Showing posts with label Magazine. Show all posts
Showing posts with label Magazine. Show all posts

Saturday, December 18, 2021

పాత బంగారం : కథానిక కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 నిరీక్షణ - ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ సేకరణ : కర్లపాలెం హనుమంతరావు




 



పాత బంగారం : కథానిక 

కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 

నిరీక్షణ 

- ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ 

సేకరణ :  కర్లపాలెం హనుమంతరావు 


యంత్రంలా సాగిపోతున్న జీవన సరళిలో అతనిరాక ఒక గొప్ప అనుభూతి. 


జీవితంలో ఎదురైన చేదు అనుభవం అతని జీవితాన్నే మార్చేసింది. అనుభూతినే ఊపిరిగా పీలుస్తూ దూరమై పోయిన 'ఆనందాన్ని ఆస్వా దించడానికి, అందుకోడానికి ప్రయత్నిస్తున్నాడతను....


నిరీక్షణలో మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడా? |


ఆదో విచిత్రమైన స్థితి.అతనిది:


అనందం లాంటి విచారం . విచారం లాంటి ఆనందం


అదో చిన్న రైల్వే స్టేషన్.

నేనక్కడ అసిస్టెంట్ స్టేషన్ మేష్టార్ని.


ఈ ప్రాంతానికి బదిలీ అయి దాదాపు రెండేళ్ళు అయ్యింది. ఇక్కడ కొచ్చిన కొత్తలో ఇక్కడి వాతావరణం అలవాటు అవ్వడం కాస్త కష్టమే అయ్యింది. 


పట్నంలో పుట్టి పెరగడంవల్ల పల్లెటూరి వాతావరణం కొత్తగా, కొంచెం ఇబ్బందిగా వుంది... వచ్చిన రెండో రోజునే, జలుబు.... జ్వరం.....


వైద్య సహకారాలు పెద్దగాలేవు. ఏదో అదృష్టం బాగుండి ఓ వారం తరువాత కోలుకున్నాను.  తరువాత క్రమేణా వాతావరణానికి అలవాటు వడ్డాను. వాతావరణంతో 'అవగాహన' ఏర్పడ్డాకా, అక్కడి జనం, వాళ్ళ వేషభాషలు కూడా అర్ధమయ్యాయి. 


అంతా అర్థమయ్యాకా, అంతా ఆనందమే! అక్కడి వాళ్ళతో నేను కలిశాను. నాతోవాళ్ళు కలిశారు. స్టేషన్లో పెద్దగా పనులు వుండవు. ఎక్స్ ప్రెస్ బళ్ళు వచ్చినప్పుడు సిగ్నల్స్ చూ పెట్టడం.... రెండే రెండు 'ఎక్స్ప్రెన్సులు' వస్తాయి రోజుకి . అవి ఉదయం  వేళలలో రావడంతో... దాదాపు మధ్యాహ్నమంతా ఖాళీయే: 


మళ్ళీ సాయంత్రం ఆరింటికి ఓ ప్యాసింజర్ వస్తుంది. దాంట్లోంచి ఒకరిద్దరు కన్నా దిగరు. వెళ్ళేవాళ్ళు ఒక్కొసారి అసలు వుండరు. అడపా దడపా నాలుగైదు గూడ్స్ బళ్ళు వస్తుంటాయి. అందుకే పెద్దగా పన్లు ఉండవు . వున్నా వున్నట్టు అనిపించదు.


ఏడాది కొకసారి ఈ ప్రాంతంలో తిరునాళ్ళు లాంటిది జరుగుతూ వుంటుంది. అప్పుడే కాస్త రద్దీగా వుంటుంది. అందుకే.....


ప్రొద్దున్నుండి సాయంత్రం వరకు గడవడం పొద్దు బోదు . కానీ వుద్యోగ ధర్మం తప్పదు.


రోజంతా భరించలేని వేడిమిని భరించడంవల్ల సాయంత్య్రం కోసం, సాయింత్య్రం వీచే చల్లని పిల్లగాలులకోసం ఎదురు చూడడం నా జీవితంలో నిత్యకృత్యమయి పోయింది. ఇక్కడి సాయంత్రం  నిజంగా చాలా అందంగా వుంటుంది.


ఆ అందానికి వన్నె తెస్తూ. ప్రకృతి సంధ్యారాగ సంకీర్తన! 

దూరంగా గూళ్ళవైపు సాగిపోతున్న పక్షుల గుంపులు. ఏవో నందేశాలు

హడావిడిగా మోసుకుపోతూ నీలిమేఘాలు. 

పిల్లగాలి కెరటాల సప్తస్వరాలు.

నిశ్శబ్ద సౌందర్యం.


అలాంటి సమయంలో

' అతను'  వస్తున్నాడు.


అతని పేరు తెలీదు. దాదాపు ఏడాది నుండి వస్తున్నాడు.


మా యిద్దరి మధ్య మాటల్లేవు. చూపులతోనే పలకరింత.


అందమైన నిశ్శబ్దం ఇద్దరిమధ్య.


ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు ప్యాసింజర్ వచ్చే వరకు చూస్తాడు.


వచ్చేకా, అది వెళ్ళే వరకు అన్ని బోగీల్లోకి చూస్తూ, అటునుండి ఇటూ,

నుండి టూ తిరుగుతాడు.


రైలు కదిలేవరకు అక్కడే  వుండి, కదిలాకా, భారంగా ఓ నిట్టూర్పు విడిచి, మెల్లగా అడుగులో అడుగువేసుకుంటూ వెళ్ళిపోతాడు.. ఇక్కడికి దగ్గర్లోవున్న పల్లె.. దాదాపు మూడుమైళ్ళ దూరం. 


రోజూ అంత దూరంనుండి ఎందుకు వస్తున్నట్లు? పోనీ అతని కోసం ఎవరైనా వస్తారా? 

ప్స్! . . ఎవరూ రారు.


ఒకసారి పోర్టర్ వెంకటయ్య మాటల్లో తెలిసిందేమిటంటే- అతను దగ్గర్లో వున్న పల్లెటూరిలోని పాఠశాల మేష్టారు. దాదాపు ఏడాది అయ్యిందిట ఆవూరు వచ్చి మనిషి.  బక్కపలచగా వుంటాడు. పెద్ద ఎత్తుగా వుండడు, వదులైను ఫాంట్, లూజ్ షర్ట్ వేసుకుంటాడు. నిర్మలంగా వుండే మొహంలో కొద్దిగా జాలి, ఎక్కువగా కరుణ

కన్పిస్తాయి. కళ్లాల్లో  మాత్రం ఏదో లోతుచూపులు. ఏదో పోకొట్టుకున్న తున్నట్టు వుంటాయి,


" అమాయకుడిలా వుంటాడు" అని అంటాడు వెంకటయ్య. 

ఎండైనా -


వానైనా -


చలైనా -


వచ్చేవాడు. వస్తున్నాడు. ఇంత శ్రమపడి రావడ మెందుకు?


ప్రశ్నకి ఎంత ఆలోచించినా జవాబు దొరకడం లేదు.


మధ్యాహ్న నుండి వాతావరణం ఆదో మాదిరిగావుంది. మేఘాలు కమ్ము కున్నాయి. రివ్వున ఈదురు గాలులు వీస్తున్నాయి. చినుకు ఏ క్షణానైనా రావొచ్చు. చలికి ధరించలేక స్వెట్టర్ వేసుకున్నాను. యింకా అరగంట వేచివుండాలి ... ప్యాసింజర్ కోసం.

గాలి విపరీతంగ వీస్తోంది . దగ్గర్లోవున్న చెట్లు 'లయ' గా తలలు వూపుతున్నాయి.

గాలి గంభీరంగా అరుస్తోంది.


క్షణంలో... చూస్తుండగానే... గాలి కెరటాల పురవడిలోంచి చినుకులు పడడం ప్రారంభించాయి...బంగారు తీగెలా మెరిసే మెరుపు... ఆకాశాన్ని చీలుస్తూ 

కుండపోతగా........

ధారలు ధారలుగా వర్షం....


' ధన్...' దూరంగా ఎక్కడో పిడుగు పడింది..


ప్రకృతి భీభత్సంగా తయారయ్యింది..


హోరు మనిగాలి.. అంతకంతకు  చినుకులు.. పిడుగు శబ్దం.... చినుకులు...


తాండవం చేస్తున్నాయి....


గాలీ. . వానపోటీ పడ్తున్నాయి....


స్టేషన్లో కరెంటు పోయింది.... లాంతరు వెతికి, దీపం వెలిగించడం గగనమయ్యింది. పోర్టర్ కూడలేడు.  వూళ్ళో ఎవరో బంధువులు వచ్చేరని, చూడడానికి మధ్యాహ్నమే వెళ్ళాడు.

చీకటి తెరలు అలుముకుంటున్నాయి.

భయ కంపితుడ్ని చేస్తోంది ప్రకృతి! 


అరగంట గడిచింది తెలీకుండానే. 

ఫోన్ మోగింది. ప్యాసింజర్ గంట లేటుట. పక్క స్టేషన్నుండి వర్తమానం వచ్చింది.


మరో పావుగంట తరువాత.....


చినుకులవేగం తగ్గింది. లాంతరు వెలుతురులో దూరంనుండి ఎవరో వస్తూ కన్పించారు. వెంకటయ్య అనుకున్నాను వస్తున్నది


' అతను' హడావిడిగా వస్తున్నాడు. తలమీదో గుడ్డ కప్పుకున్నాడు. మనిషిదాదాపు తడిసిపోయాడు.


' మేష్టారూ! ...ట్రైన్ వచ్చిందా?" ఆత్రంగా అడిగాడు, మెల్లగా వణుకు 


తున్నాడు. 


" లేదండి.. గంటలేటు.... "అన్నాను.


“....ఇలా బయటికు  అడుగు వేశానో లేదో ... మొదలయ్యింది . 

 చిన్న వానే అనుకున్నా, బాగా తడిపేసింది....." అన్నాడు అలా దూరంగా చూస్తూ. 


అదృష్టం బాగుండి కరెంటు వచ్చింది. తువ్వాలు వెతికళ్ళల్లోకి కృతజ్ఞతగా చూశాడు. 


" ట్రైన్ వచ్చేవరకుఇక్కడే వుండండి! బాగా కురుస్తోందివాన...." అన్నాను. 


అక్కడే వున్న కుర్చీ అతని వైపు జరుపుతూ. 


దానిమీద కూర్చొని వాన లోకి చూస్తున్నాడు


 " ఏవండీ.... రోజూ వస్తున్నారు..... ఎవరేనా బంధువులు వస్తారా .... వస్తున్నారా?" 


ప్రశ్న ఎలావేయాలో తెలీలేదు. తెలుసుకోవాలనే కుతూహలం ఆ ప్రశ్న వేసింది.


అతను జవాబు చెప్పలేదు.


“.. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి!  దాదాపు మిమల్ని ఏడాది నుండి గమనిస్తున్నాను. వస్తున్నారు.... వెళుతున్నారు...."అన్నాను.


క్షణం తరువాత.. 


"ఎవరూ రారండి.... వస్తారేమోనని ఆశ..." అని క్షణం ఆగి "నిరీక్షణలో బాధకన్నా ఆనందమే ఎక్కువగా వుంది...." అన్నాడు.


అర్ధం కానట్టు చూశాను. అతను చెప్పడం కొనసాగించాడు. “.... ఇన్నాళ్ళు మీరు నన్నడగలేదు.... కానీ.... మీకో విషయం తెలుసా?"


ఏమిటన్నట్టు చూశాను,


“... ఎప్పుడూ మీతో చెద్దామనే ప్రయత్నించాను. కానీ.... అవకాశం రాలేదు." నేను ఆశ్చర్య పోయాను. 


కష్టాన్నైనా, సుఖాన్నైనా మరొకరితో చెప్పుకుంటే, కాస్త ఓదార్పు కలుగుతుందంటారు" అని వానలోకి క్షణంచూసి. . " ఒక్కో మనిషి జీవితం ఒక్కోరకం.... విధాతనృష్టి విచిత్రం. మనిషికి మమతానురాగాల మధురిమని అందిస్తాడు ... రుచినంపూర్ణంగా ఆస్వాదించ

కుండానే దూరం చేస్తాడు. క్షణం వనంతం. క్షణం శిశిరం. జీవితం సుఖ దుఃఖాల సమ్మేళనం...." అని ఆగి "మీకు విసుగ్గావుందాః" అని తెచ్చి పెట్టుకున్న నవ్వు నవ్వాడు. 


కాగితం పూవులా వుందా నవ్వు.


" లేదు..లేదు..ఇదో విచిత్రమైన అనుభవం! చెప్పండి...." అన్నాను  ఆసక్తిగా  ముందుకు వంగుతూ....


నా ఆసక్తిని చూసి, మెల్లగా నిట్టూర్పు విడిచి కొనసాగించాడు. 

చినుకుల శబ్దం..అపరిచిత వ్యక్తి మాటలు ..విచిత్రానుభూతి..... చిత్రమైన కుతూహలం..


" నా జీవితం మొదటినుండి ఒక రకమైన ఆప్యాయతలకి అనురాగాల! 

చేరువుగా వుంది. మా తాతయ్య వాళ్లది ఉమ్మడి కుటుంబం. తాతయ్యకు  యిద్దరు కొడుకులు . ఒకరు వ్యవసాయం. మరొకరు వుద్యోగం. పాత బంగారం : కథానిక 

కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 

నిరీక్షణ 

- ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ 

సేకరణ :  కర్లపాలెం హనుమంతరావు  గారికే వుద్యోగం . వుద్యోగరీత్యా అయిన వాళ్ళందరికి  దూరంగా వుండవలసి వచ్చింది. తాతయ్య చాలాసార్లు నాన్నతో అన్నాడు. " నీకా వుద్యోగం.... ఎందుకురా?  హాయిగా యిక్కడే వుండకా?" అని. 

నాన్నగారికి వ్యవసాయ మంటీ  యిష్టంలేదు. ఎట్టి పరిస్థితిల్లోను కనీసం ఏడాదికోసారైనా, తాతయ్య గారింట్లోగడపాలనే షరతుమీద తాతయ్య నాన్నగారు పుద్యోగం చేయడాన్ని వప్పుకున్నాడు." అని ఆగి రెండు క్షణాలు దూరంగా చూస్తుండిపోయాడు . 


 గాలి హోరు తగ్గుతోంది క్రమేణా. చినుకులు మెల్లగా చిందులు చేస్తున్నాయి. 


" ఆ ఏడాది స్కూలుకి వేసవి సెలవులు యిచ్చారు. బాబయ్య ఏదో పనిమీద మా  ఊరు వస్తే ! నాన్నగారు వాళ్ళు బాబయ్యితో తాతయ్య గారింటికి పంపారు నన్ను. లీవ్ శాంక్షన్ అయ్యాక, అమ్మా, నాన్న, చెల్లి వస్తామని.. " 


మెరుపు మెరిసింది... ఒకసారి కాంతి వెల్లువ .  మళ్ళీ మాములే. సిగ్నల్ లైట్ డిమ్ గా వెలుగుతోంది.


"నాన్నగారు వాళ్ళు వస్తామన్న రోజు.... నేనూ బాబయ్య స్టేషన్లో ఎదురు చూస్తున్నాము .  అప్పటికి అమ్మా వాళ్ళని వదిలివారం రోజులయ్యింది..


నాకు బెంగగావుంది. అమ్మవస్తే ఆమె ఒడిలో ఒదిగి పోవాలని కోరిక. అదే మొదటిసారి వాళ్ళని విడిచి వుండడం. ఎదురు చూస్తున్నాము. ఎంత సేపటికి ట్రైన్ రాలేదు. కొంతసేపటికి తెలిసింది అమ్మావాళ్ళు ఇంకరారని. వేగంగా వస్తున్న రైలు పట్టాలు తప్పి... 

స్పష్టంగా కన్పిస్తున్నాయి కను కొలుకుల్లో కన్నీళ్లు.


గొంతులో స్పష్టంగా జీర.


"..ఆరోజు నుండి ఆదో అలవాటుగా మారిపోయింది. వస్తున్న ఏ రైలుని చూసినా నా వాళ్లు వస్తున్నారని... 'నా బంగారు కొండ' అనే అమ్మ, "వెధవా! ఏం చేస్తున్నావ్?" అనే నాన్న అన్నయ్య నన్ను భయపెడ్తారని 


అమ్మతో చెప్పి కొట్టించి....బూదచాడికి  యిప్పించేస్తా!  అనే చెల్లి వస్తారని ఏదో లాంటి విచారం ఎదురుచూపు...


దూరంగా రైలు వస్తున్న కూత విన్పించింది. అతను మెల్లగాలేచాడు. స్టేషన్లోకి వస్తున్న రైలుకేసి అడుగులు వేస్తున్నాడు.


చిన్న చిన్న చినుకులు పడ్తున్నాయి. చినుకుల మాటున మసక వెలుతురు దాటున మెల్లగా వెతుక్కుంటూ సాగి పోతున్నాడతను.

రైలుని చూసిన అతని మొహంలో స్పష్టమైన మార్పు. 

 ఆనందమాః విచారమా?


మరో పది నిముషాల తరువాత.


రైలు కదుల్తోంది....


అతను మెల్లగా సాగుతున్న రైలుతోపాటే నడుస్తున్నాడు.


బోగీలో ఎవరితోనో మాట్లాడుతున్నాడు....


మాటల్లో నవ్వుతున్నాడు.


నవ్వుతున్నా. 


 కనుకొలకుల్లో ఆ కన్నీళ్ళెందుకు?

***

పాత బంగారం : కథానిక 

కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 

నిరీక్షణ 

- ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ 

సేకరణ :  కర్లపాలెం హనుమంతరావు 


   

   

Sunday, December 12, 2021

సంపూర్ణ మద్యపాన ఉద్యమం - కర్లపాలెం హనుమంతరావు - వ్యంగ్యం - చుట్టుపక్కల చూడరా కాలమ్ - కౌముది అంతార్జాల పత్రిక


 

కథానిక వేలం పాట రచనః కర్లపాలెం హనుమంతరావు

 









కథానిక

వేలం పాట

రచనః కర్లపాలెం హనుమంతరావు

 

'యువర్ అటెంక్షన్ ప్లీజ్!'

జబర్దస్తీగా వినిపిస్తున్న ఆ గొంతుతో అప్పటివరకూ రకరకాల కబుర్లతో గందరగోళంగా ఉన్న సెకండ్ క్లాసు బోగీ కొద్దిగా సద్దుమణిగింది.

'లేడీస్ అండ్ జంటిల్మెన్!.. భాయియో ఔర్ బెహనో!.. అయ్యలారా అమ్మలారా!...'

మూడు భాషల్లోనూ ముచ్చటగా సంబోధిస్తున్న  మూడు పదులు నిండని ఆ యువకుడు చూపులకూ ముచ్చటగా ఉన్నాడు.

అప్పుడే ఐరన్ చేసి వేసుకున్నట్లున్న కాస్ట్లీ డ్రెస్, చెదరని హిప్పీ క్రాఫు, చిరుగడ్డం. చిరునవ్వుతో  పాఠంలా గడగడా చెప్పుకుపోతున్న అతని మాటల్ని ఎంత వద్దనుకున్నా వినకుండా ఉండలేక పోయాను.

'.. ఇది మా కంపెనీ ప్రచారంకోసం .. సేల్స్ ప్రమోషన్ కోసం పెట్టిన పథకం. ఇక్కడున్న ఈ డ్రెస్ మెటీరియల్లో ఒక్కో ఐటమ్ నే పాటకు పెడతాను. టెరీకాట్.. పాలిస్టర్..  ఊలెన్.. జపాన్.. అమెరికన్.. స్విట్జర్లాండ్.. ఎక్స్ పోర్టెడ్ బ్రాండ్స్.. ప్యాంటు పీసులు.. షర్టు పీసులు.. సూట్ మెటీరియల్.. మీటరు.. మీటరున్నర.. టూ మీటర్స్.. టూ అండ్ హాఫ్ మీటర్స్..  ఇప్పుడు ఆక్షన్లో పాడుకున్న అదృష్టవంతులకు దక్కుతాయి. ఇందులో మోసం.. దగా..  మాయా.. మిస్టరీ.. ఏవీ లేవు సార్! కంపెనీ ప్రచారంకోసం చేపట్టిన సేల్సు ప్రమోషన్ స్కీములు మాత్రమే ఇవన్నీ. అతి తక్కువ ధరలో అతిమన్నికైన బట్టలను వేలంపాటలో పాడి సొంతం చేసుకోవచ్చు. ఇందులో బలవంతం ఏమీ లేదు. మోసం అసలే లేదు. ఆక్షన్లో ఎవరైనా పాల్గోవచ్చు. ఐతే రెడీక్యాష్ ఉండాలి. అదొక్కటె కండిషన్. పాడినవారందరికీ కంపెనీ తరుఫున ఏదో ఒక గిఫ్టు. బాల్ పెన్.. దువ్వెన.. సెంట్ బాటిలు.. సెల్ ఫోన్ కవరు.. నెయిల్ కట్టరు.. కంపెనీ కాంప్లిమెంటరీకింద ఉచితంగా ఇవ్వబడుతుంది…'

ఉచితం అనే మాట చెవినబడేసరికి చాలామంది దృష్టి ఇటు మళ్ళింది.

అనుమానం వదలని ఓ నడివయసాయన 'గుడ్డలు మంచివేనా?' అని సందేహం వెలిబుచ్చాడు.

'బాబాయిగారు మంచి ప్రశ్న వేసారు. మంచిరకం బట్టల్ని ఇలా ఊరూ వాడా తిప్పుకుంటూ అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని మీలోనూ చాలామందికి అనుమానాలుండొచ్చు. లేడీస్ అండ్ జెంటిల్మెన్! ఇది లిపారియా మిల్సువారి తయారీ సరుకు. కేవలం ప్రచారంకోసం కమీషను పద్ధతిమీద ఇలా మేము అమ్ముతుంటాం. అంతేగానీ సరుకు నాసిరకం అయికాదు. ఒక్క సారి మీరే మీ కళ్ళతో చూడండి. కంపెనీ లేబుల్సుని పరీక్షించుకోండి. బజారులో దొరికే రేట్లతో కంపేరు కూడా చేసుకోవచ్చు…'

అంటూ ఆ వేలంపాట కుర్రాడు లైట్ బ్లూ కలర్ టెరీన్ షర్టు పీసు మడతలు విప్పి ప్రశ్న అడిగిన నడివయసు పెద్దాయన ఒళ్లో పరిచాడు.

పక్కనున్న జనం దాన్ని పరీక్షించడం మొదలుపెట్టారు. వేలంపాట కుర్రాడు పాట మొదలు పెట్టాడు.

'బాబాయిగారి వళ్ళో ఉన్న ఈ లైట్ బ్లూ కలర్ టెరీన్ షర్టు పీసు.. రెండు మీటర్లు.. కంపెనీవారి పాట యాభై రూపాయలు.. పచాస్ రూపయా.. ఫిఫ్టీ రూపీస్  ఓన్లీ..'

' ఫిఫ్టి ఫైవ్..' అన్నాడు విండో పక్కన కూర్చొన్నబట్టతల పెద్దమనిషి.

ఎటువైపునుంచి బదులు రాలేదు.

' ఫిఫ్టీ ఫైవ్.. యాభై ఐదు.. పచ్ పన్.. అమెరికన్ ఎక్స్ పోర్టెడ్.. టెరీన్.. షర్టు పీసు.. టూ మీటర్సు.. ఫర్.. ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ. ఇదే బట్ట  చీరాల గాంధీ క్లాత్ మార్కెట్లో టూ హండ్రెడ్ పెట్టినా దొరకదండి బాబులూ! అదృష్టవంతులు అవకాశం జార విడుచుకోవద్దు. పాటలో పాల్గొంటే పోయేదేమీ లేదు. వస్తే మంచి సరుకు. రాకపోయినా కంపెనీవారి కాంప్లిమెంటు.. దువ్వెన'

' ఫిఫ్టీ ఫైవ్.. ఒకటో సారి. ఫిఫ్టీ ఫైవ్.. రెండోసారి…'

బోగీలో అదే నిశ్శబ్దం!

'యభై ఐదుకి గిట్టుబాటు కాదు కాబట్టి కొట్టి పారేస్తున్నాం. పాడినందుకు  పాతిక రూపాయలు ఖరీదు చేసే దువ్వెన తాతగారికి కంపెనీ తరుఫునుంచి  కానుకగా ఇస్తున్నాం' అంటూ బట్టను వెనక్కి తీసుకుని ఒక దువ్వెన విండో పక్కనున్న బట్టతల పెద్దమనిషిమీదకు విసిరేసాడా  వేలంపాట కుర్రాడు.

బట్టతల మనిషి చేతికి నిజంగానే ఉచితంగా దువ్వెన వచ్చేసరికి కంపార్టుమెంటులో చాలామందికి హుషారు పెరిగినట్లుంది.  'జపాను బ్రాండు టెరీ కాటన్ షర్టింగు.. టూ అండ్ హాఫ్ మీటర్సు గులాబీ రంగు పీసు .. కంపెనీవారి పాట అరవై రూపాయలు. సిక్స్టీ రూపీస్.. సాఠ్ రుపయ్యే.. కేవలం అరవై రూపాయలు మాత్రమే..' అంటూ బట్టను గాలిలో ఎగరేసి ఎదురుగా ఉన్న కుర్రాడి భుజంమీద వేసాడో లేదో.. పరిశీలించడానికి పదిమందిదాకా అతగాడి చుట్టూ గుమికూడారు.

'ఓపెన్ మార్కెట్లో ఈ షర్టు పీసుడొందలకు తక్కువ గిట్టుబాటుకాదండీ సార్! కంపెనీవారి పాట సిక్స్టీ ఓన్లీ. అదృష్టవంతులు ఈ సారైనా అవకాశం జారవిడుచుకోవద్దు. పాడిన వాళ్ళందరికీ బాల్ పెన్ ఉచితం. సిక్స్టీ రూపీస్.. ఒకటో సారి.. సిక్స్టీ రూపీస్..'

పాట ఈ సారీ మందగొడిగా సాగినా పది నిమిషాల తరువాత యెనభై రూపాయలకో షావుకారుకు అనుకూలంగా కొట్టి వేయబడింది. పాడిన నలుగురు మనుషులకూ తలా ఓ బాల్ పెన్నుఉచితంగా దక్కింది.

'మాష్టారూ! ఈ రకం వ్యాపారంలో మాయేమీ లేదంటారా?' అని అడిగాడు అప్పటిదాకా  హిందూ పేపరు మొహానికి అడ్డం పెట్టుకుని తనకేమీ పట్టనట్లు కూర్చోనున్న నా పక్క పాసింజరు. 

అతనేమో సూటూ బూటలటులో చూపులకే  దర్జాగా దొరబాబులా ఉన్నాడు. అంతమంది మధ్యలో నన్నే ఎన్నిక చేసినట్లు అడగడంతో కాస్తంత గర్వంగా అనిపించిన మాట వాస్తవం. 

'ఏ మాయా మర్మం లేకుండా ఎందుకుంటుందండీ? ఏదో మతలబు లేకపోతే ఇంతింత ఖరీదుచేసే సరుకు ఇంత కారుచవుకగా ఎలా గిడుతుందండీ? కంపెనీ ప్రచారం.. సేల్స్ ప్రమోషన్.. అంతా ట్రాష్!' అన్నాను.

'అసలు సరుకెంత నాణ్యమో ఇంటికెళ్ళి దర్జీవాడికి చూపిస్తేగాని బండారం బైటపడదు!' అనేసాడు నాకిటువైపుగా కూర్చోనున్న మరో ప్రయాణీకుడు.

'నో.. సార్! నేనూ మీకులాగే అనుకునేవాడిని మొదట్లో! ఈ కోటు ఉంది చూసారూ! ఇలాగే ఇదివరకు బెనారస్ వెళ్ళినప్పుడు బండిలో వేలంపాటలో పాడి గెల్చిన బట్టతో కుట్టించిందే. నలభై రూపాయలకనుకుంటా  పాడింది. నాలుగేళ్ళయింది .. సరిగ్గా గుర్తు లేదు' అంటూ కౌంటరు ఆర్గ్యుమెంటుకు దిగాడిందాకటి సూటు మనిషి. అతగాడంత గట్టిగా బల్లగుద్దినట్లు తన ప్రత్యక్షానుభవం చెబుతుంటే   కాదనటానికి ఇంకెవరి దగ్గర మాత్రం మాటలేం మిగిలుంటాయి!'

'ఇహ బట్టల నాణ్యతంటారా! మాదిక్కడి తెనాలి దగ్గర రేపల్లే. ఏళ్ళ తరబడి చేసున్నామీ క్లాత్ బిజినెస్! ఆ  విండో బాబాయిగారి దగ్గరున్న క్లాతు ఎంతలేదన్నా మీటరు నూటేభైకి తక్కువుండదు ఓపెన్ మార్కెట్లో'. మరి ఇట్లా వేలంపాటలో అంత కారు చవగ్గా ఇచ్చేయడంలో మతలబేంటో మాత్రం అంతుబట్టటం లేదు.'

ఈ సారి పాటలో ఆ సూటు పెద్దమనిషే స్వయంగా  చైనా మోడల్ సిల్కు క్లాత్ గ్రే కలర్ ది పాటను నూటపాతికదాకా పెంచి మరీ సొంతం చేసుకున్నాడు. వస్తువు తీసుకునే సమయంలో అతగాడు వేలంపాట కుర్రాడితో ఆడుకున్న వైనం చూసిన తరువాత ఇంకెవ్వరికీ  ఏ ఐటమ్స్ మీదగాని.. వాటి రేట్ల విషయంలోగాని  అనుమానాలుం డక్కర్లేదనిపించింది.  

'సార్! మీలాంటోళ్ళు వెయ్యికి ఒక్కరున్నా చాలు.. మా వ్యాపారం చంకనాకి పోవాల్సిందే! కంపెనీ సరుకు. పరువుతో ముడిపడింది. ఒకసారి దిగింతరువాత  వెనక్కి తగ్గడం కుదరదు కనక సరిపోయింది. అదే నా పర్సనల్ బిజినెస్సయితేనా! అమ్మో!  సరుకు మొత్తం ఎత్తుకుని ఎప్పుడో ఉడాయించుండే వాణ్ణి' అంటూ  మొత్తుకుంటూనే  తన సామాను సర్దుకోసాగాడు. 

 జాండ్రపేటలో ఆగటానికి కాబోలు బండి బాగా స్లో అవుతుండంగా  అడిగాడా సూటువాలా 'నీకీ వ్యాపారంలో ఏ మాత్రం కమీషను గిడుతుందోయ్?' అ

'గిట్టడం కాదండీ! చెప్పాగా! ఇది కమీషను వ్యాపారం. లిపారియా మిల్సు వాళ్ళకి ఏజెంట్లం మేం. సేల్స్ ప్రమోషను చేసే దాన్ని బట్టి ఉంటుందీ గిట్టుబాటెంతనేదీ' అని వేలంపాట కుర్రాడి సమాధానం.

'కమీషనెంతో?'

'ట్వంటీ టు ట్వంటీ ఫైవు మధ్యలో ఉంటుందండీ! సరుకును బట్టి రేటు'

'బాగా గిడుతుందా?'

'జనరల్ గా బాగానే ఉంటుందండీ! ఒక్కో చోటే.. ఇదిగో..ఇలా డల్ గా ఏడుస్తుంటుంది ..' అంటూ సరుకును ఎత్తుకోబోతున్న కుర్రాడిని నా ఎదురుగా కూర్చున్న ఆడమనిషి  ఆపేసింది 'డల్ గా ఉందంటావు. తట్ట పట్టుకుని వెళ్లి పోతావు. ఈ సారు చెప్పింతరువాత నాకు నమ్మకం కుదిరింది. ఆ పాలిస్టర్ బట్ట పాటకు పెట్టబ్బాయ్!.. మా పిలగాడికి ఎప్పట్నుంచో తీసుకుందామనుకుంటున్నా" అని మొదలు పెట్టింది. 

మిగతా ప్యాసింజరర్సూ ఆమెకి వంత పాడడంతో వేలంపాట కుర్రాడికి మళ్ళీ తట్ట కిందకు దింపక తప్పింది కాదు. కానీ ఈ సారి సీను పూర్తిగా రివర్సుగా ఉంది.  ఆడమనిషి కోరుకున్న పాలిష్టరు పీసు రెండొందలకు పాడినా ఆమె సొంతం కాలేదు. పై బెర్తుమీద పడుకోనున్న కుర్రాడెవడో ఇంకో పది రూపాయల్ పై పాట పాడి సొంతం చేసుకున్నాడు.

మొదట్నుంచీ తనకేమీ పట్టనట్లు ఓ మూల పుస్తకం చదువుకంటూ కూర్చోనున్న పాపక్కూడా కిక్కొచ్చినట్లంది.. వాయిల్ క్లాత్ కోసం పోటీపడి మరీ నూటేభైకి దక్కించుకుంది.

కంపార్టుమెంట్లో మూడో వంతు మంది ఏదో ఒక ఐటమ్ చిన్నదో పొన్నదో వేలంపాటలో దక్కించుకున్న వాళ్లే. మిగిలిన వాళ్ల చేతులో కంపెనీ తాలూకు  కాంప్లిమెంటరీలు!

ఎన్నడూ లేనిది నేనే మూడు కాంప్లెమంటరీ గిఫ్టులు.. మా పిల్లదానికని ఓ మంచిరకం ఓణీ బట్ట తీసుకంటేనూ!

వేలంపాటలో సాధించిన వస్తువులు క్యారీబ్యాగులో సర్దుకంటుండంగా బండి చినగంజాం ఫ్లాట్ ఫారంమీదకొచ్చి ఆగింది.  చిన్ననాటి మిత్రుడు మౌళి అనుకోకుండా కనిపించడంతో వాడితో బాతాఖానీలో పడి బెల్ ఎప్పుడు మోగిందో కూడా గమనించలేదు. కదిలే బండిలో హడావుడిగా ఎక్కాల్సి రావడంటో ఎక్కిన బోగీ కూడా ఏదో పట్టించుకోలేదు.

అది ఇందాకటి కంపార్టుమెంటు కాదు. కానీ ఎలాగో ఓ మూల సీటైతే దక్కించుకోగలిగాను.

బండి స్పీడందుకుంది. అమ్మనబ్రోలు  స్టేషను దాటేసరికి కబుర్లలో ఉన్న కంపార్టుమెంటు ఖంగుమంటున్న గొంతుకి ఉలిక్కిపడి అటెంక్షనులోకొచ్చేసింది.

 

'యువర్ అటెన్షన్ ప్లీజ్!..'

'లేడీస్ అండ్ జంటిల్మెన్!.. భాయియో ఔర్ బెహనో!.. అయ్యలారా అమ్మలారా!...'

మరో సారి వేలంపాట! 

ఈసారి వేలంపాట జరుపుతున్నది మూడుపదులు నిండిన ఆ ముచ్చటైన యువకుడు కాదు. పక్క బోగీలో నా పక్కన కూర్చొని బట్టల నాణ్యతను గురించి లెక్చర్లు దంచి అందరిచేత సరుకుని కొనిపించిన 'ది హిందు' న్యూస్ పేపర్ సూటు జెంటిల్మన్! 

అదే హిందూ పేపరు చాటున మొహం దాచుకుని పాట డల్ గా ఉంటే లెక్చర్లు దంచడానికి ఆ మూడు పదుల ముచ్చటైన కుర్రాడు ఇక్కడే ఎక్కడో సుటూ బూటులో నక్కే ఉంటాడు. 

ఆగిపోయిన వేలంపాటకు ఓ ఊపివ్వడానికి పిల్లాడికి పాలిష్టరు బిట్టు కొనాలనుకునే మహాతల్లీ 

ఇక్కడే తన వంతు అభినయం కోసం ఎదురు చూస్తూండాలి నా అనుమానం నిజమైతే!

-కర్లపాలెం హనుమంతరావు


(ఆంధ్రభూమి వార పత్రిక- 02, ఏప్రియల్, 2015 సంచికలో ప్రచురితం)








 

 


Thursday, December 9, 2021

ఆతిథ్యం - కథానిక- కర్లపాలెం హమమంతరావు - అచ్చంగా తెలుగు - ప్రచురితం

ఆతిథ్యం - కథానిక- కర్లపాలెం హమమంతరావు - అచ్చంగా తెలుగు - ప్రచురితం 




నాగపూర్ స్టేషన్లో రైలు దిగేసరికి సాయంత్రం నాలుగయింది. చలికాలం కావడంవల్ల అప్పుడే నీడలు పొడుగ్గా సాగుతున్నాయి.
రాష్ట్రం సరిహద్దులు దాటడం నాకిదే మొదటిసారి. 'బొడ్డూడని పిల్లలు కూడా పొలోమని ఉద్యోగాల కోసంచదువుల కోసం విమానాలెక్కి దేశాలుపట్టి పోతుంటే పక్కనున్న రాష్ట్రం పోవడానికి పస్తాయిస్తావా?' అని మామయ్య ఎద్దేవా చేస్తుంటే పౌరుషం ముంచుకొచ్చి ఈ సాహస యాత్రకు సిద్ధపడ్డా.
నిజానికి మా ఊళ్ళో నాకు ఇల్లూఆఫీసూ .. దారిలో నా అవసరాలకు సంబంధించిన షాపులతో తప్ప వేరే  పరిచయాలే లేవు. 'మీ అమ్మ బిడియం నీకు వచ్చి పడిందే! ఆ కాలం కాబట్టి ఆడవాళ్లకి సరిపోయింది.. 'ఉద్యోగాలు చేస్తాం.. ఊళ్లేలుతాం.. మగాళ్ళకన్నా మేం మాత్రం ఎందులో తక్కువ?' అని మహా గొప్పలు పోతున్నారుగా ఈ మధ్య మీ ఆడంగులు! ఏదీ మరి చూపించు నీ తెగువ.. భారతనారీ!అని మా మామయ్యే..  నేనెక్కడ భయంకొద్దీ వచ్చిన ప్రొమోషన్ని వదులుకుంటానోనని మరీ మరీ రెచ్చగొట్టి పంపించాడీ నాగపూరుకి.
సిండికేట్ బ్యాంకులో క్లర్కుద్యోగం ఇప్పటిదాకా. ఆడపిల్లననిఇంకా పెళ్లి కాలేదన్న మిషతో  ఎట్లాగో మా బెజవాడలోనే బండిని నెట్టుకొచ్చానిన్నాళ్ళూ. ఇప్పుడొచ్చిన ఆఫీసరు పోస్టును ఏక్సెప్ట్ చేయాలంటే ఔటాఫ్ స్టేట్ పోస్టింగునీ రూలు ప్రకారం ఒప్పుకు తీరాల్సిందే.
'ఫస్టు పోస్టింగే పక్క రాష్ట్రంలో రావడం.. మీరు చాలా లక్కీ! వదులుకోవద్దు!అని ఎక్కబెట్టారంతా ఆఫీసులో కొలీగ్సు. పక్క సీటు ప్రసాదుగారైతే నా అవస్థ చూసి 'నాగపూరులో మా అక్కా వాళ్ళుంటారు. మా బావగారు అక్కడ డిఫెన్సులో సీనియర్ ఎక్కౌంటెంటు. ఎకామిడేషన్ ప్రాబ్లం వాళ్ళు సాల్వు చేస్తార్లేండి! మనం మాట్లాడదాం' అంటూ నా ముందే అన్ని వివరాలూ చెప్పి ఫలానా తారీఖున ఫలానా బండికి వస్తున్నది.  స్టేషనుకొచ్చి రిసీవ్ చేసుకోవడం మర్చి పోవద్దు' అని ఒకటికి రెండు సార్లు గట్టిగా చెప్పాడు కూడా. అన్నింటికి 'ఓకే.. ఓకేఅంటూ భరోసా ఇచ్చిన పెద్దమనిషి.. ఇప్పుడు అయిపూ ఆజా లేకుండా పోయాడు!
బండి దిగి అరగంటయింది. ముందుగా అనుకున్న ప్రకారం నా ఫోటో కూడా మెసేజికి ఎటాచ్ చేసి పంపించాడు ప్రసాదుగారు. గుర్తుపట్టలేక తిరిగి పోవడానికి ఆస్కారమే లేదు.
అక్కడికీ ప్రసాదుగారు ఇచ్చిన ఆ బావగారి సెల్ నెంబరుకి అరడజను సార్లు కాల్ చేసాను.  ఒక్క సారీ లిఫ్టు చేయలేదు.. వూరికే రింగవడం తప్ప.
ఇహ తప్పక చివరికి ప్రసాదుగారికే ఫోను చేయాల్సి వచ్చింది. మూడో పిలుపుకి గానీ లైన్లోకి రాలేదా మహానుభావుడూనూ. 'సారీ! శ్యామల గారూ! మా బ్రదరిన్లాగారి మదర్ అనుకోకుండా పోయారుట రాత్రి. ఉన్నఫళంగా ఫ్యామిలీ అంతా తెనాలి వెళ్ళిపోయారు. జర్నీలో ఉండటం వల్లనుకుంటా సిగ్నల్స్ సరిగ్గా అందక మీకు రెస్పాండవక పోవడం. ఐ యామ్ ఎక్స్ ట్రీమ్లీ సారీ!' అనేసాడు.
'సారీ' సంగతి ఆనక. ఇప్పుడు నా పరిస్థితి ఏంటిఈ బ్రదరిన్లాగారి భరోసామీద ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేసుకోకుండా బైలుదేరాను. సరే! ఇహ తప్పేదేముందిదగ్గర్లో ఉన్న ఏదైనా ఓ హోటల్లో దిగి రేపు భ్యాంకులో జాయినయినాక అప్పటి పరిస్థితుల్నిబట్టి షిఫ్టింగు సంగతి అలోచించుకోవచ్చు.
చలిగాలికి తోడు బైట వర్షమూ మొదలయింది. రెండు సూటుకేసులు.. ఒక షోల్డరు బ్యాగు. ఒక్కత్తినే ఎలాగో తంటాలు పడుతూ స్టేషను బైటికి రాగానే ఆటోవాళ్ళు గండుఈగల్లా మూగి రొద చేయడం మొదలు పెట్టారు. మరాఠీలో కొందరైతే.. హిందీ.. ఇంగ్లీషు తుంపుడు ముక్కల్తో కొందరు. 'ముందు వీళ్ళ వేధింపుల్నుంచి తప్పించుకుని  బైటపడటమెలాగురా భగవంతుడా!అనేటట్లుంది అక్కడి వాతావరణం.
అప్పుడు వచ్చాడు దేవుడిలాగా ఆ పెద్దమనిషి. మూడొంతుల బట్టతలనల్లగా నిగనిగలాడే నుదురు. కొబ్బరి చవురు రాసుకున్నట్లుంది మొహమంతా! తెల్లటి దుస్తుల్లో ఉన్నాడు. నడికారు వయసు దాటుతుందేమో! పిలవకుండానే దగ్గరికొచ్చాడు. 'తెలుంగువాళ్ళేనాఫ్రమ్ విజయవాడా?' అని పలకరించాడు. నా జవాబుకోసం ఎదురుచూడకుండానే ముందు ఆ ఆటో గండుఈగల్ని తరిమేశాడు.
క్వశ్చన్ మార్కు మొహంతో నిలబడ్డ నన్ను చూసి 'అట్లా ఆశ్చర్యపోకండి మ్యాడమ్ గారూ! మీ యాసనుబట్టి కనిపెట్టేసా.ఇందాకట్నుంచీ మీరదేపనిగా ఫోన్లో మాట్లాడుతున్నారు కదా! గుర్తు పట్టేసా. ఇదేమంత గొప్ప విషయం?చిత్తూరు సైడు 'తట్ట' అంటే ఒంగోలు సైడు 'కంచం' అంటారుగదా తినే పళ్లేన్ని. అట్లాంటి విద్యే అనుకోండి నాదీనూ. దేశం నాలుగు చెరగులా నాలుగు రోజులు చెడతిరిగొస్తే సరి 'రాం.. రాం'కీ 'వణక్కా'నికీ ఒకే అర్థం అని తెలిసొస్తుంది.  బై ది బై.. మై నేమీజ్ రామసుబ్బు. ఆరిజన్ కేరళ. ఖైతాన్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా దేశం మొత్తం ఒక సారి కాదు.. ఏడాదికొకసారి చెడతిరిగాను. తిరిగి చెడ్డానేమో కూడా! మీ బెజవాడలో బస్టాండు దగ్గరున్న మమత హోటల్నుంచి..  గాంధీనగర్ సందులో ఉండే మడత మంచాలు అద్దెకిచ్చే ప్రశాంత్ లాడ్జింగుదాకా అన్నీ నాకు కొట్టిన పిండే!అంటూ తనమానాన తాను టివీ యాంకర్లను మించిన జోరుతో చెప్పుకుపోతున్నాడు. 'స్మాల్ కమర్షియల్ బ్రేక్కోసం ఎదురుచూస్తూ నిలబడ్డమే నా వంతయింది.
నా అవస్థ గమనించినట్లున్నాడు. 'సారీ! కాస్త ఓవరయిందనిపిస్తుందనుకుంటా మీకు.కానీ అవసరమే మ్యాడమ్ జీ ఒక్కోసారి. మీ తీరు ఎప్పట్నుంచో గమనిస్తున్నా. ఫ్లాట్ ఫామ్మీద ఈ బరువులు మోసుకుంటూ ఎవరికోసమో గంటల తరబడి విఫల వైయిటింగు చేస్తున్నారే గానీ.. అప్పాయింటుమెంటిచ్చిన ఆ హోస్టుగారెవరో హ్యాండిచ్చాడని నిర్థారణకు రాలేకపోయారు. చొరవ లేకపోవడమంటే ఇదే మరి! సారీ! ఫర్ ది కామెంట్! మా అమ్మాయిదీ డిటో క్యారెక్టరే! అందుకనే మిమ్మల్నీ తేలిగ్గా గుర్తు పట్టగలిగా! పదిమాటలకొక మాటైనా జవాబు రాని మీలాంటి వారినుంచి మినిమమ్ నాలుగు మాటలు రాబట్టాలంటే ఎన్నొందల రకాలుగా మాట్లాడాలి!చురుక్కుమని కాలింది నాకు. ముక్కూ మొగం తెలీని మనిషితో మాట్లాడే తీరిదేనా! నేనేంటో నాకే సరిగ్గా తెలీదు. చూసి అరగంటైనా కాలేదు. అప్పుడే నా మెంటాలిటీని గురించి లెక్చర్లిస్తున్నాడు మహా! ఎవరిచ్చారీ పెద్దమనిషికీ అధికారం?
నా ఆలోచనల్నప్పుడే చదివేసినట్లు న్నాడు. 'సారీ!ఐ డోంట్ మీనిట్! మీరేదో ఇబ్బందుల్లో ఉన్నట్లున్నారు.  హెల్ప్ చెయ్యాలన్నదే నా ఉద్దేశం. మే ఐ హెల్ప్ యూ!'
ఎంత విచిత్రమైన మనిషి! హెల్ప్ చేస్తానన్న మనిషి మాటమాత్రమైనా చెప్పకుండా చెయ్యిచ్చి పోయాడు ఒక వైపు! ముక్కూ మొగం కూడా ఎరగని వాళ్ళని పట్టుకుని హెల్ప్  చేస్తానని వెంటబడుతునాడింకో మనిషి మరో వైపు!  ఏమై ఉంటుంది ఇందులో ఇతగాడి వ్యూహం?  ఏ లాభం లేకుండా ఎవరైనా సాయం చేయడానికి ముందుకొస్తారా ఈ రోజుల్లో?  ఒంటరి ఆడపిల్లనని పసిగట్టేసాడా?
ఊళ్ళు చెడతిరిగానంటున్నాడుగా! సొంత ఊళ్ళో మంచి లాడ్జింగేదో తెలిసే ఉండాలి. ఆ వివరాలు చెప్పించుకుని వదిలించుకోవడం మంచి దనపించింది. అదే అడిగాను. 'లాడ్జింగులకేం మ్యాడమ్! నన్ను కట్టుకుని పోయేటన్ని! సెంట్రల్ ఇండియా కదా! టూరిస్టుల తాకిడి జాస్తీనే! రిజర్వేషను లేకుండా మంచి హోటల్సు దొరకడం కష్టం. ఓవర్ బ్రిడ్జి దాటి గాంధీబాగ్ లోకి వెళితే కాస్ట్లీ హోటల్సున్నాయి. ఓ మాదిరివి కావాలంటే చుట్టూ తిరిగి మార్కెట్ ఏరియాలో వెదకాలి. మంచివే దొరుకుతాయని గ్యారంటీ లేదు. మీ వాలకం చూస్తుంటే సత్యహరిశ్చంద్రుడిక్కూడా దుర్భుద్ధి పుట్టేటట్లుంది. సారీ! మీరేమనుకోక పోతే నాదో ఆఫర్! ఇక్కడికి దగ్గర్లోనే మా ఇల్లుంది. హోటలంత సౌకర్యాలుండక పోవచ్చుగానీ.. ఒకటి రెండు పూటల వరకు ఓకే! వచ్చేయండి మ్యాడమ్! వానలో.. కొత్త చోట్లో.. చీకట్లో.. వయసులో ఉన్న ఆడపిల్లలు ఇట్లా అసహాయంగా ఆట్టేసేపు నిలబడటం .. జనాల కంటబడ్డం .. మంచిది కాదు. మా ఊరి సంగతి తెలిసి చెబుతున్నా. మా అమ్మాయి   మరేదన్నా ఊళ్లో ఇట్లాంటి పొజిషన్లో చిక్కుకున్నప్పుడు ఏం సహాయం కావాలని కోరుకుంటానో.. అదే నేనూ మీకు ఆఫర్ చేస్తున్నది! వచ్చీ రాని భాషతో కంతిరి ఆటోవాళ్ళను నమ్ముకుని ఎక్కడ బడితే అక్కడ దిగేకన్నా.. ఇదే మంచిది! కాస్త రిలాక్సయిన తరువాత ఏం చేయాలో రేప్పొద్దున తీరిగ్గా ఆలోచించుకుందురుగానీ! ముందు పదండి!'అనేసాడు.
ఆశ్చర్యం! నిజంగా అత్యాశ్చర్యమే! మధ్యలో వాళ్లమ్మాయిని గూర్చి  ఆ రెండు ముక్కలుగాని అనక పోయుంటే ఈ పెద్దమనిషితో ఈ రోజు నిజంగానే నాకు పెద్ద దెబ్బలాటయి ఉండేదే! ఓ వంక కామెంట్ సు  చేస్తున్నాడు. మరో వంకనుంచి హెల్ప్ ఆఫర్ చేస్తున్నాడు! ఎట్లా అర్థం చేసుకోవాలీ సిట్యుయేషన్నిఈ మనిషి మంచి స్థితిలో ఉన్నట్లేనా?
నా అనుమానాలు నన్ను పీకుతూనే ఉన్నాయి. నా అనుమతి లేకుండా ఎప్పుడు పెట్టించాడో.. సగం లగేజి అప్పుడే అక్కడే ఉన్న ట్యాక్సీలో సర్దించేసాడు! ఆలస్యం చేస్తే నా సామానుతో సహా ఉడాయించినా ఉడాయించేయచ్చు.
ఎటూ పాలుపోక మిగతా సామానుతో సహా ట్యాక్సీలో ఎక్కి కూర్చున్నాను.'చూద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం!అన్న తెగింపూ వచ్చేసింది విచిత్రంగా!
'మీ డౌటూ అర్థం చేసుకోదగ్గదే! ఇవిగోండి నా వివరాలు. సెల్ ఫోన్ నెంబరుతో సహా అన్నీ ఉన్నాయి. ఈ విజిటింగు కార్డు దగ్గరుంచుకోండి! అంతగా అవసరమనిపిస్తే పోలీసు కంప్లెయింటుకి పనిక్ వస్తుంది.. ట్యాక్సీ నెంబరు కూడా నోట్ చేసానందులో! ఉంచుకోండిఅంటూ బలవంతంగా ఓ విజిటింగు కార్డు నా చేతిలో ఉంచాడు. ఇంకేమాలోచించగలం ఇంత నిజాయితీ ప్రదర్శిస్తుంటే!
ట్యాక్సీలో మాటల మధ్యలో నేనిట్లా బ్యాంకులో ఆఫీసరుగా జాయినవడానికని వచ్చినట్లు పసిగట్టాడు. 'ఈ కాలంలో అందరూ ఇంజనీర్లూ.. సాఫ్టువేర్లూ అంటూ కలవరిస్తున్నారు.సొంతగడ్డను వదులుకొని పరాయి పంచన చేరైనా సరే నాలుగు రాళ్ళు ఎక్కువ గడించడానికే పేరెంట్ సూ ప్రోత్సహిస్తున్నారు.అనింటికీ భిన్నంగా మీరిట్లా మతృదేశాన్నీ,మాతృభాషని నమ్ముకుని ఉండటం చాలా ముచ్చటేస్తోంది. మీ తల్లిదండ్రులకు నిండుమనస్సుతో నమస్కారం చేయాలనిపిస్తోందిఇట్లా సాగుతోంది ఆయన మాటల ధోరణి. ఇన్ని మంచి విషయాలు మాట్లాడే అతనిలో దురాలోచనలు ఉంటాయంటే నమ్మలేం!
'నాగపూర్ చాలా కామ్ సిటీ. ముంబై వెస్టుసైడులాగా కాదు. రేపు  బ్యాంకులో జాయినయి ఎకామిడేషన్ ఎరేంజయినదాకా ..మీరు మా ఇంట్లోనే ఉండవచ్చు. మా శ్రీమతి కూడా ఊళ్లో లేదు. వాళ్ల పిన్నిగారు పోయారని బెనారస్ వెళ్ళింది. పదిరోజులదాకా రాదు'
‘అంటే ఈయనగారు తీసుకెళ్లే ఆ ఇంట్లో ఆడవాళ్లెవరూ లేరనేగా అర్థం! ఎంత చల్లగా చెబుతున్నాడూ ఇప్పుడీ వార్త!
'మీ భయం అర్థమైందిలేండి మ్యాడమ్అని చిన్నగా నవ్వాడు రామసుబ్బు. మా శ్రీమతి లేదన్నానుగాని మా పనివాళ్ళు లేరన్నానా! ఇల్లు చూసుకునేందుకు రెడ్డివాడి పెళ్ళాం ఎప్పుడూ అక్కడే హాజరు. మనం వీధులు పట్టుకునిలా బలాదూర్లు తిరుగుతుంటామని మా ఆవిడగారు చేసిన ఏర్పాట్లు లేండవిఅన్నాడు. మనసు కుదుట బడింది. అనవసరమైన అనుమానమేగానీ రామసుబ్బుగారి ఆహ్వానంలో కల్మషమేమీ లేదు.
ట్యాక్సీ ఆగిన ఇల్లు మరీ చిన్నదేమీ కాదు.'ఈయన తన్నుగూర్చి తాను చెప్పుకున్నది చాలా తక్కువ.' అనిపించింది.. ఇంటిముందు లాన్.. కారు గ్యారేజ్.. వగైరా ఆర్భాటం చూసిన తరువాత.
ట్యాక్సీకి బాడుగ తనే ఇచ్చేసాడు నేను పర్శు తీసే లోపలే. ‘చివర్లో చూసుకుందాంలేండి ఆ లెక్కలన్నీ. కొత్త చోట్లో సరిపడ్డంత క్యాష్ దగ్గరుండటం అవసరం. అచ్చంగా ఈ ప్లాస్తిక్ కార్డుల్ని నమ్ముకుంటే ఒక్కోసారి ఇబ్బందెదురవచ్చుఅని సలహా. నా కన్నా ముందు నా లగేజీని లోపలకి చేరవేయడంలో ట్యాక్సీ మనిషికి సాయం చేసాడు.
జేబులోనుండి తాళం గుత్తి తీసి అలవాటుగా ఓ కీ తో డోర్ అన్ లాక్ చేసి.. ఆదరాబాదరాగా లోపలికి పరుగెత్తికెళ్ళి వచ్చాడు.'అలారం సిస్టం ఉంది. తాళం తీసిన రెండు నిమిషాల్లో దాన్ని డిజార్మ్ చేయకపోతే సైరన్ ఎలర్టు మొదలవుతుంది. ఏంటో అంతా చాదస్తం! ఇన్నేసి జాగ్రత్తలు తీసుకుంటున్నా జరిగే అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి’ అన్నాడు రామసుబ్బు నవ్వుతూ. నవ్వు ఆయన ట్రేడ్ మార్కనుకుంటా.
ఇంట్లో మనిషి అలికిడి లేకపోయినా ఇల్లు మాత్రం  చాలా పరిశుభ్రంగా ఉంది! 'రెడ్డీ!.. రెడ్డీ!'అంటూ రెండు మూడుసార్లు గావుకేకలేసాడు. సమాధానం లేదు.  సా'యమ్మా!.. సాయమ్మా!మళ్లీ కేకలు. నో రెస్పాన్సు. 'వాడెక్కడో తాగి తొంగునుంటాడు. అదను చూసుకుని ఇది ఏ సినిమాకో చెక్కేసి ఉంటుంది. వీళ్లమీద మా  ఆవిడగారికి మా చెడ్డ భరోసా!'అని ఎద్దేవా చేస్తూ 'మీ సామానంతా ఇక్కడే కింద గదిలో వేసుకుని లాక్ చేసుకోండి మ్యాడమ్ గారూ! కీ మీదగ్గరే ఉంచుకోండి!అంటూ తనే లగేజీని ఓ మూలగదిలో సర్దేసి తాళం వేసేసాడు. కీ నా చేతిలో పెట్టేసాడు.
స్నానాల గది పైన ఉంది. నా షోల్డరు బ్యాగు ఓపెన్ చేస్తుంటే 'అవన్నీ ఇప్పుడెందుకు బైటికి తీయడంఉండనీయండి.. ఒక పూటకే గదా!'అంటూ ఇస్త్రీ చేసిన పొడి టవల్సును అందించాడు.
'ఏ మాత్రం భేషజంలేని మనిషి. ఈ కాలంలోకూడా ఇలాంటి వాళ్ళుంటారా!అనిపించింది.
స్నానాలవీ ముగించుకుని వచ్చే లోగానే.. ఎప్పుడు ఆర్డరు చేసి తెప్పించాడో.. డైనింగు టేబుల్ మీద ఇద్దరికీ భోజనాలు రడీ. అనుపాకాలు హోటలువే ఐనా కూరలో కారం ఎక్కువైనందుకు, పప్పులో ఉప్పు లేనందుకు తను నొచ్చుకున్నాడు.'ఇంట్లో వాళ్ళుండు ఉంటే మీ కీ ఇబ్బంది ఉండేది కాదుఅని ఆయన బాధపడుతుంటే సముదాయించడం నా వంతయింది.
అప్పటికే రామసుబ్బును గురించి ఆశ్చర్యపోవడం మానేసాను. ఎన్నింటికని నోరు వెళ్లబెట్టను! జరిగేదంతా ఆస్వాదించడానికే ప్రిపేరయి ఉన్నాను.
ప్రసాదుగారి బావగారివల్ల ఏర్పడ్డ ఇబ్బంది ఇలా ఎక్కడినుంచో ఊడిపడ్డ రామసుబ్బుగారి అదరణతో పరిష్కారమవుతుండటం వింతల్లోకెల్లా వింత! 'వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టవోయ్అన్న గురుజాడవారి పాట గుర్తుకొస్తున్నదెందుకో ఈయన్ని చూస్తుంటే!
మర్నాడు  ఉదయం తయారై.. బ్యాంకుకి పోయి జాయినింగు రిపోర్టు ఇచ్చిందాకా దగ్గరే ఉన్నాడు రామసుబ్బు.'సాయంకాలం మళ్లీ వస్తాను. మీ అకామిడేషన్ ఫిక్సయితే ఫోన్ చేసి చెప్పండి. లగేజీ డ్రాప్ చేస్తాను. కుదరకపోయినా ఇబ్బంది లేదు . మన ఇల్లు ఉండనే ఉందిగా.. పది రోజులదాకా నో ప్రాబ్లంఅని భరోసా ఇచ్చి మరీ వెళ్ళిపోయాడు.
జరిగిందంతా విన్న మా మేనేజరుగారు చాలా నెగెటివ్ గా స్పందించారు. 'ఎలాంటి ఎలాంటి మనుషులున్నారో లోకంలో! తెలివిగలవాళ్ల మనుకంటున్నాంగానీ మన ఊహక్కూడా అందనంత విడ్డూరంగా జరుగుతున్నాయి నేరాలు. ఈ మధ్యిలాగే ఇక్కడ ఓ కొత్త చోట్లో కెమేరా కన్నుకి బేర్ గా దొరికిపోయి చాలా ఇబ్బందులు పడిందొక అమ్మాయి.చేతులు కాలింతరువాత ఆకులు పట్టుకునేం లాభం లేదు. ముందు మీ లగేజీ షిఫ్టు చేయించండి! ముక్కూ మొగం తెలీని మనిషి కష్టడీలో దాన్నలా వదిలేసి రావడమేంటిసాయంకాలంలోపు మన బ్యాంకు క్వార్టర్సులో ఎక్కడన్నా ఎకామిడేట్ చేస్తాను. మన స్టాఫు లొఖండేని వెంట తీసుకుపోండి! ఏదైనా ప్రాబ్లముంటే తను టేకిల్ చేస్తాడు. లోకల్ మనిషి. పొలిటికల్ ఇన్ ఫ్లుయన్సూ జాస్తి!అని ఆయన అన్ని రకాలుగా బెదరగొట్టిన తరువాత నా మనసూ తిరిగిపోయింది.
నిన్న స్టేషన్లో దిగినప్పటినుంచి జరుగుతున్నదంతా నాకే ఒక సినిమా కథలాగా ఉంది. మానేజరుగారనేముంది! రామసుబ్బు కథ చెబితే ఎవరికీ నమ్మబుద్ధి కాదు.
సాయంకాలం ఐదు కాకుండానే రామసుబ్బు నెంబరుకి కాల్ చేసాను. 'మేనేజరుగారరు ఏర్పాటు చేయించిన ఎకామిడేషన్లోకి నా లగేజి షిఫ్టు చేయించుకుంటాను. థేంక్స్ ఫర్ ది టైమ్లీ హెల్ప్!' అని ధన్యవాదాలు చెప్పే నెపంతో ఝంఝాటం వదిలించుకోవాలని నా ఆలోచన.
ఫోన్ రింగవుతుందికానీ మహానుభావుడు..ఎంత సేపటికీ ఎత్తడే! ఒకసారి కాదు పాతిక సార్లు ట్రై చేసాను. మొదట్లో వూరికే రింగయిన ఫోను తరువాత 'స్విచ్డాఫ్అని వస్తోంది! ఇంటికి పోయి చూడటం తప్ప మరో మార్గాంతరం లేదు. ఎందుకైనా మంచిదని మరో గంట ఆగి లొఖండేని వెంటబెటుకుని బైలుదేరాను.
ఆటో సగం దూరంలో ఉండగా రామసుబ్బే కాల్ చేసాడు. 'బ్యాంకుకి రావాలనే అనుకున్నాను మ్యాడమ్ గారూ! మథ్యాహ్నంనుంచి చిన్న ప్రాబ్లం వచ్చి పడింది. రాంకోటి రోడ్డులో ఎవరో చిన్నపిల్లాడు బస్సు ముందుచక్రాల కిందపడి గందరగోళం చేసాడు. పెద్ద యాక్సిడెంటు! ఎవరూ పట్టించుకోరే! పోలీసులొచ్చిందాకా పసిప్రాణాలు నిలబడతాయాఅర కిలోమీటరు దూరంలో ఉంది గవర్నమెంటాసుపత్రి. ఐనా ఏ ఒక్క గాడిదకొడుకూ రానంటాడే! పోలీసులతో పెంటవుతుందని భయం పిరికి వెధవలకు! నేనే భుజంమీద వేసుకుని తీసుకు వెళ్ళి ఆసుపత్రిలో చేర్పించాను. పిల్లాడి పేరెంట్ సు ఎవరో కనిపెట్టే పనిలో ఉన్నారు పోలీసులు.  ఈ గొడవల్లో ఫోనెత్తలేక పోయాను. సారీ! మీ కొత్త అకామిడేషన్ అడ్రసు ఇవ్వండి! ఎంత రాత్రయినా లగేజీ చేర్చే పూచీ నాదీ!అని ఆగకుండా సంజాయిషీ ఇస్తుంటే ఇంకేమనాలో తోచకుండా ఉంది.  అదీగాక ఆయన ధోరణి నిన్నట్నుంచీ చూస్తుండీ అనుమానించడం మహా పాతకంఅనిపించింది. నా తటపటాయింపు చూసి లొఖండేనే కలగజేసుకున్నాడు తనే ఫోనులో 'మీకెందుకు శ్రమ? ఎవరిద్వారానైనా వెంటనే లగేజీ పంపించెయ్యండి సార్!అన్నాడు గడుసుగా.
'విలువైన సామాను. మ్యాడమ్ గారు నన్ను నమ్మి నా మీద భరోసాతో వదిలేసి పోయారు. మధ్యలో ఏదైనా ఐతే నా మాట పోదా!  మంచితనంమీద జనాలకున్న ఈ కాస్త నమ్మకం వట్టిపోదా! అదంతా నా వల్ల అయేది కాదుగానీ.. నా మీద నమ్మకముంచండి సార్! తెల్లారేలోగా మ్యాడంగారి లగేజీ మీ కొత్త అకామిడేషన్ గుమ్మం ముందుంటుంది. సరేనా!అంటూ నా కొత్త చిరునామా తీసుకున్నాడు. చేసేదేంలేక ఆటో వెనక్కి తిప్పుకుని వచ్చేసామిద్దరం.
పాతికమైళ్లన్నా దూరం ఉంటుందనుకుంటా  నా కొత్త అకామిడేషనుకి, రామసుబ్బు వాళ్ళింటికీ మధ్య దూరంరాత్రి ఏ ఝాములో వచ్చి దించిపోయాడో.. తెల్లారేసరికల్లా గుమ్మం ముందు నా లగేజీ మొత్తం ప్రత్యక్షం! చెక్ చేసుకుంటే.. నాలిక గీసుకునే బద్దతోసహా ఎక్కడి సామాను అక్కడే భద్రంగా ఉంది!
రామసుబ్బు నెంబరుకి కాల్ చేస్తె ఎంతసేపటికీ ఎత్తడమే లేదు. ఎక్కడ ప్రజాసేవలో తలమునకలై ఉన్నాడో! ఎప్పుడు కాల్ చేసినా నో రెస్పాన్స్. రామసుబ్బులాంటి మనిషి చిన్నపిల్లల నీతికథల్లో తప్ప ఎక్కడా కనిపించడేమో! విచిత్రం!
తరువాత ప్రసాదుగారి బావగారిని కలిసినప్పుడు అంతకన్నా విచిత్రమైన విషయం బైటపడింది. రామసుబ్బు కథవిని.. విజిటింగ్ కార్డు చూసిన ఆయన విస్తుపోయాడు. 'ఈయనా రామసుబ్బంటే!
కేరళానుంచొచ్చి టీ పౌడరు వ్యాపారం చేసే నాయరు కొనుక్కున్నాడే ఆ ఇంటిని ఈ మధ్య! మా డిఫెన్సు క్యాంటిన్సుకి లిప్టన్ పౌడరు సప్లై చేస్తుంటాడు. కూతురు పెళ్ళికని  ఓ నెల రోజులపాటు ఊరికెళ్ళాడా మధ్యలో! మా కందరికీ రిసెప్షన్  ఇచ్చింది మీరున్న ఆ ఇంట్లోనే! యస్! నాకు బాగా గుర్తుకొస్తుందిప్పుడు. మీరు బ్యాంకులో జాయినవడానికి వచ్చిన రోజుల్లోనే జరిగిందా పెళ్ళి. నా దగ్గర ఇంకా ఆ ఇన్విటేషను కూడా ఉందిఅని ఓ పెళ్ళి పత్రికను వెదికి మరీ తెచ్చి చూపించాడాయన. దానిమీద రిసెప్షనుకని అచ్చొత్తిన చిరునామాలోనే  నేనారోజు రాత్రంతా రామసుబ్బుగారి ఆతిథ్యాన్ని చవి చూసింది!
'నాయరు ఇంటితాళాలు మీ రామసుబ్బు ఎలా దొరకబుచ్చుకున్నాడో!అని ఆయన అంటుంటే నోరు వెళ్ళబెట్టడం నా వంతయింది.
లొఖండే విప్పాడా మిస్టరీ తన సోర్సులద్వారా సమాచారం రాబట్టి. ' మీ రామసుబ్బుగారికి మతి స్థిమితం తక్కువ. దయాగుణం ఎక్కువ. ఖైతాన్ కంపెనీ మనీ ఇలాగే దానధర్మాలు చేసి ఉద్యోగం పోగొట్టుకున్నప్పట్నుంచీ మొదలయిందట జబ్బు. మిమ్మల్ని ఎకామిడేట్ చేసిన భవంతి ఆయన ఫ్యామిలీ  ప్రాపర్టీనే. ఇల్లు గడవడంకోసం నాయరుకు అమ్మిన మాట నిజమే. ఆ నాయరు ఊళ్ళో నప్పుడు మీకక్కడ ఆతిథ్యం లభించిందన్న మాట. అమ్మకముందు అదాయన సొంత భవనమే కదా! పాత డూప్లికేట్ తాళాలతో పని నడిపించాడన్న మాట ప్రజా సేవకుడు!'
'పరాయి కొంపలో ముక్కూ మొగం తెలీని మనిషికి పడీ పడీ రాత్రిళ్ళు  సేవలు చేయడం ఏంటి?! ఇందులో ఆయనకొచ్చే లాభం ఏంటి?! ఒక్క క్షణంకూడా నాకు ట్రబులివ్వలేదా పెద్దాయన. పైపెచ్చు తన సొమ్మే బోలెడంత  ఖర్చు చేసాడు! ఎంత మతి స్థిమితం లేకపోతే మాత్రం ఇంత పకడ్బందీగానా ఆతిథ్యం?!'
'అదే శ్యామలగారూ ఇందులో ట్విస్టు. అసలు విషయం వింటే మీరు షాకవుతారు. ఇల్లు గడవని రోజుల్లో ఆయనగారి కూతురు ముంబైలో ఓ చిన్న ఉద్యోగం చేసేదిట. ఎవరో త్రాష్టుడు అమె వంటరిగా ప్రయాణం చేయడం గమనించి ఎడ్వాంటేజి తీసుకున్నాడంటున్నారు. చెట్టంత ఎదిగిన బిడ్డ అలా అన్యాయంగా బలై పోయినప్పట్నుంచి  మీ రామసుబ్బుగారి పిచ్చి ఇటు మళ్ళిందన్నమాట. స్టేషనులో కాపు కాయడం.. మీలాంటి ఆడకూతుళ్లెవరన్నా అసహాయంగా కనిపిస్తే సేఫుజోనులో చేరిందాకా వెంటబడి మరీ సేవల మిషతో కాచుకోవడం! మామూలు  చికిత్సకు లొంగక కొంతలొంగే చికిత్సకు డబ్బు లేక కొంత ఇంట్లో వాళ్ళంతా ఈయన్ను పట్టించుకోవడం మానేసి చాలా కాలమైందట!’ 
సినిమా కథలనుకుంటాం గానీ.. కొన్ని జీవితాలు  సినిమా కథలకన్నా విచిత్రంగా ఉంటాయి.. ఇలా!'
రామసుబ్బుగారి మంచితనంమాటకారితనం ఓ పిచ్చి వల్ల వచ్చిందా?! నమ్మబుద్ధికాకపోయినా ఇదో పచ్చినిజం! బాధతో నిట్టూర్చకుండా ఉండలేకపాయాను.
***

రచన 
కర్లపాలెం  హమమంతరావు
( అచ్చంగా తెలుగు - ప్రచురితం ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...