Monday, December 7, 2020

ఓ డోలోడు - కథానిక – రచయిత పేరు తెలియదు)- సేకరణ ః కర్లపాలెం హనుమంతరావు

 చేస్తున్న పని ఆపి కాలుతున్న చుట్టను ఒక దమ్ము లాగి మళ్లా పక్కనే పెట్టాడు సుబ్బులు. నడుముకు వారుతో తగిలించుకున్న వంకీతో డోలుకున్న వారు పట్టెల్ని మరోమారు లాగాడు. నిలబెట్టుకున డోలు కుడి మూతను నాలుగైదు సార్లు తట్టి  శృతి చూసుకున్నాడు. మళ్లా చుట్ట చేతిలోకి తీసుకుని రెండు మార్లు దమ్ములాగాడు. చుట్ట అయిపోవడంతో దూరంగా విసిరేశాడు. అదెళ్లి టెంకాయ చెట్టు మొదట్లో పడి అక్కడున్న నీళ్ల తడికి సుయ్యిమంది.

డోలును ఎడం మూత పైకి వచ్చేటట్లు తిప్పాడు. డోలు పుల్ల తీసుకుని దాని మీదా కొట్టి చూశాడు. అనుకున్నట్లు మోగలేదేమో 'ఛీ! దీనమ్మ' అనుకుంటూ డోలును మళ్లీ వంకీతో లాగడం మొదలుపెట్టాడు. కుడి మూత రంధ్రం నుంచి డోలు కర్ర మీదుగా ఎడం మూత రంధ్రంలోకి దూర్చుతూ డోలు కర్ర పట్టీ చుట్టూ ఉన్న వారుపట్టీలను లూజు లేకుండా బిర్రుగా లాగాడు.

సుబ్బులకు గొంతు కింద పోస్తున్న చెమట గుండె మీద నుంచి నడుం వరకు కారుతోంది. నల్లటి శరీరానికి నిమ్మచెట్ల మీద నుంచి వచ్చే గాలి తగలడంతో హాయిగా అనిపించింది. పక్కనే ఉన్న పై కండువాతో శరీరాన్ని తుడుచుకున్నాడు.

అలా నాలుగు సార్లు శృతి చూసుకున్నాక మిగిలిన వారును డోలు అడ్డకర్రల పట్టీగా నాలుగైదు వరుసలు చుట్టాడు. సొప్ప తీసుకుని ఎడం మూత కడెంలోకి చొచ్చుకొనొచ్చిన పిచ్చులపై ఆనించి గుండ్రాయితో తడుతూ పిచ్చుల్ని ఇంకా లోపలికి కొట్టాడు. ఎండ తగిలేటట్టు ముందు రోజు తయారు చేసి ఏలాడ గట్టిన బొట్టెల్ని తీసుకొనొచ్చాడు.  మంగలి పొదిలో నుంచి గోరుగాలు తీసుకుని గోగుపుల్లల చుట్టున్న బొట్టెల్ని జాగ్రత్తగా గుండ్రంగా కోసి వాటి నుంచి బైటికి తీశాడు. వాటిని ఎడం చేతి బొటన వేలుకు మినహా అన్ని వేళ్లకు పెట్టుకున్నాడు. గోతం పట్టని సరి చేసి డోలు కొట్టడం మొదలు పెట్టాడు.. పాల వరసల నుంచి .

యుద్ధానికి సిధమయ్యే సైనికుడిలా.. కళను సృష్టించబోయే ముందు కళాకారుడి ఆత్మనివేదనలా.. తదేక దృష్టితో సుబ్బులు దానిలో మునిగిపోయాడు.

ఇంటర్మీడియెట్ చదువుతున్న సుబ్బులు చిన్నకొడుకు కాలేజీ ఫీజుల కోసం కావలి నుంచి వచ్చాడు. సిటికేసర చెట్టు కింద, పొయ్యిలోకి కరతమ్మ పుల్లల్ల్ని చిదుగులుగా కొడుతూ తండ్రి వాయించే డోలుకు తలూపుతున్నాడు.

సుబ్బులు కూతురు అత్తగారింటి నుంచి వచ్చుంది. మళ్లా పంపాలంటే చీరన్నా పెట్టాల్సిందే. దారి ఖర్చులూ ఇవ్వాల్సిందే.

సాయబ్బుల పీర్ల పండక్కి వాయిస్తే ఈ దఫాకి మీ ఇద్దరి గొడవా వదిలినట్లే అన్నాడు వారం రోజుల కిందట సుబ్బులు. కానీ ప్రతి ఏడాదిలా ఈ ఏడు పీర్ల పండగ మేళం సుబ్బులుకు ఊరకే రాలేదు. పెద్ద తిరకాసే జరిగింది.

***

ఆ రోజు సుబ్బులు బస్టాండులో ఉన్నాడు. ఎవరో వస్తే గడ్డం చేస్తున్నాడు. సాయబ్బులపాలెం నుంచి మదర్సా హడావుడిగా వచ్చాడు. 'అరేయ్ సుబ్బులూ! ఈసారి పీర్ల పండక్కి మేళాల కోసం పెద్ద రబస జరిగిందిరా! అన్ని సావిళ్లోళ్ళు ఈసారి పక్కూరి నుంచి పిలిపిద్దాం'అన్నారు. 'కొత్తపట్నం, అలకురపాటి నుంచి తెప్పిద్దాం'అన్నారు.

గడ్డం చేస్తున్నోడల్లా ఆ మాటకు ఉలిక్కిపడ్డాడు సుబ్బులు. 'అవున్రా! మనూరోళ్ల కంటే కొత్తపట్నమోళ్ళు బాగా వాయిస్తన్నారని అంటున్నారు. ఎంత చెప్పినా వింటన్లే!'

'అదేందిరా మదర్సా! మీకు ఒడుగులైనా.. గిడుగులైనా మేమే కదరా వచ్చేది. చిన్నప్పట్నుంచి కలసి మెలసి తిరిగాం. గడ్డమైనా.. క్రాఫైనా ఎంతిస్తే అంతే తీసుకున్నాం. మన సాయబ్బులే.. మనోళ్లే.. అనుకున్నాం. ఇప్పుడేందిరా.. ఇదీ!' అన్నాడు.

'అవున్రా! నేనూ అదే చెప్పా! కానీ .. కుర్రోళ్లు .. ఎదిగొఛ్చారు కదా! ఇంటంలా! మిగతా మూడు సావిళ్లు మా చేయి దాటిపోయింది. మా సావిడి మేళం మాత్రం సుబ్బులన్నే అని గట్టిగా చెప్పొచ్చారా!' అన్నాడు.

సాయిబులపాలెం పెద్దలతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఆ ఒక్క సావిడీ ఒప్పుకుని బయానా తీసుకున్నాడు సుబ్బులు.

అన్నిసావిళ్ల పని ఒప్పుకుని పక్కూళ్ల నుంచి మేళగాళ్లను తెచ్చి పని జరిపిస్తే కాస్త డబ్బు మిగులుతుంది. అది అందరికి తెలిసిందే. పక్కూరోళ్లను మేళానికి పిలిచినా అట్లాగే చేస్తారు. కానీ ఈసారి సుబ్బులుకు ఆ అవకాశం లేదు. అదే అలవాటుగా మారితే ఈ ఊరు మంగలోళ్ల పరిస్థితి ఏమిటి? మేళాలన్నీ పక్కూరికి పోతే ఈ ఊరి మీద పట్టు పక్కూరికి పోద్ది. అది జరక్కూడదంటే పక్కూరోళ్లకంటే ఈ ఊరే మేలనిపించాలి. తమ సత్తా ఏంటో పీర్ల పండక్కి చూపించాలి అనుకున్నాడు.

గొల్లోళ్ల వెంకన్న దగ్గరికెళ్లి మంచి మేక తోలు తెచ్చి ఆరకొట్టాడు. డోలు కున్న మూతలు విప్పి నానేసి తోలు విప్పాడు. ఆరగొట్టిన కొత్తతోలు కడాలు సైజుకు తగ్గట్లు గోరుగాలుతో కోశాడు. ఎడం మూత రెప్ప కోసం మంచిగా తోల్ని సిద్ధం చేసుకున్నాడు. రెండు రోజులు బక్కెట్లో నానేశాడు. మూడు పూట్ల తొక్కి తోల్ని పొదగడానికి సిద్ధం చేశాడు. చిన్నకొడుకు ఊర్రాముల చిల్లరకొట్టు ఎదురుగా చింతిత్తులు ఏరుకొచ్చాడు. గుండ్రాయితో చిన్నచిన్న ముక్కలుగా చితక్కొట్టి నానేశాడు. సుబ్బులు పెళ్లాం వాటిని మెత్తగా రుబ్బి, వండి, మైదా కలిపి బందన తయారుచేసింది.

సుబ్బులు కడేలుకు బందన పూసి తోలు అతికించాడు. గట్టిగా అతుక్కునేందుకు బిరుసు గుడ్డతో అదిమాడు. ఎడం మూత పొదగడానికి వల్లూరు జగ్గయ్య దగ్గరికెళ్లి మిషను తెచ్చాడు. కడానికి తోలు అతికించి బాగా అత్తుకునేందుకు మిషను బిగించాడు. ఆరపెట్టాడు. రెండు మూతలు ఆరాక చింతగింజలు పెట్టి మధ్య దూరం సమానంగా ఉండేటట్లు చూసి కళ్లు(రంధ్రాలు) కోశాడు. అక్కడ తోలు నానడానికి గుడ్డపీలికతో వాటిని తడుపుతూ రోజంతా ఉంచాడు. ఎడం మూత ఆరాక దానిపై రెప్పను అతికించి మళ్లా పొదిగాడు. డోలు కర్రకు గుడ్డతో నూనె పూసి బాగా సిద్ధం చేసుకున్నాడు. కుడి మూత మధ్యలో నల్లటి బూడిదరాశాడు.

 

సుబ్బులు చిన్నకొడుకు, కూతురు కలసి ఇంట్లో పాత కద్దరు గుడ్డను అంగుళం వెడల్పు ఉండేటట్లుగా పేలికలు పేలికలుగా చించారు. రెండు గోగుపుల్లల్ని జానెడంతవి నరికి సిద్ధంచేసుకున్నారు. సిమెంటు, అన్నం కలిపి మెత్తగా నూరారు. గుడ్డలేలికలకు దానిని పూసి గోగుపుల్లలకి రెండు కొసల దానిని అంటించారు.  వాట్ని ఎండలో ఆరగట్టారు. అవి ఎండాక గోగుపుల్లల్నుంచి విడదీస్తే బొట్టెలు అవుతాయి.

ఆ రోజు సుబ్బులు పొద్దున్నె అన్నిట్నీ ముందేసుకుని కూర్చున్నాడు. డోలు కర్రని నిలబెట్టి కింద కుడి మూత, పైన ఎడం మూత పెట్టి రంధ్రాల గుండా వారు ఎక్కించాడు. మూతలు బిర్రుగా ఉండి, శృతి రావడం కోసం వారు పట్టీలకు వంకీ తగిలించి లాగుతున్నాడు.

లాగుతున్నాడే కానీ, పక్కురోళ్ల గురించి, వాళ్ల డోళ్ల గురించి, సన్నాయిల గురించి,వాళ్లు వాయించే విధానం గురించి ఆలోచిస్తున్నాడు. అంతే కాదు.. సొంతూర్లో పరువు నిలబడాలంటే ఎలా అని ఆలోచిస్తున్నాడు.

వాయించడం అయిపోయాక, అన్నిట్నీ నెమరు వేసుకున్నాక, డోల్ని మరోసారి సరిచూసుకుని పట్టెడ తగిలించాడు. గుడ్డ కప్పాడు. ఇంట్లో దేవుడి మూలనున్న పీటపై పెట్టొచ్చి ప్రశాంతంగా గాలి పీల్చుకున్నాడు. నిప్పెట్టె తీసి చుట్ట అంటించాడు. దమ్ములాగుతూ మార్కెట్లో ఉన్న పంచలోకి వెళ్లి కూర్చున్నాడు.

***

సుబ్బులూ వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. పెద్దోడు సన్నాయి, రెండోవాడు .. అదే సుబ్బులు, మూడో వాడు మళ్లీ సన్నాయి, నాలుగోవాడు మళ్లీ డోలు.. వాయిస్తారు. వాళ్లయ్య చస్తూ చస్తూ ఊరిని, వృత్తిని చూపించిపొయ్యాడు. పక్కూరు మంగలోళ్లకు ఈ నలుగురు అన్నదమ్ములంటే హడల్. కాని, డబ్బులు బాగా ఇస్తారని ఈ కొత్తపట్నపోళ్లు, అలకురపోటోళ్లు ఒప్పుకున్నారు. ఈ విషయం నలుగురు అన్నదమ్ములకు తెలుసు. అందుకే వాళ్లు సన్నాయిల్ని కూడా గట్టిగా సిద్ధంచేసుకున్నారు.

పీర్ల పండగ రానే వచ్చింది. మొదట్రోజు సావిట్లోంచి పీర్లను దించడం. మామూలుగానే సాగిపోయింది. సుబ్బులు ఆ ఊరు మంగలోళ్లకున్న పీరు దగ్గరకు వెళ్లి 'మా పరువు నీవే కాపాడాల' అని వేడుకున్నాడు. పెళ్లాంతో కలిసి బొరుగులు, వేగించిన శెనగపప్పు, బెల్లం పీర్లకు ఇచ్చొచ్చాడు. తర్వాతి రోజు గుండం తొక్కడం కూడా అయింది. ఆ తర్వాతి రోజే పీర్ల ఊరేగింపు.

ఆ రాత్రి సాయిబులపాలెంలో ప్రతి సావిడి దగ్గర సినిమాలు, నాటకాలు, రికార్డింగ్ డ్యాన్సులు.. పోటీపడి వేస్తారు. వేకువ జాము మూణ్ణాలుగ్గంటలకు పీర్లు ఊరు చుట్టూ తిరుగుతాయి. ట్రాక్టర్ల మీద డూపు హీరోలు, హీరోయిన్లు ఎగురుతుంటే జనాలకు సందడే సందడి.

పదిగంటలకల్లా పీర్లు ఊరు చుట్టూ తిరుగుతుంటే నీళ్లతో వారు పోసేవాళ్లు పోస్తూనేవున్నారు. అందరు ఇళ్ల నుంచి బయటికొచ్చి చూస్తున్నారు. సాయిబుల పిల్లలు ఎగురుతుంటే దానికి అనుగుణంగా మేళం మోగుతోంది.

పీర్ల ఊరేగింపు తిరుగుతూ తిరుగుతూ ఊరి మధ్యలో ఉన్న రాంసామి మేడ దగ్గరి కొచ్చింది. పీర్లు అన్నీ వరుసగా నిలబడ్డాయి.  ఏ పీరు కాడున్న మేళగాళ్లు ఆ పీరు దగ్గర వాయిస్తున్నారు. సన్నాయిలు శృతిమించి మోగుతున్నాయి. జనాలందరూ విరగబడి చూస్తున్నారు, ఎగిరేవాళ్లు ఎగురుతూనే ఉన్నారు.

అప్పటికే మేళగాళ్లకి మందు సరఫరా అయింది. సుబ్బులుకి, వాళ్లన్నకు మందు అలవాటు లేదు. మిగిలిన పీర్లకాడ వాళ్లు తాగిన మైకంలో వాయిస్తున్నారు. అలకురపాటి ఎంకట్నర్సు రేపు చూసుకుందాం అన్నట్లు సుబ్బుల్ని చూసి తలెగరేశాడు. కొత్తపట్నం సీను సన్నాయిని గుండ్రంగా తిప్పుతూ సై అన్నట్లు చూశాడు. సుబ్బులుకు కోపం నసాళానికి అంటింది.' నా కొడుకులు వాయించేది తక్కువ.. ఊగేది ఎక్కువ' అనుకున్నాడు. నిటారుగా నిలబడి డోలు వాయిస్తున్నాడు. అట్లా పోటీ రంజుగా సాగుతుంటే 'టైం లేదు .. టైం లేదు.. పదండి.. పదండి' అంటూ సాయిబుల్లోని పెద్దలు పీర్లని ముందుకు కదిలించారు.

మరుసటి రోజు గుమ్మటాలు. అదే చివర్రోజు. గుమ్మటాలన్నీ ఊర్లోని పెద్ద బజారుగుండా సముద్రానికి వెళతాయి. అక్కడే వాట్ని కలిపేస్తారు.

ఆరు గంటలకల్లా గుమ్మటాలు సాయిబులపాలెంలో బైలుదేరాయి. ఒక్కో గుమ్మటం దగ్గర జనాలు ఇసకేస్తె రాలనంతగా ఉన్నారు. ఒకచోట ఒకరు చేతిరుమాలును పళ్ల మధ్య బిగించి నాగిని నృత్యం చేస్తుంటే, మరోచోట ఇంకోడు పులి డ్యాన్స్! ఇలా అన్ని గుమ్మటాల దగ్గరా కోలాహలం. ఊరు ఊరంతా కులం, మతం, ఆడ, మగ భేదాల్లేకుండా ల గుమ్మటాల చుట్టూరా ఉంది.

గుమ్మటాలన్నీ జాలమ్మ చెట్టు దగ్గరకు వచ్చాయి. అక్కడ బజారు పెద్దదిగా ఉంటుంది. నాలుగు గుమ్మటాలని వరసగా నిలబెట్టారు. వాటి ముందు మేళగాళ్లు.. వాళ్ల ముందు ఎగిరేవాళ్లు. పోటీ ప్రారంభమయింది అనుకున్నారు చూసేవాళ్లంతా. అప్పటికే వాయించేవాళ్లు తాగున్నారు. ఒక్కొక్కరు మోకాలి దండేసి డోలు కొడుతున్నారు. సన్నాయిని గాల్లోకి తిప్పుతు ఆకాశం కేసి చూస్తూ ఊదుతున్నారు.   రాగాలు, తాళాలు మారుమోగుతున్నాయి. ఎగిరేవాళ్లకు అనుగుణంగా వాయిస్తున్నారు.

సుబ్బులు నిశ్చలంగా నిలబడి ఒక మౌనిలా వాయిస్తున్నాడు. తాళాలన్నీ శృతికి అనుగుణంగా పడుతున్నాయి.

ఎంకట్నర్సు సుబ్బులు వంక చూసి కొత్త తాళం అందుకున్నాడు. అక్కడి సన్నాయిలూ అందుకు అనుగుణంగా మారిపోయాయి. సుబ్బులు కూడా కొత్తతాళం ఎన్నుకున్నాడు. కొత్త కళాసృజన ప్రారంభమయింది.

సుబ్బులు దుమికే జలపాతంలా మారిపోయాడు. జనాలందరూ సుబ్బులు డోలు చూడ్రా! ఎట్టా మోగుతుందో! అంటూ ఆ గుమ్మటం దగ్గరకు వచ్చేస్తున్నారు. వస్తూ వస్తూనే ఊగిపోతూ ఎగురుతున్నారు. డోలు గట్టిగా మోగుతోంది. మోగుతూ మోగుతూ ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. డోలు కుడి మూత టప్పుమని పగిలిపోయింది. సుబ్బులుఉ నిశ్చేష్టుడైపోయాడు. ముఖాన నెత్తుటి చుక్క లేకుండా పోయింది. గుండె ఆగిపోయిందనుకున్నాడు. యుద్ధం మధ్యలో అస్త్రాలు కోల్పోయిన సైనికుడిలా నిలబడిపోయాడు.

అంతలో సుబ్బులు తమ్ముడు వెంకటేశ్వర్లు తన మెడలో ఉన్న డోలు తీసి సుబ్బులు మెడలో వేశాడు.'నువ్వు ఒక్కడివి చాలు. వాయించన్నా!'అన్నాడు. పక్కనే ఉన్న సుబ్బులు అన్న సన్నాయిలో కొత్తరాగాన్ని ఎత్తుకున్నాడు. సుబ్బులు తనను తాను నిలదొక్కుకున్నాడు. ఎడం మూతపై వేళ్లను సప్తస్వరాలుగా కదిలించాడు. కుడి మూత మీద పుల్లను దానికి తగ్గట్లుగా నర్తింపచేశాడు. ఇప్పుడు మంగలి సుబ్బులు సుబ్బుల్లా లేడు. మ్స్రొ సృష్టి చేస్తోన్న బ్రహ్మలా మారిపోయాడు.

ఆ ధ్వని అందరి మనసుల్లోకి చొచ్చుకునిపోతోంది. వాళ్లల్లో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. అందరూ మంత్రముగ్ధుల్లా మారిపోయారు. అన్ని గుమ్మటాల నుంచి జనాలు వచ్చి చూస్తున్నారు. ఎగిరేవాళ్లు కూడా నిశ్చలంగా నిలబడిపోయారు. ఒక తపస్సమాధిలో ఉన్నట్లు సుబ్బులు వాయిస్తూనే ఉన్నాడు.

నిజానికి సుబ్బులు డోలు నేర్చుకోలేదు. తండ్రి వాయిస్తుంటే చూసి నేర్చుకున్నాడు. జవజీవాల్లో నిక్షిప్తమైన కళకు,  నేర్చుకున్న కళకు ఉన్న తేడా సుబ్బుల్ని చూస్తే తెలుస్తుంది.

వెంటనే వెంకట్నర్సు డోలు పక్కన పడేసి సుబ్బులు ముందు కొచ్చి 'అన్నా..' అన్నాడు. మిగతా గుమ్మటాల దగ్గర ఉన్న సాయిబులందరూ కూడా సుబ్బులు దగ్గర కొచ్చారు. మేళం రసపట్టులో ఉన్నప్పుడు ఎదుటివాడు డోలు మీద నుంచి పుల్ల తీయడమే ఒక పెద్ద అవమానం. కానీ, వెంకట్నర్సు 'అన్నా,.. మీ ఊరు మీదే!మా ఊరు మా ఊరే!' అన్నాడు ఉద్వేగంగా.

తర్వాత గుమ్మటాలు నెమ్మదిగా సముద్రం వైపు కదిలాయి. అప్పటికే సమయం రాత్రి తొమ్మిదయింది. సముద్రం నిశ్శబ్దంగా వెన్నెట్లో మెరుస్తోంది.

రచయిత (పేరు - తెలియదు) ;

(ఆంధ్రజ్యోతి ఆదివారం 16,మే, 2010 సంచికలో ప్రచురితం)

సెల్: 9848425039

సేకరణః కర్లపాలెం హనుమంతరావు

07, 12 డిసెంబర్, 2020






*** 

 

 

Saturday, December 5, 2020

వేంపల్లి షరీఫ్ కథ ' పర్దా - నా పరామర్శ - కర్లపాలెం హనుమంతరావు





ఇప్పుడే చదివాను . ముగిసిన తరువాత మనసంతా అదోలా చేదయిపోయింది . 
మనిషి జీవితంలోని  కష్టసుఖాలకు  తిండి, బట్ట, తలదాచుకునే  ఇంత నీడ .. ఇవి కరవు అవడమే కారణమనుకుంటాం సాధారణంగా. నిజమే ఇవి ప్రాథమిక అవసరాలే .. తీరనప్పుడు జీవితం దు:ఖ  భాజనం తప్పక అవుతుంది. ఇవన్నీ ఆర్థికంతో ముడిపెట్టుకుని ఉన్న అంశాలు . చాలినంత డబ్బు సమకూరితే ఇక మనిషికి  ఏ తరహా కష్టాలు  ఉండవు. కష్టాలు ఉండనంత మాత్రాన బతుకంతా సుఖమయమయిపోతుందనా అర్ధం? జీవితం ఒక ముడి పదార్థం మాత్రమే అయితే, లాజిక్ ప్రకారం  నిజవే అనిపిస్తుంది. అదే నిజమైతే మరి  బాగా డబ్బుండి ప్రాథమిక అవసరాలు అన్నీ తీరిపోయే వారికి ఇక ఏ కష్టాలు ఉండకూడదు. . కదా మరి ? కానీ వాస్తవ జీవితాలు ఆ విధంగా లేవే!  అన్నీ సదుపాయాలు సమకూరి బైటికి సలక్షణంగా జీవితం గడుపుతున్నట్లు కనిపించేవాళ్లూ లోలోన ఏవో కుంగుబాటుల్లో .. తాము పరిష్కరించుకోలేని తాము ఏర్పరుచుకోని కట్టుబాటుల మధ్య ఇరుక్కుపోయి బైటికి రాలేక... వచ్చే మార్గం తెలేక .. తెలిసిన వాళ్లు అందుబాటులో లేక  అనుక్షణం బైటికి చెప్పుకోలేని సంక్షోభం మధ్య  నలిగిపోతుండటం కనిపిస్తుంది. అట్లాంటి నిష్ప్రయోజనమైన,   నిరాధారమైన  ( మూఢ ) విశ్వాసాల మధ్య  ఇరుక్కుని నలిగిపోయే బడుగు తరగతి సంసారుల సంఘర్షణ ఇతివృత్తంగా అల్లిన వేంపల్లి షరీఫ్ 'పర్దా' కథ కరుణరసార్ద్రంగా ఉంది. 

కథలో రచయిత ప్రధమపురుషలో  వినిపిస్తున్నట్లు అనిపించే దిగువ మధ్య తరగతి పట్టణ  ముస్లిం కుటుంబ నేపథ్యంలోని ఒక ముసలి అవ్వ కథ  ఇది .  కాని, నిజానికి ప్రతి ముస్లిం పేద కుటుంబంలోనూ పొద్దు వాటారే దశలో ఉండే స్త్రీలు ఎదుర్కొనే  విచిత్రమైన సమస్యను ఈ కథకు వస్తువుగా ఎంచుకున్నందుకు రచయిత అభినందనీయుడు  .  
ఇస్లాం కుటుంబాలలో ఇప్పటికీ  ' పర్దా' పద్ధతి  స్త్రీ లోకం పాలిట ఒక పెను శాపంగానే లోలోపల రగులుతూనే  ఉంది. ప్రభుత్వం తాను తెచ్చినట్లు చెప్పుకునే   చట్టాలు నిత్య జీవితాలలో ఆమోదయోగ్యమై ఆచరణ స్థాయి దాకా ఎదిగిరావాలంటే ముందు అందుకు సంబంధించిన  సమాజాలలో మానసికపరమైన పరిణతి స్థాయి పెరగడం అవసరం .  ఆచరణ స్థాయి దాకా తీసుకురాలేని సంస్కరణలు  ఎన్ని  సంక్షేమ పథకాలు, చట్టాల రూపంలో  ప్రదర్శనకు పెట్టినా అవి కేవలం ఏ బుక్కుల్లోనో  నమోదయి .. ఉండేందుకు, మరీ అత్యయిక పరిస్థితుల్లో ' షో ' చేసేందుకు మాత్రామే  పనికివస్తాయి. 
ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉండి వెంటనే పెళ్లి చేసి పంపేయగల  తాహతు  లేని ముస్లిం కుటుంబాలలో ' పరువు ' భయం కోసం పరదాల మరుగున ఆడపిల్ల సరదా సంతోషాలకు ఓ రెండు గదుల హద్దులు గీసేయటం ఒక అమానుష దృశ్యమయితే   .. ఏ పరదాల మరుగునా తిరిగే అవసరం లేని గ్రామీణ వాతావరణంలో బిడ్డల ఎదుగుదల కోసం మత విన్వాసాలను కూడా కాదనుకుని  సంసారం నెట్టుకొచ్చిన ఒకానొక తరం నాటి  ముసలవ్వ  ఇప్పుడు ఆ పర్దా .. గోషాల మధ్య  కొత్తగా ఇరుక్కుని మసలవలసిన పరిస్థితులు తోసుకురావడం మరింత అమానుషంగా  ఉంటుంది. తెంచుకోలేని మతమూఢ  విశ్వాసాల మూలకంగా మానవ సంబంధాలు, కుటుంబసంబంధాలు, చివరికి పేగు బంధాలు కూడా ఎంతటి  కఠిన పరీక్షకు నిలబడవలసి  వస్తుందో   అతి సహజంగా చిత్రించాడు రచయిత. కధ ఆసాంతం ఎక్కడా ఏ అతిశయోక్తులు.. అలంకారాల జోలికి  పోకుండా నిరలంకారప్రాయంగా రచయిత చెప్పుకొచ్చిన శైలీ శిల్పాల  కారణంగా కథ చదివినంతా సేపే కాదు , చదిలిన తరువాతా చెదిరిన మనసును కుదుటపడనీయదు . 
కాలం మినహా మరెవ్వరూ  పరిష్కారం చూపించలేని ఈ తరహా సమస్యలను ఎప్పటికప్పుడు సాహిత్యంలో చర్చించకపోతే.. సమాజం సంస్కారయుతంగా మారాలన్న ఆలోచనే ఆరంభమయే అవకాశాలు సన్నగిల్లిపోతాయి. 
తనకు తెలిసిన తన ప్రపంచపు తమ ఒకానొక  తీవ్రమైన సమస్యను పది మంది ముందు ఏ మెహర్చానీ పెట్టుకోకుండా చక్కని కథ రూపంలో చర్చకు పెట్టి ప్రగతిపథకాముకుల మనసుల్లో అలోచనలను ప్రేరేపించినందుకు  మిత్రుడు వేంపల్లి షరీష్ బహుధా అభినందనీయుడు! సాహిత్య లోకం నుంచి కృతజ్ఞతలకు అర్హుడు. 👏👏❤️✌️😎
- కర్లపాలెం హనుమంతరావు.
5, డిసెంబర్ 2020 
బోథెల్; వాషింగ్టన్ రాష్ట్రం 
యు.ఎస్.ఎ 
వాట్సప్: +918142283676 


Sunday, November 29, 2020

తాడికొండ శివరామశర్మ ' రహస్యం ' మంచి కథానిక - నా పరామర్శ

 తాడికొండ శివకుమార శర్మ కథానిక ' రహస్యం '  ప్రెన నా పరామర్శ 

కథను ఉత్కంఠతో చదివించే అనేక సుగుణాలలో ఒకటి -కథకుడి దృష్టి కోణం . అందరికీ తెలిసి అందరం ఒక విధంగా భావించే ఒకానొక ప్రముఖ సంఘటనను వస్తువుగా ఎంచుకొని .. దానిని విస్మయం కలిగించే మరో అనూహ్య కోణంలో ఆవిష్కరించడం ! ' ఆహా( ' అని అబ్బురపరచే ఆ కొత్త కోణం తర్కానికి అనువుగా సాగితే ఆ కథ నిస్సందేహంగా  గుర్తుంచుకోదగ్గ కథలలో చేరుతుంది. రచన  శాయి గారి కథావాహిని - 2005 లో కనిపించే తాడికొండ శివకుమార శర్మ కథానిక ' రహస్యం 'ఈ తరహా మరపురాని కథలలో ఒకటి.

భారతంలోని చిన్న కథ - ద్రోణాచార్యులవారు   ఉదరపోషణార్థమై రాచ కొలువులో ఉద్యోగం కోసరం అన్వేషించేనాటి కథ. హస్తిన రాచవీధులలో బాల కురుపాండవులు ఆడుకునే బంతిని బావిలో గిరాటేసుకుని  బైటికి తీసే సాధనాలు , ఉపాయాలు అందుబాటులో లేక బిక్కమొగాలతో  నిలబడి ఉన్నప్పుడు కాకతాళీయంగా అటుగా వచ్చిన ద్రోణాచార్యులు శర సంధానంతో సమస్యను పరిష్కరించడం- దరిమిలా ఆచార్యులవారికి  రాచ కొలువులో గురు పదవి  ఖాయం కావడం అందరికీ తెలిసిన కథ . నీటిలో పడిన బంతి శాస్త్రరీత్యా శరసంధానం ద్వారా బైటికి రావడం  అసాధ్యం. బంతి జడత్వాని కన్నా ఎక్కువ జడత్వం కలిగిన బాణం ఎంత చెక్క పదార్ధంతో చేసినదైనా నిట్టనిలువుగా నిలబడదు. బాణానికి బాణం సంధించి తాడులా పేని బంతిని బైటికి తీసినట్లు మా చిన్న తనంలో బాలల బొమ్మల భారతంలో బొమ్మ వేసి మరీ    చెప్పిన  కథను బాలలం కనక నమ్మాం. కానీ చిన్న పిల్లల మల్లే కాకుండా బుద్ధి వికాసం సాధించిన పెద్దలూ  అంత బలంగా  ఎలా నమ్ముతున్నారో !  

' కథకు కాళ్లుండవు ; ముంతకు  చెవులుండవు' అన్న సూత్రం అండ చూసుకొని మరీ చెవుల్లో    పూలుపెట్టే కాల్పనిక సాహిత్యం విశ్వవ్యాప్తంగా వినవస్తున్నదే !  కానీ ఆ తరహా కాల్పనికత బాలల్లో మాత్రమే మనోవికాస అభివృద్ధిని ఉద్దేశించినది.  పెద్దలకు కాదు . పురాణ,ఇతిహాసాలలో  పుట్టలు  పుట్టలుగా కనిపించే ఈ వింత కట్టు  కథానికల పరమార్ధ౦ మరేమైనప్పటికీ , ఆ తరహా అభూత కల్ప నను కథాంశంగా ఎంచుకొని దానికి ఓ శాస్త్రీయత ఆపాదించే తాడికొండ శివకుమార  శర్మ ప్రయత్నం నిశ్చయంగా తెలుగు కథ వరకు సరికొత్త ప్రయోగం ; సదా అభినందనీయం ! 

నూతిలోని నూలు బంతిని శర సంధానంతో కాకుండా పై మీది  అంగవస్త్రంలోని తేలికపాటి దారపు పోగులతో   తాడుగా పేని బాణానికె  కట్టి  సంధించడం ద్వారా బంతిని గురువులు బైటికి  తీసినట్లు కథకుడు చేసిన ఊహ శాస్త్రీయ పరిధులలో ఉంటూనే సమస్యకు  చక్కటి పరిష్కారంగా అనిపిస్తుంది! అంతకు మించిన లౌక్యం ప్రదర్శిస్తాడు ద్రోణాచార్యులు పాత్ర  ద్వారా .. అతగాని శిష్యుల శస్త్ర ప్రయోగ నైపుణ్యం పరీక్షకు పెట్టే సందర్భంలో !

చెట్టు మీద ముందే పెట్టించిన మట్టిపిట్ట కంటిని గురి చూసి కొట్టమన్నప్పుడు 105 మంది కురుపాండవులలో ఒక్క అర్జునుడు మినహాయించి  అందరూ వైఫల్యం చెందిన కథ మనకు సుపరిచితం.   శిక్షణ బాధ్యత నెత్తికెత్తుకున్న గురువుల సామర్ధ్యం  శిష్యుల పనితనాన్ని (performance) ను బట్టి బేరీజువేసే నేటి రివాజు భారత కథ నడిచిన రోజులకూ అన్వయించి రచయిత చేసిన కల్పన   తెలుగు కథకు   కొత్త ప్రయోగం! చెట్టుమీది పిట్ట కంటిని సూటిగా కొట్టడంలో విజయం సాధించింది 105 మంది శిష్యులలో ఒక్క అర్జునుడే! ఆ నిజం భీష్మాచార్యులవారి   దాకా చేరితే పరువుతో సహా ద్రోణాచార్యులవారి  కొలువుకూ ముప్పు ఖాయం. ఉదరపోషణ కోసం    మరో దారి వెతికే శ్రమ  తప్పించుకునే నిమిత్తం ఆచార్యులవారు ఆ పద్ధర్మంగా  ప్రదర్శించిన లౌక్యం నేటి కాలపు విద్యా రంగంలోని మాయా మర్మాలకు ఏ మాత్రం తీసిపోనిది! విద్యార్థుల నైపుణ్య ప్రదర్శనకు  నలుగురికీ తెలిసే బహిరంగ విధానం కాకుండా in- door మెథడాలజీని ఆశ్రయిస్తాడు ద్రోణాచార్యులు. భోజనానంతరం శస్త్ర పరీక్షలకు ముందు   మరికొన్ని పరీక్షలు నిర్వహించిన మీదట రచయిత గురువుగారి  పాత్ర ద్వారా చమత్కారంగా చెప్పిన అసలు రహస్యం  ఏమిటంటే ఒక్క అర్జునుడికి మినహా మిగతా శిష్యులందరికీ దూరాన ఉండే వస్తువులు సృష్టంగా  కనిపించని కంటి దోషం! భారత కాలం నాటికి చికిత్స ప్రక్రియ ద్వారా కంటి దోషాలు సరిదిద్ద గలిగే వైద్య విజ్ఞానం అభివృద్ధి చెందలేదు.. ఉన్న విషయం బైటపెట్టి కొలువు ఇచ్చిన పెద్దల ఆగ్రహానికి గురికాకుండా నేడు  ప్రభుత్వాంగాలలోని అధికారులు , ఉద్యోగులు ఏ విధంగా తిమ్మిని బెమ్మిని చేస్తారో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ! అదే రహస్య పంథాని     అనుసరించిన ద్రోణాచార్యులు  కురుపాండవుల  కంటి సమస్యలను ధృతరాష్ట్ర , భీష్మాచార్యుల నుంచి  దాచిపెట్టి.  వేరే రాచ విద్యలు నేర్పించేందుకు  అనుమతి తీసుకుంటాడు. విలువిద్య అంటే గురి చూసి ప్రయోగించే యుద్ధ కళ. దుర్యోధన, భీమసేనుల వంటి వాళ్లకు వంటబట్టించిన గదాప్రహారం తరహా విద్యలకు గురితో పనిలేదు కదా ! విల్లు కాకుండా మరే ఇతర ఆయుధాలు ప్రయోగించినా కనీసం  కుడి వైపు వారి మీదో , ఎడమ వైపు వారి మీదో దెబ్బ పడటం ఖాయం' అంటూ గడుసుగా ముక్తాయించడం  కథాంతంలో రచయిత ప్రదర్శించిన  చక్కని చమత్కారం.    ' రహస్యం' కథానిక కలకాలం గుర్తుండి పోయేందుకు కారణం కథనం, శిల్పం కన్నా  రచయిత ఎంచుకున్న కథాంశం . . దానికి ఆపాదించిన శాస్త్రీయ దృక్పథం, కొత్త తరహా ప్రయోగశీలత; చమత్కారం అదనం. కథలన్నింటినీ బలాత్కారంగా ' సామాజిక స్పృహ ' బరిలోకి దించనవసరం లేదు. నవీన ప్రయోగం, సృజనాత్మక కాల్పనిక దృష్టి వంటివీ  కథానికకు పుష్టి చేకూర్చే దిట్టమైన సరుకులే! '

తాడికొండ శివకుమార శర్మగారికి మనసారా అభినందనలు! 

 - కర్లపాలెం హనుమంతరావు

బోథెల్ ; యూఎస్.ఎ 

29 - 11 - 2019











Thursday, November 26, 2020

కాఫీ అయ్యర్ -హాస్య కవిత - గుండిమెడ వేంకట సుబ్బారావుగారు

 



 

సర్వసర్వంసహావ్యాపి  సర్వజీవ- జీవనాధారుడగు నొక్క దేవుడెవడో

కల డనగ  విందు గాని నిక్కం బెరుంగ!- వాడదృశ్యుండు మాకేల వాని గోల?

చండార్క కిరణప్రకాండముల్ చొరలేని దండకారణ్య మధ్యమున నీవు!

పేరు చెప్పినమాత్ర నీరు గడ్డలు గట్టు తుహినాచలాగ్రమందునను నీవు!

కడలేని జలరాశి గర్భమందు నడంగి కనరాని దీవులందునను నీవు!

దిగ్దిదిగంతశ్రాంత దేశదేశములందు గల యూళ్ల వాడవాడలను నీవు!

అయ్యరూ! యింక నీవు లేనట్టి తావు- కలదె పరికింప నెందు భూవలయమందు!

అహహ! యింక సర్వవ్యాప్తి యనగ నెవడు-దేవు డన నింక నెవడోయి నీవుగాక!

సకలవిశ్వస్థకీటకకోటి నీ ఫలహారసామాగ్రియం దైక్యమయ్యె!

ఇడెను ముక్కల కాసబడి కుక్క లిప్పుడు మలభక్షణాసక్తి మానుకొనియె!

వాయసంబులు నేడు వాయుసమ్మార్జన ప్రక్రియల్ మాని నీ పంచ చేరె!

గర్భస్థపిండముఖ్యసమస్తమనుజసంఘమ్ము నీ, కాత్మార్పణ మ్మొనర్పె!

భళిరా! జీవకో ట్లిటుల  జీవనవిరక్తి- మాని, యనురక్తి నీపాద మానియుండె!

సరికదా! యింక జగతిలో సర్వజీవ -జీవనాధారుడెవడోయి నీవుగాక!

అయ్యరూ! పృథ్విలోన మాయామనుష్య-మూర్తియైన యా రఘురామమూర్తివోలె

ఈవు నినుగూర్చి సుంతేని యెరుగనేమొ?- సత్యముగ నీవు దేవాంశసంభవుడవు!

పూర్వ మెపుడొ విష్ణువు జగన్మోహినియయి-అమృతమును పంచెనంట సురాసురులకు!

ఇట జగన్మోహనుండవై యీవు నిడవె= అమృత రూపాంతరం బైనయట్టి కాఫి!!

టీ యని, కో కో యని, కా-ఫీ యని, యెద్దాని వింత పేర్లిడి యమృత

ప్రాయంబుగ గొందురొ, యది- యే  యమృతంబని తలంప రేలనొ జనముల్!

నీవె ప్రత్యక్షదైవంబు!  నిన్ను మించు- దేవు డన్యుండు లేడు పృథ్వీస్థలమున!

కలియుగంబున లోకరక్షణము కొరకు - అయ్యరను  పేర దేవుడే యవతరించె!!

***

(భారతి మాసపత్రిక, 1929, జూన్ సంచికలో ప్రచురితం)

 

Saturday, September 26, 2020

చేతిరాత జాతకం మారేదెప్పుడు? -కర్లపాలెం హనుమంతరావు- సూర్య దినపత్రిక ప్రచురణ

 


 

గౌరవనీయులైన ఓ మేజిస్ట్రేట్ గారిని  చదివే తీరులొ చేతితో తీర్పులు రాయాలని కేరళ హైకోర్టు మొన్నీ మధ్యన మందలించిన ఘటన  చదివినప్పుడు చేతిరాతను గురించిన కొన్ని  చిత్రమయిన సంగతులు గుర్తుకొచ్చాయి. బ్రహ్మరాత పద్ధతిలో మందుల చీటీ రాసిచ్చినందుకు ముగ్గురు వైద్యశిఖామణుల శిఖలు పట్టుకు ఝాడించిన అలహాబాద్ కోర్టు ఉదంతం అందులో ఒకటి.

 

చిన్నతనంలో కాపీ బుక్కులు ఎన్ని నింపినా, ఎదిగొచ్చి సెల్ఫోన్ చిక్కిన తరువాత చేతితో రాసేందుకు చిన్నబుచ్చుకునే నడమంత్రపు నాగరీకం ప్రస్తుతం నడుస్తున్నది! కంప్యూటర్లు,  సెల్ఫోనులు వంటి ఐ-సరంజామా చేతి కొచ్చి  అక్షరమాల, అనూ-లంటూ ఫాంటుల  మోహజాలంలో పడ్డప్పుడు, మనిషికి  చేతిరాత మీద కొంత రోత మొదలవుతుంది! కొత్త శతాబ్దిలోకి కాలం అడుగు పెట్టినప్పటి బట్టి పుట్టుకొచ్చిన సజ్జుకంతా కీ-బోర్డుల మీద వేళ్లు టకటకలాడించటం ఒక్కటే  తెలుస్తున్న రాతవిద్య! నేటి ఉపాధులకు  కీ-బోర్డు విద్యలు కీలకమే. అలాగని, ఓపిగ్గా ఓ సారి పెన్ను కేప్ ఓపెన్ చేసి నింపాదిగ కలానికి పని చెప్పనంత నిరాసక్తతే వింత!

 

కార్డు ముక్క గిలికే రోజుల్లో   చేతిరాతే  మహారాజు!  ఫాస్ట్ కాలానికి అనుగుణంగా ఈ-మెయిళ్లు దూసుకురావడం,  పోస్ట్‍ కార్డు కనుమరగువడం.. చేతిరాతకు ఎదురయిన పెనుగండం!  ఇసుక-అక్షరం నుంచి ఈ-అక్షరం దాకా చేతిరాత కథ మహాభారతమంత. ఇవాళ ఇంగ్లీషు బడి పిల్లగాడికి  వందేళ్ల కిందటి బుడతడికి మల్లే నేల అంటకుండా వేలుతో అక్షరాలు దిద్దవలసిన అగత్యం లేదు. ఐదేళ్ల కిందట ఫిన్లాండ్ దేశం చిన్నబడి పిల్లలక్కూడా కీ-బోర్డు వాడకం తప్పనిసరి చేసింది. ఆ తరహా అదుపాజ్ఞలేవీ మనకు లేకపోవచ్చు. కానీ చేతిరాత తలరాతకు మన సమాజంలో మాత్రం ఏమంత సానుకూలత ఉండడం లేదిప్పుడు. సంతకం ఒక్కటే  చేతిరాత వంతులా ఉంది  తంతంతా.

 

రాయించెడివాడు ఏ రామభద్రుడయినా రాసెడివాడి రాతలో తేడా ఉండటం లేదిప్పుడు. అంతా కంప్యూటరమ్మ రాత మహిమ! అక్షరాలను బట్టి రాసే మనిషి అంతరంగాన్ని విశ్లేషించే శాస్త్రానికి నిన్న మొన్నటి దాకా యమ డిమాండ్! అదీ అప్రస్తుతం అయిపోతోంది ప్రస్తుతం. కనీసం నేరాంగీకార పత్రం మీద అయినా నేరుగా దోషి  స్వహస్తాలతో తప్పు ఒప్పుకునే పద్ధతి తగ్గుతున్నదిప్పుడు. చదువుకొన్నవాడికీ చదువురాని వాడికీ కీబోర్డు మీటలే సర్వం సిద్ధం చేసిపెడుతున్నప్పుడు  చేతిరాతకు ఇక సాయం పట్టే సిద్ధివినాయకుడెవడు?!

 

చిన్నతనంలో  కాపీ బుక్కుల మీదాట్టే ధ్యాస పెట్టనందుకు బాపూజీ అయిన పిదప గాంధీజీ గిల్టీ ఫీలయ్యారు. కంప్యూటర్ల కాలంలో పుట్టలేదు కాబట్టే నోబెల్ గ్రహీత  ఠాగోర్ రంగు కాగితాల మీద   అక్షరాలు పూల తీగెల్లాగా ఎలా అల్లేవారో  తెలుసుకునే వీలుకలిగింది. జాతుల తలరాతలు మార్చిన నేతల  చేరాతలు ఎక్కువగా  గజిబిజిగానే ఉంటాయి. ఎందుకో? అదో  చిత్రం!  వనితల చేరాతలు వారి అంతరంగ అద్దాలకు మల్లే కళకళలాడతాయి. అదీ విచిత్రమే! తాతల కాలంలో పెద్దల రాతలు గొలుసుకట్టు తీరులో కలం దింపకుండా ఒకే ఊపులో సాగేవి.  పద్దుపుస్తకాలలో వ్యాపారస్తులు    మెలిక రాతల్లో వివరాలు తమాషాగా దాస్తుండేవాళ్ళు. బాపు  వంటి గీతకారులయితే ఏకంగా చేతిరాతల జాతకాలే మార్చేశారు.

 

అచ్చు యంత్రం ముందు నాటి మహద్గ్రంథాలన్నీ గతకాలపు మహాకవుల చేరాతలే కదా! చేతితో చెక్కే అద్భుత విద్య మనిషికి అబ్బకపోయి ఉండుంటే? ఉండవల్లి,  అజంతా, ఎల్లోరా వంటి గుహా కుద్యాల మీదిప్పుడు కనిపించే శాసనసంపద మన దాకా వచ్చేదే కాదు. రోజుకోటి చొప్పున తాళపత్రాల పైన తాళ్లపాక అన్నమయ్య  దేవుడికర్పించిన కీర్తనలన్నింటికీ చేతిరాతే కదా ఆలంబన! త్యాగరాజయ్యరు గాలికి పాడి వదిలేసిన రాగాలను శిష్యులు చేఅక్షరాలుగ మార్చి తాటాకు దొన్నెలకు పట్ట బట్టే దక్షిణాదికి ఒక కొత్త సంగీత సంప్రదాయం పట్టుబడింది! ఆ చేతిరాత వైభవమంతా చెల్లిపోయేలా చేతులెత్తేయడం తాతలిచ్చిన సంప్రదాయానికి జెల్లకొట్టడమే! భారత రాజ్యాంగ చట్టం ముచ్చటైన చేతిరాతల్లోనే    శాశ్వతత్వం సాధించుకొందన్న సత్యం.. భారతీయులమై ఉండీ మనం మర్చిపోతున్నాం! మహా దురదృష్టం.

 

మానవ సమాజం మీద పడ్డ అక్షరం ముద్ర మామూలుది కాదు, ఈనాటిదీ కాదు. ఇండియన్ యాంటిక్వరీ (Indian  Antiquery) రాసిన డాక్టర్ బూలర్  భారతీయులకు ఈ అక్షరాలు చేతితో రాసే అపూర్వ విద్య  క్రీస్తు పుట్టుకకు ఎనిమిదొందల ఏళ్లకు పూర్వమే తెలుసన్నాడు. పండిత్ గౌరీశంకర్ హీరాచంద్ర ఓఝా క్రీస్తుకు పూర్వం పదహారు, పన్నెండు శతాబ్దాల మధ్యకే ఉత్తరాలు రాసే కళ ఉత్కృష్ట దశకు భరతజాతి చేరుకుందని నిరూపించాడు. 'షణ్మాసికే తు సంప్రాప్రే భ్రాంతిస్సంజాయతే యతః, ధాత్రాక్షరాణి సృష్టాని పత్రారూఢాన్యతః పురా'- ఏ విషయం తెలిసినా ఎంత ఏనుగు జ్ఞాపకశక్తి కలిగి ఉన్నా ఆరు నెలలు గడిస్తే మనిషికి కొంత మతిమరుపు సహజమని జీవశాస్త్రవేత్తల భావిస్తారు. మనిషి మతిమరుపు కతలు ముందుగా తెలిసే అతగాడి ఆ ముదురుజబ్బుకు మందుగా  బ్రహ్మదేవుడు వర్ణమాల వరంగా ప్రసాదించాడని బృహస్పతి స్మృతి! రజస్వల అయి రాసినమ్మకు బట్టతలతో బిడ్డ పుడుతుంద'ని కృష్ణయజుర్వేద సంహిత ద్వితీయ కాండ చెబుతుంది. 'యాప్ర లిఖతే తస్యైఖలతిః' అన్న ఆ సూక్తిని బట్టి చూస్తే అక్షరాలను గురించి, వాటిని చేతితో రాయడాలను గురించి యుగాల కిందటే భరత ఖండంలో బ్రహ్మాండమైన చర్చ జరిగిందని బోధపడటంలేదా! 

 

వ్యాసుడు చెప్పుకుపోతుంటే విఘ్ననాయకుడు రాసుకుపోయాడంటారు పంచమవేదం. వ్యాస మహర్షి కాలం సుమారు 5 వేల సంవత్సరాల కిందటిదని ఒక వాదం. చేతిరాత సహస్రాబ్దాల  బట్టి ఆర్షభూమిలో పరంపరగా  కొనసాగుతోన్న హస్తకళ అనేందుకు  వందల కొద్దీ ఉదాహరణలు చరిత్రగని తవ్వే  కొద్దీ బైటపడతాయి. చక్రవర్తి కుమారుడైనా సరే, చౌలమైన(పుట్టెంట్రుకలు తీసే సంస్కారం) తరువాత అక్షరాలు నేర్చుకు తీరాల్సిందే అన్న 'వృత్త చౌల కర్మా లిపిం సంఖ్యానం చోపయుంజీత' అనే కౌటిల్యుడి అర్థశాస్త్ర విధి అందులో ఒకటి.   వాల్మీకి మహర్షి ఆ విధంగానే చౌలసంస్కారం చేయించి మరీ లవకుశులకు అక్షరాలు దిద్దించినట్లు భవభూతి కథనం. కాళిదాసు కూడా రఘువంశంలో అజుడు లిపి పరిజ్ఞాత అయిన తరువాతనే సంస్కృత సాహిత్య సముద్ర ప్రవేశం చేసినట్లు రాసుకొచ్చాడు. బాణుడు చంద్రాపీడ మహారాజు విద్యామందిరంలో అరో ఏట అడుగుపెట్టింది మొదలు ఏ విధంగా విద్యను అభ్యసించాడో వివరించాడు. విశ్వామిత్రుడి మతం ప్రకారం పిల్లలు అయిదో ఏట పడగానే  అక్షరాల గుంట ముందు కూలబడాలి.  పండిత భీమసేన్ వర్మ కృత 'షోడశ సంస్కార విధి' గ్రంథానుసారం అజ్ఞాతుడైన రచయిత రాసిన స్మృతిని బట్టి 5, 7 వయసుల్లో అక్షరాలు నేర్చుకోవడం వటువులకు తప్పనిసరి సంస్కారవిధి. వడుగుకు ముందే మనిషి  గంటం చేతబట్టాలని  బృహస్పతి స్మృతి విధి. మార్గశిరం నుంచి జ్యేష్ఠం వరకు అక్షరజ్ఞానానికి అనుకూలమైన కాలం. ఆషాఢం నుంచి కార్తీకం వరకు అక్షరాభ్యాసం నిషిద్ధమని విశ్వామిత్ర నీతి.  సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉన్నప్పుడే అక్షరాల అవపోసన ఆరంభించడం వశిష్ఠ వాక్కు ప్రకారం శ్రేయస్కరం.  స్మృతి చంద్రిక కర్త మార్కెండేయ పురాణోక్తులను పేర్కొంటో అపరార్కుడు ఐదవ ఏట  కార్తీక శుద్ధ ద్వాదశి నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి లోపల అమావాస్య, పౌర్ణమి లాంటి తిధులు; చవితి, నవమి, చతుర్దశులు; శని, మంగళ వారాలు- చదువులు ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించకూడని కాలాలని హెచ్చరించాడు. కుంభరాశిలో రవి ఉన్నా, లగ్నాతు అష్టమంలో గ్రహాలు తిష్ఠ వేసినా అక్షరాల జోలికి పోరాదన్న విధీ  ఒకప్పుడు భరతభూమిలో కథ. ఓనమాలు రానివాడు ఆనవాలు లేకుండా పోతాడన్న భయం అనాదికాలం నుండి మనిషి గుండెల్లో మారుమోగుతుండబట్టే ఇన్నేసి పురాణేతిహాసాలలో, స్మృతి స్ముతుల విధివిధానాలలో అక్షరాల గురించి వాటి అభ్యాసాదుల గురించి రుషుల మధ్య అంతంతలేసి చర్చోపచర్చలు సాగింది. కంప్యూటర్ మాయలో పడి ఆ సంప్రదాయం ఛాయామత్రంగానైనా  మిగిల్చుకునేందుకు ప్రస్తుతం మనం పస్తాయిస్తున్నాం. అది కదా విచారం!

 

చాలా మంది ఇళ్ళల్లో పాతలేఖలు నాటి తీపి గుర్తుల కింద దాచుకుంటారు. ఆ  ఉత్తరాల కోసం రోజులు, వారాల తరబడి ఎదురుచూసిన  పాతకాలం మధురానుభూతులను ఒక్కసారి నెమరువేసుకోవాలి.  కంప్యూటర్  కొత్తవింతలో పడి..  చేతిరాత రోతగా మారకుండా అప్రమత్తమవాల్సిన అగత్యం అప్పుడు తప్పకుండా స్పృహకొస్తుంది. ఇదే అంశం మీద పీడియాట్రిక్ థెరపిస్ట్ సాలీ పెయిన్  గార్డియన్ వార్తాపత్రికకు ఇంటార్వ్యూ ఇస్తూ 'బళ్లకు వెళ్లే పిల్లలకు పెన్సిళ్లు ఇస్తే  సరయిన పద్ధతిలో పట్టుకోలేకపోతున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో రోజులో అధిక భాగం చేసే స్నేహం పిల్లల  ప్రాథమిక చలన నైపుణ్యాలను బాగా దెబ్బతీస్తుంది' అని అన్నారు. అధ్యయన, అభ్యాస రంగాలలో చేతిరాత పాత్ర రాను రాను ఎంతలా దిగనాసిల్లుతున్నదో   ప్రచారం చేసే బాధ్యత స్వచ్ఛందంగా  పుచ్చుకున్న డాక్టర్ జేన్ మెడ్వెల్, ఇళ్లలో పెరుగుతోన్న గ్యాడ్జెట్ల వల్లనే  పిల్లల్లో చాలా మందికి పెన్సిల్ మీద పట్టు కుదరడంలేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. నేషనల్ హ్యాండ్ రైటింగ్ అసోసియేషన్ వైస్ ఛైర్మన్ బాధ్యతలు కూడా నిర్వహిస్తోన్న డాక్టర్ మెలీసా ప్రూంటీ, ప్రాథమిక స్థాయి నుంచే పాఠశాలల్లో బాలలకు ఐ-పరికరాల స్థానే అచ్చు పుస్తకాలు, పలకా బలపాలు, పెన్నూ పెన్సిళ్లను పోలే ఆటవస్తువులు అలవాటు చేయడం-  బుద్ధివికాసం జీవనసమరానికి దగ్గరయే మేలైన అనుసంధాన చమత్కారం అని చెప్పుకొచ్చారు. 2014 నాటి  ఒహాయో యూనివర్శిటీ పరిశోధనల్లో అమెరికాలో ప్రతి ముగ్గురు పెద్దవాళ్లలో ఒకరు ఏడాదిలో కనీసం ఆరు నెలల పాటు చేతితో ఏమీ రాయడం లేదని తేలింది. ఇక్కడ ఇండియాలో కూడా దరిదాపులుగా అదే దుస్థితి. కానీ, అదృష్టం కొద్దీ చేతిరాత  పట్టు ఎంతో కొంత మేర చదువు సంధ్యల్లో, బతుకు తెరువులో ఇంకా మిగిలే ఉందని నమ్ముతున్నాం మనం.  కాబట్టే పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు  ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో చేతిరాత వైభవం పునరుద్ధరణార్థం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తోంది. 2005లో ఎయిక్స్-మార్సెల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన న్యూరోసైన్స్ లేబరేటరీ మూడు నుంచి ఐదేళ్ల మధ్య వయసు పిల్లలను రెండు బృందాలుగా విడగొట్టి ఒక బృందానికి చేతిరాత, మరో బృందానికి కంప్యూటర్ రాత పని అప్పగించింది. చేతిరాత పిల్లలు, కంప్యూటరు సాయంతో రాసే పిల్లల కన్నా  అక్షర జ్ఞానంలో చురుకుగా ఉన్నట్లు  తేలింది.  అక్షరాలు దిద్దే క్రమంలో  క్లిష్టమైన కండరాల కదలికలను మాలిమి చేసుకోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అన్న ఆత్మవిశ్వాసం సాధకు బలపడుతుంది. భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కోనే సందర్భంలో ఈ ఆత్మవిశ్వాసమే విజయసాధనకు తోడ్పడేది అంటారు  డాక్టర్ మెడ్వెల్. మూడేళ్ల కిందట అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఇల్లినాయిస్  రాష్ట్రంలో చిన్నబళ్ళల్లో చేతిరాత తరగతులు  తిరిగి తప్పనిసరి పాఠ్యాంశాలలో ఒక్కటిగా మార్చడానికి ఈ తరహా కొన్ని అధిక ప్రయోజనాలే ప్రముఖ కారణం.

మన దేశంలో మొన్న మొన్నటి దాకా న్యాయస్థానాల దస్తావేజుల్లో చేతిరాతే ముఖ్యమైన స్థానంలో ఉండేది.  భాష సరే, కరక్కాయ సిరాతో రాసే ఆ  అక్షరమూ  ఎంత చూడ ముచ్చటగా ఉండేదో ఈ తరానికి తెలిసే దారేదీ? చిన్న దావాలలో న్యాయాధీశులు కంప్యూటరు గట్రాలు గట్టున పెట్టేసి స్వంత దస్తూరితో స్పష్టంగా  రాసిన  తీర్పులు వెల్లడించాలని ఈ మధ్య కేరళరాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఓ  సలహా ఇచ్చింది. కంప్యూటర్ రొట్టకొట్టుడు భాష తెచ్చే అనర్థాలను  వివరిస్తూ సాక్షుల వాజ్ఞ్మూలాలు సైతం వీలయినంత మేరకు ఆ అధికారం కలవారు స్వదస్తూరితో నమోదు చేస్తే, చేతిరాత   సాధికారత పునరుద్ధరించనట్లు అవుతుందన్నది ఉన్నత న్యాయస్థానం అభిప్రాయం. చేతిరాత ఘనతను ఇకనైనా చరిత్రలో కలవకుండా విజ్ఞతతో  వ్యవహరిద్దామా?

 

పొందికైన జీవితానికి అందమైన చేతిరాత ముంజేతిన మెరిసే బంగారు కంకణం. ఆ అందమైన చేతిరాతకు అదనంగా మార్కులేసి ప్రోత్సహించే   సంప్రదాయం గతంలో బడి పిల్లల పరీక్షల్లో కనిపించేది. మార్కుల కోసమేనా? జీవితంలో మంచి రిమార్కులు సాధించడానికీ చేతిరాత మీద పాతకాలంలో మాదిరి  శ్రద్ధ మరంత పెంచడం అవసరం. జాతీయ చేతిరాత దినం' అని ప్రతి ఏటా జనవరి 23 ను  ఓ ప్రత్యేక దినోత్సవంగా గుర్తిస్తున్నాం మనం. దస్తూరీ ఆవశ్యకత అవిస్మరణీయమని చెప్పడానికి ప్రత్యేకమైన ఉత్సవాలు జరపనవసరం లేని ప్రోత్సాహ వాతావరణం  తిరిగి చేతిరాతకు రావాలని కోరుకుందాం!

-కర్లపాలెం హనుమంతరావు

***

(సూర్య దినపత్రికలో ప్రచురితం) 


 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.

చేతిరాత

-కర్లపాలెం హనుమంతరావు

 

Monday, September 21, 2020

హాస్య కథః అరకొర ఇంగ్లీషు -కర్లపాలెం హనుమంతరావు

                                                (కార్ట్యూనిస్ట్ మల్లిక్ గారికి కృతజ్ఞతలతో)

సుబ్బాయమ్మ చాలా ఆశబోతు. విలాసవంతమైన జీవితం మీద తగని మోజు.  తన భర్త తన  నాలుగు కోట్లకు బీమా చేశాడన్న విషయం తెలిసినప్పటి బట్టి అప్పటి వరకు ఆమె లోపల దాగి ఉన్న కోరికలన్నీ ఒక్కసారి పడగ విప్పి ఆడటం మొదలుపెట్టాయి. తన స్వర్గసుఖాలన్ని భర్త చావుతో తప్ప మొదలు కావు- అన్న విషయం సుబ్బాయమ్మకు అర్థమయింది. అందుచేత విలాసవంతమైన జీవితం గడపడానికి ఆమె తాళి కట్టిన భర్తను చంపాలని నిర్ణయించుకుంది.  అందుకోసమై ఆమెకు ఒక కిరాయి హంతకుడి తోడు కావాలి. బోలెడన్ని సి.ఐ.డి ఎపిసోడ్లు  వచ్చీ రాని హిందీ నాలెడ్జ్ తోనే చూసి ఒక అవగాహన తెచ్చుకుంది. కొన్ని రోజుల పాటు అత్యంత గోప్యంగా అక్కడా ఇక్కడా విషయ సేకరణ కూడా చేసి చివరకు ఒక పర్ ఫెక్ట్  మర్డర్ ప్లాన్ కు బ్లూ ప్రింట్ తయారు చేసుకుంది. ఆ స్కీమ్ ను ఆచరణలో పెట్టడానికి ఇప్పుడు ఆమెకు ఒక కిరాయి షూటర్ సాయం పట్టాలి.  

సినిమాలలో తప్ప నిజమైన జీవితంలో డబ్బులకు కాల్చే తుంటరి కుంకలు ఎక్కడ ఉంటారో, ఎట్లా ఉంటారో ఆ ఇల్లాలుకు పాపం ఇప్పటి వరకు తెలిసే అవకాశం లేదు. అత్తగారి తలరాత బాగుండి పెందరాళే తన దారిన తాను ప్రశాంతంగా పైకెళ్లిపోవడంతో ఇలాంటి కిరాయి గూండాలతో ఇప్పటి వరకు పనిపడలేదు.  అతి కష్టం మీద వచ్చీ రాని ఇంగ్లీషు నాలెడ్జ్ తోనే ఇంటర్నెట్ అంతా గాలించి గాలించి చివరికి ఒక కిరాయి హంతకుడి అడ్రస్ పట్టుకోగలిగింది సుబ్బాయమ్మగారు.

ఆ కిరాయి గూండాని తన కారులో తిప్పుతూ ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా గుట్టు చప్పుడు కాకుండా తన భర్త పని పట్టాలో పూసుగుచ్చినట్లు పదే పదే వివరించింది. ‘ఎన్నో నెలల పాటు ఎంతో శ్రమకు ఓర్చి ఉన్న తెలివితేటలన్నీ ఉపయోగించి తయారుచేసుకున్న స్కీమ్. ఒక్క చిన్నపొరపాటు జరిగినా మొత్తం వ్యవహారం తలకిందులయిపోవడం ఖాయం. ఫర్ఫెక్ట్ షూటర్ వన్న  ట్రాక్ రికార్డ్ చూసే కాస్త రేట్ ఎక్కువైనా నిన్ను కష్టపడి గాలించి పట్టుకున్నది. అన్నీ అనుకున్నట్లు గాని సజావగా జరిగిపోతే నీకు మరో ఒక అరశాతం అదనం బోనస్ కింద చెల్లించడానికైనా సిద్ధం. కానీ ఎక్కడా  నా జోక్యం ఉన్నట్లు చిన్న క్లూ అయినా వదిలిపెట్టి పోవద్దు. రేపు ఉదయానికల్లా నేను నా భర్త చావు వార్త  చల్లంగా పోలీస్ స్టేషన్నుంచి వినితీరాలి’ అంటూ పది రకాలుగా జాగ్రత్తలు చెప్పి తను సీనులో నుంచి తప్పుకుంది.

కిరాయి హంతకుడు అనుకున్న ప్లాన్ ప్రకారమే పర్ఫెక్ట్ గా ఆపరేషన్ సక్సెస్ జేసినట్లు తెల్లారుఝామున పోలీసుల నుండి వచ్చిన భర్త మర్డరైన వివరాలన్నీ విన్నాక సుబ్బాయమ్మకు నిర్ధారణయింది. మనసులోనే కిరాయి హంతకుడి అంకితభావానికి ముగ్ధురాలైంది. బైటికి మాత్రం విషాద వదనంతో పోలీసు స్టేషనుకు పరుగెత్తింది. పోలీసు జీపులోనే భర్తను షూట్ చేసిన స్పాట్ కు వెళ్లి చూసింది సుబ్బాయమ్మగారు. పోలీసులు చూపించిన స్థలమంతా రక్తంతో చెల్లాచెదరుగా ఎర్రబడి భీభత్సంగా ఉంది. భర్త ఉదయంపూట వ్యాహ్యాళికని వెళుతూ ధరించిన దుస్తులు పోలీసులు ఇప్పుడు చూపించినవే. ‘మీ హజ్బండ్ ఫేస్ కూడా చూపిద్దామని అనుకున్న మాట నిజమే కాని.. పోస్ట్ మార్టం చేసే వైద్యుడు ఊరికి వెళ్లే తొందరలో ఉండడం వల్ల మీరు రాకముందే డెడ్ బాడీని తరలించ వలసి వచ్చింది. సారీ! ఇంకా మీకు మీ భర్త బతికే ఉన్నాడన్న నమ్మకం ఉంటే చెప్పండి.  బాధితుల డౌట్సన్నీ క్లియర్  చేసే బాధ్యత పోలీసు డిపార్ట్ మెంట్ గా మాకు చాలా ముఖ్యమైనది’ అన్నాడు స్టేషన్ ఆఫీసర్.

‘ఇన్ని ఆధారాలు చూపించారు. ఇంకా అనుమానం ఎందుకు సార్? కానీ,  నా భర్త వట్టి అమాయకుడు. చీమకైనా   అపకారం జరిగితే విలవిలలాడే సౌమ్యుడు. ఎవరికి ఏం ద్రోహం చేసాడని.. పాపాత్ములు బంగారం లాంటి మా ఆయన్నిలా పొట్టనపెట్టుకున్నట్లు? ఆ దుర్మార్గులను సాధ్యమైనంత తొందరగా పట్టుకుని ఉరికంబం ఎక్కించండి సార్! అప్పుడే చచ్చి స్వర్గంలో ఉన్న మా శ్రీవారి ఆత్మకు శాంతి’ అంటూ వెక్కిళ్ల మధ్యనే పెద్ద పెద్ద సినిమా డైలాగులు గుప్పించేస్తోన్న  సుబ్బాయమ్మగారి చెవుల్లో  ‘ఎప్పటి దాకానో ఎందుకు డియర్ సుబ్బాయ్! హంతకుల్ని ఇప్పుడే పట్టేస్తే పోలే! ముందు నువ్వు  కళ్లు శుబ్బరంగా తుడుచుకో!  ఒక్కసారి తేరిపారా చనిపోయిన నీ మొగుణ్ని చూసుకుందువు గాని’ అన్న గొంతు వినిపించింది. ఆ గొంతు తన భర్త కామేష్ దే! కొయ్యబారి పోయిన సుబ్బాయమ్మగారు గాభరాగా ఎదుటనే నిలబడున్న భర్తను చూసి’ కామేష్! నివ్వింకా బతికే ఉన్నావా? మరి నా దగ్గర పది లక్షలు నొక్కేసిన ఆ చచ్చినోడు..!’

‘ఇక్కడే ఉన్నాను మేడమ్ గారూ! మీరు ప్లానంతా మా పోలీసోళ్లకు మించి మహా పకడ్బందీగా తయారుచేశారు. మెచ్చుకోక తప్పదు. కానీ.. కిరాయి హంతకుడు విషయంలోనే  చిన్న మిస్టేక్ జరిగిపోయింది.   ‘అండర్ కవర్’ అన్న మాట సరిగ్గా అండర్ స్టాండ్ అయినట్లు లేదు.. ప్రొఫెషనల్ పోలీస్ కు  ఫ్రొఫెషనల్ కిల్లర్ అన్న అర్థం చెప్పుకుని  నా అడ్రస్ దొరకపుచ్చుకుని  వెంటబడ్డారు.. సారీ!’ అంటూ సుబ్బాయమ్మగారి బంగారు గాజు చేతులకు ఇనుప గాజుల్లాంటి  బేడీలు తగిలించేసి  చిలిపిగా నవ్వాడు ప్రొఫెషనల్ పోలీసాఫీసర్. అతగాడే తాను ప్రొఫెషనల్ కిల్లర్ అనుకొని ప్రాణం మీదకు తెచ్చుకున్న పోలీసు మనిష’ని అప్పుడు గాని అర్థమయింది కాదు, పాపం, సుబ్బాయమ్మ గారికి.   

‘అందుకే ఇంగ్లీషు కోచింగ్ క్లాసుల్లో  చేరినప్పుడు మార్నింగ్  షోల కోసమని సగంలో క్లాసులు ఎగ్గొట్ట కూడదు. ఫలితం ఇప్పుడనుభవిస్తున్నా.. ఛీఁ’ అంటూ  చేతికున్న ఇనప బేడీలతోనే తల తటా తటా మొత్తేసుకుంది పాపం మేడమ్ సుబ్బాయమ్మ గారు!’

-కర్లపాలెం హనుమంతరావు

21 -09 -2020

***

Saturday, September 19, 2020

అంతరాత్మే అసలు శత్రువు.. ! - కర్లపాలెం హనుమంతరావు -పెన్ పవర్ దినపత్రిక ఆదివారం ప్రచురితం

 


'ఏం చేస్తున్నావు?' - అడిగింది అంతరాత్మ.

పెన్‌ పవర్  పత్రిక ప్రకాశం ఎడిషన్ కోసం వ్యాసం రాసే పనిలో ఉన్నాను. ఏ అంశం మీద రాద్దామా అని ఆలోచిసున్నా. తెగడంలేదు'

'ఈ మధ్య నీ రాతల్లో కాస్త సీరియస్ నెస్ ఎక్కువయింది. బ్రేకింగ్ గా ఉంటుంది .. ఏదైనా, లైటర్ వీన్ ట్రై  చెయ్యరాదూ ?' అని గొణిగింది అంతరాత్మ.

'ఆ సణుగుళ్లెందుకు. మనసులో ఉన్న మధనేదో బైటికే అనవచ్చుగా!'

చిరాకు పడ్డా. 

ఫక్కుమని నవ్వి అంది అంతరాత్మ 'బాబూ! నేను నీ అంతరాత్మను. అంతరాత్మలక్కూడా మనసులుంటాయా? అక్కడికి మీ మనుషులు అవి చెప్పే మాటలే వింటున్నట్లు.. మహా! నేను జంతువులాంటి దాన్ని. నాకూ వాటికి మల్లే మనసులూ పాడూ ఉండవు.. ముందా సంగతి తెలుసుకోవయ్యా మహానుభావా! రచయితవి ఉండి నీకే తెలీకపోతే ఇహ పాఠకులకు నువ్వేంటి కొత్తగా చెప్పుకొచ్చేది?' 

నవ్వొచ్చింది నాకు.. నా అంతరాత్మ పెట్టే నస చెవినపడగానే. 'మా పాతకాలం తెలుగు సినిమాలలో అంతరాత్మలు శుభ్రంగా ఏ టినోపాలుతో ఉతికిన  ఇట్లాగే ఏ తెల్ల వస్త్రాలో ధరించి అద్దంలో నుంచో, స్తంభంలో నుంచో అడగా పెట్టకుండా వద్దనకుండా ఊరికే తెగ నసపెడుతుండేవి. చాలా సమయాలల్లో ఒకటి కాదు, రెండు  కూడా చెరో పక్కనా చేరి చెండుకు తినడం అదో సరదా వాటికి. పాత్ర  ఎస్వీ రంగారావు సైయిల్లో చేతిలో ఉన్న మందు సీసా విసిరి గొట్టినా అద్దం ముక్కలయి చచ్చేదే కాని అద్దాని నస అన్ని గాజు ముక్కల్నుంచి వెయ్యింతలుగా మారుమోగేది. మళ్లీ ఏ కమలాకర కామేశ్వర్రావు సారో కల్పించుకుంటే తప్ప ఆ అంతరాత్మల ఘోష అంతమయ్యేదే కాదు. కొంపదీసి నువ్వూ ఇప్పుడు ఆ తరహా ప్రోగ్రామేమన్నాపెట్టుకుని రాలేదు కదా! కరోనా రోజులు .. ఎటూ బైటికి పోయే ఛాన్సు నాకుండదీని  గాని పసిగట్టావా ఏందీ!'

'ఆపవయ్యా సామీ ఆ పైత్యకారీ కూతలు. నువ్వేమీ ఎస్వే ఆర్వీ, ఎంటీఆర్వీ కాదులే! వట్టి ఓ మామూలు కెహెచ్చార్ గాడివి . గంతకు తగ్గ బొంత సైజులో నీ స్టేటస్సుకు తగ్గ  మోతాదులోనే నా ఆర్భాటం ఉంటుంది, అసలు  చెప్పాల్సిన మాట డైవర్టయి పోయింది నీ  డర్టీ డైలాగుల డప్పు చప్పుళ్ల మధ్య. మరోలా అనుకోక పోతే ఒక సలహా బాబూ! ఈ కరోనా రాతలు కాస్సేపు పక్కన పెట్టు. పాలిటిక్సు పోట్లు పద్దాకా ఏం పొడుస్తావులే కాని,, ఇంచక్కా ఈ లోకంలో నీకులాగే సమ హోదాతో జీవించే జంతుజాలం గురించి ఏమన్నా ఓ నాలుగు ముక్కలు గిలికిపారెయ్ రాదూ ఈ దఫాకు! సరదాగా అందరు చదువుకుంటారు!'

'జంతువుల గురించా? రాయడానికేమంత ఇంపార్టెంట్ మేటరుంటుందని మహానుభావా  కొత్తగా మన పాఠకులు చదివి ఎంజాయ్ చేసేందుకు?  జిత్తులు, నత్త నడక, సాలెగూడు, కాకి గోల, కోడి నిద్ర, కుక్క బుద్ధి, క్రూర మృగం, హంస నడక, మొసలి కన్నీరు, కోతి చేష్టలు, పిల్లి మొగ్గలు, పాము పగ, ఉడుం పట్టు, గాడిద చాకిరీ గట్రా జంతు సంబధమైన సజ్జెక్టులన్నీ నీ లాంటి అంతరాత్మలు నసలు పెట్టించి మరీ గిలికించేసాయి కదా! ఇహ నాకు కొత్తగా రాసేందుకు ఏం మిగిల్చారు గనక ‘

 

'ఆపవయ్యా రైటర్ ఆ అపవాదులు! అక్కడికి భాషలు, భావాలు మనుషులకే పరిమితయినట్లు ఏమిటా కోతలు! మీ మనుషులున్నారే చూడు .. వాళ్లే  అసలైన జంతువులు. ఏ సాధుశీలి లోపల ఏ మేకవన్నె పులి నిద్రోతుందో, ఏ అరి వీర భీకర మహా విజేత గుండెల్లో 'ఉస్సో ‘  అంటేనే  ఉలిక్కి పడి చచ్చే పిల్లుంటుందో.. అంతరాత్మలకు మాకానువ్వు  కొత్తగా సినిమా కతలు చెప్పి నమ్మించేదీ! ఆ  రొటీన్ టాపిక్కుల గోల మళ్లా ఇప్పుడెందు గ్గానీ, ఊపు కోసం నేనీ మధ్య  వాట్సప్ లో చదివిన వెరైటీ జంతువుల కహానీ ఒకటి చెబుతా.. ముందు విను! ఆనక నీకు యానిమల్స్ జాతి మీదుండే యనిమిటీ, గినిమిటీ మొత్తం వదిలిపోవాలి.’ 

  జంతువులు అసలేవీ  ఆలోచనల్లాంటి సృజనాత్మకమైన పనులు చేయలేవని కదూ  మీ మనుషుల బడాయి ఊహలు!  ఆహారం,  నిద్రా మైథునాల్లాంటి సహజాతాలకు మాత్రమే మొగ్గుచూపే బుద్ధి వాటిదని కదూ మీ మేధావుల వెధవాలోచనలు!  జంతుజాలం భాష నువ్వు డీ-కోడ్ చెయ్యలేవు. కనక కాకి కూతల వెనకుండే రంపపు కోత నీ బుర్రకెక్కదు.  వాటికి అసలు మాట్లాడటమే రాదనుకుంటే .. అది నీ మూఢత్వంరా బేటా!  వాటి మాటల సారం నీకు అర్థమయితేనా! మనిషిగా పుట్టించినందుకు నువ్వా బ్రహ్మయ్య మీదనే నేరుగా దాడికి దిగిపోతావు!’

ఈ సారి ఏ  హిమాలమాల సైడుకో టూరుకని వెళ్ళి నప్పుడు హరిద్వారం , ఋషీకేశం కూడా టచ్ చేసి చూడు! టీ నీళ్ల కోసం నిన్ను వేధించాడని విసుక్కోడమొక్కటే నీకు తెలుసు గాని,   రక రకాల పక్షి కూతలకు, జంతు భాషలకు ఆ గడ్డం బుచోళ్లే అచ్చుపడని పదనిఘంటువులని నీకు తెలియదు.  పక్షులూ, జంతువులతో మాట్లాడ గలగడం వాస్తవానికి ఓ గడసరి విద్య.  మేక కనపడితే గట్టిగా పట్టుకుని మన ఏప్రియల్ మాసం తరువాత వచ్చే నెల పేరేంటో చెప్పమని అడుగు!

'మే' అనకపోతే వాడి పారేసిన నీ చెప్పుల జోడు తెచ్చి  నా మెడకు వేలాడ కట్టు!’ 

'అంతరాత్మలకు మెడలు ఎక్కడేడ్చాయన్న డౌటొచ్చే లోపలే 

'సర్కార్ల పథకాలేవన్నా ప్రజలకు మేలు చేసేవే నంటావా ?' అని కాకి మూకల నడిగి చూడు!  'కావు.. కావు' మనకుండా నోరు మూసుకు నుండిపోదు .. గ్యారంటీ ‘ అంయీ    సోది కహానీలు మొదలుపెట్టేసిందీ వెధవ సూక్ష్మగ్రాహి  అంతరాత్మ! 

గలగల, వలవల, గడగడల్లాంటి  జంటపదాలు మన తెలుగురచయితలకు మల్లే చెత్తచెత్తగా వాడే శక్తి  పద్దస్తమానం 'కిచకిచ'లాడే  పిచ్చుకమ్మకుందని దాని   కోతలు! 'భ' అనే హల్లుకి ఔత్వం ఇస్తే ఏమవుతుందో బోలెడంత డబ్బుపోసి కార్పొరేట్ బళ్లో చదివే మీ బదుద్ధాయికి తెలీకపోవచ్చునేమో కానీ.. ఏ వీధి కుక్క వీపు మీద ఓ రాయి బెడ్డ వేసినా  'బౌ.. బౌ' అవుతుందని బోలెడన్ని సార్లు చెప్పేస్తుందిట!  కప్పల్ని మింగడం తప్ప ఇంకేమీ తెలిదనుకునే పన్నగాలకు అమెరికా అధ్యక్షుల్లో  'బుష్' నామధేయులు ఒకడు కాదు.. ఇద్దరున్నారన్న ఇంగితం బుసలు కొట్టి మరీ బైటపెడుతుందని ఈ అంతరాత్మ ప్రబోధం!  పార్వతీదేవికున్న పర్యాయపదాలల్లో 'అంబ' ఒకటని ఆవు తెలుసును. ఆ జ్ఞానం మనిషి జన్మ మహోదాత్తమైనదని  అనుక్షణం ఉబ్బెత్తు ఛాతీలు తిప్పుకుంటూ తిరిగే మీ మనుషులకే ముందు తెలియాల్సి వుంది. ఏనుగుకి ఆంగ్లంలో నెయ్యిని ఏమంటారో ఏ  క్రాష్ కోర్సులో చేరకముందే ఈజీగా తెలిసిపోయింది.  చెప్పుకుంటు పోతే ఈ జంతు విజ్ఞానానికి ఆదీ.. అంతూ దొరకదు. కానీ ఆఖరుగా ఈ ఒక్క ముక్క చెప్పి ముగించకపొతే  పశుపక్ష్య జాతులకు పూర్తి న్యాయం జరిపించినట్లు కాదు. నెమలీ ! నెమలీ ! ఈ మనిషిని గురించి జంతుజాలం ఏమనుకుంటున్నదో ఒక్క ముక్కలో చెప్పి ముగించమంటే 

'క్రాక్' అంటూ ఇంచక్కా తోకూపుకుంటూ నిలబడుతుంది.' అని ముక్తాయించేసింది నా అంతరాత్మ. 

నెమలిని అడ్డమేసుకుని తన మనసులోని ముక్కని అంతరాత్మ అట్లా బైటకు నెట్టేసిందన్న గుట్టు అర్థమముతూనే  ఉంది.

మనిషికి  తొలి శత్రువు ఎక్కడో లేడు. మన  మనసులోనే ఓ మూల నక్కి  ఉండి   మనతోనే ప్రతిక్షణం దొంగ  తిళ్లు తింటూ మనం కాక్స్ లా వ్యవహరిస్తున్నప్పుడు మాత్రం  గమ్మునుండి పోతున్నాడు. దెబ్బతిని కిందపడితే మాత్రం ఇట్లా బైటికొచ్చి కుక్క మీదా నెమలి మీదా పెట్టి దెప్పుతుంటాడు. ఈ అంతరాత్మ కన్నా  ఏ శత్రువు మాత్రం మనిషికి చేసే చెరుపేముందిక? 

నిజమైన మిత్రుడే అయిఉంటే తప్పు చెయ్యక ముందే నచ్చ చెప్పి తిప్పలు తప్పించాలి కదా అంతరాత్మ! అందుకే పాలిటిక్సులో పైకి రావాలనుకునే మొండి నేతలు గుండెల్లోనే ఉండి పద్దస్తమానం ఘోష పెడుతుండే ఈ వెధవ అంతరాత్మలను అప్పోజిషన్ పార్టీ శాల్తీల కన్నా హీనంగా  లెక్క గట్టి పురుగుల్లా చీదరించుకునేది*

- కర్లపాలెం హనుమంతరావు 

( పెన్ పవర్ దినపత్రిక ప్రకాశం ఆదివారం  సంచికలో ప్రచురణ ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...