ఈనాడు - హాస్యం- వ్యంగ్యం - గల్పిక
ఎన్నికల్లో ఉగాది
రచన - కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు ప్రచురితం - 27-03 -2009)
'అసలే విరోధి. ఆపై ఎన్నికల ఏడాది . అందుకే నేననేది..
ఈ ఉగాది ఉత్తి జగడాలమారిది' అంటూ పదోసారి పండుగ కవితలు వినిపించారు మావారు.
ఆ సోదింకా భరించే ఓపిక లేక శ్రీవారి నాలిక్కింత ఉగాది పచ్చడి తగిలించా! అంతే, ఆ చేదుకి నోరు ఠక్కుమని మూతబడింది.
' నీతో పనికాదులే... నేరుగా జాతికే వినిపిస్తానీ కవితలు ఆవటా అంటూ పేంటూ చొక్కా వేసుకుని విసురుగా వాకౌట్ చేసేశారు.. ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబు చెప్పలేక బైటికి పారిపోయే మంత్రులకి మల్లే.
ఇదిగో ఇప్పుడు అదనంగా ఎన్నికలు కూడా కలిసొచ్చాయి. కనక పండగకళలో మరింత మార్పు వచ్చేసింది. మెగాస్టార్ కోరుకొనే మార్పు ఈసారి ముందుగా ఈ కొత్త సంవత్సరం పండగలోనే కొట్టొచ్చినట్లు కనిపించేస్తుంది. చూశారా!
పండక్కి చాలాముందు నుంచే అన్ని పార్టీలు అభ్యర్థుల జాబితాలను ఉగాది పచ్చడి మాదిరి రుబ్బేస్తున్నాయి గదా! మూడు నాలుగు రోజుల బట్టి పంచటం కూడా మొదలె ట్టేసరికి... పండగ 'మూడే' ఎలా మారిపోయిందో చూడండి!
టికెట్టొస్తే తీపి . రాకపోతే చేదు. ఎదుటివాడి కొస్తే కారం. అడిగింది రాకపోతే పులుపు . అన్ని రుచులూ పండగ ముందే రుచి చూపించేస్తుందీ ఉగాది మరి!
సంకురుమయ్య ఈసారి ఎప్పుడో సంక్రాంతి దాకా ఆగే మూడ్ లో లేనట్లుంది ... కప్ప వాహనమెక్కి ఇప్పుడే హడావుడిగా వచ్చేస్తున్నాడు.
అందుకేనేమో ఢిల్లీ నుంచి గల్లీదాకా చోటామోటా నాయకులతో సహా అందరూ ఆ పార్టీనుంచి ఈ పార్టీలోకి .. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ లోకి దూకేస్తున్నారు.
ఈసారి పండక్కి కవుల గోలకన్నా ముందే ఈ కప్పల బెకబెకల గాల ఎలా మొదలయ్యాయో చూశారా!
ఎన్నికల తేదీలు ప్రకటించినప్పట్నుంచీ ఈసీ రోడ్ కొరడా పట్టుకుని కాచుక్కూర్చొనుంది. దెబ్బలు కాచుకుంటూ పబ్బం గడుపుకోవడం మన నాయకులకు తెలీని విద్యేం కాదుగానీ.. ఇలా పండగ పంచాగ శ్రవణాలమీద డేగకన్నేసి ఉండటం పాపం కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నట్లుంది ప్రభుత్వ సిబ్బందికి.
ప్రత్యక్ష ప్రసారం కూడా పరోక్ష ప్రమేయాలను ఈజీగా తీసుకొనేట్లు లేదు ఈసీ. అభ్యర్థుల ఆదాయ వ్యయాల మీద అభ్యంతరాలుంటే పరిశీ లన తప్పదంటున్నారు సీఈసీ. మాజీ డి.జీ. పి రాజపూజ్యం మీద తీసుకున్న చర్యే దీనికి సజీవ ఉదాహరణ.
మామూలుగా సర్వజనాలకు మాదిరిగా చదివే పంతులుగారికి కాస్త మామూళ్ళు ఎక్కువగానైనా చదివించి, వచ్చే జనాలు మెచ్చేవిధంగా ఫలితాలు అనుకూ లంగా చదివించుకోవడం ఏ సర్కారైనా ఎప్పుడూ చేసే పనేగానీ.. ఈసారి ఈ వేడుక కోడ్ మూలంగా సాధ్యపడే సాధనం లేదు. అందుకేనేమో అవధానిగారు టీవీలో చాలా కాలానికి మొదటిసారి కాస్త నిజాయతీగా ఎన్నికల స్పృహ ధ్వనిస్తున్నారు.
వరి, గోధుమలు, జొన్నలకన్నా ' ఓట్ల'కు మద్దతు ధర అధికంగా పలికే సమయం ఇది. ఉచిత హామీలు పుష్క లంగా పండుతాయి. రథాలు రోడ్ల మీదా, జనాలు రథాల కింద నలిగి ఆస్తినష్టం, ప్రాణనష్టం అధికంగా ఉంటుంది. తగ్గేది రూపాయి ధర ఒక్కటే. చమురు ధరలు పడిపో యినా చేతి చమురు రేట్లు యధావిధిగా పెరుగుతూనే ఉంటాయి.
శిలా ఫలకాల వాడకం అధికమవటం చేత ఇంటి నిర్మా రాళ్ళ కరవు ఏర్పడు తుంది. జలాలు లేకపోయినా జలాశయాలు నిర్మిస్తారు. ఆర్థిక మాంద్యం వల్ల పావలా వడ్డీలు చెల్లవు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యో గాలు ఊడే పరిస్థితి ఉన్నా ఇక్కడ ఎన్నికల మూలాన జనం చేతిలో చిల్లర ఆడుతుంది.
అందరూ మళ్ళా మరోసారి కులమతాలను గుర్తు చేసుకునే సమయం. గ్యాసు ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. పోటీలుపడి ఛానెళ్ళు నిజాలు చెబుతాయి. నీరుకన్నా బీరు అధికంగా దొరుకుతుంది. ఓట్లు తక్కువగా వచ్చినవాళ్ళకు సీట్లు ఎక్కువగా వచ్చే విచిత్ర పరిస్థితి. జొన్నపొత్తులకన్నా పార్టీల పొత్తులు ఎక్కువ. భిక్షకులు సుభిక్షంగా ఉంటారు.
చంద్రుడు రసాధిపతి, రాజు నీరసాధిపతి. రాహుల్.... అనగానే సభలో సగం జనం లేచి నిలబడ్డారు. పంచాంగం చెప్పే పంతులుగారితో ఏదో లోపాయకారీ ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం . రాహుల్ గాంధీ తప్ప రాహు, కేతువుల ఊసే లేదు. ఈసీకి ఫిర్యాదు చేస్తాం.. అంటూ విసురుగా నినాదాలు చేసుకుంటూ బయటకు వెళ్లిపోతున్నారు.
పంచాంగ పఠనం సాగుతుండగానే ఉగాది పచ్చడి పంచుకుంటూ వస్తున్నారు ప్రభుత్వ సిబ్బంది.
మావారు కాల్ చేశారు. 'టీ.వీ.లో చూస్తున్నావా! ఉగాది పచ్చడి తినాల్సి వస్తుం దని ప్రతిపక్షాలవాళ్లు ఎలా పారిపోతున్నారో! పచ్చడి వెండి గిన్నెల్లో పెట్టి ఇస్తున్నారు. పంచాంగాల మధ్య పార్టీలు మేనిఫెస్టోలు అచ్చేశాయి. నువ్వు మాత్రం టీవీ కట్టేయద్దు. చివరిలో నా కవితాపఠనందాకా ఆగు' అంటూ...!
శాస్త్రులుగారు ఆ రణగొణ ధ్వనిలోనే తన ధర్మాన్ని కొనసాగిస్తున్నారు.
'రాజకీయాలలో 'మాయ' ప్రభావం అధికంగా ఉంటుంది. లోటు బడ్జెట్లకు లోటుండదు. రాష్ట్రా దాయం రెండు, వ్యయం పన్నెండు. రాజుగారి ఆదాయం పన్నెండు వ్యయం సున్నా.'
హాలులో మిగిలిన సగం లేచి హాహాకారాలు చేశారు. ఎందుకో బయటకు పారిపోతున్నారు. క్షణంలో హాలు ఖాళీ అయిపోయింది కవులు కాగితాల కట్టతో వేదిక మీదకు ఎగబాకుతున్నారు.
మావారు మైకు పట్టుకుని ఖాళీ హాలుని చూసి ఉద్రే కంగా ఊగిపోతూ చదువుతున్నారు.
చూశారా.. రంగు రంగుల కతలు అల్లగలరు నేతలు...
కళ్ళు పడినా మూతలు...
ఓటరూ నీకు మిగులును పల్లకి మోతలు/' అంటూ...
-రచన - కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు ప్రచురితం - 27-03 -2009)
No comments:
Post a Comment