Showing posts with label Collections. Show all posts
Showing posts with label Collections. Show all posts

Sunday, December 19, 2021

ఉప్పూ - మానవ సంబంధాలు - శ్రీరమణ ( గుత్తొంకాయకూర- మానవసంబంధాలు - నుంచి ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు



ఉప్పూ - మానవ సంబంధాలు


- శ్రీరమణ

 ( గుత్తొంకాయకూర- మానవసంబంధాలు - నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 


" నీ ఉప్పు తిని నీకు అన్యాయం చేస్తానా" అనేది చాలా పాప్యులర్ సామెత. “వాడి ఉప్పు తిని "నీ వాడికే అన్యాయం చేశాడు" అని రోజూ వినిపిస్తూ వుండే సత్యం. అందుకని ఉప్పుతో ముడిపడి బోలెడు మానవ సంబంధాలు వున్నాయి. 


మరీ పిచ్చి కోపం వస్తే "ఉప్పుపాతర వేస్తా!  నా సంగతి సాంతం నీకు తెలియదు" అనడమూ కద్దు. మనిషి జీవనానికి "ఉప్పుతో పదహారు తప్పని అవసరాలు" గా  అప్పటి మనిషి గుర్తించాడు. ఇందులో మళ్లీ ఉప్పు ప్రాధాన్యతను మనం గమనించాలి. 


మనిషి నేల, నింగి, సముద్రం, కొండ, కోన అన్నిటినీ శోధించి తనకు కావల్సినవి నిర్మొహమాటంగా లాగేసుకోవడం అనాది నుంచీ అవలంబిస్తున్నాడు. సముద్రంలో నీళ్లు ఉప్పు ఖనిజాన్ని కషాయాలుగా వున్నాయని తెలిసి, ఉప్పు కూడా వొక రుచే అని గ్రహించాడు. అక్కడ నుంచి సముద్రానికి  ఏతం వేసి ఉప్పును పండించడం మొదలుపెట్టాడు. ఉప్పును తయారు చేయడాన్ని ' ఉప్పు పండించడం'  అంటారు. అంటే దీనిని పంటగా భావించారు. మానవ సంబంధాలు చాలా గట్టివని దీనినిబట్టే అర్థం అవుతోంది. 


" ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు ..." అన్నాడు సుమతీ శతకకారుడు. "ఏటికేతామెత్తి ఎన్ని పుట్లు పండించినా గంజిలో ఉప్పెరుగుమన్నా..." అని శ్రమజీవులు గుండెలు పిండేలాగా పాడారు. "ఉప్పు మెప్పు కోరేటోల్లు తప్ప వొప్పు చేసేటోల్లం" అని మనిషి సహజ లక్షణాన్ని చెబుతూ, అందులో ఉప్పు పాత్రని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఉప్పు కారం తినేవాళ్లకు రోషం భాషం వుంటుందని వొక నమ్మకం.  ఉప్పు లేని పప్పు చప్పుగా చస్తుంది అన్న నిజాన్ని "కట్టుకున్న పెళ్లాంలా" అని పొడిగించాడు.


ఏ వంటకంలో ఎంత ఉప్పు వెయ్యాలో నలుడికి తెలుసు .. భీముడికి తెలుసు. అసలు పాకశాస్త్రం పురుష కళ. క్రమేపీ పురుషుల నుంచి ఆ కమ్మటి కళ చేజారి స్త్రీల హస్తగతం అయింది. అక్కడ నుంచి వారి చేతులు వడ్డించేవి అయినాయి. పైచేయి కూడా అయింది ఆటోమేటిక్ గా. 


వంటకాల తయారీ గురించి రాసేటప్పుడు ఉప్పు దగ్గరకు వచ్చేసరికి “తగినంత”గా అని వొక మాట వాడతారు. అక్కడే వుంది తిరకాసు. మిగిలినవన్నీ కొలతలు, తూకాలు చెప్పి, ఉప్పు విషయంలో తేల్చకుండా తగినంత అనడంలో ఫార్ములా ముడి విప్పకుండా దాటివేయడమే! ఇలాంటి చోట మానవ సంబంధాలు సఫర్ అవుతాయి తప్పదు. శ్రీశ్రీ "ఇతరేతర’ శబ్దం లాంటిదే ఇక్కడ “తగినంత" అన్నమాట. ఇంతటితో యీ ప్రస్తావన ముగించకపోతే "ఉప్పు పత్రి కాకుండా” నన్ను తిట్టే ప్రమాదం వుంది. 


ఉప్పు దిగతుడిస్తే జనదిష్టి పోతుందిట. పూర్వం ఉప్పు కల్లు, కల్లుప్పు అని వ్యవహరించేవారు. కల్లు అంటే రాయి అని అర్థం. "తిరగలి కల్లు" అంటే తిరిగే రాయి అని అర్థం. ఈ శబ్ద చర్చని మరీ తిప్పితే మానవసంబంధాలు పిండి పిండి అయిపోయే అవకాశం వుంది. 


రాత్రి పూట "ఉప్పు" అనకూడదట! "దీపాలు ఆరిపోతాయ్" అని చెప్పేది మా నాయనమ్మ. అందుకని చవి, రుచి, లవణం, బుట్టలోది అని దీపాలు ఆరకుండా ఛాందసులు జాగ్రత్త పడేవారు. ఉప్పు చేతిలో వెయ్యకు గొడవలు వస్తాయని పెద్దవాళ్లు చెప్పేవారు. అంటే మానవ సంబంధాలు చెడిపోతాయనే. దానివెనుక శాస్త్రీయ లక్ష్యం గురించి హేతువాదులు తర్కించుకుని ఏకాభిప్రాయానికి రావాలి. వారి శాస్త్రీయ పరిశోధనలను సామాన్య మూఢులకు అందించి పుణ్యం కట్టుకోవాలి. హేతువాదులు పుణ్యాన్ని, అదృష్టాన్ని నమ్మరు, కాని అనుభవిస్తారు. అసలు కరెంటు దీపాలు వచ్చాక ఉప్పు అన్నా ఉఫ్ అన్నా కొండెక్కే అవకాశం లేదని వాళ్లు వాదిస్తారు. 


ఉప్పు మీద బోలెడు సామెతలున్నాయి. చెమట కన్నీళ్లు ఉప్పగా వుంటాయి. శ్రమ, దుఃఖం యీ రెండూ మానవ సంబంధాలకు సంబంధించిన వస్తు సామగ్రిలో ప్రధానమైనవి. 'అడవిలో ఉసిరికాయ, సముద్రంలో ఉప్పు- కలిస్తే ఊరగాయ" అంటుంటారు. దీని వెనుక మొత్తం భారతీయ తత్వశాస్త్రమంతా యిమిడి వుంది. భార్యాభర్తల సంబంధం వుందనుకోండి. అమ్మాయి అమలాపురంలో పుట్టి పెరుగుతుంది. అబ్బాయి అట్లాంటాలో గ్రీన్ కార్ట్ హోల్డరు. వాళ్లిద్దరికీ పెళ్లి అవుతుంది. జాడీలో పడతారు. యిలాగ వివాహ వ్యవస్థకు ఆపాదించుకోవచ్చు. అలాగే పి.వి. ఆంధ్రాలో పుట్టి, పెరిగి రాంటెక్లో నిలిచి గెలిచి ప్రధాని కావడం వుందనుకోండి. ఇక్కడ పి.వి. వుసిరికాయ. రాంటెక్ వోటర్లు ఉప్పురాళ్లు. ప్రధాని పదవి ఊరగాయ- మిగిలిన యీక్వేషన్లు, కొటేషన్లు మీరు పూరించుకోండి. 


నిజం. ఒక పెళ్ళిలో వియ్యంకుడికి వడ్డించిన వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైందని పెద్ద గొడవ అయింది. ఆడపెళ్లి వారు క్షమాపణ చెబితే గాని లాభం లేదనీ, పీటల మీద పెళ్లి ఆగిపోతుందనే దాకా వచ్చింది. చివరకు పెద్ద మనుషులు కల్పించుకుని, మళ్లీ యిన్ని వంకాయ ముక్కలు వుడికించి కూరలో కలిపి, సరిపోయిందనిపించారు. అప్పుడు గాని పెళ్లికొడుకు తండ్రి కుదుట పడలేదు. 


మన ప్రాచీన వేదాలు జాగ్రత్తగా చదివినట్లయితే “ఉప్పు”కి వొక అధిష్టాన దేవత వున్నట్లు స్పష్టం అవుతుంది. ఆవిడ నివాసం సముద్రం. దేవతలు రాక్షసులు మంధరగిరిలో  క్షీరసాగరాన్ని మధించినపుడు ఆమెకు కోపం వచ్చింది. అంతటి చరిత్రాత్మక సన్నివేశం తన వద్ద కాకుండా క్షీరసాగరంలో చేశారని ఖిన్నురాలైంది. "నేనే కనుక పతివ్రతని అయితే నా వొక్క కల్లుతో కడివెడు క్షీరము విరిగిపోవు గాక" అని శపించింది. ఆవిడ నిజంగానే పతివ్రత అవడం వల్ల యిప్పటికీ శాపం అమలులో వుంది. 


ముఖ్యంగా భారతీయులకు, ఉప్పుతో వున్న సంబంధం యింకెవరికీ వుండదు. దండి సత్యాగ్రహం, అదే ఉప్పు సత్యాగ్రహం. ఉప్పుమీద తెల్లదొరలు పన్ను వేశారని ఆగ్రహించాం. ప్రస్తుతం అదే ఉప్పు నల్లదొరల పాలనలో పెట్టుబడిదారులకు రహదారి అయింది. కోట్లాది రూపాయల వ్యాపారం నడుస్తోంది. ఇప్పుడు ఉప్పు రైతులు లేరు సాల్ట్ కింగ్స్ తప్ప. వీటన్నిటి వెనుక వున్న మానవ సంబంధాలను మీరు గుర్తించాలి. 


రక్తపోటు వున్న వాళ్లు ఉప్పు తగ్గించాలంటారు. ఏదైనా లోగుట్టు చెబితే ఉప్పు అందించాడంటారు. కొన్ని పేపర్లూ ఉప్పు అందించమని పాఠకులను కోరుతూ వుంటాయి. కొందరు అందిస్తూనే వుంటారు. బయట పడిందంటే మానవ సంబంధాలు బాగా చెడిపోతాయి. 


బాల్యంలో ఉప్పు అద్దుకుని మామిడి పిందెలు తిన్నాం. పెద్దయ్యాక ఖరీదైన బార్ కు  వెళితే చేతిమీద గంధం రాసినట్టు తడి ఉప్పు రాసి, “యిది తాగుతూ మధ్య మధ్య నాలికతో దానిని రుచి చూడండి" అన్నాడు. ఏమిటిది అంటే “చకిటా” అంటే యిదే అన్నాడు బార్ వాడు. 


కస్తూరిబాకి బి.పి. వుంటే వైద్యుడు ఉప్పు వాడద్దని చెప్పాడట. ఆమె మాత్రం మానెయ్యలేక మామూలుగానే తింటోంది. ఆ సంగతి తెలిసి గాంధీజీ వుప్పు మానేశారు. చప్పిడి తినడం మొదలు పెట్టారు. ఆవిడ లబోదిబోమని వెంఠనే ఉప్పుకి స్వస్తి చెప్పిందిట. ఇవన్నీ ఉప్పుతో మానవ సంబంధాలు కాదూ!


విశ్వనాథ సత్యనారాయణవి విచిత్రమైన అలవాట్లు. సాయంత్రం నలుగురు మిత్రులనో శిష్యులనో వెంట వేసుకుని కూరల మార్కెటుకు  వెళ్లడం వొక ఆటవిడుపు. అక్కడ మసాలా దినుసుకి నిలువుగా కోసిన వొక కొబ్బరి ముక్క రెండు పచ్చి మిరపకాయలు, ఇంటి దగ్గర్నించే గుర్తుగా తెచ్చుకున్న చిటికెడు ఉప్పు నోట్లో వేసి రుబ్బేవారుట. ఆయనకు కొబ్బరి పచ్చడి తిన్నట్లు వుండేది. మరి జిహ్వ అంటే అదీ జిహ్వ!


- శ్రీరమణ ' ( గుత్తొంకాయకూర- మానవసంబంధాలు - నుంచి ) 


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

19-11-2021 ; బోథెల్ : యూ ఎస్ ఎ


Tuesday, December 14, 2021

తెలుగు పాత్రికేయం సమానార్థకాలకు ప్రయత్నలోపం - సి. రాఘవాచారి -- సేకరణ- కర్లపాలెం హనుమంతరావు

తెలుగు పాత్రికేయం

సమానార్థకాలకు ప్రయత్నలోపం

- సి. రాఘవాచారి

-- సేకరణ- కర్లపాలెం హనుమంతరావు 

తెలుగు పత్రికల భాషాసేవ అనన్య సామాన్యమైనది. వివిధ రంగాల్లోని సమాచారాన్ని పాఠకులకు తెలియజేయడంతో పాటు తెలుగుభాషా వికాసం కూడా పత్రికల కర్తవ్యంలో భాగంగా ఉండేది. వార్తాసంస్థలు ఇంగ్లీషులో పంపించే వార్తలను అనువాదంచేసి, ప్రచురించేటప్పుడు  సాధ్యమైనంతవరకు తెలుగు పదాలే వినియోగించాలని ఒకనియమం స్వచ్ఛందంగానే పాటించడం జరిగేది. దానిని నియమం అనడంకన్నా స్వభాషపట్ల అనురక్తిగా చెప్పడం ఇంగ్లీషు పదాలకు సమానార్థకాలు సృష్టించడం, అవి ప్రజలకు సులభంగా అర్థమయ్యేరీతిలో రూపొందించడం ఆరోజుల్లో సంపాదకవిభాగంలో పనిచేసేవారి ప్రాథమ్యంగా ఉండేది. కొత్తపదం వచ్చినప్పుడు మక్కికి మక్కి కాకుండా అర్ధాన్ని బట్టి, తెలుగులో సులభంగా అర్ధంగ్రహించటానికి వీలయ్యే సమానార్థకాన్నే స్థిరపరచి వాడేవారు. తెలుగును అధికారభాషగా ప్రకటించిన తరువాత ఈ ప్రయత్నంపట్ల ఉండాల్సిన శ్రద్ధాశక్తులు ఏ కారణంతో లోపించినా విచారకరం.


తెలుగుపాత్రికేయుల్లో సంపాదకులతోపాటు అనుభవజ్ఞులైనవారు ఈ విషయమై ఆవేదన పడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లీషు అనేకాదు, సంస్కృతం, ఉర్దూ పదాల వెల్లువలో తెలుగుభాష తన స్వరూపాన్ని పోగొట్టుకుంటున్నదా అనే బాధ సహజం. అవసరమైనప్పుడు అన్యభాషా పదాలు బాగా ప్రచారంలో ఉన్నవయితే వాటిని తెలుగుభాష విసర్గ సౌందర్య సౌష్టవాలు చెడకుండా వాడడంలో ఆక్షేపణలకు తావుండరాదు. కానీ, ఇప్పుడు జరుగుతున్నది అదికాదు. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రమున్నట్లు ఇంగ్లీషుపదాలు శీర్షికల్లోనూ, వార్తల్లోనూ విశృంఖల స్వైరవిహారం చేస్తున్నాయి. సమస్యను పరిష్కరించడానికి పాత్రికేయులతోబాటు విశ్వవిద్యాలయాలు, వివిధ అకాడమీలు (ప్రత్యేకించి ప్రెస్ అకాడమీ) కలిసి ప్రయత్నిస్తే సమానార్థకాలసృష్టి అసాధ్యమేమీకాదు. తెలుగుభాష సమయ సందర్భాలనుబట్టి అన్యభాషాపదాలను స్వీకరించడానికి అనువైనది. ప్రాచీన సాహిత్యంనుంచి నేటి పత్రికలభాష వరకు వెయ్యేళ్ళచరిత్ర ఈ విషయాలను నిరూపిస్తోంది. గతంలో తెలుగుపత్రికలకు తెలుగులోనే వార్తలు పంపాలని విధిగా ఆదేశాలున్నరోజుల్లో సమానార్థకాలకోసం విలేకరి కొంత ప్రయాస పడాల్సివచ్చేది. కానీ ఆ ప్రయాస ఫలప్రదంగా

భాషకు, విలేకరి భాషాభివృద్ధికి తోడ్పడుతుండేది. 


అప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తరువాత కూడా ఇంగ్లీషు పదాల వాడకం పెరగడం ఒక విచిత్రమైన వైవిధ్యం, 

గతంలో వలె పత్రికల్లో రాజకీయాలకు పరిమితం కాకుండా, ఈ రోజు అనేక శాస్త్ర విజ్ఞాన విషయాలకు సంబంధించిన వార్తలను పాఠకులకు అందజేయడం విరివిగా పత్రికల్లో అదాజేయడం జరుగుతున్నది. పత్రికలలో ఉండే సహజమైన వత్తిళ్ల  కారణంగా పారిభాషక పదాలకు సమానార్థకాల ఇబ్బందితో కూడుకున్నప్పటికీ, ఆ కారణంతో అన్యభాషాపదాలను అదేపనిగా ఉపయోగించడం సరైనదికాదు. పరిభాష వెనుకఉండే భావాన్ని - సమానార్థకాలు స్వీకరించే సదవకాశం ఎక్కువ. సోవియట్ యూనియన్ లో గోర్బచెవ్  సంస్కరణలుగా 'గ్లాస్ నోస్త్ ', 'పెరిస్త్రోయికా' అనేపదాలు విరివిగా వార్తల్లో వచ్చేవి.  వాటికి  స్థూలంగా దగ్గరైన  'గోప్యరాహిత్యం', 'పునర్వ్యవస్థీకరణ' అనేపదాలు తెలుగులో వాడినందువల్ల పాఠకులు సులభంగా గ్రహించేపరిస్థితి ఉండేది. ఏదైనా సమానార్థకంకన్నా అన్య భాషా  పదమే పాఠకులకు అర్థమవుతుందనుకుంటే అది వినహాయింపు తప్ప సూత్రం కారాదు.


పారిభాషిక పదాలకు తెలుగులో సమానార్థకాలు రూపొందించడం లక్ష్యంగా తెలుగు అకాడమీవంటి సంస్థలను ఏర్పాటుచేశారు. శాసన, పరిపాలనా సంబంధమైన పదాలకు స్పష్టమైన ప్రసిద్ధమైన సమానార్థకాలు రూపొందించినప్పటికీ వాటివినియోగం పత్రికల ద్వారా ఆశించినంతగా లేకపోవడం బాధాకరమే. ఉదాహరణకు 'టాక్స్'ను తీసుకుంటే దానికి పన్ను' అని రాస్తుంటాం. అంతేగాకుండా సెస్సు, డ్యూటీ, లెవీ అనే బడ్జెట్ పారిభాషిక సాంకేతికార్థం భిన్నంగా ఉంటుంది. అయినా పైసంస్థలు రూపొందించిన పదాలకంటే ఎక్కువగా పాఠకులకు  ఆమోదయోగ్యమైనవాటిని పత్రికలు తమకుగా తాము సృష్టించుకుంటే అభ్యంతరం ఉండరాదు . ఆ ప్రయత్నం లేకపోగా సమానార్థకాలపట్ల అలసత్వం, తేలికభావన చోటుచేసుకోవడం విచారించదగిన విషయం.


జన వ్యవహారంలో అలవాటుపడిన అన్యభాషా పదాలు అన్ని భాషల్లోనూ ఉంటాయి. వాటికి భాషా ఛాందసం జోడించి విశ్వామిత్ర సృష్టితో సమానార్థకాలు రూపొందించాల్సిన పనిలేదు. ఒకవేళ అలా సృష్టించినా అవి ఆమోదయోగ్యత పొందడం కష్టం. తెలుగుమాత్రమేవచ్చి అన్ని రంగాలకు చెందిన సమాచారాన్ని పత్రికలద్వారా తెలుసుకోవాలనుకొనే పాఠకుడు ప్రమాణంగా ఉండాలి. తెలుగు పత్రిక చదవటానికి మరో రెండుభాషల పరిచయం అర్హతగా ఉండాల్సినస్థితి అపహాస్యభాజనం. బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో అధికారభాషాయంత్రాంగం నిర్వహించిన కీర్తిశేషులు పి.వి. నరసింహరావు, పరిపాలనారంగంలో తెలుగు వినియోగంపై శాసనసభలో శ్వేతపత్రం (వైట్‌ పేపర్) ప్రకటించినప్పుడు అందులోని సమానార్థకాలపట్ల పత్రికల్లో పెద్దవిమర్శ సాగింది. 


ఒక ప్రసిద్ధసంపాదకుడు అయితే ధారావాహిక సంపాదకీయాల్లో భూరాజసము (ల్యాండ్ రెవిన్యూ) లాంటి పదాలను ఉటంకించి ప్రత్యాఖ్యానం వెలువరించారు. దీనికి స్పందించి నరసింహారావుగారు తెలుగురాక మరిన్ని భాషలు చదివినవారు తెలుగు భాషాభివృద్ధికి ఆటంకమని చెప్పినదాంట్లో అతిశయోక్తి ఉండవచ్చేమోగానీ ఇప్పటి స్థితినిబట్టి ఎంతో కొంత సరైన ప్రతిస్పందన అనిపిస్తోంది.


ప్రస్తుతం తెలుగు పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో అవసరంలేకున్నా ఇంగ్లీషుపదాలు వాడటం ఎబ్బెట్టుగా తోస్తోంది. అచ్చమైన తెలుగుమాట దేవుడెరుగు, అసలు ఇంగ్లీషుమాటలు వాడితేనే అదేదో శ్రేష్ఠమన్న భావన చోటు చేసుకున్నది. ఒక పత్రికలో గతంలో పతాకశీర్షికల్లో కూడా భారత్ బదులు ఇండియా అని వాడేవారు. అది అప్పుడు చివుక్కుమనిపించినా ఇప్పటి పరిస్థితుల్లో కొంత మేలేమో అనిపిస్తోంది.  ప్రాంతీయ ప్రత్యేకతలను బట్టి భాషలో అక్కడికక్కడే అర్థమయ్యే పదాలు ఇతరత్రా వాడినందువల్ల గందరగోళం తప్ప మరేమీ

ఉండదు, 

కోస్తా ప్రాంతాల్లో వెలువడే ఎడిషన్లలో 'షురూ' అనే ఉర్దూ పదం కనిపిస్తోంది. ఏమైనా ఏ భాషపట్ల వ్యతిరేకత అక్కర్లేదుగానీ, మనభాషను సుసంపన్నం చేసుకోవడం అభిలషణీయం. ఈ అంశంపై పాత్రికేయుల్లోనే ఆత్మపరిశీలన అవకాశం కల్పించడం ద్వారా మిత్రులు టంకశాల అశోక్ ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో జర్నలిస్టులు, ప్రెస్ అకాడమీ, వివిధ విశ్వవిద్యాలయాల్లోని జర్నలిజం శాఖలు భాగస్వాములైతే ఆ ఫలితం అందరికీ చెందుతుంది.

( ' వార్త' 15-06-05- ఆధారంగా ) 

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                   07-11-2021

వ్యాసం మన ఆట పాటలు - మలపాక వేంకటాచలపతి సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

వ్యాసం 

మన ఆట పాటలు 

- మలపాక వేంకటాచలపతి 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 


విద్యావిధానంలో మన తండ్రుల కాలము, మన కాలములలోపుగ నే అనేక మార్పులు వచ్చాయి. దినమూ వస్తూనే ఉన్న విద్యాబోధకులకు ఒక టే సమ స్య' శేష ప్రశ్న' గా ఆదినుంచి వస్తూంది "బాల బాలి కల దృష్టి చదువువైపు చెదరకుండా నిల్పడ మెట్లా?" ఆని. 


పశ్చిమ దేశాల్లో విద్యాసంస్కర్తల రూసో కాలం నుంచి క్రొత్తమార్గాలు త్రొక్కినారు. దాని ఫలితంగా బాలుడు అభివృద్ధిపొందని వృద్ధుడు కాడనీ, అతని మన స్పతికోమలమనీ, సామాన్యమానవునకుండే రస వికారాలు  అతనికి లేవనీ తెలియబడ్డది. అందుచేత పశ్చిమదేశాల్లో బాలుని కఠినపరీక్షలకు గురిచేసే విద్యా విధానము మార్చబడి, బాలుని మనోగత అభిప్రాయా లు, ఐచ్ఛికముల ననుసరించి విద్యాబోధన ప్రారంభింప బడింది. 


కాని 'ఫ్రీబెల్' అనే ఆయన కాలమువరకు ఆటపాటలకు విద్యావ్యాప్తిపైగల    ప్రభావము గుర్తింపక బడినట్లు కన్పడదు. ఇతడు బిడ్డలకు సహజమును, నైసర్గికమునగు ఆటద్వారా విద్యను నేర్పవచ్చునని గ్రహించెను. ఇతడే మొదట 'ఆటపాటల'ను (Play_ Songs) వ్రాసి ఆటవస్తువులను తయారు చేసి పిల్లలకు విద్య ప్రారంభించాడు. ఇతని కాలమునుంచి కిండర్ గార్ట్ (Kindergarten) పద్ధతి ప్రాముఖ్యత వహించి విద్యాసంస్కర్తల అభిమానపద్ధతి ఆయ్యెను.


మన ఆంధ్రదేశములోకూడ ఈ ఆటపాటలు ఆనాదినుంచి ఉన్నవి. కాని వాటి విలువ గ్రహించినట్లు కన్పడదు. దీనినిబట్టి చూస్తే 'ఫ్రీబెల్' యొక్క పద్ధతి క్రొత్తది కాదని తెలుస్తుంది.


విద్య యొక్క పరమావధి మానవవికాసమని మన వారూ, పాశ్చాత్యులూ అంగీకరించిన విషయమే. విద్య మానవునికి సంపూర్ణత్వ మిచ్చేదని చాలమంది ఒప్పుకుంటారు. అట్టి సంపూర్ణత్వముకోసమే మన ఆచారవ్యవహారాలలో, నోములలో, వ్రతములలో, చిన్నప్పటి ఆటపాటలలో, తల్లి శిశువు నోదార్చే జోలపాటలలో విద్యాతత్త్వ మిమడ్పబడి ఉన్నది.


'ఫ్రీబెల్' (Froebel) తన ఆటపాటల్ని శిశువు యొక్క మొదటి సంవత్సరాన్నించి ఆరవ సంవత్స రమువరకు వ్రాశాడు. అతని ఉద్దేశము బిడ్డల్ని సరిగా పెంచగల తల్లులే ఈ ఆటపాటల్ని ఉపయోగించగలరని. కాని ఆట అనేక రూపాలతో వృద్ధులవరకు అభివృద్ధి చెందిఉన్నది. ఆబాలగోపాలము ఆనందించగల ఆట 'నాటకము' __కవియొక్క, సాహిత్యము యొక్క తుది ఫలము. ఆట ఏవిధముగా బాలకుణ్ణి ప్రభావితుణ్ణిగా చేస్తుంది నాటకముకూడ.  అట్లాగే అందర్నీ ప్రభావితుల్ని చేయగలదు. 


శిశువు ఆటలను, పాటలను సులువుగా అనుకరించగలదని మనస్తత్వజ్ఞులు తెలుసుకున్నారు. ఆవేశపూరితమైన బాల్యము, అచిరకాలమునకు పూర్వమే  నిత్యానందమయ స్వర్గలోకము ఆనందలహరిని ఆమృతమయ గాన, నృత్యములతో రెట్టించి రెట్టించి పాడి తన భావాన్ని వ్యక్తపరుస్తుంది. తండ్రి శిశువుకు కొంచెము బిస్కత్తు పెట్టినపుడు “ఇంకా కావాలీ ఈ, ఈ" అని రాగము తీస్తూ కాళ్లగజ్జెలు ఘల్లును నేటట్లు గంతులు వేస్తుంది శిశువు. ఇది అనుభవైక వేద్యము, ఇట్టి పిన్నవయసునందు  పాటలతో నేర్పబడిన జ్ఞానము, ఆటలతో నేర్పబడిన నడత చిరస్థాయి, ఆనందదాయకము. శిశువు లావేశపూరితులే కాకుండా, అనుకరణ బద్దులుకూడను. అతిచురుకైన వారి యింద్రియములూ, అంతకన్న నిశితమైన వారి మెదడూ చూడబడే విష యాల్నీ, చెప్పబడే జ్ఞానాన్నీ అతిసులువుగా గ్రహిస్తుంది. కనుక ఈకాలములో వారికి బోధపడే విజయాల్ని, అభిప్రాయాల్ని, నేర్చు లిషయాలని  తల్లిదండ్రులు పరిశీలిస్తూ తగుజాగ్రత్త  తీసుకోవాలి. కనుకనే ఈవయసున నేర్పబడు కథలు , ఆటపాటలు ఎట్టివి  ఉంచాలి అనేది విద్యాబోధకులు నిర్ణయించాలి. ఇప్పుడు మక ఆటపొటలలోని ప్రాశస్త్యాన్ని


మొదట మన తల్లులు  మనకు నేర్పే ఆటపాటలలో ఒకటి 'ఏనుగు పాట' . తల్లి తన శిశువును తన కాళ్లమీద కూర్చుండబెట్టుకుని

" ఏనుగమ్మ ఏనుగు ఏవూరు  వచ్చింది ఏనుగు ఉప్పాడ వెళ్లింది. ఏనుగు ఉప్పునీరు త్రాగింది ఏనుగు చూపూరు వచ్చింది ఏనుగు మంచినీరు త్రాగింది ఏనుగు' అని పాడుతూ  శిశువు యొక్క మెడ పట్టుకుని ముందుకు నెట్టుతుంది; శిశువు కాళ్లు బిగదన్ని మరల వెనుకకు వస్తుంది. ప్రారంభదశ దాటగానే ఈ పాట వివడం తడవుగా శిశువు  ముందుకూ వెనకకూ ఊగటం ప్రారంభిస్తుంది. ఇది ఒక శరీరోపాసన  (bodily exercise). ఏనుగు యొక్క సతతచలనగుణము ఈపాట లో యిమడ్చబడిఉన్నది.


పసిబిడ్డకు  మొదలుకొని పండుముసలికి వరకు  చంద్ర డాహ్లాదకరుడే. (ఒక్క విరహుల్ని మినహాయించాలి  కాబోలు!) సారస్వతంలో చంద్రుడు చాలా స్థానమాక్రమించుకున్నాడు. ఇట్టి చంద్రుణ్ణి తల్లి 

' చందమామ రావే జాబిల్లి  రావే 

కొండెక్కి రావే గోగుపూలు తేవె  నేన పసిడి గిన్నెలో పాలుపోసుకుని  వెండి గిన్నెలో పెరుగుపోసుకుని  ఒలిచిన పండు ఒళ్లో వేసుకుని ఒలవని పండు చేత్తో పట్టుకుని  అట్లా అట్లా వచ్చి అమ్మాయినోట్లో వేయవే ' అని పాడుతూ 'ఆం ' తినిపిస్తుంది. శిశువుకూడా తదేక ధ్యానంతో   చిట్టి చేతులతో 'చందమామ'ని చూస్తూ  అల్లరి చేయకుండా  'బువ్వ' తింటాడు . అన్నం తినేటప్పుడేకాకుండా చంద్రుడు కనపడినప్పుడు శిశివు తన చేతులతో పిలుస్తాడు. ఈ పాటవల్ల శిశువు క్రమంగా  సౌందర్యగ్రహణ శక్తి, ఊహ, ఆకాశమునందలి జీవులను  గూర్చి తెలుసుకోవాలనే ఆశక్తి, పెరుగుతుంది. తద్వారా భగవంతుని వైపు దృష్టి మరలడానికి  అనేక రకాల అవకాశాలు కలుగుతాయి . ఫ్రీబెల్ 'యొక్క మదటి బహుమానపు శరీరవ్యాయామము ఇక్కడ  కలుగుతుంది.


ఇదే వయస్సులో, అనగా రెండేళ్ల వయసులో  భోజన పదార్థాలు తెలిపే  'చక్కిలిగింత ' ఆట నేర్పవచ్చు. పప్పు పెట్టి, కూర వేసి , పిండివంటలు చేసి... అత్తారింటికి  ఇల్లా, ... అంటూ తల్లి తన చేతి వేళ్లని శిశువుల చేతినింది చంక వరకు  నడిపించి గిలిగింతలు పెడుతుంది.  


బిడ్డకి రెండేళ్లు వచ్చి బాగా  కూర్చోటం అలవాటైనతర్వాత 'కాళ్లాగజ్జా ' ఆట నేర్పవచ్చు. ఆ పొట యిది :


కాళ్ల గజ్జె- కంకాణమ్మ

వేగు చుక్క - వెలగ మొగ్గ 

మొగ్గ కాదు - మోతి నీరు 

నీరుకాదు - నిమ్మల వాయ 

వాయకాదు- వావిలి కూర 

కూరకాదు - గుమ్మడి మీసం 

మీసం కాదు - మిరియాలపోతు 

పోతుకాదు ' బొమ్మల శెట్టి

శెట్టి కాదు - శ్యామల మన్ను 

 మన్ను కాగు -మంచి గంధవు  చెక్క 


ఈ నలుగురైదుగురు  పిల్లలు వరుసగా కాళ్లు చాపుకుని కూర్చోవాలి .  ఒకరు పై పాటలోని ఒక్కొక్క పదానికి ఒక్కొకకాలే కొట్టుచూ    అందరి కాళ్లూ  వరుసగా తట్టుచూ వెనుకకు ముందుకు తట్టుచూ  ఉండాలి. 'మంచి గంధపు చెక్క' అని ఏ కాలిమీదికి వస్తే ఆ కాలం పండినట్లు.  పండిని కాలు ముడుచుకోవాలి. ఇట్లాఅందరి కాళ్లూ  పండేవరకూ ఈ పాట పాడుకూ ఉండాలి. ఈ ఆటపాటలో బిడ్డకి కొన్ని ఆభరణాల పేర్లు— గజ్జెలు, కంకణము, వేగుచుక్క, వెలగ మొగ్గ మొదలైనవి-  కాళ్లు  ముడుచుకొనుట అనేజ్ఞానం కలుగుతుంది. ఈ పాటలో వైద్య శాస్త్రము కూడా ఉన్న దని మనకు తెలుసు.


ఈ వయస్సుననే 'గుడుగుడు గుంచము' ఆట ఆడవచ్చు. ఈ ఆటకు నలుగురైదుగురు పిల్లలు కూర్చుండి ముడిచిన గుప్పిళ్లు ఒకదానిమీద ఒకటి పెట్టుదురు . దీనివల్ల వీరికి ఒకవిధమైన పరిమాణ స్వరూపం తెలుస్తుంది. ఈ ఆట 'కాళ్లగజ్జె ' ఆట కంటే పెద్దది. ఇక్కడ బాలునికి కత్తియొక్క పదును, బద్ద యొక్క చరును, వేణ్ణీళ్ల వేడి, చన్నళ్ల  చలి తెలుస్తుంది. పైగా వాక్యసరళి తోటి  పరిచయ మధికమవుతుంది. చేతులు వెనుకకు దాచుకుని పృచ్ఛ కుడు వేసే ప్రశ్నలకి బాలుడు సరియైన సమాధానం చెప్పటం నేర్చుకుంటాడు. ఉదాహరణకి ప్రశ్నలు, జవాబులు ఇట్లా ఉంటాయి: , నీ చేతులే మైనాయి ? - పిల్లెత్తుకుపోయింది. — పి కిచ్చింది.  పిల్లేమి చేసింది? ——కుమ్మరివాడి కిచ్చింది- 


ఇట్లా ఎన్నయినా ఆటపాటల్ని చెప్పవచ్చు. ప్రత్యేకముగా అడపిల్లలు అడ్డుకునే 'చింతగింజలు '  , ఆటలో 'గణితము' యొక్క ప్రారంభదశ ఉన్నది. ఇప్పటికిని 'కుచ్చెలు' (కుచ్చె-క) లెక్క మన ముస లమ్మల దగ్గర సజీవంగా ఉన్నది. ఇదో అంకెల పాట .  ఎంత బాగుందో చూడండి! 


“ఒక్క ఓ చెలియ

రెండు రోకళ్లు 

మూడు ముచ్చిలక 

నాలుగు నందన 

అయిదు బేడీలు 

ఆరు చిట్టిగొలును"


ఈవిధం గా పదివరకు లెక్కల పాట  ఉన్నది. ఆటపాటలతో కలిపి వైద్యశాస్త్ర మేవిధంగా గుచ్చెత్తారా  చూడండి! 


"కొండమీద – వెండిగిన్నె 

కొక్కిరాజు - కాలు విరిగ 

విరిగి విరిగి - మూడాయె.

దాని కేమి మందు?

వేపాకు చేదు 

వెల్లుల్లి గడ్డ 

నూ నెమ్మబొడ్డు

నూటొక్క  ధార

ఇంకా, ‘మాతృభావము’ అభివృద్ధి చేసే 'చిన్ని పిన్ని కెన్నో ఏడు —' అనే పాట చూడండి. దీనిలో పెళ్లి బేరాలు, నగలు పెట్టడాలు మొదలైనవి అద్భుతంగా వర్ణించారు.


ఈదృష్టితో ఆటపాటల్ని ఆంధ్రభాషలోవేగాక ఇతర హైందవ భాష ల్లోంచికూడా సేకరించాలని నా ఉద్దేశం. రాబోయ్ ‘Sargent Scheme of Educa_ tion' (సార్జెంటు విద్యాప్రణాళికలో)  కూడా శిశు విద్యాలయాల ప్రసక్తి ఉన్నదిగనుక మన శిశువిజ్ఞాన -విషయమై తగు శ్రద్ధవహించి మన పురాతన పాటల్ని సేకరించడమే కాకుండా క్రొత్తవికూడా సృజించి  జ్ఞానాభివృద్ధి కనేకవిధాల ప్రయత్నించవచ్చు.


- మలపాక వేంకటా చలపతి 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

( భారతి - మాసపత్రిక - తారణ చైత్రము ) 

Monday, December 13, 2021

తెలుగు సాహిత్యానికి పాశ్చాత్యుల సేవ కర్లపాలెం హనుమంతరావు ( మూలం - భాషా సాహిత్య స్వరూపం - డా॥ జె. చెన్నయ్య )










తెలుగు సాహిత్యానికి పాశ్చాత్యుల సేవ 

కర్లపాలెం హనుమంతరావు 

( మూలం - భాషా సాహిత్య స్వరూపం - డా॥ జె. చెన్నయ్య ) 




బెంజమెన్ షుల్జ్ - తొలి తెలుగు ముద్రాపకుడు


తెలుగులో తొలిసారిగా గ్రంథాన్ని ముద్రించి చరిత్రకెక్కిన బెంజమెన్ షుల్జ్ చిరస్మరణీయుడు. ఇతడు 1689లో జర్మనీలో జన్మించాడు. 1719 × తన 29వ ఏట దక్షిణ భారతదేశం వచ్చాడు. డెన్మార్క్ రాజు ఐదవ ఫ్రెడరిక్ పంపగా జర్మనీ నుంచి దక్షిణ భారతదేశంలోని తరంగంబాడికి క్రైస్తవ మత ప్రచారం కోసం వచ్చిన రెండవ జట్టు ఫాదరీల్లో షుల్జ్ ఒకరు. చెప్పులు సైతం లేకుండా నిరాడంబరంగా పాదచారిగా మత ప్రచారం చేశాడు. అనారోగ్య కారణాల వల్ల స్వదేశం తిరిగి వెళ్లిన తర్వాత కూడా తెలుగు టైపులు పోతపోయించి, తెలుగు గ్రంథాలు రచించి ముద్రించాడు. జర్మన్ లూథరన్ తత్త్వవేత్త జోహాన్ ఆర్నెడ్ (1555-1621) రచించిన నాలుగు గ్రంథాలను షుల్జ్ తెలుగులోకి హాలేలో ముద్రించాడు. 23 సంవత్సరాల ముద్రణారంగంలో శ్రమించాడు. స్వదేశం వెళ్లిపోయాక కూడా 17 సంవత్సరాల పాటు తెలుగు పుస్తకాలు ముద్రించాడు. స్వయంగా 'GRAMMATICA TELUGICA' (1728) పేర 8 ప్రకరణాల్లో తెలుగు వ్యాకరణం రచించాడు. దీనిని హాలే విశ్వవిద్యాలయం వారు భద్రపరచి 1984లో తొలిసారి ముద్రించారని ఆరుద్ర తెలియజేశారు.8 తమిళం, పోలీసు, డేనిష్ భాషల్లో 20 పుస్తకాలను ఆరేళ్లలో ముద్రించాడు. మద్రాసులో సెంట్ జార్జ్ కోటలో కుంపిణీ గవర్నరు ఒప్పించి భారతీయుల కోసం పాఠశాల పెట్టించడమే గాక అందులో తెలుగు విభాగాన్ని ప్రారంభించి పిల్లల్లో తానూ ఒకనిగా కేవలం రెండు నెలల్లో తెలుగు నేర్చుకున్నాడు. అంతేకాదు బైబిల్ను సాహసోపేతంగా తెలుగులోకి అనువదించి ముద్రించాడు. 1760 నవంబర్ 25న షుల్జ్ కన్నుమూశాడు.


K. జేమ్స్ గ్రాంటు - దేశీయ విద్యలపై దృష్టి


కుంపిణీ వారికి మన దేశంలో మొట్టమొదట వశమైనవి ఉత్తర సర్కారులు. ఈ ప్రాంతాల సంక్షిప్త రాజకీయ చరిత్రను, విపులమైన రెవెన్యూ చరిత్రను వ్రాసిన తొలి ఆంగ్లేయిడు జేమ్స్ గ్రాంటు నిజాం దర్బారులో బ్రిటిషు రాయబారిగా పనిచేశాడు. దేశీయ విద్యలు మూలపడ్డాయని, వాటిని ఉద్దరించాలని చెప్పాడు.


ఛార్లెస్ వైట్ - నిఘంటు నిర్మాణానికి అంకురార్పణ


సెంట్ జార్జ్ కోటలో సివిల్ సర్వెంట్ హోదాలో పనిచేసిన ఛార్లెస్ వైట్ తెలుగులో నిఘంటు నిర్మాణానికి 1793 ప్రాంతాల్లో అంకురార్పణ చేశాడు.మంచి నిఘంటువు తయారు చేసిన వారికి బహుమతులివ్వాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశాడు. అంతేకాదు తెలుగు నేర్చుకొనేవారికి ఉపయోగపడే ప్రాథమిక గ్రంథాలను రాయించాలని సూచించాడు. ఈయన సూచనవల్లే సెంట్ జార్జి కోట

పాలకులు మామిడి వెంకయ్య 'ఆంధ్ర దీపిక' హక్కులను కొన్నారని భావించవచ్చునని తెలుగు భాషా సారస్వతాల రంగాన్ని బ్రౌసు మహోజ్వల కాంతులతో నింపాడు. తెలుగు భాషా సాహిత్యాల పునరుద్ధరణకు, పునరుజ్జీవానికి అతడు ధారవోసిన శ్రమ అపారం. 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు. ఇంగ్లండులో విద్యాభ్యాసం తర్వాత 1817లో కుంపిణీ ప్రభుత్వ సివిల్ సర్వెంట్గా భారతదేశంలో అడుగుపెట్టాడు. దక్షిణ భారత క్యాడర్లో బ్రౌను నియామకం ముఖ్యంగా తెలుగు వారు చేసుకున్న పుణ్యం.

కలెక్టరు సహాయకునిగా, మెజిస్ట్రేటుగా, పర్షియన్, తెలుగు పోస్ట్మాస్టర్ జనరల్ కునిగా, గా, విద్యామండలి సభ్యునిగా, కాలేజ్ బోర్డు కార్యదర్శిగా అనేక హోదాల్లో అనేక ప్రాంతాల్లో ఉద్యోగం చేశాడు. 38 సంవత్సరాలు కుంపిణీ వారి కొలువులో ఉన్నాడు. తాను దేశంలోనూ, తిరిగి ఇంగ్లండు వెళ్లాకకూడా మొత్తం దాదాపు ఐదున్నర దశాబ్దాల కాలం తెలుగు భాషా సాహిత్యాల వికాసం కోసం అవిశ్రాంతంగా కృషి చేశాడు. ఇది ఒక వ్యక్తికి సాధ్యమయ్యే పని కాదు. తెలుగు గ్రంథాల రచనలో, తాళపత్ర గ్రంథాల సేకరణలో, ఉద్ధరణలో, భద్రపరచడంలో, పరిష్కరణలో, ముద్రణలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పనిచేశాడు బ్రౌన్. బ్రౌన్ వేమన పద్యాల ఆంగ్లానువాదం 1825లోనే చేపట్టాడు. తెలుగు ఛందస్సు (1827) ముద్రించాడు. తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు, తెలుగు వ్యాకరణం, ఆంగ్లంలో తెలుగు వ్యాకరణం ప్రచురించాడు. ది లిటిల్ లెక్సికాన్, ది జిల్లా డిక్షనరీ కూర్చాడు. కొత్త నిబంధనను అనువదించాడు. వేమన పద్యాలను ఆంగ్లంలో 1829లో 693 పద్యాలతో, 1839లో 1164 పద్యాలతో ప్రచురించాడు. ఆయన ఎన్నో విధాలా శ్రమించి వ్యయప్రయాసల కోర్చి సేకరించిన తెలుగు, సంస్కృత గ్రంథాల సంఖ్య వేలల్లో వుంది. మాజేటి సర్వేశలింగం సంకలనం నుండి సేకరించిన గ్రంథాలు 613 కాగా 227 గ్రంథాలు తెలుగు, 386 సంస్కృత గ్రంథాలు. మచిలీపట్నంలో కొన్నవి 1830 గ్రంథాలు. ప్రత్యేకంగా కడపలో భవనాన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి, దిగ్ధంతులైన పండితులను నియమించి అనేక కావ్యాలు, శతకాలకు సంబంధించిన వేరు వేరు చోట్ల లభ్యమైన ప్రతులను పోల్చి చూపి (Collation) శాస్త్రీయ పద్ధతిలో పరిష్కరింపజేశాడు. వాటిల్లో వసు చరిత్ర, మనుచరిత్ర, రాఘవపాండవీయం, రంగనాధ రామాయణం, పండితారాధ్య చరిత్ర, పల్నాటి వీర చరిత్ర, దశావతార చరిత్ర మొదలైనవి ఉన్నాయి. పోతన భాగవతాన్ని పరిష్కరించడమే కాక తెలుగు భారతం 18 పర్వాల పరిష్కరణకు, శుద్ధ ప్రతుల తయారీకి 2714 రూపాయలు ఖర్చు చేశాడు. తెలుగు నేర్చుకోదలచే ఇంగ్లీషు వారి కోసం, ఇంగ్లీషు నేర్చుకోదలచే తెలుగు వారి కోసం వాచకాలు తయారు చేశాడు. మద్రాసులో, కడపలో, మచిలీపట్నంలో స్వంత ఖర్చులతో ఉచిత పాఠశాలలు నడిపాడు. ఆయనే అన్నాడు " In 1825 found Telugu Literature dead in thirty years I raised it to life "10 అని. అది అక్షరాలా నిజం. 1855 ఏప్రిల్లో ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తిరిగి ఇంగ్లండు వెళ్లిపోయాడు. లండన్ యూనివర్సిటీలో తెలుగు గౌరవ ఆచార్యునిగా పనిచేశాడు. గ్రంథ రచన, ముద్రణ నిర్వహించాడు. ఆయన చివరి ప్రచురణ 'తాతాచార్యుల కథలు'. 1884లో కన్నుమూశాడు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్న వేమన పద్యానికి నిదర్శనంగా తెలుగుజాతి ఎన్ని తరాలకైనా మరువరాని పుణ్య పురుషుడు సి.పి. బ్రౌన్.


సర్ థామస్ మన్రో ప్రజల గవర్నరు -

తన 19 ఏళ్ల వయసులో మద్రాసుకు సైనిక విద్యార్థిగా వచ్చిన సర్ థామస్ మన్రో తన 66వ ఏట మద్రాసు గవర్నర్ గా చేస్తూ చనిపోయాడు. తెలుగు నేర్చుకున్న తెల్ల దొరల్లో ఈయన సుప్రసిద్ధుడు. రాయలసీమ తెల్లదొరల అధీనంలోకి వచ్చాక ఈయనను పాలకునిగా నియమించారు. దత్త మండలాల్లో ఉన్న 80 మంది పాలెగాండ్లను అదుపులోకి తెచ్చి రైతులకెంతో ఉపకారం చేశాడు. పాఠశాలలు నెలకొల్పేందుకు, ప్రజోపయోగకరమైన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టడానికి పథకాలు రూపొందించాడు. రాయలసీమ అంటే ప్రాణం.

1783లో రైటర్గా మద్రాసు వచ్చిన విలియం బ్రౌన్ మచిలీపట్నం, విజయనగరం, విశాఖ, గంజాం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో అనేక హోదాల్లో 50 సంవత్సరాల పాటు పనిచేశాడు. 1817లో 'జెంటూ' (తెలుగు) వ్యాకరణం ముద్రించాడు. అందులో పూర్వ వ్యాకర్తలను స్మరించడమే గాక కొన్ని పూర్వ వ్యాకరణాలు నిరుపయోగాలన్నాడు. 1818లో ఆయన ప్రచురించిన జెంటూ వొకాబులరీ వల్ల ఆనాటి సాంఘిక చరిత్ర తెలుసుకోవచ్చు. 1832లో తెలుగు అనువాదకునిగా పనిచేశాడు. మచిలీపట్నంలోని మామిడి వెంకయ్య, గుండుమళ్ల పురుషోత్తం వంటివారు విలియం బ్రౌను తెలుగు వ్యాకరణ రచనకు సహాయం చేశారు. ఆయన తెలుగు వ్యాకరణం చాలా విశిష్టమైనది. ఇంగ్లీషు వర్ణక్రమం ప్రకారం తెలుగు అక్షరాలు 22 మాత్రమేనని వర్గీకరించాడు. ఇది ఇంగ్లీషు వాళ్లు తెలుగు నేర్చుకొనేందుకు దోహదం చేసింది. తెలుగు భావ ప్రకటనకు గంభీరంగానూ, వినడానికి కమ్మగానూ ఉంటుందని అన్నాడు.


ఎ. డి. క్యాంబెల్ - ప్రామాణిక వ్యాకరణం


అలెగ్జాండర్ డంకన్ క్యాంబెల్ 1807లో రైటర్గా మనదేశానికి వచ్చాడు. బళ్లారి, తంజావూరు కలెక్టరుగా పనిచేశాడు. ప్రభుత్వ తెలుగు, పర్షియా అనువాదకునిగా పనిచేశాడు. బళ్లారి మిషన్కు ఈయన కృషివల్లే ముద్రణశాల లభించింది. 1817లోనే సెంట్ జార్జికోట కాలేజ్ బోర్డుకు కార్యదర్శి అయ్యాడు. రెవెన్యూ బోర్డు కార్యదర్శిగా కూడా పనిచేశాడు. తెలుగును నిశితంగా అధ్యయనం చేయడమేగాక తెలుగులోనూ, తెలుగును గురించి ఆంగ్లంలోనూ ప్రామాణిక రచనలు చేసిన కొద్ది మందిలో క్యాంబెల్ ఒకరు. ఉదయగిరి నారాయణయ్య అనే పండితుని దగ్గర ఆంధ్ర శబ్ద చింతామణిని ఆమూలాగ్రం చదువుకున్నాడు. మామిడి వెంకయ్య ఆంధ్ర దీపిక పీఠిక, ఆంధ్రకౌముది, అహోబిల పండితీయం మొదలైనవి 10 ఏళ్లపాటు శ్రద్ధగా పఠించాడు. ఈ పరిజ్ఞానంతో తర్వాతి వారికి ఉపయుక్తంగా ఉండేలా ఆరు అధ్యాయాలు, 519 సూత్రాలతో తెలుగు వ్యాకరణాన్ని ఇంగ్లీషులో రచించాడు. అప్పట్లో ఇంగ్లీషు వచ్చిన తెలుగు వ్యాకరణాల్లో క్యాంబెల్ వ్యాకరణ గ్రంథం ప్రామాణికమైనదిగా పరిగణనకెక్కింది.


1812 నుంచి దేశ భాషల అధ్యయన సంఘానికి కార్యదర్శిగా ఉన్నాడు. అదే తర్వాత కాలేజ్ బోర్డుగా మారింది. 1816లో వ్యాకరణం ముద్రణ జరిగింది. 1812 నుంచి 1820 వరకు ఎనిమిదేళ్లు కాలేజ్ బోర్డు కార్యదర్శిగా, పరీక్షాధికారిగా పనిచేశాడు. ఆయన ప్రతిభా విశేషాలకు మెచ్చి ప్రభుత్వం వారు నిఘంటువు రాయమన్నారు. క్యాంబెల్ ఆంధ్ర దీపికను ప్రాతిపదికగా తీసుకొని కొత్త పదాలు కలుపుకుంటూ తెలుగు ఇంగ్లీషు అర్థాలిస్తూ నిఘంటువు పూర్తి చేశాడు. దాని తొలి ముద్రణ 1821లోనూ, రెండవ ముద్రణ 1848లోనూ జరిగింది. తన వ్యాకరణానికి ఆయన రాసిన ప్రవేశిక చాలా గొప్పది. ఆంధ్ర భాషా చరిత్రను, ఆంధ్రదేశ చరిత్రను సంక్షిప్తంగా రాసినా అది కూడ ప్రామాణికమైనది. ఆంధ్ర చరిత్ర రచించిన వారిలో క్యాంబెల్ మొదటివాడు కావచ్చునని ఆరుద్ర అభిప్రాయపడ్డారు.11 తన గ్రంథంలో త్రిలింగ శబ్దానికి విపులమైన పీఠిక రచించాడు. ప్రాచీన పాశ్చాత్య చరిత్రకారులు ఆంధ్రదేశం గురించి భావించిన అంశాల్ని ప్రస్తావించాడు. వివిధ భారతీయ పురాణాల్లో ఆంధ్రప్రసక్తి ఉన్న ఘట్టాలను క్రోడీకరించాడు. మెకంజీ సేకరించిన వ్రాత ప్రతులను, శాసనాలను ఆధారం చేసుకొని విజయనగర రాజుల జాబితా రూపొందించాడు.


ఫ్రాన్సిస్ వైట్ ఎల్లిస్ - తులనాత్మక అధ్యయనం


మద్రాసులో రైటర్ 1796లో సివిల్ సర్వీసు ప్రారంభించిన ఎల్లిస్ 1802లో రెవెన్యూ బోర్డు సభ్యునిగా, జిల్లా జడ్జిగా, కలెక్టర్ గా అనేక హోదాల్లో పనిచేశాడు. మచిలీపట్నంలో జడ్జిగా పనిచేస్తున్నప్పుడు తెలుగు బాగా నేర్చుకున్నాడు. తెలుగు, తమిళం, మళయాళం భాషల్లో ప్రావీణ్యం సంపాదించడంతో పాటు దక్షిణ భారతీయ భాషల విషయంలో చెప్పుకోదగిన కృషి చేశాడు. తమిళ, సంస్కృత, మళయాళ భాషలలో తెలుగును తులనాత్మకంగా అధ్యయనం చేసి ద్రావిడ భాషావాదం బలపడడానికి ఎల్లిస్ దోహదం చేశాడు.


ఎ. డి. క్యాంబెల్ తెలుగు వ్యాకరణానికి పరిచయంగా ఎల్లిస్ తెలుగుతో ద్రావిడ భాషకు గల సామ్యాన్ని గురించి రాసిన నోటును (1816) పొందుపరచడం జరిగింది.


భారతీయుల సాంఘిక పరిస్థితుల పట్లా, చరిత్ర పట్లా ఎంతో శ్రద్ధ కనబరచి ఆ విషయాలపై ప్రామాణిక రచనలు చేశాడు. "జనని సంస్కృతంబు సకల భాషలకును" అన్న కొందరు ఆంగ్ల పండితుల వాదాన్ని ఎల్లిస్ ఖండిస్తూ తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలు ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలనీ, సంస్కృతం నుంచి జనించినవి కావని నిరూపించాడు. వాక్య నిర్మాణ పద్ధతిలో దక్షిణాది భాషలు సంస్కృతంతో ఎలా విభేదిస్తున్నాయో రాశాడు. మామిడి వెంకయ్య 'అంధ్ర దీపిక' ఉపోద్ఘాతంలో చెప్పిన తత్సను, తద్భవాలను గురించి చర్చించాడు. లక్ష్మధరుని షడ్భాషా చంద్రికను ఉటంకించాడు. ఇది భాషా శాస్త్ర విషయకంగా ప్రాముఖ్యాన్ని సంతరించుకోదగింది. ఎల్లిస్ మరణానంతరం ఆయన భాషా శాస్త్ర పరిశోధన పత్రాలన్నిటినీ సర్ వాల్టర్ ఇలియట్క అందే ఏర్పాటు జరిగింది. ఇలియట్ డాక్టర్ పోపు ఇచ్చి ఆక్స్ఫర్డ్ బోదిలియన్ గ్రంథాలయంలో భద్రపరచేట్లు చేశాడు.


కోలిన్ మెకంజీ - చారిత్రక సంపద


తెలుగుతో పాటు 15 భారతీయ భాషల్లో వేలాది వ్రాతప్రతులు సేకరించి అనంతర తరాలకు అమూల్యమైన విశేషాలను అందించిన పాశ్చాత్య ప్రముఖుడు కోలిన్మెకంజీ. లూయిస్ ద్వీపానికి చెందిన మెకంజీ 1783లో ఈస్టిండియా కంపెనీ వారి ఇంజనీర్స్ క్యాడెట్లో ఎంపికై భారతదేశం వచ్చాడు. మద్రాసు ప్రెసిడెన్సీ సర్వేలో పాల్గొన్న ఇంజనీర్లలో మెకంజీ ఒకరు. కోయంబత్తూరు, దిండిగల్, నెల్లూరు, గుంటూరు ఎక్కడికి సర్వే కోసం వెళ్లినా తనతో జిజ్ఞాసువులైన పండితులను తీసుకెళ్లేవాడు. 1809లో మద్రాసు సర్వేయర్ జనరల్, 1817లో కలకత్తా సర్వేయర్ జనరల్ గా ఉండి దాదాపు 70 వేల చదరపు మైళ్ల మేర సర్వే జరిపించాడు. కావలి వెంకట బొర్రయ్య. లక్ష్మయ్య అనే ఇద్దరు ప్రతిభావంతులైన తెలుగు సోదరుల సహాయంతో దేవాలయాలు, చెరువులు, రిజర్వాయర్లు, శాసనాల ప్రాచీన చరిత్రను మెకంజీ వెలికితీశాడు. ఆయన కృషిని సెంట్ జార్జి కోట ప్రభుత్వం కూడా ఎంతగానో ప్రశంసించింది.

తాను సేకరించిన 1620 ప్రాంతాల స్థానిక చరిత్రల కైఫీయతుల విశ్లేషణ, కేటలాగింగు చేపట్టిన కొంత కాలానికి 1821లో కలకత్తాలో మెకంజీ మరణించాడు. మెకంజీ సేకరించిన సమాచారన్నంతటినీ గపిండియా కంపెనీ కొనుగోలు చేసింది. 

ఏషియాటిక్ జర్నల్ మెకంజీ సేకరించిన విషయ సంపదను మొదటిసారిగా వెలుగులోకి తెచ్చింది.


విల్సన్స్ మెకంజీ కలెక్షన్స్ పేరుతో 1828లో కలకత్తాలో కేటలాగింగ్ ఆరంభమైంది. మెకంజీ సేకరించిన 176 తెలుగు లిఖిత ప్రతుల వివరాలు అందులో చోటు చేసుకున్నాయి. 36 పౌరాణిక, వైతాళిక సాహిత్య గ్రంథాలు, 23 స్థానిక చరిత్రలు, 82 ప్రతులు కావ్యాలు, నాటకాలు, గాధలకు సంబంధించినవి ఉన్నాయి. వీటి సహాయంతో సాధికారికమైన స్థానిక చరిత్ర నిర్మాణం చేయవచ్చు.


వీరేగాక ఇంకా ఎందరో తెల్లదొరలు తెలుగు ప్రాంతాల్లో, తెలుగువాళ్ల మధ్య తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి కృషి చేశారు. వారందరి గురించి విపులంగా చర్చించడం ఈ అధ్యయనంలో సాధ్యమయ్యేది కాదు. అయితే వారిని నామమాత్రంగానైనా స్మరించడం బాధ్యత. బెంజిమెన్ బ్రాన్ఫీల్, జాన్. పి. మారిస్, థామస్ కన్ సెట్టస్, సర్ విలియం జోన్స్, చార్లెస్ విల్కిన్స్, హెన్రీ థామస్, కోల్ బ్రూక్, జె. బి. గిల్ క్రిస్ట్, విలియం కేరీ, జార్జి అబ్రహం గ్రియర్ సన్, రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ (సి. పి. బ్రౌన్ తండ్రి) క్లాడినస్ బఛ్యస్, జాషువా మార్ష్మన్, హెన్రీ మార్టిన్, డేనియల్ కోరీ, డా. జాన్ లీడెన్... ఇలా వారి వారి స్థాయిల్లో, పరిమితుల్లో తెలుగు భాషా సాహిత్యాల వికాసానికి కృషి చేశారు.


- కర్లపాలెం హనుమంతరావు 

( మూలం - భాషా సాహిత్య స్వరూపం - డా॥ జె. చెన్నయ్య

రామకృష్ణుని గడుసుతనం సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 13 -11-2021 ( కీ.శే. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటు పద్య రత్నావళి నుంచి )

 



రామకృష్ణుని గడుసుతనం 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

13 -11-2021 

( కీ.శే. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటు పద్య రత్నావళి నుంచి ) 


వాకిటి కావ౨  తిమ్మనికి రాయలువారెప్పుడో ఒక  మంచి శాలువ  ఇచ్చారుట . దాని నతఁడు కప్పుకొని క్రుమ్మరుటఁ జూచి, మన వికటకవి దానిపైఁ గన్ను వేసి, మెట్లనను దానిని కాఁజేయవలయునని యూహఁజేసి, యుపాయము గుదుర్చు కొని యొకనాడుఁ తిమ్మనిఁ బిలిచి మెల్లఁగా నిట్లు బోధించెను. "ఓయీ! కృష్ణ దేవరాయలవంటి మహారాజుగారి ద్వారపాలకుఁ డవై, యొక పద్యమునైనను గృతినందకుండుట నాకిష్టము లేదు.” అనఁగా "అయ్యా! తగినంత బహుమానము నియ్యనిదే కవులు పద్యములు చెప్పుదురా” యనెను. రామకృష్ణుడు “తిమ్మా, నే నుపాయముఁ జెప్పెద వినుము; ఒక్కొక్క కవి నొక్కొక్క చరణమువంతున నడిగితివేని సులభముగాఁ బదిపద్యములఁ గృతి నందఁగలవు. ఇంతకు వేఱక యుపాయము లేదని చెప్పఁగా నతఁడు సంతోషించి, మఱునాఁ డుదయమున వాకిట నిలచి మొదట వచ్చిన పెద్దన్న గారికిఁ దనకోర్కి ని దెల్పఁగా నక్కవి నవ్వి, యిట్లొక చరణమును జెప్పి లోపలికిఁ బోయెను.


క. “వాకిటి కావలి తిమ్మా


తర్వాత వచ్చిన భట్టుకవి నాశ్రయింపఁగా సాతఁడు..... 


"ప్రాకటమగు సుకవివరుల పాలిటిసొమ్మా


అనుచరణమును వ్రాసియిచ్చిపోయెను. పిమ్మట వచ్చిన తిమ్మకవి కీసంగతిని విన్న నింపఁగా నతఁడు


“నీ కిదె పద్యము కొమ్మా”


అని చెప్పి పోయెను. వీరి రాకను గనిపెట్టియుండి నాలు గవ వాఁడుగా వచ్చిన మన రామకృష్ణుఁడు -


“నా కీపచ్చడమె చాలు నయముగ నిమ్మా.”


అనిపూర్తిచేయఁగా తిమ్మఁడు మాఱుపలుక నేరక సెలువ నిచ్చివేసెను.” 


ఈకథవిని రాయలునవ్వి తిమ్మనికి వేఱక సేలువ నొసంగెనంట.


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

13 -11-2021 

( కీ.శే. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి చాటు పద్య రత్నావళి నుంచి ) 

Sunday, December 12, 2021

తెలుగు సాహిత్యంలో హాస్యం- పుస్తకం: శేషేంద్ర వాహ్ ! తాజ్!!! సేకరణ ; కర్లపాలెం హనుమంతరావు


మన ప్రాచీనాలంకారికులు చెప్పిన నవరసాల్లో హాస్యం కూడా ఒకటి. హాసం అంటే నవ్వు. ఆ నవ్వును పుట్టించేదే హాస్యం. నవ్వు నాలుగందాల చేటని కొందరు నీరసవాదులు నిరసించినా, నేడు “నవ్వు” అన్నదానికి, ఆరోగ్యానికి చాలా మంచిదని గుర్తించడం వల్లే చాలా ఊళ్లలో ‘హ్యూమర్ క్లబ్స్’ వెలిసాయి. పనిగట్టుకుని రోజూ గంటసేపు నవ్వడం ఆరోగ్యం కోసమే అని ప్రకటన ఇచ్చేవాళ్లు ఎక్కువయ్యారు. అయితే ‘అతి సర్వత్ర వర్జయేత్’ కాబట్టి అదుపాజ్ఞలు లేని నవ్వు కూడా సమర్ధనీయం కాదు. ప్రసన్నమైన చిత్తవృత్తిని ప్రకటించే చక్కని సాధనం నవ్వు. వాగ్గతమైన హాస్యం ఆరోగ్య ప్రదాయిని..
నవ్వించడమనేది సృజనాత్మక కళ. సంస్కారయుతమైన పదజాలంతో ఇతరులను నొప్పింపక తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం సామాన్యమైన విషయం కాదు. హాస్యం హృదయాల్ని తేలికపరుస్తుంది కాని దాని సృష్టి మాత్రం అంత తేలికకాదని ఒక ఆంగ్ల కవి ఇలా అన్నాడు. It lightens the heart, But the process to arrive at it requires serious thinking .
మనిషి జీవితం పుట్టుక నుండి చావు వరకు దుఃఖమే. అయితే అందులోనే తనకు కావలసిన ఆనందాన్ని వెతుక్కోవడానికి, పదిమందికి పంచడానికి మనిషి సాహిత్య సృష్టి చేసాడనుకోవచ్చు. ఈ ఆనందాన్వేషణ మనిషిని మిగిలిన జీవరాసులనుండి వేరు చేస్తోంది.
ఒక మహాకవి నవ్వు గురించి ఎంత అందంగా చెప్పాడో చూడండి.
“నవ్వవు జంతువుల్ నరుడు నవ్వును, నవ్వులు చిత్త వృత్తికిన్
దివ్వెలు కొన్ని నవ్వులెటు తేలవు . కొన్ని విష ప్రయుక్తముల్
పువ్వుల వోలె ప్రేమరసముల్ వెలిగ్రక్కు విశుద్ధమైన లే
నవ్వులు సర్వదుఃఖదమంబులు వ్యాఖులకున్ మహౌషధుల్. “
జంతువులనుండి మనిషిని వేరు చేసే ‘నవ్వు’ విషపూరితం కాకుండా పువ్వుల మృదువైన ప్రేమరసాన్ని అందించి దుఃఖాన్ని, రోగాన్ని ఉపశమింప చేయాలని కవి సూచన. అలాంటి నవ్వే చిత్తవృత్తికి దివ్వె అవుతుంది. గాంధీగారు కూడా “If I had no sense of humor, I would long ago have committed suicide” అన్నారు. నవ్వగలగడం ఒక వరం. ఒక ఐశ్వర్యం. అందుకే కీ.శే.జంధ్యాల
“నవ్వడం ఒక యోగం
నవ్వించడం ఒక భోగం
నవ్వలేకపోవడం ఒక రోగం “ అన్నారు.
“A man is not poor if he can still laugh” అంటాడు హిట్లర్.
“Though the room is big if there is no place to humor , we can say it is congested” అని ఇంగ్లీషులో ఒక వాక్యముంది.
వాసనలేని పూవులా పరిహాస ప్రసంగం లేని వాక్యం వ్యర్ధమన్నాడు ఒక తెలుగు కవి. హాస్యం ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి విషాద విచ్చేధకమవుతుంది. రోజూ ఓ గంటసేపు నవ్వితే అమృతపానం చేసినంత ఫలితం.
“Humor cures the people – both the one who gives it and the one who receives it” అని ఇంగ్లీషులో మంచి వాక్యం కూడ ఉంది.
తనివితీరా నవ్వినప్పుడు, శ్వాసకోశమంతా ప్రాణవాయుమయమవుతుంది. అతికష్టమైన యోగాభ్యాసాన్ని నవ్వు ధర్మమా అని అతి సులువుగా చేయగలరన్నమాట.
అసలు “నవ్వంటే” నిర్వచనాన్ని ఒక మహాశయుడిలా చెప్పాడు. “ఎదుటి విషయంలోని వైషమ్యం వల్ల మనసుకు కలిగే ఆశ్చర్యాన్ని సమన్వయం చేసుకోలేని వేళ కండరాల బిగింపువల్ల అప్రయత్న నిర్బంధకంగా నోట్లోంచి వెలువడే నిశ్వాసమే “నవ్వు”
“అయ్యబాబోయ్! నిర్వచనం నవ్వుని మింగేస్తోంది”. కాని నవ్వడం చేతనైనపుడు అసలు నవ్వెలా వస్తోందో అంటే పై విధంగా అన్నమాట.
నవ్వులో చాలా రకాలున్నాయి. మన ప్రాచీనులు నవ్వు ఆరు రకాలుగా విభజించారు.
1.స్మితం
2.హసితం
3.నిహసితం
4. అవహసితం
5. అపహసితం
6. అతిహసితం
శ్రేష్ఠులకు స్మిత హసితాలు, మధ్యములకు నిహసిత, అవహసితాలు అధములకు అపహసిత, అతిహసితాలు అని కేటాయించారు. ధూషణ లక్ష్యంగా పెట్టుకోక, మర్యాద మరువక, శ్రుతి మించనీయక చేసే హాస్యమే నిజమైన హాస్యం.
అనేక గ్రంధాలలో పరిచయం, శబ్దార్ధాలపైన విశేషమైన అధికారం, విశిష్ట ప్రతిభ, అన్నింటికి మించి సమయజ్ఞత (Presence of mind) సమకూరితే తప్ప హాస్యరసాన్ని సర్వాంగ సుందరంగా ప్రదర్శించడం సాధ్యం కాదు. ప్రతి రసానికి ఒక రంగు ఉంటుంది.
హాస్యం రంగు తెలుపు. నవరసాల్లో నవనవలాడే నిత్యనూతనమైనది హాస్యమే. సుకుమారమైన హాస్యానికి పూర్ణాయుర్ధాయమే.
అయితే ఆంధ్ర సాహిత్యంలో ఈ హస్య రసం కవులచేత ఎంతవరకు గౌరవింపబడిందో స్థూలంగా దర్శిస్తే….
కీ.శే. ఆచార్య తూమాటి దోణప్పగారు “తెలుగు సాహిత్యంలో ప్రాచీన సాహిత్యపు పేరోలగంలో హాస్యరసానికి వేసిన పీట మాత్రం చాలా చిన్నది. ఆ రోజులలో వాళ్లు చాలా రసాలకు పట్టాభిషేకం చేసారు కాని హస్యం దాస్యం చేసింది. విధూషకులు, చెలికత్తెల ఆశ్రయంలో కాలం గడుపుతూ వచ్చింది. అయితే ఆంధ్రులు హస్యప్రియులు కారని గట్టిగా అనలేము. వదినా మరదళ్ల సరసాలు, పెళ్లిళ్లలో ఇరుపక్షాలవారి పరియాచకాలు … ఒకటేమిటి అడుగడుగునా, అనుక్షణమూ తెలుగువారి బ్రతుకుదారుల్లో హాస్యరసం జాలువారుతూనే ఉంది. తెలుగునాట వినోదాత్మక ప్రదర్శనల నిండా హస్యమే కనిపిస్తుంది” అంటారు.
తెలుగు సాహిత్యంలో తొలి తెలుగు రచన ఆంధ్రమహాభారతం.. కురువంశపు వీరులు, వారి చుట్టాలు, స్నేహితులు అందరూ గంభీరమూర్తులే. వారు నవ్వడం చాలా అపురూపం. కాగా భారతంలో మనం హాస్యరసాన్ని వెతుక్కుంటే అక్కడక్కడ దర్శనమిస్తుంది. అదీ స్మితమే. ఆదిపర్వంలో గరుత్మంతునిచేత పీడింపబడిన దేవతల పరుగులు, బకాసురుని వృత్తాంతంలో పసివాడి మాటలు దుర్యోధనుని భంగపాటు ఎంతో కొంత నవ్విస్తాయి.
నన్నెచోడుని కుమారసంభవంలో మన్మధుని ప్రగల్భాల కన్నా రతీదేవి భర్తని వారించడం పఠితను నవ్విస్తాయి. పరమేశ్వరుని తపోభంగం చేయడానికి తాను సపరివారంగా వెడుతున్నానని పల్కిన భర్తతో రతీదేవి…
“పరమశివుని విల్లు కనకసిరి, నీ విల్లు చెఱకుగడ, ఆయన బాణం పాశుపతం, నీ బాణం కేవలం పుష్పం. చిన్న పిల్లలు కూడా తిని, పిప్పి ఉమిసెడి చెఱకుగడను గొప్పవిల్లని విశ్వసించి, క్షణాలలో నశించే పూలని బాణాలుగా తగిలించుకొని, వేసవి ఎండకి బెదిరిపోయే వసంతుని గొప్ప స్నేహితుడని వెంటబెట్టుకొని, కాకి పిల్లల్ని చూసి బెదిరిపోయే కోకిలలు, ఆడవాళ్లు అదిలిస్తేనే ఆకాశంలోకి ఎగిరిపోయే చిలుకలు పెద్ద సైన్యంగా గర్వించి, పరమేశ్వరునిపై దాడికి వెళ్లడం మంచిది కాదు. ” అని హెచ్చరిస్తుంది. ఇలాంటి మాటల్లోని హస్యం సున్నితంగా మనసుని తాకి నవ్విస్తుంది.
తిక్కన రచనలో వ్యంగ్యం ఎక్కువ. నర్తనశాలలో స్త్రీ వేషంలో ఉన్న భీముడు కీచకునితో “నన్ను ముట్టి నీవు చెండి యు వనితల సంగతికి పోవు వాడవె” అని గూఢంగా అంటాడు. ఇలాంటి వాక్యాలు చిరునవ్వుకి పుట్టినిళ్లవుతాయి. ఇక ఉత్తరకుమారుని ప్రగల్భాలు, తీరా కురు సైన్యాన్ని చూసాక “ప్రాణములు తీపి యన వినవే” అనే అతని గోల బాగా నవ్విస్తాయి. అంతే కాదు.” పసులదయ్య మెరుగు, పడతుల సంతోషమేల నాకు, యనికి జాల నేను” అని రధం మీదనుండి క్రిందికి ఉరికి పరిగెత్తడం కడుపుబ్బ నవ్విస్తుంది. తిక్కన తన పాత్రలచేత నవ్వించిన నవ్వులు లెక్కలేనన్ని. తిక్కన పేర్కొన్న నవ్వుల జాబితా తయారు చేయడం గొప్ప ఆసక్తికరంగా ఉంటుంది. ఇన్ని రకాల నవ్వులుంటాయా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. అయితే ఏ నవ్వూ పాత్రోచిత్యాన్ని భంగం చేయదు. అదీ విశేషం.
గౌరన నవనాధ చరిత్రలో పురోహితుడు ఎలుగుబంటితో సరసాలాడడం, హరిశ్చంద్ర వాఖ్యానంలో కలహకంఠి, కాలకౌశికుల పోట్లాటలు, రోకళ్లతో కొట్టుకోవడాలు, విపరీతంగా నవ్విస్తాయి. కేయూరబాహు చరిత్రలో జంతు పాత్రౌచిత్యమైన మాటలు, చేష్టలు, విక్రమార్క చరిత్రలోని కొన్ని సన్నివేశాలు కొంత హాస్యరస స్ఫోరకాలే.
శ్రీనాధుని హరవిలాసంలో మాయా బ్రహ్మచారి పార్వతిని పరీక్షించాలని వచ్చి ఆమె ఎదుట శివుని నిందిస్తూ, వారి కళ్యాణాన్ని నిరసిస్తూ చేసిన ప్రసంగం,,
“రాయంచ యంచు చీరెక్కు జోకయగుగాక
పచ్చి మెనిక తోలు పచ్చ్చడంబు,”..
వంటి వ్యంగ్యాలు హాస్య రసాన్ని అందిస్తాయి. శ్రీనాధునివిగా ప్రసిద్ధి చెందిన చాటు పద్యాలలో కావలసినంత హాస్యం మనకు కనిపిస్తుంది.
ఒకసారి పల్నాడు వెళ్లిన శ్రీనాధునికి మంచి నీళ్లు కావలసి వచ్చి తన ఇష్ట దైవం శివుణ్ణి ఇలా దబాయించాడట.
సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేలు తన పెండ్లాడన్..
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగను విడుము పార్వతి చాలున్..
నీళ్లకోసం ఇలా గడుసుగా విసిరిన చమత్కారానికి ఎంత మాడుపు మొహమైనా వికసించక తప్పదు.
ఆయనదే మరో పద్యం..
పూజారి వారి కోడలు
తాజారగబిందె జారి దబ్బున పడియెన్
మైజారు కొంగు తడిసిన
బాజారే తొంగి చూసి ఫక్కుంజ నగియెన్…
ఎంత దగ్గరివారైనా ఇలాంటి సన్నివేశాల్లో దబ్బున జారిపడితే చూసినవాళ్లెవరికైనా ముందు వచ్చేది నవ్వే.. ఇలాంటి చాటువులు కోకొల్లలు..
శ్రీనాధుని యుగంలోనే అనంతామాత్యుడు భోజరాజీయమనే కథాకావ్యం వ్రాసాడు. సున్నితమైన హాస్యరసపోషణలో అనంతుడు సిద్ధహస్తుడు. మూషిక కన్య ప్రేమ వృత్తాంతం, ఎండ్రి పిల్ల కాశీ యాత్రకు ఉబలాటపడటం హస్య రసాన్ని చిందించే ఘట్టాలు. బ్రహ్మని హేళన చేస్తూ శివుడు విష్ణువుతో..
“వింటి కదా నీ తనయుని కొంటెతనము
..ఇటువంటివి పో పెక్కునోళ్ల వారల మాటల్” అంటాడు.
భక్త కవి పోతన శబ్దాలతో ఆడుకుంటాడు. ఆ శబ్దక్రీడ మన మనసుని తాకి హాయినిస్తుంది. శ్రీకృష్ణుని బాల్య చేష్టలు మనల్ని నవ్వించి పరవశింపచేసే హాస్యప్రసంగాలు.
ఇక రాయలకాలం అన్ని రసాలకి స్వర్ణయుగం. తెనాలి రామకృష్ణుడివిగా చెప్పబడే చాటుపద్యాలు హాస్యభాండాగారాలు. ఒకనాడు శ్రీకృష్ణదేవరాయలు సభలో
“కలనాటి ధనము లక్కర గల నాటికి దాత కమలగర్భుని వశమే” అని సమస్య ఇస్తే…
“నెల నడిమినాటి వెన్నెల యలవడునే గాదెవోయ యమవస నిశికీన్.. అని పెద్దన పూరించాడు.
‘అమవసనిసికి’నచ్చని రామకృష్ణుడు హేలనగా
“ఏమితిని సెప్పితివి కపితము
బెమపడి నెరి పుచ్చకాయ నడితిని సెపితో
ఉమెతక్కయ తినిసెపితో
అమవసనిసికి యనుమాడి అలసనిపెదనా!”
అన్నాడు వికటకవి.. ఈ వెక్కిరింతకు ఆనాటి సభలోనివారికే కాదు మనకూ నవ్వు రాక మానదు. రామకృష్ణ కవి అద్భుత కృతి పాండురంగ మాహత్మ్యం. అందులో నిగమశర్మ అక్క మరవలేని తెలుగింటి ఆడపడుచు. దుష్టసావాసాలు చేస్తున్న తమ్ముడిని బాగు చేయడానికి పుట్టింటికి వచ్చిన ఆవిడ తమ్ముణ్ణి దగ్గర కూర్చోబెట్టుకొని ఎన్నో నీతులు చెబుతుంది. వాడు అన్నీ విన్నట్లే విని ఒకరోజు రాత్రి ఇంట్లో వస్తువులు పట్టుకుపోతూ పనిలో పనిగా అక్కగారి ముక్కుపుడక కూడా పట్టుకు చక్కా పోతాడు. తెల్లవారిన తర్వాత విషయం తెలిసిన ఆవిడ తమ్ముడు తన మాటలు తలకెక్కించుకోలేదన్న బాధ కన్నా తన ముక్కుపుడక పట్టుకుపోయాడని గొల్లుమనడం రసాభావమై పఠితల్ని ఫక్కుమనిపిస్తుంది.
రాయలవారి స్వీయక్ర్తి ఆముక్తమాల్యద. అందులొ ఒక సొగసైన పద్యం ఉంది. విల్లిపుత్తూరు వర్ణనలోని క్రింది పద్యం..
తలఁ బక్షచ్చట గ్రుచ్చి బాతువులు కేదారంపుఁ గుల్యాంతర
స్థలి నిద్రింపఁగఁ జూచి యారెకు లుష స్స్నాతప్రయాతద్విజా
వలి పిండీకృత శాటిక ల్సవి దదావాసంబుఁ జేర్పంగ రే
వుల డిగ్గ న్వెస బాఱువానిఁ గని నవ్వు న్శాలిగోప్యోఘముల్
విల్లిపుత్తూరు చుట్టుపక్కల ఉన్న పొలాల్లో వరిమళ్లకు కాలువలు తీసారు. ఆ కాల్వల నడుమ వేకువ సమయంలో బాతులు తమ రెక్కల సందుల్లో తలలు దూర్చు పడుకున్నాయి. నగర రక్షకులు వాటిని చూసి “తెల్లవారుఝామున కాల్వకు స్నానానికి వచ్చిన బ్రాహ్మణులు స్నానం చేసాక తమ వస్త్రాలను నీళ్లలో ముంచి తీసి పిండివేసి ఆ తడి ముద్దల్ని అక్కడ మర్చిపోయి ఇంటికి పోయారు” అని భావించి వాటిని వారి వారి ఇళ్లకు చేర్చడానికి రేవులో దిగారు. ఆ చప్పుడుకి చటుక్కున లేచి వేగంగా పరిగెత్తుతున్న బాతులను చూసి వరిపైరుకు కాపలాగా ఉన్న స్త్రీలు నవ్వారట. ఈ భ్రాంతిమదాలంకారం మనల్ని నవ్వించక మానదు.
కళాపూర్ణోదయంలో పింగలిసూరన, వైకుంఠంలో నేత్రహస్తుల బెత్తపు దెబ్బలకు జడిసి బ్రహ్మగారే పారిపోయారని చేసిన వర్ణన హస్యరసస్ఫోరకమే.
క్షీణయుగంలోని హాస్యం తన ఔచిత్యాన్ని కోల్పోయిందనక తప్పదు. చేమకూర వేంకటకవి చమత్కారాలు మాత్రం చక్కిలిగింతలు పెడతాయి.
ఇక శతక కర్తలు చాలామంది హాస్యప్రియులు. తెలుగువారి హాస్యం శతకాల్లో ఎక్కువగా దర్శనీయమౌతుంది. వేకువలో సున్నితమైన సునిశితమైన హాస్యం ఉంది.
మచ్చుకి రెండు పద్యాలు…
కోతిని పట్టి తెచ్చి కొత్తపుట్టము గట్టి
కొండముచ్చు లెల్ల కొలిచినట్టు
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ వినురవేమ. … అన్నా
పాల సంద్రమునందు పవ్వళించిన హరి
గొల్ల యిండ్లకు పాలుకోరనేల
యెదుటివారి సొమ్ము యెల్లవారికి తీపి
విశ్వదాభిరామ వినురవేమ… అన్నా
సునిశితమైన హాస్యం సంఘజీవనంతో ముడిపడి శాశ్వతత్వాన్ని సంపాదించుకుంది.
ఉన్నంతలో దానం చేయడం, ఇతరులచే దానమిప్పించడం పురుషలక్షణం. అటువంటి వారికే మీసం అలంకారం అంటూ కవి చౌడప్ప చెప్పిన పద్యం వాడిగా వేడిగా హాస్యాన్ని అందిస్తుంది.
ఇయ్యక ఇప్పించగలడు
అయ్యలకే కాని మీసమందరికేలా
రొయ్యకు లేదా బారెడు
కయ్యానికి కుందవరపు కవి చౌడప్పా…
నల్లి బాధను బాగా అనుభవించిన ఒక కవి చాటువు..
శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింటనుండి రాజీవాక్షుం
డవిరలముగా శేషాద్రిపై
పవళించుట నల్లి బాధ పడలేక సుమీ…
అడిదం సూరకవి 18వ శతాబ్దంలో విజయనగర రాజుల సంస్థానంలో ప్రసిద్ధి కెక్కిన కవి. ఒకరోజు ఆయన భోజనం చేస్తుండగా ఆయన భార్య ప్రక్కన కూర్చును విసురుతూ గోముగా “అందరిమీదా పద్యాలు చెప్తున్నారు కదా? మన అబ్బాయి బాచన్న మీద ఒక పద్యం చెప్పవచ్చు కదా?” అని అడిగింది.
తరతమ బేధాలు లేని కవిగారు క్రింది పద్యంలో భార్య ముచ్చట తీర్చారట. పద్యం విని ఆవిడ ముఖం చిన్నబోయింది.
“బాబా బూచుల లోపల
బాచన్నే పెద్ద బూచి పళ్లున్ తానున్
బూచంటే రాత్రి వెరతురు
బాచన్నను జూచి పట్టపగలే వెరతురు”
కవి ఎంత నిరంకుశుడో చూడండి. ఎంత పళ్లెత్తైతే మాత్రం కన్నకొడుకు బూచి కన్నా భయంకరంగా ఉన్నాడని భర్త వర్ణిస్తే ఏ కన్నతల్లి మనసు చిన్నబోదు? అయినా మనకి జాలి కలగకపోగా కవిగారి చమత్కారానికి ఫక్కున నవ్వొస్తుంది.
అలాగే ఇంకో కవిగారు మహా పండితుడు. భోజనం చేసాక తాంబూలం వేసుకోవడానికి భార్యను సున్నం తెమ్మని సున్నితంగా పద్యరూపంలో అభ్యర్థించాడు.
“పర్వతశ్రేష పుత్రిక పతి విరోధి
అన్న పెండ్లాము అత్తను కన్నతండ్రి
ప్రేమతోడుత కన్నట్టి పెద్దబిడ్డ
సున్నంబుతేగదే సన్నుతాంగి..”
ఆయనకి భార్య మీద ఎంత అనురాగమో చూడండి.
పర్వత శ్రేష్ట పుత్రిక – హిమవంతుని కుమార్తె పార్వతియొక్క
పతి – భర్తయైన శివునియొక్క
విరోధి -శత్రువైన మన్మధునియొక్క
అన్నపెండ్లాము – అన్నగారైన బ్రహ్మదేవుని భార్య సరస్వతియొక్క
అత్తకు – అత్తగారైన లక్ష్మీదేవిని
కన్నతండ్రి – కన్నతండ్రైన సముద్రుని
ప్రేమతోడుత బిడ్డా – పెద్దకుమార్తె యైన జ్యేష్టాదేవి
సున్నంబు తేగదె సన్నుతాంగి – సున్నము తీసికొనిరా ( సన్నుతాంగి అనేది ఉత్తుత్తి సంబోధన)
“ఓ! దరిద్రపుగొట్టు పెద్దమ్మా! సున్నం పట్టుకురా” అన్నాడు. పాపం ఆవిడ చాలా పతివ్రత. పతిని అనుసరించే మాట్లాడుతుంది. అందుకే సున్నం తెస్తూ..
శతపత్రంబుల మిత్రుని
సుతు జంపిన వాని బావ సూనిని మామన్
సతతము తలదాల్చునాతని
సుతువాహన వైరి వైరి సున్నంబిదిగో…. అని అంటించింది.
శతపత్రంబుల మిత్రుని – సూర్యుని
సుతు – కర్ణుని
చంపినవాని – చంపిన అర్జునుని
బావ – శ్రీకృష్ణుని
సూనుమామన్ – కుమారునకు మేనమామయైన చంద్రుని
సతతము – నిత్యము
తలదాల్చునాతని – నెత్తిమీదమోసే శివునియొక్క
సుతు – కుమారుడైన వినాయకుని
వాహన – వాహనమైన ఎలుకకు
వైరి – శత్రువైన పిల్లికి
వైరి- శత్రువైన ఓ కుక్కా
సున్నంబిదిగో – ఇదిగో సున్నం తీసుకో.
“ఓ కుక్కా! సున్నమిదిగో అని వాత పెట్టింది. ఈ కొసమెరుపు చదివినవారందరికీ ఫక్కున నవ్విస్తుంది.
ఇలాంటి వెటకారపు పద్యాలు, వ్యంగ్య బాణాలు, చతురోక్తులు ఆధునిక తెలుగు సాహిత్యంలో కోకొల్లలు. వాస్తవానికి ఆధునిక యుగంలోనే హస్యప్రాధాన్యత ఆంధ్రులకు బాగా తెలియవచ్చిందనవచ్చు. ఇంగ్లండు, ఫ్రాన్స్, అమెరికా దేశాలు హస్యానికి నెలవుకాగా, ఆయాదేశాల్లో పుట్టిన సాహిత్యంలో హస్యం రాజ్యమేలింది. ఆంగ్లభాషతోనూ, ఆ సాహిత్యంతోనూ భారతీయులకు పరిచయమేర్పడ్డాక మన సాహిత్యంలో కొత్త ప్రక్రియలేర్పడ్డాయి. ఎక్కడ మంచి ఉన్నా గ్రహించి సాహిత్యం ద్వారా పఠితల కందించాలనే తపన మన కవులకున్న సుగుణం. అలాగే మార్క్ ట్వెయిన్ , డికెన్స్, మొలియర్ వంటి హాస్యవేత్తల మార్గంలో ఒకరిద్దరు తెలుగు రచయితలు హస్యాన్ని అందలమెక్కించే ప్రయత్నం చేసారు. ఏమైనా అంత గొప్ప హాస్యం మన సాహిత్యంలో ప్రవేశించలేదని ఒప్పుకుని తీరాలి.
కీ.శే. భమిడిపాటి, మొక్కపాటి, మునిమాణిక్యంగార్లు తెలుగులో హస్య కవిత్రయం. మునిమాణిక్యంగారి కాంతం కథలు, మొక్కపాటివారి బారిస్టర్ పార్వతీశం, చిలకమర్తివారి ప్రహసనాలు, పానుగంటి వారి సాక్షి వ్యాసాలు.. ఇలా ఎన్నో రచనలు హాస్యరసాన్ని పండించాయి. అయితే మన కవులు, రచయితలు తమ రచనలు ఏ రసప్రధానమైనవి అయినా వాటికి సాంఘిక ప్రయోజనం ఉండాలనే లక్ష్యంతో హాస్యాన్ని హద్దుల్లోనే ఉంచారు. మన నైతిక విలువలు హాస్యం పేరుతో దెబ్బతినకూడదనే భావన సుమారు పాతిక సంవత్సరాల క్రితం వరకు ఉన్నదనే చెప్పవచ్చు. ఆధునికయుగంలో సుప్రసిద్ధులైన కవి, రచయిత కీ.శే.చిలకమర్తివారు హస్యధోరణిలో పకోడీలను వర్ణిస్తూ పద్యాలు చెప్పారు. వాటి సారాంశం..
‘కోడి’ తినని శాకాహారులకు వాని రుచిలో సమానమైన ‘పకోడీ’ని బ్రహ్మ సృష్టించాడు. పెళ్లిళ్ల సమయంలో అక్షింతల వాడుక ఎక్కువగా ఉంటుంది కదా. పూజకి, ఆశీర్వచనానికి తలంబ్రాలకి ఇలా చాలా చోట్ల వాడతారు. అయితే మంగళ ప్రదమైన ఈ అక్షింతలు తల మీదనుండి క్రింది పడుటచే కాళ్లక్రింద పడి నలిగిపోతుంటాయి. కాబట్టి అక్షింతలకు బదులుగా మనం పకోడీలను వాడితే వచ్చినవాళ్లు వాటిని తొక్కకుండా జాగ్రత్తగా ఏరుకుని తింటూ హాయిగా కూర్చుంటారని, పెళ్లిపీటలమీద కూర్చున్న వధూవరులకు పకోడీల దండ వేయిస్తే వాళ్లు ఆ ఘుమఘుమలను ఆఘ్రాణిస్తూ అవకాశం వస్తే ఒకటి రెండు నములుకుంటూ కాలక్షేపం చేస్తారనే ఆయన సూచన హాస్యరసాన్ని పుష్కలంగా అందిస్తుంది.
అభ్యుదయ కవిగా, విప్లవ కవిగా ప్రసిద్ధి కెక్కిన శ్రీశ్రీ కూడా తన శతకాల్లో అక్కడక్కడ హాస్యాన్ని మెరిపించారు.
“దయ్యాలను చూపిస్తా
నయ్యారమ్మనుచు నొక్క ఆసామి నా
కయ్యో తన కూతుళ్లను
చెయ్యూపుచు పిలిచి చూపె సిరిసిరిమువ్వా ”
ఇక పేరడీ అనేది ఫక్కున నవ్వించే ప్రక్రియ
‘అప్పిచ్చువాడు వైద్యుడు’ అనే పద్యానికి శ్రీశ్రీ పేరడి ప్రసిద్ధమైనది.
“ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన యూరకుండుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము మువ్వా ”
శ్రీశ్రీ రాసిన ‘ఏ దేశ చరిత్ర చూసినా’ కవితకు మచిరాజు దేవీప్రసాద్ గారి పేరడీ.
“ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణము
రహదార్ల చరిత్ర సమస్తం ధూళి ధూస పరివ్యస్తం. ”
ఆమోదయోగ్యమైన హాస్యాన్ని ఆనందంగా, అనుభవిస్తేనే ఆహ్లాదం, ఆరోగ్యం.
కీ.శే. జంధ్యాలవంటి రచయితలు హాస్యాన్ని అంగిరసంగా ఎన్నో రచనలు చేసారు. అగ్రస్థానంలో నిలబడ్డారు. ఆరోగ్యకరమైన హాస్యం అన్నివేళల అపురూపమే. ఆ ఆవశ్యకతను తెలిసికొని నిపుణులైన రచయితలు, కవులు తమ సృజనాత్మక శక్తితో రచనలు చేస్తే గొప్ప సంఘసేవ చేసినట్టే.
ఇది హస్యరసాన్ని గూర్చి కేవలం విహంగ వీక్షణం మాత్రమే. పద్యాలలో, వచనాలతో కవితలతో పరమాద్భుత విన్యాసాలు చేసి పఠితల్ని పరమానందభరితుల్ని చేసిన ఎందరో హస్యరస పోషకులు ఇంకా ఉన్నారు. అయినా ఇంకా మరెందరో వస్తేనే సమాజం సుహాసిని అవుతుంది.
పుస్తకం: శేషేంద్ర
వాహ్ ! తాజ్!!!
సేకరణ ; కర్లపాలెం హనుమంతరావు
23 - 12 - 2019

పలకరింపులే పట్టిస్తాయి సుమా!-సేకరణ


 సమస్యల'తో 'రణం ('పూ'రణం): October 2016

అర్జునుడు ద్వారకలోని శ్రీకృష్ణమందిరం చేరుకునేసరికి, శ్యామసుందరుడు శయనించివున్నాడు. అప్పటికే అక్కడికి విచ్చేసివున్న దుర్యోధనుడు (అతడు సైతం రాబోయే రణములో వాసుదేవుని సహాయం అర్థించడానికే వచ్చాడు), శయ్యకు శిరోభాగమున గల ఉచితాసనముపై ఉపవిష్టుడై గోచరించాడు. పార్థుడు సెజ్జకు పాదములవైపునున్న ఒక ఆసనముపై ఆసీనుడయ్యాడు.... కొంత సమయం తర్వాత, కళ్ళు తెరిచిన కమలాక్షునికి ఎదురుగా కవ్వడి (అర్జునుడు) కనిపించినాడు. పానుపు దిగివచ్చి, గోవిందుడు ఆప్యాయముగా అర్జునుని పలకరిస్తున్నాడు.
 "ఎక్కడినుండి రాక యిట? కెల్లరునున్ సుఖులే కదా! యశో
భాక్కులు నీదు నన్నలును, భవ్యమనస్కులు నీదు తమ్ములున్
జక్కగనున్నవారె? భుజశాలి వృకోదరు డగ్రజాజ్ఞకున్
దక్కగ నిల్చి శాంతుగతిఁ దాను జరించునె దెల్పు మర్జునా!"
(పాండవోద్యోగ నాటకము - తిరుపతివేంకటకవులు)
(యశోభాక్కులు = యశస్సుచే ప్రకాశించువారు, భవ్యమనస్కులు = పవిత్రహృదయులు, భుజశాలి = మహా బాహుబలం కలిగినవాడు, వృకోదరుడు = భీమసేనుడు, చరించునె = నడుచుకుంటున్నాడా)
భావము: "అర్జునా! ఎక్కడినుండి వస్తున్నావు? అందరూ కుశలమే కదా! కీర్తిచంద్రికలచే విరాజిల్లు నీ అన్నయ్యలు, పవిత్రమైన మనస్సు కలిగిన నీ తమ్ముళ్ళు బాగున్నారు కదా! మహాబలశాలియైన భీమసేనుడు, మీ పెద్దన్నగారి ఆజ్ఞకు లోబడి శాంతముగా నడుచుకుంటున్నాడా? చెప్పవయ్యా!" అన్నాడు గోపాలుడు.

చూడడానికి ఇది అతి సామాన్యమైన కుశలప్రశ్నల పద్యమే! కాని, కాస్త లోతుగా పరికిస్తే, కావలసినంత విషయం ఉంది ఇందులో!..... సుయోధనుని ఎదుటనే, అర్జునుని అన్నలను "యశోభాక్కులు" అని, తమ్ముళ్ళను "భవ్యమనస్కులు" అనీ సంభావించినాడు జనార్దనుడు. అంటే, వాళ్ళు ఎంతటి గుణసంపన్నులో పరోక్షముగా అతనికి తెలుపుతున్నాడన్నమాట! ' అన్నలను ప్రస్తావించినాడు కదా! మళ్ళీ భీముని ప్రసక్తి తేవడం ఎందుకు? ' అనిపిస్తున్నది కదూ! అదేమరి నందనందనుని నేర్పరితనం. భీముడిని "వృకోదరుడు" అని సంబోధించాడు ఇక్కడ. "వృకము" అంటే తోడేలు, "ఉదరము" అంటే కడుపు. అనగా ' తోడేలు యొక్క కడుపువంటి ఉదరము కలవాడు ' అని అర్థం. తోడేలుకు ఎంత తిన్నా, ఆకలి తీరదని చెప్తారు. ' రాబోయే కదనములో భీముడు ఆకలిగొన్న తోడేలు వలె, నీ అనుజుల పైకి లంఘిస్తాడు సుమా!' అని దుర్యోధనునికి బెదురు పుట్టిస్తున్నాడు. "భుజశాలి" అని పేర్కొని ' నీవలె గదాయుద్ధములోనే కాక, మల్లయుద్ధములో కూడా ఘనాపాఠీ ' అని సుయోధనుని గుండెల్లో గుబులు కలిగిస్తున్నాడు. ' అన్నయైన ధర్మజుని ఆజ్ఞకు బద్ధుడై నిగ్రహించుకుంటున్నాడుకాని, లేకుంటే మీ సంగతి ఏనాడో సమాప్తమయ్యేది ' అని చెప్పకనే చెప్తున్నాడు అచ్యుతుడు.... పాండవగుణ ప్రశస్తి అతని చెవులకు గునపాల్లా గుచ్చుకోవాలి. భీముని భుజబల ప్రసక్తి అతనికి ప్రాణాంతక మనిపించాలి. దుర్యోధనుని మనోస్థైర్యమును దెబ్బతీసే రాజనీతి ఇది.
-(ఈమాట- అంతర్జాతీయ పత్రిక నుంచి సేకరణః కవి పేరు నోట్ చేసుకోలేదు అప్పట్లో.. క్షమించమని మనవి!)

-కర్లపాలెం హనుమంతరావు


చిన్నపిల్లల కోసం : శాస్త్రం - వ్యవహారం - సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

ఒక ఊరికి నలుగురు ఉద్దండులు వెళ్ళారు - ఆ ఊరి మోతుబరిని  మెప్పించి, పారితోషికాలను పొందాలనే ఆశతో.

తిన్నగా ఆ ఊరి సత్రపు యజమానిదగ్గరకు వెళ్ళి తమకు బస, భోజన సౌకర్యం వగైరా ఇవ్వమని అడిగారు. వారి మాటల్లో స్వోత్కర్షగా మాట్లాడడం, కొంత అహంకారం వంటివి కనిపించాయి ఆ సత్రపు నిర్వాహకుడికి. అంతేగాక, వాళ్ళలో ‘ముఖ్యమైనదేదో’ తక్కువ అనిపించింది కూడా!  అందుకని ఆయన వాళ్ళకు చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు.


“అయ్యా! చిన్న ఇబ్బంది కలిగింది. బసకి ఏమీ ఇబ్బంది లేదుగానీ, మీకు భోజనాలు వండడానికీ, వడ్డించడానికీ సిబ్బంది లేరు. కాబట్టి, కావలసిన డబ్బు ఇస్తాను గానీ మీరే వండుకోవలసి ఉంటుంది.

మీరు తలకొక పని చేసుకుని, ఈ రోజుకి గడిపేయాలి” అన్నాడాయన.

"సరే" అన్నారు వీళ్ళు.


ఆయన ఒప్పజెప్పిన పనులు:


తార్కికుడు (logician) ఊరిలోకి పోయి నేయి తీసుకురావడం. 

వైయాకరణి (grammarian) మజ్జిగ కొనడం. 

జ్యోతిష్యుడు (astrologer) - విస్తరాకులకోసం చెట్టెక్కి, వాటిని కోసుకొచ్చి, తరవాత పుల్లలతో కుట్టడం. 

గాయకుడు (singer) - అన్నం వండడం. 


వీరందరూ అక్కడికి వెళ్ళినది 10 గంటలకు. 

‘2 గంటలయేసరికి మీ భోజనాలన్నీ అయిపోయి, కాస్త విశ్రమించవచ్చు’ అన్నాడతను వాళ్ళతో.


సరేనని వీరందరూ తలొక వైపుకు  బయలుదేరారు.


తార్కికుడు  నెయ్యి కొన్నాడు. సత్రానికొచ్చే దారిలో ఆయనకు ఒక అనుమానం వచ్చింది - ‘చెంబుకు నేయి ఆధారమా? నేతికి చెంబు ఆధారమా?’ అని (ఏది ఆధారం? ఏది ఆధేయం?). బాగా ఆలోచించినా సమాధానం దొరకలేదు! ‘పోనీ ఒంపి చూస్తే సరి!’ అనుకుని చెంబును తలకిందులు  చేశాడు. సమాధానం దొరికిందిగానీ, నేయి నేలపాలైంది.  ఏం చేయాలో తెలియక బిత్తరచూపులు చూస్తూ అక్కడే చతికిలబడ్డాడు! 


ఇక వైయాకరణి - ఎందరో గొల్ల స్త్రీలు మజ్జిగను అమ్ముకుంటూ ఆయనకెదురుగా పోతున్నారు. “చల్ల” అని దంత్య చకారాన్ని ఎవరూ పలకటంలేదు . ప్రతీ స్త్రీ కూడా “సల్ల” అనే భ్రష్టరూపాన్నే పలుకుతోంది! ఆయనకు చాలా కోపం వచ్చింది. ‘ఔరా! ఈ ఊరిలో ఈ అపభ్రంశపు శబ్దాలను వినలేకపోతున్నాను. సరియైన ఉచ్ఛారణ పలికే మనిషి దొరికేవరకూ నేను మజ్జిగను కొనను' అని భీష్మించుకుని ఒకచోట కూర్చుండిపోయాడు!


ఇక జ్యోతిష్యుడి సంగతి:

ఊరి చివర్లో ఉన్న ఒక మోదుగచెట్టునెక్కి, ఆకులను కోసుకుని, కిందకు  దిగబోతోంటే ఒక తొండ కనిపించిందాయనకు. ఏవో లెక్కలు వేసుకుని చూస్తే, అది దుశ్శకునమనీ, అది అక్కడే ఉంటే గనుక మరొక 4 గంటలవరకూ  చెట్టు  దిగడం దోషమని నిర్ణయించుకున్నాడు! ఆ తొండ ఈయనను  చూచి బెదిరిందో, ఏమో - అది అక్కడ, ఈయన పైన ఉండిపోయారు!


ఇక, గాయకసార్వభౌముడి విషయానికొస్తే - ఆయన ఎసట్లో బియ్యం పెట్టాడు. కుండలోని నీళ్ళు మరుగుతున్నాయి. ఆవిరికి మూత పైకీ క్రిందకీ పడిలేస్తోంది. ఈయన తాళం వేయసాగాడు . ఆదితాళం- ఉహూఁ, రూపక- ఉహూఁ, జంప-   ఉహూఁ --- ఏ తాళానికీ రావట్లేదు. అశాస్త్రీయమైన ఆ తాళానికి విసుగొచ్చి, ఆయన ఆ కుండమీద ఒక రాతిని విసిరేశాడు! ఇంకేముంది! అన్నం నేలపాలయింది. మరి ఈయన వంటగదిలోనే!


వీరందరూ ఏవో అవకతవకలు చేస్తారని ముందే ఊహించిన సత్రపు నిర్వాహకుడు. కొందరు మనుషులను పంపి, ఎక్కడెక్కడో చతికిలబడ్డ వారినందరినీ ఒకచోటికి చేర్చాడు.


'నాయనలారా! మీకందరికీ ఎప్పుడో వంటలు చేయించే ఉంచాను, భోజనాలకు లేవండి. 

దయచేసి నా మాటలు రెండు వినండి. మీరు మీ  శాస్త్రాలలో గొప్పవాళ్ళే అయుండచ్చు. కానీ మరొకరిని తక్కువచేసే విధంగా ఉండకూడదు మీ శాస్త్రజ్ఞానం వల్ల కలిగిన అహంభావం . మరొకటేమిటో మీకు చెప్పనక్కరలేదనుకుంటా. శాస్త్రజ్ఞానం ఒక్కటే  చాలదు జీవితంలో. దానితోపాటు కొంత వ్యవహారజ్ఞానం కూడా ఉండకపోతే కష్టమని మీకు మీరే నిరూపించుకున్నారు కదా!' అని వాళ్ళను సున్నితంగానే మందలించాడు.

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

18 -09- 2021 

( ఎప్పుడో.. ఎక్కడో  విన్న కథ) 

బోథెల్ ; యూ . ఎస్.ఎ 

అశోకుని యర్రగుడి శాసనాలు -సేకరణః కర్లపాలెం హనుమంతరావు


 అశోకుని యర్రగుడి శాసనాలు
-సేకరణః కర్లపాలెం హనుమంతరావు



గుత్తి-ఆదోని రోడ్డు ఒక రాష్ట్ర రహదారి. గుత్తి నుంచి  గమ్యస్థానం 13 కిలోమీటర్ల దూరంలో ఉంది యర్రగుడి. అక్కడి నుంచి అశోకుని శాసనాలున్న చోటు మరో  1 కి.మీ దూరం. స్థలాన్ని కనుక్కోవడం సులభంగానే ఉంటుంది.
అశోకుని రాతి నిర్మాణం రాష్ట్ర రహదారికి కిలోమీటరు దూరంలో కాంక్రీట్ రోడ్డుతో కలుపబడి ఉంది. సైట్ నిర్వహణ మెచ్చుకోతీరులో ఉంటుంది. బాధ్యుల చిత్రశుద్ధి, అంకితభావం క్షేత్రంలో  పుష్కలంగా ఆరోగ్యంగా పెరిగే చెట్లు, పూలమొక్కలు చెబుతున్నాయి.  
రోడ్డును వదిలి ఒక కాలి బాట  కొండ వెళుతుంది. ద్వారం వద్ద ఎఎస్ ఐ కర్నూలు సబ్ సర్కిల్ వారు ఏర్పాటు చేసిన గ్రానైట్ పలకల జత మీద  ఉన్న ఆంగ్ల పాఠాన్ని తెలుగులో అనువదించుకుంటే ఈ విధంగా ఉండవచ్చు.  
క్రీ.పూ 3వ శతాబ్దంలో ఈ ప్రదేశంలో గొప్ప మౌర్య చక్రవర్తి అశోకుడు శిలాఫలకాన్నిచెక్కించాడు. ఈ రాతి శాసనం బ్రహ్మీ లిపిలోను, ప్రకిత్ భాషలోను చెక్కబడింది. శాసనం ధర్మానికి సంబంధించింది: దేవతల ప్రియుడు ఈ విధంగా అన్నారు: దేవతల ప్రియుని ద్వారా మీరు ఆదేశించిన విధంగా ప్రవర్తించాలి. రజకులను వారి వంతుగా గ్రామప్రజలు, స్థానిక అధికారులను ఈ క్రింది మాటలలో ఆదేశించవలెను. "అమ్మా, నాన్న, పెద్దలను ప్రేమించాలి, జీవుని దయతో చూడాలి. నిజం మాట్లాడాలి".
హిందూ పత్రిక కర్నూలు ఎడిషన్ లో 2013 మే 31 న అశోకరాతి ప్రదేశాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి డి.శ్రీనివాసులు ఆసక్తి కలిగించే  సమాచారం వ్యాస రూపంలో ఇచ్చారు.
కళింగ దండయాత్ర తరువాత అశోక చక్రవర్తి చేసిన పర్యటనల సమయంలో రాయబడిన బ్రాహ్మీ లిపి, ప్రాకృత భాష శాసనాలు కూడా ఈ విధంగా ఉన్నట్లు పరిశోధకులు భావ. 256 రోజుల పాటు జరిగిన ఈ పర్యటన కార్యక్రమంలో చక్రవర్తి  చాలా చోట్ల క్యాంపు లు నిర్వహించినట్లు తెలుస్తుంది. స్థానిక చరిత్రకారుల కథనం ప్రకారం, మౌర్యుల కాలంలో స్వర్ణగిరిగా పిలిచిన జొన్నగిరి ని ఆ రాజ్యానికి దక్షిణ భారత రాజధానిగా వ్యవహరించినట్లు అనుకోవాలి.
శాసనంలోని అంశం ఇతర అశోకుని అ తరహా  శాసనాలతో సంబంధం లేనట్లుగా కనిపిసుంది. అక్కడ రాజును ప్రియదాసి, దేవతల ప్రియునిగా ప్రస్తావించడం  జరిగింది. తొమ్మిది శిలలపై 28 భాగాలున్న యర్రగుడి శాసనాలు, తల్లితండ్రులకు విధేయంగా ఉండాలని, అలాగే పెద్దల పట్ల విధేయత ఉండాలని, ప్రాణులపట్ల దయ ఉండాలి, సత్యం మాట్లాడాలి, ధర్మం యొక్క లక్షణాలను ప్రచారం చేయాలి, బలికోసం ఏ ప్రాణిని వధించరాదు. రోడ్ల పక్కన చెట్లు నాటడానికి, జంతువులు, మనుషుల ఆనందం కోసం బావులు తవ్వారు అని ఆ రాతి బండల మీదుంటాయి. ధర్మానికి సంబంధించిన ఈ శాసనాలు నా (అశోకుడు) ద్వారా వ్రాయబడినవి. నా కుమారులు, మనుమలు అందరి క్షేమం కోసం కృషి చేయాలని శాసనం పేర్కొన్నట్లు సమాచారం.
శిలా శాసనం  ప్రపంచంలోని అన్ని వన్యప్రాణుల సంక్షేమం కోసం చేసిన మొదటి చట్టంగా పరిగణించవచ్చని ఎస్.జె. కాలేజీ ప్రిన్సిపాల్, చరిత్రకారుడు డాక్టర్ అబ్దుల్ ఖాదర్ అభిప్రాయం. నిజానికి అవి మౌర్యన్  రాజ్య విధానం నాటి నిర్దేశక సూత్రాలు. ఆ స్థల విశేషాన్ని వివరిస్తూ, భద్రపరచవలసిన ఆవశ్యకతను ఉద్బోధించే వ్యాసాలు గణనియంగానే వచ్చినట్లు సమాచారం.  
ఈ ప్రదేశంలో ఇంకా  8 శిలాశాసనాలు కనిపించాయి. అక్షరాల పరిమాణంలో పరిణామం సుస్పష్టం. బండరాయిలోకి తొలవడం వల్ల లోతుల్లో వచ్చిన తేడా వల్ల ఈ తారతమ్యం సంభవించివుండచ్చన్నది పరిశోధకుల భావన. కొన్ని అక్షరాలు సుద్దముక్కతో రాసినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రంలో మూడు శాసనాలు ఉన్నాయి. ఒకటి దిగువ భాగంలో, త్రిభుజాకారంలో ఉన్న రాయి, వెనుక భాగంలో పెద్ద బండరాయి. ఇక్కడ కనిపించే ఈ శిలలన్నీ తూర్పు ముఖంగా ఉండగా, మిగిలిన శిలాశాసనాలు ఉత్తర-ముఖంగా ఉన్నాయి.
శాసనాలను నిశితంగా గమనించండి. ఉపరితలం అందంగా ముతకగా ఉంటుంది..
ఈ ఉపరితలం మృదువుగా ఉంటుంది.

ఇక్కడ శాసనాలు కేవలం ఉపరితలంపై ఉన్నాయి, ఎచ్చింగ్స్ లో లోతు లేదు, ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి.
కర్ణాటకలోని శాసనాలతో పోలిస్తే అక్షర పరిమాణాలు చాలా చిన్నవి. కర్ణాటక క్షేత్రాలల్లో గరిష్టంగా 3అంగుళాల నుంచి 5 అంగుళాల వరకు ఉండగ, ఇక్కడ గరిష్టంగా 3 అంగుళాల లోతు అక్షరాలను మాత్రమే చూడగలం. లభ్యమయే సందేశం  పొడవు, వెడల్పులను మీద ఈ లోతులు ఆధారపడివుండవచ్చని పరిశోధకుల అభిప్రాయం.  .
ఉపరితలం పోక్ మార్క్ చేయబడింది  చెక్కేవాని(ఇన్ స్క్రైబర్ )గొప్ప పనితనానికి ఈ శాసనం ఒక  మంచి ఉదాహరణ.
ఈ మెట్లకు పైన, ఎడమల వైపున్న  రాళ్ళ జత మీద శాసనాలను కనిపిస్తున్నాయి. ఇవి ఉత్తరాభిముఖంగా కనిపిస్తాయి.
 రాయి అంచుకు దగ్గరగా ఉంటుంది,  మెటల్ రెయిలింగ్ కూడా స్థిరంగా, బలంగా ఉండటం నిర్వహణలోని శ్రద్ధను సూచిస్తోంది.  ఉత్తరముఖంగా ఉన్న మరొక శాసనం. ఈ మార్గం రాతి నిర్మాణం యొక్క పశ్చిమ కొనకు దారితీస్తుంది.

ఈ సౌకర్యవంతమైన చోటు సందేశ రీడర్ల ద్వారా ఆక్రమించబడినట్లుగా కనిపిస్తుంది.  చల్లగా ఉండే ఈ చోటు నుంచి కింద పరుచుకున్న  మైదానాల అందాన్ని ఆస్వాదించవచ్చు.
చిన్న వీడియో చూడండి,
ద్వారం వద్ద ఒక చిన్న గుండ్రని రాయి నిఉంచారు. వచనం తెలుగు. యర్రగుడి గ్రామంలో ఈ శాసనం కనుగొనబడి, సురక్షిత ప్రాంతాలకు తరలిపోయింది.

చివరగాః
మౌర్యుని కాలంలో జొన్నగిరి స్వర్ణగిరిగా ప్రసిద్ధి చెందినదని చరిత్రకారులు చెబుతారు. దే  నిజం అయితే,  ఇప్పటి దాకా  భావిస్తూ వస్తున్నట్లు కర్ణాటకలోని కనకగిరి సువర్ణగిరి కాకూడదు మరి
.
Source: with Thanks to
karnatakatravel.blogspot.com/2015/05
major-and-minor-rock-edicts-of-ashoka.html......

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...