Sunday, December 12, 2021

చదువులయ్య చలవదినం -కర్లపాలెం హనుమంతరావు (ఒకనాటి ఈనాడు సంపాదకీయం)

 చదువులయ్య చలవదినం

-కర్లపాలెం హనుమంతరావు
(ఒకనాటి ఈనాడు సంపాదకీయం)
సమీపంలో ఉన్నప్పుడే తల్లి పోషించగలిగేది. సాన్నిహిత్యంలోనే తండ్రైనా హితాహితాలు బోధించగలిగేది. మధురవాక్కులతో సాంత్వన కలిగించేందుకు స్వీయకాంతకైనా సామీప్యం అవసరం. ఎంత మంచిమిత్రునికైనా 'చింతాలత చ్చేదన' సమక్షంలో ఉన్నక్షణాలలోనే కదా సాధ్యం! భోజరాజప్రబంధంలో చెప్పినట్లు 'కల్పలతాఖ్య అయిన విద్య ఒక్కటే ప్రత్యక్ష.. పరోక్షాలలో సర్వవిధాలా అదుకునే నిధి'. చర్చక్షువును మించిన ఆ మనోనేత్రం- విద్యనందించే ఉపాధ్యాయుడు. భారతీయ సంస్కృతి ఒజ్జను ప్రత్యక్షదైవంగా సంభావించింది. 'నాస్తి మాతృసమో గురుః' అని పంచమవేదం సైతం గురువును తల్లితో సమానంగా గౌరవించింది. 'తమ కటాక్షము బల్లిదపు కుంచెకోల యావైకుంఠనగర కవాటములకు' అంటూ ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రాప్రగడయ్య చేసిన గురుస్తుతి లోకంలోని అయ్యవార్లందరికీ వర్తించే ప్రస్తుతి. ఎందరో విద్వాంసుల ముందర శ్రీ గురుబ్రహ్మగా వందనాలు అందుకున్న చెళ్లపిళ్ళవారూ 'కథలు-గాథలు' గ్రంథంలో తమకు విద్యనందించిన జ్ఞానసింధువులందరిని 'గురుపరంపర' పేర పేరుపేరునా సంస్మరించుకున్న వైనం మననీయం. రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు, బలరామకృష్ణులకు సాందీపుడు, కురుపాండవులకు ద్రోణాచార్యులు.. మౌర్యపుత్రుడికి విష్ణుగుప్తుడు, అలెగ్జాండరుకి అరిస్టాటిల్, ఆ అరిస్టాటిలుకు ప్లేటో ఆచార్యవర్యులు. గురుపాత్రలేని శిష్యుల చరిత్ర ప్రపంచం మొత్తం గాలించినా ఏ మొత్తలోనూ కనిపించదు. గురుప్రమేయం గిట్టని నవక్రీతుడు జపతపాలతో సాధించిన నడమంత్రపు విద్య సైకతనిర్మాణ సమయాన వట్టిపోయిన కథ భారతంలో ఉండనే ఉంది. 'విద్యాయుక్త వివేకసారథికి అమర్చబడి సిద్ధంగా ఉన్న అశ్వరాజం గురుహృదయం' అని కదా కఠోపనిషత్ వాక్కు!
సాహిత్యం, శాస్త్రం, కళ.. దేశీయవిద్యలన్నింటిలో సర్వకళాపారంగతులు ఒకనాటి మన గురువులు. గురుశుశ్రూష.. బ్రహ్మచర్యనిష్ఠ.. కౌమారదశ నిండే వరకు జ్ఞానార్జనలు మాత్రమే శిష్యుల వ్యాపకాలుగా సాగిన ఉత్తమ గురుకులవ్యవస్థ ఆ నాటిది. ఇప్పటి విడ్డూరపు చదువులు కావారోజులవి. 'బెంచీ లక్కఱలేదు గేమ్సు మొదలౌ ఫీజుల్ వినన్ రాదు పొ/మ్మంచున్ నిర్ధను ద్రోచిపుచ్చరు గురుల్/ప్యాసైననే లాభమిం/చంచున్ నేమము లేదు మీచదువు నందు' అంటో ప్రాచీన గురుశిష్య పద్ధతులను ప్రస్తుతించారు తిరుపతి వేంకట కవులు. ఆధునీకరణ మిషతో మనం కోలుపోతున్న మానవీయ విలువలేమిటో తెలుసుకోవటానికి ఆ పద్యాలు చాలు. ముఖ్యంగా ఉత్తమజాతి ఉపాధ్యాయవర్గం. 'శుచి యౌవేషము శుద్ధమౌ మతము సంశుద్ధంబు దేహంబ ని/ర్వచనీయం బగు పాండితీగరిమ ద్రవ్యంబంద నాసక్తి పూ/ ర్వచరిత్రంబులయందు భక్తియును చాత్రశ్రేణిపై రక్తి గ/ల్గు'.. అన్నారు గురువుకు ఆహార్య విషయంగా కూడా ఉండవలసిన శ్రద్ధాదులను గురించి హెచ్చరిస్తూ ప్రాచీనులు. చతుర్వేదులైన ఆ అచార్యదేవుళ్ళను ఇప్పుడు తలుచుకున్నా రెండు చేతులూ ఎత్తి నిండుమనసుతో నమస్కరించ బుద్దవుతుంది. వదాన్యులైన ధనవంతుల ఆదరాభిమానాలతో వికాసమానంగా నడిచిన ఒకనాటి ఆ విజ్ఞానకేంద్రాల నడత ఎక్కడ? విద్య వంకతో వంకరటింకర పోకడలు పోతోన్న నేటి వ్యాపారకేంద్రాల వంకర నడకలెక్కడ! పాలకుండకి కల్లుకుండకి మధ్య పోలికా! ఆచార్య మామిడిపూడి వేంకట రంగయ్యగారు ఓ సందర్భంలో అంటారూ 'ఇప్పుడు నడుస్తున్న బళ్ళన్నీ వట్టి 'కడుపుకూటి' చావళ్ళు'. అని. మల్లంపల్లి సోమశేఖరశర్మ 'మన ప్రాచీన విద్యాసంస్థలు' అనే వ్యాసంలో వర్ణించిన ఆ పురావిద్యావైభోగమంతా ప్రస్తుతం కేవలం సంస్మరణకు మాత్రమే మిగిలుండిపోయిన సుసాంప్రదాయ విచారధార. విచారకరం. విషాదకరం కూడా.
విద్యాసంస్కరణల ఆవశ్యకత మీద అందరిదీ ఒకే అభిప్రాయం. విధానాల వద్దే వైరుధ్యమంతా. విద్యాలయానికి పునాది ఉపాధ్యాయుడు. శిఖరం విద్యార్థి. ఆ ముఖ్యులిద్దరిని విశ్వాసంలోకి తీసుకోని ఏ సంస్కరణ అయినా నీరులేని నూతిలో వేసే చేద బాపతే. జ్ఞానక్షేత్రంలోని విద్యార్థి బీజం ఆయురారోగ్యాభివృద్ధికి ఆచార్యవర్యుడేగదా బాహిర్ప్రాణం! నియతి, పాండిత్యం, బోధనాశక్తి- ఏ అయ్యవారికైనా ఉండవలసిన మొదటి మూడు ముఖ్యలక్షణాలన్నదీ అందుకే. నీతి అందరికీ అవసరమే. గురువులకి మరీ అవసరం. వృత్తి చేతే కాదు ప్రవృత్తి రీత్యా ఒజ్జ రుషితుల్యుడైతేనే విద్యార్థివర్గం నుంచి మన్నన దక్కేది. జూదం, వ్యసనాలు, రాజకీయ జోక్యాలు, లాలస, లైంగిక నిర్వాకాలు దైవసమానులైన ఉపాధ్యాయుల నుంచీ సమాజం అసలు సహించదు. కేవలం పోటీపరీక్షలు దాటుకొచ్చిన సజ్జంతా ఒజ్జలవర్గంలో దూరటమే నేటి విద్యావ్యవస్థ మౌలిక దురవస్థ. ఐదారేళ్ళ దీక్షతో గానీ ఒక వైద్యుడు పుట్టుకు రాడు. నాలుగైదేళ్ళ నైపుణ్యంతోగానీ ఒక నిర్మాణ నిపుణుడు తయారు కాడు. దేహంకన్నా.. భవనంకన్నా చవకైనదనా ఒక పసివాడి భవితవ్యం! రెండేళ్ళ మొక్కుబడి శిక్షణతో బడిపంతులు ముద్రవేసి భావిపౌరుల జీవనశకటాలకు చోదకులుగా తోలెయ్యడం! సంస్కృతీ సంప్రదాయలపైన అభిమానం, స్వజాతి సంక్షేమం మీద ఆదరం, బతుకుపట్ల.. భావిమీద సానుకూల దృక్పథం, మంచిచెడులను ఎంచి తూచి, మేలువైపుకే మొగ్గు చూపించే బుద్ధి.. కరవైన గురువులు మకిలినీటి దొరువులు. సంఘానికి వారు చేసే చెరుపు అణువిచ్చిత్తికి మించి ఎన్నో రెట్లు ప్రమాదకరం. చిలకమర్తివారు ప్రహసన గణపతి ద్వారా చేసే హెచ్చరిక ఇదే. పెడచెవిన పెడితే పెనుగాడి పొయ్యిలో పడి మాడేది మన బిడ్డల భవితవ్యమే. పాశ్చాత్యులు ఇక్ష్వాకులనాడే విసర్జించిన విఫల పథకాల చూరులు పట్టుకునేనా ఇంకా ఈ అధునాతన శతాబ్దంలోనూ మన గబ్బిల విన్యాసాలు! గురువంటే కన్యాశుల్కం మార్కు సిగారు గీరీశాలు కాదు. శిష్యులతో చిడప్పొక్కులు గోకించుకునే కరటకశాస్త్రులూ కాదు. గుర్రానికి కళ్ళెం. భాద్రపదానికి ముందొచ్చే శ్రావణం. మైత్రావరుణులబంధం గురుశిష్య సంబంధం. బతకలేక బడిపంతులు ..కాదు. బడిపంతులు లేక బతుకులేదు. ఏటా వచ్చేది ఉపాధ్యాయదినం. ఏదో మొక్కుబడి ముక్కు చివరి స్తుతులు చాలవు. ఏడాది పొడుగూతా సాగేవీ చదువు సాములు. చదువులయ్య పాత్ర చల్లంగా సాగే కార్యాచరణ సత్వరమే అరంభించటం సమాజానికి క్షేమకరం.
-కర్లపాలెం హనుమంతరావు
(ఒక నాటి ఈనాడు సంపాదకీయం)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...