Sunday, December 12, 2021

అశోకుని యర్రగుడి శాసనాలు -సేకరణః కర్లపాలెం హనుమంతరావు


 అశోకుని యర్రగుడి శాసనాలు
-సేకరణః కర్లపాలెం హనుమంతరావు



గుత్తి-ఆదోని రోడ్డు ఒక రాష్ట్ర రహదారి. గుత్తి నుంచి  గమ్యస్థానం 13 కిలోమీటర్ల దూరంలో ఉంది యర్రగుడి. అక్కడి నుంచి అశోకుని శాసనాలున్న చోటు మరో  1 కి.మీ దూరం. స్థలాన్ని కనుక్కోవడం సులభంగానే ఉంటుంది.
అశోకుని రాతి నిర్మాణం రాష్ట్ర రహదారికి కిలోమీటరు దూరంలో కాంక్రీట్ రోడ్డుతో కలుపబడి ఉంది. సైట్ నిర్వహణ మెచ్చుకోతీరులో ఉంటుంది. బాధ్యుల చిత్రశుద్ధి, అంకితభావం క్షేత్రంలో  పుష్కలంగా ఆరోగ్యంగా పెరిగే చెట్లు, పూలమొక్కలు చెబుతున్నాయి.  
రోడ్డును వదిలి ఒక కాలి బాట  కొండ వెళుతుంది. ద్వారం వద్ద ఎఎస్ ఐ కర్నూలు సబ్ సర్కిల్ వారు ఏర్పాటు చేసిన గ్రానైట్ పలకల జత మీద  ఉన్న ఆంగ్ల పాఠాన్ని తెలుగులో అనువదించుకుంటే ఈ విధంగా ఉండవచ్చు.  
క్రీ.పూ 3వ శతాబ్దంలో ఈ ప్రదేశంలో గొప్ప మౌర్య చక్రవర్తి అశోకుడు శిలాఫలకాన్నిచెక్కించాడు. ఈ రాతి శాసనం బ్రహ్మీ లిపిలోను, ప్రకిత్ భాషలోను చెక్కబడింది. శాసనం ధర్మానికి సంబంధించింది: దేవతల ప్రియుడు ఈ విధంగా అన్నారు: దేవతల ప్రియుని ద్వారా మీరు ఆదేశించిన విధంగా ప్రవర్తించాలి. రజకులను వారి వంతుగా గ్రామప్రజలు, స్థానిక అధికారులను ఈ క్రింది మాటలలో ఆదేశించవలెను. "అమ్మా, నాన్న, పెద్దలను ప్రేమించాలి, జీవుని దయతో చూడాలి. నిజం మాట్లాడాలి".
హిందూ పత్రిక కర్నూలు ఎడిషన్ లో 2013 మే 31 న అశోకరాతి ప్రదేశాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి డి.శ్రీనివాసులు ఆసక్తి కలిగించే  సమాచారం వ్యాస రూపంలో ఇచ్చారు.
కళింగ దండయాత్ర తరువాత అశోక చక్రవర్తి చేసిన పర్యటనల సమయంలో రాయబడిన బ్రాహ్మీ లిపి, ప్రాకృత భాష శాసనాలు కూడా ఈ విధంగా ఉన్నట్లు పరిశోధకులు భావ. 256 రోజుల పాటు జరిగిన ఈ పర్యటన కార్యక్రమంలో చక్రవర్తి  చాలా చోట్ల క్యాంపు లు నిర్వహించినట్లు తెలుస్తుంది. స్థానిక చరిత్రకారుల కథనం ప్రకారం, మౌర్యుల కాలంలో స్వర్ణగిరిగా పిలిచిన జొన్నగిరి ని ఆ రాజ్యానికి దక్షిణ భారత రాజధానిగా వ్యవహరించినట్లు అనుకోవాలి.
శాసనంలోని అంశం ఇతర అశోకుని అ తరహా  శాసనాలతో సంబంధం లేనట్లుగా కనిపిసుంది. అక్కడ రాజును ప్రియదాసి, దేవతల ప్రియునిగా ప్రస్తావించడం  జరిగింది. తొమ్మిది శిలలపై 28 భాగాలున్న యర్రగుడి శాసనాలు, తల్లితండ్రులకు విధేయంగా ఉండాలని, అలాగే పెద్దల పట్ల విధేయత ఉండాలని, ప్రాణులపట్ల దయ ఉండాలి, సత్యం మాట్లాడాలి, ధర్మం యొక్క లక్షణాలను ప్రచారం చేయాలి, బలికోసం ఏ ప్రాణిని వధించరాదు. రోడ్ల పక్కన చెట్లు నాటడానికి, జంతువులు, మనుషుల ఆనందం కోసం బావులు తవ్వారు అని ఆ రాతి బండల మీదుంటాయి. ధర్మానికి సంబంధించిన ఈ శాసనాలు నా (అశోకుడు) ద్వారా వ్రాయబడినవి. నా కుమారులు, మనుమలు అందరి క్షేమం కోసం కృషి చేయాలని శాసనం పేర్కొన్నట్లు సమాచారం.
శిలా శాసనం  ప్రపంచంలోని అన్ని వన్యప్రాణుల సంక్షేమం కోసం చేసిన మొదటి చట్టంగా పరిగణించవచ్చని ఎస్.జె. కాలేజీ ప్రిన్సిపాల్, చరిత్రకారుడు డాక్టర్ అబ్దుల్ ఖాదర్ అభిప్రాయం. నిజానికి అవి మౌర్యన్  రాజ్య విధానం నాటి నిర్దేశక సూత్రాలు. ఆ స్థల విశేషాన్ని వివరిస్తూ, భద్రపరచవలసిన ఆవశ్యకతను ఉద్బోధించే వ్యాసాలు గణనియంగానే వచ్చినట్లు సమాచారం.  
ఈ ప్రదేశంలో ఇంకా  8 శిలాశాసనాలు కనిపించాయి. అక్షరాల పరిమాణంలో పరిణామం సుస్పష్టం. బండరాయిలోకి తొలవడం వల్ల లోతుల్లో వచ్చిన తేడా వల్ల ఈ తారతమ్యం సంభవించివుండచ్చన్నది పరిశోధకుల భావన. కొన్ని అక్షరాలు సుద్దముక్కతో రాసినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రంలో మూడు శాసనాలు ఉన్నాయి. ఒకటి దిగువ భాగంలో, త్రిభుజాకారంలో ఉన్న రాయి, వెనుక భాగంలో పెద్ద బండరాయి. ఇక్కడ కనిపించే ఈ శిలలన్నీ తూర్పు ముఖంగా ఉండగా, మిగిలిన శిలాశాసనాలు ఉత్తర-ముఖంగా ఉన్నాయి.
శాసనాలను నిశితంగా గమనించండి. ఉపరితలం అందంగా ముతకగా ఉంటుంది..
ఈ ఉపరితలం మృదువుగా ఉంటుంది.

ఇక్కడ శాసనాలు కేవలం ఉపరితలంపై ఉన్నాయి, ఎచ్చింగ్స్ లో లోతు లేదు, ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి.
కర్ణాటకలోని శాసనాలతో పోలిస్తే అక్షర పరిమాణాలు చాలా చిన్నవి. కర్ణాటక క్షేత్రాలల్లో గరిష్టంగా 3అంగుళాల నుంచి 5 అంగుళాల వరకు ఉండగ, ఇక్కడ గరిష్టంగా 3 అంగుళాల లోతు అక్షరాలను మాత్రమే చూడగలం. లభ్యమయే సందేశం  పొడవు, వెడల్పులను మీద ఈ లోతులు ఆధారపడివుండవచ్చని పరిశోధకుల అభిప్రాయం.  .
ఉపరితలం పోక్ మార్క్ చేయబడింది  చెక్కేవాని(ఇన్ స్క్రైబర్ )గొప్ప పనితనానికి ఈ శాసనం ఒక  మంచి ఉదాహరణ.
ఈ మెట్లకు పైన, ఎడమల వైపున్న  రాళ్ళ జత మీద శాసనాలను కనిపిస్తున్నాయి. ఇవి ఉత్తరాభిముఖంగా కనిపిస్తాయి.
 రాయి అంచుకు దగ్గరగా ఉంటుంది,  మెటల్ రెయిలింగ్ కూడా స్థిరంగా, బలంగా ఉండటం నిర్వహణలోని శ్రద్ధను సూచిస్తోంది.  ఉత్తరముఖంగా ఉన్న మరొక శాసనం. ఈ మార్గం రాతి నిర్మాణం యొక్క పశ్చిమ కొనకు దారితీస్తుంది.

ఈ సౌకర్యవంతమైన చోటు సందేశ రీడర్ల ద్వారా ఆక్రమించబడినట్లుగా కనిపిస్తుంది.  చల్లగా ఉండే ఈ చోటు నుంచి కింద పరుచుకున్న  మైదానాల అందాన్ని ఆస్వాదించవచ్చు.
చిన్న వీడియో చూడండి,
ద్వారం వద్ద ఒక చిన్న గుండ్రని రాయి నిఉంచారు. వచనం తెలుగు. యర్రగుడి గ్రామంలో ఈ శాసనం కనుగొనబడి, సురక్షిత ప్రాంతాలకు తరలిపోయింది.

చివరగాః
మౌర్యుని కాలంలో జొన్నగిరి స్వర్ణగిరిగా ప్రసిద్ధి చెందినదని చరిత్రకారులు చెబుతారు. దే  నిజం అయితే,  ఇప్పటి దాకా  భావిస్తూ వస్తున్నట్లు కర్ణాటకలోని కనకగిరి సువర్ణగిరి కాకూడదు మరి
.
Source: with Thanks to
karnatakatravel.blogspot.com/2015/05
major-and-minor-rock-edicts-of-ashoka.html......

ఆధునిక మారీచులు -కర్లపాలెం హనుమంతరావు

 

ఆధునిక మారీచులు

-కర్లపాలెం హనుమంతరావు

‘ర- కారం ముందుడే అక్షరాలన్నీ నన్ను భయకంపితుణ్ణి చేస్తున్నాయిప్పడు. రత్నాలు, రథాలు.. అయినా సరే భయమే భయం! శూర్పణఖ  కారణంగా నీకు రాముడు మీద కొత్తగా పగ  పుట్టుకొచ్చింది. తన కారణంగానే నా తోబుట్టువు ఖరుడు చచ్చినమాట గుర్తుతెచ్చుకో రాజా! రాముడు రాక్షస జాతి మొత్తానికి అంతకుడు. అందులో పిసరంతైనా అనుమానం లేదు. వాడి దెబ్బ రుచిచూసిన వాడిని కాబట్టే నిన్ను ఇంతగా హెచ్చరిండం.  అప్రమత్తంగా ఉండు. లేకపోని కక్షలతో నువ్వే కాదు నీ బంధు కోటి సర్వం భూమ్మీద లేకుండా చేసుకోకు!’ అంటూ మారీచుడు మంచి మాటలు నాలుగు చెప్పబోయినా రావణాసురుడి చెవికి ఎక్కాయి కాదు! చావు మూడినవాడు ప్రాణౌషధాన్నీ దగ్గరకు రానివ్వడు! మారీచుడీ మాటలు చెవినపెట్టకుంటే పాయ, వెటకారాలకు దిగాడు సహాయం అడుక్కోడానికి వచ్చిన రావణబ్రహ్మ.

‘ఈ అయుక్తార్థాలు ఎప్పట్నుంచి మారీచా? ఊసర క్షేత్రంలో విత్తులా నీ మాటలు నా మనసువులో నాటవు. ఇహ పండే మాట ఎక్కడ? అయినా,  పాపశీలుడు, మూర్ఖుడు పైపెచ్చు తుఛ్చ మానవ జాతికి చెందిన రాముడితో నేరుగా తలపడ్డం  నా స్థాయికి తలవంపులు. కాబట్టే నిన్నిట్లా దేబిరించడం.  అయినా ఆడదాని మాట కోసం మిత్రుల్ని, తల్లిదండ్రుల్ని గాలికొదిలి మన ఆడవుల్లొ కొచ్చి పడ్డ ఆ  ధూర్తుడి మీదనా ఈ స్తోత్రాలు, దందకాలు? నీ సోదరుడి చావుతో ఆవరించిన నైరాశ్యం వల్లనుకుంటా పిరికితనం. ఎంత హాస్యాస్పదం! స్వంత ప్రాణాలకన్నా కట్టుకున్న ఆడదాని మానం ముఖ్యం ముఖ్యమనుకునే  అనాగరికుఏమిటి.. విడ్డూరం  కాకపోతే! ఇదిగో మారీచా! ఒక మాట చెబుతున్నా.. సావధానం వినుకో! సీతాపహరణం జరిగి తీరుతుంది. అదీ నీ సమక్షంలోనే. ఇంద్రాది దేవతలు ఆడ్డొచ్చినా  ఆగే కార్యం కాదిది. మంచీ చెడూ చెప్పడానికి నీకున్న అర్హత నీకుంటే ఉండొచ్చు! నీ పని నీవు చేసేశావు. ఇహ నా పని మొదలయ్యే మార్గం మాత్రమే చర్చించడం  నీ విధి.’ అని హూంకరించాడు రావణాసురుడు. 

తెలివైన దాసుడు రాజు దగ్గర మొండికి తిరగడం చావు స్వయంగా కొనితెచ్చుకోవడమే! రాజుకు రుచించని పక్షంలో సున్నితంగా చెప్పే ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి మాటయినా సరే తలబిరుసుగా  చెబితే మొదటికే బెడిసికొడుతుంది. మారీచుడి దుస్థితే ప్రస్తుతం ఏ.పి ప్రభుత్వంలోని అధికారుల  సంకట స్థితి.

‘పంచ రూపాణి రాజానో ధారయంతి అమిత ఓజసః | అగ్నేః ఇంద్రస్య సోమస్య యమస్య వరుణస్య చ / ఔష్ణ్యం తథా విక్రమం చ సౌమ్యం దణ్డం ప్రసన్నతాం |ధారయంతి మహాతామ్నో రాజానః క్షణదాచర /తస్మాత్ సర్వాసు అవస్థాసు మాన్యాః పూజ్యాః చ పార్థివాః /త్వం తు ధర్మం అవిజ్ఞాయ కేవలం మోహం ఆశ్రితః ‘

రాజు అంటే అగ్మి, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, యముడు.. ఈ ఐదు  రూపాలు కలగలుపు. కాబట్టే అతగాడిలో ఉష్ణం, వీరత్వం, సౌమ్యత, ప్రసాద లక్షణం, దండించే గుణం- సందర్భాలను బట్టి ప్రసారమవుతాయి. రాజులు అన్ని వేళలా పూజనీయులు అవడానికి అదే కారణం. నువ్వు ఆ ధర్మం తెలిసీ అతిక్రమించి మాట్లాడావు. నీలోని మోహమే అందుకు ప్రధాన కారణం.’  అభ్యర్థించడానికి  వచ్చానన్న చులకనా?  రాజుతో పరుషంగా మాట్లాడడం తగని పని. సరే, ఈ దఫాకు మనసులో ఉంచుకోకుండా నీ తప్పును క్షమించేస్తున్నా. బంగారు లేడిగా మారు. వంటి మీద వెండి మచ్చలుండాలి. అడవిలో రామాశ్రమం చుట్టూతా తచ్చాడుతుండు. సీత కంటబడ్డం ప్రధానం. ఆడవాళ్లకు బంగారం మీదుండే కాంక్ష నార బట్టల సీతనైనా కుదురుగా ఉండనీయదు. పెళ్లాం కోరింది కాదనకూడదనే పనికిమాలిన జాతి పురుషుడు రాముడు. నీ వెంట పడకతప్పదు. నువ్వు ఆ మూర్ఖుణ్ణి  ఆశ్రమానికి చాలా దూరం తీసుకు వెళ్ళు చాలు. ఆనక సందు చూసుకుని 'హాసీతే లక్ష్మణే త్యేవం రామ వాక్యనురూపకం' అని అరుపుల్లంకించుకో మారీచా! సీత ప్రచోదనం వల్ల లక్ష్మణుడికీ రాముడు వెళ్ళిన దారి వెంటనే వెతుక్కుంటూ పోకతప్పదు. ఇంద్రుడు శచీదేవిని త్తుకొచ్చినట్లు  ఒంటరి ఆడదానిని ఎత్తుకొచ్చే ప్రతాపం అప్పుడు నేను చూపిస్తా!ఈ కార్యం చేసి పెట్టినందుకు నీ కష్టం ఊరికే ఉంచుకోల్, అర్థరాజ్యం ముట్ట చెబుతానని మాట ఇస్తున్నా. ఆ తరువాత నువ్వు దాన్ని ఏలుకుంటావో, ఏట్లో కలుపుకుంటావో .. నీ ఇష్టం' అంటూ రావణాసురుడు ఇప్పటి మన పాలకులు కొద్దిమందికి మల్లేనే ఊదరగొట్టేస్తాడు.

కైలాసగిరిని ఎత్తి కుదేసిన ఘనుడై ఉండీ రావణాసురుడు ఒక ఒంటరి మానవ స్త్రీని ఎత్తుకొచ్చేందుకు ఇంత కథ ఎందుకు నడిపించినట్లు? అంటే ఒకటే సమాధానం! పోయేకాలాన్ని మరింత ముందుకు తెచ్చుకోడం కోసమే!

పోనీ ఎత్తుకొచ్చిన సీత ఏమైనా ఆ రాక్షస రాజుకు లొంగి వచ్చిందా? తప్పు చేసిన ఆ తుచ్ఛుడు తుదకు మొదట్లో మారీచుదు చెప్పిన  చావుదెబ్బ రుచి చూడనే చూశాడు. అయ్యో పాపం అనాల్సిన అవసరమేమీ లేదు కానీ, మంచి మాటలు చెప్పగలిగిన స్థితిలో ఉండీ చెప్పలేక చివరికి అన్యాయంగా చావు మీదకు తెచుకున్న మారీచుడి గురించే వ్యథంతా!

 ‘మారీచ వధ’ ఎన్నిసార్లు పారాయణం చేసి ఉంటారో మన ఏపిలోని  అయ్యేయెస్సులు, ఐపీఎస్సులు! అయినా బుద్ధి రావడం లేదు. ఆధునిక మారీచులను గురించే బాధంతా!

-కర్లపాలెం హనుమంతరావు

21 -05 -2021

 

నేరాలు - శిక్షలు- కర్లపాలెం హనుమంతరావు


 

నేరం అంటే తప్పు. అపరాధం. సంఘ ప్రయోజనానికివ్యక్తి భద్రతకు ఉమ్మడిగా కొన్ని నీతి నియమాలు ఏర్పాటు చేసుకునే పద్ధతి  అన్ని కాలాలలోనూ ఉంది. ఆ కట్టుబాట్లను కాదని ప్రవర్తిస్తే సమాజం మొత్తానికే ముందు ముందు ముప్పు ఏర్పడే అవకాశం కద్దు. ఆ ప్రమాదం నివారించడం  కోసం గాను  'శిక్ష'లు ఏర్పడ్డాయి.  తప్పు చేసినవారిని దారిలో పెట్టడమే ప్రధానంగా 'శిక్షలుముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. కొన్ని  సరిదిద్దుకోలేని పెను తప్పిదాలకు పెద్ద పెద్ద శిక్షలూ కద్దు. ఈ శిక్షలు నిర్ణయించే అధికారం గతంలో రుషులకు ఉండడం గమనించవచ్చు. మహితాత్ములు నిర్ణయించిన  శిక్షలు అమలు  చేసే బాధ్యత సాధారణంగా రాజ్యం శాంతిభద్రతలను  సురక్షితంగా పర్వవేక్షించడమే ధర్మంగా గల పాలకులకు ధఖలై ఉండేది.   ఆన్నికాలాలలోనే కాకుండా అన్ని లోకాలలలో కూడా  నేరాలు చేయడంవాటికి తగ్గట్లు  శిక్షలు విధించి అమలు చేయబడడం గమనించవచ్చు. 

 

తెలుగువాళ్ళు పవిత్రంగా భావించే భాగవతంలో ఉపాఖ్యానల ద్వారా ఈ కొన్ని శిక్షలు.. అవి అమలు జరిగిన తీరు  స్థాలీపులాకన్యాయంగా పరిశీలించడమే ఈ చిన్నవ్యాసం ఉద్దేశం.

భాగవతంలో శిక్షలు ప్రధానంగా మూడు రూపాలలో కనిపిస్తాయి. స్వయంగా విధించుకునేవివేరేవారు విధించి అమలుచేసేవిశిక్షలు పడినా ఎన్నటికీ అమలుకాకుండా నిలబడిపోయినవీ.

సతీదేవి ప్రాణత్యాగం స్వయం శిక్షకు ఉదాహరణ. తండ్రి దక్షుడు యాగం చేసే సందర్భంలో అల్లుడైన రుద్రుడికి ఆహ్వానం అందదు. అయినా అతని భార్య దాక్షాయణి, 'పిలవని పేరంటానికి వెళితే అవమానాలు ఎదురయే అవకాశం ఉంద'ని భర్త హెచ్చరించినా 'తండ్రి ఇంటిలోని సంబరాలు తనయలు చూడాలి గదా! 'సర్వదిక్కులవారు కదిలి వెళ్ళే  యాగానికి  తానూ వెళ్లితీరాల'న్న మంకుపట్టుతో సహచరుడి తోడు లేకుండానే తరలివెళ్లింది. ఫలితం తీరని అవమానం. 'జలంబు ఆచమనంబు చేసి శుచియై మౌనంబు ధరియించిజితాసనయై భూమియందాసీనయగుచు యోగమార్గంబులో' చివరికి  ఆమె చేసిన శరీర త్యాగం భర్త ఆనతి మీరిన నేరానికి స్వయంగా విధించుకున్న శిక్ష. దేవుళ్లకు ఈగోలుఅలకలుకలతలు,దుఃఖాంతమైన కథలు ఉండటం అదొక వింత.

ఇకఇతరులు విధించే శిక్షల వ్యవహారానికొస్తే దేవతలురాక్షసులుమనుషులుమునీశ్వరులు  ఎవరు విధించే శిక్షలు వాళ్లవే.  

చిత్రకేతువు అనే విద్యధరాధిపతి ధర్మ సభలో ఈశ్వరుడి కౌగిట్లో ఉన్న గౌరిని చూసి ఆడవాళ్లు సభలలో నడుచుకొనే తీరు మీద చర్చపెట్టేశాడు. శివుడు చిరునవ్వుతో పోనిచ్చినా గౌరీదేవి గొప్ప అవమానం జరిగినట్లు క్రుద్ధురాలైంది. 'ఎగ్గుపల్కిన పాపాత్ముడెల్ల భంగి/దండనార్హుండు గాకెటు తలగగలడు'(6 -496)అని భావించింది. ఫలితం 'పాపపుస్వరూపమైన రాక్షసయోనిలో పుట్ట'మని శపించింది. తన కంటే అధికులను తప్పు పడితే నేరమని గౌరమ్మ  భావం. ఇంకెవరూ ఆ పని చెయ్యకుండా భయపడేందుకు చిత్రకేతువుకు అంతలావు శిక్ష. 

విష్ణుద్వేషులైన రాక్షస జాతిలో పద్దస్తమానం హరినామ జపం పారాయణం చేసే పసికొడుకును ప్రారంభంలొ చదువు సాములకు పెట్టి దారికి తెచ్చుకోవాలని చూశాడు రాక్షసరాజు హిరణ్యకశిపుడు. విష్ణుమాయ నుంచి బైట పడకపోగా తనకే నీతిపన్నాలు చెప్పడంలో రాటుదేలిన ప్రహ్లాదుణ్ని 'ముంచితి వార్ధులం గదల- మొత్తితి శైల తటంబులందు ద్రొ/బ్బించితి శస్త్రరాణి  పొడి- పించితి మీద విభేంద్రపంక్తిద్రొ/క్కించితి ధిక్కరించితి శ-పించితి ఘోరదవాగ్నులందు ద్రో/యించితి పెక్కు పాట్లనల-యించితి చావడిదేమి చిత్రమో!అన్న పద్యంలో రాక్షసరాజే  చెప్పుకున్నట్లు ఒకటిరెండు కాదు వరస బెట్టి శిక్షల మీద శిక్షలు విధించేశాడు. 

కంసమహారాజు బాలకృష్ణుణ్ణి వెదికి మరీ శిక్షలు విధించడం మానవమాత్రులు విధించే శిక్షలు ఎంత విచిత్రమైన పద్ధతుల్లో ఉంటాయో అర్థమవుంది. వత్సాసురబకాసుర,  అఘాసుర ధేనుకాసురల్లాంటి దుష్టరాక్షసులను  ఒకళ్ల తరువాత ఒకళ్ళను చంపమని పంపటానికి కృష్ణుడు చేసిన తప్పిదాలేమీ లేవు. తనకు ప్రాణాపాయం ఉందని కంసుడు తలపెట్టిన  దుష్కృత్యాలు ఇవన్నీ!

సనకసనందాదులు జయవిజయులకు ఇచ్చిన దండనలు మునులు ఆచరించే శిక్షల జాబితాలోకి వస్తాయి. వైకుంఠ ద్వారాలకు పహరా పనిలో ఉండే జయవిజయులు స్వామి దర్శనార్థ వచ్చేవారి వివరాల  జోలికి  పోకుండా మొండిగా అడ్డుపడుతున్నందుకు పడ్డ ఆ శిక్ష. విఐపి ల ఆఫీసులకు కాపలాలు కాసే డవాలా బంట్రోతులదే సగం పెత్తనంగా సాగుతున్న ఈ కాలంలో జయవిజయుల ఉదంతానికి సమకాలీన ప్రాధాన్యత కద్దు. గేటుకు కాపలా కాసే వాళ్లు అగంతుల పట్ల అప్రమత్తంగా ఉండడం ఎంత అవసరమో తెలియజేసే కథ. 

అరాచక పాలన ద్వారా తోటి వాళ్లందరినీ పిల్లలాట కింద హింస పెట్టే వేనుడి కథ అయితే ఇప్పటి కాలానికి ఎంతో మందికి నిజానికి గుణపాఠం కావాల్సుంది. విజ్ఞులు ఎంత చెప్పినాఎన్ని విధాల నచ్చచెప్పినా నీచబుద్ధి వదలని ఆ పాలకుడు చివరకు ఆ మునుల చేతనే శిక్షకు గురవుతాడు. 

శిక్షించే విధనాలు చాలా రకాలు. 'బావా! రమ్మని బరనగవు నగుచువీనిం బట్టి బంధించి గడ్డంబును/మీసంబునుం దలయును   గొరిగి విరూపిం '(10 -146) చేసిన రుక్మిణీవల్లభుడి రుక్మి శిక్షావిధానం కాయక విధానం. ఇప్పుడూ మళ్లా అమల్లోకి వస్తే ఎన్ని పరువు హత్యలు తగ్గి సమాజం ఆరోగ్యవంతంగా తయారవుతుందో .. ఊహించదం కష్టం.

కానీ దురదృష్ణ కొద్ది.. కొన్ని సందర్భాలలో తప్పు ఒకరు చేస్తే.. శిక్ష వేరేవాళ్లకు పడడం ఇప్పట్లా భాగవత కాలంలోనూ కద్దు. చిత్రకేతువు అనే రాజు అంగిరసుడు అనే ఋషి ప్రసాదించిన సంతానఫలం కృతద్యుతి అనే భార్య ఒక్క  దానికే ఇవ్వడం సాటి సవతులలో అసూయను రగలాడినికి కారణం అవుతుంది. కృతద్యుతి  కడుపున కాసిన ఆ కాయ మీదనే మహారాజు ధ్యాసంతా. కడుపు రగిలిన సవతులు పసిబిడ్డకు విషమిచ్చి చంపేస్తారు. మహారాజు పక్షపాత నేరానికి పాపంపుణ్యం ఎరుగని పసిబిడ్డ ప్రాణాంతకైన శిక్షను అనుభవించడం ఘోరాతిఘోరం. పాలకులకు నిష్పక్షపాత బుద్ధి లేని పక్షంలో అమాయకులు అన్యాయంగా ఎట్లా శిక్షలకు గురువుతారో.. ఈ కాలంలోనూ అన్ని ప్రాంతాలలో వీపు చరిచి చెప్పేటంత ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయ్! 

బలి చక్రవర్తి రాజ్యభ్రష్టత్వం  ప్రహ్లాదుడి వాచా దండన ఫలితం.  రాజ్యపాలన కొచ్చిన తరువాత రాక్షసలోకంలో మంచి మార్పులు సంభవించి లక్షీదేవి తన పరివారంతో సహా బలి చక్రవర్తి రాజ్యంలో మాకాం వేయడం నచ్చని దేవతలు అదితిని ప్రార్థిస్తే ఆమె విష్ణువుని ఈ సంకటం నుంచి కాపాడమని కోరుకున్నది. బలిని పాతాళానికు పంపితే గాని రాక్షసులు తిరిగి రాక్షసులుగా మారి లక్ష్మీ పరివారం వైకుంఠం చేరదని గ్రహించిన విష్ణువు అదితి గర్భలో ప్ర్రవేశిస్తాడు. అనుమానంతో  చేసిన విచారణల  మూలకంగా జరిగింది తెలుసుకుని కర్తవ్యబోధనకు ఆశ్రయించిన మీదట జరిగిందంతా చెప్పి విష్ణువుకు లొంగిపొమని ప్రహ్లాదుడు బలికి హితవు చెపుతాడు. రాక్షసులను తిరిగి దుర్మార్గులుగా మార్చుకుంటానన్న బలి మాటలకు కోపించిన ప్రహ్లాదుడు శపించిన మీదటనే బలి  రాజ్యభ్రష్టత్వం  కథ కొనసాగింది. ప్రహ్లాదుడు బలికి విధించిన శిక్ష 'వాచా దండనఅయితే బలి చేసిన నేరం హిరణ్యకశిపుడి వంటి వారి చరిత్ర వినీ గుణపాఠాలు నేర్చుకోకపోవడం. 

ఎంతటి మహామహుమహులైనా ఎప్పుడో ఓకసారి తప్పుదారిలో నడిచి శిక్షలు అనుభవిస్తారన్న దానికి త్రిలోకాధిపతి కథే ఉదాహరణ.  తన కనుసన్నలలో ఉండే పుష్కలావర్త మేఘాలను ఎడతెరిపి లేకుండా కురిసి రేపల్లె వాడలను ముంచెత్తమని అజ్ఞాపిస్తాడో సందర్భంలొ అహంకరించి. అలకకు కారణం కృష్ణుడి పలుకులు విని తనకు ఏటేటా జరిపే వేడుకలు జరపకపోవడం. మేఘాల వర్షాలకు జడివానలు కురిసినా గోపాలబాలుడు గోవర్థన గిరిని చిటికెన వేలుతో పైకెత్తి పట్టుకొని ఆ ఛత్రఛాయల కింద లోకాలను కాపాడాడు. తన తప్పు తెలిసి వచ్చిన ఇంద్రుడు నా వంటి వెర్రివారిని/ శ్రీ వల్లభ! నీవు శాస్తి చేసితి వేనిం/గావరము మాని పెద్దల/త్రోవల జరుగుదురు బుద్ధి తోడుత నీశా!(10 -937) అని సాగిల పడ్డాడు ,  

- కర్లపాలెం హనుమంతరావు 

 

 

చెట్టుకు చాదస్తం జాస్తి! - కర్లపాలెం హనుమంతరావు


చెట్టుకు చాదస్తం జాస్తి. నరికినా అవి నరజాతిని  ప్రేమిస్తాయి. ఊడలు పెరికినా, వేరుతో సహా వూడబెరికినా తాను ఎండకు కాగుతూ నీడను ఇవ్వాలనే చూడడం చెట్టు  చాదస్తమా? కొమ్మలు విరుచుకు పోయే దొమ్మీజాతిని సరసకు రానీయనే కూడదు కదా వాస్తవానికి! రాళ్లేసి పళ్లు రాలగొట్టుకునే రాలుగాయిల మీద పూలు కురిపించే చెట్టును వట్టి 'ఫూల్' అనాలా? చెట్టు తన  పట్టలు చీల్చుకు పోతున్నా పట్టించుకోదు.. సరి కదా తానే తన తొర్రలో ఆ త్రాష్టుడు పైపైకి ఎగబాకేటందుకు వీలుగా మెట్లు తయారుచేయడం  విచిత్రమే! చెట్టంత ఎదిగిన మనిషి చెట్టుకు అపకారం తలపెట్టినా ఒక్క తిట్టు పదమైనా విసరడం ఎబ్బెట్టు చెట్టుజాతికి! నిలవ నీడలేని నిర్భాగ్యుడికి తనే కుదురు కడుపులో ఇంత  వెచ్చని చోటిచ్చే దయామయ జీవి లోకంలో చెట్టు కాక మరొకటి కనిపిస్తుందా? దేవుడు ఉన్నాడో లేడోనని సందేహించే మీమాంసకులకు.. ఉంటే గింటే ఎలా ఉంటాడోనని తర్కించే  ఆలోచనాపరులకు తనే దేవుడునని చెట్టు ఎప్పుడూ నోరు విప్పి సందేశమిచ్చుకోదు. గొప్ప గొప్ప సేవల నిశ్శబ్దంగా చేసుకుపోవడమే తరువు తత్వం తప్పించి గొప్పలు చెప్పుకునే నైజం చెట్టుకు వంటబట్టలేదు. వంటచెరుకుగా తనను వాడుకొమ్మన్నది.. కొమ్మలు ఎండిన తరువాత! తిండి సరుకుగా కండలు పెంచుకొమ్మనీ కాయా కసరూ, పండూ, పసరూ  విసుగూ విరామం లేకుండా కర్ణుని మించి ఎల్లవేళలా అందించేది చెట్టు. ఒక్క మనిషికనే కాదు నిజానికి చెట్టు సృష్టిలోని  తతిమ్మా అన్ని జీవులకు అమ్మను మించిన అమ్మ! అమ్మదయినా అడగనిదే పెట్టే ఔదార్యం కాదు. ఆమెయినా ఆ చెట్టు కొమ్మ ఇచ్చిన కాయా కసరు, పళ్లూ పూలతోనే సంసారం సాకేది. వంటికి చుట్టుకునే బట్ట చెట్టు ఇస్తేనే కదా వచ్చేది! కంటికి పెట్టుకునే కాటుకైనా సరే.. కాలి బూడిద అయిన పిదప మిగిలిన మాసిక నుంచే  వచ్చేదని తెలుసా! జీవుల సేవ కోసమై నేల తల్లి కడుపున పడినప్పటి బట్టే చెట్టు విత్తనమై మొలకెత్తాలని ఎంతలా తపిస్తుందో మనిషికి తెలియదు. అదనుకు పదునుగా వానలు పడితే ఆనందంగా వేళకు పంటగా మారి మన ఇంట చేరి గోదాము గుంటలో ఓ మూల దానానికి సిద్ధంగా ఉంటుంది. ఒకసారి కరవు రక్కసి రక్కేసిపోతుంది. మరోసారి వరద వచ్చి వంగడం కొట్టుకుపోతుంది. ఇంకోసారి ఏ పురుగో పుట్రో కుట్ర పన్నినట్లు తిండిగింజను తన్నుకుపోతుంది. ప్రకృతి ఉక్రోషం, ప్రకృతి సంతోషాలతో నిమిత్తంలేని సేవాతత్వం చెట్టూ చేమది.  కాబట్టే తాలూ తప్పను కూడా వదలకుండా ఏ తవుడో, చొప్పగ మార్చి సాగుపశువుల  కడుపు నింపేది. నమ్ముకున్న ఏ జీవినీ వదిలేసే ఊహ చెట్టుకు ఎప్పుడూ రాకపోవడం  సృష్టి విచిత్రాలలోకెల్లా విశేషవైన పెద్ద విచిత్రం. అగ్గి పెట్టే వంటచెరుకు నుంచి అగ్గిపెట్టెలో మండే పుల్ల సరుకు వరకు అన్నింటా చెట్టు మహావిశ్వరూపమే. చెట్టు విశ్వంభర! చెట్టు కలపగా ఇళ్లు కడుతుంది. చెట్టు  ఆకులై దడులు నిలబెడుతుంది. చెట్టు దుంగలై తల కాచినప్పుడే మనిషి ఒక ఇంటివాడుగా మారే అవకాశం. చెట్టాపట్టాలేసుకు తిరగవలసిన స్నేహితుడు చెట్టు మనిషికి.  అమ్మ పక్కన చేరి నసపెట్టే పసికందుకు  తాను ఊయల; అన్నీ వదిలి లోకం విడిచిపెట్టే మనిషిని ఆఖరి మజిలీ వరకు వదిలిపెట్టని  పేటిక చెట్టు. పాడు లోకం అని ఎంత ఈసడించిపోతున్నా తానో పాడెగా తోడుగా వచ్చే ఆత్మబంధువు కూడా ఆ చెట్టే సుమా! మట్టితో మనిషి  మమేకమయే చోటుకు గుర్తూ చిగురిస్తూ పైకి మొలచిన మొలకే సుమా!  గుర్తుగా  పూలిస్తుంది సరే.. ఆ పూలకు తావీ  ఎందుకనిస్తున్నట్లో చెట్టు? మానవత్వం ఎంత సుగంధభరితమై పరిమళించాలో చెట్టు ఇచ్చే సందేశం  మిత్రమా అది! పండు ఇస్తుంది.. సరే పండుకు రుచి ఎందుకు జతచేస్తుందిట చెట్టు? మనిషితత్వం ఎట్లా పండించుకొనాలో గురువులా తరువు బోధించే జీవనసూతం సుమా అది! కాలానికి సూచికలు చెట్టు ఎదుగుదల దిగుదలలే! ఏమీ విగలదనే వైరాగ్యం ఎంత అవాస్తవమో గ్రీష్మం వెన్నంటి వచ్చే వసంతంలో పూచి  చెట్టు జీవిత పరమార్థం ప్రకటిస్తుంది. రాతి కుప్పలు, ఇసుక తిప్పలు, జలగర్భాలు.. చివరికి బురద కూపాలు.. ఏదీ చెట్టు చివుళ్ల పచ్చని పలకరింపుకులకు బహిష్కృతం కాదు. అడిగితే బెరడునైనా మందుకు ఇచ్చేందుకు బెట్టుచేయని చెట్టు నుంచి మనిషి ఏమి పాఠం నేర్చుకుంటున్నట్లు? కట్టు బట్ట నుంచి, కొట్టుకు తినే కాయా, కసరు వరకు దాన కర్ణుడిని మించిన ఔదార్యం ప్రదర్శిస్తుంది కదా చెట్టు! నివారణలోనే కాదు, రోగ నిదాన చికిత్సలో సైతం వేరు, కాండం, మూలిక. ఆకు, పసరు, లేహ్యం, లేపనాలుగా   మొక్క చేసే సేవకు ఇంగితమున్న ఏ మానవుడైనా సాగిలపడి మొక్కాలి కదా నిజానికి? జ్ఞాన సింధు బుద్ధుడికి  గురువు తరువు; నేటి మనిషి మొరటుతనంతో  తరువు పరువు కోలుపోతున్నది; గుండె చెరువవుతున్నది.  కోరినది ఏదైనా మారు పలుకు లేకుండా సృష్టించైనా ప్రసాదించే కల్పతరువు పౌరాణికమైన కల్పన  కావచ్చునేమో.. కానీ  వాస్తవ జగత్తులోనూ గడ్డిపోచ నుంచి, గంధపు చెక్క దాకా మనిషి జీవితంలోని ఏ భాగమూ వృక్షజాతి ప్రమేయం వినా వృద్ధిచెందే అవకాశం సున్నా! దాల్చిన చెక్కా.. పూరి జగన్నాథుడు తాల్చిన చెక్కా.. మచ్చుక కై చెప్పుకునే చెట్టు తాల్చే సహస్రాధిక అవతారాలలో కొనే ముచ్చట్లు! చెట్టుకూ మనిషికీ మట్టే తల్లి. ఒకే తల్లి బిడ్డలై పుట్టినా ఇద్దరి తత్వాల మధ్య ఎందుకింత తారతమ్యం? దాని పొట్ట కొడితే తప్ప తన బతుకు గడవని చెట్టు పైన మనిషి దావవత్వం అభ్యంతరకరం. సౌహార్ద్రం సంగతి ఆనక.. కనీసం సోదరభావమైనా ప్రదర్శించే ఆలోచన నాగరీకత నేర్చినా మనిషి చేయడంలేదు.  విచారకరం! 'వృక్షో రక్షతి రక్షతః'  చాదస్తమైన  సుభాషితం కాదు. 'చెట్టును బతకనిస్తేనే చెట్టు బతకనిచ్చేది' అన్న పర్యావరణ సూత్రం  ఎంత సత్వరం వంటబడితే మనిషి మనుగడ కొనసాగింపుకు అంతటి శ్రేయస్కరం! 
-కర్లపాలెం హనుమంతరావు 
బోథెల్; యూ ఎస్ ఎ 
08-02-2021 
***


అంతరాత్మల శిక్షణా శిబిరం ( సరదాగా ) -కర్లపాలెం హనుమంతరావు

  


'నేతలు మనకు అండగా నిలిచిన గుట్టు నేరుగా జనంలోకి  వెళ్ళిపోతోంది' అంది మద్యం బ్రాండు అంతరాత్మ.

'మరే! ఆపదల్లో ఉన్నప్పుడు ఆ సాముల్ని ఆదుకోవడం మన  ధర్మం!' అంది గోల్డు బ్రాండు అంతరాత్మ .

'పెదాల సానుభూతితో పనేమవుతుంది? పెడసరంగాళ్ల నోళ్ళు కుట్టించాలి ముందు. అందుకే  న్యాయదేవత అంతరాత్మకే టెండరు పెట్టానీసారి!’ అంది యుద్ధ విమానం మార్కు మరో అంతరాత్మ ధీమాగా. 

‘ఆ అంతరాత్మ  మనంత గట్టిగా ఉండదు. ఏ  తీర్పు ఏ భావోద్వేగంలో వస్తుందో ఊహాతీతం. గిట్టని అంతరాత్మల మధ్య పొత్తు కుదర్చడమే మెరుగు. పీ.కే ( ప్రశాంత్ కిశోర్ ) అంతరాత్మను ప్రయోగిస్తేనో!’ 

‘ఎంత ఖరీదయినా కొనడానికి ఓ.కే నే.. కానీ అదీ వెళ్ళి ఆ బురద    రాజకీయాల్లో దిగబడిందిగా .. దగా గాడిద !’  

రాజకీయ అంతరాత్మ మూలిగింది. 'మా బురదలో అందరికీ భాగముందమ్మా! ఎలాగైనా సరే లాభాల్లాగాలనే లోభం తమ వ్యాపారులది! సర్కారులెవరివైనా సరే మీకు సలాం కొట్టాలి.  జనంతో తంటాలు మావి! మిమ్మల్నీ వదులుకోలేం. ఓటర్లనీ వద్దనుకోలేం.’ 

'మా మీదేమన్నా వూరికే  కారుతోందా ప్రేమ? ఓటర్ల అంతరాత్మలను కొనిపెట్టే  సొమ్మంతా  మా  ఇనప్పెట్టెల్లోదేగా!’  బొగ్గు మార్కు అంతరాత్మ చెణుకు.

 ‘ఎంతో రిస్కుతో కుతంత్రాలు పన్ని, పన్నులు.. బ్యాంకు రుణాలు గట్రా  ఎగ్గొట్టి మా యజమానులు జమేసుకున్న సొమ్ము! మీ నేతలు కమ్మంగా అనుభవించే పదవులకిప్పుడు అదే కదమ్మా ఆధారం!’ వంత పాడింది వజ్రం మార్కు అంతరాత్మ.

'నేతలం కాదు మనం.. అంతరాత్మలం. మనలో మనకు కుమ్ములాటలొద్దు! మన ఆసాములు కష్టాల వూబిలో ఉన్నారిప్పుడు. వాళ్లని  గట్టెక్కించడం ఒక్కటే మన ధర్మం’  సర్ది చెప్పింది ఓ ముసలి అంతరాత్మ. 

‘ఆ స్కాములప్పుడేమన్నా ఆ ఆసాములు మన మాటలు విన్నారా.. ఇప్పుడు గట్టెక్కించడానికి!’ గొణికింది ఓ యువ అంతరాత్మ. 

‘అవునవును .  నసగాళ్ళని  మనకే చీవాట్లు కూడా  అదనంగా!’ నొసలు చిట్లించింది మరో కుర్రది.

‘అంతరాత్మలకి అంత ఆత్మాభిమానం చేటు! మన అసహనం, తిరుగుబాటు ఏ పంథాలో ప్రయోగిస్తే సత్ఫలితాలొస్తాయో.. ముందది ఆలోచించద్దాం! ఈ   పెద్దలతో శిక్షణా తరగతులు  నిర్వహిస్తోంది కూడా అందుకే. బుద్ధిగా వినండి!’ గద్దించింది అధ్యక్ష  స్థానంలో ఉన్న అంతరాత్మ. 

వ్యాపార అంతరాత్మ ప్రసంగం ప్రారంభయింది ‘మనం ఉన్నామన్న భరోసాతోనే పెద్దమనుషులు  స్కాములకు సిద్ధపడతారు. ఎంత  మొండిగా వాదించినా మన మాట వినరు. అందుకే మనమూ వాళ్ల బాట పట్టక తప్పదు. మన కుబేరులు  బేరుమంటే  మన అంతరాత్మలకే కదా నామర్దా? ’

'అయితే  ఏం చెయ్యాలంటా? తిట్టిపోసిన వాళ్లతోనే కూటమి కట్టాల్నా?' పెడసరంగా అడుగింది ఇందాకటి  పిల్ల అంతరాత్మ.

‘సర్కారు ఎవరిదన్నది మనకు ముఖ్యం కాదు. ఎవరు గద్దె మీదుంటే వాళ్లకే మన మద్దెల దరువు. అధికారంలో ఉన్న వాళ్లే ముందు ముందు మరెన్నో  మంచి పనులు చేస్తారని టముకేస్తే సరి. ‘వట్టి మాటలు కట్టి పెట్టోయ్.. గట్టి మేల్తలపెట్టవోయ్' అన్నాడా లేదా గిడుగు పిడుగు?’

 నవ్వొచ్చింది కుర్ర  అంతరాత్మకి 'ఆ కొటేషన్ గురజాడది’

‘తెలిసే అన్నాన్లే! గిడుగు నుంచి గురజాడ కాపీ కొట్టాడని మన  అంతరాత్మలన్నీ కలసి  ఘోషించాలి. అదే నిజమని జాతి అంతరాత్మకూ  నమ్మకం కుదరాలి. అందాకా బ్రెయిన్ వాష్ చెయ్యడమే మన పని.’

బొగ్గు అంతరాత్మ అందుకుంది ‘ ఆ గోల కవుల అంతరాత్మలేవో చూసుకుంటాయిలే! మద్యం నుంచి భూములు, మార్కెట్ బూములు, బంగారం, విమానాలు, బ్యాంకు రుణాల వరకు ఎన్నో బడా వ్యాపారాలు మన అంతరాత్మలను నమ్ముకునే పెద్దెత్తున అక్రమంగా నడుస్తున్నాయిక్కడ. ముందున్నది ముసళ్ల పండుగని ఎంతైనా మూలుగు.. ఎవరి చెవినా పడ్దంలేదు’

‘అలాంటి ఇబ్బందుల్లోనే ఈ పిల్ల అంతరాత్మలేం చెయ్యాలనేది మీ సీనియర్లు నేర్పించాలిప్పుడు’ గుర్తుచేసింది అధ్యక్ష అంతరాత్మ.

'ఈ సారి ఈ అంతరాత్మల అంశాన్నే ముందుకు  తోద్దాం! సెంటిమెంటుతో చేసే ఏ  ప్రయోగం ఇంత వరకూ విఫలం కాలేదు. ముఖ్యంగా రాజకీయాల్లో. అధికార పక్షం తరుఫు నుంచే ఈ తుర్ఫు ముక్క  తీయిస్తే సరి! తిరుగుబాటు వర్గాల్లోకి మన కోవర్టులను చొప్పించి అందరి  నొప్పులను  టోకున కొనిపిచేద్దాం!’ 

‘కొనడం అంటే మూటలతో పని. అనైతికం. ఆసాముల్నందర్నీ  సతాయించాలి?’ ముఖం చిట్లించింది మళ్ళీ మొండి అంతరాత్మ.    

‘సతాయించడానికే మనుషుల్లో మనమున్నది. వ్యాపార అంతరాత్మలుగా అది మన విధి’ 

మళ్లీ అడ్డుపడింది జిడ్డు అంతరాత్మ ‘అమ్ముడయేందుకు మీ రాజకీయ  అంతరాత్మలు  సిద్ధంగానే ఉంటాయమ్మా! కానీ కొనే సొమ్ము తమ  ఆసాములనుంచి  రాబట్టాలంటేనే గడసాములు చెయ్యాలిక్కడ పాపం వ్యాపార అంతరాత్మలు!’

‘ఏంటీ నస?’ అన్నట్లు మొండి అంతరాత్మకేసి గుడ్లురిమి చూసాయి అన్ని అంతరాత్మలూ.

‘చూడూ! మన అంతరాత్మల  ముందు ఎంత లావు బిరుసైనా తలవంచాల్సిందే! అనుభవంతో చెబుతున్నా.. ' అంతరాత్మ ప్రబోధం ' మించి ఉత్తమ చమత్కారం మరోటి లేదు  రాజకీయాల్లో. మనం ఎంటరయితే ఏ నేత వంటికీ మకిలంటదు’ కలగచేసుకుంటూ అంది అధ్యక్ష అంతరాత్మ ‘దేవుడు, రాజ్యాంగం కన్నా మన అంతరాత్మల మీదే అమాయక జనాలకు  నమ్మకం ఎక్కువ. ఆ నమ్మకం వమ్ము కానివ్వద్దు’

‘మరి ప్రజాహితం?’ మొండి అంతరాత్మ లొంగదలుచుకోలేదు.

 ‘మేధావులకే పట్టని ప్రజాహితం మనకెందుకెందుకంట? ఎన్నికలు  తరుముకొస్తున్నాయ్  అవతల! ఎన్నికల కోడు పీడ  ఏ క్షణానైనా విరుచుకుపడచ్చు. ఎంత సొమ్ముకైనా సరే.. అమ్ముడవడానికి మీరంతా సై య్యేనా?’

‘సై’ అరిచాయి అన్ని కుర్ర అంతరాత్మలు.

‘ ఏం చేసైనా సరే మీ ఆసాముల్ని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారా  మరి?’

‘ఉన్నాం.. ఉన్నాం.. ఉన్నాం!’ పిల్ల అంతరాత్మల కేకలు మిన్ను ముట్టాయ్! 

 ‘గుడ్! అయితే.. ఏదీ.. నీ నోట్లో ఏముందో చెప్పు.. చూద్దాం?’ ఓ పెంకి ఘటం దగ్గరికొచ్చి అడిగింది అధ్యక్ష అంతరాత్మ.

‘ప్రద్దానికీ అడ్డొచ్చి ప్రశ్నిస్తోందే.. ఈ మంకు అంతరాత్మ.. దీని చూపుడు వేలు’ అంది పెంకిది.

‘వెరీ గుడ్! ఓ సారి దాన్ని కొరుకమ్మా!’

లటుక్కున కొరికి కరకరా నమిలి మింగేసింది క్షణంలో పెంకిది కసిదీరా. వేలు తెగిన మొండిది  లబోదిబమంటూ బైటికి పరుగెడుతుంటే అంతటా నవ్వులే నవ్వులు. 

‘అరెఁరెఁరెఁ! కొరకమంటే నిజంగా కొరికేయడమే!’ మందలించింది అధ్యక్ష అంతరాత్మ నవ్వులు కాస్త సద్దుమణిగాక. ‘నోట్లో వేలెట్టినా కొరకలేనంత జాణతనం చూపించాలమ్మా! ఆ మాత్రం అమాయకత్వం నటిస్తేనే అంతరాత్మల సాక్షీకంగా నడిచే నాటకాలన్నీ నిజాలేనని పిచ్చి జనాలకు నమ్మకం కలిగేది. మరీ మాజీ రిజర్వు బ్యాంకు గవర్నరంత  పారదర్శకత  పనికిరాదు అంతరాత్మలకు. నవ్వింది చాలు. ఇహ ముఖ్యమైన మూడు ముక్కలతో ఈ సమావేశం ముగిద్దాం. స్వచ్చమైన, అవినీతికి తావులేని పారదర్శక పాలనంటూ నేతలు బల్లగుద్ది లక్ష హామీలిస్తుంటారు. మీరు బెదిరిపోవద్దు. మీరు లేకుండానే  మ్యానిఫెస్టోలా అంటూ అలకలసలే వద్దు.! అంతరాత్మల ప్రమేయం కుంబకోణాలతోనే మొదలవుతుంది రాజకీయాలల్లో.   బొగ్గా.. బంగారమా, పెద్దనోటా, పెట్ఱోలు రేటా.. అన్నది మనకు  పెద్ద ముఖ్యం కాదు.  ఎగ్గొట్టేందుకు వీలుగా రుణ విధానాలున్నప్పుడు ఎవరికయినా ఎందుకు తప్పు చెయ్యబుద్ధేయదు?  మనం క్లవర్లం. కాబట్టే తెలివిగా మన సాముల్ని కవర్ చేసుకుంటున్నాం. ఎవరేడ్చిపోయినా లీస్ట్ బాదర్డ్. పిల్ల అంతరాత్మలు మీరు. ఆదర్శాల ఉచ్చులో ఇరుక్కోకండి! బడుగు ఓటరొచ్చి తడితే నిద్ర లేవద్దు. మరీ అంత కునుకు పట్టకుంటే అసమ్మతి రాగాల కోర్సుంది.. సాధన చేసుకోండి.. పెద్దమనుశులతో మన బేరసారాలో కొలిక్కొచ్చిందాకా! తతిమ్మా థియరీ రేపు! ఈ రోజుకీ ప్రాక్టికల్స్  చాలు‘ ప్రకటించి లేచింది అధ్యక్ష అంతరాత్మ,

‘ప్రాక్టికల్సా?!’ నోరెళ్లబెట్టాయ్  అంతరాత్మలన్నీ.

‘మరే! ఎంత చెప్పినా మొండికేసే అంతరాత్మలు  కొన్నుంటాయెప్పుడూ. నిజాయితీ, నిమ్మబద్దలంటూ  మేధావుల మెదళ్ళు తొలవడమే వాటి పని! ఎన్నికల్రోజు బక్క ఓటరు అంతరాత్మలను అవి తట్టి లేపేస్తే.. అమ్మో.. మన ఆసాముల పని గోవిందా!  అందుకే పద్దాకా ఎత్తి చూపించే  చూపుడు వేలును  ఎలా కత్తిరించేయచ్చో ప్రాక్టికల్ గా చేయించి చూపించా!’ అంది అధ్యక్ష స్థానంలో ఉన్న ఆ  ముసలి అంతరాత్మ! 

***

- కర్లపాలెం హనుమంతరావు 

15-03-2021

బోథెల్: యూఎస్ ఏ 



  


 


 


నేరమూ శిక్షా -కథానికః -కర్లపాలెం హనుమంతరావు

 


 

పగలు రాజ్యపాలన సాగిస్తూ రాత్రిళ్ళు మారువేషంలో సంచారం చేసి ప్రజల కష్టసుఖాలను స్వయంగా పరిశీలించడం మహారాజు కృష్ణవర్మకి  అలవాటు.

ఒకసారి ఇలాగే బాటసారి వేషంలో పర్యటిస్తూ రాత్రి చీకటి పడే వేళకు  నగర పొలిమేరల్లోని ఒక ఇంటితలుపు తట్టారు కృష్ణవర్మమహారాజు.

ఆ ఇల్లొక బీద బ్రాహ్మణుడిది. ప్రాచీన సంప్రదాయాలకు ప్రాణమిచ్చే కుంటుంబం అతనిది. ఉన్నంతలోనే చేతనైనంత అతిథి మర్యాదలు చేసాడా రాత్రి.

భోజనం ముగించి.. పడుకునే ముందు బాటసారికి, బ్రాహ్మణుడికి మధ్య చిన్నపాటి లోకాభిరామాయణం సాగింది.

మాటల సందర్భంలో బ్రాహ్మణుడు మారువేషంలోని రాజావారితో  దేశంలో జరుగుతున్న అన్యాయాలను, అవినీతిని, అక్రమాలను ఏకరువు పెట్టి రాజుగారి పాలనను దుయ్యబట్టాడు.

అంతా సావకాశంగా విన్న రాజావారు "అన్ని కార్యాలూ రాజుగారే స్వయంగా చూసుకోవాలంటే సాధ్యమా! న్యాయ పర్యవేక్షణ, చట్టం అమలు వంటి  విభాగాల నిర్వహణకు అందుకే ఆయన ఎక్కడికక్కడ  ఉద్యోగులను నియమించారు కదా! వారి ప్రవర్తనల్లో లోపం కలితే ఆ దుష్ఫలితాలను రాజుకు ఆపాదించడం సరి కాదు" అని  వాదనకు దిగారు.

"కావచ్చు కానీ.. ప్రజలకు వాటితో పనిలేదు. అంతంత లోతులు ఆలోచించ లేని అమాయకులు వారు. సుఖంగా బతుకుతున్నప్పుడు రాజుగారి చలవ వల్లనే అని ఎలా నమ్ముతారో..  శాంతి భద్రతలు కరువైనప్పుడూ అలాగే  రాజుగారి వైపు  వేలెత్తి చూపిస్తారు. శరీరానికి  దెబ్బ తగిలితే.. గాయపరిచిన ఆయుధాన్ని కాకుండా.. ఆ ఆయుధాన్ని ప్రయోగించిన మనిషినే కదా మనం దూషిస్తాం! అన్యాయం చేసింది ఉద్యోగే అయినా.. అలాంటి దుర్మార్గుడికి అధికారం అప్పగించిన రాజే ఆ నిందను భరించక తప్పదు. సత్పరిపాలన అంటే సచ్చరితులను గుర్తించి సరైన పదవుల్లో నియోగించుకోవడమే" అన్నాడా బ్రాహ్మణుడు.

రాజావారు ఆలోచనలో పడ్డారు.

"చెప్పడం సులభమే.  పదవి చేతి కొచ్చిన తరువాత గాని అసలు నైజం బైటపడదు.   ఎవరి దాకానో ఎందుకు? మీకే గనక ఓ న్యాయాధికారి పదవి అప్పగిస్తే రాజుగారికి ఏ మచ్చా రాకుండా బాధ్యతలు నిర్వహించగలరా?" అని అడిగారు చివరికి.

బ్రాహ్మణుడే మాత్రం తొట్రు పడలేదు. "మహారాజు గారి నమ్మకాన్ని వమ్ముచేయననే అనుకుంటున్నాను" అన్నాడు. ఆ సంభాషణ అంతటితో ముగిసి పోయింది.

 

మర్నాడు ఆ బ్రాహ్మణుడిని కృష్ణవర్మ  కొలువుకి పిలిపించారు. రాత్రి తన ఇంట్లో ఆతిథ్యం స్వీకరించింది స్వయంగా మహారాజే అని అప్పటికి గాని గ్రహింపుకి రాలేదు బ్రాహ్మణుడికి.

"నేటి నుంచి నగర న్యాయపాలనాధికారాలు తమకే అప్పగిస్తున్నాం. న్యాయం 'తు..' తప్పకుండా పాటించడ మెలాగో మీరు నిర్వహించి చూపించాలి. గడువు నెల రోజులు.  గాడి తప్పినట్లు ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా శిక్ష ఘోరంగా ఉంటుంది. తల కోట గుమ్మానికి వేలాడటం ఖాయం. బీరాలు పలికి చివరికి కార్యభీరువులయే వారంతా నేర్చుకోవాల్సిన పాఠ్యగ్రంథంగా పనికొస్తుంది. అంగీకారమైతే  వెంటనే అంగుళీకమును అందుకోవచ్చు" అని రాజముద్ర ఉన్న ఉంగరాన్ని  ముందుకు చాచారు కృష్ణవర్మమహారాజు.

క్షణకాలం మాత్రమే ఆలోచన. ఆ రాజముద్రను అందుకుని భక్తిగా కళ్లకద్దుకొన్నాడు పేద బ్రాహ్మణుడు. నగర కొత్త న్యాయాధికారిగా రామశాస్త్రి పేరు  ప్రకటింపబడింది. రామశాస్త్రి ఆ బ్రాహ్మణుడి పేరే.

 

సగం గడువు తీరిపోయింది. నగరంలో మార్పు కొట్టొచ్చినట్లు కనబడుతోంది ఇప్పుడు. మొదటి వారంలో రామశాస్త్రి దగ్గరకు వచ్చిన ఫిర్యాదుల్లో చాలావరకు అక్కడికక్కడే పరిష్కరింపబడ్డాయి. దోషులను విచారించడంలోను, దండనలు విధించడంలోను, శిక్షల అమలును పర్యవేక్షించడంలోను.. రామశాస్త్రి చూపిస్తున్న నిజాయితి, నిష్పక్షపాతం, నిబద్ధత, చాతుర్యం రెండోవారంలోనే మంచి ఫలితాలు చూపించడం మొదలు పెట్టాయి. నేరస్తులు జంకుతున్నారు. నిందితులు తప్పించుకునే  కొత్తదారులు వెదుకుతున్నారు. శిక్షల రద్ధుకోసం పూర్వం  అవలంబించిన అడ్దదారులేవీ పనిచేయక ఇబ్బంది పడుతున్నారు బందీలు.

కొత్తన్యాయాధికారికి జనం  'జేజే'లు పలకడం నగరసంచారంలో  కృష్ణవర్మ మహారాజు స్వయంగా గమనించారు. మహారాజా వారు రామశాస్త్రినే రాజ్యం మొత్తానికి శాశ్వత న్యాయాధికారిగా నియమించబోతున్నారన్న వార్త ఒకటి ప్రచారంలో కొచ్చేసింది ఎలాగో. అప్పుడు జరిగిందా విచిత్రం.

 

పనిమీద దేశాంతరం పోయిన ఒక చిన్నవ్యాపారి అనుకోకుండా అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అమావాస్య కావడం వల్ల అప్పటికి చీకటి బాగా చిక్కపడి ఉంది. భార్య చాలా తాత్సారం చేసి గానీ తలుపు తీసింది కాదు.  అనుమానం వచ్చిన భర్త ఇల్లంతా వెతికితే పడకగదిలో మంచం కింద మరొక మగమనిషి  నక్కి  కనిపించాడు.  తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో వాడికీ, ఇంటియజమానికీ మధ్య పెద్ద పెనుగులాట అయింది. ఆ దెబ్బలాటలో కత్తిపోటుకి బైటమనిషి ప్రాణాలు అక్కడికక్కడే పోయాయి.

ఇప్పుడు హతుడి భార్య  న్యాయం కావాలంటూ రామశాస్త్రి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. "ఒక ఇంటి ఆడది చనువు ఇవ్వకపోతే మొగవాడనే వాడికి అర్థరాత్రి ఆ  ఇంట దూరే ధైర్యం ఎక్కడి నుంచీ వస్తుంది? భర్త వుండీ పరాయి మగవాడితో పోవాలనుకునే ఆడదానికి పడాలి అసలైన శిక్ష.. ముందుగా" అని విగతజీవుడి భార్య వాదన.

కొట్టి పారేయదగింది కాదు.

"నాకే పాపమూ తెలీదు. ఈ మనిషి ముఖం కూడా నేను   ఎన్నడూ చూసి ఎరగను.  వీడు ఎప్పుడు ఇంట్లో కొచ్చాడో..  పడకగదిలో మంచం కింద ఎందుకు దూరాడో అస్సలు   తెలీదు.  నా బిడ్డమీద ఒట్టు. తలుపు ఆలస్యంగా తీయడానికి కారణం నేను మంచి నిద్రలో వుండటమే. మా ఇంటాయన  ఆ సమయంలో వస్తాడని నేనేమన్నా కలగన్నానా?"అని భోరుమంది ఆ ఇల్లాలు. కన్నబిడ్డమీద కూడా ప్రమాణం చేసి చెప్పిందా ఇల్లాలు. కల్లిబొల్లి కథలుగా  శంకించడం సబబు కాదు.

"నిజానికి ఆ దుర్మారుడే నన్ను చంపాలని చూసాడు. తప్పించుకునే ప్రయత్నంలో నేను కత్తి విసిరిన మాట నిజమే. కాని.. వాణ్ణి చంపాలన్న ఉద్దేశం ఏ కోశానా లేదు. గాయ పరిచి చట్టానికి పట్టిద్దామన్నదే అప్పటి నా ఆలోచన.   చేతికి గురి చూస్తే కత్తి  గొంతులో దిగబడింది.." అని పశ్చాత్తాపం ప్రకటించాడు ఇంటి యజమాని. ఆయనకు పరమ శాంతపరుడిగా చుట్టుపక్కల మంచి పేరు కద్దు.

విచారణలో ఏ మాత్రం పొరపాటు జరిగినా అమాయకులు అన్యాయంగా బలైపోయే ప్రమాదం ఉంది.

రామశాస్త్రికి మొదటిసారి ధర్మసంకటం ఏర్పడింది.

'న్యాయానికి భార్య ఉండీ.. పరాయిస్త్రీ కోసం వెంపర్లాడిన ఆ కాముకిడికి తగిన శిక్షే పడింది. కానీ దాని పర్యవసానం  అమాయకురాలైన వాడి భార్య మీద కూడా పడింది. వ్యాపారి భార్య మీద ఆరోపించిన కాముకత్వానికి రుజువులు లేవు. చట్టప్రకారం శిక్షించడం కుదరదు. సహజన్యాయం దృష్టితో చూస్తే.. తన కాపురంలో నిప్పులు పోయబోయిన దుర్మార్గుడిని ఆత్మగౌరవం గల ఏ మగవాడూ ఉత్తిపుణ్యానికి సహించి వదిలి పెట్టలేడు. నిజంగా వాణ్ని చంపినా వ్యాపారికి పాపం అంటుకోరాదు.

కాని ఇది న్యాయస్థానం. న్యాయం ఇక్కడ  కొన్నిచట్రాల పరిధిలో మాత్రమే ఇమిడి నిర్థారింపబడుతుంది.  కావాలని చేసినా.. అనుకోకుండా జరిగినా ఒక నిండుప్రాణాలు గాలిలో కలసిపోయాయి. దానికి కారకుడైన వాడిని ఉపేక్షిస్తే సమాజం మొత్తానికి తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతాయి.

ఇదే అదనుగా తన మీద గుర్రుగా ఉన్న తతిమ్మా న్యాయాధిపతులు మహారాజు గారికి ఫిర్యాదులూ చేయవచ్చు. తన తలను గురించి కాదు కానీ.. రాజ్యం మళ్ళీ పూర్వసంక్షోభంలో  చిక్కుకుంటుందేమోనన్నదే దిగులు.  ముందు ముందు సమాజానికి  ఈ తలతో చేయవల్సిన సేవ ఎంతో వుంది. ఈ చిన్న కారణంగా ఆ పెద్ద సామాజిక భాధ్యతనుంచి ఇలా తప్పుకోవాలనుకోవడం కార్యశీలుడి లక్షణం కాదు.'

ఆ రాత్రంతా ఎన్నో రకాలుగా ఆలోచించిన రామశాస్త్రి తెలారి చెప్పవలసిన తీర్పు మీద ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చాడు. అప్పుడు గాని నిశ్చింతగా నిద్ర పట్టిందికాదు.

 

మర్నాడు న్యాయస్థానంలో రామశాస్త్రి చెప్పిన తీర్పు ఎందరినో ఆశ్చర్య చకితులను చేసింది.  'ఘటన పుర్వాపరాలు అతి సూక్ష్మంగా పరిశీలించిన పిమ్మట ఈ నేరం మొత్తానికి సంపూర్ణ భాధ్యులు దేశాన్ని ఏలే కృష్ణవర్మమహారాజు గారే అని నిర్ధారించడమైనది. దేశాంతరం పోయిన చిరువ్యాపారి చేసే పని తాను పండించిన కూరగాయలను కనీస ధరలకు అమ్ముకోవడం. దేశీయంగా తగిన మద్దతు ధర దొరికితే ఎవరూ కుటుంబాన్ని అలా వదిలి దేశాలుపట్టిపోరు.

 

మహారాజుగారి మరో నేరం మృతుడి దుర్మరణం.  స్వయంకృషితో నిమిత్తం లేకుండా సంపదలు వచ్చి పోగుపడే మిడిమేళపు వర్గం ఒకటి దేశంలో వర్ధిల్లుతున్నది ప్రస్తుతం. వారికి పొద్దు గడవడమే పెద్ద ఇబ్బంది. తిన్నదా అరగదు. కొవ్వా కరగాలి. రకరకాల దోవల్లో వాంఛలు తీర్చుకునే తాపత్రయాలు ప్రదర్శిస్తుంటారు. సంసార స్త్రీలను ఉచ్చులోకి లాగడం ఈ తరహా కుత్సిత ప్రయత్నాలలో ఒకటి. చట్టాలు వీరికి చుట్టాలు. న్యాయం ఆంటే వీరికి మహా అలుసు. పాపాత్ములకు ఏ శిక్షలూ పడని ఈ అస్తవ్యస్త వ్యవస్థకూ సర్వోన్నతాధికారి అయినందు వల్ల మహారాజుగారే  ఈ నేరానికి భాద్యత వహించవలసి ఉంది.

 

కట్టుకున్న వాడితో కలసి   బతుకును పండించుకోవాలన్న ఒక్క ఆశతో మాత్రమే స్త్రీ  మెట్టినింటికి అడుగుపెట్టేది. కలకాలం పక్కనే ఉంటానని  ప్రమాణం చేసి మరీ చెయ్యందుకున్న  మగవాడు  కలలో తప్ప కనపడని  దుస్థితి దాపురిస్తే పడతులందరూ  ఒకే రీతిలో స్పందిస్తారన్న ధీమా లేదు.  కడుపు నిండిన వాడు అన్నం దొంగిలిస్తాడా? సంసార జీవితం సంతోషంగా సాగితే పక్క చూపులు చూస్తుందా ఏ సుదతైనా? బిడ్డ ఖాళీ కడుపుకి కన్నవారిదే నేరం ఎలాగో..  ఇక్కడ ఏలిన వారి దోషం ఇక్కడ అలాగే.

మూడు తప్పులకూ మూలకారణం  మహారాజుల వారే కనక మరణ దండనే వారికి సరైన శిక్ష.  నిందితుడే స్వయంగా,  బహిరంగంగా మహారాజుల వారి పైకి  కత్తి విసిరాలి. ఆ తరువాత  ఆ నేరం మీద వ్యాపారికీ యథేచ్చగా ఉరిశిక్ష అమలు చేయవచ్చు.  హతుడి భార్య కోరుకుంటున్న న్యాయం కూడా   అప్పుడే సాధ్యమవుతుందని ఈ న్యాయస్థానం భావిస్తున్నది"

రామశాస్త్రి తీర్పు పుట్టించినంచిన కలకలం అంతా ఇంతా కాదు. ప్రజలు తీర్పుకి అనుకూలంగా.. ప్రతికూలంగా రెండు వర్గాలుగా చీలి వాదులాడుకోవడం మొదలు పెట్టారు. అంశం మహారాజుగారి మరణదండనకు సంబంధించింది అవడం చేత ఆ చర్చల ప్రభావం సమాజంలోని అన్ని వర్గాల మీద తీవ్రంగా ఉంది. తీర్పులో ప్రస్తావించిన దేశీయ వ్యాపార ధోరణులు.. కలవారి విచ్చలవిడి బతుకులు.. ఆడవారి జీవితాల్లో  జరుగుతున్న అన్యాయాల్లాంటి ఎన్నోసామాజిక సమస్యలు మేధావివర్గాల చర్చల్లో నలిగి నలిగి సామాన్య్లుల అవగాహనా స్థాయి పదును కూడా పెంచాయి. న్యాయస్థానాల్లో, శాంతిభద్రతల రక్షణ  యత్రాంగాల్లో అప్పటి వరకూ లోపాయికారీగా సాగుతోన్న అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం లాంటి ఎన్నో రుగ్మతలు ఇప్పుడు నిర్భయంగా బహిరంగ చర్చల్లో నలుగుతున్నాయి.

రామశాస్త్రి కోరుకున్న చైతన్యం కూడా అదే.

 మహారాజుగారూ  తీర్పుకి కట్టుబడి ఉంటానని ప్రకటించడంతో చట్టం ముందు అందరూ సమానమేనన్న సందేశం అత్యంత బలంగా సమాజానికి అందించినట్లయింది. న్యాయవ్యవస్థ పక్షపాతం మీద అప్పటిదాకా ధనికవర్గాలకున్న భేఫర్వా మొత్తం  ఒక్కసారి కుప్పకూలింది.

రామశాస్త్రి తీర్పు అమలు చేయాల్సిన క్షణాలు రానే వచ్చాయి. బహిరంగ వధ్యశిల ఏర్పాటు చేయబడింది.  రాచపరివారం సమస్తం వెంటరాగా మహారాజు గారు శిక్షాస్థలికి అట్టహాసంగా తరలి వచ్చింది.

శిక్షలు విధించడమే తప్ప శిక్షలు అనుభవించే వ్యవస్థ రాచరికానికి కొత్త. చరిత్రలో సైతం ఎక్కడా జరిగినట్లు విని ఉండని ఈ  అపురూప దృశ్యాన్ని తిలకించడానికి ఎక్కడెక్కడి జన సమూహాలో  విరగబడి వచ్చాయి.

 ఎక్కడ విన్నా మహారాజుగారి మంచితనాన్ని గురించిన స్మరణలే.  ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలించే  కృష్ణవర్మ మహారాజు స్థానాన్ని వారసులు  ఎంతవరకు పూరిస్తారోనన్న నిరాశ. మహారాజుగారి పాలనలో కొన్ని పొరపాట్లు జరిగితే జరిగి ఉండవచ్చు. రామరాజ్యానికే ఈ మచ్చ తప్పలేదని రామాయణం చెబుతోంది.  రాములవారికి ఇలాంటి దారుణమైన శిక్ష పడిందా?

చర్చలు ఇలా పలు రకాలుగా సాగుతుండగానే.. చీకటి పడింది. తీర్పులో విధించబడిన సమయానికి సరిగ్గా వ్యాపారిని మరణ వేదిక మీదకు తీసుకొచ్చారు. అతని చేతికి ఒక కత్తి ఇచ్చారు.

ఎదురుగా తలమీద ముసుగుతో సర్వంసహా చక్త్రవర్తులు..  ప్రాణాలు అర్పించడానికి సిద్ధబడి ధీరోదాత్తంగా  నిలబడి వున్న దృశ్యం.

ప్రకటన వెలువడింది "వ్యాపారీ! తీర్పు ప్రకారం నువ్వు మహారాజుగారి  మెడ మీదకు ఈ కత్తి విసరాలి. ఒకే ఒక్క వేటుతో  మహారాజుగారి ప్రాణాలు  పోవాలి సుమా! ఇహ అప్రమత్తమయి  విసురూ!"

అంతటా హాహాకారాలు.

వజవజా వణుకుతూ వ్యాపారి చేతిలోని కత్తి బలంగా విసిరాడు.  గురి తప్పింది.  మెడకు తగలవల్సిన కత్తి భుజానికి రాసుకుని కింద పడింది. తీర్పులో వ్యాపారికి ఇచ్చింది ఒకే ఒక్క అవకాశం కనక మహారాజు గారు ఇక  సురక్షితం.

అంతటా ఆనందంతో కేరింతలు.

ప్రజాభిమానానికి  కదలి పోయారు కృష్ణవర్మ మహారాజు. ఇంతగా ప్రేమించే ప్రజలకు ఏమిస్తే రుణం తీరేను! జన సంక్షేమానికి మరింత  ప్రాధాన్యమివ్వాలని ఆ క్షణంలోనే  కృతనిశ్చయానికొచ్చారు  కృష్ణవర్మ మహారాజు.

ఇదంతా రామశాస్త్రి చిత్రమైన తీర్పు  కలిగించిన మనోవికాసం.

"నిజమే కానీ.." అంటూ అప్పటి వరకూ తనను తొలుస్తున్న సందేహాన్ని రామశాస్త్రి ముందు బైట పెట్టారు మహారాజా వారు "అర్థరాత్రి పరాయి యింటిలోకి  ఆ దుర్మార్గుడు జొరబడింది ఎందుకో నిర్ధారణ కాలేదు. ఆ ఇంటి ఇల్లాలు చరిత్ర ఎంత స్వఛమైనదో  తేలిందిలేదు.  వ్యాపారి 'దుర్మార్గుడిని కావాలని చంపలేదు.. నిర్దోషిన'ని బుకాయిస్తున్నాడు. ఆ మాటల్లోని  నిజాయితీ పాలు నిగ్గుతేలలేదు. తప్పు చేసిన వాళ్ళందరిని గాలికి  వదిలేసి ఆ సంఘటనతో ఏ మాత్రం సంబంధం లేనినాకీ..శిక్ష ఏమిటి? అందునా గురి చూసి విసిరే కత్తికి ఎదురుగా నిలబడి ఉండడం!  వ్యాపారి సుశిక్షితుడైన యోధుడు కాడు. కాబట్టి తడబడ్డాడు.  లేకపోతే.."

మధ్యలోనే అందుకొని ముగించాడు రామశాస్త్రి "అతను తడబడ లేదు మహారాజా! గురి చూసే విసిరాడు. కానీ ఆ గురి తప్పింది. అతని గురే అంత. కుడికన్నులో దృష్టిలోపం ఉంది. ఆ లోపం కారణంగానే ఆ రోజు రాత్రి కూడా ఈ వ్యాపారి చేతిలో ఆ దుర్మార్గుడి ప్రాణాలు పోవడం!  దుర్మార్గుణ్ని గాయపరిచి వదిలేద్దామనే కత్తి విసిరాడు పాపం, ఇతగాడు. దృష్టి లోపం వల్ల అది అతని ప్రాణాలు పోవడానికి కారణం అయింది. నిజానికి అలాంటి నీచులు బతికి ఉండటం వల్ల అమాయకులకు ఏ మాత్రం మనశ్సాంతి ఉండదు. వ్యాపారి భార్య  ఒంటరిగా ఉండటం చూసి   నాశనం చేయాలన్న దుర్బుద్ధితోనే వాడు చీకటి మాటున చాటుగా వచ్చి పడక గదిలో ముందే దూరి కూర్చున్నది. ఆ పాపంలో ఆమెకే భాగం లేదు. ఆ కాముకుడి చరిత్ర.. ఆ ఇల్లాలి చరిత్ర వాకబు చేయించిన తరువాతనే నేనీ రకమైన శిక్ష ఖరారు చేసింది.

సంఘటన విచారణకు వచ్చినప్పుడు  ఆ చిన్నవ్యాపారికి శిక్ష పడుతుందనే అందరూ భావించారు. సాక్ష్యాలనీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి మరి. నా మనస్సాక్షి ఒక్కటే  అనుకూలం. వాకబు చేసిన మీదట నా నమ్మకం నిజమని తేలింది. కానీ సాక్ష్యాలుగా అవి చాలవు.  వ్యాపారిని శిక్షించకుండా వదిలేస్తే నా తల కోట గుమ్మానికి వేలాడితే చూడాలను వువ్వీళ్ళూరేవాళ్ళకు అవకాశం ఇచ్చినట్లవుతుంది.  ఇప్పటి వరకూ ఈ వ్యవస్థను భ్రష్టుపట్టించిన వాళ్ళు వాళ్ళంతా. ఇప్పుడిప్పుడే ఆ  పరిస్థితులు చక్కబడుతున్నాయి. నా తలను గూర్చి నాకు బెంగ లేదు. కానీ.. తమ మంచితనం వల్ల ఈ పేదవాడు కలలో అయినా ఊహించలేని విధంగా ప్రజాసేవ చేసుకునే ఈ గొప్ప అవకాశాన్ని పొందాను. దాన్ని సమాజ హితం కోసం మరింత పదునుగా వాడాలని మాత్రం ఆత్రంలో ఉన్నాను.  ముందు ముందు నా విరోధులు మీ మనసు విరిచే ప్రమాదం ఉంది. అందుకే .. ఏ సంబంధం లేకపోయినా ఈ వ్యవహారంలో  మిమ్మల్ని కూడా ఇరికించవలసి వచ్చింది. మీ ముందు అనుమతితోనే ఇది సాధ్యమయిందనుకోండి. వ్యాపారి దృష్టి లోపం మీద ఒకసారి మీకు నమ్మకం ఏర్పడితే ..ఇంక ఎవరు ఎన్ని చెప్పినా మీరు నా తీర్పుని  శంకించరన్న నమ్మకమే నా చేత ఈ అతిసాహసం చేయించింది. మీ సహృదయత వల్లే ఇది సాధ్యమైంది.  ఇదీ నేను ఇవ్వాలనుకున్న సంజాయిషీ. ఇప్పుడు మీరే శిక్ష విధించినా శిరసావహించడానికి ఇక సిద్ధం మహారాజా!"

మందహాసం చేసి అన్నారు  మహారాజు "నాకు ఇంత పెద్ద శిక్ష విధించిన పెద్దమనిషిని వూరికే వదిలి పెట్టడం కల్ల.శిక్ష ఖాయం. అమలుకు గడువు దాకా వేచి చూడటం దేనికి? రేపే ముహూర్తం. మీరు మా ముఖ్య  ఆంతరంగిక వర్గంలో చేరాలి. సామాన్యులకు మా ద్వారా  మరింత న్యాయం జరిగే అవకాశం కల్పించాలి!   మా ముఖ్య సలహాదారులుగా  చేరడమే  మీకు తగిన శిక్ష " అంటూ ఆప్యాయంగా రామశాస్త్రిని ఆలింగనం చేసుకున్నారు కృష్ణవర్మ మాహారాజు.

-కర్లపాలెం హనుమంతరావు

( గో తెలుగు.కామ్ లో ప్రచురితం)

***

 

 

   

 

 

 

 

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...