Sunday, August 28, 2016

గురువులకు పాఠాలు- ఓ సరదా గల్పిక


బండెడు పుస్తకాలకు బస్సెడు గురుబ్రహ్మలు తోడయ్యే నూతన విధ్యావిధానం రాబోతుందా?ఒక ఉపాధ్యాయుడికి నలభైమంది శిష్యపరమాణువులన్న  సిద్ధాంతం ఇహ పాత పడనుందా? ఒహ విద్యార్థికి నలభైమంది గురువులనే నవీన పథకం అమలు కానుందా?

విద్యుత్ బుగ్గ, ఆకాశవాణి, చరవాణివంటి ఆవిష్కరణలకంటే పనిగట్టుకొని పనులు మానేసుకొని బుర్రలు బద్దలు కొట్టేసుకొన్నారు పెద్దలు! కేవలం అవకాశాల్రాని రాజకీయవేత్తలు, అధికారం దక్కని అధికార వర్గాలు, ఉద్యోగసంఘాల బుద్ధికుశలతవల్ల మన పిల్లకాయలకిప్పుడు కొత్త విద్యావిధానం దొరికిందోచ్!

చదువు సాములు మెరుగు పడాలని, బడిపిల్లోడి అవసరాలకు తగ్గత్లు అభ్యాస పద్ధతులు  మార్పు చెందాలన్న అభ్యుదయ భావాలతో తెలంగాణా సర్కారిప్పుడు 'హేతుబద్దీకరణ'కు కాలుదువ్వుతోంది. ప్రభుత్వపెద్దల బుద్ధికుశలతకు మించి కొత్త పద్దతులున్ బాలల విద్యారంగంలోకి చొచ్చుకొచ్చేస్త్తున్నాయ్! పాఠ్యప్రణాళికలు శుద్ధంగా అమలు కావాలంటే బండెడేం ఖర్మ.. జంబో జెట్టుకు మించిన గురుసైన్యం తయారు కావాల్సుంది.

తెలుగులో అచ్చులు నేర్పించేందుకొక ఉపాధ్యాయుడు, హల్లుల  వల్లెవేతకు ఇంకో గురుబ్రహ్మగారు,, గణితంలో ఒంట్లు వటువు వంటబట్టించేందుకు పట్టుదల తగ్గని పంతులొకరు, ఎక్కాలు పిల్లడి బుర్ర కెక్కించి తొక్కేందుకు వస్తాదుల్లాంటి ఉస్తాదులు మరో ఇద్దరు- ఒహరు పైనుంచి కిందికి తొక్కిస్తే.. మరొహరు కిందనుంచి పైకెక్కించేందుకు.. ! ఆంగ్లంలో మూడు బళ్లు ఏడ్చినప్పుడు ఒక్కో బడికి ఒక్కో గట్టిపిండం అవసరమే కదా! సాంఘిక శాస్త్రంలో పర్యావరణమనే కొత్త అంశం పుట్టుకొచ్చిందిప్పుడు.. పిల్లకాయలను తోటలెంట దొడ్లెంట  తిప్పుతూ.. ప్రకృతి తిరకాసునంతా విప్పి చూపించే విశ్లేషకుల అవసరం కొత్తగా ఏర్పడింది. మోరల్ క్లాసులు పీకేందుకైతే మోటా పరిజ్ఞానం కల మాస్టార్ల అవసరం ఎలాగూ తప్పని సరి తద్దినమై కూర్చుంది. సామాన్య శాస్త్రం మాత్రం సామాన్యులకు అలివయేట్లుందా? భౌతిక.. రసాయన శాస్త్ర సూత్రాల వివరణ .. ప్రయోగశాలల్లో వాటి సత్యనిరూపణలకు ఏక మొత్తంగా మొత్తం కనీసం  నలుగురు గురువులన్నా సదా సిద్ధంగా ఉండి తీరాల్సుండె!

చిత్రకళ, సంగీతం వంటి కళా విశేషాలను గడుగ్గాయిలచేత  కాయించి వడబోయించేందుకు  ఎంతమంది ప్రావీణ్యుల సహకారమవసరమో ఇంక చెప్పేందుకు లేదు. ఇహ గెంతడం..  పరుగెత్తడం.. ఒకే బంతిని పట్టుకొని తెగగుంజుకోడం.. గుద్దులాడుకోడం వంటి వంటికి సంబంధించిన విద్యల్ని దెబ్బలక్కాచుకొంటూ వడుపుగా నేర్పించే  ఓపికమంతులు  పంతుళ్లుగా రావడమూ తప్పని సరే! ఇన్ని చతుష్షష్టి కళలు  ముష్టి సర్కారు బళ్ల పిల్లకాయకు అంతవసరమా అన్న ధర్మసందేహం ధర్మం కాదు! జీవించడానికి అవసరమైన కీచులాటల్లో లాఘవం రావాలంటే పసితనంనుంచే కండబలం చూపించే విద్యల్లో రాటు తేలాల్సిందే! బిడ్డ అవసరాలకు తగ్గ విద్య ఉగ్గుపాలదశనుంచే  గరపాలన్నది కదా హేతు బద్ధీకరణంలోని ప్రధాన నీతి సూత్రం!

గురువులకేమీ కరువు లేదు.   తరగతి గదిలో చుక్కల్లో చందమామాలా మెరిసే ఒక్క బుడతడికి ఒకేసారి నలుగురు గురువులు ఉన్న నాలుగ్గంటల్లో విద్య గరపడమెలా?.. అన్నదే ప్రస్తుత సమస్య. సంక్షోభం వచ్చినప్పుడే సమస్యకు పరిష్కారం బైటపడేది. గతంలో నల్లబల్ల దగ్గర యమధర్మరాజు దగ్గరిచుట్టమల్లే బెత్తమాడిస్తూ నిలబడ్డ  ఉపాధ్యాయుడు ఇప్పుడు ఒకింత  అసుంటా కిందికి దిగి బెంచీలమీద తోటిగురువులతోపాటు బుద్ధిగా కూర్చుంటాడు. నిష్పత్తిలో ఒక్క శాతంగా ఉన్న విద్యార్థి ఒక్క మెట్టు  పైకెక్కి బల్లమీద బాసింపట్లేసుకుని కూర్చుంటాడు. మారిన కొత్త విద్యాభ్యాస విధానంలో ముందుగా విద్యార్థి వేసే హాజరు పిలుపులకు ఉపాధ్యాయులంతా 'జీ.. హుజూర్' అని పలకాలి. ఆ తరువాతే తరగతులు ఆరంభమయేవి.
విద్యార్థి కళ్లు మూసుకొని వేలు ఎవరి వైపు చూపిస్తే ఆ ఉపాధ్యాయుడికి ఆ పూట పాఠం చెప్పుకొనే సువర్ణావకాశం దక్కుతుంది.
శిక్షణా సమయంలో పక్క గురువులు కక్షతోనో.. కడుపుమంటతోనో అల్లరికి తెగబడితే పిల్లవాడిచ్చే శిక్షలు దారుణంగా ఉంటాయి. ఆ పూట పాఠం చెప్పే అవకాశం కోల్పోవడంతో పాటు.. గోడకుర్చీ వేయడమో.. బెంచీ ఎక్కి నిలబడ్డమో తప్పని సరి. అల్లరి మరీ మితిమీరితే బైట ఎండలో నిలబడ్డమూ తప్పదు గురువులకి.
పాఠం వినే సమయంలో సాధారణంగా ఏ విధ్యార్థి పెదవి విప్పడు. తెలివితక్కువ వెధవ ఎప్పుడైనా ఖర్మకాలి ఏదైన తిక్క సందేహం అడిగితే ఠక్కుమని సమాధానం చెప్పేట్లుండాలి పంతుళ్ళ ఇంటిదగ్గర తయారీ. ఇంటిదగ్గర పాఠం సరిగ్గా తర్ఫీదు కాని పంతుళ్ల పని గోవిందో గోవిందే! వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఎంత పంతులుకైనా గుంజీలు తప్పవు.  శిష్యుడి చేతిలో బెత్తం ఆడుతున్నంత సేపూ గురువుల గుండెళ్ళో మెట్రో రైళ్ళు పరుతెత్తుతుంటాయ్!
'ఐ నెవర్ టెల్ ఎనీ లెసన్' అని పలక మెళ్లో వేళ్ళాడదీసినా పంతుళ్లెవరూ  ఎదురు పలక్కూడదీ  కొత్త నూతన విద్యా విధానంలో. 'వ్యాపారంలో వినియోగదారుడే రాజు' అయినట్లే కొత్త విద్యాభ్యాస ప్రణాళికలో విద్యార్థే రారాజు.
సర్కారువారి సరికొత్త హేతుబద్ధ ప్రణాళికను అవహేళన చేయకుండా జంధ్యాలవారి 'జంబలకిడి పంబ' సూత్రం అమలు చేస్తే మాత్రం తప్పేముంది? కాకపోతే తయారీ రంగంలో కాస్తంత మార్పులు అవసరం. ఉపాధ్యాయులకి ముందస్తు శిక్షణ ఉన్నట్లే.. విద్యార్థికీ  ప్రాథమిక పరిజ్ఞానంలో రవ్వంత  తర్ఫీదు అవసరమవుతుంది. ఒక్క గురువు వేధింపులకే తాళలేక పసిమొగ్గలు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ఇంతమంది యమ గురువులను ఒకేసారి ఒకే చోట ఎదుర్కొనేందుకు తగిన శక్తి సామర్థ్యాల్లో పసివాళ్ళకు శిక్షణ అవసరమవుతుంది.
పిల్ల కథానాయకులు పెద్ద పెద్ద దర్శకులనే అదుపులో పెడుతున్నారు చలనచిత్ర రంగంలో. బొడ్డూడని పసిగుడ్డులుకూడా కన్నవాళ్లని కనుసన్నల్లో ఆడిస్తున్నారు. సర్కారు కార్యాలయాల వ్యవహారాలన్నీ బిళ్లబంట్రోతుల కంట్రోల్లోనే కదులుతున్నాయి. కార్యకర్తల ఆదేశాలమీదే  బడానేతలూ పార్టీ గోడలు దూకుతున్నారు. పూజారుల లెక్కల ప్రకారమే సాక్షాత్ ఆ ఏదుకొండలవాడు నామాల పొడుగు సరిదిద్దుకొంటున్న నేపథ్యంలో పిల్లకాయల బెత్తాలముందు పాఠాలు చెప్పుకు బతికే బడిపంతుళ్ళు చేతులు కట్టుకొని నిలబడ్డంలొ తప్పేముంటుంది?!
మీడియా హోరు.. చిత్రాల బోరు.. సీరియళ్ల జోరుల ముందు బేజారు కాకుండా గట్టిగా  నిలబడుండాలంటే  చిన్నబళ్లనుంచే పెద్ద పెద్ద గురువులను అదుపు చేయడంలో తర్ఫీదు పొందుండాలు పసిగుడ్డులు. ఎన్నికల సమయంలో వందలాది నేతలు వేలాది హామీలను వడగళ్ళ వానలా గుప్పిస్తుంటారు. ఓటర్లుగా మారినప్పుడు ఆ వడగళ్ల నొప్పిని సంహించేందుకైనా విద్యార్థి దశనుంచే బిడ్డను సమాయత్తం చేయాల్సుంటుంది కదా!  హేతు బద్ధీకరణ అసలు సదుద్దేశం కూడా  అదే అవుతున్నప్పుడు మనం తప్పు పట్టడం అన్నింటికన్న పెద్ద తప్పు,
***
-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సంపాదకీయ పుటలో ప్రచురితం. ఈనాడు యాజమాన్యానికి.. సంపాదక వర్గానికి.. కార్టూనిస్టు శ్రీ శ్రీధర్ గారికి కృతజ్ఞతలతో)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...