దేవుడి పేరు చెప్పి తోచిన పిచ్చి కూతలు కూసుకుంటూ అమాయకులైన లోకులను భక్తి భావన వంకన భయభ్రాంతులను చేసి స్వార్థ లాభం కోసం నిలువుదోపిడీ చేసే దుష్టబుద్ధుల మీద కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి 'ధూర్తమానవా శతకము' పేరుతో కొంత పద్య రచన చేసారు. ఈ పద్యాలలోని అన్ని భావాలలో ఎక్కడా అతిశయోక్తి మచ్చుకైనా కనిపించదు. నిర్మలమైన మనసుతో తమ తమ జీవికలను నడుపుకునే లౌకికులను నిందించడమూ కనిపించదు. లేని దేవుడిని ఉన్నాడని బుకాయించే పెడసర బుద్ధిగల గడసరి మనుషులపై ఆ 'దేవుడి' చేతనే దుడ్డుకర్ర తిరగేయించిన ఈ శతకంలోని పద్యాలు సులభ శైలిలో చదవగానే అర్థమయే రీతిలోనే ధారగా సాగడం విశేషం. పద్యాలు చదువుతున్నప్పుడు కపట జీవుల పట్ల దేవుడు విసిరే విసుర్లు భక్తిభావం మెండుగా కలవారికీ నవ్వు తెప్పిస్తాయి. కారణం.. దేవుడు ఈ పద్యాలలో గద్దించిన దుర్మార్గపు జాతిలో వాళ్లు ఒక భాగంగా లేకపోవడం!
సచ్చీలవంతులు ఎవరినీ ఇంచుకైనా నొప్పించని విధంగా కవిరాజు ఈ పద్యాలు అల్లిన విధానం హర్షింపదగినది. ఆలోచించదగినది. అన్ని పద్యాలు విస్తరణ భీతి చేత ఇవ్వడం కుదరక.. కొన్ని పద్యాలు మాత్రమే ఉదాహరణ కింద కింద ఇస్తున్నాను. చదివి ఎంజాయ్ చెయ్యండి. నచ్చితే మిత్రులతో నిశ్చింతగా పంచుకోండి!
-కర్లపాలెం హనుమంతరావు
12 -02 -2020
ఏ నొకజాతికూడు భుజి-యించుచు మిక్కిలి తక్కుజాతులన్
హీనముగాగఁ జూతునని-యెవ్వరు సెప్పిరి నీకు వంచకా!
మానవు లందఱున్ సరిస-మానులు గారొకొనాకు? మాయురే!
మానక నీవ యిట్టి యవ-మానముఁ జేతువె ధూర్తమానవా!
***
త్వరపడకుండ సంజపడు-దాఁకను తప్పుపనుల్ పొనర్చి పై
బొరుగున నున్న తోఁటలను-బూవులు మ్రుచ్చిలి కోసి తెచ్చి నా
శిరమునఁ బోసినంతటనె-చేసిన పాపము లొక్కసారిగా
మఱచెడునట్టి వెంగలినె-మానక యిట్టివి ధూర్తమానవా!
***
మరణపు శయ్యమీఁద నొక-మారయినన్ నను దప్పకుండ సం
స్మరణము చేసినంతటనె-స్వర్గము వచ్చునటందు, వేగతిన్
బొరయును? నిట్లె నీ వెపుడు-బొంకుచునుందువు దీనికై నినున్
గఱకఱ గొంతు కోసెదను-కానివి చెప్పకు ధూర్తమానవా!
***
బొచ్చు నొసంగి యెట్లు పరి-పూర్ణమనోరథసిద్ధిఁ బొందగా
వచ్చును? బిచ్చివాఁడనని-భావమునం దలపోయుచుంటివా?
పుచ్చును నీదు పాపములు-పోరచి మానుము యిట్టి వానినిన్;
బొచ్చెము లిట్లుచెప్పి ప్రజ-మోసము చేయకు ధూర్తమానవా!
***
బిడ్డలకోసరమ్ము విల-పించెడి యా జవరాండ్రతోడుతన్
బిడ్డలు తప్పకుండఁ బ్రభ-వించెదరంచు సమాదరంబునన్
గడ్డముపట్టి "గర్భగుడి"-గర్భముఁ జేర్చుదువట్టెరేల నో
వెడ్డరి! నాకు మంచి పని-వెట్టితి వింతకు ధూర్తమానవా!
***
వాజను మానకున్న నప-వాదులు; తప్పవు శృంగభంగముల్;
రోజులు నీకుఁ జాల విసి-రో! జులుమింతకు మానకున్నచోఁ
బాజివియౌదు వీవు నగు-బాటు ఘటిల్లును; నింక మీఁద నీ
పోజును జూచి మోసపడి-పోవుట గల్గదు ధూర్తమానవా!
(ధూర్తమానవా శతకము- కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి)
No comments:
Post a Comment