ఈనాడు - గల్పిక
గురువు - లఘువు కాదు ; కారాదు!
- రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 05 - 09-2009 )
'గురువు, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటారు షిర్డీ సాయి బాబా యుద్ధరంగం మధ్య విషాదయోగంలో పడ్డ అర్జునుడికి సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైత బోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు
రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే. కాబట్టే జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరువాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది. అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్ధన తరువాత ' స్వస్తినో బృహస్పతి ర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనిషి ఎలాగవుతాడు? అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన. గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు. అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు సమాజంలో గురుస్థానం అంతటి ఘనతరమైనది. కనుకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చి ఇచ్చే శ్రమ తీసుకున్నది.
గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల తార్కాణం. ఔరంగజేబు కూడా చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును చక్రవర్తి అయిన తరువాత దారుణంగా అవమానించాడు. క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్ ఏథెన్స్ ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్ లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురుపు కౌటిల్యుడు. కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా.
మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే అదిగురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు. కాబట్టే గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే. మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కులు పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులకు అప్పగిం చాడు . పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు బిడ్డలు విద్యాగంధంలేక అల్లరిచిల్లరగా తిరుగుతూ ఉన్నారని వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటా నికి సాగనంపింది.
నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవి కావు. వేదాధ్య యనం తరువాత పరీక్షలు. నింబ, సారస మనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లించడం పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు. నింబ పరీక్ష మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి. అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.
మన పురాణాలు, ఉపని షత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురు ప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు ' ప్రిన్స్ ఆఫ్ వేల్స్' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు. ఒకసారి చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహా ప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందు కయ్యా' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు- అని విన్నవించుకున్నాడుట . రాజు గారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రో జుల్లో గురువుకిచ్చిన విలువ!
దేవతలకూ గురువున్నాడు .. బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు . మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు.
'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని ఉంది . . భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటే గాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు. బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా శిష్యుడిని వారించే నిమిత్తం అడ్డుపడి కన్నుపోగొట్టుకున్న గొప్ప గురువు శుక్రాచార్యుడు.
గురు శబ్దం అంత గొప్పది. కనుకనే మన మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపేవారు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా? ' అని అడి గితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం.
అటువంటి గురువుకి నేటి మన సినిమాలలో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది. 'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు. గుండ్రాయే. మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రామే నిజమైన గురువు . తాను అనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ కుర్చీలో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.
గురువులు అష్టవిధాలు . అక్షరాభ్యాసం చేయించిన వాడు, గాయత్రి ఉపదేశించినవాడు, వేదాధ్యయనం చేయంచినవాడు, శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు, పురోగతి కోరేవాడు, మతాది సంప్రదాయాలను నేర్పేవాడు, మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు, మోక్షమార్గాన్ని చూపించే వాడు - అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టిం చుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు. దొంగలపాలు కానిది, దొడ్డ కీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచ కలకిచ్చినా రవంత తరగనిది- గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.
రచన- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - 05 - 09-2009 )
No comments:
Post a Comment