Showing posts with label Translation. Show all posts
Showing posts with label Translation. Show all posts

Wednesday, December 8, 2021

అమ్మమ్మ తల్లి- కథానిక అనుసృజన : కర్లపాలెం హనుమంతరావు

 అమ్మమ్మ తల్లి- కథానిక

అనుసృజన: : కర్లపాలెం హనుమంతరావు

 

మా చిన్నతనంలో మా నాన్నగారి ఉద్యోగరీత్యా కొంతకాలం మేమొక కొండప్రాంతంలో ఉండాల్సివచ్చింది.  ఆ ప్రాంతం పేరు పిచ్చికుంటపల్లిపిచ్చికుంటపల్లికి దగ్గర్లోనే ఒక చిట్టడవి; ఆ చిట్టడవిలో గిరిజనుల ఆవాసాలుండేవి. అడవిలో దొరికే చింతపండు, పుట్టతేనె వంటివి.. ఏ సీజనులో దొరికే సరుకును  ఆ సీజనులో వారానికో సారి జరిగే సంతలకు తెచ్చిఅమ్ముకునేవాళ్ళు. వారానికి సరిపడా కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కుని పోతుండే వాళ్లు.

 పల్లెల్లో తరచూ అంటువ్యాధులు ప్రబలి  ప్రాణహాని జరుగుతుందని జిల్లా కలెక్టరుగారికి ఫిర్యాదులు వెళ్లాయి ఒకసారివాళ్ళకు టీకాలు వేయించే  భాధ్యత మా నాన్నగారి నెత్తిమీద పడింది. ఆయన హెల్త్ డిపార్ట్ మెంట్ లో జిల్లా బాధ్యులు అప్పట్లో.

'ఓస్సోస్! టీకాలే కదా! అదే మంత గొప్ప ఘనకార్యమామనిషి జబ్బ మీద మందులో ముంచిన రొటేటరీ లాన్సెట్ అటూ.. ఇటూ ఓ సారి గిర గిరా తిప్పేస్తేఅని కొట్టిపారేయకండి! పాణిగ్రహణం ఎంత కష్టమో..టీకాలు వేయడానికి ఒప్పించుకుని గిరిజనుల పాణి గ్రహణం చేయడం అంతకన్నా కష్టంఅనుభవించే వాళ్ళకు మాత్రమే తెలిసే అవస్థ అది

 

నౌఖరీ అన్నాక అన్ని రకాల శ్రమదమాదులకూ తట్టుకోక తప్పదు కదాహెల్త్ డిపార్తుమెంటులో పనిచేసే మానాన్నగారూ అందుకు మినహాయింపు కాదు.  

 

రెండురోజులు అడవిలో వుండేందుకు వీలుగా ఓ క్యాంపు కాట్ఇక్ మిక్ కుక్కరు,  హోల్డాలుథెర్మోఫ్లాస్కుమర చెంబు.. వీటినన్నింటినీ మోసుకు తిరిగేందుకు ఒక మనిషిని ఎర్పాటు చేసుకుని మరీ బయలు దేరారు. ఆ తోడువచ్చే మనిషీ అడవిజాతివాడేపేరు 'రఘువా'.

 

రఘువా మాకా ఊరు వచ్చినప్పటినుంచి పరిచయం. చాలా విశ్వాసపాత్రుడు. అతగాడి గూడెంకూడా ఆ అడవిలోనే ఎక్కడో ఉందిముందు ఆ గూడెంనుంచే పని ప్రారంభించాలని మా నాన్నగారి వ్యూహంవాళ్లను చూసి ధైర్యంతో మిగతా గూడేలవాళ్ళు ముందుకొస్తారని ఆయన ఆలోచన.

 

అడవిలోపలి దాకా వెళ్ళి ఒక చదునైన స్థలంలో టెంట్ వేసుకొని.. క్యాంపుకాట్కుక్కరూగట్రాలు సర్దుకుని 'ఆపరేషన్ టీకాఆరంభించబొయే వేళకి బారెడు పొద్దెక్కింది. వెంట తెచ్చుకున్న కిట్లో మందు చాలినంతగా లేదని అప్పుడు చూసుకున్నారుట మా నాన్నగారుఎలాగూ ఇంకో 'బ్యాచ్మందు  పోస్టు ద్వారా వచ్చి సమీపంలోని  పోస్టాఫిసులో వుందని తెలుసు.. కనక బెంగ పడలేదుక్యాంపుకి  ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందా పోస్తాఫిసు. దాన్ని తీసుకుని రమ్మని రఘువా చేతికి చీటీ రాసిచ్చి పంపించి  మంచం మీద కాస్త నడుం వాల్చారుట మా నాన్నగారు.

 

అలవాటు లేని నడక పొద్దుటునుంచీ. అనుకోకుండా కళ్ళు అలాగే మూతలు పడిపోయాయిట. 

 

మెలుకువ వచ్చేటప్పటికి చుట్టూ చీకట్లు కమ్ముకుంటున్నాయి. 

 

అసలే అడవి ప్రాంతంకొత్త చోటుఎటు వైపునుంచి ఏ జంతువొచ్చి మీద పడుతుందో.. అప్పుడేం చేయాలో తెలీదుఉదయం బయలు దేరేటప్పుడు ఇంట్లొ తీసుకున్న అల్పాహారమే! మధ్యాహ్నం క్యాంపులో రఘువా చేత వండించుకుని తిందామని ప్లాన్ఇప్పుడు ఆ రఘువానే ఆజా ఐపూ లేకుండా పోయాడు. ముష్టి ఐదు కిలో మీటర్ల దూరం  పోయి రావడానికి ఇన్ని గంటలాఅందులోనూ నిప్పుకోడిలాగా దూకుతూ నడుస్తాడు రఘువా.

 

ఏం జరిగిందో అర్థం కాలేదుఏం చేయాలో అంతకన్న పాలు పోలేదు మా నాన్నగారికికడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయిముందు ఆత్మారాముడి ఘోష చల్లార్చాలిఆనక ఈ రాత్రికి రక్షణ సంగతి చూసుకోవాలి.

 

దగ్గర్లో ఉన్న గూడానికి పోయి వచ్చీ రాని  భాషలో ఏదో తంటాలు పడి తన వెంట ఇద్దరు కోయ యువకులను తెచ్చుకున్నారుట మా నాన్నగారు. తెల్లార్లూ వాళ్ళు టెంటు బైట కాపలా వుంటే.. లోపల పేరు తెలియని జంతువుల అరుపులు వింటూ  మా నాన్నగారి జాగారం.

 

తెల్లవారంగానే ఆయన ముందు చేసిన పని ఒక యువకుణ్ణి టెంటుకి కాపలా పెట్టి.. ఇంకో యువకుడిని తోడు తీసుకుని వెళ్ళి పోస్టుమాస్టరుగారిని  కలవడం.

"మందు ప్యాకెట్టు నిన్నే మీరు పంపించిన మనిషి తీసుకెళ్ళాడు సార్!" అనేసాడుట పోస్తుమాస్టరుగారు తాపీగా.

 

'మా నాన్నగారి గుండెల్లో రాయి పడింది. నిన్ననగా మందు తీసుకున్నవాడు ఇవాళ్టికి కూడా టెంటుకు చేరలేదంటే అర్థమేంటీకొంపదీసి మధ్యదారిలో ఏదన్నా జరగరానిది జరగలేదుగదా!ముచ్చెమటలు పట్టడం మొదలుపెట్టాయిట మా నాన్నగారికి.

 

ఆయన భయానికి మరో ముఖ్యకారణం కూడా ఉంది. రూల్సు ప్రకారం రఘువా ఆ మందు డెలివరీ తీసుకోరాదుఆ అమాయకుడేమన్నా ఈ మందును  ఇంకేదన్నా అనుకుని  దుర్వినియోగం చేసుంటే.. మొదటికే మోసం. మందు సంగతి అలా ఉంచి ముందు మనిషి ప్రాణానికే ముప్పం.

 

 ఏం చేయాలో పాలు పోక అక్కడి పోస్టాఫీసు బెంచీమీద అలాగే కూలబడి పోయారుట మా నాన్నగారు.  పాపంపోస్టుమాస్టరుగారే కాసిని చాయ్ నీళ్ళు తాగించి.. ఆనక సలహా కూడా ఇచ్చారుట."సాధారణంగా ఇక్కడి గిరిజనులు చాలా నిజాయితీగా ఉంటారండీ! ఇంకేదో జరిగి వుండాలి. ఏం జరిగిందో తెలుసుకోవాలన్నా ముందు మీరు ఆ రఘువా ఉండే గూడేనికి వెళ్ళి వాకబు చేయాలిఅక్కడి పరిస్థితులను బట్టి అప్పుడు ఏం చేయాలో ఆలోచించుకుందురుగాని.. ముందు బైలుదేరండి" అని తొందరపెట్టి మరీ పంపించాడుట.  రఘువా గూడేనికి వెళ్లే దారికూడా  ఆయనే  చూపించాడుట.

 

ఆరు మైళ్ళు.. డొంకదారుల్లో బడి.. ఎత్తులూ పల్లాలూ దాటుకుంటూ.. రఘువా ఉండే గూడేనికి చేరుకొనేసరికి సూర్యుడు నడినెత్తిమీద కొచ్చేసాడుట.

 

గూడెం పొలిమేరల్లోనే ఒక  ఊరేగింపు ఎదురైందిట వాళ్ళకు. ఆడామగా అట్టహాసంగా చిందులేసుకుంటూ  కోలాహలంగా  వస్తున్నారు  బాజాలూ బంత్రీలూ మోగించుకుంటూ. మధ్యమధ్యలో జివాల బలులు. కోళ్ళని గాల్లోకి ఎగరేసి గొంతులను లటుక్కుమని నోటితో కొరకడం.. చిమ్మేరక్తాన్ని ఊరేగింపు మధ్యలో  ఉన్న దున్నపోతుమీదకు చల్లడం! దున్నపోతుకు చేసిన అమ్మోరి వాహనం అలంకారంలో ఈ రక్తం కలగలిసిపోయి చూపులకే పరమ భయంకరంగా ఉందంట అక్కడి వాతావరణం. అన్నింటికన్న విచిత్రమైన విషయం.. ఆ దున్నపోతు మీద ఊరేగుతున్న పెద్దమనిషి ఎవరో కాదు.. సాక్షాత్తూ రఘువానే! 

 

వాహనం మీద అటో కాలూ ఇటో కాలూ వేసుకుని  వళ్లో ఏదో బుట్టతో దేవుడల్లే  కూర్చోని వున్నాడుట. నుదిటిమీద పెద్ద పెద్ద కుంకుమ బొట్లు.. మెళ్ళో పూలుపూసలు కలగలిపి అల్లిన దండలు.. చేతిలో బల్లెం.. చూడ్డానికి సాక్షాత్తూ యమలోకం నుంచి దిగొచ్చిన  కింకరుడు మల్లే ఉన్నాడుట. 

 

చేతులూ రెండూ కట్టుకుని.. ముంగిలా.. ఎప్పుడూ వెనకెనకే వంగి వంగి నడిచే రఘువాలో ఇన్ని కళలున్నాయా!' ఆశ్చర్యంతో మానాన్నగారి నోటంట మాట రాలేదుట. ఆటైములో.

 

అసలేం జరుగుతుందో అర్థం కాలేదుత ముందాయనకు. వెంటవచ్చిన గిరిజనుడిదీ అదే పరిస్థితి. 'కనుక్కొస్తాన'ని అటుగా వెళ్ళిన మహానుభావుడు.. నీరసంతో శోషొచ్చి మా నాన్నగారు  బండమీద వాలి పోయిందాకా తిరిగి రానేలేదుటఅరగంట తరువాత వచ్చి దగ్గర్లోని చెట్టునుంచి రెండు జాంకాయలు  కోసి తినిపించి అప్పుడు తీరిగ్గా వినిపించాడుట తెచ్చిన సమాచార ఆ గిరిజనుడు.

 

 

 అతగాడు తెచ్చిన సమాచారం ప్రకారం ఇంకో గంటలో ఊరిబైట కొత్తగా గుళ్లో అమ్మమ్మ తల్లి ప్రతిష్టాపన జరగబోతుంది.

'అమ్మతల్లితెలుసు గాని.. ఈ 'అమ్మమ్మ తల్లిఎవరూ?" అని అడిగారుట మానాన్నగారు.

"నాకూ తెలీదు దొరాఎప్పుడూ వినలేదుచూద్దాం పదండి" అని అర్థం వచ్చే వాళ్ళభాషలో ఏదో కూసి ఆ దేవాలయం ఎక్కడ కడుతున్నారో అక్కడికి  నడిపించుకుని పోయాట్త ఆ గిరిజనుడు.

 

ఊరికి ఉత్తరంలో కొత్తగా కాల్సిన మట్టి ఇటుకలతో కట్టిన నాలుగు గోడల గుడి అదిదాని మధ్యలో అరగంట కిందటే ప్రతిష్టించినట్లున్నారు అమ్మమ్మతల్లిని.. బైట ఇంకా పచ్చి ఆరని బల్లుల రక్తం మరకలు.. పసుపు కుంకుమల వాసనలు.. సగం కాలిన అగరవత్తులూ..!

 

అప్పటి దాకా సందడి చేసిన గిరిజనులు.. ప్రతిష్టాపన అనంతరం.. సంబరాలు చేసుకుంటూ ఒక దిక్కుకు వెళ్ళిపోవడం చుసారుట మా నాన్నగారు.

'టీకా మందు తెమ్మ'ని పంపించిన నమ్మకస్తుడు.. అలా అన్నీ మరిచి మందుకొట్తి కొత్త దేవుడి అవతారంలో మందతో కలిసి ఇలా ఆడుతూ..పాడుతూ మొహం కూడా చూపకుండా వెళ్ళిపోతుంటే.. అంత లావు ఆఫీసరు సారయివుండీ..ఏం చేయాలో దిక్కుతోచక అలాగే నిలబడిపోయారుట మానాన్నగారు.

 

"అప్పటికింక చేసేదేమీ లేదు.. తిరిగి మళ్ళీ చీకటి పడేలోపు టెంటుకెళ్ళి బబ్బోవడం తప్పమళ్లీ మందు  తెచ్చుకొని  'ఆపరేషన్ టీకాకంటిన్యూ చేయడమెలాగూ తప్పదు. జరిగిందంతా పై అధికారులకు  వివరంగా చెప్పి పడబోయే పనిష్మెంటుకి తలవగ్గడం ఎలాగూ  తప్పదు.అలా అనుకున్న తరువాత ఇంక వర్రీ అవడం మానేసానుఎలాగూ పోతున్నాము కదా.. ఒక సారి ఈ కొత్త దేవత అమ్మతల్లి ఎలాగుంటుందో చూడాలని కుతూహలం పుట్టుకొచ్చింది" అని చెప్పుకొచ్చారు మా నాన్నగారు తరువాత మా కాకథ చెప్పే సందర్భంలో ముక్తాయింపుగా.  గుర్తున్నంత వరకూ ఆయన మాటల్లోనే చెప్పి ఈ కథ ముగిస్తా.

 

"..అప్పటికే నావెంట వచ్చిన గిరిజనుడు గుడిముందు పడి పొర్లుదండాలు పెట్టేస్తున్నాడు. గుడికి ఇంకా పైకప్పు ఏర్పాటు కాలేదుకాస్త ముందుకు వెళ్ళి లోపలికి తొంగి చూసా!

ఆశ్చర్యం! పీఠంమిద  'టీకా మందుల పెట్తె'! అదే రఘువా పోస్తాఫీసునుంచి విడిపించుకొచ్చింది. దానికి అన్ని వైపులా పసుపూ కుంకుమ బొట్లు పెట్టున్నాయి! ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. మెడిసన్ తొ పాటు ప్రచారానికని సప్లై చేసిన  డిస్ ప్లే మటీరియల్లో ఒక సినిమాతార  కుడిచేత్తో సిరెంజి.. ఎడం చేత్తో అభయ హస్తం ముద్ర పట్టి వున్నట్లు ముద్రించిన పోస్టరు ఒకటుంది.. అది ఆ గుడిగోడ లోపల అంటించి ఉందిఆ సినీతార నుదుటనిండా ఇంత మందాన కుంకుమ బొట్లు.. కాళ్ళకి పసుపు పారాణీ!.. టీకాలు సక్రమంగా  వేయించుకుంటే ఆరోగ్యానికి భద్రతఅన్న నినాదం ఇచ్చే సినిమా తార హఠాత్తుగా  ఈ గిరిజనులకు 'అమ్మమ్మతల్లి'ఐపోయిందన్నమాట!  అలా ఎందుకయిందో..ఎలా ఐందో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థమై చావలేదు.

మర్నాడు తిరిగి వెళుతూ వెళుతూ దారిలో పోస్టుమాస్టరుగారిని మళ్ళా కలిసి విచారించినప్పుడు గానీ ఆ చిక్కు ముడి విడిపోలేదు.

"మీ రఘువా మందు ప్యాకెట్టూ.. ప్రచార మెటీరియల్ తీసుకుంటున్నప్పుడు 'నన్ను అడిగాడండీ.. ఇదేమిటి దొరా?" అనిఇక్కడి కొండజాతివాళ్ళు 'ఆట్లమ్మా..మశూచికంలాంటి అంటువ్యాధులని 'అమ్మోరుఅని పిలుచుకుంటుంటారుఆ అమాయకుడికి బాగా అర్తమవుతుందన "మీ అమ్మోరుని చంపేసే మందురా" అని చెప్పాసార్!. దాన్నా అమాయకుడు 'అమ్మమ్మ తల్లిగాభావించాడుమీకు తిరిగి తెచ్చిస్తే మిగతా గూడేలకందరికీ పంచేస్తారు కదావాళ్ల గూడెపొళ్ళకి దక్కకుండా పోతుందనుకున్నాడో ఏమో.. నేరుగ్గా గూడేనికే తీసుకెళ్ళి నాయకుడి పరం చేసేసాడు. ఆ నాయకుడూ అంతకన్నా తెలివిమంతుడు లాగున్నాడు. వాళ్ల ఆచారం ప్రకారం ఈ 'అమ్మమ్మ తల్లి'కి ఊళ్ళోనే గుడి కట్టించి పారేశాడు" అని వివరించాడ్దుట పోస్టుమాస్టరుగారు"

 

అదండీ ఆ గిరిజనుల అమాయకత్వం. వాళ్ళంటే అనాగరికులు. చదువుకోని వాళ్ళుఅన్ని చదువులు చదివి ఇంత నాగరీకం వెలగబోసే మనం మాత్రం ఇంతకన్నా తెలివిగా ప్రవర్తిస్తున్నామాఆలోచించుకోవాల్సిన విషయం ఎవరికి వాళ్ళుగా!

అందుకే అప్పటి కథ ఇప్పుడు చెప్పుకొచ్చింది.*

అమ్మమ్మ తల్లి- కథానిక

అనుసృజన : కర్లపాలెం హనుమంతరావు

Thursday, October 7, 2021

అనువాద కవిత: అనేకుల కది! - రవీంద్రనాథ్ ఠాగోర్-తెనుగు సేత : శ్రీ విద్వాన్ విశ్వం సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

 


క్రొవ్విరులను గూర్చిన 

నీ మువ్వపు  మాలికను

కంఠమందు వైతువా 

పువ్వుంబోణీ!    అయినచో  


క్రొవ్విరులను గూర్చిన 

నీ మువ్వపు  మాలికను

కంఠమందు వైతువా 

పువ్వుంబోణీ!    అయినచో 

ని వ్విరి సరమునకు 

బదులు నే నేమిత్తున్ ? 


నే గట్టిన తో మాలను 

నీ కొక్కర్తుక కె 

యొసగ నెట్లు పొసగు? 

నో రాకా  హిమకర వదన! 

అనేకుల కిది

వారి నెల్ల నెటు వర్జింతున్ ? 


ఉన్నారు భావుకులు : 

మన కన్నుల కగపడని 

చోట్ల గలవారెవరో 

ఉన్నారు; కవుల పాట 

సన్నిహితులు ఉన్నవారు 

చాలమందియె

ఇందరికై ఈ మాలిక 

నందమ్ములు జిలుక కట్టినాడ

గావునన్‌; 

కుందరసమదన ! 

నీకే చెందించుట 

నెట్లు పడును? 

చెప్పుము నీవే. 


నీ యడదకు   

నా  యడద నుపాయనముగ 

నడుగు  సమయ మది 

గతియించెన్; 

తోయజ నయనా 

ఎపుడో పోయిన దా   

కాలమెల్ల  గతియించెన్ 

పూర్వగాథయై.


పరిమళమంతయు 

లోపలి యరలోనె 

దాచు కొన్నయట్టి

మొగ్గతో సరియై , 

నా జీవిత - 

మొక పరియై యుండెను-  

పోయె నట్టి ప్రాప్తము 

పడతీ!  


ఉండిన తావిని 

దిక్కుల నిండా 

వెదజల్లి వేసి

నే  నుంటిని; 

ఏ పండితు డెరుగును 

పోయినదండి వలపు 

మరల చేర్చి, దాచు 

మంత్రమున్ . 

సారస నయనా 

నీ హృన్నీ రేజాతమ్ము 

నొకరి నెయ్యమునుకే

ధారాదత్తము సేయగ నేర! 

ననేకులకు 

దాని నియ్యగ వలయున్ . 

- బెంగాలీ - రవీంద్రుడు 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

07 - 10 - 2021 

బోథెల్ ; యూ. ఎస్. ఎ

Friday, July 23, 2021

Portrait of Edna St. Vincent Millay (1933-01-14)

 


ఎందుకలా అని అడగద్దెవరూ!

-కర్లపాలెం హనుమంతారావు


 

పిల్లల్లారా వినండర్రా!

మీ నాయన పోయాడివాళ.

ఆయన పాత కోట్ల నుంచి

మీకు  అంగీలు, లంగాలు కుట్టించేదా?

నాయన పాత పేంట్లు చించి

మీ సైజుకు సరిపోయే  జేబులు కుట్టిస్తానర్రా!

తాళాలూ చిల్లర డబ్బులు

పొగాకు చుట్టల అడుగున

ఆ జేబుల్లోనే కదా పడివుండేదెప్పుడూ!


డుంబూకేమో తన తండ్రి ఆస్తి పైసలు

బ్యాంకుల్లో వేసుకు దాచుకునేందుకు

బుజ్జి తల్లికి  నాన్న గుర్తుగా తాళాల గుత్తులు

కాళ్ల గజ్జెలకు మల్లే ఆడించుకు తిరగచ్చు భలేగా!

..

అంతేనరా! ఎన్ని చావులొచ్చినా

బతికుండక తప్పదు మనకు

పోయినోళ్లు ఎంతటి మంచోళ్లయినా

ఎల్లకాలం గుర్తుండరు కదా ఎక్కడయినా!


బుజ్జీ, లే!

 బడికెళ్లే టైమయింది

బువ్వ తినమ్మా

డుంబూ,  నీ కాలికి గాయమయిందిగా

పోయి ముందు నువు మందేసుకో!


జీవితంతో  అదేరా గొడవ భడవాయిల్లారా!

మనసెంత నొచ్చినా తప్పించుకు తిరక్క చావదు 

ఎందుకలా అని అడగద్దెవరూ పిల్లలూ!

ఎందుకనో..   నాకూ పెద్దలెవరూ చెప్పలేదు 

ఇంతవరకు

- కర్లపాలెం హనుమంతరావు

24 -07 -2021

(ఎద్నా సైంట్ విన్సెంట్ మిలే కవిత – లేమెంట్ కు నా తెలుగు సేత) 


Lament

- Edna St. Vincent Millay 

Listen, children:

Your father is dead.

From his old coats

I’ll make you little jackets;

I’ll make you little trousers

From his old pants.

There’ll be in his pockets

Things he used to put there,

Keys and pennies

Covered with tobacco;

Dan shall have the pennies

To save in his bank;

Anne shall have the keys

To make a pretty noise with.

Life must go on,

And the dead be forgotten;

Life must go on,

Though good men die;

Anne, eat your breakfast;

Dan, take your medicine;

Life must go on;

I forget just why.

-Edna St. Vincent Millay

నా పరామర్శః

ఇంటికి పెద్ద దిక్కు అనూహ్యంగా మరణించినప్పుడు అప్పటి వరకు ఎంతో బేలగా కనిపించిన ఆ ఇంటి ఇల్లాలు  ధీరవనితగా మారిపోతుంది. ముందు ముందు ఎదిగి జీవితంలో  సొంత కాళ్లపై నిలబడవలసిన తన పసికూనల కోసం ఆ ఉగ్గబట్టుకోడం! పుట్టెడంత దుఃఖం కడుపులో తెరలుతున్నా.. అణుచుకుంటుందా ఇల్లాలు! అసలేమీ జరగనట్లే రోజూలానే పిల్లలను ఆమె పరామర్శించే తీరు ఈ కవితలోని ప్రతీ పాదానికీ ఉదాత్తత చెకూరుస్తుంది. పిల్లల పట్ల అంత అప్రమత్తతతో ఉన్నప్పటికీ  పిల్లల తండ్రిని గురించే అడుగడుగునా ప్రస్తావించడం ఈ కవిత విశిష్టత. స్త్రీకి తరలెళ్ళిపోయిన తన జీవితభాగస్వామి పైనుండే తరగనంత అనురాగాన్ని  బిడ్డల వైపుకు మళ్లించే కుటుంబ సంబంధాన్ని ఎంతో బలంగా చాటుతున్నది  కనకనే ఈ కవితకు ఇంత  గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా. 

కుటుంబంలో జరిగే పెను విషాదాలు పసికూనలపై పడకూడదని, పోయినవాళ్లను గురించి ఎంత దుఃఖం పొర్లుతున్నప్పటికీ పెద్దలు తమ బాధ్యతగా పిల్లలతో ఎప్పటిలాగానే ప్రవర్తించాలన్న గొప్ప సందేశం ఈ పద్యంలని ప్రతి పాదంలోనూ కనిపించడం విశేషం. 

ఎంత మంచివాళ్లు పోయినా జీవితం ఆగకుండా ముందుకు  కొనసాగాల్సిందేనన్న తాత్విక చింతనతో ముగిసే  ఈ పద్యనికి కొసమెరుపులా మరో లోక రీతీ 

‘లైఫ్ ముస్ట్ గో ఆన్.. అని ఊరుకోకుండా.. ‘ఐ ఫరగెట్ జస్ట్ వై’ అని కర్త అనడం కవితను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళింది.  చావు పుట్టుకలతో నిమిత్తం లేకుండా జీవితం కొనసాగుతూనే ఉండాలన్న నిత్యసత్యం ఊరడింపు వాక్యంగా తనకు తాను చెప్పుకోడం కోసం. ‘ఎందుకు అట్లా’ అనే తాత్విక సంశయం సహజంగానె పసి మెదళ్లలో మొలకెత్తక మానక మానదు కదా! ఆ సందేహం తలెత్తి చిన్నారులు అయోమయం పాలవకుండా ‘ ఐ ఫర్ గెట్ జస్ట్ వై’ అని ఆదిలోనే  ఫుల్ స్టాప్ పెట్టేసింది గడుసుగా తల్లి. ప్రకృతిలో జరిగే అన్ని సంఘటనలకు కారణాలు వెతకబోతే మనిషి అవగాహనకు అందనివీ ఎన్నో ఉండనే ఉన్నాయి కదా!

-     కర్లపాలెం హనుమంతరావు

   23 -07 -2021

 

 

Sunday, December 15, 2019

తోకచుక్కలు, గ్రహాలు, నక్షత్రాలు -కీర్తి ప్రతిష్ఠలు -కర్లపాలెం హనుమంతరావు




తోకచుక్కలు తృటికాలం మెరిసి కనుమరుగవుతాయి. గ్రహాల వెలుగు దూరాలు, దగ్గరల మీద ఆధారపడుంటుంది. నక్షత్రాల కాంతి నిరంతరాయం. దవ్వులతో నిమిత్తం లేని చిరంజీవి నక్షత్రం. స్థూలంగా సాహిత్య వినీలాకాశంలో మెరుపులీనే కవులనూ ఈ తోకచుక్కలు, గ్రహాలు, నక్షత్రాలతో పోల్చుకోవచ్చు. అసమాన ప్రతిభగల వాళ్లను నక్షత్రాలతో పోల్చడం ఉచితం. సామాన్య జనాలకు వీళ్ల ప్రతిభా పాటవాలు బేరీజు వేసేటంత సామర్థ్యం ఉండదు. సమకాలీన రచయితలు వృత్తిఅసూయల కారణంగా వారి కీర్తి ప్రతిష్టలకు అడ్డు.  అన్నిటికీ మించి అత్యంత ప్రతిభావంతులను అనామకులుగానే మిగిల్చే అతి ముఖ్య కారణం.. పూవై పరిమళాలు వెదజల్లక ముందే ఆ మొగ్గలను తుంచేయడం.  సమకాలికుల రహస్య ఆయుధం ఇదే! సాటి రాచయితలు ఎవ్వరూ తమకన్నా ఎక్కువగా కీర్తి ప్రతిష్ఠలు పొందడం గిట్టని ఈర్ష్యాపరులు వీళ్లు. ఎవరూ స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించేందుకు ఇష్టపడరాదు. తాము అనుకున్న భావాజాలమే తమకు అనుకూలమైన వర్గ ప్రయోజనాలకు తాము ఆమోదించిన మోతాదులో ప్రతిభను ఉపయోగించే వాళ్లనే వీళ్లు ప్రతిబావంతులైన  రచయితలుగా అంగీకరించేది. వాళ్ల దురష్టం కొద్ది ఎన్ని అవాంతరాలు సృష్టించినా కొంతమంది ప్రతిభావంతులు తాము అదుపుచేయలేనంత నైపుణ్యంతో ఊహించనంత కీర్తి ప్రతిష్ఠలు సాధిస్తారు. జీనియస్ ల పట్ల సెకండ్ రేట్ సమకాలికుల అకృత్యాలు ఈనాటివి కాదు.
ఎదుటివారి ఆధిక్యాన్ని మరుగుపరచడం రెండు పద్ధతుల్లో సాధ్యం. అంతకన్నా ఎక్కువ ప్రతిభను ప్రదర్శించేందుకు కృషిచేయడం. కష్టంతో కూడిన ఈ పని కన్నా అసలు ఎదుటివాడి ప్రతిభనే గుర్తించకపోవడం సులభం. చేవ తక్కువ అసూయాపరులు అందుకే ఎక్కువగా రెండో పద్ధతిలో పోతుండేది. స్వీయ సంస్కరణ కన్నా రంధ్రాన్వేషణ సులభమైన పని కూడా. కోకిల, కాకి ఒకే పక్షి జాతి. పంచమ స్వరంతో  లోకాన్ని పరవశింపచేస్తుందని కోకిలకు కీర్తి. అది సహించలేని కాకులు గుంపుగా చేరి గోలగోలగా కూయడంలా ఉంటుంది అసూయపరుల అవాకులు, చవాకులు. స్పానిష్ తత్వవేత్త  జాల్త్ జార్ చెప్పుకొచ్చిన ప్రతిభ, అసూయల మధ్యనుండే అంతరం అన్నివేళలా అన్ని స్థలాలా  దర్శనిమిచ్చేదే! ప్రతిభలేమితో బాధపడే ఆత్మన్యూనత నుంచి మనసును ఉపశమింపచేసే బ్రహ్మాస్త్రం అసూయాద్వేషాలు. ద్వేషం దాచి అసూయతో చేసే వెటకారాలు ప్రతిభావంతుల కీర్తిని మరింత పెంచుతాయి.  'ప్రతిభ లేని సందర్భంలో వినయం భూషణంగా భాసిస్తుంది' అంటాడు లిక్టెన్ బర్గ్.  అట్లా అని అతివినయం చేటు తెస్తుంది.  గోతె  'దొంగవెధవలే అతివినయం నటిస్తారు' అంటూ కుండబద్దలు కొట్టేసాడు మరి. సెర్ర్వాంటస్ కూడా తన 'జర్నీ అప్ పర్నాసస్' లో కవులను అతివినయం ధూర్తుల జాబితాలో కలిపేస్తుంది' అని చేసిన  హెచ్చరిక మర్చిపోరానిది. 'నా రాతలు కాలానికి ఎదురీతలు' అని షేక్స్పియర్ లా అతిశయాలు పోవాలంటే షేక్స్పియర్ అంతటి ప్రతిభ ఉందో లేదో బేరీజు వేసుకోవాలి ముందు. చెత్తను మాత్రమే  ఆకాశానికి ఎత్తేసే కువిమర్శకులు అసూయతో చేసే వ్యాఖ్యలు ఒక రకంగా  ప్రతిభ గల రచయితలకు ప్లస్సే! అరచేయి అడ్డం పెట్టి సూర్యోదయాన్ని ఆపలేనట్లే కుళ్లుబోతుతనంతో చేసే వ్యాఖ్యానాలు సత్తా గల సద్గ్రంథాలను సహృదయలోకం నుంచి ఆట్టే కాలం దూరంపెట్టలేవు. పనిగట్టుకుని చెత్తను ప్రోత్సహించినా కాలం గడిచే కొద్దీ ఆ కళ వెలాబోవడం ఖాయం.   కాల పరీక్షకు కూడా తట్టుకునే ప్రతిభ తటాలున కళ్లెదుట తలెత్తుకు నిలబడినప్పుడు కుళ్లుమోతులకు మతిపోతుంది ముందు. మాటా పడిపోతుందేమో కూడా!  ఆ మౌన ముద్రా ప్రమాదకరమే. సెనాకా హెచ్చరించినట్లు 'కాటేసే వాటం కోసం కాలనాగులు ఆలోచించే సమయం కూడా కావచ్చును. సాహిత్యం పరిభాషలో ఈ మౌనం పేరే 'విస్మరించడం'. అసూయాపరులతో   ఎన్నేసి  ఇడుములు పడ్డాడో కానీ పాపం..  'విదేశాల నుంచి విడుదలయితే తప్ప  స్వదేశీయుల దృష్టి మంచి పుస్తకం మీద పడదు' అని వాపోతాడు మహా తత్వవేత్త గోతె.
మనం చేసే పనే మరొకడూ చేస్తున్నప్పుడు.. మనల్ని వదిలి ఆ మరొకడిని పొగడ్డం అంటే మనల్ని మనం కించపరుచుకున్నట్లు. ప్రతిభ పరంగా రెండు పనుల్లో ఉండే తేడాను గుర్తించనీయకుండా మన మనసును శాంతింపచేసేది అసూయ. సర్వకాల సర్వావస్థల్లో సర్వత్రా మానవుల్లో సహజంగా ఉండే నైజమే అయినా కళాజగత్తుని ఈ ఈర్ష్యాద్వేషాలు మరంత ఎక్కువ పాళ్లల్లో ప్రభావితం చేయడమే ఆశ్చర్యం.
ఎన్నో అడ్డంకులని అధిగమించి ఎవరికైనా చిరస్థాయి కీర్తి లభించింది అంటే ఆ ప్రతిభ ఎంతటి ఉన్నతమైనదో అర్థంచేసుకోవాలి.
పరస్పర డబ్బా బృందాల వ్యవహారాలను పక్కన పెట్టి మరంత లోతుగా తరచి చూద్దాం. గొప్ప పని స్వయంగా చేయడంలో ఉన్న తృప్తి ఎదుటివారి గొప్ప పనిని గుర్తించి మనస్ఫూర్తిగా శ్లాఘించడంలో కూడా లభిస్తుంది.  నిజాయితీగా ఒకరిని పొగడడం.. మనల్ని మనం కించపర్చుకోవడం కిందకు రాదు. గ్రీక్ కవి హోమర్ సమకాలీనుడు హీసియడ్ మాటల్లో చెప్పాలంటే 'కొందరికి ప్రతిభ స్వయంగా పసిగట్టే ప్రజ్ఞ ఉంటుంది, మరి కొందరికి విజ్ఞులు విడమరిచి చెబితే అర్థమవుతుంది. చాలామంది స్వయంగా తెలుసుకోనూలేరు. ఎవరు చెప్పినా వినిపించుకొనే సహనమూ ఉండదు.' అందుకే మాకియవెల్లి భావించినట్లు లోకంలో జీవించి ఉన్న కాలంలోనే కీర్తి ప్రతిష్ఠలు గడించే అవకాశం అరుదు. హీసియడ్ క్లాసిఫికేషన్ లోని రెండో తరగతికి చెందిన సమాజంలో జీవింఛడం కూడా ఒక అదృష్టమే! దొరికిన గుర్తింపు చిరస్థాయిగా నిలబడేదీ ఈ రెండో తరగతి జిజ్ఞాసుల కారణంగానే.
ఒకసారి గుర్తింపు పొందిన పనిని, వ్యక్తిని గురించి తిరిగి తిరిగి పొగిడేందుకు ఎవరూ సంకోచించరు.. సరి కదా, కాలం గడిచే కొద్దీ ప్ర్రశంసలకు పోటీ పడతారు. పదిమంది గుర్తింపు సాధించిన పనిని తామూ పొగడకపోతే తతిమ్మా బృందం కన్నా వెనుకపడతామేమోనన్న హిపోక్రసీ వీరి నోటి నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తుంది. జెనోఫోన్ సూక్తి ప్రకార్రం 'జ్ఞానం ఎక్కడ ఉందో గుర్తించడం కూడా జ్ఞానం కిందే లెక్క. స్వయంగా  ప్రతిభ ప్రదర్శించలేని లోపాన్ని ప్రతిభ ప్రదర్శించిన వారిని శ్లాఘించడం ద్వారా అయినా పూరించుకోవాలన్న సామాన్యులకు ఉండే యావ కీర్తి ప్రతిష్ఠల కొనసాగింపుకు ప్రధాన కారణం. అందరూ అందరు ప్రతిభావంతులను పొగడడం అసాధ్యం.  ఏ తరగతికి చెందిన రచయితలకు ఆ తరగతికి చెందిన వందిమాగదులు. ఆ పొగడ్తరాయుళ్ల మధ్య పోటీ కూడా కద్దు. ఎథీనియన్ రాజకీయ పండితుడు ఫోసియస్  అనర్గళంగా ప్ర్రసంగించగల సామర్థ్యం గల వక్త. ఒకానొక సభలో ఆయన ఉపన్యాసం ఉధృతంగా సాగే వేళ  నిశ్శబ్దంగా ఉన్న హాలులో ముందుగా ఒక మూల నుంచి కరతాళ ధ్వనులు మొదలయ్యాయి. కొంత విరామం తరువాత ఒకరికొకరుగా ఆ తమాషాను అందిపుచ్చుకొని  సభాప్రాంగణం దద్దరిల్లేలా చప్పట్లను మారుమోగిస్తుంటే.. అర నిమిషం తరువాత ఆ హంగామానంతా అణగనిచ్చి అణుకువగా 'మరీ అంత మూర్ఖంగా ఏమైనా మాట్లాడుంటే క్షమించండి' అంటూ చేతులు జోడించాడుట. అనుకరణతో కొనసాగే ప్రశంసల వల్ల అసలైన కీర్తి ప్రతిష్ఠలేమాత్రం అబ్బవు. చిరకాలం మనగలిగే కీర్తి క్రమంగా, నిదానంగా పరిపక్వత సాధిస్తుంది. సమకాలికుల సమర్థన ఒక్కటే చాలదు . తరువాతి తరాల  గుర్తింపును కూడా సాధించి నిలుపుకోవడానికి చాలా ప్రతిభా వ్యుత్పత్తులు ప్రదర్శించాలి. సమకాలికుల అసూయాద్వేషాలకు తట్టుకుని శతాబ్దాల పాటు ప్రాజ్ఞులుగా మన్ననపొందేది కోటికి ఒక్కరు. కొద్దిపాటి తెలివితేటలతోనే కీర్తి ప్రతిష్ఠలు మూటగట్టుకునేవాళ్లే ఎక్కువ. తమ జీవితకాలంలోనే మంచు తునకలా కరిగిపేయే పేరు ప్రఖ్యాతులు ఈ తాత్కాలిక వస్తు జాబితాలోకే వస్తాయి. యవ్వనంలో ఓ వెలుగు వెలిగి వయసు వాటారే దశలో పేరు మసకబారే ప్రముఖులు అశేషంగా కనిపిస్తారు. అందుకు విరుద్ధంగా జీవించివున్న కాలంలో ఆట్టే గుర్తింపు లేకపోయినా తరువాతి తరాల దృష్టిలో మేధావులుగా కీర్తింపబడేవాళ్లు కొందరుంటారు. వాళ్లు అచ్చమైన ప్రతిభావంతులు. రోమన్ కేథలిక్ సంప్రదాయంలో మరణానంతరమే సెయింట్స్ గా మన్నింపు దక్కడం ఇందుకు ఉదాహరణ. గొప్పపని వెంటనే సామాన్యుడి మెప్పుదల పొందదు. పజ్జెనిమిదో శతాబ్ది జర్మన్ పాత్రికేయ రచయిత సీగ్ ఫ్రీడ్ తన హెరొడెస్ ' లో ఆ మాటే చెబుతాడు. చరిత్రలోకి వెళ్లి చూస్తే హెరొడెస్ మాటల్లోని వాస్తవం తెలిసివస్తుంది. ఈనాడు గొప్ప కళాఖండాలుగా హారతులు అందుకునే ఏ చిత్రమే చిత్రకారుని జీవితకాలంలో ఆ స్థాయిలో గుర్తింపు సాధించిన దాఖలాలు కనిపించవు. అనేక తరాల పాటు అనేకమంది కళావివర్శకులు వాటి విలువను వివరించినప్పుడు గాని సామాన్యుడికి వాటి గొప్పతనం బుద్ధికెక్కదు. ఇక రచనల విషయానికి వస్తే చిరకాల కీర్తి ప్రతిష్ఠలకు రెండు అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి. పండిత పామర జన రంజకంగా ఉండటం.. వస్తువు ఏ తరగతి పాఠకులకు చెందివుందనే కోణం. వీధినాటక ప్రదర్శనకారులు, సర్కస్ కళాకారులు, నాట్యకత్తెలు, గారడీ ప్రదర్శకులు, నటీనటులు, గాయకులు, సంగీత విద్వాంసులు, రచయితలు, భవన నిర్మాతలు, చిత్రకారులు, శిల్పులు, చివరగా తత్వవేత్తలు. తమాషా ప్రదర్శకులకు మాదిరి తత్వవేత్తలకు తటాలున గుర్తింపు రాదు. విషయం వినోదానికి దూరంగా ఉంటుంది కాబట్టి ఆకర్షణా తక్కువే. తత్వవేత్తల ప్రబోధ సారం తమాషా ప్రదర్శనలో మాదిరి తటాలుమని తలకెక్కదు. లోతైన అంశాల స్వారస్యాన్ని ఆలస్యంగా అయినా  ఆస్వాదించే స్వల్ప వర్గాలు పరిమితంగా ఉంటాయి కనుక తత్వవేత్తలకు ఒక పట్టాన తమ జీవితకాలంలోనే కీర్తి ప్రతిష్ఠలు దక్కే అవకాశం తక్కువ. సర్వజనామోదం పొందిన వ్యక్తి కీర్తి ఎక్కువకాలం మనలేదు, నెమ్మది నెమ్మదిగా తక్కువ మందితో మొదలయ్యే గుర్తింపు తరతరాలపాటు నిలబడుతుంది.
దాదాపు తత్వవేత్తల సరసనే చేరే వర్గం కవులు, రచయితలు. చిత్రకారులు,  సంగీతప్రాజ్ఞులు, శిల్పనిపుఉణులు. సాకారాత్మకం చెందిన కళకి చావు ఉండదు. అచ్చయిన పుస్తకంలో సరుకుంటే కాలం గడిచిపోయినా ఏదో ఓ శుభదినాన దాని వెలుగులు బైటపడడం ఖాయం. వేలాది రాగి రేకుల మీద నిక్షిప్తమయ్యాయి కనకనే అన్నమయ్య సంకీర్తనలు కాలాంతరంలో ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సాధించాయి. కర్త కన్నా కావ్యం ఎక్కువ కీర్తి ప్రతిష్ఠలు సాధించడం మన్నం చూస్తున్నాం. థేల్స్, ఎంపిడాకల్స్, హెరాక్లిటస్, డెమోక్రిటస్, పార్మెనెడ్స్, ఎపిక్యూరస్  వంటి గ్రీకు తత్వవేత్తలు నక్షత్రాల మాదిరి మేథో జగత్తు మీద వెలుగులు విరజిమ్మడానికి కారణం.. తోకచుక్కలు, గ్రహాల మాదిరి కాకుండా తారల స్థాయిలో  నిదానంగానే అయినా కీర్తి ప్రతిష్ఠలు సాధించడం,
తత్వశాస్త్రం సామాన్యుడి జీవితానికి అనునిత్యం ఉపయోగించే బౌతికాంశం కాదు. దానికి కీర్తి ప్రతిష్ఠలు  తక్షణమే దక్కకున్నా సమాజానికి జరిగే నష్టం తక్కువ. సామాన్యుడి చైతన్య స్థాయిని తట్టి లేపి సుఖమయమైన జీవిత సూత్రాలకు మార్గం చూపించే సత్సాహిత్యం సమకాలీనుల ఈర్ష్యాద్వేషాల కారణంగా మరుగునే ఉండిపోవడం మాత్రం జనావళికి నష్టం కలిగించే అంశమే! వినోదమూ జీవితానికి అవసరమైన దినుసే. ఆ వంటకం తయారుచేసే వంటవాడికీ గుర్తింపు తప్పనిసరి ప్రేరణే. వంటకంలో ప్రత్యేకత ఉంటే  వంటింటి దాకా వెళ్ళి అభినంధించే సంప్రదాయం ఇంగ్లీషువారి సంస్కృతిలో ఉంది. మంచి పుస్తకం మంచి వంటలాంటిదే. కానీ పుస్తకం శ్రేష్టత పనిగట్టుకుని పరిచయం చేస్తే మినహా ప్రాచుర్యంలోకి రాదు. కృత్రిమంగా అయినా సరే కీర్తి ప్రతిష్ఠలు గడించాలని పాకులాడే పేరాశగాళ్ల సంఖ్యే సమాజంలో ఎక్కువ. మిత్రుల చేత పొగిడించుకోడం, భజన బృందాలతో కీర్తించుకోడం, దొంగ విమర్శలు రాయించుకోడం, అసందర్భ సన్మాలకు అంగలార్చడం వంటి ఎన్ని స్వీయ ప్రాయోజిత కార్యకలాపాలకి పాల్పడినా పుస్తకంలో గుజ్జంటూ లేని పక్షంలో గాలి నింపిన బంతి మాదిరి ఆకాశంలో నిలబడుతుంది. గాలి పోయి నేల కూలిన బంతుల్లాంటి నిష్ప్రయోజనమైన సాహిత్యంతో సమాజానికి ఒనగూడే ప్రయోజనం సున్నా. ప్రతిభ అనే ఇటుకలతో నిర్మితమయే  ప్రజాసాహిత్యం శుక్ల పక్షం చంద్రుని మాదిరి దినదినప్రవర్థమానమయి తీరుతుంది. కాలం గడిచే కొద్దీ గురుత్వాకర్షణ శక్తిని కూడా ధిక్కరించి సాహిత్యాకాశంలో వెలుగులు విరజిమ్ముతుంది. సత్సాహిత్యం కాలాతీతమైన కీర్తి ప్రతిష్ఠలు గడించడం సమాజానికే శ్రేయస్కరం.
(మూలంః ఆర్థర్ షోపెన్ హావర్ ప్రసంగం - కీర్తి ప్రతిష్ఠలు- మిసిమి- జమవరి- 2016)
`


Monday, January 29, 2018

బాపూజీ.. నీ చల్లని నవ్వే మా కివ్వు! - ఆంధ్రప్రభ వ్యాసం



మహాత్మా గాంధీ నిర్యాణంపై ఒక వ్యాసాన్ని రాయమని నన్నడిగినప్పుడు నాకుగా నేను వేసుకున్న ప్రశ్న ఇది. రాయడానికి కూర్చున్న ప్పుడు దానికి న్యాయం చేయగలనా అనిపించింది. నేనొక రేడియో వ్యాఖ్యాతని. గుండెలు పగిలిపోయిన ఆఖరు క్షణాల్నీ, బాపూజీ అంతిమ యాత్రనీ ఏమని వర్ణించాలి? ఏ విధంగా నా కలం కదులుతుంది? నాకు మాత్రం ఆ రాత్రి సుదీర్ఘంగా అనిపించింది. కాళరాత్రిని తలపించింది. బాధ, విషాదం పొంగిపొర్లుకొచ్చాయి. మాటలలో వర్ణించలేని భావన మెదులాడింది. కాలం అన్నింటికీ మందు. క్రమేపీ బాధ తగ్గుముఖం పడుతుంది. కొన్ని దృశ్యాలు నా మెదడులో నిక్షిప్తమైపోయాయి. ఆ దృశ్యాల గురించే నేనిప్పుడు రాయబోయేది.





ఆరోజు ఉదయం 6గంటలు. మహాత్ముని పార్థివ దేహాన్ని ఉంచిన బిర్లా హౌస్‌కు వెళ్ళాను. బాపూజీ అంతిమ సంస్కారం నిర్వహించే రోజది. నేను వెళ్ళేసరికే పెద్ద సంఖ్యలో ప్రజలు బరువెక్కిన గుండెలతో వరుసలో నిలబడి ఉన్నారు. గత స్మృతులను నెమరువేసుకుంటూ కనిపిం చారు. నన్ను
ఒక ప్రత్యేక ద్వారం ద్వారా గాంధీ మృతదేహమున్న చోటకు తీసుకెళ్ళారు. విశాలమైన ఆయన ఛాతిని నిర్దయగా గాయపరిచిన తూటాల గుర్తులు కనిపించాయి. అవి ద్వేషానికీ, పిచ్చి పనికీ పరాకాష్టగా కనిపించాయి. బాపూజీ ముఖంలోకి చూశా. ఎంత అద్భుతమైన ముఖమది. మృత్యు పరిష్వంగంలో చేరిపోయింది. ఆయన అభిమానుల వదనాలు దీనంగా మారిపోయాయి. ఎగురుతున్న గులాబీ రేకుల మధ్యలో నుంచి కనిపిస్తున్న మహాత్ముని వదనం నా నోటి నుంచి ధారాళంగా పదాల వెల్లువను సృష్టించింది. బాల్యంలో నేను చదువుకున్న ఏసు క్రీస్తు బోధనలలో ఒక వాక్యం గుర్తుకొచ్చింది. ఓ తండ్రీ వారిని మన్నించు. వారేం చేస్తున్నారో వారికే తెలియదు శాశ్వత నిద్రలో ఉన్న మహాత్ముని పెదవులు కూడా అలాగే అన్నట్లు నాకనిపించింది. బాపూజీ మన్నించడానికి పెట్టింది పేరు. ఇంతవరకూ నేనలాంటి మనీషిని చూడలేదు. అదే సమయంలో నా భుజంపై ఓ చేయి పడింది. వెనక్కి చూస్తే ప్రధాన మంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ. ఆయన కళ్ళలోనూ అదే రకమైన అనుభూతి కనిపించింది. అది కూడా నేను మరిచిపోలేను.

గులాబి రేకులతో అంతిమ వీడ్కోలు
మహాత్ముని అంత్యక్రియల ఊరేగింపులో రేడియో వాహనం మెల్లిగా నడుస్తోంది. క్వీన్స్‌వే, కింగ్స్‌వే, హర్డింగే అవెన్యూ, బీటా రోడ్‌..మీదుగా రాజ్‌ఘాట్‌కు వాహనం చేరాలి. మా వెనుకే మహాత్ముని పార్థివదేహాన్ని ఉంచిన ట్రాలీ కదులుతోంది. ప్రజలంతా చూసేలా దేహాన్ని ఉంచారు. పండిట్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, దేవదాస్‌ గాంధీ, సర్దార్‌ బల్‌దేవ్‌ సింగ్‌, ఆచార్య కృపలానీ, డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ నిలబడి ఉన్నారు. లక్షలాదిమంది గాంధీ మహాత్మునికి ఇష్టమైన శ్లోకాలను చదువుతున్నారు. ఆ సమయంలో చెమర్చని కన్ను నాకు కనిపించలేదు. మరణానికి రెండు నెలల ముందు బహిరంగ సభలో ప్రసంగించిన జిల్లా జైలు వద్దకు యాత్ర చేరింది. జైలు శిక్ష అనుభవిస్తున్న వారినుద్దేశించి బాపూజీ అప్పుడు ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని నేనూ విన్నాను. ప్రేమాభిమానాలను వర్ణిస్తూ ఆయన ప్రసంగం సాగింది. సరిగ్గా అదే రోడ్డు మీదుగా యాత్ర సాగడం యాదృచ్ఛికం. గాంధీ భౌతిక కాయంపై స్వర్గం నుంచి పూల రేకులను వర్షించినట్లుగా ఉంది. యాత్రలో పాల్గొన్న ప్రజలు గుప్పెట్లో గులాబీలను తీసుకుని ఆకాశంలోకి విసురుతున్నారు. గాంధీజీ అమర్‌ రహే అంటూ నినదిం చారు. రోడ్డుకిరు వైపులా ఉన్న భవనా లపై నుంచి పూలను జల్లుతూ గాంధీకి జై అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. యాత్ర అక్కడ కొద్ది నిముషాలపాటు నిలిచింది. గాంధీజీని కడసారి చూసుకునేందుకు ప్రజలు ముందుకు తోసుకొచ్చారు. మా రేడియో వ్యాన్‌ను కూడా లాగేశారు. దుఖం తాండవిస్తున్న వదనాలు గాంధీజి మరణాన్ని జీర్ణించుకోలే మంటున్నాయి. ఓ మహిళ.. ఇది నిజం కాదు.. రేపు ప్రార్థనల సమయానికి బాపూజీ తిరిగొస్తారంటకూ భోరుమంది. ఎక్కడో తప్పు జరిగిందని అంటోంది. ఆమెలో ఆమె మాట్లాడుకుంటోందని నాకర్థమైంది. తనను తాను ఆమె అలా సంబాళించుకుంటోంది. ఆమె పక్కనే ఓ భిక్షువున్నాడు. అతడి కళ్ళు ఏడ్చిఏడ్చి ఉబ్బిపోయాయి. ఆ పక్కనే చక్కని దుస్తులు ధరించి ఉన్న మహిళ పరిస్థితి సైతం అదే. ధనిక, పేద లేకుండా దేశం యావత్తూ కుమిలిపోయిన క్షణాలవి. ఒక మరణం పేద, ధనికులను ఒకచోట చేర్చింది.. ఎంత ఆశ్చర్యం. గాంధీజీ భారత దేశమంతటా నిండిపోయారు. ఆయన సాధారణ తత్వం ప్రపంచంలోని అన్ని హృదయాలనూ గెలుచు కుంది. మా వ్యాను ముందుకు కదులుతుంటే ఓ చిన్నారి తన తల్లిని అడిగిన ప్రశ్న నా చెవిన పడింది. అమ్మా! గాంధీజి నిజంగా, శాశ్వతంగా వెళ్ళిపోయారా! అని. అసలు తిరిగి రారా అని కూడా ప్రశ్నించింది. తల్లి చెప్పిన సమాధానం గుర్రపు డెక్కల చప్పుడులో కలిసిపోయింది. బాపూజీ అంత్యక్రియలకు హాజరైన గుర్రాలు సైతం విచారంగా నడుస్తున్నట్లే అనిపించింది.
నిమజ్జన యాత్రలోనూ కన్నీటి ధారలు

యాత్ర రాజ్‌ ఘాట్‌కు చేరడానికి 5 నిముషాల ముందే నేను అక్కడికి చేరుకున్నాను. మా రెండో వాహనం
అంత్యక్రియల వేదికకు 30 అడుగుల దూరంలో నిలిచి ఉంది. అక్కడికి చేరిన ప్రజలంతా నాకు కనిపించేందుకు నేను వాహనంపైకి ఎక్కి నిలబడ్డాను. ప్రజలకు ఎటువంటి ప్రమాదమూ జరగకుండా చూసేందుకు చేసిన ఏర్పాట్లు నా దృష్టిని ఆకర్షించాయి. రక్షణ సిబ్బంది సాసర్‌ ఆకారంలో భుజంభుజం కలిసి రక్షణగా నిలుచున్న తరుణంలో చందనపు చెక్కలతో రూపొందించిన చితినుంచి తొలి జ్వాల నింగికెగిసిన తరుణంలోనే సూర్యభగవానుడు అస్తమించడం ఆరంభమైంది. అదే సమయంలో ప్రజల నుంచి పెద్ద నిట్టూర్పు కూడా ఆకాశానికెగిసింది. రాజ్‌ఘాట్‌పై ఒక తుపాను విరుచుకుపడిన తీరును తలపించింది. అడ్డుగా కట్టిన బ్యారికేడ్లను, తాళ్ళనూ, తీగలను తెంచుకుంటూ ఆడా, మగ తేడా లేకుండా చితిమంటలను చూసేందుకు బాధాతప్త హృదయాలతో ముందుకు తోసుకొచ్చారు. చందనపు చితి చుట్టూ చేరారు. వారి శోకంతో పాటూ చితిమంటలు ఉవ్వెత్తున ఎగిరిపడ్డాయి. చందనపు పరిమళం ఆ ప్రాంతాన్ని ఆవరించింది. గవర్నర్లు, రాయబారులు, క్యాబినెట్‌ మంత్రులు.. యమునా నదీ జలాలతో పవిత్రమైన, హరితహారంలా ఉన్న ప్రాంతంలో ఈ దృశ్యాలకు సాక్ష్యాలుగా నిలిచారు. ఈ సన్నివేశాలను చూసిన నా పరిస్థితి సుడిగుండంలో చిక్కుకున్న ఆకులా మారిపోయింది. మహాత్ముని పార్థివ దేహాన్ని ఆబగా కబళిస్తున్న చితిమంటల ఎత్తు మరింత పెరుగుతుండగా.. ఒక పక్క నుంచి చీకటి చుట్టుముట్టేసింది. లక్షలాదిమంది ఇళ్ళకు తిరుగు ముఖం పట్టినప్పుడు వారి కాలి నుంచి లేచిన ధూళి ఆ ప్రాంతాన్ని ఆవరించింది. జాతి పిత లేకుండానే ఇక తమ ప్రయాణం కొనసాగించవలసి ఉంటుందని వారికి అప్పటికి అర్థమైంది. ఆయన ప్రేమ లేదనీ అవగతమైంది. చితిమంటల్లో వారు కడసారి బాపూజీ చిరునవ్వుల్ని చూసుకున్నారు. సోదరీ, సోదరుల్లారా అంటూ ఆయన చేసే సంబోధనలను ఆ చిటపటల్లో విన్నారు. తుచ్ఛమైన ఈ ప్రపంచాన్ని వీడిన బాపూజీకి గుడ్‌బై చెప్పారు. అసత్యం, హింసలతో కూడిన ప్రపంచంలో జన్మించిన గాంధీ సత్యం, అహింసలతో కూడిన తనదైన ప్రపంచాన్ని నిర్మించారు. రాజ్‌ఘాట్‌నుంచి హృదయభారంతో వెనుదిరుగుతున్న ప్రజల శిరస్సులపైనుంచి చితిమంటలను గమనించిన నాకు గొంతులో ఏదో అడ్డం పడినట్టనిపించింది. మింగడానికి కష్టమైంది. ఆ రోజంతా అలాగే ఉంది. అలా అడ్డం పడిందేమిటో? లక్షలాదిమంది బరువెక్కిన గుండెలతో తిరుగుముఖం పడుతుండగా, వెండిరంగులో నక్షత్రాలు మెరుస్తూ, ప్రేమ, సత్యం, అహింసలకు ప్రతిరూపమైన బాపూజీకి స్వాగతం పలుకుతున్నట్లుగా కనిపించింది.
వ్యాఖ్యానం పూర్తయిన తరవాత నేను కొద్దిగంటల పాటు వ్యాన్‌పైనే కూర్చుండిపోయాను. ప్రజలంతా వెళ్ళేవరకూ అలాగే ఉండిపోయాను. మూర్ఛిల్లిన ఓ మహిళను వ్యానుపైకి చేర్చారు. ఒక బాలుడు, బాలికను కూడా అక్కడికి చేర్చారు.
ఆ జనప్రవాహంలో ఒక చేయి వ్యాను పైభాగాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం కనిపించింది. చూస్తే.. అది ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ. వెంటనే చేయి అందించి, ఆయనను పైకి లాగాను. గవర్నర్‌ జనరల్‌ని చూశారా అని ఆయన నన్ను ప్రశ్నించారు. ఆయన అరగంట ముందే ఇక్కడినుంచి వెళ్ళిపోయారని బదులిచ్చాను. సర్దార్‌ పటేల్‌??? ఆయన కూడా కొద్ది నిముషాల ముందు అక్కడి నుంచి నిష్క్రమించారు. ఆ ప్రజా సమూహంలో కలిసి వచ్చిన స్నేహితులై వేరైపోయారు. ప్రధానిని చూసిన ప్రజలు వ్యాను చుట్టూ చేరారు. ఆయనేమైనా మాట్లాడతారేమోనని చూశారు. ఆ సమయంలో నా మదిలో ఒక అద్భుతమైన ఆలోచన కలిగింది. ఒక అత్యద్భుతమైన వ్యక్తి దగ్గరగా ఉన్నానన్నదే ఆ యోచన. ఒక పక్కన జాతిపిత దేహం అగ్నికి ఆహుతవుతుంటే.. భారత మాత పుత్రుడు జవహర్‌లాల్‌ నెహ్రూ, స్వాతంత్య్రమనే దీపశిఖను సజీవంగా ఉంచడానికి జాతికి తనను తాను అంకితం చేసుకున్నారు. మరుసటి రోజు 2 గంటలకు నేను ఇల్లు చేరాను. తిరిగి రాజ్‌ఘాట్‌కు వెళ్ళేసరికి అక్కడ చితినుంచి పొగలొస్తున్నాయి. ప్రజలు అదృశ్యమయ్యారు. దుమ్మూ, ధూళీ సర్దుకున్నాయి. ఒక గార్డును అక్కడుంచారు. ఒక్కసారి రాజ్‌ఘాట్‌వైపు చూశాను. మొత్తం దృశ్యాలను గుర్తుకు తెచ్చుకున్నాను. ఆ చీకటిలో తెల్లటి ఖాదీ వస్త్రాన్ని ధరించిన మచ్చలేని మహనీయుడు నా మస్తిష్కంలో ఆవిష్కృతమయ్యాడు. దృఢనిశ్చయంతో కూడిన దృక్కులతో ఆయన కనిపించారు. ప్రజల శిరసుల పైనుంచి ఆయన చూస్తున్నారు.
ఫిబ్రవరి 11వ తేదీసమయం తెల్లవారు జామున నాలుగున్నర గంటలు..నేను గ్రీన్‌ అస్తి స్పెషల్‌ కంపార్ట్‌ మెంట్‌ ఎదురుగా నిలుచున్నాను.ఆ బోగీలో గాంధీజీ అస్తికలు ఉంచారు. అందులో అన్నీ మూడవ తరగతి బోగీలే. గాంధీజీ ఎప్పుడూ మూడవ తరగతిలోనే ప్రయాణం చేసేవారు. మూడవ బోగీ లో ఏం మంట అది ఎర్రగా వెలిగిపోతోంది. బోగీలో దీర్ఘచతురాస్రాకారంలో ఒక టేబిల్‌ ఉంది. దానిపై శవపేటిక లో అస్తికల కలశం ఉంది.ఆ పేటికపై చేతితో నేసిన త్రివర్ణ పతాకం పరిచారు.ఆకుపచ్చ ఆకులతో నేసిన ఒక చాప ఉంది. దానిపై తెల్లని పూలు,కాషాయి రంగు ఆకులుఉన్నాయి. పూర్తిగా త్రివర్ణ పతాకంతో కప్పివేసారు.మధ్య భాగంపై ఫ్లడ్‌ లైట్ల కాంతి విరజిమ్మేట్టు ఏర్పాటు చేశారు.
బయట ఫ్లాట్‌ ఫారంపై వేలాది మంది ప్రజలు గాంధీజీ అస్తికల కలశాన్ని దర్శించి నివాళులర్పించేందుకు వేచి ఉన్నారు.ఉదయం ఆరున్నర గంటలకు గార్డు ఈలవేశాడు. గ్రీన్‌ బోగీలు కొత్తఢిల్లిd స్టేషన్‌ బయటకు వచ్చాయి. ఆ రైలు కదలుతుండగా, ప్రజలు కట్టలు తెగే కన్నీరు ధారగా ప్రవహిస్తుండగా, విలపిస్తూ జాతిపితకు కడసారి వీడ్కోలు చెప్పారు. గాంధీజీ అస్తికల కలశంపై గులాబీ రేకులనూ,పూలదండలను మంత్రాలు చదువుతూ విసిరారు. శిరసావహించి భక్తిప్రపత్తులతో ప్రణామం చేశారు. తమ తలలు ఎంత గర్వంగా పైకి ఎత్తాలో నేర్పిన జాతిపితకు శిరసు వంచి ప్రమాణం చేశారు.
మా బోగీ మధ్య బోగీ పక్కన ఉంది.ఆ బోగీలోనే గాంధీజీ అస్తికల కలశం ఉంది. కిటికీల్లోంచి బయటకు చూస్తే, పొలాలన్నీ బంగారు తివాచీల్లా కనిపించాయి. నేలపై పరిచిన బంగారు దుప్పట్ల మాదిరిగా కనిపించింది. మామూలుగా అయితే, ఆ దృశ్యం హృదయాలను పులకింపజేసేదే. పొలాల్లో రైతులకూ,వ్యవసాయ కూలీలకు బోధిస్తూ ఒక వ్యక్తి పెద్ద అడుగులేస్తూ వెళ్తున్న భావన కలిగింది.గ్రామీణులంతా రైలు కట్టకుఇరువైపులా నిలబడి ఉబికివస్తున్న కన్నీరును తుడుచుకుంటూ గాంధీజీకి నివాళులర్పించారు. స్పెషల్‌ రైలు అంతిమ యాత్ర కొనసాగుతోంది. ఘజియాబాద్‌,ఖుర్జా,ఆలీగఢ్‌, హథ్రాస్‌,తుండ్లా, ఫిరోజాబాద్‌, ఎటావా, ఫాఫుండ్‌,కాన్పూర్‌, ఫతేపూర్‌, రసూల్‌ బాద్‌ స్టేషన్లలో ఇసుక వేస్తే రాలనంతగా జనం ఉన్నారు.తుండ్లాలో మా బోగీ వైద్యశాలగామారిపోయింది.అనేక మంది మహిళలు స్పృహతప్పి పడిపోయారు. విషాదం నిండి ఉంది. సంపూర్ణమైన ఆశ ఉంది.గీతా శ్లోకాల పఠనం నిరంతరం సాగుతూనే ఉంది.అది చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే, ఆయనకు మరణం లేదనిపించింది.ఎవరో ఇలా అంటున్నట్టు అనిపించింది.
ఎవరనగలరు ఒక వ్యక్తిని హత్య చేశారని
ఎవరు భావించగలరు నేను వధించబడ్డానని
జీవితాన్ని ఎవరూ అంతం చేయలేరు. జీవితం అంతంకాదు.
ఆత్మకు పుట్టుక లేదు. ఆత్మకు చావు లేదు.
ి్లటౌు ్హ్‌ిలిబిె ప్ఘ ్హఁి్లడ;
మీకు నారింజ ఇష్టమేనా? ఇలా ఎవరో అడిగేసరికి నాకు గుర్తొచ్చింది నేనేమీ తినలేదు కదా అని.నా బోగీ కిటికీకి దగ్గరగా వచ్చిన వ్యక్తివైపు చూశాను.మళ్ళీ బోగీలో చూశాను.అక్కడ అంత గాంధీజీని గౌరవించేవారు,భక్తితో ఆరాధించేవారూ ఉన్నారు.
విఎ సుదర్శన్‌ అనే మా మిత్రుడు ముప్పయిరెండేళ్ళ వయస్కుడు. గాంధీజీకి ప్రియ శిష్యుడు. మెెం ఇప్పుడే ఫతేపూర్‌ దాటామని నాకు గుర్తుకు వచ్చింది. పురుషులు, బాలురు రైలుతో పోటీ పడి ఒక కిలోమీటరు దూరం పరిగెత్తారు. గాంధీజీ అస్తికల కలశంపై ఉంచేందుకు తెచ్చిన పువ్వులు వారిచేతుల్లో కనిపించాయి.రైలు వేగాన్ని అందుకోవడంతో వారంతా వెనక్కి వెళ్ళిపోయారు. మహాత్మాగాంధీ వర్ధిల్లాలి అనే వారి నినాదాలు మాత్రం చెవుల్లో చాలా సేపు గింగురు మన్నాయి. మా మిత్రుడు ఎర్రని గులాబీని చూస్తూ ఆలోచనలోపడ్డాడు.ఆతడి కళ్ళంట నీళ్ళు బొటబొటా రాలాయి.ఇలాంటి గులాబీనే బుల్లెట్‌ గాయాలపై ఉంచాను. అని గొణుక్కున్నా డు.మా మధ్య సంభాషణ ఏమీ జరగలేదు. బయట ఆకాశం ఎర్రగా కనిపించింది. స్వర్ణకాంతులీనుతూ సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ గులాబీని చేతిలోకి తీసుకున్నాను.అది గతంలో ఎన్నడూ లేనంత అందంగా కనిపించింది. సువాసనలను వెదజల్లింది. అక్కడ ఒక సైనికుడు సైనిక దుస్తుల్లో ఉన్నాడు .రైలు ఆ స్టేషన్‌ దాటుతుంటే వంగి నమస్కరించాడు.
దారి పొడవునా లక్ష లాది మంది గాంధీజీకి కన్నీటి ధారలతో నివాళులర్పించారు. మహాత్మా గాంధీకీ జై అనే నినాదాలు మార్మోగాయి.లక్షలాది మంది ప్రార్థనలు చేశారు. అన్ని రంగాలకు చెందిన వారూ వచ్చారు.వారందరిలో గాంధీజీపై పరిపూర్ణమైన భక్తి ఉంది. వారి నోటంట మహాత్మాగాంధీ అమర్‌ రహే అనే నినాదాలు వినిపించాయి. త్రివేణి సంగమం వద్ద అంతిమ యాత్ర ముగిసింది. మహాత్మాగాంధీ పవిత్ర అవశేషాలను త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు.పవిత్రమైన,యోగి పుంగవుడి అస్తికలను అంతే పవిత్రమైన త్రివేణి సంగమంలో రామదాస్‌ గాంధీ నిమజ్జనం చేశారు. నేను ఒక పడవపై నిలబడి ఉన్నాను. అస్తికల నిమజ్జనం జరిగిన ప్రదేశానికి కొద్దిగజాల దూరంలో ఉన్నాను.వేలాది మంది ప్రజలు ఆ దృశ్యాన్ని అతి దగ్గర నుంచి చూసేందుకు ఎంతో ఆత్రుతను ప్రదర్శించారు. పీపాల కొద్దీ పాలు పోశారు. ఆ పాలతో ఆ నదీ జలాలు శ్వేత జలాలుగా కనిపించాయి.అది ఒక ప్రస్థానపు ముగింపు.ఆయన అనంతలోకాల్లోకి చేరిపోయాడు.ఆ దృశ్యాన్ని వీక్షించిన వారంతా నాలాగే అనుకుని ఉంటారు.మనంకూడా అలా గాలిలో కలపాల్సిందేనని. ఓ భగవంతుడా! ఆలయాల్లో అర్చనలు చేయలేదు. నాది గంభీరమైన జీవితం కాదు, అలా అని క్లిష్టమైనదీ కాదు.కాని నేను కృతజ్ఞతలు తెలిపానునదీ దేవత నిరంతరం ప్రవహిస్తూ, దప్పికగొన్నవారికి దాహంతీరుస్తోంది. ప్రయాగ అంతటా చీకటి అలుముకుంది. అప్పుడప్పుడే దీపాలు వెలిగిస్తున్నారు. మేం వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాం.త్రివేణి సంగమం వైపు ఒక్కసారి పరికించి చూశాను.ఇప్పుడు దీపాలు మరిన్ని కాంతివంతంగా వెలుగుతున్నాయి. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఆ నక్షత్రాల్లో బాపూజీ ఉన్నారు.ఆయన జ్ఞాపకాలు ఆ దీపాల మాదిరిగానే మెరుస్తున్నాయి. నిజమే దీపం ప్రకాశమానం అవుతుంది.దాని కాంతి నిశీధిలోకి చొచ్చుకునిపోతుంది.ఈ నాగరికత ఉన్నంతకాలం ప్ర కాశిస్తూనే ఉంటుంది.
అనువాదంః శ్రీ కె వి సుబ్రహ్మణ్యం
(ఆంధ్రప్రభ 30-01-2016 సంపాదకీయ వ్యాసం)

                      

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...