Friday, February 12, 2021

కవిత్వం-కవుల బడాయి - రామకృష్ణ కవులు - రచన ః కర్లపాలెం హనుమంతరావు

 


వినాయకచవిత పండుగ పూట పూజాదికాలైన పిదప సాయంకాలం ఇష్టులైన వారి ఇళ్ళమీదకు పిల్లలు చిన్న చిన్న రాళ్ళు, బెడ్డలు విసిరి పెద్దలచేత షష్టాష్టకాలు పెట్టించుకోవడం హిందువుల సంస్కృతిలో ఓ ఆచారం. ఆ పండుగ పూట   పెద్దలు వడ్డించే  తిట్లు పిన్నలకు   దీవెనలతో సమానమని ఓ నమ్మకం. శతావధాన పండితులు రామకృష్ణ కవులు బహుశా ఇలాంటి ఏదో విశ్వాసంతోనే  నన్నయాదులవంటి అఖండ ప్రజ్ఞావంతులందరిని ఒక వరసలో తిట్టి పోసారు. 1918నాటి ఆంధ్ర పత్రిక సంవత్సరాది సంచికలోని ముచ్చట ఇదిసరదాగా ఏరిన అందులోని కొన్ని పద్యాలు ఇవి.  పూర్వకవులమీద తనకుండే అపారమైన  భక్తిశ్రద్ధలను  రామకృష్ణకవులే స్వయంగా ప్రకటించుకున్నారు కనక ఇక  పేచీ లేదు.

కేవలం  సరదాగా మాత్రమే తీసుకోమని సహృదయ సాహిత్యాభిమానులకు మనవి.

 

ఆంధ్ర లోకోపకారము నాచరింప/

భారతమ్మును నన్నయభట్టు తెలుగు/

జేయుచున్నాడు సరియె; బడాయి గాక/

తొలుత సంస్కృతపద్య మెందులకు జెపుఁడి!

 

గురుకులక్లిష్టుడయి విద్య గఱవబోక/

సహజపాండిత్యుడ నటంచు సంబరపడు/

పోతనామాత్యు నే రాజు పూజ సేయు?/

దేవరల దయ్యములను గీర్తింప కేమీ?

 

ఆంధ్ర కవిచక్రవర్తుల కందఱకును/

నీ పలుకు చాలు మేలుబంతి యగుగాక!/

తెలుగు సేతయె కా? స్వతంత్రించి నీవు/

చేసినది యేది? శ్రీనాథ! చెప్పుకోగ.

 

తన మాట తనకె తెలియక/

చని యొక సాలీని వాక్యసందర్భంబున్/

విని యర్థ మెఱింగిన తి/

క్కన పాండిత్యంబె వేఱ యడుగగ నేలా!

 

మన యెర్రన హరివంశము/

దెనిగించినవాడు మంచిదే నాచన సో/

మన యుత్తరహరివంశము/

గనుడీ! యది యెంత చక్కగా నున్నదియో!

 

మధ్యవళ్లు పెట్టి మంజరిద్విపద బ/

ల్నాటి వీరచరిత నా బెనచితి/

వది స్వతంత్రకావ్య మని యేరు మెచ్చుకొ/

నంగవలెనొ? కమలనాభ పౌత్ర!

 

ప్రాలుమాలికచే దాళపత్ర పుస్త/

కాటవుల నర్థపుందెరువాట్లు గొట్టి/

కొఱతబడు నని కుకవిని కొసరి తిట్టి/

పెద్దన యొనర్చినట్టి తప్పిదము నదియె.

 

కృష్ణరాయడు చేసిన విష్ణుచిత్త/

కావ్యమందలి భావము శ్రావ్యమె యగు;/

నెన్ని మార్లు పఠించిన నెఱుకపడని/

వట్టి పాషాణపాక మెవ్వండు సదువు?

 

కవనధోరణి కల్పనాగౌరవంబు/

శబ్దసౌష్ఠవమును లెస్స సంబరంబె;/

బోగపుబడంతులా కళాపూర్ణ కథకు/

నెత్తిన ప్రధాననాయిక? లెంత తప్పు!

 

తగని గర్వంబు జేసి తన్ను దానె/

పొగడుకొనువాడటంచు జెప్పుదురుగాక,/

నాలి పలుకులు రావు తెనాలిరామ/

కృష్హ్ణకవి నోట బంగారు గిలకదీట.

 

కవులందరికీ కలిపి చేసిన  వడ్డనలుః

 

ఒకడు స్వప్నప్రకారము నుగ్గడింప/

నెల్లవారలకు గలలె తెల్లవార్లు/

నవ్వుదురను తలంపు లే దెవ్వరికిని/

పేరుకొన నేమిటికి నట్టి బీద కవుల?

 

దేవతాప్రార్థనంబును దేశనగర/

రాజవర్ణనములు కథారచన యంత/

త్రొక్కి విడిచిన పుంతయే దిక్కుమాలి/

కవనముం  జెప్పదిగిన ప్రజ్ఞానిధులకు.

 

ఈ కాలం కవులకూ ఆశీర్వచనాలు తప్పలేదుః

 

గాసటబీసట వేలుపు/

బాసం బఠియించి యాంధ్రభాషాగ్రంథా/

భ్యాసము లేకయె తెలుగుల/

జేసెద మనుచుండ్రు బుధులు సిగ్గెఱుగరొకో?

 

పూర్వకవి రాజులకు నిది భూషణంబొ/

దూషణమొ యనుకొనుడు మీ తోచినట్లు;/

నన్నయాదుల పట్ల మాకన్న గూర్మి/

గలుగువారలు లేరు జగమ్మునందు.

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

ఫిబ్రవరి, 9 2013


 

 

 

 

 

 

 

 

 

 

 

 

ధూర్తమానవా శతకము- కీ.శే త్రిపురనేని రామస్వామి చౌదరి - కర్లపాలెం హనుమంతరావు



దేవుడి పేరు చెప్పి తోచిన పిచ్చి కూతలు కూసుకుంటూ అమాయకులైన లోకులను భక్తి భావన  వంకన భయభ్రాంతులను చేసి స్వార్థ లాభం కోసం నిలువుదోపిడీ చేసే దుష్టబుద్ధుల మీద కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి 'ధూర్తమానవా శతకము'  పేరుతో కొంత పద్య రచన చేసారు. ఈ పద్యాలలోని అన్ని భావాలలో ఎక్కడా అతిశయోక్తి మచ్చుకైనా కనిపించదు. నిర్మలమైన మనసుతో తమ తమ జీవికలను నడుపుకునే లౌకికులను నిందించడమూ కనిపించదు. లేని దేవుడిని ఉన్నాడని బుకాయించే పెడసర బుద్ధిగల గడసరి మనుషులపై ఆ 'దేవుడి' చేతనే దుడ్డుకర్ర తిరగేయించిన ఈ శతకంలోని పద్యాలు సులభ శైలిలో చదవగానే అర్థమయే రీతిలోనే ధారగా సాగడం విశేషం. పద్యాలు చదువుతున్నప్పుడు కపట జీవుల పట్ల దేవుడు  విసిరే విసుర్లు భక్తిభావం మెండుగా కలవారికీ నవ్వు తెప్పిస్తాయి. కారణం.. దేవుడు ఈ పద్యాలలో గద్దించిన  దుర్మార్గపు జాతిలో వాళ్లు ఒక భాగంగా లేకపోవడం!

సచ్చీలవంతులు ఎవరినీ ఇంచుకైనా నొప్పించని విధంగా కవిరాజు ఈ పద్యాలు అల్లిన విధానం హర్షింపదగినది. ఆలోచించదగినది. అన్ని పద్యాలు విస్తరణ భీతి చేత ఇవ్వడం కుదరక.. కొన్ని పద్యాలు మాత్రమే ఉదాహరణ కింద కింద ఇస్తున్నాను. చదివి ఎంజాయ్ చెయ్యండి. నచ్చితే మిత్రులతో నిశ్చింతగా పంచుకోండి!

-కర్లపాలెం హనుమంతరావు

12 -02 -2020


 

ఏ నొకజాతికూడు భుజి-యించుచు మిక్కిలి తక్కుజాతులన్‌

హీనముగాగఁ జూతునని-యెవ్వరు సెప్పిరి నీకు వంచకా!

మానవు లందఱున్‌ సరిస-మానులు గారొకొనాకు? మాయురే!

మానక నీవ యిట్టి యవ-మానముఁ జేతువె ధూర్తమానవా!

***

త్వరపడకుండ సంజపడు-దాఁకను తప్పుపనుల్‌ పొనర్చి పై

బొరుగున నున్న తోఁటలను-బూవులు మ్రుచ్చిలి కోసి తెచ్చి నా

శిరమునఁ బోసినంతటనె-చేసిన పాపము లొక్కసారిగా

మఱచెడునట్టి వెంగలినె-మానక యిట్టివి ధూర్తమానవా!

***

మరణపు శయ్యమీఁద నొక-మారయినన్‌ నను దప్పకుండ సం

స్మరణము చేసినంతటనె-స్వర్గము వచ్చునటందు, వేగతిన్‌

బొరయును? నిట్లె నీ వెపుడు-బొంకుచునుందువు దీనికై నినున్‌

గఱకఱ గొంతు కోసెదను-కానివి చెప్పకు ధూర్తమానవా!

***

బొచ్చు నొసంగి యెట్లు పరి-పూర్ణమనోరథసిద్ధిఁ బొందగా

వచ్చును? బిచ్చివాఁడనని-భావమునం దలపోయుచుంటివా?

పుచ్చును నీదు పాపములు-పోరచి మానుము యిట్టి వానినిన్‌;

బొచ్చెము లిట్లుచెప్పి ప్రజ-మోసము చేయకు ధూర్తమానవా!

***

బిడ్డలకోసరమ్ము విల-పించెడి యా జవరాండ్రతోడుతన్‌

బిడ్డలు తప్పకుండఁ బ్రభ-వించెదరంచు సమాదరంబునన్‌

గడ్డముపట్టి "గర్భగుడి"-గర్భముఁ జేర్చుదువట్టెరేల నో

వెడ్డరి! నాకు మంచి పని-వెట్టితి వింతకు ధూర్తమానవా!

***

వాజను మానకున్న నప-వాదులు; తప్పవు శృంగభంగముల్‌;

రోజులు నీకుఁ జాల విసి-రో! జులుమింతకు మానకున్నచోఁ

బాజివియౌదు వీవు నగు-బాటు ఘటిల్లును; నింక మీఁద నీ

పోజును జూచి మోసపడి-పోవుట గల్గదు ధూర్తమానవా!

(ధూర్తమానవా శతకము- కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి)

Wednesday, February 10, 2021

భార్యావిధేయత - కర్లపాలెం హనుమంతరావు- సరదావ్యాసం - తెలుగు వెలుగు ప్రచురణ

 





విధివిధేయతకన్నా గడుసుపురుషుడు భార్యావిధేయతను నమ్ముకుంటాడు.

భగవంతుడు కనిపించడు. భార్య కనిపిస్తుంది. భయం భార్యమీదా, భక్తి భగవంతుడిమీదా ఉంచుకొంటే బతికున్నంతకాలం భుక్తికి వెదుకులాట తప్పుతుంది.

పెళ్లినాడే పెళ్లాం కొంగుకి పంచె  అంచు ముడివేయించి మరీ పెద్దలు భార్యామణి ఆధిక్యతను అధికారికంగా ప్రకటిస్తారు.   బరువు భాద్యతలు భర్తవంటారుగాని.. వట్టిదే! భర్త బరువుభాధ్యత భార్యదే! భార్య బరువుబాధ్యత భర్తకు పడకటింటివరకే పరిమితం,

 పెళ్ళికోసం పాపం మొగాడు కలర్ఫుల్ కలలు కంటాడుగానీ .. భర్తబతుకు ఉత్తరకుమారుడికి మించి ఉత్తమంగా ఉంటుందన్న భరోసా లేదు. పెళ్లయిన ఉత్తరక్షణంనుంచే పిల్లాడికి  లక్ష్మణకుమారుడి లక్షణాలు ఆవహిస్తాయి.

బైట పల్లకీమోత సంగతేమోగానీ.. ఇంట పెళ్లాన్ని తప్పించుకొనే రాత విధాత ఏ మగవాడి నుదుటా రాయలేదు.

పెళ్లాం చెబితే వినాల్సిందే!  రాముడు అదే చేసాడు. అష్టకష్టాల పాలయ్యాడు, అయినా కృష్ణుడూ అదే బాటపట్టి భార్యామణి కాళ్లు పట్టాడు. పడకటిల్లే కదా! ఏ పాట్లు పడితే మాత్రం తప్పేంటి! అనేది వట్టి బుకాయింపులకే! గడపకవతలా  తన తరుణి గీచిన గీత  మగవాడు జవదాటరాదు. దాటితే ఏమవుతుందో ఏ మొగుడూ బైటికి చెప్పడు!

ఎన్నికల్లో ఓటేసే జనాలంత అమాయకంగా ఉంటారా భార్యలెవరైనా! మగాడేదో మానసిక సంతృప్తి కోసం ఆడదాని జడత్వం మీదనో.. పతివ్రతా మహత్యం మీదనో కథలు కవిత్వాలు  అల్లుకుంటే అల్లుకోవచ్చుగాక. ఆడవాళ్ళు వాటిని చదివి లోలోన నవ్వుకుంటారని పాపం మగభడవాయికి తెలీదు!

లల్లూప్రసాదు అర్థాంగి   శ్రీమతి రబ్రీదేవమ్మగారి కథల్లోనే స్త్రీశక్తి ఏమిటో  తేటతెల్లమవడంలేదా! పోనీలే పాపమని మొగుణ్ణి తనమీద పెత్తనం చెలాయించేందుకు ఆడది అంగీకరిస్తుంది కానీ.. వాస్తవానికి ఇంటి పెత్తనం, మొగుడి కంటిపెత్తనం.. వంటిపెత్తనం.. చివరాఖరికి.. జైలుకెళ్ళిన భర్త కుర్చీమీద కూడా దాన వినిమయ విక్రయాది సర్వహక్కుభుక్తాలు తాళికట్టించుకొన్న భార్యామణికి మాత్రమే దఖలుపడి ఉంటాయి. న్యాయస్థానాలు కూడా అందుకు విరుద్ధంగా తీర్పులివ్వడానికి పస్తాయిస్తాయి. న్యాయాధీశుడూ ఒకింటి ఇల్లాలి అర్థాంగుడే కదా!

 

కైకేయిని కాదని దశరథుడు ఏమన్నా చేయగలిగాడా? సత్యభామను రావద్దని కృష్ణస్వామి యుద్ధభూమికి వెళ్లగలిగాడా? భార్యను కాళ్లదగ్గరుంచుకున్నట్లు బైటికి వీరబిల్డప్పే  శేషప్పశయనుడిది!  భృగుమహర్షి పాదాలు  పట్టాడని అలిగి భూలోకం తారుకున్న శ్రీలక్ష్మమ్మను  ప్రసన్నం చేసుకోడానికి  ఆ ఏడుకొండలవాడు పడ్డ ఇడుములు అన్నీ ఇన్నీ కావు! సహధర్మచారిణి సాహచర్యంలో ఏ మజా లేకపోతే  మహావిష్ణువంతటి భగవంతుడూ అన్నేసి కోట్ల ఖర్చుకు  వెనకాడకుండా పెళ్లిపిటల మీదకు తయారవుతాడు! విరాగి.. బికారి.. అంటూ వీరబిరుదులు ఎన్ని తగిలించుకుంటేనేమి! ఇద్దరు భార్యలనూ  సుబ్బరంగా ముద్దు చేశాడా లేదా  ఉబ్బులింగడు! విధాతగారి కథయితే మరీ విచిత్రం. అర్థాంగి  అవసరం ముదిమితనంలో మరీ ఎక్కువ.   వావివరసలైనా చూసుకోకుండా అందుకే సరసమహాదేవి సరసన చేరిపోయాడు ముసలిబ్రహ్మయ్య!

పూర్వాశ్రమంలో ఎంత చింకిపాతలరాయుడైనాగానీ .. తన మెళ్లో తాళి కట్టిన అదృష్టానికి  'శ్రీవారు' హోదా ప్రసాదిస్తుంది స్త్రీ మూర్తి! అలాంటి ఒక ఉదారమూర్తిని మగాడు ఓ దినం ఎన్నుకొని  అభినందించేందుకు పూనుకోడమేంటి! ఫన్నీ! ఇంగ్లీషువాడికదో  చాదస్తం. మనదేశీయ మగవాడు మాత్రం అడుగడుగునా ఏడడుగులు తనతో కలిసి నడిచిన  ఇల్లాలి అడుగులకు మడుగులు వత్తుతూనే ఉంటాడు.. ఇంట్లో!  బైటకు చెబుతారా అన్నీ!

భార్య కొన్నవి మినహా ఏ మగవాడైనా స్వంత అభిరుచి మేరకు దుస్తులు  ధరించే సాహసం చేయగలడా! విసుగుపుట్టో, జాలి కలిగో.. రీమోటు వదిలితే తప్ప మగవాడన్నవాడు స్వంత ఇంట్లో పడకటింట్లో అయినా ఇష్టమైన ఏ 'ఎఫ్' చానల్నైనా  మనసారా చూడగలడా! 'భోజనంలోకి ఏం చేయమంటారండీ!' అంటూ భార్యలు తలుపు చాటునుంచి  బిడియపడుతూ అడిగి.. చేసి.. వడ్డించే   స్వర్ణయుగం కేవలం ప్రబంధాలలోనే!     వంటకు వంకపెట్టటం అటుంచండి మహాశయా! భార్య బజారునుంచి కొనుక్కొచ్చిన ప్రియా పచ్చడికైనా వంకపెట్టే గుండెదైర్యం ప్రపంచంలో ఏ మొగాడికైనా ఉంటుందా.. చెప్పండి! పచ్చడి పచ్చడి ఐపోదూ ఆ రోజంతా బతుకంతా!

స్త్రీ పాత్ర లేని నాటకాలంటే మగాళ్ళు ముచ్చటపడి రాసుకొనే ఉటోపియాలు!  స్త్రీ ప్రమేయంలేని.. ముఖ్యంగా భార్యామణి హస్తాలులేని సంసారాలను ఆ విధాతకూడా సృష్టించలేడు. సృష్టించాలని ఉన్నా కట్టుకున్న శారదమ్మ చూస్తూ ఉరుకోదు!

'కవులేల తమ కావ్యములలో భార్యలగూర్చి వర్ణించరు?' అని వెనకటికి  తర్కం లేవదిసింది ఓ  ఎల్లేపెద్ది వెంకమ్మగారు 'విద్యానంద'మనే పాత పత్రికలో!

(విద్యానంద- 4-1928) కాళిదాసు శకుంతలను అంత కిలికించితాలుగా వర్ణించాడుగాని..  కట్టుకున్న భార్య కట్టుబొట్టులనైనా  గట్టిగా ఓ శ్లోకంలో వర్ణించలేదని ఫిర్యాదు.  శూలపాణీ అంతే! ముఫ్ఫైయ్యేడు నాటకాల్లో లెక్కలేనంతమందిని ఆడవాళ్లను  అణువు వదలకుండా వర్ణించిన శృంగారపురుషుడు!   అణగిమణగి ఉందన్న చులకనభావం  కాబోలు.. అన్న వస్త్రాలు వేళకు అందించే భార్య సుగుణాలలో ఒక్కటీ సదరు పాణిగారి దృష్టికి ఆనింది కాదు!   

తల్లులను తలుచుకొన్నవారు కొందరున్నారు. అవ్వలమీద అవ్యాజమైన ప్రేమానురాగాలు కురిపించిన కవులూ కొంతమంది కద్దు.  అన్ని దేశాలకవులు తమతమ  రాజులనే కాకుండా వారి వారి దేవేరులను, భార్యలను, వేశ్యలను సైతం  వర్ణించి తరించడం కనిపిస్తున్నదే గాని.. సొంతభార్యల ప్రస్తావనల దగ్గరమాత్రం  ఎందుచేతనో సర్వే సర్వత్రా పస్తాయింపులే!  ఏ కావ్యపీఠికైనా పరకాయించి చూడండి! కావ్యపోషకుడి వంశవర్ణనలే మెండు. ఒక్క రెండు మూడు మంచిపద్యాలైనా సమయం సందర్భం చూసుకొని  కంచిగరుడ సేవ చేసే ఇంటి ఇల్లాలును గురించి రాద్దామన్న బుద్దే ఏ కవిమన్యుడి మనసులో కలగలేదాయ

భార్య లఘువుగా ఉండి మరీ భర్తను గురువు చేస్తుందని మళ్లీ షేక్ష్పియరే స్త్రీమూర్తిని మోస్తాడు! భార్యలేని మొగాడు పైకప్పులేని తాటియాకు గూడని జర్మనీలు కూడా వంతపాడారు. అదృష్టం ఎన్ని భాగ్యాలైనా ప్రసాదిస్తుందిటగానీ.. అనుకూలమైన భార్యమాత్రం  ఈశ్వరేచ్చే'నని చివరికి పెళ్ళికాని ప్రసాదు  జాన్ పోప్ పాలు సైతం  వాక్రుచ్చారు! మరెందుకీ మగాళ్ళందరికీ తాళికట్టిన మఃహిళ మీదంటేనే అంత మత్సరం!

'నిప్పు.. నీరు..  భార్య' అందుబాటులో ఉండే అత్యంత  అపాయకరాలని ఆ ఎద్దేవాలెందుకు మగమహారాజులకు! ఏ మాటకామాటే! నిప్పూ నీరుకు మల్లే ఆడదీ  వళ్ళు మండితే వేడి పుట్టిచ్చేస్తుంది. కన్నీళ్ళతో వణుకూ పుట్టిస్తుంది! మగాడిదే మాయదారి బుద్ధి. చనిపోయిన అర్థాంగి మీదా ఆ మగగాడిద దుఃఖం వాకిలి గడప దాటే దాకానే! 

అందరు మగాళ్ళూ అలాగే ఉంటారని కాదు. మంచన మహాకవి 'కేయూరుబాహు చరితం'లో మగాడి ప్రేమకు అద్దం పట్టే ఓ చిత్రమైన కథా ఉందిభార్య వయసులో చిన్నది. భర్తకు ఆమె అంటే అంతులేని అనురాగం. ఆమె గర్భం దాల్చింది. ఆ  సమయంలోనే ఊరు వాళ్ళంతా  తీర్థయాత్రలకని బైలుదేరారు. 'వయసులో ఉన్నదానివి. నాలుగూళ్లు తిరిగాలన్న సరదా సహజం. నీ గర్భం నేను భరిస్తాను. తీర్థయాత్రలు ముగించుకొని వచ్చి తిరిగి తీసుకో!' అంటూ ఆలి గర్భం తనకు బదిలీచేయించుకొని మరీ ప్రసవవేదనలు పడేందుకు సిద్ధపడతాడు.   చూలు మోయడమంటే పేలాలమూట మోయడమా! అన్నం సయించదు. నిద్రబాధలు. బిడ్డకుట్లకు ఓర్చి  నీళ్లాడినా.. తరువాత వాతాలు తగలుకోకుండా  పథ్యపానీయాలతో పంచకరపాట్లు పడాలి! గర్భంమోసి బిడ్డను కని.. పెంచి పోషించేందుకు ఆడది అయిదు మల్లెల   సుకుమారి అయి కూడా ఎన్ని కష్టాలనైనా   ఇష్టంగా ఓర్చుకొంటుందో మగవాడు తెలుసుకోవాలి ముందు

నాగరీకులమని బోరవిరుచుకు తిరిగే  నేటి తరాలకన్నా.. ఆనాగరికులుగా ముద్ర వేయించుకొని హీనంగా బతుకులు వెళ్లమార్చే జాతులు కొన్నింటిలో మగవాడు భార్య ప్రసవవేదనలను పలురీతుల్లో తానూ పంచుకొంటూ నిజమైన సహచరుడు అనిపించుకొంటాడు.

ఎరుకల కులంలో  భార్య ప్రసవించే సమయానికి  మగవాడు అమె కట్టు బొట్టులను  తాను అనుకరిస్తూ చీకటిగది కుక్కిమంచంమీద దుప్పటి ముసుగులో  దాక్కుంటాడు. భార్యకు సుఖంగా ప్రసవమయితేనే  మంచం దిగడం! బాలింత తినాల్సిన గొడ్డుకారం.. ఇంగువ ముద్దలు భర్తే మింగుతాడు.  అండమాను దీవుల్లోని మరో తెగలో అయితే   గర్భిణీ భార్య తినకూడని గొడ్డుమాంసం, తేనెవంటి పదార్థాలు తనూ ముట్టడు.  బిడ్డ పుట్టగానే పెనిమిటి ఉయ్యాల్లో పడుకొనే వింత ఆచారం న్యూగినియా ఆదిమజాతుల్లో నేటికీ ఉన్నది. పార్శీసు జాతి మగాడికి ఉయ్యాల శిక్షతో పాటు వంటికి నల్లరంగు పులుముడు అదనం. మైల తీరేదాకా గది బైటికి రాడు కూడా ఆ జాతిలో మగవాడు. బిడ్డ బొడ్డుతాడు ఊడే వరకు ఉపవాసాలుంటాడు అతగాడు.  ఫిలిప్పీన్ దీవుల్లో   ప్రసవించే సమయంలో  భార్య గది గస్తీ బాధ్యత కట్టుకొన్న భర్తదే. బిడ్డ పుటకకు తనే కారణమన్న వాస్తవం  లోకానికి చాటిచెప్పే ఇట్లాంటి తంతులు ఇంకెన్నో పలుదేశాల ఆదిమజాతులు ఈ నాటికీ నిష్ఠగా ఆచరిస్తున్నాయి!  పురిటిబాధల్లో భాగం పంచుకోవాలని  ప్రసవ సమయంలో   భార్య మంచానికి తనను తాను కట్టేసుకొనే  మియాస్ తెగ మగాడికి మించి భార్యలను  ఎవరు ఎక్కువ ప్రేమించగలరు? 

బుద్ధభగవానుడు భార్యాభర్తలిద్దరూ పాటించవలసిన సూత్రాలు చెరి ఐదేసి  బోధించాడు. 'భార్యను చీదరించుకోకుండా, సంపూర్ణ గౌరవం అందిస్తూ, ఆమెకు తనివితీరా అన్నవస్త్రాలు, ఆభరణాలు  క్రమం తప్పకుండా అందించడం భర్త బాధ్యత అన్నాడు. పరస్త్రీలను కాముక దృష్టితో చూడకపోవడాన్ని మించి మగవాడు మగువకు ఇవ్వగల గొప్ప ప్రశంస మరేదీ లేదని కూడా బుద్ధుడు చురకలంటించాడు.

 

రెండు పుంజులు, రెండు పిల్లులు, ఎలుకలు, ముసలివాళ్లు, పడుచుపెళ్లాం ఉంటే  ఇంట రభస తప్పదని డచ్ దేశంలో ఓ సామెత కద్దు. ‘మగవాడి జీవితానికి రెండే శుభసందర్బాలు.. పెళ్లయిన రోజు, భార్యను పూడ్చిపెట్టిన రోజు’ అని పంచ్ పత్రిక పంచ్! ఎంత అన్యాయం! ‘నీ భార్యను నువ్వు గాడిద చేసావంటే.. ఆ గాడిద నిన్ను ఎద్దును చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త!- అని మాత్రమే నేటి వనిత మగవాడిని హెచ్చరిస్తోంది.

మగవాళ్ళు తమ ఎద్దు మొద్దు స్వరూపాలు గుట్టుగా ఉండాలంటే ఆ 'గాడిద' కూతల జోలికి వెళ్ళనే  కూడదు మరి. భార్యలను ప్రశంసించేందుకు ప్రతి ఏటా సెప్టెంబరు నెల  మూడో ఆదివారం నాడు  భార్యామణిని ప్రశంసించే దినం’ (Wife Apptreciation Day) జరుపుకుంటారు పశ్చిమదేశాల్లో మగవాళ్ళు! ప్రశంసలు అనక! సర్వస్వాన్ని నిస్వార్థంగా అర్పించడానికి సిద్ధపడి మగాడి గడప తొక్కిన ఆడదాన్ని ముందు సాటి మనిషిగ్గా గుర్తించడం   నేర్చుకోవాల్సుంది పురుష ప్రపంచం స్ర్వే సర్వత్రా!.

ప్రతి పురుషుని విజయం వెనకా ఒక  స్త్రీ ఉంటుందంటారు కదా! ఆ స్త్రీ కట్టుకున్నది కాకపోతే ఆ పురుషుడి బతుకు ఇక ఇస్త్రీనే! ఆ సంగతి  గుర్తుంచుకోవాలి మగమేస్త్రీలు.

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

(తెలుగు వెలుగు మాసపత్రిక ప్రచురణ)

 

 

ఉరుము - చిన్న కథ - కర్లపాలెం హనుమంతరావు

 


వృక్ష సంపద – ప్రకృతిచ్చిన పచ్చ’ధనం’ -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు సంపాదకీయం)

 









 'నేత్రపర్వంబు హర్ష సందీపకంబు/ పావనకరంబు పరమ శుభావహంబు/

నీమహత్వంబు విబుదైక విగదితంబు/ దశదిశలయందు నీచారు ధవళకీర్తి

తనరుగావుత మాచంద్ర తారకముగ!' అంటూ హారతులు పట్టించుకున్న వృక్షసంపద ప్రాణికోటికి కోటి ప్రయోజనాల దాత . వృక్ష రహిత జీవావరణం ఊహకందటం కష్ట తరమే. 'పుటకే పుటకే మధు' అని పురాణ సూక్తి. ప్రతి పత్రంలోనూ మధురసం దాచి ఉంచి, ఆది నుంచి  ప్రతి జీవి  కుక్షి నింపుతున్నది  వృక్ష మాతే. చిగురుటాకు మొదలు.. ఎండు చితుకుల వరకు మొగ్గలు, పూవులు, కాయలు, పండ్లు, బెరళ్ళు.. ప్రత్యణువూ పరహితార్థంగ బతికే ప్తత్యక్ష దైవం వృక్షం.

'భూరుహాలూ మానవుల తరహాలో సుఖదుఃఖ అనుభవాలకు అతీతులేమీ కాదు. ' అన్నది మనువు మతం. జేమ్స్ మోరిసన్, జెసి బోసు గెల్వనా మీటరు సాయంతో నిరూపించిందీ ఈ సత్యమే.  కుఠార ప్రహారానికి విలపించిన విధంగానే.. గట్టు కట్టి నీరు పోస్తే చెట్టూ చేమా సంతోషిస్తాయి.. పుష్ప భావోద్వేగాలు ప్రధానాంశంగా సాగిన కరుణశ్రీ ఖండ కావ్యం మనకు  ఉదాహణగా ఉండనే ఉంది.   కాల గతిన గతించక ముందే చేసే వృక్షచ్ఛేదనను  ఉపపాతకంగా యాజ్ఞవల్క్యం(276) పరిగణించింది. పూర్వీకులు వృక్షాలకు దైవత్వం కల్పించి.. పూజనీయం చేయడంలోని ఆంతర్యం.. విలువైన  వృక్ష సంపద అర్థాంతరంగా అంతరార్థం కారాదనే. పరీశీలించే విశాల దృక్పథం ఉండాలే గాని ప్రాచీనుల సూత్ర బద్ధ నిబందనల చాటున దాగి ఉన్నదంతా.. నేటికి గాని నిగ్గు తేలని వైజ్ఞానిక అంశాల సమాహారమేనన్న సులువుగానే బధపడుతుంది. వరాహమిహిరాచార్యులు పన్నెండు వందల ఏళ్ల కిందటే  వృక్షారోపణ లక్షణాలను.. పుష్పాదుల వికాసానికి సహకరించే దోహద  క్రియలను గూర్చి పూసగుచ్చినట్లు వివరించారు.

మొక్కా మోడులను  పెంచడం ఒక్క ఆహారానికేనా? ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, మానసిక ప్రశాంతతకు, ఏకాంతానికికూడా!  వైద్యునిలా, మిత్రునిలా, హితునిలా జీవితో  సన్నిహితంగా మెలిగే తల్లి ప్రవృత్తి ప్రకృతిది. కాబట్టే అడవుల నుంచి.. అధునాతన కట్టడాల వరకు హరిత పత్ర పోషణ ఒక ముఖ్య జీవితోపాసనగా మారింది. వృక్షో రక్షతి రక్షితః.

 

వృక్షాంశం ఒక  శాస్త్రంగా పఠించే సంప్రదాయం ఇక్ష్వాకుల కాలం  నుంచే ప్రచారంలో ఉందీ దేశంలో. కౌటిల్యుడు (క్రీ. పూ 850)  అర్థ శాస్త్రంలో ఆయుర్వేద వైద్యం విధి విధానాలు విస్తృతంగా  చర్చించిన విశేశం ఎంత మందికి తెలుసు?. వేదాలు, సంహితలు మొక్కల బాహ్య స్వరూప స్వభావాలను అత్యంత మనోహరంగా వర్ణించాయి.   ఆర్యులు ఆదరించిన సాగు పద్ధతుల నుంచి, చరకుడు అనుసరించిన వైద్య విధానం వరకు అన్నింటికీ వృక్షాలు, మొక్కలు, మూలికలే ప్రధాన ఆలంబన. వాల్మీకి రామాయణం ఒక వృక్ష వైజ్ఞానిక గ్రంథం.  సుందర కాండలో లంకానగర ఉద్యాన వనాలు, కాళిదాసు మేఘసందేశంలో అలకాపురి వృక్షాలు  రుతుభేధం లేకుండా పుష్పిస్తాయి. లక్ష్మణ స్వామి మూర్చ బాధకు సుషేనుడు  సంజీవ పర్వత ఓషధులతోనే చికిత్స చేసింది. యుద్ధ కాండలో ఆయుధ ప్రహారాల నుంచి గాయపడకుండా తప్పించుకునే నిమిత్తం  మహాపార్శ్వుడు, మహోదరుడు ఓషదులను, నానావిధ సుగంధాలని దేహానికి పట్టించడం విశదంగా వర్ణించడం ఉంది. శిఖరాగ్ర వృక్షాల  బెరళ్లలోని శిలీంద్ర జాలం పొడి  వర్ష ధారలకు తడిసి శరద్రాత్రుల్లో మెరుస్తుంటుంది. అధిక మోతాదుల్లోని  భాస్వరం ఈ రసాయనిక చర్యకు ప్రేరణం. హిమవత్పర్వతం మీద ఓషధులు  వెదికే  ఆంజనేయుడి దృష్టి నుంచి  'సందీప్త సర్వౌషధ సంప్రదీప్త'మూ దాటి పోలేదు! అణ్ణామలై విశ్వవిద్యాలయం మాజీ వృక్షశాస్త్రాచార్యులు టి.సి.ఎన్. సింగ్  శబ్ద తరంగాలతో భూమి పొరల ద్వారా మొక్కల్లోని ప్రత్యుత్పత్తి కణజాలాన్ని ఉత్తేజపరిస్తే సత్వర పుష్ప వికాసం  సాధ్యమేనని నిరూపించారు.  స్రీ పాద తాడనంతో అశోకం, ఆలింగనంతో గోరింట, నమ్ర వాక్యాలతో కొండ గోగు అకాలంలోనూ పుష్పిస్తాయని కాళిదాసు, శ్రీహర్షుల కృతుల్లోనూ ఉండటం తెలిస్తే నవీన తరం ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుడుతుందేమో! కాళిదాసు శృంగార మంజరిలోని 'పూవు నుంచి పూవు పుట్టే' వింత నేడు గులాబీ, జినియా జాతి  బంతి పువ్వుల్లో  కనిపిస్తుంది. ధూర్జటి 'కాళహస్తీశ్వర మాహాత్మ్యం' లోని ఓ చెట్టు  ఆకులు తటాక జలాల్లో పడ్డవి  జలచరాలుగాను,  గాలిలో తేలేవి పక్షులుగాను, వడ్డుకు అటు ఇటుగా  పడ్డవి ఉభయచరాలుగానూ మారే విడ్డూరం వర్ణీంపబడింది. ఈజిప్టు, రోము, గ్రీసు నగరాల తవ్వకాలలో బయట పడ్డ కొన్ని చిత్రాలు ఇదే వింతను చిత్రీకరిస్తుంటే ఆ అద్భుతానిని ఏమనిపిల్చుకోవాలి?! అయినా నాటి కవుల వృక్ష పరిజ్ఞానాన్ని సాటి పాశ్చాత్యులతో కలసి  మనమూ  వెటకరిస్తున్నాము! పెరటి చెట్టంటే మరి అంత చులకన కాబోలు!

రావిలోని రాగి తేజోకారి. బావి నీటిని  సైతం ఆవిర్లెక్కించే ఉష్ణకారి.  పగలు ప్రాణ వాయువు, రాత్రి బొగ్గు పులుసు  విడిచే గుణం వేప చెట్టుది. చింత గాలి వంటిసున్నానికి బద్ధ విరోధి.  అశ్వత్ఠం వృక్ష జాతుల్లోకెల్లా అత్యుత్తమమైనదని  గీత ధృవీకరిస్తున్నది. చెట్లు విడిచే గాలి వంటికి  తగిలే చోట నివాసముంటే చాలు.. సగం ఆరోగ్యం సర్వదా వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లే నంటున్నారు  ఆరోగ్య శాస్త్రవేత్తలు. రష్యన్  వృక్ష శాస్త్ర పరిశోధకులు దక్షిణ భారతాన దొరికే అత్యంత అరుదైన ఆరువేల  రకాల మొక్కలను, వెయ్యి రకాల విత్తనాలను  పరిశోధనల నిమిత్తం పట్టుకు పోయారు. అయినా మనకు చీమ కుట్టినట్లైనా లేదు! మనకు చెట్టంటే పట్టదు! కార్తీక మాసం సంబరాల్లా  వనభోజనాల సందళ్ళు సాగే కాలం. ఉసిరి చెట్టు కింద సాలగ్రామార్చన.. సామూహిక  భోజనాలు ఓ ఆచారం. కాలుష్య రహిత హరిత వనాల్లో పవిత్ర ఔషధ పరిమళాల మద్య చేసే విందు ఆరోగ్య కోణం  వైద్యుల  ప్రశంసలు అందుకుంటోన్నది. 'జిరుత వాయువులను దెచ్చి చెమట లార్చి/ చల్లదనమిచ్చి సుఖమిచ్చి సత్వమిచ్చి/కౌతుకము నిచ్చి బుద్ధివికాస మిచ్చి/యతిధి కభ్యాగతికి మరియాద వెలయ/నాదరము జూపు మంచి గృహస్థు'నితో పోల్చాడు వృక్షరాజ్యాన్ని వెనకటికి ఓ ప్రకృతి ప్రేమికుడు. వివిధ  విలయాలకు ఇప్పుడా వృక్షాలు లక్షలాదిగా    నేలకూలుతున్నాయి. . పచ్చదనం తగ్గి నేల తల్లి కళ తప్పివున్నది. వనాలే లేవు .. వన భోజనాలు ఎక్కడని ఇప్పుడు  జనాల బెంగ. నిరుత్సాహం చికిత్స కాదు గదా! విలయాల అనంతరమైనా చెట్టు ఘనత మనకు తెలిసి వచ్చింది కదా! సంతోషం. కూలినంత వేగంగా వృక్ష జాతుల్ని తిరిగి నాటే ఉద్యమానికి ప్రభుత్వాల చేత శ్రీకారం చుట్టించాల్సింది ఓట్లు వేసి గెలిపించుకున్న జనతే. ఆనందం, ధృఢ సంకల్పంతో చెట్లు నాటే కార్యక్రమంలో జనమూ స్వచ్చందంగా చొరబడితే కోల్పోయిన పచ్చ'ధనా'న్ని తిరిగి సాధించడం ఎంత సేపూ?

***

(ఈనాడు సంపాదకీయం)

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ


ఆంధ్రకల్పవృక్షం-తాడి చెట్టు- వేటూరి ప్రభాకర శాస్త్రి గారు-

 

తాటి చెట్టు ఆంధ్రుల కల్ప వృక్షం. తాటాకు చుట్టతో కట్టడాన్ని బట్టి తాళికి ఆ పేరు వచ్చిందిస్త్రీ కర్ణ భూషణాలు తాటాకు కమ్మలుతాటి తోపులు ప్రతిగ్రామంలో తప్పని సరి.యనభై తొంభై ఏళ్ళ వయసుగల వారి చేతే తాటిగింజలు నాటించేవారు ఊరి పెద్దలు.తాడి కాపు పట్టే లోపు మరణం తప్పదన్న భయం కారణం.పదిహేనేళ్ళకు గాని తాటి కాపు పట్టదు.' ముత్తాడి' అంటే మూడు తరాల తాడిని చూచిన మొనగాడని అర్థం.తను నాటిన తాటి కాపుకు పండు పడితే దాని గింజను మళ్లా నాటి మళ్లా దాని పండునూ నాటి అది కాపుకు వచ్చినదాకా నూకలు చెల్లకుండా ఉన్నాడంటే వాడు నిజంగా దీర్ఘాయుష్మవంతుడేగా! 

నేల  నాణ్యతతో  చదునుతో తాటికి నిమిత్తం లేదు.నీటి వసతి అక్కర్లేదు. విస్తీర్ణం తక్కువున్నా ఎక్కువ మొక్కలు నాటుకోవచ్చు.నాటిన మూడేళ్లకే ఆకులు మట్టలు ఉపయోగానికి వస్తాయి. కట్టుబట్ట మినహా మిగతా జీవితావశ్యక వస్తువులన్నీ తాటి చెట్టునుండి సేకర్ంచుకుని జీవయాత్ర గడుపుకున్న రోజులు ఉన్నాయి. గుడిసెకు నిట్రాడ దూలం.గోడల కొంపకైతే తనాబీలు దూలాలు, స్తంభాలు, కొమరులు, గుజ్జులు, వాసాలు, పెండెలు, అన్నింటికీ తాటిచెట్టు ఆటి వస్తుంది. కట్టడానికి తాటనార. ఇంట పడకలకి తాటియాకులుసామానుల భద్రానికి తాటి పెట్టెలు, బుట్టలు. తాటి డొక్కుతో నీరు తోడే చేద. నారతో చేంతాళ్ళు సరే సరితాటి మ్రానులు రెండుగా చీల్చి నీళ్లు పారే దోనెలుగా వాడుకోవచ్చు. తాటి ముంజెలు, తాటి పండ్లు, తాటి(నిలవ చేసిన పేసము) చాప, బుర్రగుంజు, తాటి తేగలు, తాటి బెల్లం, తాటి కల్కండ, తాటిపానకం, తాటి కల్లు వమ్టికి మేలు చేసే మంచి ఆహార పానీయాలు.

(ఆంధ్రకల్పవృక్షం-తాడి చెట్టు-వేటూరి ప్రభాకర శాస్త్రి గారు- భారతి- -46-6-1)

-సేకరణ; కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూ ఎస్ ఎ

10 -02 -2021

 



నమస్తేలోనే ఉంది సమస్తం

 

-కర్లపాలెం హనుమంతరావు

10 -02 -2021

 

నమస్తే'లోనే ఉంది సమస్తమంతా.

న ‘మస్తే’ అంటే తల లేని వ్యవహారంగా కొద్దిమందికి వెటకారం. జోడించే వడుపు కుదరక  చేతులను  ఆడిపోసుకోవడమే అదంతా! 

తెల్లారగట్టే వచ్చి తలగడ దగ్గర ఎంత పడిగాపులు పడ్డా దుర్యోధనుడికి రవ్వంత కార్యలాభం కలిగింది కాదు.   ఆలస్యంగా వచ్చినా  నమస్కార బాణాలతో ఇచ్చకాలు పోయిన పాండవ మధ్యముడికో! ఊహించని మోతాదులో కృష్ణానుగ్రహ లాభం. నిండు సభామధ్యంలో ఇట్లాంటివే ఏవో  దండకాలు.. స్తోత్రాలు చదివినందు వల్లనే   ఆ గాండీవుడి అర్థాంగికీ  రుక్మిణీవల్లభుడి సహోదరత్వం అండలా లభించింది. అందుకే,  ‘ఆఁ! దండాలూ దస్కాలా!’ అంటూ వెక్కిరింపుకలొద్దు! ఆ మస్కా జాతి  ట్రిక్కే ఎంత కోన్ కిస్కా గొట్టాన్నైనా ఇట్టే గుప్పెట్లో పట్టేసుకునే పట్టు!

రామాయణమే ప్రణయాంజలి ప్రభావాలకు పరమ  ప్రమాణం! ఎత్తిన రెండు చేతులూ దించకుండా జీవితాంతం ఒక పట్టున అట్లా నెట్టుకొచ్చాడు కాబట్టే కోతి జాతిలో పుట్టినా ముక్కోటి దేవతలకు మించిన అపూర్వ గౌరవం ఆంజనీ పుత్రుడు కొట్టేసింది. ఉన్న ఒక్క తొండంతోనే  చేతనైనంత వరకూ సాగిలపడబట్టే కదా  ఆపదల మడుగు నుంచి గట్టెక్కగలిగింది    కరిరాజు గజేంద్రమోక్షంలో!

అదే చాయలో పోబట్టే అప్పట్లో మన పక్క రాష్ట్రం పన్నీరు సెల్వంసారూ.. అమ్మవారి అనుగ్రహం అమాంతం కొట్టేసారు. జయామ్మాళ్ ఆ రోజుల్లో  సర్కారువారి సత్కార గృహ(జైలు) యాత్రకెళ్ళినప్పుడల్లా  పన్నీరువారు ముఖ్యమంత్రి పీఠానికి ముఖ్యమైన  కాపలాదారు! ఆ తరహా ఎక్స్ట్రా లాభాలకు ఎల్ల వేళలా నమస్కార బాణాలే బ్యాగ్రౌండు నుంచి బాగా వర్కవుటయ్యేది కూడా.. బయటికి కనిపించవు కానీ!

స్వామివారు కంట బడ్డప్పుడు స్వాభిమానలవీ  పెట్టుకోడం కూడదు. 'నమో నమః' అంటూ సాష్టాంగ ప్రమాణాలు  ఆచరించకుంటే ఆ తరువాత జరిగే చేదు అనుభవాలకు ఎవరికి వారే బాధ్యులు.. యడ్యూరప్పే అందుకు గొప్ప  ఎగ్జాంపుల్!

పది తలలున్నాయి.. ఏం లాభం? ఉన్న రెండు చేతుల్నీ వేళకి సద్వినియోగం చేసుకునే  విద్య అలవడకే  అంత లావు రావణుడూ   రాముడి ముందు పిట్టలా రాలిపోయింది. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుళ్ళ జాతి పతనానికి  ముఖ్య కారణం  ఈ దాసోహ  దాసోహం రాజకీయాలకు దాసోహం అనకపోవడమే!  రాక్షసులకు  తెలియని చమత్కారం మన రాజకీయ పక్షులకు మా  బాగా తెలుసు.  లేకుంటే మన ప్రజాస్వామ్యం  మరీ ఆర్ట్ మూవీకి మల్లే బోర్ కొట్టదూ!

కడుపులో ఎంత కంటయినా ఉండుగాక.. ఓ యాత్ర కంటూ బైలుదేరాక   దేవుడిచ్చిన రెండు చేతులూ  గోజుతో కరిపించినట్లు గాలిలో అట్లా ఊపుతూనే ఉండాలి.  జైలుకు వెళుతూ వస్తూ కూడా మన నేతాశ్రీలు పళ్ళికిస్తూ గాల్లోకి అలా వణక్కాలు గట్రా  వదలడం చూస్తున్నా .. ఇంకా వందనాల విలువను గూర్చి సందేహాలేనా! మీ కో నమస్కారం!

ప్రణామాలకు, వాగ్దానాల మాదిరి  కాలపరిమితి బెడద లేదు! నగదు బదిలీ.. రుణమాఫీలకు మల్లే   ఈ ప్రజాకర్షక పథకానికి పైసల్తోనూ బొత్తిగా నిమిత్తం లేదు.  ఏ ఎన్నికల సంఘం  అదుపూ.. అజమాయిషీ లేకుండానే రెక్కల్లో ఓపిక ఉన్నంత కాలం వాడుకుని ఆనక వదిలేసే  సౌకర్యం ఒక్క చేతుల జోడింపులోనే కద్దు. చెప్పిందేదీ చెయ్యకుండా  చెయ్యిచ్చే నేతలు సైతం ఈ  చేవిప్పులు(నమస్కారాలు) కెప్పుడూ చెయ్యివ్వని కారణం ‘చేవిప్పు’ మీద ‘విప్’ జారీ చేసే అధికారం ఏ పార్టీ ‘వివ్’  లకూ  లేకపోవడం!

ఎన్నికలు ఎప్పుడొచ్చినా  నరేంద్ర మోదీకి కలిసొచ్చే  అంశాల్లో  ప్రధానమైనది కుదించి పలికే ఆయనగారి పొట్టి పేరు ‘నమో’ ! ఓ వంక దెప్పుతూనే మరోవంక 'నమో.. నమో' అనక తప్పని  తలనొప్పులే  ప్రతిపక్షాల కెప్పుడూ.. పాపం పిటీ! 

పబ్లిగ్గా ఎంత పడతిట్టిపోసుకున్నా శాల్తీ కంటబడ్డప్పుడు ఏ సంకోచం లేకుండా కల్తీ లేని ‘నమస్తే’ ముద్రొకటి అభినయిస్తే చాలు.. సగం అభిప్రాయభేదాలు సాల్వ్ డ్! ప్రధాని మోదీ ఓం ప్రథమంగా పదవీ ప్రమాణ స్వీకారోత్సవం చేసిప్పుడు సార్క్ దేశాధిపతులంతా మూకుమ్మడిగా  కలసి సాధించిందీ అదే!  ఎవరి బాణీలో వాళ్ళు  నమస్కార బాణాలు సంధించుకుంటూ సరికొత్త విదేశీ సంబంధాలకు బోణీ కొట్టడం!

జపాను పోనీ.. చైనా పోనీ.. అమెరికాతో సహా ఏ గడ్డ మీద  కాలు పడ్డా.. మన ప్రధాని మోదీని ఆదుకున్నవీ మొదట్నుంచీ చేతులే! తంపులమారి ట్రంపయినా   తప్పించుకోలేని అట్రాక్షన్ ప్రణామంలో ఉంది. 

'ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు' అంటూ ఆ త్యాగరాజయ్యరువారంతటి వైతాళికులు ఊగిపోయారు. ఆరోగ్యాన్నిచ్చి, బంధుకృత్యాన్ని నెరవేర్చే ప్రత్యక్ష నారాయణుడు అనే గదా ఆ పై నెక్కడో ఉండే  సూర్యుణ్ణి కూడా భగవానుడిగా భావించి 'ఓం..హాం..మిత్రాయ' అంటో రెండు పూటలా అలా పడీ పడీ సూర్యనమస్కారాలు చేసుకోడం!  

అర్హతలతో నిమిత్తం లేకుండా అందలం ఎక్కించి పదిమందిలో గుర్తింపు తెచ్చిపెట్టే  లోకబాంధవి నమస్కారం.  నిజానికి పడమటి ‘హాయ్.. హలో’ లకు మించి  ఇవ్వాలి ఈ నమస్కారానికి మనం గౌరవం. అందుకు విరుద్ధంగా లోకువ కట్టేస్తున్నాం.. అదీ విడ్డూరం! 

ఏ అరబ్బుల దేశంలోనో  పుట్టుంటే తెలిసుండేది మన  వందనాల విలువ.  ఖర్మ కాలి ఏ ఒసామానో  కలిసినప్పుడు బుగ్గ బుగ్గ రాసుకు చావాల్సొచ్చేదక్కడ.  రాం రాం, నారాయణ నారాయణ, జై రామ్, జై సియా రామ్, ఓం శాంతిః- ఆహా.. ఎన్నేసి రకాల నామధేయాలండీ నమస్కారాలకు  మన పుణ్యభూమిలో!  'నమస్తే' అంటే 'వంగటం' అన్న ఒక్క  పిచ్చర్థం  మాత్రమే తీసుకుని పెడమొహం పెట్టేస్తే ఎట్లా?  పూరా నష్టపోతాం కదరా ఉన్న ఒక్క  ప్రపంచ స్థాయి గుర్తింపు  పిచ్చిగా వద్దనుకుంటే  సోదరా!

 అమెరికా అధ్యక్షులు ఎవరు ఇండియా వచ్చినా,  వెళ్ళిన  ప్రతి చోటా అదే పనిగా 'నమస్తే'లు కుమ్మేస్తారు. బిలియన్ డాలర్లు విలువ చేసే  బిజినెస్సులతో దేశీయ మార్కెట్లను  కమ్మేస్తారు.  

మనలను ఏలి పోయిన తెల్లవాడిదే తెలివంటే. మన నమస్కారమే మన పైన గడుసుగా సంధించేసి మన రాజుల్ని, నవాబుల్ని బుట్టలో వేసేశాడు! ఇంగ్లీషు వాడి  నమస్తేకి  పదిహేను వందలేళ్ల  గ్రంథం ఉంది. అదంతా మొదలు పెడితే ముందు మీరు నాకు నమస్కారం పెట్టేస్తారు!

తూర్పు పడమర్లు, ఉత్తర దక్షిణాలనే తేడా ఏముందిలే కాని

నమస్కారాన్ని కనిపెట్టిన మహానుభావుడికో నమస్కారమైతే.. దాన్నో ఆయుధంలా వడుపుగా వాడేసుకునే తాజా రాజకీయాలకు  వందలొందల నమస్కారాలు!


నమస్కారాన్ని నమ్ముకున్న వాడెన్నటికీ చెడే ఆస్కారం లేదు. 'దండమయా విశ్వంభర.. దండమయా పుండరీక దళనేత్ర హరీ..  దండమయా ఎపుడు నీకు.. దండము కృష్ణా!' అంటో దండక శతం ఆపకుండా గడగడ చదవ గలిగే గడుసు పిండానికి ఏ గండాలు రావు.  వచ్చినా రామచంద్రుడి ముందు   సముద్రుడంతటి వాడొచ్చి సంధించిన  బాణంలా అవి తీరం దాటి ప్రళయం సృష్టించబోవు.

గూగుల్ నుంచి ట్వట్టర్ దాకా  ‘నమస్కారం'   సృష్టిస్తోన్న  ప్రభంజనం  ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఇంకా ప్రణామ మాహాత్మ్యాల మీద సవాలక్ష సందేహాలంటే.. బాబూ .. తమకో నమస్కారం!

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ


Monday, February 8, 2021

ట్రాజెడీ ఆఫ్ ఎర్రర్స్- కామెడీ కథ - కర్లపాలెం హనుమంతరావు

 


టీఈ సీరియల్ కమర్శియల్ బ్రేక్ లో రాంబాయమ్మగారికి గుండెపోటొచ్చిందిఎపిసోడయిందాకా కదలనని మొండికేయడం వల్ల గుండెకొచ్చిన ప్రమాదం మరింత హెచ్చింది

ఐదు నక్షత్రాల ఆసుపత్రిఅనుభవజ్ఞులైన వైద్యులు.. సంగతెలా ఉన్నా టీవీ uసోపులమీదున్న  అకుంఠిత అభిమానం ఆమె ప్రాణాలని నిలబెట్టింది

ఆపరేషన్ టేబుల్ మీదున్నప్పుడు  రాంబాయమ్మగారికి దేవుడితో చిన్న భేటీ అయిందిదైవ దర్శనం కాగానే ఆమె దేవుణ్ణి అడిగిన మొదటి ప్రశ్ననాకింకా ఎంతకాలం భూమ్మీద నూకులున్నాయ'ని

'నలభై మూడేళ్ల రెండునెల్ల మూడురోజులమీద నాలుగ్గంటలా ఐదు నిమిషాల ఐదు సెకన్లుఅన్నాదు దేవుడుదేవుడిమాటమీద గురితోనే రాంబాయమ్మగారు ఆపరేషను సక్సెసయిందనిపించి ప్రాణాలతో లేచికూర్చున్నారు

'ఎలాగూ  మరో అర్థశతాబ్దం బతకబోతున్నాం గదాఇంకా ఈ ముడతలుబడ్డ ముఖంబాన కడుపుముగ్గుబుట్ట జుట్టుబోసి నోరువంగిన నడుంతో ముసిల్దానిలాగా ఎందుకు బతుకు నిస్సారంగా గడపాలిమానవజన్మ మళ్ళీ మళ్లీ రాబోతుందాఅందులోనూ ఆడజన్మే దొరుకుతుందన్న గ్యారంటీ ఉందాఅన్నీ ఉండి అనుభవించేందుకు కట్టుకుపోయినంత ఆస్తి తనకుమాదిరిగా ఎంతమందికి ఉందిఅడ్డుచెప్పే కట్టుకున్నవాడూ భూమ్మీదలేని అదృష్టం  తనది.' అన్నివిధాలా అచ్చొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న దృఢనిశ్చయానికొచ్చింది రాంబాయమ్మగారు.

గుండాపరేషనైన ఆసుపత్రిలోనే ఫేస్ లిఫ్టింగ్ఫ్యాట్ సక్కింగ్ప్లాస్టిక్ సర్జరీడెంటల్ రికవరింగ్హెయిర్ ట్రాన్స్ ప్లాంటింగ్.. వగైరా వగైరా ఓ పది లక్షలు పారేసి  టోటల్లీ బాడీ రీమోడలింగు చేయించేసుకుంది రాంబాయమ్మగారుపది లక్షలు పోతే పోయాయిగాని.. రాంబాయమ్మగారిప్పుడు  రంభను తలదన్నే మోడల్ గా మెరిసిపోతోంది.

ఆ ఉత్సాహంలో ఆఖరి ఆపరేషన్ కూడా  విజయవంతంగా ముగించుకుని ఆసుపత్రి బైటకొచ్చి రొడ్డు దాటుతుండగా లారీ ఒకటి దూసుకొచ్చి రాంబాయమ్మగారిని లేపేసింది.

మళ్ళీ దేవుదిగారితో భేటీ తప్పింది కాదుభగవంతుణ్ణి చూడంగానే భగభగ మండింది రాంబాయమ్మగారికికడుపులోని కోపాన్నంతా వెళ్లగక్కుతూ 'నలభైముడేళ్లకు పైగా ఆయుర్దాయం ఉదంటివే?మీ  దేవుళ్ళూ మా లోకంలోని రాజకీయ నాయకులకు మల్లే మాటమీద నిలబడకపోతే ఎలాగయ్యాముల్లోకాలకింకేం గతి?' అని ఎడపెడా వాయించడం మొదలుపెట్టింది దేవుడు కంటపడీ పడకముందే రాంబాయమ్మగారు.

'సారీ!రాంబాయమ్మగారూలారీ గుద్దింది ఎవరో రంభననుకున్నాను.. రాంబాయమ్మగారిననుకోలేదుఅని నాలిక్కరుచుకున్నారు దేవుడు గారు!

- కర్లపాలెం హనుమంతరావు 

( చతుర్ మాసపత్రిక ప్రచురణ ) 

***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...