అమ్మమ్మ తల్లి- కథానిక
అనుసృజన: : కర్లపాలెం హనుమంతరావు
మా చిన్నతనంలో మా నాన్నగారి ఉద్యోగరీత్యా కొంతకాలం మేమొక కొండప్రాంతంలో ఉండాల్సివచ్చింది. ఆ ప్రాంతం పేరు పిచ్చికుంటపల్లి. పిచ్చికుంటపల్లికి దగ్గర్లోనే ఒక చిట్టడవి; ఆ చిట్టడవిలో గిరిజనుల ఆవాసాలుండేవి. అడవిలో దొరికే చింతపండు, పుట్టతేనె వంటివి.. ఏ సీజనులో దొరికే సరుకును ఆ సీజనులో వారానికో సారి జరిగే సంతలకు తెచ్చిఅమ్ముకునేవాళ్ళు. వారానికి సరిపడా కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కుని పోతుండే వాళ్లు.
పల్లెల్లో తరచూ అంటువ్యాధులు ప్రబలి ప్రాణహాని జరుగుతుందని జిల్లా కలెక్టరుగారికి ఫిర్యాదులు వెళ్లాయి ఒకసారి. వాళ్ళకు టీకాలు వేయించే భాధ్యత మా నాన్నగారి నెత్తిమీద పడింది. ఆయన హెల్త్ డిపార్ట్ మెంట్ లో జిల్లా బాధ్యులు అప్పట్లో.
'ఓస్సోస్! టీకాలే కదా! అదే మంత గొప్ప ఘనకార్యమా? మనిషి జబ్బ మీద మందులో ముంచిన రొటేటరీ లాన్సెట్ అటూ.. ఇటూ ఓ సారి గిర గిరా తిప్పేస్తే' అని కొట్టిపారేయకండి! పాణిగ్రహణం ఎంత కష్టమో..టీకాలు వేయడానికి ఒప్పించుకుని గిరిజనుల పాణి గ్రహణం చేయడం అంతకన్నా కష్టం. అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలిసే అవస్థ అది.
నౌఖరీ అన్నాక అన్ని రకాల శ్రమదమాదులకూ తట్టుకోక తప్పదు కదా! హెల్త్ డిపార్తుమెంటులో పనిచేసే మానాన్నగారూ అందుకు మినహాయింపు కాదు.
రెండురోజులు అడవిలో వుండేందుకు వీలుగా ఓ క్యాంపు కాట్, ఇక్ మిక్ కుక్కరు, హోల్డాలు, థెర్మోఫ్లాస్కు, మర చెంబు.. వీటినన్నింటినీ మోసుకు తిరిగేందుకు ఒక మనిషిని ఎర్పాటు చేసుకుని మరీ బయలు దేరారు. ఆ తోడువచ్చే మనిషీ అడవిజాతివాడే. పేరు 'రఘువా'.
రఘువా మాకా ఊరు వచ్చినప్పటినుంచి పరిచయం. చాలా విశ్వాసపాత్రుడు. అతగాడి గూడెంకూడా ఆ అడవిలోనే ఎక్కడో ఉంది. ముందు ఆ గూడెంనుంచే పని ప్రారంభించాలని మా నాన్నగారి వ్యూహం. వాళ్లను చూసి ధైర్యంతో మిగతా గూడేలవాళ్ళు ముందుకొస్తారని ఆయన ఆలోచన.
అడవిలోపలి దాకా వెళ్ళి ఒక చదునైన స్థలంలో టెంట్ వేసుకొని.. క్యాంపుకాట్, కుక్కరూ, గట్రాలు సర్దుకుని 'ఆపరేషన్ టీకా' ఆరంభించబొయే వేళకి బారెడు పొద్దెక్కింది. వెంట తెచ్చుకున్న కిట్లో మందు చాలినంతగా లేదని అప్పుడు చూసుకున్నారుట మా నాన్నగారు. ఎలాగూ ఇంకో 'బ్యాచ్' మందు పోస్టు ద్వారా వచ్చి సమీపంలోని పోస్టాఫిసులో వుందని తెలుసు.. కనక బెంగ పడలేదు. క్యాంపుకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందా పోస్తాఫిసు. దాన్ని తీసుకుని రమ్మని రఘువా చేతికి చీటీ రాసిచ్చి పంపించి మంచం మీద కాస్త నడుం వాల్చారుట మా నాన్నగారు.
అలవాటు లేని నడక పొద్దుటునుంచీ. అనుకోకుండా కళ్ళు అలాగే మూతలు పడిపోయాయిట.
మెలుకువ వచ్చేటప్పటికి చుట్టూ చీకట్లు కమ్ముకుంటున్నాయి.
అసలే అడవి ప్రాంతం. కొత్త చోటు. ఎటు వైపునుంచి ఏ జంతువొచ్చి మీద పడుతుందో.. అప్పుడేం చేయాలో తెలీదు. ఉదయం బయలు దేరేటప్పుడు ఇంట్లొ తీసుకున్న అల్పాహారమే! మధ్యాహ్నం క్యాంపులో రఘువా చేత వండించుకుని తిందామని ప్లాన్. ఇప్పుడు ఆ రఘువానే ఆజా ఐపూ లేకుండా పోయాడు. ముష్టి ఐదు కిలో మీటర్ల దూరం పోయి రావడానికి ఇన్ని గంటలా! అందులోనూ నిప్పుకోడిలాగా దూకుతూ నడుస్తాడు రఘువా.
ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏం చేయాలో అంతకన్న పాలు పోలేదు మా నాన్నగారికి. కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి. ముందు ఆత్మారాముడి ఘోష చల్లార్చాలి. ఆనక ఈ రాత్రికి రక్షణ సంగతి చూసుకోవాలి.
దగ్గర్లో ఉన్న గూడానికి పోయి వచ్చీ రాని భాషలో ఏదో తంటాలు పడి తన వెంట ఇద్దరు కోయ యువకులను తెచ్చుకున్నారుట మా నాన్నగారు. తెల్లార్లూ వాళ్ళు టెంటు బైట కాపలా వుంటే.. లోపల పేరు తెలియని జంతువుల అరుపులు వింటూ మా నాన్నగారి జాగారం.
తెల్లవారంగానే ఆయన ముందు చేసిన పని ఒక యువకుణ్ణి టెంటుకి కాపలా పెట్టి.. ఇంకో యువకుడిని తోడు తీసుకుని వెళ్ళి పోస్టుమాస్టరుగారిని కలవడం.
"మందు ప్యాకెట్టు నిన్నే మీరు పంపించిన మనిషి తీసుకెళ్ళాడు సార్!" అనేసాడుట పోస్తుమాస్టరుగారు తాపీగా.
'మా నాన్నగారి గుండెల్లో రాయి పడింది. నిన్ననగా మందు తీసుకున్నవాడు ఇవాళ్టికి కూడా టెంటుకు చేరలేదంటే అర్థమేంటీ? కొంపదీసి మధ్యదారిలో ఏదన్నా జరగరానిది జరగలేదుగదా!' ముచ్చెమటలు పట్టడం మొదలుపెట్టాయిట మా నాన్నగారికి.
ఆయన భయానికి మరో ముఖ్యకారణం కూడా ఉంది. రూల్సు ప్రకారం రఘువా ఆ మందు డెలివరీ తీసుకోరాదు. ఆ అమాయకుడేమన్నా ఈ మందును ఇంకేదన్నా అనుకుని దుర్వినియోగం చేసుంటే.. మొదటికే మోసం. మందు సంగతి అలా ఉంచి ముందు మనిషి ప్రాణానికే ముప్పం.
ఏం చేయాలో పాలు పోక అక్కడి పోస్టాఫీసు బెంచీమీద అలాగే కూలబడి పోయారుట మా నాన్నగారు. పాపం, పోస్టుమాస్టరుగారే కాసిని చాయ్ నీళ్ళు తాగించి.. ఆనక సలహా కూడా ఇచ్చారుట."సాధారణంగా ఇక్కడి గిరిజనులు చాలా నిజాయితీగా ఉంటారండీ! ఇంకేదో జరిగి వుండాలి. ఏం జరిగిందో తెలుసుకోవాలన్నా ముందు మీరు ఆ రఘువా ఉండే గూడేనికి వెళ్ళి వాకబు చేయాలి! అక్కడి పరిస్థితులను బట్టి అప్పుడు ఏం చేయాలో ఆలోచించుకుందురుగాని.. ముందు బైలుదేరండి" అని తొందరపెట్టి మరీ పంపించాడుట. రఘువా గూడేనికి వెళ్లే దారికూడా ఆయనే చూపించాడుట.
ఆరు మైళ్ళు.. డొంకదారుల్లో బడి.. ఎత్తులూ పల్లాలూ దాటుకుంటూ.. రఘువా ఉండే గూడేనికి చేరుకొనేసరికి సూర్యుడు నడినెత్తిమీద కొచ్చేసాడుట.
గూడెం పొలిమేరల్లోనే ఒక ఊరేగింపు ఎదురైందిట వాళ్ళకు. ఆడా, మగా అట్టహాసంగా చిందులేసుకుంటూ కోలాహలంగా వస్తున్నారు బాజాలూ బంత్రీలూ మోగించుకుంటూ. మధ్యమధ్యలో జివాల బలులు. కోళ్ళని గాల్లోకి ఎగరేసి గొంతులను లటుక్కుమని నోటితో కొరకడం.. చిమ్మేరక్తాన్ని ఊరేగింపు మధ్యలో ఉన్న దున్నపోతుమీదకు చల్లడం! దున్నపోతుకు చేసిన అమ్మోరి వాహనం అలంకారంలో ఈ రక్తం కలగలిసిపోయి చూపులకే పరమ భయంకరంగా ఉందంట అక్కడి వాతావరణం. అన్నింటికన్న విచిత్రమైన విషయం.. ఆ దున్నపోతు మీద ఊరేగుతున్న పెద్దమనిషి ఎవరో కాదు.. సాక్షాత్తూ రఘువానే!
వాహనం మీద అటో కాలూ ఇటో కాలూ వేసుకుని వళ్లో ఏదో బుట్టతో దేవుడల్లే కూర్చోని వున్నాడుట. నుదిటిమీద పెద్ద పెద్ద కుంకుమ బొట్లు.. మెళ్ళో పూలు, పూసలు కలగలిపి అల్లిన దండలు.. చేతిలో బల్లెం.. చూడ్డానికి సాక్షాత్తూ యమలోకం నుంచి దిగొచ్చిన కింకరుడు మల్లే ఉన్నాడుట.
' చేతులూ రెండూ కట్టుకుని.. ముంగిలా.. ఎప్పుడూ వెనకెనకే వంగి వంగి నడిచే రఘువాలో ఇన్ని కళలున్నాయా!' ఆశ్చర్యంతో మానాన్నగారి నోటంట మాట రాలేదుట. ఆటైములో.
అసలేం జరుగుతుందో అర్థం కాలేదుత ముందాయనకు. వెంటవచ్చిన గిరిజనుడిదీ అదే పరిస్థితి. 'కనుక్కొస్తాన'ని అటుగా వెళ్ళిన మహానుభావుడు.. నీరసంతో శోషొచ్చి మా నాన్నగారు బండమీద వాలి పోయిందాకా తిరిగి రానేలేదుట. అరగంట తరువాత వచ్చి దగ్గర్లోని చెట్టునుంచి రెండు జాంకాయలు కోసి తినిపించి అప్పుడు తీరిగ్గా వినిపించాడుట తెచ్చిన సమాచార ఆ గిరిజనుడు.
అతగాడు తెచ్చిన సమాచారం ప్రకారం ఇంకో గంటలో ఊరిబైట కొత్తగా గుళ్లో అమ్మమ్మ తల్లి ప్రతిష్టాపన జరగబోతుంది.
'అమ్మతల్లి' తెలుసు గాని.. ఈ 'అమ్మమ్మ తల్లి' ఎవరూ?" అని అడిగారుట మానాన్నగారు.
"నాకూ తెలీదు దొరా! ఎప్పుడూ వినలేదు. చూద్దాం పదండి" అని అర్థం వచ్చే వాళ్ళభాషలో ఏదో కూసి ఆ దేవాలయం ఎక్కడ కడుతున్నారో అక్కడికి నడిపించుకుని పోయాట్త ఆ గిరిజనుడు.
ఊరికి ఉత్తరంలో కొత్తగా కాల్సిన మట్టి ఇటుకలతో కట్టిన నాలుగు గోడల గుడి అది. దాని మధ్యలో అరగంట కిందటే ప్రతిష్టించినట్లున్నారు అమ్మమ్మతల్లిని.. బైట ఇంకా పచ్చి ఆరని బల్లుల రక్తం మరకలు.. పసుపు కుంకుమల వాసనలు.. సగం కాలిన అగరవత్తులూ..!
అప్పటి దాకా సందడి చేసిన గిరిజనులు.. ప్రతిష్టాపన అనంతరం.. సంబరాలు చేసుకుంటూ ఒక దిక్కుకు వెళ్ళిపోవడం చుసారుట మా నాన్నగారు.
'టీకా మందు తెమ్మ'ని పంపించిన నమ్మకస్తుడు.. అలా అన్నీ మరిచి మందుకొట్తి కొత్త దేవుడి అవతారంలో మందతో కలిసి ఇలా ఆడుతూ..పాడుతూ మొహం కూడా చూపకుండా వెళ్ళిపోతుంటే.. అంత లావు ఆఫీసరు సారయివుండీ..ఏం చేయాలో దిక్కుతోచక అలాగే నిలబడిపోయారుట మానాన్నగారు.
"అప్పటికింక చేసేదేమీ లేదు.. తిరిగి మళ్ళీ చీకటి పడేలోపు టెంటుకెళ్ళి బబ్బోవడం తప్ప. మళ్లీ మందు తెచ్చుకొని 'ఆపరేషన్ టీకా' కంటిన్యూ చేయడమెలాగూ తప్పదు. జరిగిందంతా పై అధికారులకు వివరంగా చెప్పి పడబోయే పనిష్మెంటుకి తలవగ్గడం ఎలాగూ తప్పదు.అలా అనుకున్న తరువాత ఇంక వర్రీ అవడం మానేసాను. ఎలాగూ పోతున్నాము కదా.. ఒక సారి ఈ కొత్త దేవత అమ్మతల్లి ఎలాగుంటుందో చూడాలని కుతూహలం పుట్టుకొచ్చింది" అని చెప్పుకొచ్చారు మా నాన్నగారు తరువాత మా కాకథ చెప్పే సందర్భంలో ముక్తాయింపుగా. గుర్తున్నంత వరకూ ఆయన మాటల్లోనే చెప్పి ఈ కథ ముగిస్తా.
"..అప్పటికే నావెంట వచ్చిన గిరిజనుడు గుడిముందు పడి పొర్లుదండాలు పెట్టేస్తున్నాడు. గుడికి ఇంకా పైకప్పు ఏర్పాటు కాలేదు. కాస్త ముందుకు వెళ్ళి లోపలికి తొంగి చూసా!
ఆశ్చర్యం! పీఠంమిద 'టీకా మందుల పెట్తె'! అదే రఘువా పోస్తాఫీసునుంచి విడిపించుకొచ్చింది. దానికి అన్ని వైపులా పసుపూ కుంకుమ బొట్లు పెట్టున్నాయి! ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. మెడిసన్ తొ పాటు ప్రచారానికని సప్లై చేసిన డిస్ ప్లే మటీరియల్లో ఒక సినిమాతార కుడిచేత్తో సిరెంజి.. ఎడం చేత్తో అభయ హస్తం ముద్ర పట్టి వున్నట్లు ముద్రించిన పోస్టరు ఒకటుంది.. అది ఆ గుడిగోడ లోపల అంటించి ఉంది! ఆ సినీతార నుదుటనిండా ఇంత మందాన కుంకుమ బొట్లు.. కాళ్ళకి పసుపు పారాణీ!.. టీకాలు సక్రమంగా వేయించుకుంటే ఆరోగ్యానికి భద్రత" అన్న నినాదం ఇచ్చే సినిమా తార హఠాత్తుగా ఈ గిరిజనులకు 'అమ్మమ్మతల్లి'ఐపోయిందన్నమాట! అలా ఎందుకయిందో..ఎలా ఐందో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థమై చావలేదు.
మర్నాడు తిరిగి వెళుతూ వెళుతూ దారిలో పోస్టుమాస్టరుగారిని మళ్ళా కలిసి విచారించినప్పుడు గానీ ఆ చిక్కు ముడి విడిపోలేదు.
"మీ రఘువా మందు ప్యాకెట్టూ.. ప్రచార మెటీరియల్ తీసుకుంటున్నప్పుడు 'నన్ను అడిగాడండీ.. ఇదేమిటి దొరా?" అని. ఇక్కడి కొండజాతివాళ్ళు 'ఆట్లమ్మా..మశూచికం' లాంటి అంటువ్యాధులని 'అమ్మోరు' అని పిలుచుకుంటుంటారు. ఆ అమాయకుడికి బాగా అర్తమవుతుందన "మీ అమ్మోరుని చంపేసే మందురా" అని చెప్పాసార్!. దాన్నా అమాయకుడు 'అమ్మమ్మ తల్లిగా' భావించాడు. మీకు తిరిగి తెచ్చిస్తే మిగతా గూడేలకందరికీ పంచేస్తారు కదా! వాళ్ల గూడెపొళ్ళకి దక్కకుండా పోతుందనుకున్నాడో ఏమో.. నేరుగ్గా గూడేనికే తీసుకెళ్ళి నాయకుడి పరం చేసేసాడు. ఆ నాయకుడూ అంతకన్నా తెలివిమంతుడు లాగున్నాడు. వాళ్ల ఆచారం ప్రకారం ఈ 'అమ్మమ్మ తల్లి'కి ఊళ్ళోనే గుడి కట్టించి పారేశాడు" అని వివరించాడ్దుట పోస్టుమాస్టరుగారు"
అదండీ ఆ గిరిజనుల అమాయకత్వం. వాళ్ళంటే అనాగరికులు. చదువుకోని వాళ్ళు. అన్ని చదువులు చదివి ఇంత నాగరీకం వెలగబోసే మనం మాత్రం ఇంతకన్నా తెలివిగా ప్రవర్తిస్తున్నామా! ఆలోచించుకోవాల్సిన విషయం ఎవరికి వాళ్ళుగా!
అందుకే అప్పటి కథ ఇప్పుడు చెప్పుకొచ్చింది.*
అమ్మమ్మ తల్లి- కథానిక
అనుసృజన : కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment