'సావధానం బలదేవా..
సావధానం! ఇదిగో నా పాచికల మీద
ఒట్టుపెట్టుకుని ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నాను. ఆలకించండి!
మోసం చేసి కపట ద్యూతం చేసి పాండవుల రాజ్యం కాజేశాము. ధర్మానికి కట్టుబడి వాళ్లు వనవాసానికి వెళ్లారు. అ దుర్వార్త విని నువ్వు మమ్ములను దండించడానికి వచ్చావు. నువ్వొక వెర్రిబాగుల యాదవుడవు. అఖండ సన్మానికి, అతిముఖస్తుతికి లోబడతావని నాకు తెలుసు. మా జాతివాడవు
కాకపోయినా నీ సంబంధం ఎందుకు కోరి తెచ్చుకున్నామనుకున్నావు? వనవాసాననంతరం మళ్లీ పాండవులు విజృంభిస్తే వాళ్లకు నీ సహాయం, నీతో పాటు నీ తమ్ముని సహాయం లేకుండా చేయడానికి. కానీ..
యతోధర్మ స్తతోజయః అన్నట్లు మాకు తగిన శాస్తే జరిగింది'
సినిమా ఇంకో పావుగంటలో అయిపోతుందనంగా శకుని వేషంలో సియస్ఆర్ పలికిన ఈ నిమిషం
డైలాగు మాయాబజారు సినిమా మొత్తానికీ పెద్ద డైలాగ్. తెలుగులో సియస్ఆర్ సింగిల్ టేక్ లో ఓకే చేయిస్తే.. తమిళంలో నంబియార్ నాలుగైదు టేకులు తిని బావురుమన్నాడని.. గుమ్మడి వెంకటేశ్వర్రావుగారు తన 'తీపి గుర్తులు.. చేదు జ్ఞాపకాలు'లో రాసుకున్నారు.
ఒక నిమిషం డైలాగులో సినిమా కథ సారాన్నంతా సరళమైన భాషలో
పామరుడికి కూడా అర్థమయే పద్ధతిలో ఇలా రాయడానికి ఎంతో పాండిత్యంతో పాటు సినిమా
ప్రక్రియ మీద అంతులేని అవగాహన ఉండితీరాలి. అవి
పింగళివారికి పుష్కలంగా ఉన్నాయి. కనుకనే మాయాబజార్
సంభాషణా శైలికి అత్యుత్తమ మైన తార్కాణంగా
ఈనాటికి ఫిలిం స్కూళ్ళ నుండి సినిమా సభల వేదికల మీద వరకు అన్నింటా
ఉధహరించుకుంటున్నాం మనం.
సినిమా సంభాషణ అంటే క్లుప్తంగా, సరళంగా, సహజంగా,
పాత్రోచితంగా, స్పష్టంగా భావం పలికేలా, జీవం ఉట్టిపడేలా,
జనంభాషలో అందంగా, కథాప్రయోజనానికి
దోహదపదే విధంగా ఉండాలని సినీపండితుల నిశ్చితాభిప్రాయం.
పాత్రలకు బదులు రచయితలు మాట్లాడడం పాతపద్ధతి. అంటే అన్ని పాత్రలూ ఒకే మూసలో పలికే మొనోటోనీ విధానమన్న మాట.
ఫిలిం ప్రక్రియ ఖరీదైన వ్యవహారం. కనుక వృధా
సంభాషణలకు ప్రోత్సాహముండదు. టీవీ
ధారావాహికాలకి ఈ సాగతీత ఉంటుంది! అక్కడ 'డై'లాగ్ అంటే చచ్చిందాకా సాగదీయడమనే అర్థం సరిపోతుందేమో కానీ.. సినిమాలో ప్రతీ సెకనూ ఖరీదైన వ్యవహారమే. కాబట్టి
అవసరమైనంత మేరకే పాత్ర పెదాలు కదిలించాలి. అదీ సినీ సంభాషణలకు
సంబంధించినంత వరకు ప్రథమ ప్రధాన సూత్రం.
పాత సినిమాలలో పాత్రలు పూర్తిగా పుస్తకాల భాష మాట్లాడేవి. సందర్భం వచ్చినప్పుడల్లా ఒక సందేశమో, పోలికో తెచ్చి
చప్పట్లు కొట్టించుకొనేవి.
రంగస్థలం వాసనలు పూర్తిగా తొలగిపోని తొలినాటి దశ అది. ఇప్పుడు సినిమాలకు సంభాషణలు రాసేవాళ్లకు నాటకాలతో ప్రత్యక్షంగా అనుబంధం లేదు. నేరుగా జీవితాలనుంచి సినిమాలలోకి దిగబడిన సరుకే ఎక్కువ. సినీ సంభాషణలు
పక్కింట్లో నుంచి వినిపించే తరహాలో
ఉండటానికి అదే కారణం.
ఇది మంచి మార్పే! కానీ.. కత్తెర
వేసేవాళ్ల చెవుల్లో డబ్బు చెట్లు మొలవడం వల్ల పదిమంది ముందు వినడానికి ఇబ్బంది కలిగించే పదాలు
కూడా విచ్చలవిడిగా వెండితెర మీద వినిస్తున్నాయి! కథానాయకులు సైతం ప్రతినాయకులను మించి బూతు పురాణాలు విప్పడం పసిపిల్లల మీదా, మాస్ మనస్తత్వం ఉన్నవాళ్ల మీదా విపరీతమైన చెడుప్రభావం చూపిస్తోంది.
పాత సినిమాలలో పాత్రలు సందర్భోచితంగా చక్కని తెలుగు నుడికారంతో మాట్లాడేవి. సంభాషణలు
రాసేవాళ్లు సంస్కృతాంధ్రాలలో ఉద్దండులైనా, సినిమా ప్రక్రియ
ప్రధానంగా పామరజనరంజకం అనే భావన ఉంది కనుక
సరళమైన,
సజీవమైన భాషను ఎన్నుకొనేవాళ్లు. పౌరాణిక చిత్రమైనా మాయబజారులోని పాత్రలు నేలబారు ప్రేక్షకులకు అర్థమయే పదాలనే
వాడాయి.
‘మోడర్నిజం’ మిషతో ఇప్పుడు వచ్చిపోయే మెజారిటీ చిత్రాలు
కనీసం టైటిళ్లలో అయినా తెలుగుదనం ఉండకూడదని ఒట్టు పెట్టుకున్నట్లున్నాయి! వీలైనన్ని సన్నివేశాల్లో బట్లరింగ్లీష్ దంచేస్తున్నారు. రాసేవాడికీ,
రాయించుకొనేవాడికీ కనీసం ఇంటర్మీడియేట్ స్థాయి ఇంగితమైనా
లేని కారణంగా సినిమాల ద్వారా వీళ్లు వినిపిస్తున్న బూతుపదాలే జనసామాన్యంలో
ఊతపదాలుగా స్థిరపడుతున్నాయి!
సినిమా ప్రధానంగా దృశ్యమాధ్యమంగా వినోదపరిచే కళ. దృశ్యపరంగా చెప్పలేని సందర్భాలప్పుడే మాటల ద్వారా భావప్రకటన జరగాలన్నది మూలసూత్రం. 'మాతృదేవోభవ' చిత్రంలోని ఒక సన్నివేశం ఇప్పటికీ కళ్లముందు కనిపించి కంటతడి పెట్టిస్తుంటుంది. భర్త తాగుబోతు.
భార్యకు కేన్సర్. పిల్లలు
అనాధలైపోతారని ఆ తల్లి దిగులు. ఒక్కొక్కరినే దత్తత
కిచ్చేస్తుంటుంది.
కవల పిల్లల్లో ఒకడు దివ్యాంగుడు. ముందు వాడినే దత్తు తీసుకుందామని వచ్చిన డబ్బున్న దంపతుల ఆలోచన. కానీ వాడికి తోబుట్టువులను విడిచి వెళ్ళాలని ఉండదు. అయినా వెళ్లకుండా ఉండలేని పరిస్థితి. చివరికి
దివ్యాంగుడికి బదులు మంచి బిడ్డను దత్తు తీసుకొని దంపతులు
వెళ్ళిపోతున్నప్పుడు 'అవిటి కాలుతో పుట్టడమే నా అదృష్టం' అంటూ ఆ
దివ్యాంగుడు సంబరపడుతుంటే ఆ సంభాషణ రాసిన రచయిత సత్యమూర్తికి రెండు చేతులూ ఎత్తి
నమస్కరించ బుధ్దేస్తుంది.
కామెడీ ఎన్టర్టైన్మెంట్ వంకతో ఇప్పుడొచ్చే సినిమాల్లో మూడొంతుల భాగాన్ని కథతో
ఏమాత్రం సంబంధం లేని కుళ్ళు స్కిట్లతో నింపేస్తున్నారు. కాబట్టే జాతీయస్థాయిలో తెలుగు సినిమా రూపాయి విలువలా రోజు రోజుకూ దిగజారుతోంది.
మాయాబజారులో మాయాశశిరేఖ పెళ్లిసందడి సన్నివేశం గుర్తుందా? వధువు రూపంలో ఉన్న ఘటోత్కచుడు వరుడి పాదం
మహారాక్షసంగా తొక్కేస్తాడు. లక్ష్మణకుమారుడు గగ్గోలు పెట్టేస్తుంటే శశిరేఖ నంగనాచిలా 'ఆర్యపుత్రులు నా కాలు తొక్కచ్చునేం?' అంటూ ఒక్క
వాక్యంతో వగలాడితనమంతా ప్రదర్శిస్తుంది. ఆ ఘట్టంలో రచయిత వాడిన ఆ చిన్న వాక్యంలోనే
సావిత్రి ఎన్నో రకాల హావభావాలతో ప్రేక్షకులను అలరిస్తుంది. చలనచిత్రం ప్రధానంగా
పాత్రల హావభావాల ద్వారా నడిచే దృశ్యమాలికేగా!
సన్నివేశం పండేందుకు చాంతాడంత
సంభాషణలు దండగ.
డైలాగ్ ఎంత చిన్నదైతే ప్రేక్షకుడి మెదడు అంత పదునుగా
పనిచేస్తుంది.
నాటి మిస్సమ్మ నుంచి నేటి 'అతడు'
వరకు విజయవంతమైన చిత్రాలన్నింటిలో పదునైన స్వల్ప
సంభాషణలే ప్రధానపాత్ర పోషించాయి. సినిమా సంభాషణలు రాసే రచయితలు సూక్ష్మంగా గ్రహించాల్సింది ఏ సన్నివేశానికి ఏ మోతాదులో పాత్రల నోట సందర్భోచితమైన డైలాగులు సాధ్యమైనంత
సంక్షిప్తంగా పలికించాలన్నది.
మాయాబజారు చిత్రం ఈనాటికీ మూవీ రచయితలకు మంచి గైడ్. సమర్థత ఉంటే తల్పాలకు బదులు గిల్పాలు, కంబళ్లకు బదులు గింబళ్ళు కూడా సృష్టించేయచ్చు. ఆ చిత్రంలోనే పింగళివారు అన్నట్లు 'ఎవరూ
పుట్టించకపోతే భాష ఎలా పుడుతుంది?'
దుషట చతుషటయం,
అసమదీయులు, తసమదీయులు వంటి
సందర్భోచితమైన పదాలు ఎప్పుడు ప్రయోగించాలో వర్ధమాన రచయితలు ముందు అధ్యయనం చేయాలి. 'బోర్' అనే ఆంగ్లపదానికి 'సుత్తి'
ని తిరుగులేని ప్రత్యామ్నాయంగా మార్చేసిన జంధ్యాల సామర్థ్యం
ఒక్క రోజుల్లో అలవడే రసవిద్య కాదు. పట్టుదలగా పదాల మీద పట్టు
సాధించాలి. ఒక తరంలో ముళ్లపూడి ప్రదర్శించిన విలక్షణ పూలశైలి, అనంతరం జంధ్యాల ప్రవేశపెట్టిన గిలిగింతల స్టైల్, సమాంతరంగా పరుచూరి సోదరులు కదను
తొక్కించిన జవనాశ్వపు వరవడి, నవరసాలను సైతం ఒకే
లైనులో ప్రకటించే త్రివిక్రమ్ మాటల మంత్రం.. అబ్బో.. అలా.. చెప్పుకుంటూ పోతే ఆంజనేయుడి వాలం సైతం చిన్నదనిపించే జాబితా మన ఒకనాటి తెలుగు
సినీ సంభాషణా రచయితలది.
'సినిమాకి మాటలు రాయడమంటే మాటలు కాదు' అన్న మాట ముందు
ప్రవర్థనమాన సినీరచయితలు మనసులో పెట్టుకుంటే చాలు.. శ్రధ్ద దానంతటే పుట్టుకొచ్చేస్తుంది.
పామర జనానికి ఈనాటికీ సినిమాలే పరమ ప్రామాణికం. శారదమ్మ తన మీద ప్రసరించిన అక్షర కటాక్షాన్ని ప్రజాహితానికి మాత్రమే
వినియోగించడం ప్రతీ సినీరచయిత సామాజిక బాధ్యత. సినిమాకు వినోదం ప్రధానమే.. కానీ
మనోవికాసాన్నీ అది తోడుతెచ్చుకోవాలి.
-కర్లపాలెం హనుమంతరావు
20 -06 -2018
(ఆంధ్రభూమి దినపత్రిక -09,
జూలై, 2009, వెన్నెల పుటలో
ప్రచురితం)