్నోనిందిస్తూ కూర్చుంటే మనశ్శాంతి తిరిగొస్తుందా!. వస్తుందంటే చెప్పు.. నీ మాటే వింటాను’


'సరేలే! నీ వెర్రివేదాంతం నాకింతప్పట్నుంచీ తెలిసిందేగా! నువ్వెలాగూ వృద్ధాప్యంలో కష్టమొచ్చినప్పుడు ఇలాంటి గోతిలోనే పడతావని  ముందే తెలుసు. ఏడేళ్లకిందట ఇల్లు కట్టేటప్పుడు నీ దగ్గర అప్పు తీసుకున్నాను. గుర్తుందా? ఆ మూడు లక్షలు ఎప్పుడు తిరిగిస్తానన్నా'ఫ్రెండు దగ్గర బాకీ వసూలు చేసుకునే ద్రోహినా?' అంటూ సినిమా డైలాగులు కొట్టేవాడివి. 'కనీసం వడ్డీలేకుండానైనా తీసుకోరా దేవుడా!' అని ఎంత బ్రతిమిలాడాను! నీ  డబ్బుమొత్తం  ఆ రోజుల్లోనే  బ్యాంకులో వేసేసానబ్బాయ్ రికరింగ్ డిపాజిట్టుగా. నిన్ననే మెచూరయింది.. అదిచ్చిపోదామనే వచ్చింది' అని డబ్బున్న సంచీ అక్కడేవున్న సుగుణమ్మ చేతిలో పెట్టేసి  'లెక్క పెట్టించు తల్లీ! మొత్తంఆరున్నర లక్ష ఉండాలి' అన్నాడు లక్ష్మీనారాయణ. 


'లక్ష్మీ! నీకెందుకురా నామీద అంత ప్రేమ?'


'నేను నీ బాల్యస్నేహితుణ్ణి కనక. మరీ ముఖ్యంగా నువ్వు నా కన్నతండ్రివి కాదు కనక' అని నవ్వాడు లక్ష్మీనారాయణ. 


భోరున ఏడ్చేసాడు సుందరమూర్తి. అప్పటిదాకా అదిమిపెట్టుకొనున్న ఉద్వేగమంతా ఒక్కసారిగా కట్టలు తెంచుకొన్నట్లయింది. 


కాఫీ తాగి లేచివెళ్ళే సమయంలో  లక్ష్మీనారాయణని దగ్గరికి పిలిచి చెప్పాడు సందరమూర్తి 'సుగుణదగ్గరున్న ఆ క్యాష్  మా మూడోవాడు రాజుకాతాలో వేసెయ్యరా! వాడు చాలా రోజులబట్టీ డబ్బుకావాలని ఒహటే గోలపెడుతున్నాడు. ఏదో బండికొంటాట్ట! అదికొనిస్తేగాని వాళ్లబాసు ప్రసన్నం కాడనీ.. పైపోస్టుకి తన పేరు క్లియర్ కాదనీ మొత్తుకుంటున్నాడు చాలా రోజులబట్టీ.. పాపం! తప్పేముందిలే! వాడికి మాత్రం వాడి అన్నలకు  మల్లే పెద్ద హోదాలో ఉండాలని ఎందుకుండ కూడదు? ఈ మొండిచేతులు పెట్టుకొని ఇహ ముందు మాత్రం  వాడికి నేను చేసేది ఏముంటుంది? ప్రైవేట్ కంపెనీలో ఓ బోడి గుమస్తాపోస్టు ఇప్పించానని కదా ఇంతకాలం  వాడికి నామీద ఆ  గుర్రు!' అన్నాడు భార్యవైపు తిరిగి.


'మరి మీ సంగతేమిటండీ?' అని లబలబలాడింది అప్పుడే హారతిపళ్లెంతో లోపలికొచ్చిన సుగుణమ్మ.


'సుగుణా! ఈ లక్ష్మీగాడు  నీకు చెప్పడానికి జంకుతున్నాడు. నిన్న వాడే డాక్టరుదగ్గరికి వెళ్ళొచ్చాడు 'సమయం చాలా మించిపోయిందని.. ఇప్పుడు యాంప్యుటేషనంటే అసలు ప్రాణానికే ముప్పు' అని డాక్టర్లు చెబుతున్నార్ట. ఏరా!?' అని గద్దించి అడిగాడు మిత్రుణ్ణి సుందరమూర్తి.


' అవున'నాలో.. 'కాద'నాలో' తేల్చుకోలేక నీళ్ళునిండిన కళ్ళతో అలాగే నిలబడిపోయున్నాడు లక్ష్మీనారాయణ.


సుగుణమ్మ చేతిలో వెలుగుతున్న  హారతికర్పూరం  వాసన గుప్పున అతగాడి   ముక్కుపుటాలకు సోకింది.


- రచనః కర్లపాలెం హనుమంతరావు

***

(ఆంధ్రభూమి- వారపత్రిక- 17 సెప్టెంబరు 2015 నాటి సంచికలో ప్రచురితం)














గుండు జాడీ - సరదా కథానిక -కర్లపాలెం హనుమంతరావు

 

గుండు జాడీ- కథానిక

T


'ఆవగాయ అయిపోయింది. మీ అల్లుడిగారికి ముద్ద దిగడం లేదు. అర్జంటుగా ఓ చిన్నగుండు జాడీడైనా పమ్మిం'చమని మా తోడల్లుడుగారి మూడో కూతురు ఉత్తరం రాసింది.

ఆ పిల్ల మొగుడు వినాయకరావుకు అదేదో బ్యాంకులో ఉద్యోగం. ఈ మజ్జెనే బెజవాడ బదిలీ అయింది.

కృష్ణలో మునగాలనీ, కనక దుర్గమ్మను చూడాలనే వాంఛితం వల్ల నేనే బండెక్కా జాడీ పట్టుకుని.

తెనాలి దగ్గర ఓ ఎర్ర టోపీ పెట్టెలో కొచ్చింది. 'పేలుడు సామాను బండిలో ఉండకూడద'ని పేచీ పెట్టుక్కూర్చుంది సీటు కిందున్న జాడీ చూసి. అది పేలే పదార్థం కాదని నచ్చచెప్పడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది.

లంఖణాల బండి ముక్కుతూ మూలుగుతు బెజవాడ చేరేసరికి చిరుచీకట్లు ముసురుకుంటున్నాయి.

అదెక్కడి ఫ్లాట్ ఫారం! పెళ్లిపందిరిలా వెలిగిపోతో ఉంది. ఏవిఁ జనాలూ! ఎంత హడావుడీ! మా వూరి సంతే అనుకుంటే అంతకు వంద రెట్లు ఎక్కువగా ఉందీ వింత! ఈ సందోహంలో మా వాణ్ణి ఎట్లా పసిగట్టడం? అసలా శాల్తీనే గుర్తుపట్టడం కష్టం. పదేళ్ల కిందట పెళ్ళి వెల్తుర్లో చూడ్డవేఁ. ఇంకా అట్లాగే ఈకలు పీకిన కోడిలా ఉంటాడా?

అయోమయంగా జాడీ పట్టుకుని నడి ప్లాట్ ఫామ్మీద తచ్చాట్టం మొదలుపెట్టాను. ఈ కాఖీవాలా, రైల్వేపోలీసనుకుంటా.. కర్రకొట్టుకుంటూ వచ్చాడు.

'అగ్గిపెట్టుందా?'

ఇచ్చాను.

'సిగిరెట్టూ?'

నాకు చుట్టలు పీల్చడం అలవాటు. 'లేద'న్నాను.

'సిగిరెట్టు లేకుండా వట్టి అగ్గిపెట్టెందుకుందీ? ఎక్కడ అగ్గిపెట్టబోతున్నావ్? నీ వాలకం అనుమానంగా ఉంది. నీ చేతిలో అదేంటీ? టైం బాంబా?'

'బాంబు కాదండీ! ఆవగాయ జాడీ!'

'ఆవగాయా? వో క్యా హైఁ! ఖోల్దో!' ఏందో గోల!

జాడీ క్కట్టిన వాసెన విప్పి చూపించక తప్పింది కాదు.

లోపలికి తొంగి చూసి ఉలిక్కిపడ్డాడు. 'అమ్మో! రక్తం.. రక్తం!'

'తెలుగు వాడై ఉండడు. ఆవగాయంటే అర్థమవడంలేదు.

'రక్తం కాదండీ! నూనె!' నమ్మించడానికి జాడీలో వేలు ముంచి ఆ పోలీసోడి నాలిక మీదింత రాశాను.

అంతేఁ! ఎగిరి గంతేశాడు.

'పెలింది. గూబ్బేలింది' అంటు చెవులు రెండూ పట్టుక్కూర్చున్నాడు. నష్టపరిహారం కిందో వంద రూపాయలు వదులుకుంటే గాని వాడు నన్ను వదల్లేదు.

వినాయకరావిక రాడు. కార్డంది ఉండదు. ఇట్లాంటి ఉపద్రవాలన్నీ ముందే పసిగట్టే అతగాడింటి వివరాలన్ని రాయించి రొంటిన పెట్టుకునుంది. స్టేషన్ బైట సగం మెట్ల మీదుండగానే ఓ కుర్రాడొచ్చి నా జాడీ మీద పడ్డాడు. ఇంకా చాలామంది ఆ అవకాశం కోసం చుట్టూ మూగిపోయారు. అంతా కలసి నా చంకలోని జాడీని గుంజేసుకుంటున్నారు. బూతులు!.. గోల!

'ముందు నేనూ పట్టుకుంది. ఇది నాదీ!'

'ముందు నేన్చూశానెహె! జాడీ నాదీ..'

'కాదు నేం జూశాన్రా లం.. కొడకా!'

'ఇలాగిచ్చీసెయ్యండి సార్ .. జాడీని'

నా జాడీని పట్టుకుని నాది.. నాదని వాదులాడుకునే వాళ్లను చూసి ముందు నేను బెంబేలెత్తిపోయాను. బెజవాడ మనుషులు ఎంతకైనా తగుదురని మా బామ్మర్ది మాటలు గుర్తుకొచ్చి బలం కొద్దీ పరుగెత్తాను జాడీతో సహా!

వెనక నుండి ఈలలు.. గోల! బూతు మాటలు కూడా!

 నవ్వుల్తో కలిసి! వాళ్లంతా రిక్షావాళ్లట! తర్వాత తెలిసింది!

ఆదుర్దాలో ఎంత దూరం పరుగెత్తుకొచ్చానో నాకే తెలీదు. కుదుపులకు జాడీ మీద మూత కదిలినట్లుంది. వాసెనక్కట్టిన గుడ్డ ఆవనూనెకు  ఎరుపు రంగుకు తిరిగింది. మాడు కూడా కొద్దిగా మంటెత్తుతోంది.

ఇహ నడక నా వల్ల కాదు. ఎంత దూరవఁని నడుస్తా మీ దిక్కూ మొక్కూ లేని ఊళ్ళో! అందునా మా వినాయకరావుండే 'ఆంజనేయ వాగు' ఆనవాలు బొత్తిగా లేదు!

దార్న పోయే రిక్షాను పిలిచాను. వాడు దగ్గర దాకా వచ్చి జాడీని చూసి ఝడుసుకున్నట్లున్నాడు.. అదే పోత.. ఓ మాటా పలుకూ లేకుండా!

అతి కష్టం మీద మరో బండి పట్టుకున్నా! వాడి క్కొంచెం గుండె ధైర్యం ఎక్కువే సుమండీ! 'ఎక్కడికీ?' అనడిగాడు.

'వాగు లోకి' అని ఇది కూడా ఉందని జాడీని చూపిస్తూ. వాడూ ఝడుసుకున్నాడు. 'ఏంటదీ? ఎర్రంగా కార్తా ఉంది? మడిసి తలకాయ కాదు గందా?' అని ఆడిగాడు నా వంక అదోలా చూస్తూ!

ఈ గుండు జాడీ నా కొంప ముంచేట్లుందివాళ!

'ఏడు రూపాయలివ్వండి!  మూడో కన్నుకు కానకుండా వాగులోకి దింపించేత్తాను. రగతం రిసుకు మరి!' అన్నాడు దగ్గరి కొచ్చి గొంతు తగ్గించి.

ఆవకాయరా బాబూ! అని అక్కడికీ చిలక్కి చెప్పినట్లు చెప్పి చూశా. నా మాట నమ్మడంలే! అట్లాగని వదలటవూఁ లేదు. ఇట్లాంటి సాహసాలు ఇంతకు ముందు ఎన్ని చేశాడో! ఇప్పుడు నాకు వణుకు మొదలయింది.

'బెజవాడలో రిక్షా రేట్లు దారుణంగా ఉంటాయి. రిక్షా తొక్కె వాళ్లు అంత కన్నా దారుణంగా ఉంటారు. సాధ్యవైనంత వరకు పబ్లీకు మధ్యన బస్సుల్లో తిరగడవేఁ మేలు' అని హెచ్చరించివున్నాడొకప్పుడు మా తోడల్లుడు. ఆ ముక్కలు ఇప్పుడు గుర్తుకొచ్చాయి. రిక్షావాణ్నక్కడే వదిలేసి అప్పుడే వచ్చిన బస్సు దిక్కు పరుగెత్తాను.

అది ఇరవై నాలుగో నెంబరు బస్సు.

అమ్మాయి ఉత్తరంలో రాసిన నెంబర్లు గభాలున గుర్తుకొచ్చి చావడం లేదు. ఎవర్నైనా అడుక్కోక తప్పదు. అక్కడే నిలబడి తాపీగా చుట్ట పీక పీల్చుకునే పెద్దమనిషొకతను కనిపించాడు.

'ఈ బస్సెక్కడికి పోతుంది?' ఆడిగా.

'నువ్వేడకి పోవాలా?' ఎదురు కొచ్చెను.

'వాగులోకి'

'ఇది కాటికి పోయేదయ్యా! అల్లదిగో! ఆడాగి వుందే నాలుగో నెంబరు బస్సు.. అదెక్కెల్లిపో! తిన్నగా వాగులో దింపేత్తది.. బేగి పో' ఉత్తరాంధ్ర సరుకులాగా ఉంది. బెజవాడ కదా! అని బాషల వాళ్లూ గుమిగూడ్తార్లా ఉంది.

 నాలుగో నెంబర్ బస్సు నిద్రలో గురక పెడుతూ తూలిపడేవాడిలా వూరికే వూగిపోతావుంది వెనక్కీ.. ముందుకీ!

బస్సంతా కోళ్ల గంపలా కిక్కిరిసిపోయుంది. అయిస్కాంతం అంచుల దగ్గర ఇనప తుక్కు పేరుకున్నట్లు రెండు డోర్ల దగ్గరా జనాలు పొర్లిపోతున్నారు. అయినా మనిషికి మనిషికీ మధ్యన ఇంకా సందుండిపోయిందని మధన పడిపోతున్నాడు బస్సు కుర్రాడు.

'రావాలండీ .. రావాల! మార్కెట్ పంజా కాలేజ్ జండా వాగు చిట్నగర్ లంబాడీ.. రావాలండీ.. రావాలా..'

చెవి తెగ్గోసిన మేకకి మల్లే ఒహటే అరుస్తున్నా ఆ కుర్రాడి దగ్గరికెళ్లి అడిగా 'వాగులో కెళతందా?'

అంతే! మాటా పలుకూ లేకుండా నా పెడ రెక్కలు పట్టేసుకుని బస్సులోకి ఈడ్చేసుకున్నాడ కుర్రాడు నా భుజం మీది జాడి పక్క మనిషి నెత్తి మీదకెక్కింది కుర్రాడి గత్తర్లో!

రామాయణంలోని పుష్పకవిమానం దారి తప్పొచ్చి బెజవాడ వీధుల్లో వాలినట్లుంది. ఎంత మందిని కుక్కినా బస్సోళ్లకు తృప్తి కలగడం లేదు.

'.. ఎదరకు జరగండి బావూఁ.. ముందుకు జరగండి.. ముందుకు పదండి.. ఊఁ ఊఁ.. పదండి ముందుకు .. పదండి ముందుకు..'

మనస్ఫూర్తిగా మనల్నింకా ముందుకు పదమనే వాళ్లింకా దేశంలో మిగిలున్నందుకు మహా ముచ్చటేసింది కానీ.. అదా స్థలం? సందర్భం?

చినుక్కీ చినుక్కీ మధ్య నుంచి గుర్ర్రం తోల్తూ బాణాలేసే పురాణపురుషుడి చాకచక్యం మించి పేసింజర్స్  భుజాల మీద పాక్కొస్తూ, బూతులు కూస్తో, 

టిక్కెట్లు కోస్తో వస్తోన్న కండక్టర్ని నిజంగా అభినందించాలి!

నిద్రలో నడిచేవాళ్లా బైల్దేరిన బస్సుకు ఏం మూడిందో, మూడు నిమిషాల్లో ముక్కుతాడు తెంచుకున్న గుర్రంలా పిచ్చ పరుగందుకొంది. మజ్జె మజ్జెలో సకిలింపులు.. బస్సు కుర్రాళ్ల రంకెలు!

వెనకమాల్నుంచి మరో మదమెక్కిన బస్సుగుర్రం తరుముకొస్తోందట!

అప్పుడు చూశా డ్రైవర్ సీటుకు సరిగ్గా నెత్తి మీద పెద్దక్షరాలతో రాసున్న హెచ్చరిక 'దేవుని స్మరింపుము'

ప్రస్తుతం నేను చేస్తోన్న పని కూడా అదే!  నేనూ, జాడీ క్షేమంగా వాగులోకి దిగితే అదే పదివేలు!

గవర్నమెంటాసుపత్రి ముందు అయిష్టంగా బస్సాగింది.

కండక్టరు అరుస్తోన్నాడు 'ఆసుపత్రి కెవరెళతారండీ!;

ఈ బస్సిట్లా ఇంకో పది నిముషాలు గెంతితే అందరం అక్కడికి పోవాల్సిన వాళ్లమే!

ప్రస్తుతానికి ఓ భారీ కాయం మాత్రం ఆపసోపాలు పదుతూ సీట్లోంచి లేచింది.

ఆ కాయాన్ని ఆస్పత్రి పాల్జేయడానికి అయిన ఆలస్యాన్ని కాంపెన్సేట్ చేయడానికి డ్రైవర్ పూర్తిగా స్టీరింగ్ మీంచి చేతులు ఎత్తేశాడు. బహుశా పెడలు మీది పాదం కూడా అదే పని చేసుండచ్చు. మొత్తంగా బస్సు మెత్తంగా గాలిలో తేలిపోతోందీ సారి. బోడెమ్మ సెంటర్ దగ్గర బ్రేక్ పడక తప్పలేదు.

'బోడెమ్మ ఎవరండీ? బోడెమ్మ ఎవరండీ?' కండక్టరు రంధి.

'నేనేనండీ!' అంటూ లేచిందో పునిస్త్రీ.

'నువ్వం కాళ్లమ్మంటివి కదమ్మా? 'అంకాళమ్మ గుడి స్టాప్' అని కండక్టర్ ధ్వని!

'నేను కాదయ్యా అంకాళమ్మ! నా ఈపరాలు. ఇదిగో ఈడనే కూకోనుండాది. బోడెమ్మ నేనే!'

ఆ శాల్తీని బస్సులో నుంచి దాదాపు తోసేసి బెల్లుకొట్టాడు కండక్టర్.

పీరు చెట్టు దగ్గర పీరెవరో లేచి రమ్మంటే ఓ శాస్త్రులు గారు దిగడానికి తయారయ్యారు. 'గాంధీ బొమ్మ' దగ్గర అట్లాగే కండక్టర్ 'గాంధీ..గాంధీ ఎవరు బాబూ.. గాంధీ' అని మొత్తుకుంటుంటే ఓ తాగుబోతు 'ఓయ్' అంటూ ఇద్దరు పేసింజర్ల చేతి సాయంతో తూలుకుంటూ దిగిపోయాడు.

 

హఠాత్తుగా     బస్సొక్కక్షణం ఆగి.. మరుక్షణమే వెనక్కి నడవడం మొదలెట్టింది!

'అందరూ దిగాలి. దిగాలి. బస్సింక ముందుకు పోదు' అని అరుపులు లంకించుకున్నాడు కండక్టర్!

వనక బస్సుతో పోటీ తట్టుకోడానికి హఠాత్తుగా ఇట్లా దారి మళ్లించడం బెజవాడ బస్సుల కలవాటైన ముచ్చటేనట. 

అదేమని అడిగితే 'మెడ మీద చెయ్యేసి తోసేస్తారు, బెజవాడ బసులోళ్లు యములోడికైనా జడవరు' అంది అప్పటి దాకా నా గుండు జాడీ మోసిన గుండు శాల్తీ.

అందర్తో సహా హడావుడిగా బస్సు నుండి నేనూ  బైటకుదూకేశా.

ఎత్తు మీంచి దూకడంతోజాడీ బీటలిచ్చినట్లుంది.. జుత్తంతా ఆవ జిడ్డుతో ముద్ద ముద్ద! నుదుటి మీంచి నుదురు మీదికి జారిన ఆవ నూనె మరకలు ఎండి ఎప్పుడో చారికలు కట్టున్నాయి. కళ్లూ.. వళ్లూ అంతా మంట మంట!

చీకట్లో ఎవరూ చూదకుండా మావాడిల్లు కనుక్కోడానికి అష్టకష్టాలు పడాల్సొచ్చింది.

అప్పటికే అర్థరాత్రి దాటింది.

బాడీ, జాడీ వెరసి శరీరమంతా బట్టలతో రక్త సిక్తంగా మారిపోయింది.   చంకలోని గుండు జాడీ ఖండిత శిరస్సును తలపిస్తోంది.

    ఎవరైనా చూస్తే హంతకుణ్నని వెంటబట్టం ఖాయం.

చలి వల్ల వణుకు..

ఆకలి వల్ల నీరసం..

ఆవగాయ వల్ల  మంట..

ప్రయాణం వల్ల అలసట..

నిద్ర వల్ల మత్తూ..

వళ్లు తూలిపోతూంటే, కాళ్లు వణికిపోతోంటే, ఆ నడి రాత్రి చీకట్లో ఎట్లాగైతే ఏం వినాయకరావిల్లు పట్టుకుని తలుపులు దబదబా బాదేస్తున్నా.

ఐదు నిముషాలగ్గానూ మెల్లిగా తలుపు తెరుచుకుంది కాదు.

'ఎవరూ?' ఏదో ఆడగొంతు మెల్లిగా.

'నేనమ్మా! పెదనాన్నను.  ఇదిగో! ఆడిగావుగా! తెచ్చా నీ కోసం!' అంటూ గుండు జాడీని గడప మీదకు దించానంతే!

 'కెవ్వుఁ!' కేక! ఒకసారి కాదు.. వరసగా ఏ పది సార్లో!

ఆ పిల్ల అమాంతం అల్లాగే విరుచుకుపడిపోయింది.

భగవంతుడా! ఇప్పుడేం చేయడం!

పారిపోడమా! ఉండిపోయి దెబ్బలు తిండమా!

మీమాంస నడుస్తూండగానే గదిలోంచి  బైటికొచ్చిన వినాయకరావు ఒక్క క్షణం అవాక్కయిపోయి మరుక్షణంలో 'మర్డర్! మర్డర్!' అంటో వీధిలోకి పరుగేట్టి వీరంగాలు  మొదలెట్టాడు.

అరవడానికి పోగైన వీధి కుక్కలు చీకట్లో ఆవగాయ బద్దల్నే మాంసం ముక్కలనుకున్నాయో.. ఏంటో.. ఆవురావురమని మెక్కెస్తున్నాయి.

అమ్మాయికని తోడల్లుడు శ్రద్ధగా చేయించిన ఆవగాయ మొత్తం వీధి కుక్కలపాలు!

అవునూ!.. కుక్కలు ఆవగాయ ముక్కల కాశపడతాయా.. మరీ విడ్డూరం కాపోతే? అని సొడ్డు నా మీద మాత్రం వేయకండి!

అప్పుడూ ఇప్పుడూ .. బెజవాడలో జరిగే విచిత్రాలు బ్రహ్మంగారికే అందలే! ఇహ మీకూ.. నాకూనా?!

-కర్లపాలెం హనుమంతరావు

***

(ఆంధ్రప్రభ వారపత్రిక సెప్టెంబర్, 1982 ప్రచురితం -రికార్డులో 16  -09 -1982 అని ఉంది)

 

 

 

 

 

 

 

 

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...