అర్జునుడు
ద్వారకలోని శ్రీకృష్ణమందిరం చేరుకునేసరికి, శ్యామసుందరుడు
శయనించివున్నాడు. అప్పటికే అక్కడికి విచ్చేసివున్న దుర్యోధనుడు (అతడు సైతం రాబోయే
రణములో వాసుదేవుని సహాయం అర్థించడానికే వచ్చాడు), శయ్యకు
శిరోభాగమున గల ఉచితాసనముపై ఉపవిష్టుడై గోచరించాడు. పార్థుడు సెజ్జకు
పాదములవైపునున్న ఒక ఆసనముపై ఆసీనుడయ్యాడు.... కొంత సమయం తర్వాత, కళ్ళు తెరిచిన కమలాక్షునికి ఎదురుగా కవ్వడి (అర్జునుడు) కనిపించినాడు.
పానుపు దిగివచ్చి, గోవిందుడు ఆప్యాయముగా అర్జునుని
పలకరిస్తున్నాడు.
"ఎక్కడినుండి రాక యిట? కెల్లరునున్ సుఖులే కదా! యశో
భాక్కులు నీదు
నన్నలును, భవ్యమనస్కులు నీదు తమ్ములున్
జక్కగనున్నవారె? భుజశాలి వృకోదరు డగ్రజాజ్ఞకున్
దక్కగ నిల్చి
శాంతుగతిఁ దాను జరించునె దెల్పు మర్జునా!"
(పాండవోద్యోగ నాటకము -
తిరుపతివేంకటకవులు)
(యశోభాక్కులు = యశస్సుచే
ప్రకాశించువారు, భవ్యమనస్కులు = పవిత్రహృదయులు, భుజశాలి = మహా బాహుబలం కలిగినవాడు, వృకోదరుడు =
భీమసేనుడు, చరించునె = నడుచుకుంటున్నాడా)
భావము:
"అర్జునా! ఎక్కడినుండి వస్తున్నావు? అందరూ
కుశలమే కదా! కీర్తిచంద్రికలచే విరాజిల్లు నీ అన్నయ్యలు, పవిత్రమైన
మనస్సు కలిగిన నీ తమ్ముళ్ళు బాగున్నారు కదా! మహాబలశాలియైన భీమసేనుడు, మీ పెద్దన్నగారి ఆజ్ఞకు లోబడి శాంతముగా నడుచుకుంటున్నాడా? చెప్పవయ్యా!" అన్నాడు గోపాలుడు.
చూడడానికి ఇది అతి
సామాన్యమైన కుశలప్రశ్నల పద్యమే! కాని, కాస్త
లోతుగా పరికిస్తే, కావలసినంత విషయం ఉంది ఇందులో!.....
సుయోధనుని ఎదుటనే, అర్జునుని అన్నలను
"యశోభాక్కులు" అని, తమ్ముళ్ళను
"భవ్యమనస్కులు" అనీ సంభావించినాడు జనార్దనుడు. అంటే, వాళ్ళు ఎంతటి గుణసంపన్నులో పరోక్షముగా అతనికి తెలుపుతున్నాడన్నమాట! '
అన్నలను ప్రస్తావించినాడు కదా! మళ్ళీ భీముని ప్రసక్తి తేవడం ఎందుకు?
' అనిపిస్తున్నది కదూ! అదేమరి నందనందనుని నేర్పరితనం. భీముడిని
"వృకోదరుడు" అని సంబోధించాడు ఇక్కడ. "వృకము" అంటే తోడేలు, "ఉదరము" అంటే కడుపు. అనగా ' తోడేలు యొక్క
కడుపువంటి ఉదరము కలవాడు ' అని అర్థం. తోడేలుకు ఎంత తిన్నా,
ఆకలి తీరదని చెప్తారు. ' రాబోయే కదనములో
భీముడు ఆకలిగొన్న తోడేలు వలె, నీ అనుజుల పైకి లంఘిస్తాడు
సుమా!' అని దుర్యోధనునికి బెదురు పుట్టిస్తున్నాడు.
"భుజశాలి" అని పేర్కొని ' నీవలె గదాయుద్ధములోనే
కాక, మల్లయుద్ధములో కూడా ఘనాపాఠీ ' అని
సుయోధనుని గుండెల్లో గుబులు కలిగిస్తున్నాడు. ' అన్నయైన
ధర్మజుని ఆజ్ఞకు బద్ధుడై నిగ్రహించుకుంటున్నాడుకాని, లేకుంటే
మీ సంగతి ఏనాడో సమాప్తమయ్యేది ' అని చెప్పకనే చెప్తున్నాడు
అచ్యుతుడు.... పాండవగుణ ప్రశస్తి అతని చెవులకు గునపాల్లా గుచ్చుకోవాలి. భీముని
భుజబల ప్రసక్తి అతనికి ప్రాణాంతక మనిపించాలి. దుర్యోధనుని మనోస్థైర్యమును
దెబ్బతీసే రాజనీతి ఇది.
-(ఈమాట- అంతర్జాతీయ పత్రిక నుంచి సేకరణః కవి పేరు నోట్ చేసుకోలేదు అప్పట్లో.. క్షమించమని మనవి!)
-కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment