ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - గల్పిక
మేకపురాణం
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు ప్రచురితం - 07-03-2003)
వ్యాసమహర్షుల వారు పురాణ ప్రవచనం చేస్తున్నారు. అష్టాదశ పురాణాల పఠనం పూర్తయిన తరువాత స్వస్తి చెప్పే తరుణంలో 'ఆగండాగండి. ఇంకో పురాణం మిగిలుంది ' అంటూ ఎక్కణ్ణుందో రొప్పుమంటు వచ్చిపడింది ఆ జీవి . అయినా మహర్షుల వారు మంగళం పాడేశారు.
***
నైమిశారణ్యం.
'సూత మహర్షి శౌనకాది మునులకు గురుప్రవచిత పురాణాల సారాన్ని కోరిక మేరకు తిరిగి చెబుతున్నాడు. పజ్జెనిమిది పురాణాలు పూర్తయి 'ఏవం పురాణ పఠనమ్ సమాప్తమ్' అని ముగించబోతుండగా మళ్ళీ ఆ జీవే ఎక్కణ్ణుంచి ఊడిపడిందో పంథొమ్మిదో పురాణం కూడా ఉందిగా' అంటూ వెంటబడింది. మునులం దరూ మౌనంగా చాపలు చుట్టేసుకుని నిష్క్రమించారు.
***
భువన విజయం భువన మనోహరంగా సాగుతోంది. పొరుగుదేశం కవిగారొకాయను పొగరుగా ' పద్యం చదువుతా... అర్ధం చెప్పండి ' అంటూ ' భావ భవభోగ సత్కళా భావములను..' అనే పాదాన్ని పదేపదే చదివేసరికి కృష్ణదేవరాయలవారితో సహా దిగ్గజాల వంటి కవి అష్టదిగ్గజాలూ తికమకపడిపోయారు. తెనాలి రామకృష్ణుడు తెలివిగా 'మేకతోక తోకకు మేక తోకమేక ' అంటూ ఎదురుదాడికి దిగేసరికి ఆ కవిగారు అదే పోత. రామకృష్ణుని మేకపద్యాన్ని అందరూ అభినందించేవేళ సభ మధ్యలోకి దూసుకొ చ్చిందా జీవి.
' పద్యమే ఏం ఖర్మ .. ఏకంగా పురాణమే చెబుతాను' అంటూ అరుపులకు దిగిపోయింది .
సభ అర్థాంతరంగా ముగిసిపోయింది.
***
విసిగి ప్రాణం తీసుకుందామని కొండ కొమ్ము మీదకెక్కిన ఆ జీవిని వెనక్కి లాగారెవరో.
తిరిగి చూస్తే.. ఓ వింత ఆకారం ! తల సింహానిది. . బాడీ మేకది! తోక మాత్రం డ్రాగన్ గ్రీకు దేవుడో.. రోమన్ దయ్యమో!
'బిమెరా , అంటార్లే నన్ను. నేటివిటీకి సూటుకాకపోయినా నిన్నెందుకో రక్షించాలని పించింది. ఛీ! ప్రాణాలు తీసుకొంటున్నావేంటి ? అనడిగిందా ఆకారం.
'అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ...! '
'అయితే వద్దులే ! వినే ఓపిక లేదు' '
'అదే ప్రాబ్లం... నా ప్రారబ్దం! పద్దెనిమిది పురాణాలను కూడా ఓపిగ్గా వినేవాళ్లు నాదాకా వచ్చేసరికి తెగ చిరాకు పడిపోతున్నారు. ఎన్ని వేల తరాలు మారినా నా తలరాత మారే దారి దొరకటం లేదు. ఇక
నాకు మోక్షం దొరికేదెప్పుడు? ' అంటూ నుదురు బాదుకుందా వింత జీవి.
' నీ కథకీ . . మోక్షానికీ కనెక్షనేంటీ ?' ఒన్ లైన్ ఆర్డర్లో చెబుతానంటే వింటా' అంది బిమెరా జాలిగా.
'ఓకే! మా అదిదేవుడు శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు శంఖం జారి ప్రళయజలాలలో పడిపోయింది . ఆ శంఖంలో నుంచి ఒక
జెయింట్ పుట్టుకొచ్చాడు. వాడికి ఒకాసురుడి అబ్బ ఆకలి . బ్రహ్మ చేతిలోని వేదాలని కాస్తా కాజాలు అనుకొని మింగేశాడు. విష్ణుమూర్తి చేపలాగా వచ్చి రాక్ష సుడి పొట్టలో చొచ్చి వేదాలు లాక్కోవటంలో లోపల ఒకటి మిగిలిపోయింది. అది కూడా కక్కేస్తే గాని ఆ జెయింట్ గాడికి మోక్షం లేదు.
'అర్థమయింది. ఆ జెయింటు గాడివి నువ్వేనన్నమాట'
'ఇండలిజెంట్! ఇట్టే పసిగట్టేశావ్ ! మిగిలిన ఆ ఒక్క పురాణాన్ని కక్కేద్దామని వ్యాసులవారి టైం నుంచీ ట్రై చేస్తూనే ఉన్నా! నా వాసన భరించలేక దగ్గరికే రానివ్వటంలేదసలెవరూ నన్ను! ' అందా జెయింట్ జీవి విషాదంగా.
' మధ్యలో ఈ ఆకలొకటి ! ఎన్ని తిన్నా తీరిచావడంలేదు . మోక్షమెప్పుడొస్తుందో తెలీటం లేదు'
' పోనీ! ఆ పురాణాన్ని నవలగా రాసి ఏ తొక్కలో పత్రిక్కో తోసెయ్యకపోయావా ?'
' న్యూస్ ప్రింట్ వేస్టని తిరుగు టపాలో తిప్పికొట్టారు. '
' సినిమా వాళ్ళకు వినిపించాల్సింది. బాగుంటే ఏ కొత్తహీరోనో పెట్టి బొమ్మగా లాగించుండేవాళ్లు'
' మేనకలాంటి గ్లామర్ రోలుండే ఒకే గానీ, మేకతో అయితే మునిగిపోతాం' అని కొట్టేశారు. ఈ పురాణంలో మేకదే గదా మెయిన్ రోల్!
' ఓహో! మేక పురాణమన్నమాట. టి.వీ సీరియల్ గా కూడా పనికిరాదే! '
' అవును. మేకేం ఏడుస్తుంది. ఏడుపు లేకుండా ఎన్ని ఎపిసోడ్లని ఎవరైనా సాగతీస్తారు? కనీసం నువ్వయినా వింటే నాకీ కడుపుబ్బు తప్పుతుంది.' అంది ఆ జీవి ప్రాధేయపడుతూ.
'అమ్మో! అవతల రోమ్ లో నాకర్జంటు పనులు చచ్చేటన్నున్నాయ్ అన్నాయ్! పోనీ... ఒక పని చెయ్! ఇక్కడే ఏవో సమావేశావా .... అవీ జరుగుతున్నాయని విన్నాను. అక్కడ ట్రైచేయకపోయావా?
' చేయొచ్చుకానీ ఇంత జెయింటుకు ఎంట్రీ ఎవడిస్తాడు? ' అందా జీవి నిరాశగా.
'మనసుంటే మార్గం ఉండకపోదు' మేక లాగా మేకప్పేసుకుని సంగారెడ్డి సంతకెళ్లు. బిల్ గేట్స్ భార్య గాని చూసిందంటే ముచ్చట పడ్డం .. కొనటం ఖాయం ! '
' మేక వాసవ గదా! దొరసానులు కొంటారా? '
' మెలికంతా అక్కడే ఉందిసోదరా! కొన్న తరువాతగాని కంపు తెతీదు ఆ కపుల్సుకి . బిల్ గేట్సా .. మజాకా? మేక పక్కన పది నిమి షాలు కూర్చుంటే మిలియన్ డాలర్స్ బహు మతి అంటాడు. ఎంట్రీ ఫీజు ఏ పది డాలర్లో పెడతాడు . పదికి మిలియన్ డాలర్లంటే ఎంత బుద్ధిమంతుడి పుర్రెనైనా పురుగు కుట్టక మానదు. అందునా మనదేశంలో ! నూటికి వందమంది ఆ రకాలు! అధికారం పలుకుబడి ఉంటే ఏకంగా 'పీ' లోనే నిలబడొచ్చు!
'పీ ' అంటే?
'క్యూ' కన్నా ముందుండేది 'పి' నేగదా! వెరైటీగా ఉంటుందని అలాగన్నాలే ! అది కాదు ముఖ్యం. అవకాశాలు గాని వస్తే లటుక్కని దొరకబుచ్చుకునే అవకాశం అందరికన్నా ముందుండేది దొరలకే అని నా భావం . మేకతో అయినా ఇంపైన వ్యాపారం చేయగల బిల్ గేట్స్ రోజుకో గోట్ ను గదిలో కట్టేసుకుంటాడు గానీ, కంపని వ్యాపారం మానుకోడు '
' దాంతో నా సమస్వెలా సాల్వవుతుంది తమ్ముడూ ? '
'వాసన చూట్టానికే మాతం అవకాశం లేక కడుపు మండిన సభ్యులంతా మేక కోసం డిమాండు మొదలెట్టేస్తారు . దాంతో.. నీ ఎంట్రీ సులువవుతుందన్నాయీ! శాసన సభా సమావేశాలు సాగినంత కాలం నీ పురాణ కాలక్షేపమే నిరాటంకంగా జరుగుతుంటుంది. '
' భలే... భలే.. సీజన్ ముగిసేలోగా నాకు మోక్షం ఖాయం' '
' అంతేకాదు సోదరా! నీ ఆకలి సమస్యా శా్యోతంగా తీరిపోతుంది. సభాకాలం కన్నా విలువైనది తినటానికి నీకింకేం దొరుకుతుందింకెక్క డైనా.. చెప్పు'
' అంతా బాగానే ఉంది ! గానీ మాయ చేయటానికి బిల్ గేటుకైనా రోజుకో ' బకరా' దొరకాలి కాదా? ' అని బిక్కమొగమే సిందాజీవి.
పిచ్చివాడా! ఇక్కడ ఒకరాల కేం తక్కువ? బారులుతీరి ఎలా పోతున్నాయో చూడు; అంటూ కొండ కింద రోడ్డు మీద పోయే జనాన్ని చూపించింది బిమెరా. ' మీ ప్రజాస్వామ్యం ఇలా సాగినంతకాలం బకరాలకు ఏ మాత్రం లోఉండదు . బేగి సభను పో! మేక పురాణం వినిపించుకో ! అని మాయమైంది ఆ రోమన్ బెమరా!
కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు ప్రచురితం - 07-03-2003 )
No comments:
Post a Comment