కుక్కనుంచి
పుట్టకపోవడం మనిషి దురదృష్టం. మనిషిలాగా పుట్టకపోవడం కుక్క అదృష్టం. 'చీఁ!,, కుక్కా!' అని ఊరికే
చీదరించుకొంటాంగానీ.. విధిరాత బాగోలేకే వీధి కుక్క
బతుకు.. మంత్రులింట మెట్టిన
శునకానిది శుక్ర మహర్దశ! ఆమ్ ఆద్మీ
జనాలకంటే పూటకో అరప్లేటు భోజనానిక్కూడా
నానా అగచాట్లు. మంత్రిగారింటి చాటు కుక్కపిల్లకైతే
గంటకో స్వ్వీటు.. చాటు! అయ్యగారి సందర్శానికని వచ్చే వందిమాగదులందరి ముద్దు మురిపాలు ముందుగా మంత్రివర్యులగారి ముద్దుల శునకం పాలు! కనకపు సింహాసనంమీది శునకాన్ని సుమతీ
శతక్కారుడు ఏ మంత్రిగారింట్లోనో చూసుంటాడు. మన తుక్కు తెలుగులో కుక్కంటే కుక్కే.
అదే ఆంగ్లంలో 'డాగ్' తిరగబడ్డ 'గాడ్' ! మంత్రిగారింటి డాగ్ అయితే తిరగబడ్డా.. మరగబడ్డా..
. 'గాడే’ సర్వే సర్వత్రా.! ఇంటిక్కాపలా ఖర్మం మామూలు కుక్కలకి. మంత్రిగారింటి
కుక్కలకి మంత్రిగారింటిల్లిపాదీనే కాపలా! గోమాత ఎక్కడున్నా పూజ్యమే
కానీ.. శునకానికి మంత్రిగారింట
ఉన్నంత కాలమే రాజ్యం. ఆ ఆనుపానులు తెలీని అమాయక ప్రాణం.. రాజస్థాన్ రాష్ట్ర ఆరోగ్య శాఖామాత్యులవారి శ్రీమాన్ శునకం .. హఠాత్తుగా
కనిపించకుండా పోయి
దేశమంతటా కలకలానికి కారణమైపోయింది మలేసియా విమానం మాయమయినప్పుడు
కూడా ఇంతలా కలవరం
కలిగించలేదెక్కడా!
కటకటాల వెనకున్న
దొంగవెధవ కనపించడం లేదంటే అర్థముంది. పిటపిటా నడిచే పడుచు పిల్ల గాయబ్ అయిందటే ఎక్కడో గబ్బయిందని అర్థమవుతుంది. అవినీతికో..
అరాచకానికో అడ్రసుదారుడు పట్టుబడే సమయంలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం..అదీ.. మామూలే! చట్టసభల సమయంలో రాహుల్ బాబొకప్పుడు చటుక్కున సెలవు చీటీ పారేసి ఎక్కడికో చెక్కేసినట్లు.. రాజస్థాన్ మంత్రిగారి కుక్కా.. ఇప్పుడు హఠాత్తుగా మాయమైపోయింది! శునకరాజానికంతగా వచ్చి
పడ్డ కష్టాలేంటో? ఎమ్ సెట్ పరీక్షల్లాంటి కేసులూ ఏవీ లేవు మరి! భూ దంధాల్లాంటి ధూం ధాంల్లో దూరే అవసరాలా?.. అసలే ఉండుండని జాతి ఆ శునకానిది. . చలన
చిత్రాల్లాంటి కళలమీదగ్గాని గాలి పోలేదు కదా.. చెప్పా పెట్టాకుండా ముంబయి చెక్కేసెయ్యడానికి? డాగ్ ‘ఫాదర్’ మంత్రిగారు! చెవిలో చిన్నగా ఊదినా చాలు.. కొండమీది కోతినైనా
తెచ్చి కొంపలో పడేస్తారు!
కుక్కగారు
కనిపించకుండా పోవడం పోలీసు యంత్రాంగం మొత్తానికిప్పుడు ప్రాణాల మీదకి
వచ్చిపడింది ముఖ్యమైన దస్త్రాలు మాయమైనా బొత్తిగా పట్టించుకోరు శ్రీవారు. కుక్కగారిని వెతికి తెచ్చేందుకు మాత్రం ఇచ్చిన గడువు కేవలం ఒక్క
వారం !
మంత్రిగారి
ముఖమంటే అప్పుడప్పుడు మీడియాలో డప్పుకొట్టేటప్పుడైనా చూసే అవకాశం కద్దు. మంత్రిగారి ముద్దు కుక్క ముఖారవింధం కనీసం ఫేస్ బుక్కులోనయినా సందర్శిచు అవకాశమే లేదు! ఇహ పసిగట్టి పట్టుకొనుట
ఎట్లు? దొంగవెధవల పని పట్టేటందుకంటే కుక్కలకి గట్టి శిక్షణుంటుంది. సాటి కుక్కల్ని పసిగట్టేపాటి నైపుణ్యం కుక్కలకే లేనప్పుడు మంత్రిగారి
కుక్కజాడ కనిపించడం ఏట్లు? కుక్క ముఖారవిందాలన్నీ ఒక్క తీరులోనే ఉండటం.. కుక్క మొరుగుళ్లన్నీ ఒకే కోడులో సాగడం పోలీసులకో ఓ
అగ్ని పరీక్ష!
‘నల్లదనం మాదిరి కుక్కనూ ఎక్కడో దాచేసి మీడియా ప్రచారానికి మంత్రి పడే
ఆరాట’మిదంతా అంటూ ప్రతిపక్షాలప్పుడే నిప్పులు చెరుగుతున్నాయి. ‘వచ్చే
ఎన్నికల్లో ఏకుక్క సాయంతో గెలవాలన్న నక్కజిత్తులి’వన్నీ అంటూ ’ ప్రజాసంఘాలూ దాడులు ప్రారంభించేసాయి. రోజులు గడిచే
కొద్దీ వేడి పెరగడమే కానీ..ఏ పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదు.
కనక కనిపించని శునకంగారిని ఉద్దేశించి చివరికి నియోజక వర్గ ప్రజానీకమే బహిరంగంగా మొర పెట్టుకొన్నారు. అందులోని అత్యంత
ముఖ్యాంశాలు కొన్నిః
మంత్రిగారి గౌరవనీయులైన
శునకంగారికి.. హక్కులు లేకపోయినా సామాన్యులం ఎలాగో తట్టుకోగలం.. మంత్రులు
పెంచుకొనే కుక్కలు కనిపించకుండా పోతే పాలన స్థభించి పోవడం ఖాయం.. తమరు
కనిపించకుండా పోయిన రోజునుండి మా మంత్రిగారు మాకు కనిపించకుండా పోయారు.. తమరి మీదున్న చింతతో శ్రీవారు
మా చింతలు ఆలకించేందుకు సిద్ధంగా లేరు.. రియో ఒలంపిక్సు క్రీడలు తిలకించుటానికి వెళ్ళంటే ..
వెంటనే ఓ బహిరంగ ప్రకటన విడుదల చేయ
ప్రార్థితులు.. కృష్ణాపుష్కరోత్సవాలకు హాజరయి ఉంటే తక్షణమే తిరిగి రావలయునని విన్నపములు.. చింత వీడి
వెంటనే తమరు అజ్ఞాతమునుండి బైటకు రా
ప్రార్థితులు. మంత్రిగారి భవంతి నిత్య పంచభక్ష్య పరమాన్నాల
విందులకు మొహం
మొత్తి తమరు పాత పాదరక్షల
వేటకు వెళ్లారని వదంతులు ఊపందుకొంటున్నాయి.. దయచేసి పాత చెప్పులు మా దీన జనులకు వదిలేయమని మనవి. రాబోయే ఎన్నికల్లో
మొన్నటి ఎన్నికల హామీలేవీ నెరవేర్చని మాయగాళ్లందరికీ దేహశుద్ధి చేసేందుకు మా దగ్గర
మిగిలున్న చివరి ఆయుధం అదొక్కటే!. ఈ సారి ఎన్నికల్లో తమరే నిలబడితే గంపగుత్తగా ఓట్లేసి గెలిపించుకునేందుకు
మేమంతా సిద్ధం.. నేటి నాయకులకన్నా మీ విశ్వాసం ఎజెండా వల్లే బీదా బిక్కీకి కొద్దో గొప్పో మేలు
జరుతుందని మా విశ్వాసం..’.
…
మంత్రిగారి బంగళాలో ఉన్నంతకాలం బైటెక్కడా వినిపించని శునకరాజంగారి ఊసులు.. కనిపించకుండా పోయిన
మరుక్షణంనుంచి మీడియా నలుమూలలా మారుమోగేస్తున్నాయి!
ప్రతీ
కుక్కకీ ఒక రోజు వస్తుందంటారు. మంత్రిగారికి కుక్కకిప్పుడొచ్చేసినట్లుందా మంచి రోజు.
ప్రజాస్వామ్యమంటే అంతే మరి. రోజుకో
విచిత్రం జరుతుంటేనే పిచ్చి
జనాలకి దానిమీద గురి
***
-కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment