గెలీలియో నిజంగా మహానుభావుడు. మందుబాబులకన్నా ముందే భూమి
గుండ్రంగా తిరుగుతున్నదని కనుక్కొన్నాడు.
కథలు చెప్పేవాళ్లందరూ తాగుబాతులని చెప్పలేంకానీ..
తాగుబోతులుమాత్రం మంచి కథకులై ఉంటారు. కొంపకు ఆలస్యంగా వచ్చినప్పుడల్లా ఇంటిఇల్లాలుకి
కొత్తకథ అల్లి చెప్పాలంటే అల్లాటప్పా వ్యవహారం కాదు! తప్పతాగితే తప్ప అంత
సృజనాత్మకత సాధ్యం కాదు.
మందేమీ ఇప్పుడు కొత్తగా కనిపెట్టిందికూడా కాదు. రామాయణకాలంలో-
సీతమ్మవారిని వెతకడానికని వెళ్ళిన ఆంజనేయుడుకి లంకలో ముందుగా కనిపించింది
ద్రాక్షారసాలు సేవించే రాక్షసులే! భారతంలోని కీచకుడుకి మగువలమీదకన్నా మధ్యపానంమీద
మక్కువ జాస్తి. ఉజ్జయినీ కాళీమాతకు మద్యమే నైవేద్యం. శిప్రానదీ తీరాన కొలువైన
భైరవుడు నాటుసారా తప్ప మరొకటి ముట్టడు. దేవదానవులు దెబ్బలాట దేనికోసం? ఆ సురేకదా
నేటి సారాయి!
మదిరలో ఎంత మహత్తు లేకపోతే గాలిబ్ అంత గమ్మత్తైన గజల్సు
చెప్పగలడు! అజంతా హరప్పా శిథిలాలు
తవ్వితీసినప్పుడూ ముందుగా బైటపడ్డవి అప్పటి తాగుబోతులు తాగిపారేసిన చట్లూ
పిడతలేనంటారు. నిప్పు కనిపెట్టకముందు ఆదిమానవుడు ఎండావానలకు, చలిగాడ్పులకు ఎలా తట్టుకొని నిలబడ్డాడంటారూ? అంతా
యిప్పసారా మహత్తు. యుద్దసమయాల్లో ఏనుగులకీ
బాగా మద్యం పట్టించి శత్రుసైన్యంమీదకు తోలేవారని 'ఇండికా'లో మెగస్తనీస్ అంతటి మహానుభావుడే రాసినప్పుడు 'రా'
పనికిరాదంటే కుదురే పనేనా!
కామానికీ సూత్రాలు రాసిపెట్టిన మునులు మధుపానానికి
శాస్త్రాలు రాయలేదంటే నమ్మలేం! తంజావూరు తాళపత్ర గ్రంథాలయంలో మరికాస్త మందుకొట్టి
వెదికితే ఒకటో రెండో పెగ్గుకావ్యాలు బైటపడక మానవు. మౌర్యులకాలంలోనే మనవాళ్ళు 'అంగుళం' కనిపెట్టారంట!
ఎందుకు? లోటాలో మందుకొలతలు చూసుకొనేందుకుగాక మరి దేనికీ?
‘చంద్రయాన్’ మిషన్ ఇంజనులో ఇంధనానికి బదులు ఏ కల్లో సారానో కొట్టించి వదిలుంటే.. సముద్రంలో పడేబదులు
ఇంచక్కా చందమామ చూట్టూ చక్కర్లు కొట్టొచ్చుండేది.
దేవుడుకూడా ఆదాము అవ్వల్ని ఆపిల్ ముట్టుకోవద్దాన్నాడుగాని..
మందు జోలికి వెళ్లద్దని హద్దులు పెట్టలేదు కదా! మరెందుకు అందరూ ఈ మందును ఇలా ఆడిపోసుకొంటారో
అర్థం కావడంలేదు!
ఒత్తిడినుంచి ఉపశమనం పొందే ఉపాయంకదా ఇది! శతాబ్దాలకిందట
మనవాళ్లు శోధించి సాధించింది. అష్టాంగమార్గాల్లో ఆఖరిదైన 'సమాధి' అంటే ఫుల్లుగా ‘రా’
కొట్టి చల్లంగా పడుంటమే! మందుగుండు కనుక్కొన్నది చైనానే కావచ్చుకానీ.. 'మందు' కనుక్కొన్నది మాత్రం నిశ్చయంగా మన దేశమే!
‘సారే జహాఁసే అచ్చా!.. సారా భారత్ మహాన్!’
-కర్లపాలెం హనుమంతరావు
***
(ఈనాడు- సంపాదకపుటలో ప్రచురితం)
No comments:
Post a Comment