Saturday, December 18, 2021

పాత బంగారం : కథానిక కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 నిరీక్షణ - ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ సేకరణ : కర్లపాలెం హనుమంతరావు




 



పాత బంగారం : కథానిక 

కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 

నిరీక్షణ 

- ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ 

సేకరణ :  కర్లపాలెం హనుమంతరావు 


యంత్రంలా సాగిపోతున్న జీవన సరళిలో అతనిరాక ఒక గొప్ప అనుభూతి. 


జీవితంలో ఎదురైన చేదు అనుభవం అతని జీవితాన్నే మార్చేసింది. అనుభూతినే ఊపిరిగా పీలుస్తూ దూరమై పోయిన 'ఆనందాన్ని ఆస్వా దించడానికి, అందుకోడానికి ప్రయత్నిస్తున్నాడతను....


నిరీక్షణలో మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడా? |


ఆదో విచిత్రమైన స్థితి.అతనిది:


అనందం లాంటి విచారం . విచారం లాంటి ఆనందం


అదో చిన్న రైల్వే స్టేషన్.

నేనక్కడ అసిస్టెంట్ స్టేషన్ మేష్టార్ని.


ఈ ప్రాంతానికి బదిలీ అయి దాదాపు రెండేళ్ళు అయ్యింది. ఇక్కడ కొచ్చిన కొత్తలో ఇక్కడి వాతావరణం అలవాటు అవ్వడం కాస్త కష్టమే అయ్యింది. 


పట్నంలో పుట్టి పెరగడంవల్ల పల్లెటూరి వాతావరణం కొత్తగా, కొంచెం ఇబ్బందిగా వుంది... వచ్చిన రెండో రోజునే, జలుబు.... జ్వరం.....


వైద్య సహకారాలు పెద్దగాలేవు. ఏదో అదృష్టం బాగుండి ఓ వారం తరువాత కోలుకున్నాను.  తరువాత క్రమేణా వాతావరణానికి అలవాటు వడ్డాను. వాతావరణంతో 'అవగాహన' ఏర్పడ్డాకా, అక్కడి జనం, వాళ్ళ వేషభాషలు కూడా అర్ధమయ్యాయి. 


అంతా అర్థమయ్యాకా, అంతా ఆనందమే! అక్కడి వాళ్ళతో నేను కలిశాను. నాతోవాళ్ళు కలిశారు. స్టేషన్లో పెద్దగా పనులు వుండవు. ఎక్స్ ప్రెస్ బళ్ళు వచ్చినప్పుడు సిగ్నల్స్ చూ పెట్టడం.... రెండే రెండు 'ఎక్స్ప్రెన్సులు' వస్తాయి రోజుకి . అవి ఉదయం  వేళలలో రావడంతో... దాదాపు మధ్యాహ్నమంతా ఖాళీయే: 


మళ్ళీ సాయంత్రం ఆరింటికి ఓ ప్యాసింజర్ వస్తుంది. దాంట్లోంచి ఒకరిద్దరు కన్నా దిగరు. వెళ్ళేవాళ్ళు ఒక్కొసారి అసలు వుండరు. అడపా దడపా నాలుగైదు గూడ్స్ బళ్ళు వస్తుంటాయి. అందుకే పెద్దగా పన్లు ఉండవు . వున్నా వున్నట్టు అనిపించదు.


ఏడాది కొకసారి ఈ ప్రాంతంలో తిరునాళ్ళు లాంటిది జరుగుతూ వుంటుంది. అప్పుడే కాస్త రద్దీగా వుంటుంది. అందుకే.....


ప్రొద్దున్నుండి సాయంత్రం వరకు గడవడం పొద్దు బోదు . కానీ వుద్యోగ ధర్మం తప్పదు.


రోజంతా భరించలేని వేడిమిని భరించడంవల్ల సాయంత్య్రం కోసం, సాయింత్య్రం వీచే చల్లని పిల్లగాలులకోసం ఎదురు చూడడం నా జీవితంలో నిత్యకృత్యమయి పోయింది. ఇక్కడి సాయంత్రం  నిజంగా చాలా అందంగా వుంటుంది.


ఆ అందానికి వన్నె తెస్తూ. ప్రకృతి సంధ్యారాగ సంకీర్తన! 

దూరంగా గూళ్ళవైపు సాగిపోతున్న పక్షుల గుంపులు. ఏవో నందేశాలు

హడావిడిగా మోసుకుపోతూ నీలిమేఘాలు. 

పిల్లగాలి కెరటాల సప్తస్వరాలు.

నిశ్శబ్ద సౌందర్యం.


అలాంటి సమయంలో

' అతను'  వస్తున్నాడు.


అతని పేరు తెలీదు. దాదాపు ఏడాది నుండి వస్తున్నాడు.


మా యిద్దరి మధ్య మాటల్లేవు. చూపులతోనే పలకరింత.


అందమైన నిశ్శబ్దం ఇద్దరిమధ్య.


ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు ప్యాసింజర్ వచ్చే వరకు చూస్తాడు.


వచ్చేకా, అది వెళ్ళే వరకు అన్ని బోగీల్లోకి చూస్తూ, అటునుండి ఇటూ,

నుండి టూ తిరుగుతాడు.


రైలు కదిలేవరకు అక్కడే  వుండి, కదిలాకా, భారంగా ఓ నిట్టూర్పు విడిచి, మెల్లగా అడుగులో అడుగువేసుకుంటూ వెళ్ళిపోతాడు.. ఇక్కడికి దగ్గర్లోవున్న పల్లె.. దాదాపు మూడుమైళ్ళ దూరం. 


రోజూ అంత దూరంనుండి ఎందుకు వస్తున్నట్లు? పోనీ అతని కోసం ఎవరైనా వస్తారా? 

ప్స్! . . ఎవరూ రారు.


ఒకసారి పోర్టర్ వెంకటయ్య మాటల్లో తెలిసిందేమిటంటే- అతను దగ్గర్లో వున్న పల్లెటూరిలోని పాఠశాల మేష్టారు. దాదాపు ఏడాది అయ్యిందిట ఆవూరు వచ్చి మనిషి.  బక్కపలచగా వుంటాడు. పెద్ద ఎత్తుగా వుండడు, వదులైను ఫాంట్, లూజ్ షర్ట్ వేసుకుంటాడు. నిర్మలంగా వుండే మొహంలో కొద్దిగా జాలి, ఎక్కువగా కరుణ

కన్పిస్తాయి. కళ్లాల్లో  మాత్రం ఏదో లోతుచూపులు. ఏదో పోకొట్టుకున్న తున్నట్టు వుంటాయి,


" అమాయకుడిలా వుంటాడు" అని అంటాడు వెంకటయ్య. 

ఎండైనా -


వానైనా -


చలైనా -


వచ్చేవాడు. వస్తున్నాడు. ఇంత శ్రమపడి రావడ మెందుకు?


ప్రశ్నకి ఎంత ఆలోచించినా జవాబు దొరకడం లేదు.


మధ్యాహ్న నుండి వాతావరణం ఆదో మాదిరిగావుంది. మేఘాలు కమ్ము కున్నాయి. రివ్వున ఈదురు గాలులు వీస్తున్నాయి. చినుకు ఏ క్షణానైనా రావొచ్చు. చలికి ధరించలేక స్వెట్టర్ వేసుకున్నాను. యింకా అరగంట వేచివుండాలి ... ప్యాసింజర్ కోసం.

గాలి విపరీతంగ వీస్తోంది . దగ్గర్లోవున్న చెట్లు 'లయ' గా తలలు వూపుతున్నాయి.

గాలి గంభీరంగా అరుస్తోంది.


క్షణంలో... చూస్తుండగానే... గాలి కెరటాల పురవడిలోంచి చినుకులు పడడం ప్రారంభించాయి...బంగారు తీగెలా మెరిసే మెరుపు... ఆకాశాన్ని చీలుస్తూ 

కుండపోతగా........

ధారలు ధారలుగా వర్షం....


' ధన్...' దూరంగా ఎక్కడో పిడుగు పడింది..


ప్రకృతి భీభత్సంగా తయారయ్యింది..


హోరు మనిగాలి.. అంతకంతకు  చినుకులు.. పిడుగు శబ్దం.... చినుకులు...


తాండవం చేస్తున్నాయి....


గాలీ. . వానపోటీ పడ్తున్నాయి....


స్టేషన్లో కరెంటు పోయింది.... లాంతరు వెతికి, దీపం వెలిగించడం గగనమయ్యింది. పోర్టర్ కూడలేడు.  వూళ్ళో ఎవరో బంధువులు వచ్చేరని, చూడడానికి మధ్యాహ్నమే వెళ్ళాడు.

చీకటి తెరలు అలుముకుంటున్నాయి.

భయ కంపితుడ్ని చేస్తోంది ప్రకృతి! 


అరగంట గడిచింది తెలీకుండానే. 

ఫోన్ మోగింది. ప్యాసింజర్ గంట లేటుట. పక్క స్టేషన్నుండి వర్తమానం వచ్చింది.


మరో పావుగంట తరువాత.....


చినుకులవేగం తగ్గింది. లాంతరు వెలుతురులో దూరంనుండి ఎవరో వస్తూ కన్పించారు. వెంకటయ్య అనుకున్నాను వస్తున్నది


' అతను' హడావిడిగా వస్తున్నాడు. తలమీదో గుడ్డ కప్పుకున్నాడు. మనిషిదాదాపు తడిసిపోయాడు.


' మేష్టారూ! ...ట్రైన్ వచ్చిందా?" ఆత్రంగా అడిగాడు, మెల్లగా వణుకు 


తున్నాడు. 


" లేదండి.. గంటలేటు.... "అన్నాను.


“....ఇలా బయటికు  అడుగు వేశానో లేదో ... మొదలయ్యింది . 

 చిన్న వానే అనుకున్నా, బాగా తడిపేసింది....." అన్నాడు అలా దూరంగా చూస్తూ. 


అదృష్టం బాగుండి కరెంటు వచ్చింది. తువ్వాలు వెతికళ్ళల్లోకి కృతజ్ఞతగా చూశాడు. 


" ట్రైన్ వచ్చేవరకుఇక్కడే వుండండి! బాగా కురుస్తోందివాన...." అన్నాను. 


అక్కడే వున్న కుర్చీ అతని వైపు జరుపుతూ. 


దానిమీద కూర్చొని వాన లోకి చూస్తున్నాడు


 " ఏవండీ.... రోజూ వస్తున్నారు..... ఎవరేనా బంధువులు వస్తారా .... వస్తున్నారా?" 


ప్రశ్న ఎలావేయాలో తెలీలేదు. తెలుసుకోవాలనే కుతూహలం ఆ ప్రశ్న వేసింది.


అతను జవాబు చెప్పలేదు.


“.. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి!  దాదాపు మిమల్ని ఏడాది నుండి గమనిస్తున్నాను. వస్తున్నారు.... వెళుతున్నారు...."అన్నాను.


క్షణం తరువాత.. 


"ఎవరూ రారండి.... వస్తారేమోనని ఆశ..." అని క్షణం ఆగి "నిరీక్షణలో బాధకన్నా ఆనందమే ఎక్కువగా వుంది...." అన్నాడు.


అర్ధం కానట్టు చూశాను. అతను చెప్పడం కొనసాగించాడు. “.... ఇన్నాళ్ళు మీరు నన్నడగలేదు.... కానీ.... మీకో విషయం తెలుసా?"


ఏమిటన్నట్టు చూశాను,


“... ఎప్పుడూ మీతో చెద్దామనే ప్రయత్నించాను. కానీ.... అవకాశం రాలేదు." నేను ఆశ్చర్య పోయాను. 


కష్టాన్నైనా, సుఖాన్నైనా మరొకరితో చెప్పుకుంటే, కాస్త ఓదార్పు కలుగుతుందంటారు" అని వానలోకి క్షణంచూసి. . " ఒక్కో మనిషి జీవితం ఒక్కోరకం.... విధాతనృష్టి విచిత్రం. మనిషికి మమతానురాగాల మధురిమని అందిస్తాడు ... రుచినంపూర్ణంగా ఆస్వాదించ

కుండానే దూరం చేస్తాడు. క్షణం వనంతం. క్షణం శిశిరం. జీవితం సుఖ దుఃఖాల సమ్మేళనం...." అని ఆగి "మీకు విసుగ్గావుందాః" అని తెచ్చి పెట్టుకున్న నవ్వు నవ్వాడు. 


కాగితం పూవులా వుందా నవ్వు.


" లేదు..లేదు..ఇదో విచిత్రమైన అనుభవం! చెప్పండి...." అన్నాను  ఆసక్తిగా  ముందుకు వంగుతూ....


నా ఆసక్తిని చూసి, మెల్లగా నిట్టూర్పు విడిచి కొనసాగించాడు. 

చినుకుల శబ్దం..అపరిచిత వ్యక్తి మాటలు ..విచిత్రానుభూతి..... చిత్రమైన కుతూహలం..


" నా జీవితం మొదటినుండి ఒక రకమైన ఆప్యాయతలకి అనురాగాల! 

చేరువుగా వుంది. మా తాతయ్య వాళ్లది ఉమ్మడి కుటుంబం. తాతయ్యకు  యిద్దరు కొడుకులు . ఒకరు వ్యవసాయం. మరొకరు వుద్యోగం. పాత బంగారం : కథానిక 

కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 

నిరీక్షణ 

- ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ 

సేకరణ :  కర్లపాలెం హనుమంతరావు  గారికే వుద్యోగం . వుద్యోగరీత్యా అయిన వాళ్ళందరికి  దూరంగా వుండవలసి వచ్చింది. తాతయ్య చాలాసార్లు నాన్నతో అన్నాడు. " నీకా వుద్యోగం.... ఎందుకురా?  హాయిగా యిక్కడే వుండకా?" అని. 

నాన్నగారికి వ్యవసాయ మంటీ  యిష్టంలేదు. ఎట్టి పరిస్థితిల్లోను కనీసం ఏడాదికోసారైనా, తాతయ్య గారింట్లోగడపాలనే షరతుమీద తాతయ్య నాన్నగారు పుద్యోగం చేయడాన్ని వప్పుకున్నాడు." అని ఆగి రెండు క్షణాలు దూరంగా చూస్తుండిపోయాడు . 


 గాలి హోరు తగ్గుతోంది క్రమేణా. చినుకులు మెల్లగా చిందులు చేస్తున్నాయి. 


" ఆ ఏడాది స్కూలుకి వేసవి సెలవులు యిచ్చారు. బాబయ్య ఏదో పనిమీద మా  ఊరు వస్తే ! నాన్నగారు వాళ్ళు బాబయ్యితో తాతయ్య గారింటికి పంపారు నన్ను. లీవ్ శాంక్షన్ అయ్యాక, అమ్మా, నాన్న, చెల్లి వస్తామని.. " 


మెరుపు మెరిసింది... ఒకసారి కాంతి వెల్లువ .  మళ్ళీ మాములే. సిగ్నల్ లైట్ డిమ్ గా వెలుగుతోంది.


"నాన్నగారు వాళ్ళు వస్తామన్న రోజు.... నేనూ బాబయ్య స్టేషన్లో ఎదురు చూస్తున్నాము .  అప్పటికి అమ్మా వాళ్ళని వదిలివారం రోజులయ్యింది..


నాకు బెంగగావుంది. అమ్మవస్తే ఆమె ఒడిలో ఒదిగి పోవాలని కోరిక. అదే మొదటిసారి వాళ్ళని విడిచి వుండడం. ఎదురు చూస్తున్నాము. ఎంత సేపటికి ట్రైన్ రాలేదు. కొంతసేపటికి తెలిసింది అమ్మావాళ్ళు ఇంకరారని. వేగంగా వస్తున్న రైలు పట్టాలు తప్పి... 

స్పష్టంగా కన్పిస్తున్నాయి కను కొలుకుల్లో కన్నీళ్లు.


గొంతులో స్పష్టంగా జీర.


"..ఆరోజు నుండి ఆదో అలవాటుగా మారిపోయింది. వస్తున్న ఏ రైలుని చూసినా నా వాళ్లు వస్తున్నారని... 'నా బంగారు కొండ' అనే అమ్మ, "వెధవా! ఏం చేస్తున్నావ్?" అనే నాన్న అన్నయ్య నన్ను భయపెడ్తారని 


అమ్మతో చెప్పి కొట్టించి....బూదచాడికి  యిప్పించేస్తా!  అనే చెల్లి వస్తారని ఏదో లాంటి విచారం ఎదురుచూపు...


దూరంగా రైలు వస్తున్న కూత విన్పించింది. అతను మెల్లగాలేచాడు. స్టేషన్లోకి వస్తున్న రైలుకేసి అడుగులు వేస్తున్నాడు.


చిన్న చిన్న చినుకులు పడ్తున్నాయి. చినుకుల మాటున మసక వెలుతురు దాటున మెల్లగా వెతుక్కుంటూ సాగి పోతున్నాడతను.

రైలుని చూసిన అతని మొహంలో స్పష్టమైన మార్పు. 

 ఆనందమాః విచారమా?


మరో పది నిముషాల తరువాత.


రైలు కదుల్తోంది....


అతను మెల్లగా సాగుతున్న రైలుతోపాటే నడుస్తున్నాడు.


బోగీలో ఎవరితోనో మాట్లాడుతున్నాడు....


మాటల్లో నవ్వుతున్నాడు.


నవ్వుతున్నా. 


 కనుకొలకుల్లో ఆ కన్నీళ్ళెందుకు?

***

పాత బంగారం : కథానిక 

కథ: భారతి - మాస పత్రిక - నవంబరు, 1986 

నిరీక్షణ 

- ఎ.వి. వి. ఎస్. ఎస్. ప్రసాద్ 

సేకరణ :  కర్లపాలెం హనుమంతరావు 


   

   

ఈనాడు - గల్పిక' వూల్యం - హాస్యం త్యాగమూర్తివమ్మా! రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - తేదీ తెలియదు )







ఈనాడు - గల్పిక' వూల్యం - హాస్యం 
త్యాగమూర్తివమ్మా!
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - తేదీ తెలియదు ) 
అసమాన త్యాగ  నిరతులు  కోసం పోటీ పెడితే ' టాప్ ఆఫ్ ది టాప్ టె న్‌ ' లో ఉండాల్సిందెవరో తెలుసా? ' 

' తండ్రి మాటకోసం రాజ్యాన్నొదిలి అరణ్యాలకు వెళ్ళిన శ్రీరామచంద్రుడా? ' 

' పురాణాల కాలాన్నొదిలేయ్. శిబి, దధీచి, దానవీరకర్ణుళ్లాంటి  వాళ్లు ఆ కాలాల్లో చాలా మందున్నా ర్లే! కలికాలం సంగతి చెప్పు! ' 

'   దేశం కోసం సమస్తాన్ని వదులుకున్న గాంధీజీని మించిన  వాళ్లెవరున్నారబ్బా! ' 

' రైటేగానీ... రైట్ టైమ్ లో  ఆయనగారు నెహ్రూ ప్రధాని పదవి కావాలని పట్టుపట్టాడే!' 

' అయితే మొన్నటి  మన జయ్ ప్రకాష్ నారాయణ్ కరక్టయిన కేండిడేట్' 

' కాదనటానికి లేదు కానీ... అంతకన్నా రెట్టింపు అర్హతలున్నవాళ్లు ఇంకోరున్నప్పుడు  టాపెస్టుగా ఈ పేరు చెప్పటం బెస్టు అనిపించుకోదయ్యా'

' క్విజ్ మానేసి క్విక్ గా  నీ మనసులో నలుగుతున్న ముక్కేమిటో కక్కేయరాదా! పోనీ... ప్రజలకోసం ప్రాణాలైనా తృణప్రాయంగా  ఇచ్చేందుకు సదా సిద్ధమని ప్రకటనలిచ్చే వైయస్ కీ,  చంద్రబాబుకూ చెరిసగం పంచేస్తే.. ' 

'సాటి మహిళ కేశత్యాగం చేస్తానన్నం దుకే క్లేశపడి  ప్రధానమైన ప్రధాని పదవిని 'కేశవాయనమః' అని వదిలేసుకున్న ఓ త్యాగశీలి మన మానవ మాత్రులమధ్యే తిరుగుతుండటం గమనించుంటే  నీకే అనుమానం  వచ్చి ఉండేదే కాదుగా... మిత్రమా!'

' నిజమే సుమా! త్యాగమంటె ఆమెదే ! ' 

'నాకనిపిస్తోంది.. రెండుసార్లు పదవీ త్యాగాలు చేసిన ఆ భూలోక దేవత ముందు... నీ శ్రీ రామ చంద్రుల వారైనా  బలాదూర్. రాజ్యం ఇలాంటి పూజ్యుల చేత పరిపాలింపబడుతున్నంత కాలం  ధర్మదేవత నాలుక్కాళ్ల మీద ఏమిటి.. నలభై కాళ్లమీద పరిగెత్తుకు  తీరాలి... తప్పదు'

' పరిటాల హత్యకేసులో హంతకులు క్యూలు కట్టి మరీ లొంగిపోతున్నారంటే ఇందుకేనా మరి! వర్షాలు పడటానికి ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి మేఘమధనాలు చేయటం వృథా  కదా! ధర్మం మరీ ఎక్కువైతే మును పటిలాగా మళ్ళీ సునామీలు ముంచుకొస్తాయేమో! ' 
పూర్వం మున్యాశ్రమాల్లో పులులూ, మేకలూ ఒకే మడుగులో కలిసి ఆడుకొనేవని చందమామ కథలూ చదువుకున్నాం .. నానమ్మ తాతయ్యలు చెబితే విన్నాం. మన చల్లని తల్లి పాలనవల్ల మళ్ళీ మొన్న
మన అన్నలూ, పోలీసులూ అన్నేసి రోజులు అతిథి గృహాలలో అలా  కలిసిమెలిసి ఉన్నారు... అన్నీ త్యాగ మయి మహిళామతల్లి మహిమవల్లే నంటావా!'

' సందేహమెందుకూ?... నక్సలైట్లు బేషరతుగా లొంగిపోతున్నా, వీరప్పన్ విజయ్ కుమారుకు  దొరికి చచ్చినా, సానియా మీర్జా దర్జాగా టెన్నిస్ ఆడి గెలుచు కొస్తున్నా. శంకర్ దాదా వందరోజులు పైగా ఆడిందం టున్నా.. అన్నీ..  అన్నీ ఆ త్యాగమూర్తి స్ఫూర్తితో జరు గుతున్న సంఘటనలే'

' ఐసీ... ! మరి ఆమె ఏదో ఏఐసీసీకి  మాత్రమే అధ్యక్షురాలని  కదా టాక్! ఈ బాదరాయణ సంబంధం అర్ధం కాకుండా ఉందే !'

'జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తుంటావా! ఆదేశాలు ఇచ్చే సూపర్ బాస్ ఫేసు ఆఖరినిమిషం దాకా కనిపిస్తుందా! అయినా కథలో తిరిగే మలుపులు అన్నిం టికీ మూలం అతగాడేగా ! గాడ్ మాత్రం కనిపిస్తు న్నాడా? ఐనా ఈ సమస్త చరాచర సృష్టినంతా నడి పించేదీ అతగాడేగా ! దైవానికన్నా ఎక్కువయిన మన నాయకామణి  అదృశ్యమానంగానే ప్రజాస్వామ్యాన్ని పరిర క్షిస్తున్నది. కాబట్టే  ఆఖరి నిమిషంలోసోరెన్ అలా తప్పుకోవలసి  వచ్చింది.' 

'ఏందో..! రామనామం వినగానే ముసలి శబరికీ  శక్తి కిక్కు వచ్చినట్లు... సోనిమమ్మ పేరుకే  కొంతమందికి ఎక్కడ లేని పూనకాతన్నుకొచ్చేస్తుంటాయ్ . మరామె దేవతలకే దేవత కదా! రాముని మించిన దేవుడు కదా! గాంధీజీని మించింన గాంధీ  గదా సోనియాగాంధీ! మరి ఎప్పటి ఉప్పు ' దండి వ్యవహారాలకో  ఇప్పుడు మళ్ళీ ఈ ఉద్యమాల పేరడీలు  ఎందుకంట.. దండగ! 

'పథ్నాలుగేళ్ల  వనవాసం. ఆనక పట్టాభిషికం.  రాములవారూ  జనాని కింకోమారు తన త్యాగగుణాలను  గుర్తుకు తెద్దామని   అలిని సైతం త్యాగం చేసి మరీ 'ఔరా' అనిపించాడు. ఔనా... కాదా! రామునికే తప్పలేదు రాజకీయం. మనలాంటి మామూలు మానవమాత్రుల మధ్య మెదులుతున్న పాపానికి పాపం, ఈ త్యాగమూర్తికీ  అప్పుడప్పుడు ఈ తరహా ఉప్పు ఫీట్లు తప్పవు నాయనా! సందేహం తీరిందా ఇంక!

'ఇంకోటి మిగిలిపోయింది. అందరికీ వరాలిచ్చే తల్లి మరి అంతర్జాతీయ విమానాశ్రయానికి మాత్రం 'రాజీవ్ గాంధీ' పేరు పెట్టడంలో రాజీపడ్డం లేదు! ఎందుకనో  అర్ధం కాదు ' 

' పదవే వదులుకున్న త్యాగమయి పేరు కోరుకుంటుందా! దేవుడు కానుక కావలని భక్తుడిని బతిమాలుకుంటాడా? తరచిన కొద్దీ లోతుల కెళ్లే  రామాయణం లాంటిదే రాజకీయం కూడా. రామపాదుకలను మోసే ఆపరభరతులు అపారంగా ఉన్న భరతదేశం కదా మనది ! తమ దైవానికే దైవమయినవారిని స్మరించుకొంటే ' మోక్షం' మరింత లాభదాయకంగా ఉంటుంది. ఆ విశేషం లవలేశం  తెలిసినా  భక్తులెవరూ అంతర్జాతీయపు స్థాయిల్లో  వచ్చిపడే  ఇంతటి మగత్తరా  సువర్ణావకాశాన్ని వదులుకుంటారా? '

' అర్ధమయింది. వీరచక్ర, పరమవీరచక్ర పంథాలో  ఎవరైనా అసమాన త్యాగనిరతులకు బహుమానాలు ఇవ్వదలుచుకుంటే అందుకు ముందుగా తాంబూలం అందుకొనే అర్హత నిస్సందే హంగా మన నాయకురాలికే అని గాఢంగా నమ్ముతున్నా
 ఇప్పుడు '

'గాడిలో పడ్డావ్ . బీహార్లో లాలూ పాలన పోయి నప్పుడు సృష్టిలో ఇంకేదీ శాశ్వతం కాదని నీరసప డ్డావు. కంచి గొడవలప్పుడు మంచికి స్థానం లేకుండా పోయిందని మధనపడ్డావు చూశావా.... కంచికైనా చిలుం పట్టక తప్పదేమో  కానీ... భరతఖండం, అరేబియా సముద్రం, బంగాళాఖాతాలకు  మధ్యన్  ఉన్నంత కాలం, 'గాంధీ' ఇంటి పేరుకున్నంత సెంటిమెంట్ హిమాల యాలకన్నా ఒక సెంటిమీటరు ఎక్కువే ఉంటుందన్న పాయింటు ఫస్టు వంటబట్టించుకో ! ఇహనైనా  పద 'దండి' యాత్రకు... దండిగా మీ వాళ్లందర్నీ తోలుకుని.

రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - ప్రచురితం - తేదీ తెలియదు ) 

కథానిక వేలంపాట ( రచయిత పేరు నమోదు కాలేదు ) ( 26 -11 -1952 - నాటి ఆంధ్ర పత్రిక ఇలస్ట్రేటెడ్ వీక్లీ ) సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 18 -11-2021



పాత బంగారం 


కథానిక 

వేలంపాట 

 

( రచయిత పేరు నమోదు కాలేదు )  

( 26 -11 -1952 - నాటి ఆంధ్ర పత్రిక ఇలస్ట్రేటెడ్ వీక్లీ ) 

సేకరణ - కర్లపాలెం హనుమంతరావు 

                 18 -11-2021 

                 


కన్నప్పని చూస్తే ఎవరికైనా సరే నవ్వు రాకుండా ఉండదు. 


చదువుకుంటున్న చిన్న పిల్లల దగ్గర్నుంచి ముసలివాళ్ళదాకా అతన్ని ఏవిధంగానైనాసరే ఏడిపించంది వదలరు. కాదు. 


కన్నప్ప వము ఫ్ఫై సంవత్సరాల క్రిందట మూడో క్లాసు మూడేళ్లు వరసగా ఫేలయి, ఆఫీసులో గుమాస్తాగా చేరాడు. ఎకౌంట్సు డిపార్టుమెంట్ లో !. 


అతన్ని అందరూ ఏడిపిస్తారంటే కారణం లేకపోలేదు. తెలిసిన వారందరి కంటే తను ఎంతో తెలివయినవాడినని అనుకుంటాడు. కాని అన్ని విషయాల లోనూ పప్పులో కాలు వేస్తాడు. ముప్ఫై సంవత్సరాల క్రిందట కొన్న చేతివాచి అహర్నిశలు చేతికి తగిలించుకునే ఉండేవాడు కన్నప్ప. ఒక వేళ అది చెడిపోయినా, ఆగిపోయినా దాన్ని తన చేతినుంచి విడదీసేవాడు కాదు. 


నాలుగు రోజులై వరసగా గడియారం నడవడం లేదు. అందుకు కన్నప్పకి చాలా కోపం వచ్చింది. దానికితోడు హనుమంతరావు ఆలోచన మందులా పని చేసింది. 


హను మంతరావు కన్నప్ప తోటి గుమస్తా. అందరి కన్నా కన్నప్పకి హనుమంతరావుమీద ఎక్కువ అభిమానం. గడియారాన్ని వేలం యించాలని హనుమంతరావు చెప్పిన ఆలోచన కన్నప్పకి బ్రహ్మాండంగా తోచింది. వేలం వేయించడానికి సంసిద్ధుడయాడు. 


వేలం పాడేందుకు వేరే ఒక గుమాస్తాని నియమించాలని, ఆ గుమాస్తాకి వేలం పాటలో అయిదు రూపాయలు ఇచ్చి వేయాలని నిర్ణయించాడు హనుమంత రావు. దానికి కన్నప్ప వప్పుకున్నాడు. 


గడియారం వేలం వేయబడే వార్త ఆఫీసులో  అందరికీ అందజేశాడు హనుమంత రావు. ఆఫీసు గుమస్తా లందరికీ సాయం కాలం అయిదు గంటలకు ఆఫీసుకు ఎదు రుగా నున్న మైదానంలో చేరుకోవాలని నోటీసు పంపించడమయింది. 


ఆనాడు జీతాల రోజు బట్టి వేలంపాట పోటీ బాగుంటుందని కన్నప్ప గట్టిగా నమ్మాడు. హనుమంతరావు ఒక్కడే తన శ్రేయోభి లాషి అని ఆనాడు పూర్తిగా దృఢపరుచుకో గలిగాడు.


సాయం కాలం అయిదు గంటలకి గుమస్తాలందరూ మైదానంలో హాజరయారు. 


గడియారం చేత్తో పట్టుకుని వేలంపాట పాడ్డానికి ఒక గుమస్తాని ఎన్నుకున్నారు. 


"కన్నప్ప గారి రిష్టువాచి వేలంపాట ఖరీదు ఒక్క అయిదురూ పాయిలే” అని వేలంపాట మొదలు పెట్టాడు గుమస్తా. ఆమాంతంగా గుండె ఆగిపోయినట్లయింది కన్నప్పకి. కాని వేలం అని జ్ఞాపకా నికి రాగానే మనసు కుదుటపడ్డది. 


'' కన్నప్ప గారి బంగారు ముద్దలాంటి చేతి గడియారం పదిరూపాయిలు. ఇరవై రూపాయిలు ! ఇరవై అయిదు రూపా యిలు” 


కన్నప్ప హృదయం ఆనందంతో ఊగిసలాడింది. దమ్మిడీకి పనికిరాని వాచిఅయిదు నిమషాలలో పాతిక రూపాయిల విలువగలది అయింది. హనుమంతరావు అతని కళ్ళల్లో దేముడయాడు.  


" ముఫ్ఫై రూపాయిలు. "


హనుమంతరావు కన్నప్ప చెవిలో అన్నాడు. "కన్నప్ప గారూ మీ వాచీ ఖరీదయిందిలా ఉంది. లేకపోతే పోటీ ఇంత జోరుగా ఉంటుందా? ఇంతమంచిది. వేలం వేయడం నాకేమీ నచ్చలేదు  సుమండీ . " 


కన్నప్ప మెదడులో ఆలోచనలు పరుగులెత్తాయి  " అవునోయ్ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అసలు ఇటు వంటి వాచీలు ఈ రోజుల్లో లేవంటేనమ్ము . కాని . . ఏం చేస్తాం ?ఇంతదాకా వచ్చిన తరువాత  ఇప్పుడు వేలం లేదంటే నోట్లో గడ్డిపెడ్తారు " అని కన్నప్ప తన విచా రాన్ని తెలియబర్చాడు. 


" ముఫై అయిదు రూపాయిలు” 

" నల భైరూపాయలు" 

"నలభై అయిదురూపాయిలు" .. వేలంపాట పోటీ జోరుగావుంది


" మీకు మళ్లీ మీ వాచీ కావాలంటే ఒక్కటే ఒక్క ఉపాయం ఉంది. అలా చేస్తే మీ వాచీ మీకు దక్కుతుంది '' అన్నా డు హనుమంతరావు. ఈ మాటలు కన్నప్పలో ఉత్సాహాన్ని రేకెత్తించాయి .


"ఆ ఉపాయం ఏమిటో వెంట నే చెప్పవోయ్,” అని ఆ రాటంతో అన్నాడు . 


“స్వయంగా మీరే ఏ  యాభైరూపాలో పాడి వాచీ తీసుకోండి." అని ఊదాడు హను మంతరావు.


"నా వాచీకి నేనే..." 


"నే నున్నానుగా పాడండీ" అని అన్నా డు హనుమంతరావు. 


" ఏభై రూపాయిలు” అ చేశాడు కన్నప్ప. 


 గుమస్తాలు ఒక్కరొక్కరేజారుకున్నారు.


"ఏ భైరూపాయిలు ఒకటి, ఏభైరూపా యిలు రెండు ; ఏ భైరూపాయిలు మూడు." అన్నాడు గుమాస్తా. 


కన్నప్ప దగ్గర ఏభై రూపాయిలు తీసుకుని గడియారాన్ని అతనికి ఇచ్చేశాడు — వేలం చేసి న గుమస్తా.


కన్నప్పకి గుండె ఆగిపోయినట్లయిపోయింది. 


“మరి నా డబ్బో" అని ఏడుపుముఖంతో హనుమంతరావుని అడిగాడు. 

" మీ డబ్బు మీదే. వేలం వేసిన అతనికి అయిదు రూపాయలు ఇస్తానని వప్పుకున్నారు కదూ మీరూ ? ఇదుగో ఏభై రూపాయలకి మీ వాచి వేలంలో మీరు పాడుకున్నారు. దీంట్లో అయిదు రూపాయలు పోగా నలభై అయిదు రూపాయలు ఇవిగో తీసుకోండి" అని హనుమంత రావు 45 రూపాయల కన్నప్పకి ఇచ్చి వేశాడు. అయిదు రూపా యలు పోతే పోయాయికొని తన గడి యారం పోలేదని సంతోషించాడు కన్నప్ప . 


మర్నాడు హనుమంతరావు సెక్షన్లో అందరికీ పకోడీ, టీ ఇప్పించాడు - కన్నప్పకి కూడా.


ఎందుకో అర్థం అయింది కాదు కన్నప్పకి. 


 కాని తరువాత తెలిసింది అతనికి - తనదగ్గర అయిదు రూపాయలు కొట్టేయడానికే హనుమంతరావు వేలం పాట ఏర్పాటు చేశాడని. కాని అతన్ని ఏమీ అనలేకపోయాడు కన్నప్ప, కారణం తన తెలివితక్కువ తనమే అని అతనికి  తెలుసు . 

( రచయిత పేరు నమోదు కాలేదు > 

( 26 -11 -1952 - నాటి ఆంధ్ర పత్రిక ఇలస్ట్రేటెడ్ వీక్లీ ) 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

                 18 -11-2021 

ఈనాడు - సంపాదకీయం వృథా అరికడదాం! రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 15 - 05 - 2011 )






చూడు- ఇల్లుకట్టి చూడు' అని సామెత. ఆస్తులు అంతస్తులతో నిమిత్తం లేకుండా ఏ గృహస్థుకైనా ఈ రెండూ తలకు మించిన కార్యాలే. వరవిక్రయంలో పురుషోత్తమరావు బాధపడినట్లు ఆడపిల్ల పెళ్ళంటే అశ్వమేధ యాగమే! 'కావిళ్లతో కాఫీయు, దోసెలి/ డ్డెనులు, నుప్మాయు నడిపింప వలయు/ కుడుచుచున్న ప్పుడు పంక్తి నడుమ నాడుచు బెండ్లివారి వాంఛలు కనిపెట్టవలయు' అన్న ఆ వధువు తండ్రి మాటల్లో ఉన్నది నూరుశాతం ఆవేదన. లోకం, కాలం ఎన్ని మార్పులకు లోనైనా వివాహాది శుభ కార్యాల ఆచారాలు, ఆలోచనలు తాతల కాలంనాటివి కావడమే విచిత్రం! ఆడపిల్ల పెళ్ళంటే ఇప్పటికీ కన్నవారి గుండెలమీద నిప్పుల కుంపటే! ఆ బరువు దింపుకోవడానికి తల తాకట్టుకైనా తయారుగా లేకపోవడం లోకుల దృష్టిలో తప్పు. ' అన్నింటికి వేలు వ్యయించి గౌరవించినను నిష్ఠురములె ప్రాప్తించు తుదకు' అని ఎన్ని నిట్టూర్పులు విడిచినా ఫలితం సున్నా. కష్టించి జీవితాంతం కూడబెట్టిన లక్షలు క్షణాల్లో ఎంత గొప్పగా ఆరిపోయాయన్నదే ఘనతకు గుర్తు! అందుకే పెళ్ళితంతును ఒక ఆధునిక కవి ' అంతరిక్షనౌక ప్రయోగం' తో సరిపోల్చాడు. వధువు మెడలో తాళిపడే సుముహూర్తం క్షిపణి ప్రయోగ క్షణమంత అమూల్య మన్న అతగాడి చమత్కారం- అణాపైసలలో చూసుకున్నా రూపాయికి వంద పైసలంత నిజం. కల్యాణమండపం ఖరారు, ఆహ్వాన పత్రాల ముద్రణ, ఆహూతుల సంఖ్య, వంటకాల జాబితా... అదు పులో ఉండవచ్చు గానీ, అతిథుల ఆ పూట ఆకలి దప్పికలను ఏ సూపర్ కంప్యూటర్ అంచనా వేయగలదు?! అది వేయలేకా, వృథాను అదుపు చేయలేకా ఎంతో ఆహారం వృథా అవుతోంది. ఎక్కడైనా ఏదైనా సమృద్ధిగా లభిస్తున్నప్పుడు, దాని విలువ తెలీదు. భూమాత అందించే ప్రతి గింజనూ ప్రసాదంగా స్వీకరించాలే తప్ప, నేలపాలు చేయకూడదు. పెళ్ళిళ్లు స్వర్గంలో నిర్ణయం కావచ్చు గాక- భోజనాల ఏర్పాట్లు భూలోకంలోనే కదా జరిగటం! కన్య వరుడి రూపానికి, తల్లి అల్లుడి ఆస్తిపాస్తులకు, తండ్రి అతగాడి పరువు ప్రతిష్ఠలకు, బంధుబలగం కులగోత్రాలకు ప్రాధాన్యమిచ్చినా, అతిథి జనాలు ఆరాటపడేది భోజ నాదికాల కోసమేనని ఓ సంస్కృత శ్లోక చమత్కారం. 'జల సేవన | గళగళలు, అప్పళముల ఫెళఫెళలు, భోక్తల భళాభళాల' సందడి లేని పెళ్ళి విందుకు అందమే లేదు పొమ్మన్నాడు ఓ భోజనప్రి యుడు. పెళ్ళిలో పుస్తెలకున్నంత ప్రాముఖ్యం విస్తరికీ ఉంది మ రి! మాయాబజారు చిత్రంలోని ఘటోత్కచుడిలా గారెలు, బూరెలు, అరిసెలు, అప్పడాలు, పులిహోర, దప్పళాలు... వరస పెట్టి అంగిట్లోకి జార్చుకోవాలనే యావే ముప్పు. అష్ట భోగాల్లో మృష్టాన్నమూ ఒకటి. అది మితిమీరడం అహితమే. మర్యాదల పేరుతో శ్రుతి మించి సాగే వియ్యాలవారి విందుకు చెయ్యడ్డుపెట్టుకోకపోతే ముందు చెడేది అతిథి కడుపే. మాయదారి జిహ్వచాపల్యం జీవి తానందాన్నే దెబ్బతీసే ప్రమాదముంది. పీకలదాకా మెక్కి పీకలమీదకు తెచ్చుకోవడం ఏమంత తెలివైన పని? కుడుము కడుపును చేరకముందే మనసును మంగళగిరి పానకాల స్వామి ఆవహిస్తే 'మంగళం మహత్ ' . పరగడుపున రాజులాగా, అపరాహ్నం మంత్రి లాగా, సాయంత్రం బంటులాగా భుజించాలని భోజన నీతి. అందుకు కట్టుబడటం ఇంటికీ దేశానికి మంచిదంటున్నారు ఆహార, ఆర్థిక శాస్త్రవేత్తలు. నూటికి నలభై అయిదుమంది ఒక్క పూటైనా ముద్దకు నోచని మన పూర్ణగర్భలో ఆ హితోక్తి శిరోధార్యం.!

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 15 - 05 - 2011 )




Friday, December 17, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక మేకపురాణం రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు ప్రచురితం - 07-03-2003)


 



 ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక 


మేకపురాణం 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు ప్రచురితం - 07-03-2003) 


వ్యాసమహర్షుల వారు పురాణ ప్రవచనం చేస్తున్నారు. అష్టాదశ పురాణాల పఠనం పూర్తయిన తరువాత స్వస్తి చెప్పే తరుణంలో 'ఆగండాగండి. ఇంకో పురాణం మిగిలుంది ' అంటూ  ఎక్కణ్ణుందో రొప్పుమంటు వచ్చిపడింది ఆ జీవి . అయినా మహర్షుల  వారు మంగళం పాడేశారు. 

***

నైమిశారణ్యం. 

 'సూత మహర్షి శౌనకాది మునులకు గురుప్రవచిత పురాణాల సారాన్ని కోరిక మేరకు తిరిగి చెబుతున్నాడు. పజ్జెనిమిది  పురాణాలు పూర్తయి 'ఏవం పురాణ పఠనమ్ సమాప్తమ్' అని ముగించబోతుండగా మళ్ళీ ఆ జీవే ఎక్కణ్ణుంచి ఊడిపడిందో పంథొమ్మిదో  పురాణం కూడా ఉందిగా' అంటూ వెంటబడింది. మునులం దరూ మౌనంగా చాపలు చుట్టేసుకుని నిష్క్రమించారు. 


***

భువన విజయం భువన మనోహరంగా సాగుతోంది. పొరుగుదేశం కవిగారొకాయను పొగరుగా ' పద్యం చదువుతా... అర్ధం చెప్పండి ' అంటూ ' భావ భవభోగ సత్కళా భావములను..' అనే పాదాన్ని పదేపదే చదివేసరికి కృష్ణదేవరాయలవారితో సహా దిగ్గజాల వంటి కవి అష్టదిగ్గజాలూ తికమకపడిపోయారు. తెనాలి రామకృష్ణుడు తెలివిగా 'మేకతోక తోకకు మేక తోకమేక ' అంటూ ఎదురుదాడికి దిగేసరికి ఆ కవిగారు అదే పోత. రామకృష్ణుని మేకపద్యాన్ని అందరూ అభినందించేవేళ సభ మధ్యలోకి దూసుకొ చ్చిందా జీవి. 

' పద్యమే ఏం ఖర్మ .. ఏకంగా పురాణమే చెబుతాను' అంటూ అరుపులకు దిగిపోయింది . 

సభ అర్థాంతరంగా ముగిసిపోయింది.

***


విసిగి ప్రాణం తీసుకుందామని కొండ కొమ్ము మీదకెక్కిన ఆ జీవిని వెనక్కి లాగారెవరో. 

తిరిగి చూస్తే.. ఓ  వింత ఆకారం ! తల సింహానిది. . బాడీ మేకది!  తోక మాత్రం డ్రాగన్ గ్రీకు దేవుడో..  రోమన్ దయ్యమో! 

 'బిమెరా  , అంటార్లే నన్ను.  నేటివిటీకి సూటుకాకపోయినా నిన్నెందుకో రక్షించాలని పించింది. ఛీ! ప్రాణాలు తీసుకొంటున్నావేంటి ? అనడిగిందా ఆకారం.


'అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ...! ' 


'అయితే వద్దులే ! వినే ఓపిక లేదు' '


'అదే ప్రాబ్లం... నా ప్రారబ్దం! పద్దెనిమిది పురాణాలను  కూడా ఓపిగ్గా వినేవాళ్లు నాదాకా వచ్చేసరికి తెగ చిరాకు పడిపోతున్నారు.  ఎన్ని వేల తరాలు మారినా నా తలరాత మారే దారి దొరకటం  లేదు. ఇక

నాకు మోక్షం దొరికేదెప్పుడు? ' అంటూ నుదురు బాదుకుందా వింత జీవి.


' నీ కథకీ . . మోక్షానికీ  కనెక్షనేంటీ ?' ఒన్ లైన్‌ ఆర్డర్లో  చెబుతానంటే  వింటా' అంది బిమెరా  జాలిగా. 


'ఓకే! మా అదిదేవుడు శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు శంఖం జారి ప్రళయజలాలలో పడిపోయింది . ఆ శంఖంలో నుంచి ఒక

జెయింట్ పుట్టుకొచ్చాడు. వాడికి ఒకాసురుడి అబ్బ ఆకలి . బ్రహ్మ చేతిలోని వేదాలని కాస్తా కాజాలు అనుకొని మింగేశాడు. విష్ణుమూర్తి చేపలాగా వచ్చి రాక్ష సుడి పొట్టలో చొచ్చి వేదాలు లాక్కోవటంలో లోపల ఒకటి మిగిలిపోయింది. అది కూడా కక్కేస్తే గాని ఆ జెయింట్  గాడికి  మోక్షం లేదు. 


'అర్థమయింది. ఆ జెయింటు గాడివి నువ్వేనన్నమాట' 


'ఇండలిజెంట్! ఇట్టే పసిగట్టేశావ్ ! మిగిలిన ఆ ఒక్క పురాణాన్ని కక్కేద్దామని  వ్యాసులవారి టైం నుంచీ ట్రై చేస్తూనే ఉన్నా! నా  వాసన భరించలేక దగ్గరికే రానివ్వటంలేదసలెవరూ నన్ను! '  అందా జెయింట్ జీవి విషాదంగా. 


' మధ్యలో ఈ ఆకలొకటి ! ఎన్ని తిన్నా తీరిచావడంలేదు . మోక్షమెప్పుడొస్తుందో తెలీటం లేదు' 


' పోనీ! ఆ పురాణాన్ని నవలగా రాసి ఏ తొక్కలో  పత్రిక్కో  తోసెయ్యకపోయావా ?' 


' న్యూస్ ప్రింట్ వేస్టని తిరుగు టపాలో తిప్పికొట్టారు. ' 


 ' సినిమా వాళ్ళకు వినిపించాల్సింది. బాగుంటే ఏ కొత్తహీరోనో పెట్టి  బొమ్మగా లాగించుండేవాళ్లు' 


' మేనకలాంటి గ్లామర్ రోలుండే  ఒకే గానీ, మేకతో అయితే మునిగిపోతాం' అని కొట్టేశారు. ఈ పురాణంలో మేకదే  గదా మెయిన్ రోల్! 


' ఓహో! మేక పురాణమన్నమాట. టి.వీ సీరియల్ గా కూడా పనికిరాదే! ' 


' అవును. మేకేం ఏడుస్తుంది. ఏడుపు లేకుండా ఎన్ని ఎపిసోడ్లని ఎవరైనా సాగతీస్తారు?  కనీసం నువ్వయినా వింటే నాకీ కడుపుబ్బు తప్పుతుంది.' అంది ఆ జీవి ప్రాధేయపడుతూ. 


'అమ్మో! అవతల రోమ్ లో  నాకర్జంటు పనులు చచ్చేటన్నున్నాయ్ అన్నాయ్! పోనీ... ఒక పని చెయ్!  ఇక్కడే ఏవో సమావేశావా .... అవీ జరుగుతున్నాయని విన్నాను. అక్కడ ట్రైచేయకపోయావా?


' చేయొచ్చుకానీ ఇంత జెయింటుకు ఎంట్రీ ఎవడిస్తాడు? ' అందా జీవి నిరాశగా. 


 'మనసుంటే మార్గం ఉండకపోదు' మేక లాగా మేకప్పేసుకుని సంగారెడ్డి సంతకెళ్లు. బిల్ గేట్స్ భార్య గాని చూసిందంటే ముచ్చట పడ్డం ..  కొనటం ఖాయం ! ' 


' మేక వాసవ గదా! దొరసానులు కొంటారా? ' 


' మెలికంతా అక్కడే ఉందిసోదరా! కొన్న తరువాతగాని కంపు తెతీదు ఆ కపుల్సుకి .  బిల్ గేట్సా .. మజాకా?  మేక పక్కన పది నిమి షాలు కూర్చుంటే మిలియన్ డాలర్స్ బహు మతి అంటాడు.  ఎంట్రీ ఫీజు ఏ పది డాలర్లో పెడతాడు . పదికి మిలియన్ డాలర్లంటే ఎంత బుద్ధిమంతుడి పుర్రెనైనా  పురుగు కుట్టక మానదు. అందునా మనదేశంలో ! నూటికి వందమంది ఆ రకాలు! అధికారం పలుకుబడి  ఉంటే ఏకంగా 'పీ' లోనే నిలబడొచ్చు! 


'పీ ' అంటే? 


'క్యూ'  కన్నా ముందుండేది 'పి' నేగదా!  వెరైటీగా ఉంటుందని అలాగన్నాలే ! అది కాదు ముఖ్యం.  అవకాశాలు  గాని వస్తే  లటుక్కని  దొరకబుచ్చుకునే అవకాశం అందరికన్నా ముందుండేది దొరలకే  అని నా భావం . మేకతో అయినా  ఇంపైన వ్యాపారం చేయగల బిల్ గేట్స్ రోజుకో గోట్ ను  గదిలో కట్టేసుకుంటాడు గానీ,  కంపని వ్యాపారం మానుకోడు ' 


' దాంతో నా సమస్వెలా  సాల్వవుతుంది తమ్ముడూ ? ' 


'వాసన చూట్టానికే మాతం అవకాశం లేక కడుపు మండిన సభ్యులంతా మేక కోసం డిమాండు మొదలెట్టేస్తారు . దాంతో.. నీ ఎంట్రీ సులువవుతుందన్నాయీ! శాసన సభా సమావేశాలు సాగినంత  కాలం నీ పురాణ కాలక్షేపమే నిరాటంకంగా జరుగుతుంటుంది. ' 


' భలే... భలే.. సీజన్ ముగిసేలోగా నాకు మోక్షం ఖాయం' '


' అంతేకాదు సోదరా! నీ ఆకలి సమస్యా శా్యోతంగా తీరిపోతుంది.  సభాకాలం కన్నా విలువైనది తినటానికి నీకింకేం దొరుకుతుందింకెక్క డైనా..   చెప్పు'


' అంతా బాగానే ఉంది ! గానీ మాయ చేయటానికి బిల్ గేటుకైనా రోజుకో  ' బకరా' దొరకాలి కాదా? ' అని బిక్కమొగమే సిందాజీవి. 


పిచ్చివాడా! ఇక్కడ ఒకరాల కేం తక్కువ?  బారులుతీరి ఎలా పోతున్నాయో  చూడు; అంటూ కొండ కింద రోడ్డు మీద పోయే జనాన్ని చూపించింది బిమెరా.  ' మీ ప్రజాస్వామ్యం ఇలా సాగినంతకాలం  బకరాలకు ఏ మాత్రం లోఉండదు . బేగి సభను పో! మేక పురాణం వినిపించుకో ! అని మాయమైంది ఆ రోమన్ బెమరా!  


కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు ప్రచురితం - 07-03-2003 ) 

కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 10- 12-2009 ) అఖిల జంతువుల దినోత్సవం - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 10- 12 -2009 )


 


ఈనాడు - సంపాదకీయం 


కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 10- 12-2009  )


అఖిల జంతువుల దినోత్సవం

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 10- 12  -2009  ) 

  

చిలుక పలుకులంటూ మెచ్చుకుంటూనే మనిషి నన్ను పంజరంలో  బంధించి ఆనందిస్తున్నాడు. వేరే జాతివైన గోరుమంతలతో మాకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నాడు - అంది చిలుక. 


అడ్డమైన చాకిరీ నాచేత చేయించుకుంటూ  'అడ్డగాడిదా '  అంటూ నన్నడ్డు పెట్టుకుని మనుషులు తిట్టుకుంటున్నారు. ఇది మాత్రం న్యాయంగా ఉందా? అంది గాడిద . 


మా పాలు తాగుతాడు. వట్టిపోతే మెడ నరికి కిలోల చొప్పున అమ్ముకుంటాడు' అంది మేక కసిగా. 'అవునవును' అంటూ వంతపాడాయి  ఆవు, గేదె. 


గొడ్డుగా పుట్టిన నేరానికి  మనిషి చేతిలో నానా యాతన పడని పశువెక్కడుంది గానీ , ఇంతకీ ఈ సభ ఎందుకో చెప్పారుకాదు- అంది ఎద్దు అసహనంగా. 


పశువుల్నేనా .. పక్షులూ చేపలూ క్రిములూ కీటకాలు వేటినీ  వదిలటం లేదీ సర్వభక్షకుడు మానవుడు . ఆకులూ అలమలూ దొరకని కరవు రోజుల్లో ఇంత కోసుకు తిన్నాడంటే అర్ధముంది. కడుపు నిండినీ  

వాడి వినోదానికి కోళ్లూ, గొర్రెలకు మధ్య కుమ్ములాటలు .. పైపెచ్చు మన చావుబతుకుల పైన పందేలు!  దారుణం ! వాళ్లు వాళ్లూ చేసుకోమనండి కుమ్మి సిద్ధాలు . మధ్యలో వాళ్ల చచ్చే బరువుఅని   మోసి కూడా మా ఘోడాలు.. హస్తీలు  ఎందుకుండీ  నలిగి చావాలి? ! ఆ యుద్ధాలు .. అవీ లేనప్పుడు పరుగు పందేలంటూ అఘోరిస్తాడు .. మా ప్రాణాలు తోడేస్తాడు . వీడిని భరించడం మహాకష్టంగా ఉంది బాబూ ' గుర్రుమంది  

గుర్రం.


'మా పులులు వాళ్లనేం చేశాయంట! మా మానాన మేం అడవుల్లో  దొరికిందింతతిని చింతలేకుండా బతుకుతున్నాం ; వేట పేరుతో వెంటాడి మరీ చంపేస్తున్నాడీ మానవ దుర్మార్గుడు- అని గర్రుమంది  పులి.  


ఎన్నన్నా. . మీ పులీ సింహమంటే మనిషికి  ఉలుకేలే! గౌరవం కూడాను . వాళ్లిచ్చి పుచ్చుకునే బిరుదులు గట్రాలన్నీ గాండ్రించే  పులులూ గర్జించే సింహాల మీదనే కదా! సినిమాలక్కూడా మీ పేర్లే.. బడాయిలకోసం!  మా రాబందుల్ని, గుడ్లగూబల్ని, గబ్బిలాల్ని, పందికొక్కుల్ని... ఇదిగో, ఈ గాడిదలకన్నా  ఘోరంగా చిత్రిస్తాడు. . వీడితాడు తెగ! ఒక్క  కుక్కతో తప్ప కుక్కల్ని తప్ప మన జంతుజాలం మొత్తంలో మనిషిగాడికి ఏ జీవంతో పడింది. . చెప్పండి! 


చివరికి ఎవరికి ఏ హానీ తలపెట్టని చీమల్ని కూడా బతకనీయడీ మానవుడు! 


'శివుడాజ్ఞ వంకతో కుట్టి కొద్ది కసైనా తీర్చుకునే అవకాశముందీ పిపీలానికి. 'గొర్రెల్ని కోసి ఊలు వాడుకుంటాడు. కోళ్ల గుడ్లు గుట్టుగా నొక్కేసి అట్లేసుకు తింటాడు.   భూసారం తన వంతుగా భావించే వానపాముల పైకి   పిల్లుల్నీ, పిల్లుల్ని తరిమి  కొట్టే దిక్కుమాలిన పనికి తోడేలు నోటి కాడ కూడై చావమని ఎన్ని జీవాలని తన ఎదాన  పెట్టుకుంటుంన్నాడో ఈ జిత్తులమారి ! 


నిజమే! జిత్తులన్నీ వాడివీ.. చెడ్డ పేరేమో నాకు! '  నక్క ఊళ . 


వేళ మించి పోతుంది . ఈ కథ కంచికి చేరక ముందే ఏం చెద్దామో చెప్పండందరూ! - అంది కోతి! 



' కానివ్వండి .. కానివ్వండి! ఈ జంతుదినోత్సవం తంతు మళ్లా ఏడాదిగ్గాని తగలడి చావదు! - లేడి లేచింది.  


చివరకు సింహం గొంతు జూలు సవరించుకుంటూ గంభీరంగా ప్రకటించింది. ' ఇవాళ ప్రపంచ జంతువుల హక్కుల దినం . సృష్టిలో బతకటానికి మనిషికి ఎంత హక్కుందో మనకీ అంతే హక్కుంది. దేవుడేదో వాడి బుర్రలో  కొద్దిగా  గుజ్జెక్కువ పెట్టాడని మనిషి మహా బడాయిలు పొతున్నాడు.  నోరులేని జీవాలను చేసి సృష్టి మొత్తంమీద పెత్తనం చలాయిస్తున్నాడు. చూస్తున్నాంగా.. చిత్తం వచ్చినట్లు మన అడవుల్ని నాశనం చేస్తున్నాడు. శాంతి వంకతో ఆకాశంలోకి పావురాలను ఎగరేసే ఈ మనిషి పావురాలకే మనశ్శాంతి లేకుండా చేస్తున్నప్పుడు .  . ఇక మనల్ని మాతం ప్రశాంతంగా ఎందుకు బతకనిస్తాడు?  


రొయ్యల మాదిరి వెనకకు ఈదటం రాదు. మన కప్పల్లెక్కన బండరాళ్ళ మధ్య ఏళ్ళ తరబడి ఏ తిండీ తిప్పలూ లేకుండా ఉండటమూ వచ్చి చావదు. 

గద్దలా  ఎగరలేని దద్దమ్మ . లేడిలా పరిగెత్తలేని లేకి వెధవ . గబ్బిలంలా తలకిందులుగా వేలాడమనండి .. తలకిందులుగా  తపస్సు చేసినా  పట్టుపడదు ఆ వడుపు .   మన నెమలికి మల్లే , కాకి తీరున  వాన రాకను ముందే కనిపెట్టటమను! రాక, అవేవో వాతావరణ కేంద్రాలంట .. శుంఠ , నానా రకాల ఆగాలకు తెగబడతాడు. తీరాబాతో ఆ గాలి వాన వాడనుకున్న టైముకు రాదు . వచ్చేటైము తెలీనివ్వదు. నవ్యకండి! చిర్రెత్తుకు రావాలి నిజానికి వీడి జిత్తులు చూస్తుంటే! హంసలా పాలను నీళ్ళనూ వేరుచేయటం రాదుగానీ పాలలో నీళ్ళు, బియ్యంలో రాళ్లు కలిపి సొమ్ము చేసుకోవటం మాత్రం   మా బాగా వచ్చు.  నూకలు జల్లి పావురాలను పట్టుకునే కంతిరితనమే ఎరవేసి చేపల్ని బుట్టలో వేసుకోడంలో చూపించేది. ఏనుగుల్ని  పడదోయడానికి నేర్చిన  గోతులు తీసే విద్య మాత్రం మా బాగా  ఉపయోగిస్తాడు గిట్టనోడి గొట్టం గాడిని పడతోసేందుకు! కోతుల్ని పట్టి ఆడిస్తాడు. చిలకల్ని జోస్యాల కోసం చిలకల్ని పీడిస్తాడు. వీడి  తాడు తెగ .. తోటివాడని కూడా చూడకుండా  సందు దొరకడం ఆలస్యం వీడు  మోసగిస్తాడు. వాడు బట్టలకు  పట్టుపురుగులు బలి! వాడి చెప్పులజతకు పొదుగిచ్చి ఎదగనిచ్చిన గేదె  బలి!   వీడి బరువులు మోసేందుకు , బళ్లను తోసేందుకు , భూములు దున్నేందుకేనా భగవంతుడు  దున్నలను కిందికి తోలింది! తన  నట్టింటి  ఫాటో ప్రేముల్లో చర్మం   అందంగా బిగించుకోనేందుకా     పులి!

ఏనుగు దంతాల వేలంలో  దేవుడి పాటే వీడికి  లక్షల్తో  మొదలు ;  మనిషిగాడు తాన వినోదార్ధం  మన జంతు తంతులన్నిటినీ నడి బజారు ముడిసరుకుగా మార్చేసి గారడీ చేస్తున్నాడు. 

 ఏం తప్పు చేశాం మనం?  ఎందుకు మనిషికి మనమీదింత కక్ష? స్వేచ్ఛేగా అడుగుతున్నాం దేవుణ్ణైనా!  జంతువుల హక్కులను తొక్కి పారేసే పోకిరీలకు తక్షణం పడే శిక్షల అవసరం చాలా 

ఉంది ' అంది రాజమృగం. 


' పదండి ! ఆ దేవుడి ముందే ముందు మున డిమాండ్లు పెట్టి నిలదీద్దాం ' అంది నక్క  ఉత్సహంగా. 


'గాడ్ మనిషిగాడి సైడ్! మొండికేస్తే ?' అడిగింది వరాహం. 


'   ఉద్యమానికి దిగుదాం. నో డిమాండ్స్ కు . . నో వర్క్ . ఆవు పాలివ్వదు. ఎద్దు పొలం దున్నదు.  గాడిద బరువులు మొయ్యదు . గుర్రం బండినీడ్చదు . కోడి కూతలు  కుయ్యదు . ఎలుక పామును పట్టదు. పిల్లిఎలుకతో  .. కుక్క పిల్లితో .. కయ్యాలకు  దిగవు . . 


మనిషి డోంట్ కేర్ అంటేనో?! 


ఛాన్స్.. లేదు. మనవరాహం వర్క్ బంద్ చేస్తే ఊరంతా .. 


అన్ని జంతువులూ ఠక్కునముక్కలు మూసుకున్నాయి. 


ముక్కు లేని పాము జాలిపడింది ' పాపం! మనిషి! మనకు పాపం చుట్టుకోదూ ' 


' మరే! అప్పనంగా అప్పులివ్యటం  లేదని కక్ష కొద్దీ బ్యాంకులోళ్ల గుమ్మాల  ముందు ఈ మధ్య ఈ దరిద్రపు మనుషులే చెత్తా కుమ్మరించిపొతున్నారు . వాళ్లకు లేని పాపం మనకు మాత్రం ఎందుకు చుట్టుకుంటుందో! ' అంది జిత్తులమారి నక్క . 



' అఖిల జంతువులపై దౌర్జన్యం నశించాలి !' 

' జంతువుల హక్కులు పరిరక్షించాలి!  ' 



చప్పట్లు బాదుకుంటో .. నినాదాలు చేసుకుంటో జంతువులన్నీ దేవుడి దగ్గరకు  బైలుదేరాయి . 







'మరో ముఖ్యమైన మాట మృగరాజా! మనిషి సంగతి నాకు మహ బాగా తెలుసు. వాడు పరిసరాల్లో పోగేసే చెత్తాచెదారాన్ని ఏదో వంకతో మన జంతుజాలాలు హరాయించకపోతే ఈపా టికి భూగోళం... అదిగో- ఆ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపా లిటీ చెత్తకుండీ మాదిరి అయిపోయుండేది.. ఈ లోకంలోనే మనిషికి నరకం కనపడి ఉండేది అంది వరాహం.


'వాడితో మనకింక కుదరదు గానీ, జంతుజాలం నిర్భయంగా జీవించడానికి


మనుషుల బెడదలేని ప్రశాంతవనం కావాలని జంతువుల హక్కుల దినోత్సవ


సందర్భంగా తీర్మానం చేద్దాం' అంది సింహం.


అన్ని జంతువులూ చప్పట్లు కొట్టాయి. 


కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - ప్రచురితం - 10/12/2009 ) 

ఈనాడు -హాస్యం - వ్యంగ్యం అంతా సంతసమే రచన- కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - ప్రచురితం - 20 -05 - 2009 )



ఈనాడు -హాస్యం - వ్యంగ్యం 

అంతా సంతసమే 


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 20 -05 - 2009 ) 


'ఎలాగైతేనేం... అపరాధ పరిశోధన నవల చివరి పేజీ లాగా సాగిన ఈ ఎన్నికలైపోయాయ్... అందరూ హ్యాపీ!' 


' హ్యాపీనా?! రోజా వెక్కివెక్కి ఏడ్చింది. డియస్ గుండె బరువెక్కింది. గౌడు గోడు గోడుమంటున్నాడు. తెలంగాణ భవనంకి   తాళాలు పడ్డాయి. నారాయణకు బీపీ పెరిగింది. నారా వారింకా నారాజ్ గానే ఉన్నారు.. ' 


' ఓటమిలోనే గెలుపును చూడటం ముందు మనవాళ్ళందరూ చిరంజీవి దగ్గర నేర్చుకోవాలి! అయిదు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పన్నెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికలయ్యాయి. అధికార పార్టీకి ఇన్ని తక్కువ సీట్లు ఎన్నడూ రాలేదు. మంత్రులింతమంది ఓడిందీ లేదు . ఒకే ఒక్కశాతం ఎక్కువొచ్చి గద్దెనెక్కు తున్నందుకే 'ఓహో జనమంతా మాకే జయహో' అనేసారని వైయస్సారు సారు తెగ సంబరపడిపోతున్నారు చూడూ.... అదీ స్పిరిట్! ' 


నవ్వొచ్చినా రాకపోయినా నవ్వుతూనే ఉంటే చేసిన పన్లు కూడా అలాగే అచ్చొస్తాయిరా పిచ్చి నాయనా! వరుణ దేవుణ్ని తెగ మొహమాటపెట్టి తన పార్టీలోకి లాక్కు న్నాడా! కమ్యూనిస్టుల భూ పోరాటాల కన్నా... కాంగ్రెసు పెద్దల భూ ఆరాటాలే ఆయనకు ఆటొచ్చాయి. సీనియర్లెంత  సీను చేసినా తెలంగాణకి చీమతలకాయంతయినా  చోటు పెట్టకపోవటం చివర్లో ఎట్లా కలిసొచ్చిందో చూశావుగా! ఎంత హ్యాపీ! అబ్బాయి గెలిచాడు. అదో సంతోషం. అడొచ్చే వాళ్ళందరూ ఓడారు. అదో ఆనందం. అవే యజ్ఞాలూ పథకాలూ.... కొత్తవాటికోసం బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పనేలేదు. కేవీపీ, దేవుడే చూసుకుంటారనే ధీమా. హస్తిన హస్తంలో మూడు వేళ్ళు తనవేనని భరోసా! అందుకే చంద్ర బాబును కూడా అస్తమానం చిర్రుబుర్రు లాడకుండా 'ఛీరపుల్'గా ఉండ మనేది. నిజానికి మహాకూటమి ఓటమి చంద్రబాబు అదృష్టంరా!' 


'అదెలాగ తాతయ్యా.. నువ్వస్తమానం ఇలాగే రోశయ్య లాగా విచిత్రంగా మాట్లాడతావేంటీ? ' 


' ఎన్నికలకు ముందే సొంత జనాలని సర్దలేక బాబుకు ఎంతిబ్బందయిందీ? నిజంగానే కూటమి గెలిచి ఉంటే తెగిందాక లాగే తెరాసా. అటూ ఇటూ తెగ లాగే కమ్యూనిస్టు లతో సీటులో ఒక సెకనైనా సుఖంగా కూర్చునే దానికుండేదా? బోలెడన్ని ఫ్రీగా ఇస్తానన్నాడు. బోడి ఫారం గేటు కోడిగుడ్డే మూడు రూపా యల ముప్పై పైసలుంది... ఎన్నని ఇస్తాడు? ఎంతమందికని ఇస్తాడు? ఈ మాంద్యం కాలంలో ఇంటింటికీ వెయ్యి రెండువేలు ఊరికే పొయ్యాలంటే రోశ య్య చెప్పినట్లు ఉద్యోగుల జీతాలన్నా కొయ్యాలి. . నకిలీ నోట్లన్నా అచ్చె య్యాలి. ఈ పాట్లు తప్పినందుకు ' హమ్మయ్య'  అనుకోక మిత్రభేదం, సంధి, విగ్ర హమనుకుంటూ అందరి మీదా అలా ఆగ్రహాలెందుకూ? హాయిగా ఆనం దంగా ఉండక! కలరుటీవీలు పంచుతానన్నాడు. రోజూ ఏదో ఒక ఛానెల్లో వచ్చే చిరంజీవి సినిమాలు చూసీ, చూసీ జనాలు 'మెగాస్టారు ' వైపు మొగ్గే ప్రమాదం నుంచి ఏ దేవుడో కాపాడాడనుకోవాలి, విచారమెందుకు? సీఎం సీట్లో కూర్చున్నప్పట్నుంచీ కూలదోయాలనుకునే జనాలు క్యూలు కడతారని స్వీయా నుభవం మీద తెలిసి కుమిలిపోవటమెందుకు?  దండగ!  ప్రతిపక్ష నాయకుడి పోస్టుకైతే పోటీ ఉండదు. హాయిగా నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ!....నవ్వుతూ చావాలిరా!' అని పాడుకోవటం నేర్చుకోవాలి. పిక్చరు ఫ్లాపైనా ' సూపర్... హండ్రెడ్ డేస్' అంటూ మైకుల ముందు సినిమా వాళ్ళు మోసేస్తుంటారే... వాళ్ళను చూసి మార్పు తెచ్చుకోవాలి?' 


అందుకేనా అత్తారూళ్ళో ఘోర పరాజయం జరిగినా మన ఘరానా అల్లుడు మర్నాడే మైకుల ముందుకొచ్చి ' అబ్బే... మాకసలేం కాలే దబ్బా! ఆటలో అరటి పండు అని ఆనందంగా బాధపడిందీ?! నేనింకా షామీర్ పేట కేంపుల ఖర్చు తప్పినందుకనుకున్నాను తాతయ్యా'


' జాతరకొచ్చే జనమంతా భక్తులు కానక్కర్లేదను  సత్యం ఆల స్యంగానైనా అర్ధమైనందుకు  ఆనందం. ఎన్నికల గోదారినీద టానికి గోడదూకిన పిల్లుల తోకలని నమ్ముకుంటే సగమైనా రాకుండానే బుడుంగుమని మునగటం ఖాయ మని జ్ఞానోదయమైన మోదం అది. మాస్టరుప్లాన్  మెగా ఫ్లాపయినా డష్టరు పెట్టి అంతా చెరిపేసి ఈసారి ఫస్టునుంచీ బెస్టుగా చెయ్యాలన్న మేష్టారి పాఠాలు కమ్యూనిస్టులు కూడా ఒంటపట్టించు కుంటే ఎంతానందంగా   ఉంటుందీ ! అరె.. నేనేమన్నా జోకేశానా! ఎందుకా నవ్వులు..? ' 


'కాదు తాతయ్యా కమ్యూనిస్టుల మాటవినంగానే పొట్టచెక్కలయ్యేలాగా నవ్వొచ్చింది. అంతేలే!  ఈసారీ  ఎన్నికలాటలో లాస్టునుంచీ ఫస్టొచ్చింది ఆ కమ్యూనిస్టులే  గదా! ఒబామానే కాదు... జనం కూడా వాళ్ళను వద్దనేశారా ? కొండనాలుక ఉన్న నాలుకక్కూ  చేటయింది .. పాపం ! '


' పోనీలేరా! ఇంచక్కా  మరో చారిత్రక తప్పిదం చేసే లక్కీ ఛాన్‌సొచ్చింది గదా! అక్కరకురాని పోరు, మొక్కిన వరమీని ఓటరు, తానెక్కిన జారిన సైకిలు, ఠక్కున  విడువంగ వలదు బ్రదరా' అని వాళ్ళెప్పుడో ఫిక్సైపోయారు గదరా! వచ్చిన చిక్కల్లా ఇప్పుడు తెరాస పంచాయితీతోనే!'


'పోనీలే తాతయ్యా! ఆ ఎకసెక్కాలెందుగ్గానీ తెలంగాణ భవనంలో వాళ్ళు హాయిగా తాళాలేసుక్కూర్చున్నారు. ప్రస్తుతానికి ఏ బొంతపురుగునూ, కుష్ఠురో గినీ కావలించుకునే  రొష్టు తప్పినందుకు లోపం  గంతులు వేస్తున్నారు . ఎవ ర్నయినా  సరే వంద కిలోమీటర్ల కింద బొందపెట్టాలంటే ఎంత కష్టం?! ఆ రోష్టు తప్పినందుకు తెరాసావారికి  తెగ హ్యాపీగానే ఉంటుందనుకుంటా తాతయ్యా! ' 


'అందువల్ల... అందరూ హ్యాపీస్ అన్న మాట! దత్తన్నకి మళ్ళీ సారకాశంగా  ఉత్తరాలు రాసుకునే అవకాశం వచ్చింది హ్యాపీ:  జనం గెలిచినందుకు జేపీ హ్యాపీ!  జేపీ గెలిచినందుకు నాలాంటి జనం హ్యాపీ ! వామపక్షాలు ఓడినందుకు ఒబామా హ్యాపీ!  చిరంజీవి సగం ఓడి నందుకు జీవితా రాజశేఖర్లు సంపూర్ణంగా హ్యాపీ!  డీయస్ ఓడినందుకు వైయస్ లోలోపల హ్యాపీ!  డీయన్సీ అభ్యర్థులు హ్యాపీ..  రియల్ ఎస్టేటు ఓనర్లు  హ్యాపీ. సెన్సెక్సు హ్యాపీ.. 


'అధికార పార్టీకి ఓటరు అవకాశం ఇస్తూనే దాని బలం తగ్గించి   ప్రతిపక్షం బలం పెంచినందుకు  అయామాల్స్ హ్యాపీనే తాతయ్యా! ' 


' రెండు నెలల నుంచీ స్తంభించిన పాలన ఎట్లాగో  మళ్ళీ పట్టాలెక్కుతున్నందుకు  అందరూ హ్యాపీసే  గానీ... మొత్తానికి మేన్ ' ఆఫ్ ది మ్యాచ్'  వైయస్ అయితే'  మేన్ ఆఫ్ ది మిస్ మ్యాచ్ ఎవర్రా మనవడా?' 


' అయితే కేసీఆర్... కాకుంటే  దేవేందర్  గౌడ్' 


- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - ప్రచురితం - 20 -05 - 2009 ) 


ఈనాడు - సంపాదకీయం సమజీవన సౌభాగ్యం - రచన- కర్లపాలెం హనుమంతరావు ( ప్రచురితం - 08 -07 - 2012 )

 


ఈనాడు - సంపాదకీయం 

సమజీవన సౌభాగ్యం

- రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ప్రచురితం - 08 -07 - 2012 ) 


క్షీరసాగర మథనసారంగా దక్కిన మధుర రసం అసురులకు ఒక్క చుక్క దక్కకుండా మొత్తం అమరసంఘానికే ధారపోసిన హరి- ఆ 'మాయ'కోసం ఆశ్రయించిన వేషం జగన్మోహినీ అవతారం.  బొమ్మ పెళ్లిళ్లకు కూడా పోనొల్లని బేల సత్యభామ నరకాసురునితో సమరానికని 'వీర శృంగార భయరౌద్ర విస్మయములు/ గలసి భామిని యయ్యెనో కాక యనగ ' తయారయింది! ఆడామగా తేడా ఏముంది... పనులు చక్కబడటం ముఖ్యంగానీ! 'రామ' అంటే సీత అని కూడా అర్ధం. 'అన్యూహిమయా భాస్కరస్య ప్రభాయథా- సూర్యునికి వెలుగులా నాకు సీత 'వేరుకాదు' అని వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడే స్వయంగా చెప్పుకొన్నాడు. దాంపత్య ఔన్నత్యానికి ఇంత కన్నా గొప్ప వ్యాఖ్య ఇంకేముంటుంది! ఒకే పరమాత్మ తనను తాను రెండుగా విభజించుకున్నాడని అదే ప్రకృతి పురుష స్వరూపాలని వేదబోధ. భార్యాభర్తల అనుబంధాన్ని వాక్కు అర్ధాల బంధంగా సరిపోల్చాడు రఘువంశ కర్త కాళిదాసు. ఇల్లు చూస్తే ఇల్లాలిని చూడనక్కర్లేదని సామెత. అశోకవనంలో ఉన్న సీతమ్మ హనుమ కంటికి స్త్రీ వేషంతో ఉన్న రామయ్యలాగే కనిపించిందట. కైకేయి కోరింది శ్రీరాముడి వనవాసాన్నే అయినా సీతమ్మ  రామయ్యను అనుసరించింది. దుష్టరావణ సంహారంలో తనవంతు పాత్ర పోషిం చింది. నరకాసుర సంహారంలో సత్యభామ పాత్రా శ్రీకృష్ణుడితో సరిసమానం. 'నా పాపపుణ్యాలలో  నా భార్యకు వాటా ఉంటుందా? ' అన్న ధర్మసందేహం మహర్షి కాకముందు వాల్మీకి మనసును తొలిచింది. అది త్రేతాయుగంనాటి ముచ్చట.  పాపపుణ్యాల మాట పక్క నుంచి పనిపాటల్లో మాత్రం ఆలుమగల  పాత్ర సరిసమానం అంటున్నారు నేటి మగువలు.


'అలుమగలు అంటే ఒకరికొకరు పూరించుకునే ఖాళీలు' అంటారు ఆరుద్ర. తనది అనే గూడులేక ఆడది బతకలేదు. నాది అనే తోడులేక అతగాడు నిలువలేడు . 'మనువు' అంటేనే రెండు తనువులు అనువుగా మసలుకోవడం! ఇల్లాలిగా మారిన ఇంతిని ఇల వేలుపుగా భావిస్తే పతిగా మారిన పురుషుడి ప్రతి విజయానికి తానే ఒక ప్రేరణ అవుతుంది. 'చిరునవ్వుల వరమొసగే శ్రీమతి/ శుభశకునాలే వెలిగించే హారతి' అంటారు వేటూరి. ఈనాటి వనిత శతకోటి సీతల మేలి కలబోత. సరిజత కావాలంటే మరి మగడు ఎంతమంది రాముళ్ల వడపోత కావాలి! పురుషుడికి దైవమిచ్చిన స్నేహితులెవరు? ' అని యక్షుడు అడిగిన ప్రశ్నకు యుధిష్ఠిరుడు ఇచ్చిన సమాధానం 'భార్య'. .'స్నేహం సాప్తపదీనాం' అని కుమార సంభవంలో కాళిదాసు వాక్కు.  వివాహ మహోత్సవవేళ నిర్వహించే సప్తపది తంతులో కలసి  ఏడడుగులు పడినప్పటినుంచే మొగుడూ పెళ్ళాలు కడదాకా ఒకరికొకరు తోడు, నీడగా నిలబడే స్నేహితులయ్యారు. 'దంపతులారా! కలిసి వర్తించండి! సమాన ధర్మాన్ని ఆచ రించండి!' అంటుంది యజుర్వేదం. 'వృత్తిలో, ప్రవృత్తిలో భార్యాభ ర్తలు ఒకరికొకరు ఉత్ప్రేరకంగా నిలవాలి' అని బోధించడానికి వేదాలు, ఉపనిషత్తులే కావాలా? ఒంటిచేయి ఊపితే చప్పట్లు మోగవని మనకు తెలియదా! 'చెలిమి గావింపను జేరి భాషింప/కలహింస ద్రోపాడు (తోసివేయు) గలసి వర్తింప' అని ద్విపద భారతంలోనే తిమ్మయ్య సూక్తి చెప్పాడు. సంసారంలో నిన్న మొన్నటి దాకా మగవాడి దృష్టిలో  మగువ ' కార్యేషు దాసి... శయనేషు రంభ!... కాలం మారింది. ఒంటెద్దులా సంసార వాహనం  ఒక్కరే లాగడం ఇక కుదరదు అంటున్నారు కొత్తతరం భార్యలు.


వాహనం  నడక సవ్యంగా సాగాలంటే బండికి రెండు చక్రాల్లా భార్యాభర్తలిద్దరూ సమన్వయంతో సాగాల్సిందే! త్వమే వాహం- నువ్వే నేననే భావన తప్ప అహంకారానికి తావులేని వ్యవహారం సంసారం. 'కుడి యెడమ భేదమున్నది పడతికి బురు/షు నకు... కత్తి కతడర్హుడగు; సూడి గరిటెలకు సమర్హమగు నీమె' అన్నది కాలం చెల్లిన వాదన. 'ఇంటాబయటా ఇద్దరిదీ సమవాటా' అనేదే ప్రస్తుతం చెల్లుబాటయే మాట . నరకాసుర వధానంతరం పద హారు వేలమంది స్త్రీలను పరిణయమాడిన శ్రీహరి అన్ని సంసారాలను ఎలా నిభాయించుకొస్తున్నాడో చూడాలని ఉబలాటపడ్డాడు నారదుడు. 'ఒకచో సంధ్యావందనం, ఒకచో పురాణపఠనం, ఒకదెస స్నానపానాదులు, మరో దిశ భూగోదానాదులు, ఒక ఇంట ఆట పాటలు, మరో ఇంట విందు విశ్రాంతులు'గా సాగుతోందట గోవిం దుడి లీలావినోదం. 'ఎలా సాధ్యం' అన్న ముని సందేహానికి 'లోకాలకు మేలు చేకూరాలన్న సంకల్పం కలగాలేగానీ... సమయమూ, సంయమనమూ స్వయంగా సమన్వయమైపోవా!' అన్నది పరంధాముడి సమాధానం. లోకాలదాకా ఎందుకు... సొంత సంసారాన్ని చక్కబెట్టుకునేందుకు మరి నేటి మగవాడు కొంతైనా చొరవ చూపాలిగదా! 'పనిలో భర్త భాగస్వామ్యం భార్య మానసిక ఒత్తిడిని గణ నీయంగా తగ్గిస్తుంది' అంటున్నారు స్త్రీలమీద పరిశోధనలు చేసే అంతర్జాతీయ కేంద్ర పరిశోధకులు. వారి ఆసియా ప్రాంతీయ న్యూఢిల్లీ విభాగం వెల్లడించిన తాజా సర్వే గణాంకాల ప్రకారం ఇంటిపనుల్లో భార్యకు సంపూర్ణ సహకారం అందించే పురుషులు నూటికి పదహారుమంది. గృహకృత్యాల్లో తమది ఇంకెంతమాత్రం 'అతిథి పాత్ర'  కాదని గుర్తిస్తున్న భర్తల శాతమూ గణనీయంగా పెరుగుతోందంటున్నాడు సర్వే బృందనాయకుడు రవివర్మ. 'శీత గాలి వీచినప్పుడు లేత ఎండలా/ఎండ కన్ను సోకినప్పుడు మంచు కొండలా' ఒకరికొకరు అండగా ఉండే ఇల్లు ఆదిదంపతుల విలాసం కైలాసంగా మారిపోదా! సమజీవన సౌభాగ్యానికి శ్రమ విభజనే మూలమన్న సత్యాన్ని మగవారిప్పటికైనా గుర్తించడం మగువలకు మహదానందం కలిగించకుండా ఉంటుందా!


రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ప్రచురితం - 08 -07 - 2012 ) 

Thursday, December 16, 2021

చందమామ కథ పరీక్షా ఫలితం రచన - బి. లక్ష్మణాచారి ( చందమామ - మాసపత్రిక - అక్టోబర్ - 1964 సేకరణ : కర్లపాలెం హనుమంతరావు

చందమామ కథ 


పరీక్షా ఫలితం 

రచన - బి. లక్ష్మణాచారి 

( చందమామ - మాసపత్రిక - అక్టోబర్ - 1964 

సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

              

సింధుదేశాన్ని మలయకేతు మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన ఏకైక పుత్రిక వనజముఖి పరమ సుందరిగా కీర్తికెక్కింది. ఆమెను పెళ్ళాడాలని అనేక మంది రాజ కుమారులు వచ్చారు గాని, రాజకుమారి పెట్టిన పరీక్షలో నెగ్గలేకపోయారు. ఈ పరీక్ష గురించి వాడవాడలా తెలిసిపోయింది.


తనను పెళ్ళాడేవాడు ధైర్యవంతుడూ, వీరుడూ, యుక్తిపరుడూ అయి ఉండాలనే ఉద్దేశంతో రాజకుమారి ఈ పరీక్ష ఏర్పాటు చేసింది. ఆమె వచ్చిన వారి నందరినీ పరీక్షకు పెట్టలేదు; వారి వయసూ, అంద చందాలూ తనకు నచ్చిన మీదటనే ఆమె వారికి పరీక్ష ఇచ్చింది.


ఆ పరీక్ష ఈవిధంగా ఉన్నది: రాజభవనానికి ఉత్తరాన ఒక తోటా, దానికి ఉత్తరాన చిన్న అరణ్యమూ ఉన్నాయి. ఆమెను పెళ్ళాడ గోరినవాడు ఆ అరణ్యంలో ప్రవేశించి, అందులో దారి తప్పకుండా  తిరిగి రాజభవనానికి రావాలి. అరణ్యంలో ఒక పులి ఉన్నది. దాన్ని నిరాయుధుడై జయించి రాజ ముందుకు వచ్చి, తోటలో ప్రవేశించాలి. ఆ  తోటలో ఒక భయంకరమైన పక్షి ఉన్నది;  అది ఎవరినన్నా చూడగానే మీదికి వచ్చి కళ్ళు రెండూ పొడిచేస్తుంది. దాన్ని కూడా తప్పించుకుని రాజభవనం కేసి వస్తే తోటకూ, రాజభవనం ఆవరణకూ మధ్యగా ఒక బురద కందకం ఉన్నది. అందులో  గొంతు లోతు బురద ఉంటుంది. ఆ కందకంలోకి దిగి రాజభవనం చేరుకోగానే, రాజ మె కుమార్తె తన స్వహస్తాలతో లోటాడు నీళ్ళి స్తుంది. ఆ లోటాడు నీళ్ళతోనే బురద అంతా పోయేలాగు కడుక్కోవాలి. ఈ పరీ క్షలో నెగ్గినవాణ్ణి ఆమె పెళ్ళాడుతుంది. 


ఆమెను పెళ్ళాడ వచ్చిన వారిలో కొందరు పులి చేత చచ్చారు. మరి కొందరు పులి బారి నుండి తప్పించుకుని, భయంకర పక్షి మూలాన కళ్ళు పోగొట్టుకున్నారు. పులినీ, పక్షిని జయించి బురదలో దిగి వచ్చినా, లోటాడు నీటితో ఒళ్ళంతా కడుక్కోవటం ఎలా సాధ్యమవుతుంది?


ఈ అసాధ్యమైన పరీక్ష గురించి నాగావళి  రాజకుమారుడు ప్రతాపుడనేవాడు విన్నాడు. అతను సింధుదేశపు రాజధానికి వచ్చి, రాజ భవనానికి ఉత్తరాన ఉన్న అరణ్యాన్ని ఒక సారి చుట్టి వచ్చాడు. అరణ్యం చుట్టూ బలమైన కంచె వేసి ఉన్నది. ఆ కంచెలోనే ఉత్తర భాగంలో ఒక ద్వారమున్నది. చుట్టూ కంచె ఉండటమే గాక, రాజభవనానికి దగ్గిరిగా కూడా ఉన్నందున, ఆ అరణ్యం సహజమైనది కాదనీ, కృత్రిమ మైనదనీ, అందులో ఉండే పులి కూడా మనుషులు పెంచేదే అయి ఉంటుందనీ అతను ఊహించాడు.


తరువాత ప్రతాపుడు రాజకుమార్తెను సందర్శించాడు. అతను పరీక్షకు నిలబడ టానికి ఆమె సమ్మతించింది. ఎందుకంటే అతను యువకుడూ, అందగాడూనూ. అతను మనిషి ముఖాన్ని పోలి ఉండేటట్టుగా ఒక ముఖ కవచం చేయించుకున్నాడు. అది ధరించినట్టయితే, కళ్ళూ, ముక్కూ, గడ్డమూ, నుదురూ మొదలైన వాటితో కూడి, అచ్చగా మనిషి ముఖాన్ని పోలి ఉంటుంది, కాని అది లోహంతో చేయబడినది. ఈ కవచాన్ని చంకన పెట్టు కుని, చేతిలో మాంసం మూటగట్టి పట్టు కుని, ప్రతాపుడు ఉత్తర ద్వారం కుండా అరణ్యంలో ప్రవేశించాడు.


అరణ్యంలో అతను కొద్ది దూరం వెళ్ళే సరికి గాండ్రిస్తూ పులి ఎదురయింది. అతను మాంసం మూట విప్పి పులిముందు పడేసి తన ముఖానికి కవచం ధరించుకుని ముందుకు సాగాడు. పులి మాంసం తినటంలో నిమగ్నమై పోయి అతని గొడవే పట్టించుకోలేదు.


ప్రతాపుడు అరణ్యం దాటి తోటలో ప్రవేశించగానే భయంకర పక్షి వచ్చి, అతని ముఖ కవచంలోని కళ్ళను పొడిచి తన దారిన తాను పోయింది. అతను ముఖ కవచాన్ని తీసి దూరంగా పారేసి, తోటకూ రాజభవనం ఆవరణకూ మధ్య ఉండే బురద కందకంలోకి దిగి, పైకి వచ్చి, రాజ భవనాన్ని చేరుకున్నాడు.


రాజకుమారి లోటాడు నీళ్ళతో సిద్ధంగా ఉన్నది. ప్రతాపు డామెతో, "ఈ పరీక్షలో రెండు అంశాలలో నెగ్గాను. ఈ మూడవ దానిలో నెగ్గించే బాధ్యత అంతా నీ పైన ఉన్నది," అన్నాడు.


"ఈ లోటాడు నీటితో ఒంటి బురద అంతా కడుక్కోవలిసినవాడవు నీవేగదా?” అన్నది రాజకుమారి.


" అలాగే కడుక్కుంటాను. కాని ఆ నీరు పొయ్యవలిసిన పని నీది. జాగ్రత్త, ఒక్క చుక్క కూడా నేలపై పడకూడదు. అలా పడిన ప్రతి చుక్కకూ ఒక్కొక్క బిందెడు నీరివ్వవలిసి ఉంటుంది,” అన్నాడు ప్రతాపుడు.


"పరీక్షలో నెగ్గాపులే. స్నానం చేతువుగాని పద!" అన్నది రాజకుమారి. తరవాత వారిద్దరికీ వైభవంగా పెళ్ళి జరిగింది.


- బి. లక్ష్మణాచారి 

( చందమామ - మాసపత్రిక - అక్టోబర్ - 1964 

సేకరణ : 

కర్లపాలెం హనుమంతరావు 

16 - 11-2021

బోథెల్ ; యూఎస్ఎ 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...