Showing posts with label celebrations. Show all posts
Showing posts with label celebrations. Show all posts

Tuesday, September 1, 2020

కలిసి మునుగుదాం రండి!- కర్లపాలెం హనుమంతరావు ఈనాడు దినపత్రిక సరదా వ్యాసం




చికాగో నుంచి మా చిన్నాన్నగారబ్బాయి చిట్టి ఫోన్ చేసాడు 'మొత్తం పాతిక మందిమి వస్తున్నాం.. మునగడానికి.. అదేరా.. గోదావరి పుష్కరాలు కదా!.. ఆ ఏర్పాట్లూ అవీ అన్నీ చూసే పూచీ నీదే..'అంటూ.
ఇంత మందొచ్చి పడితే నదిలో నీళ్లు చాలొద్దూ! అని మధన పడుతుంటే మా మాధవగాడే దేవుడిలా వచ్చి ఆదుకున్నాడు.. 'గోదావరా? .. డోంట్ వర్రీ!' అంటూ. ‘అమెరికాలో మునగడానికేం లేవు కాబోలు పాపం,, చికాగో నుంచి వస్తున్నారు. చికాకు పడితే ఎట్లారా? .. చూద్దాంలే! .. చుట్టం కదా!' అన్నాడు.
ఆ సాయంత్రమే టక్కూ టయ్యీ కట్టుకున్న శాల్తీ ఒకటి 'టక్,, టక్' మంటూ మా ఇంటి తలుపు తట్టింది. మొఖాన కాసంత గంధబ్బొట్టు మినహా మనిషి మనాడే అనేందుకు ఇంకే దాఖలాల్లేవు. అంత మంచి ఇంగ్లీషు మాట్లాడుతున్నాడు! 'మై నేమీజ్ మిష్టర్ డూబే. మాధవ్ పంపించా'డంటూ ఏదో ఫారాలిచ్చి ఫార్మాలిటీస్ అవీ పూర్తిచెయ్యమన్నాడు. హ్యాండౌట్ ఇచ్చి డౌట్సేమన్నా ఉంటే అడగమన్నాడు.
కరపత్రం కడు రమణీయంగా ఉంది. 'పన్నెండేళ్లకోసారొచ్చే పవిత్ర గోదావరీ పుష్కర స్నానఘట్టాన్ని మీరు జీవితంలో మర్చిపోలేని మధుర ఘట్టంగా మార్చే పూచీ మాదీ! రాజమండ్రి నుంచి నర్సాపురం వరకు గోదావరి నది వడ్డున వడ్దూ పొడుగూ ఉన్న మా వస్తాదులు మిమ్మల్ని ముంచేందుకు సదా సిద్ధంగా ఉంటారు'
'వస్తాదులెందుకయ్యా?'
'ముంచేటప్పుడు మీరు కొట్టుకు పోకుండా సార్! ఒక్క ఫోన్ కాల్ ఛాలు. మీరు పరుగులెత్తకుండా గోదావరి నదే మీ పాదాల వద్దకు పరుగులెత్తుకుంటూ వచ్చేస్తుంది'
'బానే ఉంది గానీ, మునిగేందుకే ఫీజు కాస్త ఎక్కువ. తలకు మరీ మూడు వేలా?!'
'టోకున మునిగితే డిస్కౌంటుంటుంది సార్! ముసిలివాళ్లకు, పసిపిల్లలకు చెంబుస్నానాలు మా స్పెషాలిటీ! స్త్రీలను ప్రత్యేకంగా ముంచేందుకు ఏర్పాట్లు చేసాం. సిక్కులకు మినరల్ వాటర్ మిక్స్డ్ బాత్! సిక్కంటే సర్దార్జీ అని కాదు. సిక్ పర్సన్ అని అర్థం. వి. . పి లకు విడిగా వేణ్ణీళ్ల స్నానాలు.
'శుద్ధి చేసిన వాటర్ కదా! కొద్దిగా ఫీజు ఎక్కువే ఉంటుందిలేరా మరి' అని అందుకున్నాడు అప్పుడే వచ్చిన మాధవగాడు. ‘సౌకర్యాలు చూసుకో.. ఫీజెంత చౌకో తెలుస్తుంది. సొంతంగా వెళ్లాలంటే ఎంతవుతుందీ? పైన యాతన. రద్దీలో ఏదీ దొరిగి చావదు. అదే డూబే వాళ్లయితే అంగవస్తం నుంచి గోచీపాత వరకు అన్నీ అద్దెకిస్తారు. నిదానంగా అన్ని దానాలు చేయిస్తారు. పురోహితుడ్నీ.. అవసరమయితే పితృదేవతల్ని కూడా వాళ్లే చూసిపెడతారు..'
'మరేఁ!' అన్నాడు మిష్టర్ డూబే సెల్ ఫోన్ మీదేవో నెంబర్లు టకటకలాడిస్తో.
'పితృదేవుళ్లని ఇప్పుడే బుక్ చేస్తున్నాడేమో! ఎంత ఫాస్టు! డూబే జోరు చూస్తుంటే నాకిప్పుడే గాదారిలో కెళ్లి బుడుంగుమని మునగెయ్యాలనిపిస్తుంది. బేడ్ లక్. పుష్కరం రెండు వారాలు నా కింకో దేశంలో క్యాంపు!'
'సరిగ్గా మీలాంటి వాళ్లకు సరిపడే స్కీముంది సార్ మా దగ్గర. ఆఫీసులో, బిజినెస్ లో బిజీగా ఉంటే మీ తరుఫున ఇంకోళ్లను ముంచుతాం. పుణ్యం పూర్తిగా మీ కాతాలోకే బదిలే అయ్యే ప్రత్యేక పూజ కూడా పాకేజ్ లో ఉంది.' అని ఇంకో ఫారం బైటికి తీసాడు. డూబే ఫైలు నిండా ఎన్నో ఫారాలు!
'నాకూ ఓ టోకెన్ తీసుకోండి! నలుగురులో స్నానం చెయ్యడమెలాగా అని ఇందాకణ్ణుంచి నలుగుడు పడుతున్నా. ప్రాబ్లం సాల్వడ్' అని తగులుకుంది మా శ్రీమతి. 'ముక్కు మూసుకొని మునగకుండా ముక్కోటి దేవతలనర్చించే పుణ్యఫలం ఈజీగా వస్తుంటే వదులుకోడమెలా?' అని ఆవిడగారి గోల. పాచినీళ్లలో  మునిగే బాధలేదు. కొట్టుకుపోయే రిస్క్ లేని స్కీమ్. పదివేలు మనవి కావనుకుంటే పుష్కలంగా పుష్కర పుణ్యం.
'ఊరికే నీతులు దంచే నేతలు ప్రజల్నిలా పునీతుల్ని చేసే పనులు ఎందుకు చేపట్టరో! ఎన్నికలున్నాయిగా! ఓట్ల కోసం వచ్చినప్పుడు అడగాల'ని అనుకున్నా.
తీరాబోతే అమెరికా నుంచి ఒకే ఒక శాల్తీ దిగింది, తెల్లతోలు! తెల్లబోయాం. తెలుగు బ్యాచంతా తీరికలేనంత బిజీగా ఉన్నార్ట, డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యుడ్రౌనింగ్ డాట్.కామ్ వెబ్ సైట్లో. చిట్టిగాడు చిట్టీ రాసి పంపించాడు 'ఇంట్లో కూర్చుని ఇంటర్మెట్లో పుష్కర స్నానాలు.. పితృదేవతలకు పిండప్రదానాలు చేసే సాఫ్ట్ వేర్ డిజైనింగులో  బిజీగా ఉన్నాం. నట్టింట్లోకి గోదావరి నదిని తెప్పించాలని ప్రయత్నం. ప్రతిరోజూ పెరట్లోనే పుష్కరస్నానాలు చేయిస్తాం'అంటో ఏదేదో సోది రాసాడు. 'ఈ తెల్లోడికి మన తెలుగు నదుల్లో మునగాలని తెగ 'ఇది'గా ఉంది. అందుకనే మా అందరికీ బదులుగా పంపిస్తున్నాం. మా కొలీగే. జాగ్రత్త. జాతకం ప్రకారం వీడికి ఈ ఏడాది జలగండం ఉంది. మునిగే ముందు కొట్టకుండా చూడండి!' అని రాశాడు.
ఊళ్లో ఉన్నంత సేపూ వాడికి కాపలా కాయలేక చచ్చాం. తీరా బైలుదేరే సమయానికి బాత్ రూమ్ లో కాలుజారి పడ్డాట్ట. గోదావరిలో మునగాల్సిన వాడు అపోలోలో తేలాడు. ఏమైనా సరే నదిలో మునగాల్సిందేనని పట్టుబడితే అట్లాగే కట్లతో డిశ్చార్జ్ చేయించి.. బాసర వైపుకు మోసుకు పోయారుట డూబే బేచి.
తిరిగొచ్చిన తరువాత వీడి ఆనందం చూడాలి. ఆంధ్రా నదుల సౌందర్యాన్ని తిక్కన కన్నా ఎక్కువగా పొగిడేశాడు. వీడియో తీసాట్ట గాని.. విడిగా ఫీజేదో అదనంగా ఎందుక్కట్టాలని ఆర్గ్యూ చేసాడని ఎవడో కెమెరా నీళ్లపాలుచేసేశార్ట! అక్కడికీ పవిత్రస్థలంలో ఫొటోలు తీయడం పాపహేతువని బుకాయిస్తే పాపపరిహారర్థం పన్నెండు వందలు సమర్పించుకుని చెంపలేసుకొన్నాడుట కూడా! తిప్పలెన్ని పడ్డా 'దిస్ మేజిక్ ల్యాండ్ ఈజ్ ఫుల్లాఫ్ మెరికల్స్' అని అమెరికాపోయిందాకా తెల్లదొర ఒహటే మురిసిపోవడమే విశేషం.
మూడో రోజే చిట్టబ్బాయ్ నుంచి ఫోన్. చిటపటలాడిపోతున్నాడు. 'ఇష్టం లేకపోతే ముందే చెప్పాలిరా! గోదారికి దారి తెలీకపోతే కనుక్కోవచ్చుగా! మూసీ నదిలో మునకలేయిస్తార్రా మా తెల్లబాసుని! అదే గోదారనుకుని  పాపం మా అందరి కోసం పాతికసార్లు మురికినీళ్లలో మునకలేసాట్ట గదా! ఇప్పుడు పడిశం పట్టుకుంది. మూసిన కన్ను తెరవడంలేదు. 'మిరకల్.. మిరకల్' అంటూ కలవరిస్తున్నాడు పాపం, మానవుడు!' అంటూ తిట్టిపోసాడు మాధవగాడు.
డూబే మోసం అర్థమయింది. బ్యాంకుల్లో ముంచడం తెలుసుగానీ, ఇట్లా రివర్ బ్యాంకుల్లో ముంచినట్లు వినడం ఇదే మొదటిసారి.
గోరు తడవకుండా  గోదావరి స్నానమంటూ  ఇదేంటో మరి?!
కడిగేద్దామని డూబేగాడికి ఫోన్ చేస్తుంటే నెంబర్ ఎంతకీ కలవదే!
'మళ్లీ పుష్కరాల వరకు మనకు దొరకడులే!' అన్నాడు మాధవగాడు ఆ మధ్య కనబడ్డప్పుడు. జరిగినదంతా చెప్పి చొక్కా పట్టుకు జగడానికి దిగబోతే 'వాడికి జాతకంలొ జలగండం ఉందన్నారుగా! నేనూ.. ఆ డూబేగాడు కేవలం నిమిత్తమాత్రులం.. అంతే' అంటూ కాలరు విడిపించుకుని దర్జాగా వెళ్లిపోయాడు మిత్ర్రుడు.
కర్లపాలెం హనుమంతరావు
01 -09 -2020
***
(ఈనాడు దినపత్రిక 08 -07 -2003 నాటి సంపాదకీయ పుటలో ప్రచురితం)




Saturday, March 7, 2020

సరదాకేః మగువంటే మగవాడి మర-యంత్రమా? -కర్లపాలెం హనుమంతరావు





చెయ్యగా చెయ్యగా పనుల్లో సులువు తెలుస్తుందన్నది  లోక నుడి. మనుషులకే కాదు.. దేవుళ్లకూ ఈ సూbత్రం వర్తిస్తుంది. 'విధినా తావభ్యస్తం యావద్స్పుష్టా మృగేక్షణా' అని  ‘సుభాషిత రత్నమాల’ ముక్తాయించడానికి sఅదే కారణం. లావణ్యంతో ఓలలాడే లలనామణి సృష్టి కోసం లీలామానుషుడు ఎన్నో మగబొమ్మలను తయారుచేసాడన్నది  ఈ శ్లోకం తాత్పర్యం. ఆడవాళ్లను అందుకే ఫెయిర్ సెక్స్ అనడం! 

ఫెయిర్ నెస్ ఎతుంటే ఏం లాభం? చపల చిత్తం మగవాడి బుద్ధి ముందు స్థిత ప్రజ్ఞత పుష్కలంగా ఉన్నా స్త్రీ సునిశిత గ్రహణ శక్తి మొక్కవోతూనే ఉంది. సృష్టి ఆది నుంచి ఇదే బాధ. మగవాడు ఆవులించక ముందే మగువలు వాడి పేగులు లెక్కెట్టేస్తారు!  ‘అందుకే ఆడదంటే మగవాడికంత బెదురు’ అన్నారు హిల్లరీ క్లింటన్ ఓ  సందర్భంలో! అబలగా అన్నింటా మగవాడు చిన్నబుచ్చే  ఆడది నిజానికి జగద్గురు శ్రీ శంకరాచార్యుని భాష్యం ప్రకారం అపర పరాశక్తి.. అతిలోక సుందరి శ్రీ లలితాదేవి.. కూడా! 
పరమేశ్వరి అనే పదానికి పరమార్థమేదో బుర్రకు  తట్టక ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అంటూ తనకు తానే సర్దిచెప్పుకునే ‘బుద్ధి’తక్కువ శాల్తీ మగవాడు.  అయ్యగారి దృష్టిలో ముద్దరాలు అంటే ముద్దుపళని రాధికాసాంత్వనం మార్కు రాధాదేవి. ‘కంటికి నిద్ర రాదు, విను, కాంతుని బాసిన నాటినుండియున్/వంటక మింపు గాదు..’ టైపు విరహబాధలు తెగ పడిపోయే అష్ట శృంగార నాయికల్లో సందర్భాన్ని బట్టి ఎవరో ఒకర్తె. అందుకే  ఆమెను అందాల భరిణ అంటూ ఉన్నవీ లేనివీ ఊరికే ఊహించుకుని మరీ ‘కురులకు వందనములు తెలి గోము మొగంబునకున్ జోహారు, నీ/ యరుదగు కంబు గంఠమున కంజలి, నీ కుచ కుంభాళికిన్/ కరముల్ మోడ్చెదన్, బెళుకు క్రౌనుకు మ్రొక్కెద, బంచబాణ మం/దిరములకున్ సతీమణి! పదింబదిగా పదివేల దండముల్' అంటూ  దండకాలు రాసుకునేది. నడివయసు దాటినా మిడిమేళపు కవిత్వంతో సడీ సప్పుడు లేకుండా తన మానాన తాను తన పని తాను చూసుకునిపోయే చానను కూడా సామాజిక మాధ్యమ వేదికల మీద కీడ్చి కీచకుడికి మించి రచ్చ చేసేది మగవాడే.  కేస్టింగ్ కౌచ్ లు ఉన్నంత వరకు విరుగుడు తంత్రంగా  ‘మీ.. టూ’ లు పుట్టుకురాక తప్పదు. 
నిజానికి మహిళ ఏనాడూ ‘వాల్మీకి రామాయణం’ పట్టించుకోకుండా వదిలెట్టేసిన ఊర్మిళమ్మలా ఊరికే పడి నిద్రపోయిందిలేదు. అర్జనుడి రాక ముందు నుంచే రాజ్యం దర్జాగా నడిపించిన   ప్రమీల  ప్రజ్ఞే  ప్రమదలది ఎప్పుడూ. నేటి లోకవ్యవహారం కూడా ఆ తీరులోనే  తరుణుల ఆధ్వర్యంలో సాగుతుంటే ఇప్పుడీ మహిళా దినోత్సవాలు గట్రా అంటూ ఆర్భాటాల అక్కరే ఉండేది కాదు.  

15వ శతాబ్దంలో ఇండియా  పర్యటనకని వచ్చిన నికోలో కోంటీ అప్పటి హిందూ రాజ్యాలలో భర్త చనిపోయిన భర్తతో బతికున్న భార్యనూ చితి పైకి ఎక్కించడం చూసి విస్తుపోయాడు.  ఆ కాల్చడాలు అవీ ప్రత్యక్షంగా ఇప్పుడు కనిపించవు. కానీ.. కడుపులో పడ్డ మరుక్షణం నుంచి కాటిచితిలో పడే ఘడియ వరకు ఏదో ఓ దుర్మార్గపు రూపంలో ఆడాళ్లను కాల్చుకు తినడాలు మాత్రం తప్పడంలేదు ఇప్పుడు కూడానూ! 
వేదాల కాలంలో  స్త్రీ పురుషులిద్దరిలో గొప్ప ఎవరన్న  వాదమే వినిపించింది కాదు. జనకుడి  విద్వత్మహాసభలో గొప్ప తర్కతో తనను తలకిందులు చేసినప్పుడు మహాజ్ఞాని యాజ్ఞవల్కుడు మొహమాటం లేకుండా  మైత్రేయి ముందు మోకరిల్లినట్లు  మనకు కథలున్నాయి.  ఎప్పుడు రాజుకుందో గాని ‘అహం’ అనే ఈ నిప్పు రవ్వ.. ఇప్పటి  మగవాడి మనస్సులో  ‘అహం బ్రహ్మోస్మి’ అన్న అగ్నిని తెగ ఎగదోసేస్తోంది. మగవాడి ఆధిపత్య జ్వాలలకు సుకుమారమైన బతుకులు ఎన్నెన్ని  కాలి బూడిదయిపోతున్నాయో ప్రతీ రోజూ! మరి ఉద్యమం వద్దంటే ముద్దరాలు మొద్దులా ఓ మూల పడివుంటుందా?    

సృష్టిధర్మ రీత్యా పురుషుడి దేహం స్త్రీ శరీరం కన్న దృఢం అయితే కావచ్చును. అంత మాత్రం చేతనే అన్నింటా అతగాడు అధికుడు ఐపోతాడా? నాగరికత ఆరంభ యుగాలలో ఆడదే కుటుంబానికంతటికీ తిరుగులేని పెద్ద. పితృస్వామ్యవాదం బలిసి పెత్తనం రుచి మరిగిన తరువాతే మగవాడో మహారాజు.. ఆడది అతగాడి ఇష్టారాజ్యానికి ఆడి పాడే మరబొమ్మగా మారిపోవడం. 

బాల్యం నుంచే బాలికల ఊహలు మహా సునిశితంగా సాగుతుంటాయంటారు.  తన మొద్దు బుర్రకు అందని ఊహల  ఆడదాని చేతిలో ఓటమి  అంటే ఊహూఁ మగవాడికి మరి మండదా! సాటి మగవాళ్లల్లోఎంత నామర్దా? అందుకే అడ్డదారుల్లో అయినా ఆడదానిని మగాడు లొంగదీసుకునేది. కానీ ఆడదాని మనసు ఊరుకుంటుందా? ‘జీవితమనే మాయాజూదంలో మగవాడిదేనా ఎప్పుడూ గెలుపు?/ అంటే ఖాయంగా అది కనిపించని శకుని విసిరే పాచికల ఆటే’ అనుకుంటుంది ప్రముఖ  తమిళ స్త్రీవాద రచయిత్రి ఉమా నారాయణ్ ‘కల్చరల్ డిస్లొకేషన్స్: ఐడెంటిటీసి, ట్రెడిషన్స్ అండ్ థర్డ్ వరల్డ్ ఫెమినిజమ్ ‘ చదివిన తరువాత.

వాస్తవానికి మానవ జీవనకావ్యంలో స్త్రీ పురుషులిద్దరూ  రఘువంశ కర్త కాళిదాసు బాషలో చెప్పాలంటే వాగర్థాలు! ఆదిదంపతులకు మల్లే వాళ్లిద్దరూ చెరో సగంగా సమన్వయంతో నిభాయిస్తే తప్ప జగత్ అనే ఈ మహా రథం సక్రమంగా ముందుకు సాగదు!  'న శివేన వినా దేవీ, న దేవ్యాచ వినా శివః' ! అమ్మ లేకపోతే అయ్య లేడు. అయ్య లేని పక్షంలో ‘అమ్మ’ ఉండదు. వేటూరివారి పాటలో ఇంకా వివరంగా చెప్పాలంటే మానవ జీవితం ‘నర నారీ సంగమ మృదంగం/ గంగమ జంగమ సంగీతం’.  ‘ఆమె’ ధరకు జారిన శివగంగ తరంగం.  ఆడది అంటే ఇహ చిన్నచూపు ఎందుకో మగవాడికి?

తరతరాల వెలుగు తాలుపులైనా, తరుగెరుగని ఇలవేలుపులైనా నేల మీదకు కాలు మోపే ముందు ఓ అమ్మ కడుపులోనే  ముందు నునుపు తేలేది! లోకాదర్శ జీవనుడు శ్రీరామచంద్రుడు భూమ్మీదకు  అవతరించింది కౌసల్యామాత గర్భంలో నవ మాసాలు రూపుదిద్దుకున్న తరువాతనే! స్త్రీ జన్మ మహిమ రహస్యం ఆ త్రిశంకు  స్వర్గ ద్రష్ట  విశ్వామిత్రుల దృష్టి దాటక పోబట్టే బాలరామయ్యను మేలుకొలుపుతూ సుప్రజా రాముడి కన్న   ముందు ‘కౌసల్య’ మాతను తలుచుకున్నది. అమ్మ కడుపు చల్లంగా ఉన్నంత కాలమే ఏ అయ్యల కలలైనా నిండుగా పండేది. మగాడు ఈ సింపుల్ లాజిక్ మరుగున పడుతున్నందు వల్లనే  స్త్రీలోకమంతా ఇంతలా అల్లకల్లోలంగా తయారవుతున్నది.

కోవెల వంటిదీ లోకం అన్నది కోమలి కోమల భావన.  కానీ ‘మగవాడి దృష్టిలో ఆమె తనువుకు మాత్రమే ఓ వెల! తాను కని పెంచిన మగవాదే తన పాలిట సైతానుగా మారుతున్నందుకు ఆ మాత  వెత. ఆ కలత వల్లనే నెలతలంతా  'ఏ జన్మకీ స్త్రీ జన్మ నీ కొద్దు నా చిట్టి తల్లీ!' అంటూ అంతలా తల్లడిల్లిపోతున్నది అప్పుడూ.. ఇప్పుడు కూడా! 

భారతీయుల దృష్టిలో ఆడవాళ్లకు ఉండే పూజ్యభావన ఎంత  గొప్పగా ఉంటుందో చెప్పడానికని   ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అంటూ ఎప్పుడూ ఒకే శ్లోకాన్ని వల్లెవేస్తాడు బడుద్ధాయి మగవాడు. వేదాలల్లో స్త్రీని దేవతలుగా చూపించడమూ, విద్య, ధన, ధైర్యాలకు స్త్రీలనే దేవతామూర్తులుగా చిత్రీకరించుకోవడమూ మహా బడాయిగా ఎత్తిచూపిస్తాడు కూడాను. రామాయణంలో రావణాసురుడి కన్న ముందు రాముడిని కష్టాల పాల్చేసింది ఆడాళ్లే.. కైకేయి, మంధర, శూర్పణఖ.. అంటూ తన బుద్ధికి తోచిన కుతర్కం ప్రదర్శిస్తాడు కూడాను!మరి కాస్త కావ్య శాస్త్రజ్ఞానం వంటబట్టి ఉంటే ప్రబంధాల నుంచి కూడా ఎంచుకున్న పద్యాలతో లెచ్చర్లు దంచికొడతాడు. ‘సుబ్బరంగా చదువుకోవడానికని వచ్చిన పిల్లోడు చంద్రుడిని చెడగొట్టింది  తార అనే  స్త్రీనే కదా! కృష్టుణ్ని అష్టకష్టాల పాల్చేసిన దుష్టజాతిలో పూతన వంటి స్త్రీ జాతి పాత్రా ఎంతో కొంత ఉంది కదా!  ఆడజాతి అంతా పులుకడిగిన ముత్యాలల్లే బిల్డప్పులు ఇస్తే ఎట్లా?  ఏదో ప్రకృతిని చూసి పరవశించిపోదామని వచ్చిన పిచ్చి బ్రాహ్మడు ప్రవరాఖ్యుడిని వరూధిని వశం చేసుకోడానికి ఎంతలా వేపుకుతినలా? అంటూ అంటూ- సొంటూ లేని శుంథ ప్రశ్నలు లేవదీస్తాడు. జరిగాయో జరగలేదో, జరిగితే ఎంత వరకు నిజంగా నిజాలే  ప్రచారంలోకి వచ్చాయో.. ఇతమిత్థంగా నిర్థారణ కాని కట్టు కథలను పట్టుకుని కొట్టుకు చావడం తప్పించి.. వర్తమానం కట్టెదుట ఆడదానికి అన్ని మతాలలో వాస్తవంగా జరుగుతున్న అన్యాయం గురించి నోరు విప్పడు! 
కామసూత్రాలను శాస్త్రీకరించి బహిరంగంగా  ప్రబోధించినందుకు మహానుభావుడని  మనం  నెత్తికెత్తుకుంటున్నామే వాత్సాయనుడు..  ఆయన అదే కామకళల్లో భర్తల పెత్తనాన్ని ఎట్లా భార్యలు చచ్చినట్లు ఒప్పుకుతీరాలో ఉదాహరణలతో సహా నొక్కి చెప్పిన నిజం ఎవరికీ చెప్పరు ఈ మగవాళ్లు. భర్త తినకుండా భార్య తింటే దోషమన్న దుర్మార్గపు సిద్ధాంతం మొదట లేవదీసిన రుషి ఆ మహాశయుడే! దాన ధర్మాల నుంచి ఏ ఇంటి పని (వంట పని తప్పించి) వరకైనా స్వతంత్రించి చేసుకునే హక్కు ఆమెకు చరిత్రలో ఏ దశలోనూ దఖలు పడిందికాదు. ఒక్క  భర్తనే కాదు భర్త బంధువులను, మిత్రులను, ముఖపరిచయస్తులనయినా సరే ఇంటికి వచ్చినప్పుడు నెత్తిన పెట్టుకు సకల సపర్యలతో ఒప్పించని పక్షంలో ఆమె ఉత్తమమైన ఇల్లాలు కానేరదు కదా.. కొండొకచో శపాలకు గురయిన కథలూ పురాణాలలో బొచ్చెడున్నాయ్. వాటి ప్రస్తావన ఏ మగవాడూ చెయ్యడు. భర్త మోజుపడి మరో వివాహం చేసుకున్నా .. వివాహం కుదరని పక్షంలో ఇంటికే తెచ్చేసుకుంటే ఆ సవతితో సఖ్యంగా ఉండాలి తప్పించి కయ్యానికి కాలుదువ్వే సాహసం ధర్మపత్ని అయినా చేస్తే పుణ్యస్త్రీ బిరుదులు వెనక్కి పీక్కోబడతాయని బెదిరింపులు  ఈ తరహా మొగాళ్ల  నుంచే!
ప్రపంచంలోని అతి పెద్ద మతం క్రైస్తవానికి సైతం స్త్రీ పట్ల బొత్తిగా సదుద్దేశం లేదు. 'స్త్రీ పుట్టుకతోనే పాపి. పాపహేతువు. కేవలం పురుషుడి సుఖ సంతోషాలే ఆ నీచ ప్రాణి  సృష్టి పరమార్థం. స్త్రీని బానిసగా దేవుని వాక్యం భావించిన దానికి ఏ మాత్రం తిసిపోని విధంగా పురుషుడి అన్ని కష్టాలకు మూలకారణం  క్రైస్తవంలో లాగా ఇస్లాం మతమూ గాఢంగా విశ్వసించింది. 

స్త్రీకి బురఖా ఇస్లాం ప్రసాదమే! ప్రార్థనాలయాల ప్రవేశం ఆమెకు నిషిద్ధం. భర్త కోరితే సంగమానికి సిద్ధం కాకపోవడం పాపహేతువు. ఎంత వయసు వచ్చినా భార్యను  శిక్షించే హక్కు భర్తకు ధారాదత్తం చేసేసింది ఇస్లాం మతం. భర్త తలాడించకుండా తనకు పుట్టిన బిడ్డకు అయినా సరే పాలిచ్చే అధికారం భార్యకు కల్పించింది కాదీ మతం. విడిపోయినా సరే భర్త అనుమతి తప్పనిసరి అనడం కన్నా ఘోరం ప్రపంచంలో మరొకటి ఉంటుందా? 

ప్రపంచంలోని దాదాపు అన్ని మతాలలో స్త్రీలు వ్యామోహ కారకులు. కాబట్టి వారి మీద సదా  ఓ కన్నేసి ఉంచడం పురుషుల  తప్పనిసరి బాధ్యతల్లో ఒకటి. ఆడవాళ్లు దున్నబడే భూములతో సమానం. భూముల మీదుండే హక్కు భుక్కుల నియమాలన్నీ స్త్రీలకీ వర్తిస్తాయి కొన్ని మతాలల్లో. లేబుల్ ఏదైనా, కాలం ఎప్పటిదైనా, ప్రాంతం ఎక్కడిదైనా, వైవిధ్యాలు, వైరుధ్యాలు, అంతర్వైరుధ్యాలు ఎన్నున్నా స్త్రీలకు అన్నాయం చేసే అంశంలో అన్ని మతాలు అన్నదమ్ముల వలెనే సహకరించుకున్నాయ్.. సహకరించుకుంటున్నాయి కూడా!

హోలీ బైబిల్  రెండో ఛాప్టర్ ప్రకారం నిద్ర పోయే మగాడి డొక్కలో నుంచి ఓ పక్కటెముక పీకి  ది గ్రేట్ లార్డ్ గాడ్ సృష్టించిందేనట ఆడజీవి. ఆ తరహా  భావజాలమే మన ముత్తాతలది కూడా. మనువులాంటి మగ మహానుభావులంతా చేరి  'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి' అంటూ  సిద్ధాంతాలు చేయబట్టే కదా  మగాడికి ఆ చొప్పదంటు సూత్రాలను పట్టుకుని  తోడు నీడుగా ఉందామని వచ్చే సాటి జీవి ఆడదానిని అన్ని ఆటలు ఆడిస్తున్నది! శేషం వేంకటకవి ‘శశాంక విజయం’లో కోరిక తీర్చమని తన దరి చేరిన గురుపత్ని తారతో ‘వికల చరిత్రు డైన, ముది వెంగలి యైన, గురూపి యైననున్, త్రికరణ శుద్ధిగా మగడె దేవు డటం చని నిశ్చయించి, యొండొక డెటువంటివా డయిన నొప్పదు కోరగ నింతి, కి’ అంటూ చంద్రుడు ద్వారా చెప్పిన నీతి సూక్తులన్న్నీ నిజానికి మగాడి మనసులో యుగాల బట్టి జెండా పాతుకొనున్నవే! ఆడదంటే ఒక్క తనువే అన్నట్లు మనువు  లాంటి దుష్ట మేధావులు ఈ తరహా  ధర్మపన్నాలు పదేపదే వల్లించడ వల్లనే ఆడవాళ్లకు  ఏ దశ లోనూ స్వేచ్ఛ అనేదే బొత్తిగా లేకుండా పోయిందన్నది  స్త్రీవాదుల మండిపాటు. 
మరను, యంత్రాన్ని  కనిపెట్టక ముందే ‘మర-మనిషి’ని కనిపెట్టింది ప్రపంచం. మగప్రపంచం కనిపెట్టిన ఆ మర-మనిషి పేరు ఆడది. ఆడదిగా పుట్టినందుకు, చీరె కట్టడం నేర్చిందాకా పుట్టింటికి గొడ్డులా చాకిరీ చేయడం, ఓ మగాడొచ్చి మెడలో పలుపు కట్టేయంగానే తలొంచుకొని వెళ్లి అతగాడి వంశం మొత్తానికి  జీతం బత్తెం లేకుండా శాశ్వతంగా ఊడిగం చేసుకోడం!' మల్లాది సుబ్బమ్మగారి వంటి  స్త్రీ జనాభ్యుదయవాదులు పద్దాకా తిట్టిపోసేదీ మగవాడిని తమకు పగవాడిగా మారుస్తున్న ఈ తరహా పెడవాదనలు ఇప్పటికీ గుడ్డిగా నమ్మి కఠినంగా అమలుచేస్తూ, ముమ్మరంగా ప్రచారం చేసే మగజాతిని మాత్రమే!

'ఎంత రుచి ఆ నిషిద్ధ ఫలానికి/ ఎంత వడి ఆ విముక్త హృదయానికి' అంటారు సినారె  విశ్వంభర ఖండకావ్యంలో నారీ నార సంగమ సుందర దృశ్యాన్ని అభివర్ణిస్తూ! ఇద్దరూ కలసి ఒకే తీరులో  ఆనుభవించే  ఆ సంగమ కార్యపు  తీయని రుచి మగవాడికి  ఒకానొక అనుభూతితో సరి. ఆడదానికి మాత్రం  మంచి.. చెడు.. అన్ని అనుభవాలూ అక్కడి నుంచే  మొదలు! గర్భం ధరించింది మొదలు ప్రసవం అయే వరకు కాబోయే అమ్మ పడే యాతనలేమిటో వాయుపురాణం తిరగేస్తే విశదంగా బోధపడుతుంది. ‘గర్భస్య ధారణే విషమే భూమి వర్త్ముని/ తస్య  నిష్క్రమణార్థాయ , మాతృపిండం దదమ్యాహం' (గర్భం ధరించడమే కష్టం. ఎగుడు దిగుడు నేలల మీద నడవడం అందుకు అదనపు కష్టం. ఆ కష్టం కలిగించినందుకు నీ మాతృపిండాన్ని నేను నీకు నమస్కరిస్తున్నాను) అంటూ ఎదిగొచ్చిన తరువాత  సంతానం తమ తల్లుల ముందు తోచిన  విధంగా  మోకరిల్లవచ్చు.  తన బిడ్డ పుట్టుక కోసం యమద్వారం ముందుండే మహాఘోరమైన వైతరణీ నదినైనా తరించేందుకు  సాహసించిన స్త్రీ అప్పట్లో నష్టపోయిన జీవితానుభవాలకు పరిహారం చెల్లిందెవరూ? 

భావుకతను రేకెత్తించే కవిత్వాలకేం గానీ.. వాస్తవంగా చూస్తే దేశంలోని స్త్రీ పురుష జనాభా నిష్పత్తి లెక్కలే ఆడవారి పట్ల మగజాతి ప్రదర్శించే ద్వంద్వవిలువల  వ్యాపార దృక్పథాలకు వికృత ఉదాహరణలు. పుట్టాలంటేనే 'చావు గండం' నుండీ గట్టెక్కాల్సిన గడ్డు దుస్థితి ఒక్క ఆడ గుడ్డుకే ఈ గడ్డన ఇప్పటికీ! తప్పీ దారీ భూమ్మీద పడ్డా.. తప్పుదారిలో నడిచే మగప్రపంచాన్నుంచి ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకునే దారులు దేవులాడుకోవడమే తప్పించి నేటికీ ఇంటా బైటా వయసుతో నిమిత్తం లేకుండా ఆడది ఎదుర్కోక తప్పని దైన్యస్థితి.

తన జీవితాన్ని తనకై  తానుగా అచ్చు  మగవాడి హక్కులతో సమానంగా బతికే మంచి రోజులు ఆడదానికి ఎప్పుడు లభిస్తే అప్పుడే ఏటేటా జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు అంతిమ లక్ష్యం 
- కర్లపాలెం హనుమంతరావు 
(సూర్య  దినపత్రికలో ప్రచురితం ..మార్చి 8, మహిళా దినోత్సవ సందర్భంగా )  

***


Saturday, January 11, 2020

సంక్రాంతి సౌరభాలు- సూర్య దినపత్రిక- 'సరదాకే’ ఆదివారం శీర్షిక - కర్లపాలెం హనుమంతరావు



                                      పండుగ పేరు చెవిన పడితేనే చాలు మనసులో అదో వింత వెలుగు. రసానుభూతిని పెంచే ప్రతీ సందర్భమూ నిజానికి ఓ పండుగే! సాంప్రదాయకంగా జరుపుకునే పండుగల ఆనందం అందుకు అదనం. దేశమంతటా ఏదో ఓ సందర్భంలో వేరే వేరే పేర్లతో అయినా సరే వైవిధ్యభరితంగా జరుపుకొనే వ్యవసాయ సంబరాలలో సంక్రాంతిది మొదటి స్థానం. తెలుగువారికి అదనంగా ఇది పెద్దల నుంచి పశువుల దాకా అందరినీ  స్మరించుకొనే పెద్దపండుగ కూడా!
పుష్యమాసం ఆరంభంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే  శుభసందర్భాన్ని ధనుర్మాస ప్రారంభంలోనే  'నెల పట్టండహో!' అంటో దండోరా వేసుకుంటూ వచ్చే పెనుపండువు(శ్రీనాథుడి ప్రయోగం) సంక్రాంతి పండుగ.
తొలి జాము చలిని సైతం లెక్కచేయకుండా ముగ్గుబుట్టలతో ముంగిళ్ల ముందు  ముద్దుబొమ్మలు రంగవల్లుల రంగంలోకి దిగిపోయేది ఈ నెలలోనే! ముగ్గంటే ముగ్గు కాదు. చుక్కంటే చుక్కా కాదు. ఖగోళశాస్త్ర గ్రహాల సంచార రహస్యాలను ఇంటి ముంగిళ్ల ముందు ముదిముత్తైదువులకు మల్లే ఈడొచ్చిన ఆడపిల్లలు పరిచి మరీ ప్రదర్శించే బ్లూ-ప్రింట్లు! క్రిమి సంహారక గుణాలు ప్రకృతిపరంగా సిద్ధించిన గోమయం(ఆవుపేడ)తో కలాపులు ల్లి, చీమల్లాంటి చిట్టి పొట్టి జీవాలకు పెట్టే గోరుముద్దలకు మల్లే బియ్యప్పిండితో కళలుట్టి పడేలా కోలాలు  తీర్చిదిద్దుతారు కోమలాంగులు. గుమ్మడి, గన్నేరు, చామంతి వంటి పూబంతులకు తోడు పసుపూ కుంకుమలద్ది అలంకరించిన గొబ్బిదేవతల చుట్టూతా చేతులు తట్టుకుంటూ సాయం సంధ్యల్లో 'సుబ్బీ గొబ్బెమ్మా! శుభమూ నీయవే! మొగలి పూవంటి మొగుడు నీయమే'  అంటూ అరవిరసిన మందారాల వంటి చేతులతో గొబ్బి తట్టే దృశ్యాలు.. అబ్బబ్బ! అబ్బాయిలకే కాదు.. అబ్బాయితనం గడచిపోయిన ముదుసళ్లక్కూడా చూసేందుకు వెయ్యి కళ్లున్నా చాలేవి కావు.
'కోడితో మేలుకొని, తానమాడొ, నుదుట/
దిరుమణియు, తిరుచూర్ణము తీర్చిదిద్ది/
యొక్క కేలను దంబఱ నొక్కకేల/
జిఱుతలం బూని వీధు వీధుల దిరిగి/
'రంగ రంగా'యటంచు ' గోవిందనామాలు కొట్టే సాతాని జియ్యరు సాక్షాత్ శ్రీహరి అవతారాన్ని కళ్లకు కట్టిస్తాడు! అతగాని శిరం మీద కొలువైన కూష్మాండ(గుమ్మడి కాయ ఆకారంలో ఉండే) పాత్ర భూమాత సంక్రాంతి పర్వదిన అవతారం! చిన్నారి చిట్టి చిట్టిగుప్పెట నిండా భిక్ష పట్టించి అక్షయపాత్రలోని అన్నపూర్ణాదేవిని సేవించుకోడం ఏ గోవర్థన గిరిధారినీ ఉద్ధరించడంగా అనుకోరాదుట. బువ్వ పెట్టే భూదేవి అవ్వ నోటికి వ్వంత కబళం అందించి  కృతజ్ఞత తెలుపుకునే భారతీయుల సత్సంప్రదాయమదని పెద్దల మాట! పట్టుశాలువతో మహాపండితుడికి మల్లే సన్నాయి బృందాన్ని వెంటేసుకొని గడపగడపా తడుముతూ ఈ అయ్యగారికి ఓ దండం, ఆ అమ్మగారికి ఓ దండం అడగకుండానే తడవతడవకీ తలాడించుకు పెట్టే గంగిరెద్దుదీ ఏ సరదా ఆట కాదుట! సాక్షాత్తూ ఆ గంగాధరుడి పండుగ సంబరాల  పర్యాటనట. పాడిపంటలకు అత్యవసరమైనవి జలధాన్యాలు. ఆ రెండింటినీ తలలపై మోసుకుంటూ శివకేశవులు నేల మీద పండుగ నెలరోజులూ తిరగాడుతున్నారు కాబట్టే తిండిగింజలకు ఏ మాత్రం లోటు లేకుండా లోకమిలా చల్లంగా సాగిపోతోందని పెద్దల కాలం నుంచి వస్తున్న ప్రగాఢ విశ్వాసం.
సకాలంలో నాట్లు పడి, పంట పుష్కలంగా దిగబడి, క్షేమంగా ధాన్య సంపద ఇంటి గాదెల్లోకి చేరిన శుభసందర్భంలోనే పౌష్య సంక్రాంతిలక్ష్మి శుభాగమనం గమనార్హం. ధాన్యాగారంలా కర్షకుడి గుండె కూడా నిండుగా నిర్మలంగా ఉంటుందీ పండుగ నెలరోజులు! ఏడాది పొడుగూతా పడిన సాగుకష్టానికి తగిన ఫలితం దక్కిందన్న సంతృప్తి పదిమందితో కలసి పంచుకుంటే పదింతలవుతుందనుకునే  మంచి బుద్ధి మొదటి నుంచి ఈ భూమినే నమ్ముకున్న అన్నదాతది. ఆ సంతృప్తి సంబరాల రూపమే శుభ సంక్రాంతి!
సంక్రాంతి అంటే  ఆటవిడుపు కూడా. ఏ మూల చూసినా పల్లెపట్టుల వైపు కోడి పందేలు, కోడె దూడల పరుగు పందేలు, చిన్నపిల్లల గాలిపటాల  మధ్య పోటా పోటీలు  సాగు విరామసమయంలో పల్లెలు సేదతీరే విధానాలు మనోహరాలు.
'అంబ పలుకు జగదంబా పలుకు/
కంబుకంఠి  ఓ కాళీ పలుకు/
కంచిలోని ఓ కామాక్షీ పలుకు' అంటూ ముక్కోటి దేవతల మధుర వాక్కులను తన డుబుడుక్క శబ్దంలో వినిపించే బుడబుక్కలవాడి నుండి- విశ్వశంభుడిని తన కాశీచెంబులోనికి కుదించి కాణీ ఆశించకుండానే ఆశీర్వాదాలు అందించే పురోహితుల దాకా ఈ పండుగ నెలరోజులూ ఏ మారుపల్లెలో విన్నా విష్ణ్వాలయ ధ్వజస్తంభం  నుంచి వినిపించే జయ జయ విజయధ్వానాలే! నిజానికి ఇవన్నీ శ్రామిక కృషీజన విజయాలకు వైజయంతీ గానాలని అంటారు కరుణశ్రీ ‘సస్య సంక్రాంతి’లో. ముందు చావిళ్ల నుంచి గొడ్ల చావిళ్ల దాకా  ఒక్క గజమైనా వదలక గోడలకు  వెల్లవేయించిన ఇళ్లు మహేంద్రైరావతాలని మించి మురిపిస్తుంటాయి గదా! కవి భావన ఎంత కమనీయంగా ఉందో!
హాని కలిగించే క్రిమికీటకాదుల సంహారానికని పరగడుపునే రగిలించే చలిమంటలు సంక్రాంతి పండుగ సంబరాల తొలి ఘట్టం. ఏడాది పొడుగునా ఇంటి నలుమూలలా పేరుకున్న చెత్తా చెదారమంతా చలిమంటల పరశురాముడికి పసందైన పండుగ  విందు. కొత్త ఏడు గడపలోకి కుడిపాదం మోపి ముందుగా ప్రవేశించే ముగ్ధ పౌష్య సంక్రాతి. ఆ లక్ష్మికి పట్టే దివ్యమంగళ హారతులు ఇంటి ముంగిటిలో రగిలే చలిమంటలని మరో కవి భావన.
తూర్పున తెలతెలవారుతుండగానే అభ్యంగన స్నానమాచరించి, నూత్న వస్త్రాలతో కొత్తకుండలో కొత్తబియ్యం, కొత్తబెల్లం, పాలు, నేయి కలగలిపి వండిన మధురాన్న ప్రసాదం ప్రత్యక్షనారాయణుడికి నివేదించి, ఆనక ఆరగించడంతో పండుగ సంబరాలు పంచుకోడం ఆరంభమయినట్లే! భోగినాటి సాయం సంద్యవేళల్లో బాలభగవంతులకు ఇరుగు పొరుగు పేరంట్రాండ్ల సాక్షిగా రేగుపళ్లతో చేసే అభిషేకోత్సవం  మరో ముచ్చట. ఆంధ్రాప్రాంతాలలో స్త్రీలు తమ సృజనాత్మకనంతా రగంరించి తీర్చి దిద్దే బొమ్మల కొలువులు మరో అద్భుత  కోలాహల ప్రదర్శన. సీతారాముఅ కళ్యాణాన్ని ఆశీర్వదిస్తూ ఎదురుగా రావణబ్రహ్మ, రాధాకృష్ణుల సరాగాలాను ఆస్వాదిస్తూ వెనకనే సత్యభామ! సహజ వైరాలన్నీ పక్కన పెట్టి ఒకే వరుసలో బారులు తీరిన పులీ-మేకా, పామూ-ముంగిసా.. సహజీవన సౌందర్యానుభూతులను చాటి చెపుతుంటాయ్ బొమ్మల కొలవుల్లో. మనుషులూ దేవుడు చేసిన బొమ్మలే కదా! ఆ మర్మం మరుగున పడినందునే మనిషి మనిషికీ మధ్యన ఇన్ని మద మాత్సర్యాల పొరలు! మాకులా కలసి మెలసి ఉంటేనే కలదు సుమా కలకాలం సుఖశాంతులు’ అంటూ నోరులేని బొమ్మలు  సందేశమందిస్తున్నా.. బుద్ధి కలిగిన మనుషలం మనమే ఎందుకో అర్థం చేసుకోం!
దేహం. కుటుంబం, సంస్కారం. సంస్కృతి, ఆస్తీ, అంతస్తూ .. అన్ని సంపదలూ కోరక మునుపే వారసర్వంగా ఇచ్చిపోయిన పెద్దలను స్మరించుకునే అవకాశం పండుగ రెండోరోజు. ఎక్కడెక్కడో రెక్కల కష్టం మీద రోజులు వెళ్లబుచ్చే కుటుంబ సభ్యులందరూ సకుటుంబ సపరివార సమేతంగా ఒకే చూరు కింద చేరి సరదాలు, సరసాలు, విందులు, వినోదాలు జరుపుకునే సందర్భం చూసి సంబరపడాలని అంబరం నుంచి పితృదేవతలంతా కిందకు దిగివచ్చే శుభఘడియలుట ఇవి.
'లేగడి పాలలో గ్రాగి మాగిన తీయ తీయ కప్పుర భోగి పాయసంబు/
చవులూరు కరివేప చివురాకులో గుమగుమలాడు పైర వంకాయగూర/
అరుణ కూస్తుంబరీ దళ మైత్రిమై నాల్క త్రుప్పుడుల్చెడు నక్కదోస బజ్జి/
కొత్త బెల్లపు దోడికోడలై మరిగిన ముదురు గుమ్మడి పండు ముదురు పులుసు/ జిడ్డు దేరిన వెన్నెల గడ్డపెరుగు/
గరగరిక చాటు ముంగారు చెఱుకు రసము/
సంతరించితి విందు భోజనము సేయ/
రండు రండ'ని ఇంటిల్లిపాదినీ సంక్రమణ లక్ష్మి విందుకుడుపులకై ఆహ్వానమందిస్తుంటే 'కాదు.. రామ'ని మారాములు చేయడం ఎంత నిగ్రహాత్మారాములకైనా  సాధ్యమయే పనేనా? కాకపోతే తృప్తిగా తిని త్రేన్చే ముందు  మనకింత సంపత్తినిచ్చిపోయిన పితృదేవతలకు తృప్తిగా నువ్వులూ నీళ్లూ కలపిన మంత్రపూర్వక తర్పణాలను సంతృప్తిగా అర్పించుకోడం విధాయకానికే కాదు.. విధి నిర్వహణకు కూడా!
'అత్తవారింట విందులటన్న/ భార్య వాలుజూపు కోవులె గాని. వారు పెట్టు పంచభక్ష్యములనుకొని భ్రాంతి పడవద్ద'ని 'సంక్రాంతి' లో కవితలో పింగళి -కాటూరి వారి సందర్భానుసారంగా సందేశమందిస్తారు. అదనపు కట్న కానుకల కోసం ఇంటి ఇల్లాళ్లను కాల్చుకు తింటున్న ఈ కాలపు కాసు రాకాసి మూకల చెవులకూ కాస్తంత కవుల వాక్కుల్లోని పరమార్థం సోకడం అవసరం. పండగకు వచ్చిన కొత్తదంపతులకు ఉన్నంతలో పెట్టుపోతలు చేసి మనసారా 'వచ్చే సంక్రాంతికి/ గుమ్మడి పండంటి కొడుకును ఎత్తుకోమ'ని అత్తమామలు ఆశీర్వదిస్తే 'కొడుకుపై ప్రేమచే చెడిపోయె కురురాజు/ కొడుకుపై మమతతో కుమిలిపోయెను కైక/ అబ్బాయి వలదండి అమ్మాయి కావలెనండి' అంటూ కరుణశ్రీ  స్వర్ణసంక్రాంతిలోని ఇంటల్లుడు అభిలాషించడం అభినందనీయం. పుట్టింది ఆడబిడ్డనగానే కట్టుకున్న ఇల్లాలిని పుట్టింటనే వదిలెళ్ళిపోయే ప్రబుద్ధులు అందరకూ బుద్ధి చెప్పే సుద్ది కూడా ఇది! దక్షిణాయన కురుక్షేత్ర యుద్ధంలో నేలకొరిగిన భీష్మపితామహుడు సద్గతుల కోసం ఉత్తరాయన పుణ్యతిథులకుగాను  ఎంతో ఓపికగా అంపశయ్య మీద ప్రాణాలు ఉగ్గబట్టుకుని వేచిచూస్తాడు వ్యాస మహాభారత కథనం ప్రకారం. పితృదేవతలనంతా అదే మార్గంలో స్వర్గధామం చేర్చే  తర్పణాలు అర్పించుకునే గొప్ప కౌటుంబిక సంస్కృతి ప్రపంచం మొత్తంలో ఒక్క భారతీయుల పర్వదిన సంస్కృతులకే సొంతం! బతికుండగానే తల్లిదండ్రులను గొడ్లకొష్టాల పాల్చేసే గొడ్డుమోతు సంతుకు సంతర్పణల్లోని వైశిష్ట్యం అంతుపడితే ఎంత బావుణ్నో! పితృ, మాతామహులు నరకయాతనల నుంచి  విముక్తి పొందే ఆనంద సందర్భం కాబట్టే ఆబాలగోపాలం ఎంతో సంతోషంతో   మకర సంక్రాంతికి మూడో రోజున గాలి పతంగులతో మనసారా కృతజ్ఞతలు తెలుపుకోవడం!
మూడో రోజు పశువుల పండుగ, కనుమ. దుక్కి దున్నడం నుంచి ధాన్యం గాదెల కెక్కించడం దాకా అన్నదాతకు అన్నదమ్ములకు మించి అన్నిందాలా సాయమందించేది పశుజాతే! కొట్టినా తిట్టినా పట్టించుకోదు. గడ్డీ గాదం పెట్టినా కిమ్మనకుండా గొడ్డుచాకిరీ చేసే గొడ్డూగోదాకు ఏడాదికి ఓ రోజైనా ఆటవిడుపు అవసరమే కదా! చేసిన సాయానికి ఘనంగా కృతజ్ఞతలు చెప్పుకోవడమే కనుమ వెనుక ఉన్న మర్మం! పశువులను పరిశుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో దేవుళ్లకు మల్లే అలంకరించి, కడుపారా గడ్డి, మనసారా కుడితి నైవేద్యాలుగా అర్పిస్తే బసవరాజుల భుక్తాయాసం, గోమాలక్ష్ముల ఆశీర్వాదం, ముందొచ్చే ఆరుగాల సేద్యానికి మేలుచేస్తుందని రైతన్నల భక్తి, విశ్వాసం.
పితృదేవతల ప్రీత్యర్థం వండే గారెలు కాకులు  కడుపారా సేవిస్తే పైనుండే పెద్దల ఆశీస్సులూ తమకందినట్లేనని ఓ భావ భారతీయులకు. కనుమ నాడు కాకైనా కదలదని సామెత. కడుపు సరిపడా ఆహారం కంటి ముందరే కనపడుతుంటే ఏ కాకైనా ఎక్కడెక్కడికో ఎందుకు ఎగిరిపోతుంది? ముక్క లేనిదే పండుగేమిటని పెదవులు విరిచే ఆహారప్రియుల ఆత్మారాముల శాంతి కోసమే నాలుగో రోజు నాటి ముక్కనుమ సంబరం.
కాలం పెనువేగంగా మారుతోంది. పోటీ వినా జీవితమే లేదనుకునే భావన పెరుగున్న కొద్దీ వ్యక్తిగత విరామ సమయమూ కుదింపుకు లోనవుతోంది. కాలాన్ని కాసులతో తూచే కలికాలంలో తీరుబడిగా నెలరోజుల పాటు సంబరాలు జరుపుకుంటూ నష్టానికి సిద్ధపదేదెవరూ? పండుగ మూణ్నాళ్లే బంధు మిత్రులతో సందడిగా గడపేందుకు సామాన్యుడికి గంపెడన్ని కడగండ్లు! చీకాకులు కాస్తింత సేపు పక్కకు తోసేసి పండుగ వంకనైనా పుట్టి పెరిగిన పల్లె వంకలకు తొంగి చూస్తే  ఎంత తెరిపో పట్నవాసులు  తెలుసుకోవడం ఆరోగ్యానికి అవసరం అంటున్నారు వైద్యులు కూడా! ఇన్స్టాంట్ ముగ్గులు, ప్లాస్టిక్ గొబ్బెమ్మలు, డొక్కలు ఎండిన బసవన్నల పక్కన నిలబడి అపస్వరాలతో  వినిపించే దండాల దండకాలు అపార్టుమెంటు దండకారణ్యంలో అందుకునేదే అయ్యవారు?  కిలో రెండొందలు  దాటి బెల్లం పలికే కరువు రోజులు! ఇంటిల్లిపాది పండుగ  పొంగలి ఎంగిలి పడేందుకు ఇంటి మాలక్ష్మి పడే   యాతనను ఏ బరువు రాళ్లు తూచగలవు? పెంట్ హౌస్ టాపుల పైన చేరి పిల్ల సంచు సందడిగా ఎగరేసే గాలిపటాలు ఏ సెల్ టవర్లకో, కరెంట్ తీగలకో తగలకుండా గడిస్తే అదే సగటు కుటుంబానికి పెద్దపండుగ! బతికున్న తల్లిదండ్రులకే  ఇంట ఏ మూల చోటు చూపించాలో తోచని బడుగు సంసారికి తాతల తాతలకూ తిలోదకాలంటే తలకు మించిన క్రతువే! నిన్న మొన్నటి వరకు అన్నిటికీ తానున్నాననన్న పెద్ద మనసు పొరుగింటి అన్నది! పండుగ చక్కిలాలతో సంబరాలు పంచుకొందుకు ఈ పూట తలుపు తడితే 'సకినాలు' తప్ప  నోటికి మరేదీ హితవనిపించవు' అంటూ సకిలించేస్తుండె!గుండె గుండెకూ మధ్య రోజుకో కొత్త కొండను లేపే పాడుకాలం అంతు చూస్తేనే లోకానికి అసలైన పెద్దపండుగ.
సేద్యమంటే ప్రకృతిశకుని మామతో రైతన్నాడక తప్పని మాయదారి జూదం. ఏరువాక  అంటేనే రాబోయే యుద్ధపు రాక. జవాను మాదిరి అరకోలు పట్టుకుని సాగు పోరుకు కిసాను గడప దాటితే ఇల్లాలు కన్నీటి చెరువు చీరె చెరుగులో దాచుకుని ఎదురెళ్లే దారుణ పరిస్థితులిప్పట్టివి.
జీవనదులు ఎన్నున్నా చేవలేని చౌడుల పైనే   ఇంకెత కాలం నాగలి  పోరు? విత్తనాల నుంచి ఎరువుల వరకు అన్నింటా కల్తీ, కరువు. ముద్ద పెట్టే రైతన్న మద్దతు ధరల సాధనకై ముష్టియుద్ధాలకు దిగడమా! ముఖ్యమంత్రులు, ప్రధానులతో ఎన్నికల బరిలో నిలబడి పోరడమా! చేతులారా పెంచిన పంటకు చేజేతులా నిప్పటించడం.. బురద మళ్లలో పొర్లి పండించిన కాయను ధరలేక నడిరోడ్ల మీద కుమ్మరించడం! పొలాలకు గొళ్లేలు బిగించినా పట్టించుకే నాథుడు కనిపించడే! కళ్లేల  నుండి.. అంగళ్ల దాకా అన్ని యుద్ధక్షేత్ర్రాలలో  అన్నదాతకు కర్ణుడికి  మించిన పరాభవాలే. బ్యాంకు రుణాల నుంచి సరళీకృత విధానాల వరకు  సంక్లిష్టమైన సాలెగూళ్లన్నింటి  మధ్యన  ఓటమి ఖాయమని తెలిసీ పోరాటమాపని  అసలు సిసలు  నిస్వార్థ నిబద్ధ కర్మయోధుడు  దేశం మొత్తాన ఒకే ఒకడు! ఆ ఒక్క  సేద్యగాడూ కాడి కింద పడవేస్తే  పుష్యమాస సంక్రాతి శోభలిక సమ్మేళనాలలో మాత్రమే కవుల గళాలలో  వినిపించే మంగళ గీతాలుగా మిగిలేది!
రూపాయికి కిలో బియ్యం అందించే ప్రభువులు విత్తనాలకు, ఎరువులకు రాయితీలు ఎందుకు కల్పించరో?! అదనుకు జలాలు సమృద్ధిగా  పొలాలకు అందించేందుకు  ప్రభుత్వాలకు ఎందుకు చేదో?! పెరిగే రైతుకూలీ రేట్లకు ప్రత్యామ్నాయ విధానమేది?  యంత్రాల బాడుగ ధరల వరకైనా ప్రభువులు దయచూపిస్తేనే గదా బడుగు రైతు  సాగుబడి సాగిలపడకుండా ముందుకు సాగేది! పటిష్ట మార్కెట్ వ్యవస్థ, పారదర్శక పంటల బీమా, చీడపురుగుల నివారణలకు తోడు అగ్రిక్లినిక్కులు, ఉత్తేజపరిచే సాంకేతిక సమాచారం వంటి ఎన్నెన్నో పథకాలు  ఎప్పటికప్పుడు ఏదో ఓ రూపంలో రైతన్నకు అందేందుకూ రూపాయల లెక్కలా?! 
రాష్ట్రాల అంశమా, కేంద్రం అంశమా అన్నది కాదు.. రైతాంగం సమస్య యావద్దేశానికీ  అత్యంత ప్రధానాంశం! విపత్తులో ఉన్నాయన్న మిషతో లక్షల కోట్ల ప్రజల సొత్తు డీలాపడే డొక్కు సంస్థలకు ధారాదత్తం చేస్తున్నప్పుడు.. ఏ వైభోగంతో   ప్రాభవంగా వెలుగుతోందని  వ్యవసాయరంగానికి పైసా  సాయమందకపోవడం? ఉత్తుత్తి సానుభూతి వచనాలు కురవని నైరుతీ రుతుపవనాలు! ఓటి కమిటీలు, ఓటు కుండలు సామెత! వేదికల పైన జరిగే వాదనలు రైతు వేదనలను ఆర్చవు తీర్చవు. కాడి ఇంకా నేల మీద పడలేదంటే అది అన్నదాతలోని అమాయకత్వం కాదు. అమ్మతనం! కృషీవలుడు కదిలే కన్నీటి మేఘంలా ఉన్నంత కాలం సంక్రాతి లక్ష్మి మొహంలో  సరదాకైనా కళాకాంతులు  కనిపించవు! పాలన  పొలాల వైపుకు పరుగులెత్తినప్పుడే కరుణశ్రీ 'స్వర్ణ సంక్రాంతి'లో ఆశ్వాసించినట్లు 'సస్య సంపదలతో' దేశమంతా సంబరంగా సంక్రాంతులు చేసుకునే వీలు!
-కర్లపాలెం హనుమంతరావు  
(‘సరదాకే’ శీర్షిక - సూర్య దినపత్రిక   ఆదివారం, 12 -01 -2020 )
***





  



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...