సెప్టెంబర్- 5. 2016 వినాయక చవితిః ఆ సందర్భానికి ఒక హాస్య
గల్పిక
'వినాయకా! చవితి
శుభాకాంక్షలు నాయనా!'
'ధన్యవాదాలమ్మా! మరి
.. నేనో తొమ్మిది రోజుల
పాటు భూలోకం ట్రిప్పుకు వెళ్ళి రానా? భక్తబృందాలన్నీ ఎదురు చూస్తున్నాయంటూ పొద్దుట్నుంచీ ఒహటే సందేశాలు చరవాణిలో!'
పాటు భూలోకం ట్రిప్పుకు వెళ్ళి రానా? భక్తబృందాలన్నీ ఎదురు చూస్తున్నాయంటూ పొద్దుట్నుంచీ ఒహటే సందేశాలు చరవాణిలో!'
'భద్రం లంబోదరం!
వెళ్ళేది జంబూ ద్వీపం. జెంబో జెట్టులెన్నున్నా పట్టనంత భక్త బృందాలు నీకు! ఈ పాటికే కోట్లకు కోట్లు విరాళాలు పోగయి ఉంటాయ్! నూలు పోగైనా నోచుకోని బీదా బిక్కీ బోలెడంతమందున్నారు
బాబూ నీ భక్త బృందాల్లో! వాళ్లనూ బాది మరీ వసూలు చేసే ఉంటారు 'చందా'మామలు! ధరాతలంమీద ధరలెలా మండిపడుతున్నాయో తెలుసా? నీకేమో
ఇరవయ్యొక్క పత్రుల్లో ఏ ఒక్కటీ తగ్గకూడదాయ పూజా పునస్కారాలకి! తింటానికే ఆకులలమలు
దొరక్క అల్లాడుతున్నారయ్యా అక్కడి బడుగు జనం. ఏం అల్లర్లకు
దిగుతారో.. భద్రం గణపతయ్యా!'
'చిట్టి చట్టిమూసలో
ఇంత మట్టేసి తీసినా నీ ఆకారం మహా సుందరంగా తయారవుతుందే!
అన్నేసి అడుగుల ఎత్తు
విగ్రహాలతో అంత హడావుళ్ళు అవసరమా? కొంతమంది ఎత్తుగడలు కాకపోతే!
ఆ కృత్రిమ రంగుల పులుముళ్లతో నువ్వెంత వికారంగా ఉంటావో? ఓట్లే తప్ప .. కోర్ట్లు..
పర్యావరణాలేవీఁ పట్టించుకోని భక్తుల వల్ల నీ వంటికేమవుతుందో! బెంగగా
ఉంది గణపతీ! జరంత భద్రంగా ఉండాలి నాయనా నకిలీ భక్త బృందాలతో!’
'ఉండ్రాళ్లు..వడపప్పు..
పానకాలు కనిపిస్తే చాలు నీకు వళ్ళు తెలీని
పూనకాలు వచ్చేస్తాయి! కళ్ళు మూతలు పడేవరకు ఆరగించేసి ఆనక నడుం గుండ్రంగా
తయారైందని.. ఏడుపులు!. జీరో సైజు నీ వల్ల అయ్యే పని కాదు గాని.. ఏ ఫిజియోథెరపీ కంపెనీనో నాలుగు ఉండ్రాళ్ళు ఆశ చూపించి తమ తరుఫున ప్రచారం చేయమంటే
‘నో’ చెప్పేసెయ్!
పుసుక్కుమని ఒప్పేసుకొని రాకు. తప్పుడు ప్రకటనల్లో పాల్గొంటే ఐదేళ్ళు జైలు శిక్ష.. అరకోటి జరిమానాట!
కొత్త జామానా నడుస్తోంది గణపతీ కింద..
కాస్తంత కింద చూసుకొని నడుస్తుండీ తొమ్మిద్దినాలు! '
'బాలాపూర్ లడ్డుండల
సైజు చూసి భక్తులంతా కుబేరుడి పుత్రులనుకోవద్దు. పూర్ పబ్లిక్కే ఎక్కువ నీ భక్తుల్లో! నువ్వేదో వచ్చి వరాల వర్షాలు కురిపించేస్తావని మోరలెత్తుకొని ఆబగా ఎదురుచూస్తున్నారు. అరచేతిలో కైలాసం చూపించి రావడం
పచ్చి మోసం. గుర్తుంచుకో! పోయిన చవితికి ఇచ్చొచ్చిన హామీలు ఏ
మేరకు అమలయ్యాయో ఓ సారి పరిశీలించుకో! హక్కుల సంఘాలు ఇప్పుడక్కడ చాలా క్రియాశీలకంగా మారాయి బాబూ! ఏ
ఫోర్ ట్వంటీ కేసుల్లోనో ఇరుక్కోకుండా తిరిగొస్తే అదె మాకు పదివేలు.'
'బలమైన ఏనుగు కనక దాని
తలను నెత్తికెక్కించుకొన్నావనీ.. ఎలుక
బక్కది కాబట్టే కాలుకింద
తొక్కి పెడుతున్నావని బడుగు భక్తులు నీ మీదిప్పుడు చాలా అసహనంగా ఉన్నారని విన్నాను. తొందర పడి
వాళ్ళనేమీ తూలనాడద్దు. పరువు నష్టం కేసులక్కడ రోజుకొకటి పడుతున్నాయి! మా పరువు తీసే పనులేవీ చేసి
రావద్దు వినాయకా. జర భధ్రం!’
'రియో ఒలంపిక్సులో
ఓడొచ్చిన కచ్చలో ఉందిప్పుడు ఆసేతు హిమాచలమంతా! వచ్చే ఒలంపిక్సన్నింటిలోనూ వరస
బెట్టి స్వర్ణాలు తెచ్చే
చాంపియన్సు 'పికింగ్' పనిలో ఉంది
కొత్తగా ఏర్పాటయిన వెతుకులాట సంఘం. నిన్నూ ఉబ్బేసి చేతికో ‘పోల్
జంప్’ గడకర్ర ఇస్తే పొంగిపోయి ఒప్పంద పత్రంమీద సంతకం గిలికి
రాకు! ఆనక మీ చందమామయ్య ఎగతాళ్లకు దిగాడని ఏడవమాకు గణపతీ.. జర భధ్రం!’
'అవూనూ! నీ వంటికింత
సింగారం అవసరమా బంగారూ! భద్రాద్రి సీతమ్మవారి నగా నట్రకే భద్రత లేకుండా పోయిందిట
కింది లోకంలో.. జర జాగ్రత్తరా వినాయకా!'
'చవితి వచ్చీ రాగానే
ఛెంగు ఛెంగున కిందకు
దొర్లుకుంటూ పోతావ్! పోతే పో కానీ.. నీ
మూషికం గుంటూరు ధర్మాసుపత్రిలో చేసిన నిర్వాకం ఇంకా పోలీసు ఠాణాలో విచారణలోనే ఉంది!
కందిపప్పుకు బదులు పసికందుల్ని మెక్కుతార్రా ఎంత తిండిగింజలకి నకనకలాడుతున్నా! జర భద్రం.. తిక్క పోలీసులు కేసు నీ మీదకైనా మళ్ళించెయ్యచ్చు!'
'వెళ్లేది ఖైరతాబాదు!
ఆ ఖరాబు ట్రాఫిక్కు మధ్యలో అమెరికా మంత్రిగారే ఇరుక్కు పోయారుట! నువ్వెంతా? జర
భద్రం బాబూ! హెల్మెట్ వెంటలేకపోతే వ్యాను
డ్రైవరు మీదైనా కేసులు పడుతున్నాయ్!
ఎలుకా వాహనమే..
డ్రైవింగు లైసెన్సు
తప్పని సరంటారేమో! తీసుకో! ..ఎక్స్
పైరవకుండా చూసుకో! ఆదిదేవుడి
ప్రధమ సంతానమంటే అర్థమవుతుందో లేదో.. బుద్ధి తక్కువ భటులకు? గుర్తింపు
కార్డొకటి సంపాదించుకు పో!’
'బయల్దేరే ముందు నోరు శుభ్రం చేసుకోవడం మర్చి పోవద్దు బాబూ!
మన ‘సుర’ని మరేదో అనుకొని డ్రంకెన్ డైవింగ్
కేసు బుక్ చేస్తే.. ఆదిదంపతులం ఆ పాడు కౌన్సిలింగు సెంటర్ల చూట్టూ కాళ్లరిగేటట్లు
తిరగి చావలేం.. జర భద్రం!'
‘ఆధార్ కార్డొకటి పుట్టించుకొని పో ! బ్యాంకు కాతాలో సున్నా బ్యాలెన్సున్నాసరే..
ఆదాయప్పన్నువాళ్ల పాన్ కార్డు తప్పని సరిట. పన్ను ఎగవేతదారుల జాబితాలో బిడ్డ
పేరుంటే.. నీ పేరెంట్స్ పరిస్థితేంటో ఆలోచించుకో!'
'విద్యలకు గురువ్వని
నీ మీదో ముద్రుంది మొదట్నుంచీ. నెట్లూ. ఎమ్సెట్లూ.. రాసీ.. రాసీ.. విసుగుమీదున్నారు పసిపిల్లలు. కసి కొద్ది నీ మొహంమీదో రెండు
సిరా బొట్లు చల్లినా బండరాయిలా మౌనంగా ఉండు! ‘శివా’ అన్నా బూతుగా ఉంది భూతలం పరిస్థితి. మౌనమే బంగారం బంగారు
కొండా మన దేవుళ్లకైనా ఇప్పుడక్కడ!’
‘నీ పండగంటే తెలుగు హాస్యగాళ్లకీ..
కార్టూనిస్టులకు నిజంగా
సంబురాలే! ఫేసుబుక్కుల్లో.. వాట్సప్పుల్లో వాళ్ళ రాతలు చూసి
ఉడుక్కోవద్దు. అచ్చు పత్రికల్లో వాళ్ళ
గీతలు చూసి ఉలిక్కిపడొద్దీ తొమ్మిది రోజులు! ఏడాది పొడుగూతా ఏదో ఏడుపులు.. పెడబొబ్బల జీవితా;లు కదా.. పాపం.. అక్కడి జీవులవి! నీ చలవ్వల్లయినా ఈ చవితి గడిచిన తొమ్మిది రోజులు చల్లంగా
నవ్వుకోనివ్వు బొజ్జ
వినాయకా!'
'సరే నమ్మా! బుద్ధిగానే
ఉండొస్తా! సిద్ధి..బుద్ధి కూడా వెంటుంటారుగదా!
భయమొద్దు! మరి వెళ్ళి రానా?'
' బైల్దేరు! నీ రాక
ముందే నీ కులంమీద ఆరాలు మొదయ్యాయట.. నారదులవారు చెపుతున్నారు.
గజానన రెడ్డని ఒహడు.. వినాయక నాయుడని ఇంకొహడు..గణపతి శర్మని మరొహడు.. విఘ్నేశ్వర
వర్మని.. ఇలా తలా ఒహ కులం పేరు తగిలించి హడావుళ్ళు చేసేస్తున్నారుట. జర జాగ్రత్తగా మసులుకో రత్నం!'
‘దేవుళ్లకి కులమేమిటమ్మా!
మనమేమన్నా ఓట్లకోసం గాలమేసే రాజకీయ నాయ’కుల’మా! నమ్మినా నమ్మకున్నా.. సకల జనావళి సుఖ సంతోషాలకు పాటుపడే సేవ'కులం' గానీ!
' మా బాబే ఎంత మంచి
మాటన్నావురా చిన్నా! అన్నట్లు ఇవాళ 'ఉపాధ్యాయ దినోత్సవం'
కూడా! ఆది గురువ్వి. అందుక్కూడా నీకు శుభాకాంకలు గు.. గ్గణపతీ! మానవత్వానికి కులం..
మతం.. ప్రాంతం.. అనే తేడాలేవీ
లేవని.. మా ఆదిదంపతుల మాటగా కూడా మన భక్తులందరికీ నచ్చ చెప్పి
రా! లాభంగా
కాకపోయినా .. క్షేమంగా తిరిగి వస్తే
మళ్లీ చవితివరకూ నాకూ.. మీ నాన్నకూ మనశ్శాంతి!
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు- 05-09-2016 నాటి సంపాదక పుటలో ప్రచురితం)
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు- 05-09-2016 నాటి సంపాదక పుటలో ప్రచురితం)
***