బోరబండ సెంటర్లో బస్సు దిగేసరికి
సమయం రాత్రి ఎనిమిది గంటలు.
నమ్ముకొన్న బండి మొండికేసి.. షేరు ఆటో దొరక్క.. ఒంటరిగా ట్యాక్సీలో ప్రయాణమెందుకని.. కనిపించిన బస్సు ఎక్కేసింది పనిచేసే కాల్ సెంటరు జంక్షనులో స్వాతి.
వాన కురిసి వెలిసి రోడ్లంతా
చిత్తడి చిత్తడి. సూదిగాడి భయమొకటి మొదలైనందువల్లనేమో దాదాపుగా
దారంతా నిర్మానుష్యంగా ఉంది!
ఇల్లు చేరాలంటే ఇంకో రెండు కిలోమీటర్లు.. అరగంట. అడ్డదారిలోపోతే సగం సమయం.. దూరం ఆదా! కానీ తాగుబోతు వెధవలు పొద్దస్తమానం పేకాట్లాడుకొంటూ
కాట్లాడుకుంటుంటారు పోలేరమ్మ చెట్టు కింద చేరి!
రిస్కయినా అడ్డదారిలోనే తొందరగా
ఇల్లు చేరిపోవాలని మలుపులోకి మళ్లింది
స్వాతి.
పోలేరమ్మ చెట్టు అల్లంత
దూరంలో ఉందనగానే తగులుకొన్నాడెవరో దొంగవెధవ!
చీకట్లో ఆకారం పోలిక పట్టడం
కష్టంగానే ఉంది.
'హాయ్! స్వీటీ!'
స్వాతి బదులివ్వదలుచుకోలేదు.
'’స్వాతీ’ అంటేగాని ‘హాయ్’ చెప్పవు కాబోలు!'
ఉలిక్కి పడింది స్వాతి. 'ఎవర్రా నువ్వు? నా పేరెలా తెలుసు?'
'పేరేనా! నువ్వు పనిచేసే కాల్ సెంటరు.. నీ ఇంటి అడ్రసుతో
సహా ఇంకా చాలా వివరాలు తెలుసు మ్యాడమ్ గారూ!’ దగ్గరికొస్తూ అన్నాడు ఆగంతకుడు.
‘గో అవే! నా దగ్గర పెప్పర్
స్ప్రే ఉంది'
'ఇంకా..'
'కరాటే తెలుసు.
అవసరమైతే పోలీస్టేషనుకైనా ఫోన్ చేసే తెగింపుంది మిస్టర్!’
‘గుడ్! ఫోన్ చెయ్యాలంటే..
ఫోనుండద్దా మేడమ్
గారూ..!'
బ్యాగ్ తడుముకొంది స్వాతి. ఫోనేనా.. వేలెట్టూ మిస్సింగ్!
కళ్ళెంబడి నీళ్ళొచ్చాయి స్వాతికి. కాళ్లబేరమొక్కటే ప్రస్తుతానికి
దారి.
‘వంటిమీది బంగారం మొత్తం
వలిచిచ్చేస్తా! ప్లీజ్! నన్నొదిలేయ్!'
'హ్హ.. హ్హ..హ్హ! వళ్లే బంగారంలాగుంది. ఈ బంగారం
వదిలేస్తాడా ఏ పిచ్చాడైనా!’
'ఏం కావాలిరా స్కౌండ్రల్ నీకూ!’
భోరుమంది స్వాతి.
‘ఇదీ! .. అదీ.. రెండూనూ!’ స్వాతి
హ్యాడుతో పాటు హ్యాండుబ్యాగూ బలవంతంగా పుచ్చుకొని ముందుకు నడిచాడా అగంతుకుడు.
‘ప్లీజ్! నీ చెల్లెల్లు లాంటిదాననుకోరాదా అన్నయ్యా!' చెయ్యి విడిపించుకొనే
ప్రయత్నంలో ఆఖరి అస్త్రం ప్రయోగించింది స్వాతి.
' ఆ మాటాన్నావూ బాగుంది. అయితే అల్లరి చెయ్యద్దు. గమ్మున నాతో
రా! ఇంకో ఐదు నిమిషాల్లో మీ ఇల్లొచ్చేస్తుంది. భద్రంగా లోపలికి పో!
ఇదిగో నీ బ్యాగు. సెల్లు. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొన్న తరువాతే ఇంట్లోనుంచి ఓ రింగియ్యి! నీ సెల్లోనే నా నంబరు ఉంటుంది
ఆచారి పేరుతో!’
ఒక్కక్షణం అవాక్కయినట్లు
చూసి ఇంట్లోకి వెళ్లిపోయింది స్వాతి.
ఐదు నిమిషాల తరువాత ఆచారి
నెంబరుకి కాల్ చేసి ‘థేంక్స్.. అన్నయ్యా.. సారీ!' అంటున్నప్పుడు స్వాతి గొంతు
పశ్చాత్తాపంతో వణికింది.
'అన్నయ్యా అన్నావు కనక
ఓ సలహా చెల్లమ్మా! అడ్డదారిని ఎప్పుడూ ఎంచుకోవద్దు.
పోయేకాలం వచ్చిననవాళ్లను పోలేరమ్మతల్లైనా ఏం చెయ్యలేని రోజులు ప్రస్తుతం
నడుస్తున్నవి. పోలేరమ్మ చెట్టుకింద తుంటరి వెధవలు నువ్వు వంటరిగా
రావడం పసిగట్టారు. వెంటాడే ప్రోగ్రామ్ పెట్టారు. అమ్మవారి నైవేద్యం పెడుతూ సమయానికి
నేనక్కడ ఉండబట్టి సరిపోయింది.
లేక పోతే! ఆడపిల్లను తోడేళ్ళకు వదిలిపెట్టి అమ్మవారిని పూజిస్తే వచ్చే
పుణ్యం ఏముంటుంది! మాటల వంకతో నీతో నడుస్తూ.. అదిలించో.. బెదిరించో.. నీ హ్యాండూ..
హ్యాండుబ్యాగూ పుచ్చుకుని నేను నీతో కలిసి నడవబట్టే వెనకనుంచి వచ్చే తోడేళ్ళకు మగతోడుందనే బెదురు పుట్టింది’ అన్నాడు ఆచారి.
***
కర్లపాలెం హనుమంతరావు
(కౌముది అంతర్జాల పత్రిక సెప్టెంబరు, 2016 లోని 'మరీ చొ.క' గా ప్రచురితం)
No comments:
Post a Comment