Sunday, December 12, 2021

చెట్టుకు చాదస్తం జాస్తి! - కర్లపాలెం హనుమంతరావు


చెట్టుకు చాదస్తం జాస్తి. నరికినా అవి నరజాతిని  ప్రేమిస్తాయి. ఊడలు పెరికినా, వేరుతో సహా వూడబెరికినా తాను ఎండకు కాగుతూ నీడను ఇవ్వాలనే చూడడం చెట్టు  చాదస్తమా? కొమ్మలు విరుచుకు పోయే దొమ్మీజాతిని సరసకు రానీయనే కూడదు కదా వాస్తవానికి! రాళ్లేసి పళ్లు రాలగొట్టుకునే రాలుగాయిల మీద పూలు కురిపించే చెట్టును వట్టి 'ఫూల్' అనాలా? చెట్టు తన  పట్టలు చీల్చుకు పోతున్నా పట్టించుకోదు.. సరి కదా తానే తన తొర్రలో ఆ త్రాష్టుడు పైపైకి ఎగబాకేటందుకు వీలుగా మెట్లు తయారుచేయడం  విచిత్రమే! చెట్టంత ఎదిగిన మనిషి చెట్టుకు అపకారం తలపెట్టినా ఒక్క తిట్టు పదమైనా విసరడం ఎబ్బెట్టు చెట్టుజాతికి! నిలవ నీడలేని నిర్భాగ్యుడికి తనే కుదురు కడుపులో ఇంత  వెచ్చని చోటిచ్చే దయామయ జీవి లోకంలో చెట్టు కాక మరొకటి కనిపిస్తుందా? దేవుడు ఉన్నాడో లేడోనని సందేహించే మీమాంసకులకు.. ఉంటే గింటే ఎలా ఉంటాడోనని తర్కించే  ఆలోచనాపరులకు తనే దేవుడునని చెట్టు ఎప్పుడూ నోరు విప్పి సందేశమిచ్చుకోదు. గొప్ప గొప్ప సేవల నిశ్శబ్దంగా చేసుకుపోవడమే తరువు తత్వం తప్పించి గొప్పలు చెప్పుకునే నైజం చెట్టుకు వంటబట్టలేదు. వంటచెరుకుగా తనను వాడుకొమ్మన్నది.. కొమ్మలు ఎండిన తరువాత! తిండి సరుకుగా కండలు పెంచుకొమ్మనీ కాయా కసరూ, పండూ, పసరూ  విసుగూ విరామం లేకుండా కర్ణుని మించి ఎల్లవేళలా అందించేది చెట్టు. ఒక్క మనిషికనే కాదు నిజానికి చెట్టు సృష్టిలోని  తతిమ్మా అన్ని జీవులకు అమ్మను మించిన అమ్మ! అమ్మదయినా అడగనిదే పెట్టే ఔదార్యం కాదు. ఆమెయినా ఆ చెట్టు కొమ్మ ఇచ్చిన కాయా కసరు, పళ్లూ పూలతోనే సంసారం సాకేది. వంటికి చుట్టుకునే బట్ట చెట్టు ఇస్తేనే కదా వచ్చేది! కంటికి పెట్టుకునే కాటుకైనా సరే.. కాలి బూడిద అయిన పిదప మిగిలిన మాసిక నుంచే  వచ్చేదని తెలుసా! జీవుల సేవ కోసమై నేల తల్లి కడుపున పడినప్పటి బట్టే చెట్టు విత్తనమై మొలకెత్తాలని ఎంతలా తపిస్తుందో మనిషికి తెలియదు. అదనుకు పదునుగా వానలు పడితే ఆనందంగా వేళకు పంటగా మారి మన ఇంట చేరి గోదాము గుంటలో ఓ మూల దానానికి సిద్ధంగా ఉంటుంది. ఒకసారి కరవు రక్కసి రక్కేసిపోతుంది. మరోసారి వరద వచ్చి వంగడం కొట్టుకుపోతుంది. ఇంకోసారి ఏ పురుగో పుట్రో కుట్ర పన్నినట్లు తిండిగింజను తన్నుకుపోతుంది. ప్రకృతి ఉక్రోషం, ప్రకృతి సంతోషాలతో నిమిత్తంలేని సేవాతత్వం చెట్టూ చేమది.  కాబట్టే తాలూ తప్పను కూడా వదలకుండా ఏ తవుడో, చొప్పగ మార్చి సాగుపశువుల  కడుపు నింపేది. నమ్ముకున్న ఏ జీవినీ వదిలేసే ఊహ చెట్టుకు ఎప్పుడూ రాకపోవడం  సృష్టి విచిత్రాలలోకెల్లా విశేషవైన పెద్ద విచిత్రం. అగ్గి పెట్టే వంటచెరుకు నుంచి అగ్గిపెట్టెలో మండే పుల్ల సరుకు వరకు అన్నింటా చెట్టు మహావిశ్వరూపమే. చెట్టు విశ్వంభర! చెట్టు కలపగా ఇళ్లు కడుతుంది. చెట్టు  ఆకులై దడులు నిలబెడుతుంది. చెట్టు దుంగలై తల కాచినప్పుడే మనిషి ఒక ఇంటివాడుగా మారే అవకాశం. చెట్టాపట్టాలేసుకు తిరగవలసిన స్నేహితుడు చెట్టు మనిషికి.  అమ్మ పక్కన చేరి నసపెట్టే పసికందుకు  తాను ఊయల; అన్నీ వదిలి లోకం విడిచిపెట్టే మనిషిని ఆఖరి మజిలీ వరకు వదిలిపెట్టని  పేటిక చెట్టు. పాడు లోకం అని ఎంత ఈసడించిపోతున్నా తానో పాడెగా తోడుగా వచ్చే ఆత్మబంధువు కూడా ఆ చెట్టే సుమా! మట్టితో మనిషి  మమేకమయే చోటుకు గుర్తూ చిగురిస్తూ పైకి మొలచిన మొలకే సుమా!  గుర్తుగా  పూలిస్తుంది సరే.. ఆ పూలకు తావీ  ఎందుకనిస్తున్నట్లో చెట్టు? మానవత్వం ఎంత సుగంధభరితమై పరిమళించాలో చెట్టు ఇచ్చే సందేశం  మిత్రమా అది! పండు ఇస్తుంది.. సరే పండుకు రుచి ఎందుకు జతచేస్తుందిట చెట్టు? మనిషితత్వం ఎట్లా పండించుకొనాలో గురువులా తరువు బోధించే జీవనసూతం సుమా అది! కాలానికి సూచికలు చెట్టు ఎదుగుదల దిగుదలలే! ఏమీ విగలదనే వైరాగ్యం ఎంత అవాస్తవమో గ్రీష్మం వెన్నంటి వచ్చే వసంతంలో పూచి  చెట్టు జీవిత పరమార్థం ప్రకటిస్తుంది. రాతి కుప్పలు, ఇసుక తిప్పలు, జలగర్భాలు.. చివరికి బురద కూపాలు.. ఏదీ చెట్టు చివుళ్ల పచ్చని పలకరింపుకులకు బహిష్కృతం కాదు. అడిగితే బెరడునైనా మందుకు ఇచ్చేందుకు బెట్టుచేయని చెట్టు నుంచి మనిషి ఏమి పాఠం నేర్చుకుంటున్నట్లు? కట్టు బట్ట నుంచి, కొట్టుకు తినే కాయా, కసరు వరకు దాన కర్ణుడిని మించిన ఔదార్యం ప్రదర్శిస్తుంది కదా చెట్టు! నివారణలోనే కాదు, రోగ నిదాన చికిత్సలో సైతం వేరు, కాండం, మూలిక. ఆకు, పసరు, లేహ్యం, లేపనాలుగా   మొక్క చేసే సేవకు ఇంగితమున్న ఏ మానవుడైనా సాగిలపడి మొక్కాలి కదా నిజానికి? జ్ఞాన సింధు బుద్ధుడికి  గురువు తరువు; నేటి మనిషి మొరటుతనంతో  తరువు పరువు కోలుపోతున్నది; గుండె చెరువవుతున్నది.  కోరినది ఏదైనా మారు పలుకు లేకుండా సృష్టించైనా ప్రసాదించే కల్పతరువు పౌరాణికమైన కల్పన  కావచ్చునేమో.. కానీ  వాస్తవ జగత్తులోనూ గడ్డిపోచ నుంచి, గంధపు చెక్క దాకా మనిషి జీవితంలోని ఏ భాగమూ వృక్షజాతి ప్రమేయం వినా వృద్ధిచెందే అవకాశం సున్నా! దాల్చిన చెక్కా.. పూరి జగన్నాథుడు తాల్చిన చెక్కా.. మచ్చుక కై చెప్పుకునే చెట్టు తాల్చే సహస్రాధిక అవతారాలలో కొనే ముచ్చట్లు! చెట్టుకూ మనిషికీ మట్టే తల్లి. ఒకే తల్లి బిడ్డలై పుట్టినా ఇద్దరి తత్వాల మధ్య ఎందుకింత తారతమ్యం? దాని పొట్ట కొడితే తప్ప తన బతుకు గడవని చెట్టు పైన మనిషి దావవత్వం అభ్యంతరకరం. సౌహార్ద్రం సంగతి ఆనక.. కనీసం సోదరభావమైనా ప్రదర్శించే ఆలోచన నాగరీకత నేర్చినా మనిషి చేయడంలేదు.  విచారకరం! 'వృక్షో రక్షతి రక్షతః'  చాదస్తమైన  సుభాషితం కాదు. 'చెట్టును బతకనిస్తేనే చెట్టు బతకనిచ్చేది' అన్న పర్యావరణ సూత్రం  ఎంత సత్వరం వంటబడితే మనిషి మనుగడ కొనసాగింపుకు అంతటి శ్రేయస్కరం! 
-కర్లపాలెం హనుమంతరావు 
బోథెల్; యూ ఎస్ ఎ 
08-02-2021 
***


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...