Showing posts with label celebrations. Show all posts
Showing posts with label celebrations. Show all posts

Friday, February 12, 2021

ఆచార్యదేవోభవ! కర్లపాలెం హనుమంతరావు -ఈనాడు ప్రచుర్తితం

 



'గురువూ, దేవుడూ ఒకేసారి కనిపిస్తే ముందు నేను గురువుకే నమస్కారం చేస్తాను. దేవుడిని నాకు ముందు చూపించినవాడు గురువే కదా!' అంటాడు షిర్డీ సాయిబాబా

యుద్ధరంగం మధ్య విషాదయోగంలోపడ్డ అర్జునుడికి 'సుఖదుఃఖే సమైకృత్వా' అంటూ గీతోపదేశం చేసిన శ్రీకృష్ణుడిని మనం 'జగద్గురువు'గా భావిస్తాం. అద్వైతబోధ చేసిన ఆదిశంకరులు మరో జగద్గురువు. రాయికి రూపం ఇచ్చేవాడు శిల్పి. శిష్యుడికి రూపం తెచ్చేవాడు గురువు. 'గు' అంటే చీకటి, 'రు' అంటే పోగొట్టేది. అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువే కనకే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తరవాత పూజనీయుడవుతున్నాడు. గురువును పరబ్రహ్మ స్వరూపంగా సంభావించే సంప్రదాయం మనది.

అధర్వణ వేదంలోని శిష్టాచార సంప్రదాయం ప్రకారం- చదువుకు కూర్చునే ముందు శిష్యుడు ఇష్టదేవతా ప్రార్థన తరవాత 'స్వస్తినో బృహస్పతిర్దదాతు' అంటూ గురువును స్మరించే విధానం ఉంది. మహాభారతం అరణ్యపర్వంలో యక్షుడు 'మనిషి మనీషి ఎలాగవుతాడు?' అనడిగినప్పుడు- 'అధ్యయనం వలన... గురువుద్వారా' అని సమాధానం చెబుతాడు ధర్మరాజు.  అందరూ ప్రణామాలు చేసే ఆ శ్రీరామచంద్రుడు కూడా విశ్వామిత్రుడి ముందు చేతులు జోడించి నిలబడి ఉండేవాడు. సమాజంలో గురుస్థానం అంతటి ఘనమైనది కనకనే శ్రీకృష్ణుడు చదువుచెప్పిన సాందీపునికోసం అతని మృతశిశువును తిరిగి తెచ్చేందుకు అంత లావు శ్రమ తీసుకున్నది!.

 గురువును గౌరవించటం రానివారు జీవితంలో రాణించలేరనటానికి కౌరవులే ప్రబల  తార్కాణం.చిన్నతనంలో విద్యాబుద్ధులు చెప్పిన గురువును ఔరంగజేబుకూడా చక్రవర్తి అయిన తరవాత దారుణంగా అవమానించాడు.

క్రీస్తు పుట్టుకకు మూడు శతాబ్దాల ముందే మహామేధావి అరిస్టాటిల్‌ ఏథెన్స్‌లో ఒక పెద్ద విశ్వవిద్యాలయన్నే స్థాపించి అలెగ్జాండర్‌లాంటి విశ్వవిజేతను తయారుచేశాడు. అదేదారిలో చంద్రగుప్తుడిని తీర్చిదిద్దిన మహాగురువు మన కౌటిల్యుడు.  కృష్ణదేవరాయలుకు తిమ్మరుసు మామూలు మంత్రేకాదు, గురువు కూడా. మనిషి భూమిమీద పడిననాడే బడిలోపడినట్లు లెక్క. ఇంటివరకూ తల్లే ఆది గురువు. తల్లితండ్రులు ప్రేమపాశంచేత కఠిన శిక్షణనీయలేరు గనక గురువు అవసరం కలిగింది. గురుకుల సంప్రదాయంలో మహారాజు కుమారుడైనా కౌమారదశలో గురుకుల విద్యాభ్యాసం చేయవలసిందే! మహాచక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు కూడా చెక్కిట పాలుగారే ప్రహ్లాదుడిని మంచి విద్యాబుద్ధులు నేర్పించమని చండామార్కులవారికి అప్పగించాడు.  పాటలీపుత్రాన్ని ఏలే సుదర్శనుడు తన బిడ్డలు విద్యాగంధంలేక అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నారనే గదా వారిని విష్ణుశర్మ అనే పండితుడి వద్దకు విద్య నేర్చుకోవటానికి సాగనంపింది! నాటి చదువులు నేటి విద్యలంత సుకుమారంగా ఉండేవికావు. వేదాధ్యయనం తరవాత పరీక్షలు మరింత కఠినంగా ఉండేవి. నింబ, సారసమనే రెండు పరీక్షలు మరీ సంక్లిష్టం. సామవేదం సంగీతమయం. తలూపకుండా వల్లించటం తలకు మించిన పని. బోడిగుండుమీద నిమ్మకాయ పెట్టుకుని అది దొర్లకుండా వల్లింపు పూర్తిచేస్తేనే పరీక్ష అయినట్లు, అది నింబ పరీక్ష. మెడకు రెండువైపులా సూదులుతేలిన నారసంచుల్ని కట్టి సామగానం చేయమనేవాడు గురువు. తల కదిలితే సూదులు నేరుగా గొంతులో దిగుతాయి! అది నారస పరీక్ష. గురువు మాట వేదవాక్కుగా సాగిన కాలం అది.

మన పురాణాలు, ఉపనిషత్తులు, చరిత్రల్లోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా కూడా గురుప్రసక్తి లేని, గురుప్రశస్తి చేయని సంస్కృతులే లేవు. జార్జి చక్రవర్తి తన కొడుకు 'ప్రిన్స్‌ ఆఫ్‌ వేల్స్‌' చదివే పాఠశాలకు వెళ్ళి కొడుకు ఎలా చదువుతున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు ఒకసారి. చక్రవర్తి వస్తున్నాడని తెలిసి ఆ పాఠాలు చెప్పే పంతులుగారు 'మహాప్రభో! మీరు రావద్ద'ని కబురు చేశాడు. 'ఎందుకయ్యా?' అనడిగితే 'తమరు వస్తే నేను మర్యాదపూర్వకంగా నా తలపాగా తీసి, లేచి నిలబడాలి. ఇంతవరకూ నా విద్యార్థుల దృష్టిలో నేనే పెద్దను. నాకంటే పైన మీరొకరున్నారని తెలిసిపోతే, నా మాట విలువ తగ్గిపోతుంది. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు!' అని విన్నవించుకున్నాట్ట. రాజుగారు మన్నించి అటువైపు వెళ్లటం మానుకున్నారు. అదీ ఆ రోజుల్లో గురువుకిచ్చిన విలువ!

దేవతలకూ గురువున్నాడు బృహస్పతి. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. మృతసంజీవనీ విద్య అతనికొక్కనికే తెలుసు. కచుడు ఆ తంత్రం తెలుసుకునేందుకే శిష్యరికం చేయటానికి వచ్చి చచ్చి బతికిన కథ మనకు తెలుసు. 'ద్రోణ' పేరుతో గురువులకు ఇవాళ బిరుదులిస్తున్నారు. ఆ ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలని తంటాలుపడి భంగపడినా ఆయన పిండి విగ్రహం ముందు పెట్టుకుంటేగాని ఏకలవ్యుడికి ఆ శాస్త్రరహస్యం పట్టుబడలేదు.

బలి అమాయకంగా వామనుడి రూపంలో వచ్చిన విష్ణువుకు సర్వం ధారబోసే ప్రయత్నంలో ఉండగా, శిష్యవాత్సల్యంతో అడ్డుపడి కన్నుపోగొట్టుకున్నాడు గురువు శుక్రాచార్యుడు.

 

గురుస్థానం అంత గొప్పది కనకనే మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం దేశాధ్యక్షుడి పదవికన్నా బడిపిల్లలకు పాఠాలు చెప్పటానికే ఎక్కువ మక్కువ చూపుతున్నాడు. ఓ తమిళ పత్రికలో బాలలకు ఇంటర్వ్యూ ఇచ్చే సమయంలో ఓ చిన్నారి 'చిన్నతనంలో మీరు చాలా కష్టాలు పడి ఓ పెద్ద శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు, రాష్ట్రపతి అయ్యారుగదా! మీ విజయానికి కారణం అదృష్టమా?' అని అడిగితే 'అవును. చిన్నతనంలో నాకు మంచి దారిచూపించే ఉపాధ్యాయులు దొరికిన అదృష్టం' అని బదులిచ్చాడు కలాం. అలాంటి గురువుకి నేటి మన సినిమాల్లో పడుతున్న గతిని చూస్తుంటే దిగులు కలుగుతుంది.

'గురువు' అంటే గుండ్రాయి కాదు అంటాడు ఓ సినిమా కవి. కాదు గుండ్రాయే! మనిషి అజ్ఞానాన్ని, మొండితనాన్ని చితక్కొట్టే గుండ్రాయే నిజమైన గురువు. తాను ఆనాడు 'గోడకుర్చీ' వేయించాడు గనకే మనమీనాడు ఓ 'కుర్చీ'లో కూర్చుని గొప్పగా పనిచేసుకోగలుగుతున్నాం.

 గురువులు అష్టవిధాలు.

అక్షరాభ్యాసం చేయించినవాడు,

గాయత్రి ఉపదేశించినవాడు,

వేదాధ్యయనం చేయించినవాడు,

శాస్త్రజ్ఞానం తెలియజెప్పేవాడు,

పురోగతి కోరేవాడు,

మతాది సంప్రదాయాన్ని నేర్పించేవాడు,

మహేంద్రజాలాన్ని విడమరిచి చెప్పేవాడు,

మోక్షమార్గాన్ని చూపించేవాడు

అని పురాణజ్ఞానం తెలియజేస్తున్నా వాటిని పట్టించుకొనే శిష్యులు ఇప్పుడు లేరు. గురువుకు నామాలు పెట్టే శిష్యులు తయారవుతున్నారు.

దొంగలపాలు కానిది, దొడ్డకీర్తిని తెచ్చేది, పరమ సౌఖ్యానిచ్చేది, భద్రతనిచ్చేది, యాచకులకిచ్చినా రవంత తరగనిది, గొప్ప నిధి అయిన జ్ఞానాన్ని ఇచ్చే గురువును లఘువు చేయకుండా ఉంటేనే ఏ జాతికైనా మేలు జరిగేది.

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు దినపత్రిక సంపాదకీయ పుట ప్రచురితం)

(ఈనాడు, o5-o9-2009)

Tuesday, February 2, 2021

హాస విలాసం -కర్లపాలెం హనుమంతరావు - వ్యాసం




హాసం  ఈశ్వర విలాసంగా సంభావించుకోవడం భారతీయ సంస్కృతిలో ఒక  అంతర్భాగం. 'కారము వాడి చూపులగు, నా-/కారము శ్వేతచంద్రికగు, సం/-స్కారము మందహాసములు, ప్రా-/కారము ప్రేమ సన్నిధి గదా! ..' అనే ఆదిదేవుని  సంస్తుతే ఇందుకొక అందమైన ఉదాహరణ. రావణవధ అనంతరం అయోధ్యలో ఆరుబయట వెన్నెల్లో అఖిలాండ కోటిబ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్రుడు  నిండు కొలువు తీరి కూర్చున్నాడు. సభ పరమ గంభీరంగా ఉంది. అకస్మాత్తుగా లక్ష్మణస్వామి కిలకిలల నవ్వులు! ఎవరికి వారు ఆ నవ్వుకి తమకు తోచిన భాష్యం తలుచుకుని, ఉలికిపాటుకు గురి అవడం తదనంతర కథాపరిణామం.. 'పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్ రోష రాగోదయా/  విరత భ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరుగన్' అంటాడు బమ్మెర పోతన ఆంధ్రమహాభాగవతం నరకాసుర వధ ఘట్టంలో. కృష్ణనారి ఒకసారే సారించిన మందహాసంలో హరి కొక  అర్థం, అరికి మరో అర్థం తోచినట్లు పోతన చెప్పుకొచ్చిన ఆ తీరులోనే నవ్వుకు నూటికి నూరు పైసల నిర్వచనం రాబట్టడం దాని సృష్టికర్త విధాతకైనా అలివిమాలిన కార్యమని తేలిపోతోంది.   చూసే తీరులోనే భేదం. గిరిజాసుతుడి రూపాన్ని పాపం చవితి చంద్రుడు ఏ భావంతో తేరిపార చూసి నవ్వాడో.. పాపం, నిందల పాలయ్యాడు. హాసానికి, పరిహాసానికి మధ్య గల  పల్చటి  కారణంగానే  భారతంలోనూ సాథ్వి పాంచాలి వ్యర్థంగా అపార్థాల పాలయింది. 'నవ్వకుమీ సభలోపల/నవ్వకుమీ తల్లి దండ్రి నాథుల తోడన్/నవ్వకుమీ పరసతితో/నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!' అంటో హాసపరిమితుల  మీదుండే పరిమితుల పైన  సుదతులందరికీ బద్దెన చెప్పిన సుద్దులు  నవ్వులాటకు కాదు.   'కారణము లేక నవ్వును.. ప్రేరణమును లేని ప్రేమ.. వృథరా!' అని ఆ సుమతీ శతక కర్త నిష్కారణంగా నీతులకు దిగడు కదా! కానీ కాలంతో పాటు ఆలోచనల్లోనూ మార్పులొస్తున్నాయి మరి.  'నిష్కారణంగా నవ్వినా సరే సిద్ధించే ప్రయోజనాలు బోలెడు'అంటున్నాయి  నవీనశాస్త్ర పరిశోధనలు. 'నవ్వు నాలుగిందాల చేటు' అనుకోడం అందం, ఆనందం, ఆరోగ్యం మీద ఆట్టే అవగాహన లేని గతకాలపు ఛాందసం నుంచి వారసత్వంగా వస్తోన్న మాట – అని కొట్టిపారేస్తున్నది కొత్త తరం.   

 

సరస రసాల సరసన పీట వేసి హాస్యానికీ ఉత్తమ గౌరవ మిచ్చారు ఆలంకారికులు అప్పట్లో కూడా.  'సహవికృతి వేషాలంకార ధార్ఘ్యలౌల్య కలహాసత్ప్రోలాష..' అంటూ కలగాపులగంగా హాస్యానికేదో పెద్ద నిర్వచనమే ఇచ్చే ప్రయత్నమూ చేసారా మేథావులు. ఆ సిద్ధాంతాల రాద్ధాంతాల గోల మామూలు మనుషులం  మనకెందుకుగ్గాని, మనిషి మౌలికంగా ఆనంద స్వరూపుడన్న  అంతిమ సత్యం ఒక్కటి వంటబట్టించుకుంటే సరిపోతుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నవ్వు రావచ్చు. ఉన్నది లేనట్టుగా చెప్పినా నవ్వు రావచ్చు. సందర్బోచితంగా  సంభాషణలు సాగించినా.. అసందర్భగా సంభాషణల మధ్య తల దూర్చినా.. శబ్దాలు విరిచి పలికినా.. పదాలు అడ్డదిడ్డంగా పేర్చి చదివినా.. చేష్టలు వికృతంగా  అనుకరించినా.. అకటా వికటంగా ఎట్లా ప్రవర్తించినా.. ఏ వంకర టింకర విన్యాసాలు ప్రదర్శించి అయినా.. మందహాసం నుండి అట్టహాసం దాకా  రకరకాల స్థాయీభేదాలతో నవ్వు ముత్యాలను మనసు గనుల నుండి కొల్లగొట్టవచ్చు.  తిక్కన సోమయాజిది తన పాలు భారతంలో నవ్వులను రాసులు రాసులుగా దిమ్మరించిన చతురత.  పిన్ననవ్వు, చిఱునవ్వు, అల్లన నవ్వు, అలతి  నవ్వు, మంద స్మితం, హర్ష మంద స్మితం, ఉద్గత మంద స్మితం, జనిత మంద స్మితం, అనాద మంద స్మితం, అంటూ తొమ్మిది రకాల చిన్ని చిన్ని నవ్వులను; కలకలనవ్వు, పెలుచనవ్వు, ఉబ్బు మిగిలిన నవ్వు అంటో పెద్ద నవ్వులనో  మూడు రకాలను; కన్నుల నవ్వు, కన్నుల నిప్పు  రాలు నవ్వు, ఎల నవ్వు, కినుక మునుగు నవ్వు, నవ్వు గాని నవ్వు, ఎఱ నవ్వు , కటిక నవ్వు,  కినుక నవ్వు అనే మరో  మరో ఎనిమిది రకాలను- వెరసి మొత్తం కాలి, చేతి వేళ్ల లెక్కకు సరితూగేటన్ని హాస విలాసాదులతో వివిధ పాత్రల రసపోషణ  రసఫ్లావితం చేసి 'అహో' అనిపించిన సరసరాజ్య సామ్రాట్టు. కారణాలే ప్రేరణలుగా కలిగి వికసించే హాసవిలాసాదుల వైభవాలను  గురించి కాళిదాసు నుంచి, కృష్ణదేవరాయల వరకూ, శ్రీనాథుని మొదలు.. చిన్నయసూరి దాకా అట్టహాసంగా ప్రస్తుతించిన కవులూ  కోకొల్లలు. ఆయా హాససారస్వ సర్వస్వాన్ని రామాయాణ భారత భాగవతాదులకు మించిన శ్రద్దాసక్తులతో మహాప్రీతిగా ఇప్పటికీ మనం పారాయణం చేస్తూనే ఉంటిమి.  'ప్రపంచ నవ్వుల దినం' ప్రత్యేకత అంతా .. మన సుమతీశతక కర్త చెప్పుకొచ్చిన  'కారణం లేని నవ్వు' మాహాత్మ్యాన్ని గూర్చి మరింత సదవగాహన పెంచుకొనే సందర్భంగా జరుపుకొనేందుకే!

 

గొంతుకోత పోటీలు.. ఉరుకుల పరుగుల జీవితాలు.. ముంచుకొచ్చిన మీదట కానీ  తెలిసి రాని నివారణ లేని పెను రోగాలు. ఆధునిక సంక్షుభిత జీవితం అంతిమంగా అందిస్తున్నవైభోగాల జాబితా చిన్నదేమీ కాదు. కొత్త కొత్త వ్యాధులకు కొత్త కొత్త అధ్యయనాలు.. సరి కొత్త పరిష్కారాలు. అందరికీ అందే ద్రక్షాఫలాలేనా అవి? వీలున్నంత దాకా ఏ మందూ మాకూ జోలికి పోకుండా,  జీవన శైలిలో మార్పులను ప్రోత్సహించే ప్రత్యామ్నాయ చికిత్సలకు ప్రాధాన్యత పెరుగుతోందిప్పుడు క్రమంగా. గుడ్డిలో మెల్ల. నవ్వు నాలుగు విదాల చేటన్న మాట సరికాదు. సరికదా  నవ్వుతో ఆరోగ్యానికి అదనంగా అరవై రకాల మేళ్ళు. ఐదు దశాబ్దాల కిందటే నార్మన్‌ క్విజిన్స్‌  విటమిన్‌ ‘సి’ కు  బదులుగా   నవ్వునూ  చికిత్స  ప్రక్రియగా మలిచాడు.  చాలా అధ్యయనాలలో ఉల్లాసం పరమౌషధంగా రుజువు కావడం విశేషం. సంతోషం. గత శతాబ్దాంతాన భారతీయ యోగా గురువు  డా. మదన్‌ కటారియా ప్రారంభించిన హాస చికిత్సా విధానం బహిరంగ సాముహిక సంబరమే నేటి నవ్వులదినోత్సవానికి నేపథ్యం. ఏ కారణం లేకుండానే నవ్వగలగడం క్రమం తప్పకుండా సాధన చేస్తే చాలు.. ఉద్రిక్తల నుంచి ఉపశమనం, భయాల నుంచి విముక్తి. నవ్వు వల్ల రక్తవాహికలు మరింత విశాలమవుతాయి.   వత్తిడి పెంచే హార్మోన్ల ఉత్పత్తి మందగిస్తుంది., రోగనిరోధక వ్యవస్థ శక్తి పుంజుకుంటుంది, ప్రాణవాయువుకు ధారాళమైన  సరఫరా మార్గం సాధ్యమవుతుంది, నొప్పిని నివారించే ఎండార్ఫిన్ నిలవలు మరింత పెరగుతాయని, ఊపిరితిత్తుల మళ్లీ ఊత్తేజితమవుతాయని, హృద్రోగ సంబంధ వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చనేవి .. చేకూరే వందలాది లాభల్లో కొన్ని మాత్రమే. నిస్పృహకు , నాడీ సంబంధ పీడనలకు, నిద్రలేమికి నవ్వు తిరుగులేని గుళిక కూడా. ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా నవ్వితే  పదినిమిషాలు పడి పడి  వ్యాయామం చేసినంత  లాభం. ముఖసౌందర్యం మెరుగుదలకు, సామాజిక సత్సంబంధాల పెరుగుదలకు నవ్వు ఒక ఆధునిక  జీవన సూత్రం. సూదంటు రాయిలాగా మంచి వారినందరినీ ఓ గుంపుగా చేసే ఆకర్షణ శక్తి హాసానికి ఉంది. కారణాలేమీ అవసరం లేదు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం పకపక నవ్వగలగడం.. ఆహ్లాదకరమైన ఏ చిన్న భావన తోచినా చిరునవ్వుతో హృదయాన్ని, పరిసరాలను  వెలిగించుకో గలగడం హాస దినోత్సవ సంబరాల వెనకున్న స్ఫూర్తి. అందుకు అత్యంత శక్తివంతమైన మంత్రం  మన పెదాల మీదే ఉంది .అదే నవ్వుల క్లబ్  హాస నినాదం ‘హా..హా..హా’ నిదానం.

-     కర్లపాలెం హనుమంతరావు

04 -02 -2021

బోథెల్, యూఎసె


Monday, January 25, 2021

జల తరంగిణి -కర్లపాలెం హనుమతరావు - ఈనాడు దినపత్రిక సంపాదకీయం

 




పంచ భూతాత్మకమే కాదు.. సహ శక్తులతో భిన్నమైన అనుబంధం కలది జలం. వాయువులో నిక్షిప్తం. అగ్నితో శత్రుత్వం. భూమికి బలిమి. ఆకాశంతో చెలిమి. భూమ్యాకాశల మద్య   రాయబారి.    'సృషికర్త పుటక, సృష్టిభర్త పడక,  సృష్టిహర్త సిగ- జలమే'అని ఒక కవి చమత్కార సమన్వయం. అమృతానికైనా.. హాలాహలానికైనా..  జలనిధే జన్మస్థలి. నిప్పు మనిషి కనిపెట్టింది. నీరు మనిషిని 'కని'పెట్టింది. ఒక్క మనిషనేమిటి.. భోగరాజువారు 'కంకణం'లో సెలవిచ్చినట్లు 'సమస్త జీవరాసులకూ నీరే  జీవనాధారం'. 'స్వాదునీరము త్రావి పద్మము కనువిచ్చె/ మోదవీచికలలో మునిగెను ద్విరేఫమ్ము/ ప్రిదిలి బీటలువారు పుడమి చేడియు మేను/ పదనుతో పులకెత్తు' అని 'వర్షారమణి'లో డాక్టర్ పోచిరాజు శేషగిరిరావు కొనియాడిందీ జీవాధారమైన సలిల ధారల గురించే.  అన్నం  లేకపోయినా కొంతకాలం బతకవచ్చు. పానీయం లేకుంటే  ప్రాణాలు నిలబడేది కొన్నిక్షణాలే.  ఉమ్మనీరు మొదలు తులసి తీర్థం వరకు మనిషికి నీటికీ మధ్య గల బంధం అంత బలమైనది. సూది మందుకి.. సూతక స్నానానికి, తల మీదకి.. గొంతులోపలకి.. నీరే కావాలి.  దేవాలయం నుంచి శౌచికాలయం దాకా నీరు తప్పనిసరి. దాహానికి, జీర్ణానికి, రుచికి, సుచికి, అందానికి, ఆరోగ్యానికి, పంటకు, వంటకు, ఇంటికి, వంటికి..నీరు అవసరం లేనిది ఎక్కడ..ఎవరికి?  పితృదేవతల పుణ్యావహనం కోసం భగీరథుడు 'శివజటాజూటాగ్ర  గళిత  హిమమణి మిళిత శీకర కిరీటి గంగ'ను భువికి  దించాడు. కురు పితామహుల కోరిక మేరకు పాండవ మధ్యముడు 'పొగలుమిసి సెగలెగసి అడుగులలబడి మడుగు  పాతాళగంగ'ను  పైకి సాధించాడు. భాగవతంలోని రంతిదేవుని ఉదంతమో?  సర్వసంపదలు దానధర్మాలు చేయడం ఒక ఎత్తు. దారా సుతులతోసహా ఎనిమిది దినాలు పస్తులుండీ  దైవవశాత్తు దొరికిన మధురాంబులను క్షుధార్తుడికి ధారాదత్తం చేయడం మరో ఎత్తు.

జీవ ప్రాదుర్భవానికి నీటి లభ్యతే మూలం.  సేకరణ, రవాణా, విసర్జన.. జీవ రసాయన ప్రక్రియలన్నిటికి నీరే మాధ్యమం. అవయవాల సక్రమ కర్మ నిర్వహణకి  క్రమం తప్పని నీటి నిలవలు తప్పని సరి. ఆరు నుంచి ఎనిమిది  లోటాల కొలతకి  మాత్రం వెలితి పడ్డా శాల్తీ అడ్డం పడటం ఖాయమని ఆరోగ్యశాస్త్ర సూత్రం. జీవవ్యవస్థలో నీటిది విశ్వవ్యాప్త ద్రావణి పాత్ర . రసాయనాలేవైనా సరే కరిగే గుణం నీటి లక్షణం. మూడింట రెండు వంతులు మంచి నీరుంటేనే శరీరానికి వాయుపీడనం నుంచి రక్షణ. 'లోటాకి రెండువేల మేలిమి రకాల ఖనిజాలుంటేనే మంచినీరు కింద లెక్క' అంటున్నారు మానవాళి భవిష్యత్తు మీద పరిశోధనలు  సాగించే ప్రజావైజ్ఞానికులు  స్టాంఫోర్డు విశ్వవిద్యాలయ ఆచార్యులు  జాన్ మెక్కార్థీ. స్వచ్ఛమైన నీటి అవసరాలను  గురించి చాలా వివరాలే సేకరించారాయన. బాలింత దశలో  స్త్రీకి కనీసం ఏడున్నర లీటర్ల నీరు అవసరం. రోజుకు మనిషికి రెండు లీటర్లకు  మించి మంచి నీరు దొరకని పరిస్థితి ప్రస్తుతం ప్రపంచానిది. ఐరాస లెక్కల ప్రకారం రెండువందల యాభై కోట్లమంది నిర్భాగ్యులు పారిశుద్ద్యవసరాలకైనా నీరు నోచుకోవటం లేదు! శిశుమరణాలకు అతి పెద్ద రెండో గండం మురికి నీరే. నీటిరోగాల వల్ల రోజుకు నాలుగున్నర కోట్ల బడి దినాలు నష్టపోతున్నామని అంతర్జాతీయ విద్యా వేదికల  ఆవేదన. ఎదిగిన  బాలికలు చదువులకు దూరమవడానికి, చదువులకు వెళ్ళే పిల్లలు వింత రోగాల పాలవడానికి  పాఠశాలల అపరిశుభ్రతే  ప్రధాన కారణమని  ప్రతి ఏటా  సర్వేలూ మొత్తుకుంటున్నాయి. భూగోళం  వేడెక్కుతున్న కారణంగా హిమనదాలు కరిగిపోతున్నాయి. జీవనదులు తరిగిపోతున్నాయి. నేలమీది నీరు ఆవిరైపోయి తాగునీరు అందనంత ఎత్తుకి ఎగిరిపోతున్నది. 'ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది' అని ఒక తెలుగు చిత్రం పాట. నీటికున్న ఉలికిపాటైనా మనిషికి లేకపోవడమే వింత! నగరాల్లో  బోర్ల ముందు  బిందెల బారులు.  బస్తీళ్లో నీళ్ళబళ్ళ వెనక  పరుగులు. పల్లెపట్టుల్లో ఒక్క నీటిబొట్టు కోసం కోసులు కొద్దీ ప్రయాణాలు. విశ్వవ్యాప్తంగా ఇవే వీధి భాగవతాలు.

తాగుకి, సాగుకి, పాడికి, పరిశ్రమకి..  నీరే మొదటి అవసరం. సీసాలో నింపి వ్యాపారం చేసేందుకూ నీరే ముడి సరుకయింది ప్రస్తుతం! దేశాలు , రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య వివాదాలకీ నీరే కారణం. భూతలం మీద నాల్గింట మూడు వంతులు నీరే.  ఘన, ద్రవ, వాయు స్థితుల్లో విస్తారంగా దొరుకుతున్నదీ నీరే. ఐనా నీటి జాడల కోసం వేరే గ్రహాల వెంట పడాల్సిన దుస్థితి దాపురించిందెందుకు? భావి అవసరాలకి సరితూగే నీటి నిల్వలు భూమ్మీదే  భద్రపరుచుకునే తెలివి ఉండవద్దా?కరవు ప్రకృతి పరంగా ముంచుకొస్తే  ముందస్తు అదుపు  చర్యలు తప్పవు సరే.. మరి మానవ తప్పిదాల మాటేవిటి?రోజు గడిచే లోపు ఇరవై లక్షల టన్నుల చెత్త మంచినీటిని కలుషితం  చేస్తున్నది.యుద్దాలు, రహదారి ప్రమాదాలు,  ఉగ్రవాదుల దాడులు, ప్రాణాంతక వ్యాథులన్నీ కలుపుకొన్నా కలుషిత జలాలవల్ల జరిగే చెరుపుకు సరి తూగటం లేదు. ఎరువులు, పురుగుమందులు ఎడాపెడా వాడకం, బొగ్గు విద్యుత్తుకూ మంచినీరు దుర్వినియోగం.. ఎంత వరకు సమర్థనీయం? నీరు పసిడికి మించి మిడిసి పడుతున్నప్పుడు తరచు మాంసాహార విందులతో మజాలెందుకు?వరి సాగును తగ్గించి  రాగులు, జొన్నలు పండిస్తే సాగునీరు మిగులుతుందని వ్యవసాయశాఖల సూచనలు..చెవిన పెట్టేదెవరు? ఇజ్రాయెల్ దేశ పద్దతిలో బిందుసేద్యమూ   మంచి మందే. పొదుపులన్నిటిని  మింగేసే జనాభాను అదుపు చేసుకోవాలి ముందు. నీటి సరఫరా మెరుగుపడితే ఒనగూడే లాభాలో! 'అపారం' అంటున్నాయి గణాంకాలు. ఆరోగ్యవంతుడి ఉత్పాదకశక్తి స్థాయి  అత్యుత్తమంగా ఉంటుందంటుంది వైద్యశాస్త్రం. బీమా మీద ఆదా అయే నిధులు  నిర్మాణాత్మక విధులకు మళ్ళించుకోవచ్చు.  నీటిని మనిషి  ప్రాథమిక హక్కుగా పరిగణించమనడానికి ఐరాసకి ఇంకా ఇన్ని కారణాలు. తాగునీటి వృథాకి ముంబైలో జైలు శిక్షో.. జరిమానానో ఎదుర్కొనాల్సి ఉంది!   నీటి దుర్వినియోగాన్ని   నేరంగా పరిగణించే దారుణ పరిణామాలు ప్రపంచమంతటా   దాపురించరాదనే ఐ.రా.సా  ముందస్తు జాగ్రత్త. నడుస్తున్న దశాబ్దాన్ని(2005-2015) 'జీవనం కోసం జలం' దశాబ్దంగా, ఏటి అంతర్జాతీయ  జీవవైవిధ్య దినం(మే 22) అంశాన్ని 'నీటి కోసం సహకారం'గా ఐక్యరాజ్య సమితి చేసిన ప్రకటన వెనకున్న పరమార్థం ఇదే.

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సంపాదకీయం కోసం రాసినది)

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...