Sunday, December 19, 2021

ఉప్పూ - మానవ సంబంధాలు - శ్రీరమణ ( గుత్తొంకాయకూర- మానవసంబంధాలు - నుంచి ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు



ఉప్పూ - మానవ సంబంధాలు


- శ్రీరమణ

 ( గుత్తొంకాయకూర- మానవసంబంధాలు - నుంచి ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 


" నీ ఉప్పు తిని నీకు అన్యాయం చేస్తానా" అనేది చాలా పాప్యులర్ సామెత. “వాడి ఉప్పు తిని "నీ వాడికే అన్యాయం చేశాడు" అని రోజూ వినిపిస్తూ వుండే సత్యం. అందుకని ఉప్పుతో ముడిపడి బోలెడు మానవ సంబంధాలు వున్నాయి. 


మరీ పిచ్చి కోపం వస్తే "ఉప్పుపాతర వేస్తా!  నా సంగతి సాంతం నీకు తెలియదు" అనడమూ కద్దు. మనిషి జీవనానికి "ఉప్పుతో పదహారు తప్పని అవసరాలు" గా  అప్పటి మనిషి గుర్తించాడు. ఇందులో మళ్లీ ఉప్పు ప్రాధాన్యతను మనం గమనించాలి. 


మనిషి నేల, నింగి, సముద్రం, కొండ, కోన అన్నిటినీ శోధించి తనకు కావల్సినవి నిర్మొహమాటంగా లాగేసుకోవడం అనాది నుంచీ అవలంబిస్తున్నాడు. సముద్రంలో నీళ్లు ఉప్పు ఖనిజాన్ని కషాయాలుగా వున్నాయని తెలిసి, ఉప్పు కూడా వొక రుచే అని గ్రహించాడు. అక్కడ నుంచి సముద్రానికి  ఏతం వేసి ఉప్పును పండించడం మొదలుపెట్టాడు. ఉప్పును తయారు చేయడాన్ని ' ఉప్పు పండించడం'  అంటారు. అంటే దీనిని పంటగా భావించారు. మానవ సంబంధాలు చాలా గట్టివని దీనినిబట్టే అర్థం అవుతోంది. 


" ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు ..." అన్నాడు సుమతీ శతకకారుడు. "ఏటికేతామెత్తి ఎన్ని పుట్లు పండించినా గంజిలో ఉప్పెరుగుమన్నా..." అని శ్రమజీవులు గుండెలు పిండేలాగా పాడారు. "ఉప్పు మెప్పు కోరేటోల్లు తప్ప వొప్పు చేసేటోల్లం" అని మనిషి సహజ లక్షణాన్ని చెబుతూ, అందులో ఉప్పు పాత్రని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఉప్పు కారం తినేవాళ్లకు రోషం భాషం వుంటుందని వొక నమ్మకం.  ఉప్పు లేని పప్పు చప్పుగా చస్తుంది అన్న నిజాన్ని "కట్టుకున్న పెళ్లాంలా" అని పొడిగించాడు.


ఏ వంటకంలో ఎంత ఉప్పు వెయ్యాలో నలుడికి తెలుసు .. భీముడికి తెలుసు. అసలు పాకశాస్త్రం పురుష కళ. క్రమేపీ పురుషుల నుంచి ఆ కమ్మటి కళ చేజారి స్త్రీల హస్తగతం అయింది. అక్కడ నుంచి వారి చేతులు వడ్డించేవి అయినాయి. పైచేయి కూడా అయింది ఆటోమేటిక్ గా. 


వంటకాల తయారీ గురించి రాసేటప్పుడు ఉప్పు దగ్గరకు వచ్చేసరికి “తగినంత”గా అని వొక మాట వాడతారు. అక్కడే వుంది తిరకాసు. మిగిలినవన్నీ కొలతలు, తూకాలు చెప్పి, ఉప్పు విషయంలో తేల్చకుండా తగినంత అనడంలో ఫార్ములా ముడి విప్పకుండా దాటివేయడమే! ఇలాంటి చోట మానవ సంబంధాలు సఫర్ అవుతాయి తప్పదు. శ్రీశ్రీ "ఇతరేతర’ శబ్దం లాంటిదే ఇక్కడ “తగినంత" అన్నమాట. ఇంతటితో యీ ప్రస్తావన ముగించకపోతే "ఉప్పు పత్రి కాకుండా” నన్ను తిట్టే ప్రమాదం వుంది. 


ఉప్పు దిగతుడిస్తే జనదిష్టి పోతుందిట. పూర్వం ఉప్పు కల్లు, కల్లుప్పు అని వ్యవహరించేవారు. కల్లు అంటే రాయి అని అర్థం. "తిరగలి కల్లు" అంటే తిరిగే రాయి అని అర్థం. ఈ శబ్ద చర్చని మరీ తిప్పితే మానవసంబంధాలు పిండి పిండి అయిపోయే అవకాశం వుంది. 


రాత్రి పూట "ఉప్పు" అనకూడదట! "దీపాలు ఆరిపోతాయ్" అని చెప్పేది మా నాయనమ్మ. అందుకని చవి, రుచి, లవణం, బుట్టలోది అని దీపాలు ఆరకుండా ఛాందసులు జాగ్రత్త పడేవారు. ఉప్పు చేతిలో వెయ్యకు గొడవలు వస్తాయని పెద్దవాళ్లు చెప్పేవారు. అంటే మానవ సంబంధాలు చెడిపోతాయనే. దానివెనుక శాస్త్రీయ లక్ష్యం గురించి హేతువాదులు తర్కించుకుని ఏకాభిప్రాయానికి రావాలి. వారి శాస్త్రీయ పరిశోధనలను సామాన్య మూఢులకు అందించి పుణ్యం కట్టుకోవాలి. హేతువాదులు పుణ్యాన్ని, అదృష్టాన్ని నమ్మరు, కాని అనుభవిస్తారు. అసలు కరెంటు దీపాలు వచ్చాక ఉప్పు అన్నా ఉఫ్ అన్నా కొండెక్కే అవకాశం లేదని వాళ్లు వాదిస్తారు. 


ఉప్పు మీద బోలెడు సామెతలున్నాయి. చెమట కన్నీళ్లు ఉప్పగా వుంటాయి. శ్రమ, దుఃఖం యీ రెండూ మానవ సంబంధాలకు సంబంధించిన వస్తు సామగ్రిలో ప్రధానమైనవి. 'అడవిలో ఉసిరికాయ, సముద్రంలో ఉప్పు- కలిస్తే ఊరగాయ" అంటుంటారు. దీని వెనుక మొత్తం భారతీయ తత్వశాస్త్రమంతా యిమిడి వుంది. భార్యాభర్తల సంబంధం వుందనుకోండి. అమ్మాయి అమలాపురంలో పుట్టి పెరుగుతుంది. అబ్బాయి అట్లాంటాలో గ్రీన్ కార్ట్ హోల్డరు. వాళ్లిద్దరికీ పెళ్లి అవుతుంది. జాడీలో పడతారు. యిలాగ వివాహ వ్యవస్థకు ఆపాదించుకోవచ్చు. అలాగే పి.వి. ఆంధ్రాలో పుట్టి, పెరిగి రాంటెక్లో నిలిచి గెలిచి ప్రధాని కావడం వుందనుకోండి. ఇక్కడ పి.వి. వుసిరికాయ. రాంటెక్ వోటర్లు ఉప్పురాళ్లు. ప్రధాని పదవి ఊరగాయ- మిగిలిన యీక్వేషన్లు, కొటేషన్లు మీరు పూరించుకోండి. 


నిజం. ఒక పెళ్ళిలో వియ్యంకుడికి వడ్డించిన వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైందని పెద్ద గొడవ అయింది. ఆడపెళ్లి వారు క్షమాపణ చెబితే గాని లాభం లేదనీ, పీటల మీద పెళ్లి ఆగిపోతుందనే దాకా వచ్చింది. చివరకు పెద్ద మనుషులు కల్పించుకుని, మళ్లీ యిన్ని వంకాయ ముక్కలు వుడికించి కూరలో కలిపి, సరిపోయిందనిపించారు. అప్పుడు గాని పెళ్లికొడుకు తండ్రి కుదుట పడలేదు. 


మన ప్రాచీన వేదాలు జాగ్రత్తగా చదివినట్లయితే “ఉప్పు”కి వొక అధిష్టాన దేవత వున్నట్లు స్పష్టం అవుతుంది. ఆవిడ నివాసం సముద్రం. దేవతలు రాక్షసులు మంధరగిరిలో  క్షీరసాగరాన్ని మధించినపుడు ఆమెకు కోపం వచ్చింది. అంతటి చరిత్రాత్మక సన్నివేశం తన వద్ద కాకుండా క్షీరసాగరంలో చేశారని ఖిన్నురాలైంది. "నేనే కనుక పతివ్రతని అయితే నా వొక్క కల్లుతో కడివెడు క్షీరము విరిగిపోవు గాక" అని శపించింది. ఆవిడ నిజంగానే పతివ్రత అవడం వల్ల యిప్పటికీ శాపం అమలులో వుంది. 


ముఖ్యంగా భారతీయులకు, ఉప్పుతో వున్న సంబంధం యింకెవరికీ వుండదు. దండి సత్యాగ్రహం, అదే ఉప్పు సత్యాగ్రహం. ఉప్పుమీద తెల్లదొరలు పన్ను వేశారని ఆగ్రహించాం. ప్రస్తుతం అదే ఉప్పు నల్లదొరల పాలనలో పెట్టుబడిదారులకు రహదారి అయింది. కోట్లాది రూపాయల వ్యాపారం నడుస్తోంది. ఇప్పుడు ఉప్పు రైతులు లేరు సాల్ట్ కింగ్స్ తప్ప. వీటన్నిటి వెనుక వున్న మానవ సంబంధాలను మీరు గుర్తించాలి. 


రక్తపోటు వున్న వాళ్లు ఉప్పు తగ్గించాలంటారు. ఏదైనా లోగుట్టు చెబితే ఉప్పు అందించాడంటారు. కొన్ని పేపర్లూ ఉప్పు అందించమని పాఠకులను కోరుతూ వుంటాయి. కొందరు అందిస్తూనే వుంటారు. బయట పడిందంటే మానవ సంబంధాలు బాగా చెడిపోతాయి. 


బాల్యంలో ఉప్పు అద్దుకుని మామిడి పిందెలు తిన్నాం. పెద్దయ్యాక ఖరీదైన బార్ కు  వెళితే చేతిమీద గంధం రాసినట్టు తడి ఉప్పు రాసి, “యిది తాగుతూ మధ్య మధ్య నాలికతో దానిని రుచి చూడండి" అన్నాడు. ఏమిటిది అంటే “చకిటా” అంటే యిదే అన్నాడు బార్ వాడు. 


కస్తూరిబాకి బి.పి. వుంటే వైద్యుడు ఉప్పు వాడద్దని చెప్పాడట. ఆమె మాత్రం మానెయ్యలేక మామూలుగానే తింటోంది. ఆ సంగతి తెలిసి గాంధీజీ వుప్పు మానేశారు. చప్పిడి తినడం మొదలు పెట్టారు. ఆవిడ లబోదిబోమని వెంఠనే ఉప్పుకి స్వస్తి చెప్పిందిట. ఇవన్నీ ఉప్పుతో మానవ సంబంధాలు కాదూ!


విశ్వనాథ సత్యనారాయణవి విచిత్రమైన అలవాట్లు. సాయంత్రం నలుగురు మిత్రులనో శిష్యులనో వెంట వేసుకుని కూరల మార్కెటుకు  వెళ్లడం వొక ఆటవిడుపు. అక్కడ మసాలా దినుసుకి నిలువుగా కోసిన వొక కొబ్బరి ముక్క రెండు పచ్చి మిరపకాయలు, ఇంటి దగ్గర్నించే గుర్తుగా తెచ్చుకున్న చిటికెడు ఉప్పు నోట్లో వేసి రుబ్బేవారుట. ఆయనకు కొబ్బరి పచ్చడి తిన్నట్లు వుండేది. మరి జిహ్వ అంటే అదీ జిహ్వ!


- శ్రీరమణ ' ( గుత్తొంకాయకూర- మానవసంబంధాలు - నుంచి ) 


సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

19-11-2021 ; బోథెల్ : యూ ఎస్ ఎ


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...