అదృష్టం బాగుండి మనం మనుషులుగా పుట్టేసాం. ఏ దున్నపోతుగానో జన్మెత్తుంటే జీవితాంతం గడ్దీ గాదం కోసం మాత్రమే అల్లాడాల్సొచ్చేది. థేంక్ గాడ్! గాడిదగా పుట్టించలేదు మమ్మల్ని. బడిబిడ్డల స్కూలు బ్యాగుల్ని మించిన మైల బట్టలు మోసీ మోసీ నాలుక్కాళ్ళు చచ్చుబడుండేవి. ఏ కుక్కగానో పుట్టించినా గతంలో కొంత బెటరేమో గానీ.. ప్రెజెంట్లీ నాట్ ప్లెజెంట్ డేస్! రోజులు బా లేవు. బడా నేతల ట్విట్టరు ఎకౌంట్లు కొత్తగా నెత్తికి చుట్టుకుంటున్నయ్! కాకులుగా పుట్టినా ఓకే నే! సర్కారీ నౌఖరీల్లో దూరి ఏ కాకిలెక్కల్తోనో కాలక్షేపం చేసేయచ్చు కానీ పద్దాకా లెక్కలడిగి పీడిచ్చేస్తున్నాయ్ ఈ మధ్య ప్రభుత్వాలన్నీ. మా చెడ్డ చిక్కులొచ్చి పడుతున్నయ్ వీటి చాదస్తంతో! ఆ గండం నుండి గట్టిక్కించావ్ దేవుడా! గండర గండడు మనిషి. వాడి జాతిలో పుట్టించేసావ్! ఇహ ఇప్పుడెన్ని తప్పులు చేసినా బదులు చెప్పే ఇబ్బందే లేదు. ధన్యవాదాలయ్యా దయమయా.. కోడి మాదిరిగా పుట్టించనందుక్కూడా! తెల్లారగట్టే పర్ఫెక్టుగా లేచి కూసి కూసి చచ్చే పని తప్పించావు నాయనా! కొంగలా పుట్టిస్తావేమోనని బెంగ పడి చచ్చాను! ఇంత బుల్లి చేప్పిల్ల నోట పడాలన్నా తెల్లార్లూ ఒంటి కాలు మీద దొంగ జపాలు చెయ్యాలయ్యా చన్నీళ్ళల్లో! ఆ పాట్లన్నీ తప్పించినందుకు వేన వేన దండాలయ్యా ఆపద్భాంధవా! తోకల్లేక పోతేనేమిలే? తప్పులు చేయడమే ఓ గొప్ప హక్కుగా భావించే మానవ జాతిలోకి మమ్మల్ని తోసి తిప్పలు తప్పించావుగా తండ్రీ.. మెనీ మెనీ థేంక్స్ దయామయా!
ఏ తప్పూ చేయడం రాని చవట జాతులు సృష్టిలో సవాలక్ష ఉన్నాయి. గద్ద గురి తప్పకుండా గంప కిందున్న కోడి పెట్టను కొట్టుకు పోగలదు. ఎట్లాంటి అంట్లవెధవ అడిగినా పొలమారకుండా చిలక పర్ఫెక్టుగా జోస్యం కార్డు బైటికి తీసేయగలదు. ఎంత్తెత్తు నుంచైనా దూకించు.. పిల్లి ముంగాళ్ల మీదనే మొగ్గ్గేసి నిలబడగలదు. కొమ్మ నుంచి కొమ్మ మీదకు గెంతే కొద్ది టైములో కూడా కోతిది పర్ఫెక్టు టైమింగు! జెమినీ సర్కసు మార్కు పర్ఫెక్టు ఫీట్సన్నీ చేసే జీవులు సృష్టిలో లక్షా తొంభై ఉన్నాయ్! అయినా మిస్టేకుల మీద మిస్టేకులు మాత్రమే చేసి నవ్వించే జోకర్ జాతిలోకే మమ్మల్ని తోసి పుణ్యం కట్టుకున్నావయ్యా పరంధామా! అడుగడుక్కీ తడబడి పోవడం.. తడవ తడవకీ గొడవలు పడిపోవడం.. భలే థ్రిల్లింగుగా ఉందిలే ఈ మానవ జన్మ. మహా ప్రసాదం స్వామీ నీ దయా దాక్షిణ్యాలకి!
మనిషి పుట్టుక కాబట్టి మడత పేచీలుండవు. పంచపాండవులు ఎంతమందని ఏ మందమతొచ్చి అడిగినా మంచం కోళ్ల మాదిరి ముగ్గురేనని ముచ్చటగా దబాయించేయచ్చు. రెండు వేళ్లకు బదులు ఒక్క వేలు చూపించినా వేలెత్తి చూపించే హక్కు ఏ భోషడిక్కీకీ లేదు. ఏ తప్పూ చేయకుంటే లైఫు మరీ ఓల్డు లైలా మజ్నూ మూవీలా బోర్ కొట్టి చావదా? ఆ వినోద రహస్యం తెలుసును కాబట్టే .. గెజిట్ జీ. వో లు అవీ తప్పులేవీ లేకుండా ఛస్తే రిలీజు చెయ్యరీ సర్కారీ నౌఖర్లు. ఆ జీవులూ నీ సృష్తిలీలలే కదా .. తప్పులెలా దొర్లకుండా ఉంటాయిలే మహానుభావా?
తప్పులున్నంత కాలమే జైళ్లుండేది. జైళ్లున్నంత కాలమే జైలధికారులుండేది. జైలధికారుల కదికారమున్నంత కాలమే తప్పులు యధేఛ్చగా జరుగుతుండేది. ఏ తప్పులూ ఎవరూ చేసి సహకరించక పోతే అసలు ముప్పు ముందు మీడియా దొరలకే కదా.. మేత దొరక్క!
పర్ఫెక్టుగా బతకాలనుకొనే చాదస్తపు జీవికి మానవ జన్మ శుద్ధ వేస్ట్. నేరాలవీ భారీగా చేసేసి ఆనక కన్నీళ్ళు గట్రా కుండల కొద్దీ కార్చినప్పుడే పబ్లిక్కులో సింపతీ ప్లస్సయ్యేది. ఏ తప్పూ చేయడం రాక తగుదునమ్మా అంటూ రాజకీయంలకి జొరబడ్డా.. ఎంత దొరసాని బిడ్డ కథయినా డ్యామిట్.. అడ్డం తిరుగడం ఖాయం! 'అయ్యో.. పాపం' అంటూ అమాయకుల చేత కావిళ్ల కొద్దీ కన్నీళ్లు కార్పించాలి. పాప్యులారిటీ పెరగాలంటే పద్దాకా పప్పులో తప్పకుండా కాలేస్తుండాలి. తప్పదు. మిస్టేకుల్ని మించిన ట్రిక్ పాలిటిక్సులో మరోటి లేదు మరి!
యమర్జన్సీ తప్పు తరువాతే ఇందిర 'అమ్మ'గా ఎమర్జయింది. ‘మహానేత’గా మేక్ ఇన్ ప్రాసెస్ లో మొహమాటాల కస్సలు తావుండ కూడదన్నా! పట్టు బట్టి మిస్టేక్స్ చేసినప్పుదే జనం మీద పట్టు దొరికేదక్కా!
'తప్పు లెన్ను వారు తమ తప్పు లెరుగరు' అన్న వేమన వాస్తవానికి ఓ వెర్రినాగన్న. 'ఒపీనియన్స్ డిఫరైతే గాని పొలిటీషియన్ కానేరడ'న్నాడయ్యా గురజాడగారి గిర్రాయి! మిస్టేక్స్ మీద పొలిటీషియనుకే మిస్టర్ పర్మినెంట్ పేటెంట్ రైట్స్!
తప్పును తప్పు అని కుండ బద్దులు కొట్టే పూర్ శరద్ యాదవ్ సిన్సియార్టీ.. తప్పే ఒప్పని దబాయించి మరీ బుర్ర బద్దలు కొట్టేసే లల్లూ యాదవ్ పాప్యులార్టీ ముందు బలాదూర్! జయమ్మ కుర్చీ పక్కనే కూలపడుండేది శశికళమ్మ ఎల్ల వేళలా. ఎన్ని తప్పులు చేయందే చెలికత్తె నుంచి చిన్నమ్మ స్థాయికి ఆ మహాతల్లి ఎగబాకినట్లు? కాణీకి.. ఏగాణీకి మొగంవాచి బోలెడన్ని తప్పులకు బోల్డుగా ఒడిగట్టింది.. కాబట్టే కనిమొళి ప్రభ తమిళనాట ఇంకా కొడిగట్టకుండా వెలిగిపోతోంది.
తప్పు చేయడం అంటే ఓ కొత్త వివాదం సృష్టించడం. కొత్త కొత్త నినాదాలకు ఉప్పందించడం. జడ్జీల నుంచి బెంచి క్లర్కుల వరకు అందరూ బాగుండాలి. అందుకే దండిగా తప్పులు జరుగుతుండాలి! పొరపాట్లు చెయ్యమని మొండికేస్తే ఎట్లా? ఇహ పోలీసులెందుకు? జైళ్లెందుకు? దండక్కదా!. దొంగలకు, దొరలకు మధ్య ఉండే పల్చటి తెర ఈ తప్పుల తడికే నప్పా!
తప్పుల్ని తప్పు పట్టడం పెద్ద తప్పు. 'పొరపాటయిపోయింది.. సరిదిద్దండి' అన్న రెండు ముక్కలకుండే దమ్ము కొరియా కిమ్ము అణుబాంబుకైనా ఉండదండీ బాబూ! మిస్టేక్సుల్లో టెస్టు పెడితే ప్రశ్నపత్రాలు సెట్ చేసే మాష్టర్సుదే ఫస్టు ర్యాంకు. పేజీకి ఈజీగా నాలుగైదైనా తప్పులుండాలి. లేకుంటే లేజీ ఫెలోసని లోకమెక్కడ లోకువ కడుతుందోనని శంక. వివాదాలేవీ లేకుండా ఆన్సర్ 'కీ', హానర్ పోస్ట్, నంది అవార్డు, బయో పిక్కు, టీ.వి చర్చ ముగిసాయంటే.. ఎక్కడో కచ్చితంగా ఏదో తప్పు జరిగినట్లే! మానవ జన్మమీద మచ్చ పడ్డట్లే!
మనిషిగా పుట్టించి మనకు నిత్యం తప్పులు చేసే మంచి అవకాశం కల్పించాడు దేవుడు. పర్ఫెక్షనో అంటూ చాదస్తానికి పోయి భగవంతుడి నమ్మకాన్ని వమ్ము చేయద్దు. మన వంతు తప్పులు మనం చేసుకు పోతున్నప్పుడే పై వాడికీ నాలుగు చేతుల నిండా పని. అస్తమానం బొక్కలు వెదికే జాతి కూడా భూమ్మీద ఒకటుంది కదా! సరిదిద్దే అవకాశం దేవుడు వాటికీ ప్రసాదించాడని మరవద్దు.. మరో పెద్ద తప్పు చేయద్దు!
ఉదాత్తమైనది మానవ జన్మ. వృథా చేయద్దని కాంగీ కొత్త అధినేత ఉద్బోధ. రాహుల్ బాబు జాతికి ఈ మధ్య ట్విట్టరు ద్వారా ఓ చక్కని సందేశం అందించారు. అందరికీ ఆదర్శంగా ముందుండడమే కదా గొప్ప నేత మంచి లక్షణం! అందుకే.. మోదీ హయాంలో అందలాలెక్కిన ధరవరలను శాతాల్లో చూపిస్తూ శతాధికమైన దోషాలను యధేఛ్ఛగా దొర్లించేసారు. సారుని జౌరంగజేబని తిట్టిన నోళ్లే ‘ఔరా’ అంటూ అవాక్కయి పోతున్నాయి నాయనా ఇప్పుడు!
ఎంత లావు శివ భక్తుడైతే ఏమి? ‘మనిషి’గానే పుట్టాడు కదా సోనియమ్మ కడుపున? చూడాలిహ! ముందు ముందు మోదీజీ సైతం తానూ 'ఓ మహా మనీషి'ని అని నిరూపించుకొనేందుకు ఇంకెన్ని ఘోర తప్పిదాలకు శ్రీకారం చుట్టబోతున్నారో!
-కర్లపాలెం హనుమంతరావు
***
(ఆంధ్రప్రభ దినపత్రిక, 09-12-2017నాటి సుత్తి.. మెత్తంగా కాలమ్ లో ప్రచురితం)
***
(ఆంధ్రప్రభ దినపత్రిక, 09-12-2017నాటి సుత్తి.. మెత్తంగా కాలమ్ లో ప్రచురితం)