కథానిక
పనికిరానివాడు
- కర్లపాలెం హనుమంతరావు
( ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక- 03-07- 1985 సంచికలో ప్రచురితం )
తాగబోతున్న టీని తిరిగి ఇచ్చే సి వాప సిచ్చిన చెత్త నోటును పట్టుకుని బయలుదేరాను.
ఈ నోటును మార్చట మెలా? అదీ సమస్య
కొండపల్లి పోయిందాకా తెలిసిన మొహం లేదే!
చీరాల బస్సు స్టాండులో చిల్లర కోసం పత్రిక కొనాల్సి వచ్చింది.
బస్సు బయలుదేరే హడావుడిలో నోటు చూసుకోలేదు. టిక్కెట్టు ఖరీదు ప్లస్ సాదర ఖర్చులు పోనూ మిగిలిందీ నోటు మాత్రమే.
పది పైసలతో కొండపల్లి చేరటం ఇంపాజి బుల్.
ఊరుకాని ఊరు. ఈ బెజవాడలో చిక్కడిపో యాను. వెనక్కు పోవటానికి లేదు. ముందుకు సాగటానికి లేదు.
ఏదో విధంగా ఈ పదిరూపా యల నోటుని మార్చాలి .
బ్యాంకుల టైము కాదు. సాయంత్రం అయిదున్నరయింది.
(కొన్ని బాంకులు ఉంటాయి గాని, ముక్కూ మొగం తెలీనివాళ్ళ దగ్గర చెత్త నోట్లు ఎక్స్ఛేంజ్ చేస్తాయన్న నమ్మకం లేదు).
చూపు ఉన్న ఏ సన్నాసీ ఈ నోటును చస్తే తీసుకోడు. పోనీ డిస్కౌంటు రేటుకు ట్రై చేస్తేనో!
ఎలా అడగటం? ఎవరిని అడగటం?
విజయ వాడలో నోట్ల ఆసుపత్రి ఉందని విన్నాను. ఎక్క డుందో తెలీదు. ఎవరి నడిగినా ఫలితం లేకపో యింది.
ఎనిమిది గంటల లోపు నేను కొండవల్లి చేరుకో లేకపోతే నా ఈ ప్రయాణం వృథా.
'నువ్వు ప్రయోజకుడివిరా. పైకొస్తావు. డబ్బు సాయం నేను చేస్తాను. బి.ఎ. పరీక్షకు కట్టు' అన్న మేనమాడు ఈ రాత్రే పనిమీద హైద్రాబాదు వెళుతున్నాడు. నెల రోజుల దాకా తిరిగి రాడు.
పరీక్ష ఫీజు కట్టే సమయం దాటి పోతుందప్పటికైతే. అందుకే హడావుడిగా దొరికిన డబ్బు చేత పుచ్చుకుని కొండపల్లి బయలుదేరాను సాయంత్రం.
'ఈ పది రూపాయల నోటు మార్చలేకపోతే ప్రాక్టికల్ గా నేను పనికిరాని వాడి కిందే లెక్క.
ఇంటర్లో సంపాదించుకున్న ఫస్ట్ క్లాసు ఇందుకు ఉపయోగిస్తుందా?'
రకరకాల ఆలోచనలు... కొన్ని ఆచరించలేనివి.
కొన్ని ఆచరించగలిగినా అంతరాత్మ ఒప్పుకోనివి. 'రిక్షా బేరం చేసుకొని కొంత దూరం పోయి ఈ నోటు ఇస్తేనో ?
తీసుకోక చస్తాడా? పాపం! కష్టజీవి!
గుడ్డివాడి బొచ్చెలోవేసి చిల్లర తీసుకుంటేనో!
పదిరూపాయల చిల్లర బొచ్చెలో ఉండదు. అలా తీసుకోవడం ద్రోహం' కూడా!
ఆలోచనలతో బుర్ర వేడెక్కడమే కాని, ఫలితం లేదు.
ఎదురుగా లీలా మహల్లో ఏదో ఇంగ్లీషు సినిమా. రష్ గా ఉంది. 'పోనీ అక్కడ కౌంటర్ లో ట్రై చేసి చూస్తేనో! ఆ హడావుడిలో వాడు నోటు చూడవచ్చాడా!'
రు. 20 కౌంటర్ లో అరగంట నిలబడిన తరువాత కౌంటరు ముందు కొచ్చాను. నోటు తీసి కౌంటర్లోకి తోస్తుంటే గుండె గుబగుబలా ఉంది.
ఇందాక టీ స్టాలు ముందు ఏమీ అనిపించలేదు. అప్పుడు నోటు సంగతి తెలీదు.
ఇప్పుడు తెలుసు. మోసం... మోసం ... అని అంతరాత్మ ఘోషిస్తూనే ఉంది.
'ఇందులో మోసం ఏముంది? దొంగనోటు కాదు గదా నేనిచ్చేది!' అని మరో వైపునుండి సమర్థన.
' ఈ నోటు పోదు' అనేశాడు కౌంటర్లో మనిషి కర్కశంగా
గభాలున చెయ్యి బయటకు తీసేసుకుని మొహం చూపకుండా హాలు బయటకు వచ్చేశాను.
'ఇంక ఈ నోటును మార్చటం నా వల్ల కాదు. కొండపల్లిదాకా నడిచి పోవడమొక్కటే మార్గం. లేదా.... బెగ్గింగ్...'
' ఛీ...చీ... ! నా మీద నాకే చచ్చే చిరాకుగా ఉంది.
'టికెట్ కావాలా సార్!' అని పక్క కొచ్చినిలబడ్డాడు ఓ కుర్రాడు.
పదిహేనేళ్ళుంటాయి. వాడు వేసుకొన్న పట్టీ బనీను మాసి , చినిగి, ముడతలు పడి అచ్చు నా వదిరూపాయల నోటు లాగే ఉంది.
' 2 - 20 .. ఫోర్ రుపీస్...2-20 . ఫోర్ రుపీ స్ . అని మెల్లగా గొణుగుతున్నాడు.
బ్లాకులో టిక్కెట్లు అమ్ముతున్నాడని తెలుస్తూనే ఉంది'
' పోనీ నాలుగు రూపాయలకు టిక్కెట్టు కొంటే ! ఆరు రూపాయలన్నా మంచివి వస్తాయి. కొండపల్లిదాకా వెళ్ళవచ్చు. ఎందుకైనా మంచిది ముందే నోటు సంగతి చెప్పి ఇవ్వటం....'
నోటును చూసి ' అయిదు రూపాయ లిస్తాను. సార్!' అన్నాడు ఆ కుర్రాడు.
నా అవసరాన్ని కనిపెట్టాడు-అవకాశాన్ని ఉపయో
గించుకుంటున్నాడు. అసాధ్యుడు!
జంకూ గొంకూ లేకుండా తెలిసి తెలిసి ఇలాంటి పరమ చెత్త నోటును తీసుకోవటానికి చాలా సాహనం కావాలి. అందులోనూ ఒక రూపాయి కాదు, రెండు రూపాయలు కాదు... పది రూపాయలు... అతని స్తోమతకు అది చాలా ఎక్కువ.
టికెట్ ప్లస్ అయిదు రూపాయలు ఇచ్చాడు. వది
రూపాయల నోటు అందుకొని.
అడగకుండా ఉండలేకపోయాను.' ఈ నోటును నువ్వెలా మారుస్తావోయ్?'
' అదంతా ట్రేడ్ సెక్రెట్, సార్!' అని నవ్వా డు.
' చెబితే రూపాయి ఇస్తా!'
' అయితే, చెప్పను. మీ కంటిముందే మార్చి చూపిస్తా... రెండు రూపాయ లిస్తారా?' అన్నాడు. సవాల్ గా .
ఎలాగూ నాకీ అయిదు రూపాయలు తిరిగి చీరాల పోను సరిపోవు. కొండపల్లిలో ఎలాగూ తంటాలు పడాల్సిందే. సరే. మరో రూపాయి పారేసి ప్రపంచజ్ఞానం నేర్చుకుంటే పోయేదే ముంది.. ఆ జ్ఞానం నాకు లేనప్పుడు!
ఒప్పుకున్నాను.
ఫుట్ పాత్ మీద అడుక్కునే గుడ్డి తాత దగ్గర పాత నోటు మదుపు పెట్టి ఎనిమిది రూపాయలు తెచ్చాడు.
నన్ను కూడా వెనక నిలబెట్టి రెండు సినిమా టిక్కెట్లు కొన్నాడు.
చూస్తుండగానే పది నిముషాల్లో ఆ టికెట్లను రెట్టింపు రేటుకు గిట్టించేశాడు. పావు గంటలో అరు రూపాయలు లాభం... అదీ పాత పనికిరాని నోటు పెట్టుబడితో! ....
' అడుక్కునే తాతకు ఆ నోటు మారదు. నువ్వు
పాపం గుడ్డి తాతను మోసం చేశావు' అన్నాను.
' అందరి విషయం మన కనవసరం, సార్! మన పనేదో మనం చూసుకోవాలి. అడిగారు గనుక చెబుతున్నా. తాతకు బాంకులో అకౌంటుంది. ఏ నోటు ఇచ్చినా తీసుకుంటారు. వాడికి రెండు రూపాయలు లాభం. నాకు అయిదు రూపాయలు లాభం... మీకు పని జరిగింది...'
' ఇంత తెలివైన వాడివి మరెందుక నిలా రోడ్లు పట్టావు! ? '
అని అడగకుండా ఉండలేకపోయాను బెట్ పెట్టిన రెండు రూపాయలు అందిస్తూ ఒక రకమైన అడ్మిరేషన్ తో.
వాడు నవ్వాడు మిస్టీరియస్ గా. 'మా అయ్య నన్ను తన్ని తగలేశాడు చదూకోటల్లేదని, ఎందుకూ పనికిరానని...'
ఉలిక్కిపడ్డాను నేను.
పనికిరాని వాడు.... అతనా?...నేనా??...
ఎవరు? వాడు చదువుకోలేదు. కనక భేషజం లేదు.
నేను చదువుకున్నాను. కనక భేషజం నన్ను చొరవ చెయ్యనియ్యలేదు. .
మంచికీ చెడుకూ కూడా పనికిరాని ఈ చదువు పనికిరాని వాడుగా తయారు చేస్తుంది నన్నే...
ఇంకా నాలాంటి వాళ్లు ఎందరో...!
- రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఆంధ్రప్రభ వారపత్రిక - 03 -07 - 1985 సంచికలో ప్రచురితం )
No comments:
Post a Comment