Friday, February 12, 2021

కవిత్వం-కవుల బడాయి - రామకృష్ణ కవులు - రచన ః కర్లపాలెం హనుమంతరావు

 


వినాయకచవిత పండుగ పూట పూజాదికాలైన పిదప సాయంకాలం ఇష్టులైన వారి ఇళ్ళమీదకు పిల్లలు చిన్న చిన్న రాళ్ళు, బెడ్డలు విసిరి పెద్దలచేత షష్టాష్టకాలు పెట్టించుకోవడం హిందువుల సంస్కృతిలో ఓ ఆచారం. ఆ పండుగ పూట   పెద్దలు వడ్డించే  తిట్లు పిన్నలకు   దీవెనలతో సమానమని ఓ నమ్మకం. శతావధాన పండితులు రామకృష్ణ కవులు బహుశా ఇలాంటి ఏదో విశ్వాసంతోనే  నన్నయాదులవంటి అఖండ ప్రజ్ఞావంతులందరిని ఒక వరసలో తిట్టి పోసారు. 1918నాటి ఆంధ్ర పత్రిక సంవత్సరాది సంచికలోని ముచ్చట ఇదిసరదాగా ఏరిన అందులోని కొన్ని పద్యాలు ఇవి.  పూర్వకవులమీద తనకుండే అపారమైన  భక్తిశ్రద్ధలను  రామకృష్ణకవులే స్వయంగా ప్రకటించుకున్నారు కనక ఇక  పేచీ లేదు.

కేవలం  సరదాగా మాత్రమే తీసుకోమని సహృదయ సాహిత్యాభిమానులకు మనవి.

 

ఆంధ్ర లోకోపకారము నాచరింప/

భారతమ్మును నన్నయభట్టు తెలుగు/

జేయుచున్నాడు సరియె; బడాయి గాక/

తొలుత సంస్కృతపద్య మెందులకు జెపుఁడి!

 

గురుకులక్లిష్టుడయి విద్య గఱవబోక/

సహజపాండిత్యుడ నటంచు సంబరపడు/

పోతనామాత్యు నే రాజు పూజ సేయు?/

దేవరల దయ్యములను గీర్తింప కేమీ?

 

ఆంధ్ర కవిచక్రవర్తుల కందఱకును/

నీ పలుకు చాలు మేలుబంతి యగుగాక!/

తెలుగు సేతయె కా? స్వతంత్రించి నీవు/

చేసినది యేది? శ్రీనాథ! చెప్పుకోగ.

 

తన మాట తనకె తెలియక/

చని యొక సాలీని వాక్యసందర్భంబున్/

విని యర్థ మెఱింగిన తి/

క్కన పాండిత్యంబె వేఱ యడుగగ నేలా!

 

మన యెర్రన హరివంశము/

దెనిగించినవాడు మంచిదే నాచన సో/

మన యుత్తరహరివంశము/

గనుడీ! యది యెంత చక్కగా నున్నదియో!

 

మధ్యవళ్లు పెట్టి మంజరిద్విపద బ/

ల్నాటి వీరచరిత నా బెనచితి/

వది స్వతంత్రకావ్య మని యేరు మెచ్చుకొ/

నంగవలెనొ? కమలనాభ పౌత్ర!

 

ప్రాలుమాలికచే దాళపత్ర పుస్త/

కాటవుల నర్థపుందెరువాట్లు గొట్టి/

కొఱతబడు నని కుకవిని కొసరి తిట్టి/

పెద్దన యొనర్చినట్టి తప్పిదము నదియె.

 

కృష్ణరాయడు చేసిన విష్ణుచిత్త/

కావ్యమందలి భావము శ్రావ్యమె యగు;/

నెన్ని మార్లు పఠించిన నెఱుకపడని/

వట్టి పాషాణపాక మెవ్వండు సదువు?

 

కవనధోరణి కల్పనాగౌరవంబు/

శబ్దసౌష్ఠవమును లెస్స సంబరంబె;/

బోగపుబడంతులా కళాపూర్ణ కథకు/

నెత్తిన ప్రధాననాయిక? లెంత తప్పు!

 

తగని గర్వంబు జేసి తన్ను దానె/

పొగడుకొనువాడటంచు జెప్పుదురుగాక,/

నాలి పలుకులు రావు తెనాలిరామ/

కృష్హ్ణకవి నోట బంగారు గిలకదీట.

 

కవులందరికీ కలిపి చేసిన  వడ్డనలుః

 

ఒకడు స్వప్నప్రకారము నుగ్గడింప/

నెల్లవారలకు గలలె తెల్లవార్లు/

నవ్వుదురను తలంపు లే దెవ్వరికిని/

పేరుకొన నేమిటికి నట్టి బీద కవుల?

 

దేవతాప్రార్థనంబును దేశనగర/

రాజవర్ణనములు కథారచన యంత/

త్రొక్కి విడిచిన పుంతయే దిక్కుమాలి/

కవనముం  జెప్పదిగిన ప్రజ్ఞానిధులకు.

 

ఈ కాలం కవులకూ ఆశీర్వచనాలు తప్పలేదుః

 

గాసటబీసట వేలుపు/

బాసం బఠియించి యాంధ్రభాషాగ్రంథా/

భ్యాసము లేకయె తెలుగుల/

జేసెద మనుచుండ్రు బుధులు సిగ్గెఱుగరొకో?

 

పూర్వకవి రాజులకు నిది భూషణంబొ/

దూషణమొ యనుకొనుడు మీ తోచినట్లు;/

నన్నయాదుల పట్ల మాకన్న గూర్మి/

గలుగువారలు లేరు జగమ్మునందు.

-కర్లపాలెం హనుమంతరావు

బోథెల్, యూఎస్ఎ

ఫిబ్రవరి, 9 2013


 

 

 

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...